
నాల్గవ అధ్యాయం
బాట పక్కన బాల ఒక్కతె
క్రిస్మస్ ఆగమన సంధ్యవేళ. అపరాహ్ణం ముగిసే వేళకు రైన్‌హార్డ్, మరికొందరు విద్యార్థులూ ‘రాట్స్ కెల్లర్’ హోటలు నేలమాళిగలో ఒక పాత ఓక్ బల్ల చుట్టూ కూర్చుని ఉన్నారు. గోడలమీద దీపాలు వెలిగించారు. నేలమాళిగలో అప్పటికే చీకటి ముసురుకుంటోంది. హోటల్ కి వచ్చినవాళ్ళు పలచగా ఉన్నారు; వడ్డన చెయ్యాల్సిన పనివాళ్ళు తీరిగ్గా స్తంభాలకి ఆనుకుని చూస్తున్నారు.
అర్ధచంద్రాకారంగా వంపుతిరిగిన ఆ గదిలో ఒక మూల ఒక ఫిడేలు వాద్యకారుడున్నాడు. అతడి పక్కన ముచ్చటైన ఒక జిప్సీ పిల్ల ఒక తంత్రీవాద్యంతో కూర్చుని ఉంది. తమ ఒళ్ళో పెట్టుకున్న వాద్యాలతో వాళ్ళు ఉదాసీన దృక్కుల్తో చుట్టూ పరికిస్తూ ఉన్నారు.
విద్యార్థులు కూర్చున్న బల్ల దగ్గర షాంపేన్ బాటిల్ మూత తెరుచుకుంది. ‘సేవించు, అందాల జిప్సీ కుమారీ!’ అంటూ ఒక యువకుడు పానపాత్ర ఆమె వైపు చాచాడు. అతడిలో కులీన దర్పం ఉట్టిపడుతున్నది.
ఆమె తాను కూచున్న చోటునుంచి ఏ మాత్రం కదలకుండానే ‘నాకు తాగాలని లేదు’ అంది.
‘అయితే మాకోసం ఓ పాట పాడు’ అన్నాడు ఆ యువకుడు, ఆమె ఒడిలోకి ఒక వెండి నాణెం విసురుతూ. ఆమె తన నల్లటి జుట్టు చేతివేళ్లతో మృదువుగా సవరించుకుంది. ఫిడేలు వాయించేవాడు ఆమె చెవిలో ఏదో గుసగుసలాడాడు. కానీ ఆమె తన తల నిర్లక్ష్యంగా పక్కకు తిప్పి తన తంత్రీ వాద్యం మీద తన గడ్డం ఆనించి కూచుంది.
‘నేనైతే అతని కోసం పాడాలనుకోవడం లేదు’ అందామె.
రైన్‌హార్డ్ తన చేతిలో పానపాత్రతో ఒక్క ఉదుటున దూకి ఆమె ముందు నిలబడ్డాడు.
‘నీకేం కావాలి?’ అనడిగింది ఆమె తిరస్కారభావంతో.
‘నీ కళ్లల్లోకి ఒకసారి చూడాలని ఉంది.’
‘నా కళ్లతో నీకేం పని?’
రైన్‌హార్డ్ చూపులు ఆమెమీద వెలుగులు కురిపించాయి. ‘అవి మోసపూరితాలని నాకు తెలుసు.’
ఆమె తన బుగ్గమీద తన అరచేయి ఆనించుకుని అతణ్ణి పరిశీలనగా చూసింది. రైన్‌హార్డ్ తన చేతుల్లో పానపాత్ర తన పెదాల దగ్గరకి చేర్చుకున్నాడు.
‘అందమైన నీ కపట నేత్రాలకు ఇదే నా కానుక!’ అని ఆ మద్యం ఒక్క గుక్క తాగాడు.
ఆమె నవ్వి తల విదిలించింది.
‘ఇలా ఇవ్వు’ అంటూ తన నల్లటి చూపులు అతడి కళ్లలోకి గుచ్చి చూస్తూ, ఆ పానపాత్రలో మిగిలిన మద్యం నెమ్మదిగా తాగేసింది. అప్పుడు తన చేతుల్లో ఉన్న తంత్రీవాద్యం తీగలు మీటుతూ, మత్తుగా, మోహపూరితస్వరంతో పాడటం మొదలుపెట్టింది.
పిల్లగాడా చక్కదనములు
వెల్లివిరిసేదొక్కదినమె
అందచందములెల్లకాలము
నిలవగలవని తలవబోకుము
మనకు మిగిలిన గడియకాలము
నువ్వు సాంతము నాకు సొంతము
రేపు ముంగిట మృత్యుదేవత
వచ్చి పిలిచిన వెంటపోదును
ఫిడేలు వాయించేవాడు గీతంలో చివరి చరణానికి తగ్గట్టుగా తంత్రులు మీటుతుండగా ఒక స్నేహితుడు కొత్తగా అప్పుడే వచ్చి ఆ బృందంలో చేరాడు.
‘నిన్ను వెతుక్కుంటూ నీ గదికి వెళ్ళాను, రైన్‌హార్డ్’ అన్నాడతడు. ‘కానీ నువ్వప్పటికే బయటికి వెళ్ళిపోయావు. కానీ శాంతాక్లాసు నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు’ అని కూడా అన్నాడు.
‘శాంతాక్లాజా?’ ప్రశ్నార్థకంగా చూసాడు రైన్‌హార్డ్. ‘కానీ శాంతాక్లాజ్ ఇప్పుడు నా దగ్గరకి రావడం లేదే’ అని అన్నాడు.
‘శాంతాక్లాస్ నిజంగానే వచ్చాడు. నీ గదిమొత్తం క్రిస్మస్ వృక్ష సుగంధంతోనూ, అల్లం మురబ్బా కేకులతోనూ పరిమళాలు వెదజల్లుతోంది.’
రైన్‌హార్డ్ తన చేతిలో ఉన్న పానపాత్రని అలానే జారవిడిచి టోపీ అందుకున్నాడు.
‘ఇంతకీ ఇప్పుడేం చేయబోతున్నావు?’ అని ఆ అమ్మాయి అడిగింది.
‘ఉండు. ఒక్క నిమిషంలో వచ్చేస్తాను.’
ఆమె కనుబొమ్మలు ముడివేసింది. ‘ఆగు’ అంటూ మృదుమోహపూరిత దృక్కుల్తో అతడిమీద వల విసిరింది.
రైన్‌హార్డ్ ఒక్క క్షణం తటపటాయించాడు. ‘కానీ నేనిక్కడ ఆగలేను’ అన్నాడు.
ఆమె నవ్వుతూ తన కాలి బూటు కొనతో అతణ్ణి సున్నితంగా తాకుతూ ‘సరే, పో, పనికిమాలినవాడా! నువ్వూ, మీరంతా కూడా ఒక్కలాంటివాళ్ళే, శుద్ధ అప్రయోజకులు’ అంటూ ఆమె పక్కకు తిరగ్గానే రైన్‌హార్డ్ ఆ నేలమాళిగ మెట్లమ్మట నెమ్మదిగా పైకొచ్చాడు.
బయట వీథిలో చిక్కటి సంధ్యాకాంతి కమ్ముకుంటున్నది. వేడెక్కిన తన నుదుటిని శీతాకాలపు చలి గాలి తాకుతుండటం అతడికి తెలుస్తున్నది. ఎక్కడ చూసినా ఏదో ఒక కిటికీలోంచి క్రిస్మస్ వృక్ష కాంతుల వెలుగు కనవస్తున్నది. అప్పుడప్పుడు ఏదో ఒక ఇంట్లోంచి, ఏదో ఒక గదిలోంచి మంగళవాద్యాల సంతోషమయ సంగీతం పిల్లల ఆనందపు కేరింతల్తో కలగలిసి వినవస్తున్నది.
బిచ్చగాళ్ళ పిల్లల గుంపులు ఇంటింటికీ తిరుగుతున్నారు. తాము నోచుకోని సంతోషవైభవాన్ని కళ్ళారా చూసేందుకు ఆ ఇళ్ళముందు మెట్లెక్కి ఆ కిటికీల్లోంచి తొంగిచూస్తున్నారు. అప్పుడప్పుడు ఏదో ఒక తలుపు భళ్ళున తెరుచుకుని లోపలనుంచి ఏదో ఒక స్వరం ఆ బాలసందర్శకుల్ని గదమాయిస్తూ చీకటి వీథిలోకి తరిమేస్తున్నది. మరొకచోట మరొక ఇంటి ముఖమండపంలో మరెవరో పురాతన క్రిస్మస్ గీతాలు ఆలపిస్తున్నారు. తక్కినచోట్ల కూడా పాటలు పాడుతున్న చిన్నారుల గొంతులు స్పష్టంగా వినబడుతున్నాయి.
కానీ రైన్‌హార్డ్ దృష్టి వీటిమీద లేదు. అతడు వాటన్నింటినీ దాటుకుంటూ ఒక వీథిలోంచి మరొక వీథిలోకి నడుచుకుంటూ పోతున్నాడు. అతడు తన బసకి చేరుకునేటప్పటికి బాగా చీకటి పడింది. అతడు వడివడిగా మెట్లెక్కి తన గదిలోకి ప్రవేశించాడు.
ఒక మధుర పరిమళం అతణ్ణి స్వాగతించింది. అతడికి తన ఇల్లు గుర్తొచ్చింది. క్రిస్మస్ రోజుల్లో వాళ్ళమ్మ గదిలో అలముకుంటూ ఉండే చిరపరిచితమైన పరిమళం అది. వణుకుతున్న చేతుల్తో అతడు దీపం వెలిగించాడు. అక్కడ బల్ల మీద పెద్ద పార్సెలు ఒకటి కనబడింది. అది తెరుస్తూండగానే సుపరిచితమైన అల్లం కేకులు బయటపడ్డాయి. వాటిమీద చక్కెర పూతలో అతడి పేరులో మొదటి అక్షరాలు రాసున్నాయి. ఎలిసబెత్ తప్ప మరెవ్వరూ అలా చెయ్యరని అతనికి తెలుసు.
అప్పుడు మరో చిన్న పార్సెలు కనిపించింది. దానిలో చక్కటి ఎంబ్రాయిడరీ చేసిన వస్త్రాలూ, చేతిరుమాళ్ళూ, చొక్కా చేతుల కఫ్‌లూ ఉన్నాయి. వాటితో పాటు వాళ్ళమ్మ రాసిన ఉత్తరమూ, ఎలిసబెత్ రాసిన ఉత్తరం కూడా ఉన్నాయి. రైన్‌హార్డ్ మొట్టమొదట ఎలిసబెత్ రాసిన ఉత్తరం తెరిచి చూసాడు. అందులో ఆమె ఇలా రాసి ఉంది:
‘చక్కెర పూతతో రాసిన ఈ చక్కటి దస్తూరీ చూడగానే ఈ కేకులు తయారు చెయ్యడంలో ఎవరు సాయం చేసి ఉంటారో నీకీపాటికే అర్థమైపోయి ఉంటుంది. ఈ కఫ్‌ల మీద ఎంబ్రాయిడరీ చేసింది కూడా వారే. ఈ క్రిస్మస్ పూర్వసంధ్య ఇక్కడ చాలా నిశ్శబ్దంగా ఉండబోతోంది. రాత్రి తొమ్మిదిన్నర అయ్యేటప్పటికి మా అమ్మ రాట్నం ఓ మూల పెట్టేస్తుంది. నువ్విక్కడ లేకపోవడంతో ఈ శీతాకాలమంతా ఎంతో ఒంటరితనం ఆవరించినట్టుంది.
నువ్వు నాకు కానుక చేసిన బుల్లిపిట్ట పోయిన ఆదివారం చనిపోయింది. నేను దాన్నెంతో శ్రద్ధగానే చూసుకున్నాను. అయినా చనిపోయింది. నాకు చెప్పలేనంత ఏడుపొచ్చింది.
మధ్యాహ్నాలప్పుడు దాని పంజరం మీద సూర్యకాంతి పడుతుండే వేళల్లో అది పాడుతూ ఉండేది. అది అంత ఉత్సాహంగా పాడుతుంటే ఆ గానం మరీ గట్టిగా వినిపించకుండా ఉండటానికి అమ్మ ఆ పంజరం మీద ఒక గుడ్డ కప్పేది. నీకు గుర్తుంది కదా.
ఇప్పుడు మేముంటున్న గది మునుపటికన్నా మరింత నిశ్శబ్దంగా మారిపోయింది. మీ పాతమిత్రుడు ఎరిక్ అప్పుడప్పుడొచ్చి మమ్మల్ని పలకరిస్తున్నాడనుకో. అతను అచ్చం తను వేసుకునే గోధుమరంగు కోటులాగే ఉంటాడని నువ్వు మాకోసారి చెప్పావు కదా, అతను గుమ్మం దగ్గర కనబడ్డప్పుడల్లా ఆ మాట గుర్తొచ్చి భలే సరదాగా అనిపిస్తుంది. కానీ అమ్మతో మాత్రం ఈ మాట చెప్పకు. ఆమెకి కోపం రావొచ్చు.
