జీవనశిల్పి-15

గ్రామాల గురించీ, గ్రామాల నిర్మాణం గురించీ, గ్రామాల్లో కట్టే ఇళ్ళ శైలి గురించి గురూజీ తన సంభాషణ కొనసాగిస్తున్నారు:

‘గ్రామాల్లో ఇండ్లు కట్టేటప్పుడు కట్టడానికి ఉపయోగించే సూత్రాలు, సిద్ధాంతాలూ అందరికీ ఒకేలా ఉండేవి. కానీ డిజైన్ మాత్రం ఎవరికి నచ్చినట్లు వారికుండేది. ఆ కాలంలో వాస్తు గురించిన అవగాహన ప్రతి ఒక్కరికీ ఉండేది. వాస్తు ఎందుకు అవసరమో ఆ సమాచారం అందరికీ తెలిసినప్పటికీ, వారి వారి వృత్తుల్ని బట్టి ఇండ్ల డిజైను ఉండేది. ఉదాహరణకి ఒక నేత పనివాడు ఉన్నాడనుకోండి, వాడి ఇల్లు ఎలా ఉండాలన్నది వాడికే బాగా తెలుస్తుంది. ఇంకొకరికి ఎలా తెలుస్తుంది? అందువల్ల ఆ కాలంలోని ఇండ్లన్నీ  ఒక పక్క ఇండ్లుగా ఉంటూనే, మరో పక్క కార్ఖానాలుగా కూడా ఉండేవి . అలాగే ఆ ఇండ్లు దుకాణాలుగా, పాఠశాలలుగా, ఒకరకమైన మ్యూజియాలుగా పనిచేసేవి. విద్య నేర్చుకునే శిష్యుడు కూడా అక్కడే నేర్చుకునేవాడు. ఇంటి ముంగిలే వారికి వర్క్ షాపు లాగా ఉండేది. ప్రతి ఒక్కరి ఇల్లూ వారి వృత్తికి సంబంధించిన కార్ఖానాగా ఉండేది. పనులు చెయ్యడంకోసం మనవాళ్ళు ప్రత్యేకంగా షెడ్లులాంటివి వేసేవాళ్ళు కాదు. అది కంసాలి ఇల్లు కావచ్చు, సాలెవారి ఇల్లు కావచ్చు, కుమ్మరి ఇల్లు కావచ్చు, అన్నీ వర్క్ షాపులుగానే ఉంటూనే వ్యాపారదుకాణాలుగానే ఉండేవి. అక్కడినుంచే ఇవ్వడం, తీసుకోవడం అంతా సాగేది. పాతకాలపు డిజైన్ల వస్తువుల్నీ, పుస్తకాల్నీ వారు ఇంట్లోనే భద్రపరుచుకునేవారు.’

‘సాలెవారి ఇండ్ల విషయానికొస్తే, నేత కార్మికుడు కూచుని పనిచేసే స్థలంలో ఎప్పుడూ వెలుతురు ఉండాలి. అందుకని వాడు తూర్పు, పడమర దిశల్ని బట్టి ఇల్లు కట్టుకునేటప్పుడు రెండు వైపులా చాలా పెద్ద పెద్ద కిటికీల్ని ఉంచేవాడు. తద్వారా సూర్యుడు తూర్పునున్నా, పడమరనున్నా, వాడు పనిచేసే చోట ఖచ్చితంగా వెలుతురు పడేది.’

‘మనిషి చేసే పనిని బట్టి ఇల్లుండేది. కుమ్మరి ఇల్లుందనుకోండి- మట్టి ఎక్కడుంచాలి, చక్రం ఎక్కడ తిప్పాలి, ఎక్కడ కూర్చుని కుండలు చెయ్యాలి, అలాగే ఆ కుండల్ని కాల్చడానికి ఆవం ఎక్కడ పెట్టాలనేది వారి ఇండ్లలోపలనే నిర్ణయించి ఉండేది. వాళ్ళ ఇండ్లు గడ్డి ఇళ్ళే అయినప్పటికీ, కుమ్మరులు తమ ఇండ్లమధ్యలోనే ఆవం పెట్టి కుండలు కాల్చేవారు. కానీ ఆ మంటలు బయటకి వచ్చేవి కావు. అగ్ని తమ వశంలో ఉంటుందని కుమ్మరులకి  ఒక నమ్మకముండేది. వారి ఆవం నుండి మంటలెప్పుడూ బయటకు రావు. పక్కనే గడ్డికుప్పలున్నప్పటికీ వారు ఎంతో నిశ్చింతగా ఆవానికి మంటపెట్టేవారు. వారు మట్టినొకసారి గాల్లోకి చల్లి, ఆ మట్టి కిందికి పడే విధానాన్ని బట్టి గాలి ఒత్తిడి ఎలా ఉందో, తుపాను ఎప్పుడు రావచ్చో, గాలి గాలి ఎటు వీస్తుందో అంచనా వేసుకుని ఆవం పెట్టేవారు. అందువల్ల తుపానులు వచ్చినా కూడా ఆ మంటలు బయటకు వెళ్ళేవి కావు.’

‘అలాగే చర్మకారుల ఇండ్లు కూడా వారి వృత్తికి అనుకూలమైన డిజైనుతో ఉండేవి. కుమ్మరుల ఆవములు కొన్ని వ్యక్తిగతంగా ఉంటే, మరికొన్ని ఉమ్మడిగా ఉండేవి. ప్రతి ఒక్క చేతివృత్తి వాని పరిస్థితీ ఇంతే. కాగితాలు తయారు చేసేవాడు కూడా గుజ్జు తయారుచేయడానికి సామూహిక పద్ధతులు వాడేవాడు. కుమ్మరులు కూడా చిన్న చిన్న పనులకి తమ సొంత ఆవములను వాడితే ఎక్కువ కుండలు కాల్చడానికి సామూహిక ఆవములు ఉపయోగించేవారు.’

‘అలాగే వ్యవసాయం చేసుకునే రైతుల ఇండ్ల విషయానికొస్తే, నేను గమనించినంతవరకూ వారి ఇండ్లు చాలా పెద్దవిగా ఉండేవి. వాటి ద్వారాలు ఎంత పెద్దవిగా ఉండేవంటే, వారి పశువులు, ఎడ్లబండ్లు అన్నీ నేరుగా ఇంటిలోపలకి వచ్చేసేవి. ఇంటిలోపలనే ధాన్యం నిల్వచేసుకునే పద్ధతులూ, పశువులను కట్టుకునేందుకు ఏర్పాట్లూ ఉండేవి. ఇదంతా ఒకే కుటుంబ వ్యవస్థలాగా నడిచేది. ఒకే ఊళ్ళో అందరికీ వేరువేరుగా కోఠీలు లేదా ప్రత్యేక స్థలాలూ ఉండేవి కావు. అంతా ఇంటిలోపలనే ఇమిడి ఉండేది. ఇప్పటికీ ఎడ్లబండ్లు నేరుగా ఇంటిలోపలికే వెళ్ళేలా ఉన్న ఇండ్లను మనం చాలా గ్రామాల్లో చూడవచ్చు.’

‘మరొక ముఖ్యమైన విషయం, గ్రామాల్లో ధాన్యం నిలవచేయడానికి నేలలోపల పాతర తవ్వేవారు. భుమి స్వభావాన్ని బట్టి ఇంటి అంగణంలోగాని, లేదా ఊరి బయటగానీ ఈ పాతరలు ఏర్పాటు చేసేవారు. కొన్ని గ్రామాల్లో వాగులు లేదా నాలాల ఒడ్డున కూడా పాతరలు తవ్వేవారు. అవి మట్టితోనో, గడ్డితోనో చేసినవి కావు. నేరుగా భూమిలోపలనే తవ్వే ఏర్పాట్లు. నేలపైన రెండు మూడు అడుగుల గుండ్రని ద్వారాన్నుంచి లోపలకి వెళ్ళేకొద్దీ చాలా లోతుగా, వెడల్పుగా పాతర తవ్వేవారు. ఒక్కో పాతరలో దాదాపు నాలుగు వందలనుంచి అయిదు వందల  క్వింటాళ్ళ ధాన్యం పట్టేది.’

‘అందులో ధాన్యం వేసిన తరువాత రెండు మూడేళ్ళ వరకూ తీయకపోయినా అది అస్సలు పాడయ్యేది కాదు. కొన్ని గ్రామాలు తగలబడిపోయి, ప్రజలు వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిపోయిన తర్వాత కూడా తమ పాత ఊళ్ళో  ధాన్యం దాచిన పాతరలున్నాయనే విషయం గుర్తొచ్చి, వచ్చి తవ్వి చూస్తే, ఆ ధాన్యం అలాగే సురక్షితంగా ఉన్న సందర్భాలున్నాయి. పైన చెట్లు మొలిచినప్పటికీ లోపల ధాన్యం పాడయ్యేది కాదు. ఆ పాతరల ప్రత్యేకత ఏమిటంటే వాటిలోపలకి నీరు అస్సలు చేరేది కాదు. పైన వర్షం ఎంత పడినప్పటికీ, లోపల ధాన్యం కుళ్ళిపోయేది కాదు. దీని వెనుక ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ ఉండేది. నదుల ఒడ్డున, పొన్నారి లేదా చాందా ప్రాంతాల్లోని నాలాల పక్కన కూడా చాలా పెద్ద పెద్ద పాతరలుండేవి. అవి వ్యక్తిగతంగానూ ఉండేవి, అలాగే ఊరి మొత్తానికి కూడా కలిపి ఉమ్మడి పాతరలుండేవి.’

ఇక ఇండ్లలో వస్తువులు దాచుకునే పద్ధతిని చూస్తే- చాలా ఇండ్లలో ఏడాది నుంచి ఇరవై రెండేళ్ళదాకా నిల్వ ఉన్న నెయ్యి, చింతపండు, బియ్యం ఉండేవి. ఎవరైనా వచ్చి తొమ్మిదేళ్ళ నాటి పాత చింతపండు కావాలన్నా, లేదా ఇరవై రెండేళ్ళ నాటి పాతనెయ్యి కావాలన్నా తీసిచ్చేవారు. 22 ఏళ్లు, 21 ఏళ్లు, 20 ఏళ్ల నాటి నెయ్యి పాత్రల్ని వారు వరసగా అమర్చి ఉంచేవారు. నెయ్యి వాసన వస్తుంది కదా అని మీరడగవచ్చు. దాన్ని ఆయుర్వేదం కోసం చాలా పద్ధతిగా భద్రపరిచేవారు. 16 ఏళ్ళ నాటి పాతబియ్యం, నెయ్యి, చింతపండు, ఇరవై  ఏళ్ళ నాటి పాత బెల్లం కూడా రైతుల ఇండ్లలో సురక్షితంగా ఉండేవి. మట్టి పాత్రలకు లక్క పూసి వాటిని భూమిలో పెట్టేవారు. కొన్ని వస్తువులు అటకలమీద దాచేవారు. అప్పటి ఇండ్ల మధ్య గోడలు గజం నుంచి ఒకటిన్నర గజం వెడల్పుతో చాలా లావుగా ఉండేవి. ఆ గోడల మధ్యలోనే చిన్న చిన్న అరలు చేసి అక్కడ ఊరగాయలు, నెయ్యి పాత్రలు ఉంచేవారు. అందువల్ల అవి ఎప్పటికీ పాడయ్యేవి కావు.’

‘ధాన్యపు పాతరలు కూడా అంతే. జొన్నల్ని దాచడానికి పాతరలలో వేసేవారు. ఇప్పుడు హైబ్రిడ్ జొన్నలు వచ్చిన తరువాత ఎవరూ పాతరలను వాడటం లేదు. హైబ్రిడ్ ధాన్యం ఎక్కువ కాలం నిల్వ ఉండదు. అది కేవలం అమ్ముకోవడానికే తప్ప దాచుకోవడానికి పనికిరాదు. పాతరల వ్యవస్థ చాలా అద్భుతమైనది. ఎందుకంటే, అందులో దొంగల భయంగానీ, అగ్ని భయంగానీ ఉండేది కాదు.’

‘పాతరలలో ధాన్యం వేసేటప్పుడు, తీసేటప్పుడు కొన్ని పద్ధతులుండేవి. చాలా ఏళ్ళ తరువాత పాతర తెరిచినప్పుడు వెంటనే లోపలకి వెళ్ళి తీసేవారు కాదు. కొన్ని గంటలు దాన్ని అలాగే తెరిచి ఉంచేవారు. మొదట ఒక దీపాన్ని లోపలకి పంపించేవారు. దీపం కనుక వెలిగితే, ఆ తర్వాత ఒక కోడిని లోపలకి వదిలేవారు. కోడి లోపల నిశ్చింతగా తిరిగితేనే, ఆ తర్వాత మనిషి లోపలకి దిగేవాడు. పాతర తెరవగానే నేరుగా లోపలకి వెళ్తే లోపల ఉన్న విషవాయువులవల్ల మనిషి చనిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఆ గాస్ అంతా బయటకు పోయి కోడి బతికి ఉన్నట్లు నిర్ధారించుకున్న తర్వాతే మనిషి లోపలకి వెళ్ళేవాడు.’

