ఉష్ణీశ పరిత్యాగ శిల్పం

ఫణిగిరి శిల్పులు బుద్ధుడి ఉశ్ణీష పరిత్యాగాన్ని శిల్పంగా చెక్కారని రాసాను గుర్తుందా! అది స్టేట్ మూజియంలో ఉందని తెలిసిందనీ, ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆత్రుతగా ఉందని కూడా రాసాను కదా. ఎట్టకేలకు ఈ రోజు మధ్యాహ్నం స్టేట్ మూజియంలో ఆ శిల్పాన్ని చూడగలిగాను.

అదింకా ఏదో రెండు మూడు అడుగుల పొడవుండే చిన్నపాటి శిల్పమూ, దాన్నెక్కడో లోపల షోకేసులో పెట్టి ఉంటారేమో అనుకున్నాను. మూజియంలో అడుగుపెడుతూనే అక్కడి టెక్నికల్ ఆఫీసరు ప్రేమ్ సాగర్ రావు గారిని ఆ విగ్రహం ఎక్కడుందో చూపించరా అనడిగాను. ఆయన నన్ను మూజియంలో లోపల భవనంలోకి తీసుకు వెళ్ళి చూపించారు. అది మూజియం మధ్యలో నా కోసమే ఎదురుచూస్తూ కనబడింది. ఇప్పుడుగాని చూడకపోయుంటే మళ్ళా ఎన్నాళ్ళకు చూస్తానో అనుకున్నాను. ఎందుకంటే ప్రపంచమంతా ఆ శిల్పాన్ని చూడాలని ఉవ్విళ్ళూరుతూ ఉంది. ఆ మధ్య అమెరికా వెళ్ళి న్యూయార్క్ మెట్రొపోలిటన్ మ్యూజియంలో కొన్ని నెలలుంది. అక్కణ్ణుంచి రాగానే దక్షిణ కొరియాలో సియోల్ కి వెళ్ళి వచ్చింది. ఈ నెలాఖరున మళ్ళా న్యూఢిల్లీ వెళ్ళబోతున్నదట. నాకు తెలిసి ప్రపంచం ఇంతలా ఎదురుచూసే ఒక్క సజీవకళాకారుడు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లేడు!

ఆ శిల్పాన్ని అక్కడ సిమెంట్ పెడస్టలు మీద తాపడం చేసి పెట్టారు. దాన్ని వేరే దేశాలకు పంపేటప్పుడు ఆ పీఠం నుంచి పెళ్ళగించి పంపిస్తారట. తిరిగి వచ్చాక మళ్ళా తాపడం చేసి పెట్టేస్తారట. బహుశా భద్రతా కారణాల వల్ల అలా చేస్తూ ఉండవచ్చుగాని, భారతదేశంలో మ్యూజియంలు అన్నింటిలోనూ కూడా ఈ దురాచారం ప్రచలితంగా ఉందని విన్నాను. ఏమిటది? శిల్పాల్ని సిమెంటు చప్టాల్లో పాతి బిగించడం. ఒక కళారూపాన్ని భద్రపరుచుకోడానికి అంతకన్నా అనాగరికమైన పద్ధతిని ఊహించలేమని ఈ మధ్యనే ఎక్కడో చదివాను. దాన్ని పెద్ద గాజు షోకేసులో పెట్టి కూడా భద్రత కల్పించవచ్చు. అలా గాలీ, తేమా సోకేలా బయట పెట్టినందువల్ల దాదాపు రెండువేల ఏళ్ళ వయసుకలిగిన ఆ నిత్యయవ్వన శిల్పానికి వార్ధక్యం రాకుండా కాపాడుకోలేం.

కానీ నా మటుకు నాకు ఆ శిల్పాన్ని అంత దగ్గరగా చూస్తాననుకోలేదు. నేను ఆ శిల్పాన్ని చూస్తూనే విజయసారథిని తలుచుకున్నాను. ఆయన ఇక్కడ ఉండగానే ఒక్కపూటేనా ఈ శిల్పాన్ని చూపించి ఉండవలసింది కదా అనుకున్నాను. (ఆ పైభాగం చూడండి. దాన్ని కూడా తలపాగా ఆకారంలో చెక్కారు అని చెప్తున్నారు ప్రేమ్ సాగర్ రావుగారు.)

నేను ఆంకార్ వాట్, బోరోబుదూరు లు చూడలేదు. Louvre Museum చూడలేదు, అమస్టర్ డామ్‌లో వాన్ గో మ్యూజియం చూడలేదు. వాటికన్ సిటీలో Sistine Chapel చూడలేదు. బీజింగ్ లో పాలస్ మ్యూజియం చూడలేదు. కానీ ఈ రోజు, ఈ శిల్పాన్ని చూడటంతో నాకు అవేవీ చూడలేదన్న బెంగలేకుండా పోయింది. ఎందుకంటే, ఆ మహత్తర కళాఖండాలన్నీ కూడా ఫణిగిరి శిల్పులు ఈ శిల్పాన్ని చెక్కాక ఉనికిలోకి వచ్చినవే. నేను తాజ్ మహల్ చూసాను, ఎర్రకోటలో ముఘల్ మీనియేచర్లు చూసాను, సముద్రాలమీంచి బంగారం తెచ్చి చోళచక్రవర్తులు నిరించిన తమిళ మహాదేవాలయాలు—ఒక చిదంబరం, ఒక శ్రీరంగం చూసాను. కానీ ఫణిగిరిలో శిల్పులు ఈ శిల్పాన్ని చెక్కిన వెయ్యేళ్ళ తరువాతి కళారూపాలవి. నేను సారనాథ్ చూడకపోలేదు, సాంచి చూడకపోలేదు. అమరావతి, నాగార్జున కొండలు కూడా చాలా దగ్గరగా చూసాను. కాని నేనింతకుముందే మీకు చెప్పుకున్నట్టు, భారతీయ బౌద్ధ శిల్ప కళ అత్యుచ్చదశకు చేరుకున్న ఈ శిల్పం లాంటి శిల్పాన్ని మాత్రం నేనెక్కడా చూడలేదు.

సాధారణంగా మనుషులకి గొప్ప సౌందర్య సన్నిధిలో అన్నిటికన్నా ముందు ఆకలి వేస్తుందని చెప్తారు. అందుకే ఊటీలోనూ, బెంగలూరు లాల్ బాగ్ లోనూ కనిపించేంత చెత్త మనకి మరెక్కడా కనిపించదు. లేదా మనుషులు అట్లాంటి సౌందర్యసన్నిధిలో ఒకటే వాగడం మొదలుపెడతారు. ఈ తిండిపోతుతనానికీ, ఈ వదరుబోతుతనానికీ కారణం మనుషుల్లో అణగి ఉండే libido అక్కడ బయటపడుతుంది. దానికి కారణం మహాసౌందర్యసన్నిధిలో మనిషి తనకు తెలీకుండానే మృత్యుభీతికి లోనవుతాడు. ఆ సౌందర్యం తన అశాశ్వతత్వాన్ని తనకి గుర్తుచేస్తుంది. అది తనని కబళించివేస్తుందని మనిషికి చెప్పలేని భయం అంతరాంతరాల్లో మేల్కొంటుంది. అందుకనే అటువంటి ఉగ్ర సౌందర్య సన్నిధిని beautiful అనే మాటతో కాకుండా sublime అనే మాటతో సూచిస్తారు.

ఈ శిల్పంలో కూడా సాధారణ సౌందర్యప్రమాణాల్ని దాటిన తీవ్ర అభివ్యక్తి ఉన్నమాట నిజమేగాని, దీని ముందు మనకి భయం కలగదు. ఎందుకంటే, జీవితం అశాశ్వతం అని మనకి స్ఫురించేముందే, అదే ఆ విషయాన్ని బిగ్గరగా చెప్తున్నది. కాబట్టి ఈ శిల్పం ఎదట మనకి ఉపనిషత్తుల మాటల్లో చెప్పాలంటే ఒక ‘ప్రపంచోపశమనం’ కలుగుతుంది. మనం మరుక్షణం ఉండము, నిజమే, కానీ, ఈ క్షణం ఈ శిల్పం ఎదట నిలబడ్డప్పుడు, బుద్ధుడి ఆత్మవిజయ క్షణం మనం అనుభూతి చెందుతాం. అది చూసినప్పుడు మనకి సంతోషం కలుగుతున్నదంటే, మనలో కూడా బుద్ధత్వం మేలుకుంటున్నట్టే కదా. ఈ ఒక్క క్షణం చాలు మనం పుట్టినందుకు.

