సాయంకాల అతిథి

ఎండలోనే తెల్లవారి
ఎండలోనే చీకటి పడే
మండు వేసవి దినాల్లో
వాడు నా సాయంకాల అతిథి.

ఇళ్ళూ, గోడలూ, చివరికి చెట్లూ కూడా
పొగలు గక్కే దినాంతాల్లో
వాడొక సాయంకాల పవనంలా
మా ఇంట అడుగుపెట్టేవాడు

వాడు వస్తూనే మా హాలంతా
చందనచర్చ చేసినట్టు చల్లబడిపోయేది
వాడి అడుగుల వెనక
నా చిన్నప్పటి పల్లె, ఆ అడవి, ఆ సెలవులు
వేసవి మొత్తం ఒక చలివేంద్రంలాగా
గడిచిన కాలమంతా మళ్ళా అడుగుపెట్టేది

వస్తూనే చేతులు చాపేవాడు
నేను వాణ్ణెత్తుకుని వాడికి చూపిస్తున్నట్టుగా
మరో కొత్తం లోకం తలుపులు
నా కోసం నేనే తెరుచుకునేవాణ్ణి.

ఈ నగరాకాశం కిందనే
నా చిన్నప్పటి ప్రపంచాన్ని మళ్ళా పోల్చుకునేవాణ్ణి
కిటికీలోంచి కనిపించే పక్కింటి కుక్కపిల్ల
అప్పుడప్పుడే మొగ్గలు తొడుగుతున్న పూలమొక్క
నా పరిమిత ప్రపంచాన్నే
వాడిముందు అపరిమితంగా పరిచిపెట్టేవాణ్ణి
మాకు తోడుగా అప్పుడప్పుడు
బాల్కనీలో చంద్రుడు పలకరిస్తుండేవాడు.

వాడితో కలిసి సాయంకాలం నడుస్తుంటే
ఆ చిన్నిపాదాలకు తగ్గట్టు
నన్ను నేను సరిదిద్దుకునేవాణ్ణి.
వాడి వల్ల మా కాలని నాకు పరిచయమైంది
మా ఇరుగుపొరుగుని
చిరునవ్వుతో పలకరించడమెలానో
వాడే నాకు నేర్పాడు.
నిర్మలమైన ఒక్క మందహాసంతో
ఈ ప్రపంచం మొత్తం నీది కాగలదని
నాకు మంత్రవిద్య నేర్పించాడు.

తల్లిపాదాల కింద స్వర్గం ఉందని
మెహిదీపట్నం సెంటర్ లో
ఒక మసీదు దగ్గర రాసి ఉంటుంది
పసిబిడ్డ బుల్లి పిడికిళ్ళు తెరిస్తే కూడా
స్వర్గం కనిపిస్తుందని
నేనిక్కడ రాసిపెడుతున్నాను.

(వేదార్థ్ ఏడాదిన్నర బిడ్డ. నాకు వరసకి మనమడు. ఈ వేసవిలో వాళ్ళ అమ్మమ్మగారి ఇంటికి వచ్చి, వేసవి పూర్తవగానే తన తల్లిదండ్రుల్తో కాలిఫోర్నియా వెళ్ళిపోయాడు.)

29-9-2026

10 Replies to “సాయంకాల అతిథి”

  1. Refreshingly beautiful. పసివాళ్ళ ప్రపంచంలో చోటు ఉచితం. కానీ అందరూ కోరుకోరు. కోరుకున్న వాళ్లకు మీరన్న స్వర్గం కళ్ళ ముందుకు❤️

    నిర్మలమైన ఒక్క మందహాసంతో
    ఈ ప్రపంచం మొత్తం నీది కాగలదని—
    భవభూతి దంపతులను సంతోషంతో ముడి వేసే ఆనంద గ్రంథులు పిల్లలు అంటాడు కదా..మీరు ప్రపంచాన్నే ముడి వేసి దగ్గరకు తెచ్చారు.

    మహాకవి ఆ పసివాళ్ళ పాద ధూళి సోకిన వాళ్ళు ధన్యులంటాడు… ఎత్తుకు మురిసిన దేహాలన్నీ ఒప్పుకు తీరే మాట అని ఈ కవితలో కనపడ్డ ఊహల సాక్షిగా ఇంకోసారి గుర్తు చేసుకుంటున్నాను.

  2. మీ సాయంకాల అతిథి…వేదార్ధ్ బుజ్జిగా, చాలా బావున్నాడు.

    “వస్తూనే చేతులు చాపేవాడు
    నేను వాణ్ణెత్తుకుని వాడికి చూపిస్తున్నట్టుగా
    మరో కొత్తం లోకం తలుపులు
    నా కోసం నేనే తెరుచుకునేవాణ్ణి.”

    పిల్లలతో నవలోకం…

  3. ఆహా.. హృదయాన్ని హత్తుకునే ఎంత అందమైన కవితాప్రపంచాన్ని మిగిల్చి వెళ్ళాడు..

  4. పసిబిడ్డలు చూపించే అందమైన లోకాలు
    వారు నేర్పించే మంత్రవిద్యలు!!
    Very very beautiful!! 🙏🏽

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading