ఆ వెన్నెల రాత్రులు గొప్ప అనుభూతి

కె.పి. అశోక్ కుమార్ గొప్ప చదువరి. సమీక్షకులు. తెలుగులో ఇప్పటికే 1500 పైన పుస్తకాలు సమీక్షించినవారు. ఆయన ఆ వెన్నెల రాత్రులు పుస్తకం పైన రాసిన ఈ సమీక్ష మిత్రులు కొప్పరపు లక్ష్మీ నరసింహారావు గారు పంచుకోగా నా దాకా వచ్చింది. అశోక్ కుమార్ గారికి ధన్యవాదాలతో ఆ సమీక్షని ఇక్కడ మీతో పంచుకుంటున్నాను.


ఇష్టం కొద్ది విమల బీఎస్సీ బోటనీ తీసుకుని, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయి ఎం ఎస్ సి చేయాలనుకుంటుంది. త్వరగా పెళ్లి చేసి పంపించాలని తండ్రి ఆరాటం. ఏం చేయాలో తోచని పరిస్థితులలో సేన్ గుప్తా అనే కలకత్తా యూనివర్సిటీలోని జియాలజీ ప్రొఫెసర్, తూర్పు కనుమల మీద పరిశోధనకు ఒక ప్రాజెక్టు తీసుకుంటాడు. దానికి జియాలజీ, బోటని, ఆంత్రోపాలోజీకి చెందిన విద్యార్థులు ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లుగా అవసరం కావడంతో, బోటనీ విభాగానికి విమలను ఎంపిక చేసుకుంటారు. జియాలజీలో డాక్టరేట్ చేస్తున్న ప్రొఫెసర్ అన్నగారి కూతురు వనలత కూడా రావడంతో విమలకు బెరుకు లేకుండా పోతుంది. విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దుల్లోని, మన్యప్రాంతంలో ఉన్న ఒక ఊరిలో బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకుంటారు. అక్కడికి వెళ్లి ఫారెస్ట్ ఆఫీసర్ ను కలుసుకొని సూర్యనారాయణమూర్తి అనే ఉపాధ్యాయుడి ఇంట్లో విమల గెస్ట్ గా ఉండిపోతుంది. ప్రొఫెసర్ గారు ఆ ప్రాంతంలో ఉండే కొండల గురించి, అడవుల గురించి, అక్కడి కొండరెడ్ల గురించి పరిశోధన చేయడానికి వచ్చానని పరిచయం చేసుకుంటాడు. ప్రొఫెసర్ సేన్ గుప్తా తన ఎదుట ఉన్న కొండల గురించి ,భూమి గురించి, సముద్రాల గురించి చాలా సరళంగా చెప్పాలని ప్రయత్నించేవాడు. ఆయన కాలం కన్నా ముందున్న వ్యక్తి, ఆయనలో ఒక జియాలజిస్టు, ఒక న్యాచురలిస్టు మాత్రమే కాక ఒక యాంత్రోపాలజిస్ట్ కూడా ఉన్నాడు. కొండ అంటే అడవి, అడవిలో ఉంటున్న ఆదివాసులు కూడా అని ఆయన నమ్మకం. అదంతా ఒక సమిష్టి కుటుంబం అని ఆయన విశ్వసించాడు. ఆ కుటుంబాన్ని ఎన్ని పార్శ్వాల్లో సమీపించగలిగితే, అన్ని పార్శ్వాల్లో వాళ్ళను సమీపించాలని అనుకుంటాడు.

ప్రొఫెసర్ సేన్ గుప్తా హఠాత్తుగా కలకత్తా వెళ్ళిపోవడంతో, అతని స్థానంలో వచ్చిన మిశ్రా యాంత్రోపాలజిస్ట్. ఏ విషయాన్ని అయినా ప్రాక్టికల్ గా ఆలోచిస్తుంటాడు. “ట్రైబల్స్ గురించి తెలుసుకోవడానికి పుస్తకాలు ఎందుకు? డైరెక్ట్ గా వాళ్ళని పోయి తెలుసుకుంటే తెలుస్తుంది కదా! వాళ్లతో మాట్లాడినా తెలుస్తుంది” అన్న ప్రొఫెసర్ మిశ్రా మాటలు విమలను ఆలోచింపజేస్తాయి. గిరిజనులు నిరంతరం దోపిడీకి గురవుతూనే ఉన్నారన్న స్పృహను వారితో పాటు తన అసిస్టెంట్లకు కూడా తెలియజేస్తాడు. గిరిజనుల అభ్యుదయం కోసం తపించే ప్రొఫెసర్ మిశ్రా వారి బడి కోసం బీడీవో వెంటబడి సాధిస్తాడు. గిరిజనుల పుస్తకాలలో వాళ్ళ జీవితాల గురించి కానీ, వాళ్ళు ఎదుర్కొనే సమస్యల గురించి కానీ లేకపోతే వారేం నేర్చుకుంటారని ప్రశ్నిస్తాడు. వారి కోసం పట్టుబట్టి మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయిస్తాడు. గిరిజనులతో ” మీరు మైదాన ప్రాంతాల వారికి బినామీలుగా ఉండకండి. మీ బంజరు మీరే దున్నుకోండి. మీకు కావలసిన ఎడ్లు, పనిముట్లు, విత్తనాలు, ఎరువులు ప్రభుత్వం నుంచి వస్తాయి. ఐటిడిఏ ఉన్నది మీకోసమే” అని వారికి చెప్పి వాళ్ళలో ధైర్యాన్ని నింపుతాడు. సామాజిక అన్యాయాలనుంచి గిరిజనులను కాపాడటానికి ప్రభుత్వమో లేదా నక్సలైట్లో బాధ్యత పడాలనుకుంటారు. కానీ నా దృష్టిలో అది గిరిజనులని మరింత డిపెండెంట్ చేయడం. అందుకే గాంధీ గారు ప్రజల దగ్గరకు వెళ్ళండి. వాళ్లతో మాట్లాడండి. వాళ్లకు శిక్షణ ఇవ్వండి అని చెప్పారు. గిరిజనుల సమస్యల్ని గిరిజనులే హ్యాండిల్ చేసుకోగలిగే స్థితికి రావాలి అని చెప్పడం మనల్ని ఆలోచింపజేస్తుంది.

ఒక ఉన్నతాధికారి ట్రైబల్ ఏరియాలో చాలా చేయగలరు. అక్కడ ఉన్న ఇన్ జస్టిస్ ని ఎంతో కొంత అరికట్టగలడు. కానీ ఒక ఐఏఎస్ అధికారి జీవితమంతా ట్రైబల్ ఏరియా లోనే పనిచేయడం కుదరదు. రెండు మూడేళ్ల కన్నా అక్కడ ఉంచక, వేరే పోస్టులో అతన్ని ట్రాన్స్ఫర్ చేయడంతో, అతను స్వేచ్ఛగా పనిచేయలేక పోతాడు. అదిగాక గిరిజన సమస్యలకు ప్రభుత్వం ఇవ్వగల పరిష్కారాలకు కూడా చాలా లిమిటేషన్స్ ఉండడం కూడా మరొక సమస్య.

నవల చదువుతున్న పాఠకుడు విమలకు లాగానే, తను కూడా తనకు తెలియని ఒక కొత్త అపరిచితమైన ప్రపంచంలోకి ప్రయాణం మొదలుపెడతాడు. ఆ గ్రామం, గ్రామస్తులు, అడవి కొండలు, శబ్దాలు, నిశ్శబ్దం, వెన్నెల రాత్రులు, ప్రొఫెసర్ సేన్ గుప్తా ,వనలత, మిశ్రా అందరితో పాటు రాజును కూడా ఇష్టపడుతుంది కానీ ఆ ఇష్టం ఇష్టంగానే ఉండిపోతుంది. ఇందులో బొటానిస్టులు జియాలజిస్ట్ లు, ఇండాలజిస్టులు, యాంత్రోపాలజిస్టులు, పాలియంటాలజిస్టు లే కాకుండా అన్వేషకులైన ఇద్దరు ప్రొఫెసర్ల నుండి ఆయా విషయాలకు సంబంధించిన శాస్త్ర చర్చలు, ప్రకృతితో- మానవ జీవితాలతో అవి ఎలా పెనవేసుకుపోయాయో శాస్త్రీయంగా వివరించడం ఎంతో విజ్ఞానాత్మకంగా ఉంది. అడవిలోకి ప్రయాణం, ప్రకృతితో సహజీవనం, మనకు కొత్త లోకాలను పరిచయం చేస్తూ సమాచారాత్మకంగా, విజ్ఞానాత్మకంగా కొనసాగిన ఈ నవలను చదవడమే గొప్ప అనుభూతి.

కె పి అశోక్ కుమార్

( వాడ్రేవు చినవీరభద్రుడు “ఆ వెన్నెల రాత్రులు” శ్రీపాద పబ్లికేషన్స్., హైదరాబాద్ .వెల 350 రూపాయలు, పేజీలు 284 ప్రతులకు 9063992633)

2-11-2026

Leave a Reply