అయినా కూడా ఒక చాపల్యాన్ని మాత్రం అణచుకోలేకపోయాను. ఆ శిల్పానికి చాలా దగ్గరగా నిలుచున్నాను కాబట్టి అందులో కనీసం ఒక్క ఆకృతినన్నా స్కెచ్ గా వేసుకోవాలన్న కోరికని అణచుకోలేకపోయాను. దాని అర్థం నేనొక గొప్ప చిత్రకారుణ్ణనో లేదా ఇలా స్కెచ్చిలు గీసుకునే కళారాధకుణ్ణనో కాదు. అలా చూస్తున్నదాన్ని స్కెచ్ వేసినప్పుడు నాకు కలిగే అనుభూతి ఏమిటంటే ఆ శిల్పంలోని ఆ వక్రరేఖలమ్మట నా అంగుళుల్ని పోనిచ్చినట్టుగా, ఆ వంపుల్ని నేను నా సర్వాస్తిత్వంతో feel అవుతున్నట్టుగా ఉంటుంది. రెండువేల ఏళ్ళకిందట ఆ శిల్పులు సిద్ధార్థుణ్ణి చెక్కుతున్నప్పుడు, ఆయన అధిరోహించిన కంఠకాన్ని చెక్కుతున్నప్పుడు, ఆ శిరస్సు, ఆ ఉష్ణీశం, ఆ కళ్ళెం, ఆ ఉత్తరీయం, ఆ దండకడియం, ఆ నేత్రాలు, ఆ చుబుకం, ఆ ఫాలభాగం, ఆ ఉదరం, ఆ ఊరువులు, ఆ జానువులు— ఆ మహాపురుషుడి సర్వాంగాల్నీ నేను కూడా ఒకసారి ప్రీతిగా తడిమిచూసుకున్నట్టు ఉంటుంది కదా అన్న ప్రలోభంతోనే పెన్సిలు చేతుల్లోకి తీసుకున్నాను.

గీయడమైతే గీసాను. సిద్ధార్థుణ్ణీ, ఆయన్ని ముక్తిమార్గం వైపు తీసుకుపోతున్న ఆ అశ్వాన్నీ. చూడండి. ఇందులో నా చిత్రలేఖన కౌశల్యం ఏ పాటిదని చూడకండి.

రుద్రపురుషదత్తుడి కాలంలో, ఆ కొండమీద బౌద్ధారామంలో— ఆ శిల్పులు ఈ శిల్పాన్ని చెక్కడానికి, అశ్వఘోషుడి ‘బుద్ధ చరిత్ర‘లో ఈ శ్లోకాలు (6:13-14;19-20) పదే పదే మననం చేసుకుంటున్నప్పుడు— నేను కూడా అక్కడ ఉన్నాననీ, ఆ పులకింతని ఇలా మీతో పంచుకుంటున్నాననీ మాత్రమే అనుకోండి.

ముకుటోద్దీప్తకర్మాణం మణిమాదాయ భాస్వరం
బ్రువన్ వాక్యమిదం తస్థౌ సాదిత్య ఇవ మందరః

(అంతదాకా తన మకుటాన్ని వెలిగిస్తూ ఉన్న మణిని చేతుల్లోకి తీసుకుని సూర్యుణ్ణి ధరించిన మందరపర్వతంలాగా ప్రకాశిస్తూ (సిద్ధార్థుడు చండుడితో) ఇలా అన్నాడు.)

అనేన మణినా ఛంద ప్రణమ్య బహుశో నృపః
విజ్ఞాప్యో ऽముక్తవిశ్రంభం సంతాపవినివృత్తయే

(నువ్వు ఈ మణి తీసుకుని పోయి మహారాజుకి పదే పదే నమస్కరించి ఆయన దుఃఖాన్ని పోగొట్టే విధంగా నా మాటగా ఇలా చెప్పు.)

అయం చ కిల పూర్వేషామస్మాకం నిశ్చయః స్థిరః
ఇతి దాయాదభూతేన న శోచోऽస్మి పథా వ్రజన్

(మన పూర్వీకుల స్థిర నిశ్చయం కూడా ఇదే. కాబట్టి నేను వాళ్ళ నిజమైన వారసుడిగా ఈ మార్గాన్ని ఎంచుకున్నందుకు నా గురించి శోకించకండి.)

భవనితి హ్యర్థదయాదాః పురుషస్య విపర్యయే
పృథివ్యాం ధర్మదాయాదా దుర్లభాస్తు న సంతి వా

(ఎందుకంటే ఒక మనిషి మరణించినప్పుడు అతడి ఆస్తిపాస్తులకు వారసులు చాలామందే ఉంటారు. కానీ ఈ భూమ్మీద ధర్మానికి వారసులు మాత్రం దుర్లభం, ఆ మాటకొస్తే, ఉండరేమో కూడా!)

17-11-2026

Leave a Reply