మీ అమ్మకు నేను క్రిస్మస్ కానుకగా ఏమిస్తున్నానో ఊహించు చూద్దాం! నువ్వు ఊహించలేవు కదూ? మరేమీ కాదు, నన్ను నేనే కానుకగా సమర్పించుకుంటున్నాను! ఎరిక్ చార్‌కోల్‌తో నా బొమ్మ గీస్తున్నాడు; దానికోసం నేనిప్పటికి మూడుసార్లు బొమ్మకి తగ్గట్టుగా కూర్చోవాల్సి వచ్చింది. కూచున్నప్రతిసారీ గంటకి తక్కువ కాకుండా కదలకుండా కూచోవాలి తెలుసునా.
ఒక పరాయిమనిషి నా వదనాన్ని అంత నిశితంగా చూస్తూండటం అన్న ఆలోచనే నాకెంతో చికాగ్గా ఉంది. నిజానికి అది నా ఊహ కూడా కాదు. మా అమ్మనే పట్టుబట్టింది. నా బొమ్మ కానుకగా ఇస్తే మీ అమ్మగారు చాలా సంతోషిస్తారని చెప్పింది.
కానీ రైన్‌హార్డ్, నువ్వే నీ మాట నిలబెట్టుకోవడం లేదు. నా కోసం నువ్వు కథలేమీ రాసి పంపించడం లేదు. ఈ సంగతి మీ అమ్మగారికి చాలా సార్లు చెప్పాను. కానీ ఇలాంటి చిన్నపిల్లల పనులకన్నా మించినవి నువ్వు చెయ్యవలసిన పనులు చాలా ఉంటాయని సర్దిచెప్తుంటారామె. నేనైతే నమ్మను. మరేదో కారణం ఉండే ఉంటుంది అనుకుంటాను.’
ఆ తర్వాత రైన్‌హార్డ్ వాళ్ళమ్మ రాసిన ఉత్తరం చదివాడు. చదవడం పూర్తయ్యాక వాటిని నెమ్మదిగా మడిచి పక్కన పెట్టేసాక, స్వగ్రామం మీద చెప్పలేనంత బెంగ అతణ్ణి ముంచెత్తింది. చాలాసేపటిదాకా అతడు ఆ గదిలోనే పచార్లు చేస్తూ తనలో తను మాటాడుకుంటూ, చివరికి గొంతు సవరించుకుని సన్నగా గొణుక్కోడం మొదలుపెట్టాడు:
దారితప్పితి దిక్కు తోచక
మార్గమేదో మరచిపోతిని
బాటపక్కన బాలయొక్కతె
కానరాగా కలతతొలగెను
అతడు బల్లదగ్గరికి వెళ్ళి, ఆ సొరుగులోంచి కొంత సొమ్ము తీసుకుని, మళ్లీ వీథిలోకి అడుగుపెట్టాడు. ఈలోపు బయట వీథుల్లో నిశ్శబ్దం ఆవరించింది. క్రిస్మస్ చెట్లమీద దీపాలు కొడిగడుతున్నాయి. పిల్లల ఊరేగింపులు ముగిసిపొయ్యాయి. నిర్మానుష్యంగా మారిన వీథుల్లో చలిగాలి వీస్తోంది. ఇళ్లల్లో పిల్లలూ పెద్దలూ అంతా కలిసి పండగ విందుకోసం సిద్ధమవుతున్నారు. క్రిస్మస్ పూర్వసంధ్యల వేడుకల్లో మలి ఘట్టం మొదలయ్యింది.
రైన్‌హార్డ్ ‘రాట్స్ కెల్లర్’ దగ్గరికి రాగానే, ఆ మాళిగలోంచి ఫిడేలు నాదమూ, జిప్సీపిల్ల గానమూ వినిపించాయి. రెస్టారెంటు తలుపుదగ్గర గంట మోగింది. ఒక మనిషి నీడలాగా తూలుకుంటూ ఆ మసకవెలుతురులోనే మెట్లెక్కి పైకి వచ్చాడు.
రైన్‌హార్డ్ ఆ ఇళ్ళ నీడల పక్కనుంచే వాటిని దాటుకుంటూ ముందుకుపోయాడు. కాసేపటికి ఒక నగల దుకాణం దగ్గరకి చేరుకున్నాడు. ఆ దుకాణంలో దీపాలు ప్రకాశవంతంగా వెలుగుతున్నాయి. అతను అక్కడ పగడాలు పొదిగిన చిన్న శిలువబొమ్మ కొనుక్కుని వెళ్ళిన దారినే తిరిగి మళ్ళా వెనక్కి వచ్చాడు.
అతనుంటున్న గదికి దగ్గర్లోనే, చిరిగిపోయిన దుస్తుల్లో ఉన్న ఒక చిన్న బాలిక ఒక ఎత్తైన తలుపు ముందు నిలబడి, దాన్ని తెరవడానికి విఫలయత్నం చేయడం అతడు చూశాడు.
‘నేను సాయం చెయ్యనా?’ అనడిగాడు.
ఆ చిన్నారి బదులు చెప్పలేదు. కానీ ఆమె ఆ తలుపుకున్న పెద్ద పిడిమీంచి చేతులు వెనక్కి లాక్కుంది. రైన్‌హార్డ్ తనే ఆ తలుపు తెరిచాడు.
కానీ మళ్ళా ‘వద్దులే, వాళ్ళు నిన్ను మళ్ళా బయటికి తరిమేస్తారు. నాతో రా. నీక్కొన్ని క్రిస్మస్ కేకులిస్తాను’ అన్నాడు.
అని ఆ తలుపు మళ్ళా దగ్గరికి మూసేసి ఆ చిన్నారి చేతిని అందుకున్నాడు. ఆమె మౌనంగా అతడుండే చోటుకి అతని కూడా అడుగులేసింది.
అతను ఇంతకు ముందు బయటికి వచ్చినప్పుడు ఆర్పకుండా వచ్చిన దీపం వెలుగుతూనే ఉంది.
‘ఇవిగో ఈ కేకులు తీసుకో’ అని తన దగ్గరున్న మొత్తం కేకుల్లో సగానికి సగం ఆమె పరికిణీలో పోసేసాడు. కానీ చక్కెర పూత అక్షరాలున్న కేకులు మాత్రం తనదగ్గరే అట్టేపెట్టేసుకున్నాడు.
‘ఇంక మీ ఇంటికిపోయి మీ అమ్మకి కూడా కొన్ని కేకులివ్వు’ అన్నాడు.
ఆ పసిబిడ్డ అతణ్ణి బిడియంతో చూస్తూ ఉంది. తన పట్ల ఎవరేనా అటువంటి దయ చూపించడం ఆమెకి అలవాటులేనట్టుగా ఉంది. అలాంటి క్షణాల్లో అతనికి ఏమి చెప్పాలో తెలియనట్టే ఉంది. రైన్‌హార్డ్ తలుపు తెరిచి దీపం పట్టుకుని మెట్లవైపు చూపించాడు. ఆ చిన్నారిబిడ్డ కేకుల్తో మెట్లు దిగి ఒక పిట్టలాగా రెక్కలు చాపి తన ఇంటిదిక్కుకి పరుగుతీసింది.
రైన్‌హార్డ్ పొయ్యిలో నిప్పులు ఎగదోశాడు. సిరాబుడ్డి తీసి బల్లమీద పెట్టుకున్నాడు. దానికి దుమ్ముపట్టి ఉంది. అప్పుడు కూర్చుని వాళ్ళమ్మకీ, ఎలిసబెత్‌కీ ఆ రాత్రంతా ఉత్తరాలమీద ఉత్తరాలు రాస్తూనే ఉండిపోయాడు.
మిగిలిన క్రిస్మస్ కేకులు అతడి పక్కనే అలానే ఉండిపోయాయి. కానీ అతడు ఎలిసబెత్ పంపిన కఫ్‌లు తన చొక్కాకి తగిలించుకున్నాడు. రంగులద్దని ఆ ముతక ఊలు కోటుమీద అవి వింతగా కనిపిస్తున్నాయి. మంచుపట్టిన కిటికీ అద్దాలమీదుగా శీతాకాలపు సూర్యోదయ కాంతి ప్రసరించేవేళదాకా అతడట్లానే అక్కడే కూర్చుని ఉన్నాడు. పాలిపోయిన అతడి గంభీరవదనం ఆ అద్దాల్లో ప్రతిఫలిస్తూ ఉంది.
(ఇంకా ఉంది)
2-11-2026