‘ధాన్యాన్ని పాతరలో వేసేటప్పుడు చర్మకారుల పాత్ర చాలా ముఖ్యమైనదిగా ఉండేది. పాతరలోపల శుభ్రం చేయడం, అంతా సిద్ధం చేయడం వారి బాధ్యత. అంతా బాగుంది అనుకున్నాక, వారు పైకి వచ్చాక, అతడు, అతడి  భార్యా ఒక దుప్పటి పట్టుకుని నిలబడేవారు. ప్రతి ఒక్క ఎడ్లబండి నుండి వచ్చే ధాన్యాన్ని మొదట ఆ దుప్పట్లో పోసి ఆ తర్వాతే పాతరలోపలకి పంపేవారు. ఆ సమయంలో రాలిన ధాన్యమంతా ఆ చర్మకారుని కుటుంబానికి కూలిరూపంలో దక్కేది. ప్రతి ఒక్క బండినుండి వారికలా ధాన్యం ముట్టేది. ధాన్యం అంతా పాతర లోపల వేసిన తర్వాత వాడు లోపలకి దిగి అన్నింటికీ గుర్తులు గీసి ఎవరి ధాన్యం ఎంత ఉందనే లెక్కలు అక్కడే రాసేవాడు. వాడు లోపల ఎన్ని మూటలు కట్టగలిగితే అన్ని మూటలు బయటకు తెచ్చుకునేవాడు. అది కూడా వాడికే దక్కేది. ఆ తర్వాత పాతర పూర్తిగా మూసేసేవారు. మళ్ళీ ఎప్పుడు తెరవాలనే దానికి ఊరి ప్రజలంతా ఒక సమయం నిర్ణయించుకునేవారు. అప్పటిదాకా దాన్ని ముట్టుకునేవారు కారు. సాధారణంగా కొత్త ధాన్యాన్ని ఆ ఏడాదే తినే అలవాటు మనవాళ్ళకు లేదు. దాన్ని భద్రపరిచి పాత ధాన్యం మాత్రమే తినేవారు. వరి ధాన్యం భద్రపరచడానికి గడ్డితోనే చాలా లావుపాటి తాళ్ళను అల్లి, అందులో ఆ ధాన్యాన్ని ఒక పెద్ద కుప్పగా తయారుచేసేవారు. దానిపైకి నీరు అస్సలు వెళ్ళేది కాదు, ఆ వరిధాన్యం చాలా సురక్షితంగా ఉండేది.’

‘ఆ విధంగా ప్రతి ఒక్క చేతివృత్తికారుడు తన అవసరాలకు తగ్గట్టుగా ఇల్లు కట్టుకునేవాడు. తన పనులేమిటి, తనకు ఎంత స్థలం కావాలి అనేది తనే నిర్ణయించుకునేవాడు తప్ప ఇంకొకరు వచ్చి డిజైన్ చేసేవారు కాదు. వృత్తిపనివాడు తన ఇంటి ప్లాను వాస్తుశిల్పికి చెబితే, వారు దాని ప్రకారం కట్టేవారు. కానీ ఈ రోజుల్లో ఆ చేతివృత్తులన్నీ  అంతరించిపోయి, మన ఇల్లు ఎలా ఉండాలో మనకు తెలియదు. ఎవడో వచ్చి మీకు ఇలాంటి ఇల్లు కావాలి, ఇలాంటి రంగు కావాలి అని చెబుతుంతే మనం అలాగే చేస్తున్నాం.

‘పూర్వం మానసోల్లాసం అనే గ్రంథంలో ఇండ్లకు వేసే రంగుల గురించి చాలా అందమైన వర్ణన ఉండేది. ఇండ్లకు వేసే సున్నంలో, రంగుల్లో కొన్ని మూలికలు కలిపేవారట. అందువల్ల ఆ రంగులు ఋతువుల్ని బట్టి తమ రంగులు మార్చుకునేవి! ఎండాకాలంలో మన కళ్ళకు ఎలాంటి రంగులు ఎంత మోతాదులో కనిపించాలో, చలికాలంలో ఎలాంటి రంగులుండాలో ఆ రంగులే స్వయంగా మారిపోయేవి. ఎండాకాలంలో మనం ఎక్కువ తెల్లదనాన్నిగానీ, ఎర్రదనాన్ని గానీ చూడలేం కాబట్టి వాతావరణానికి అనుగుణంగా గోడల రంగులు మారిపోయే సాంకేతికత ఉండేది. ప్రతి ఏటా రంగులు మార్చాల్సిన అవసరం లేకుండా ఆ మూలికల వల్ల సంభవించే రసాయన క్రియలు తోడ్పడేవి. కల్యాణ చాళుక్యరాజైన సోమేశ్వరదేవుడు క్రీ.శ. 1025 లో రాసిన ‘మానసోల్లాసం’ పుస్తకంలో ఈ వివరాలన్నీ ఉన్నాయి. ఆ కాలంలో ఇండ్లు ఎలా కట్టేవారు, ఋతువుల ప్రకారం ఇండ్ల రంగులు ఎలా మారేవి, ఏ ఋతువులో ఎలాంటి పరుపులు, దుప్పట్లు వాడాలి అనే విషయాలు అందులో ఉన్నాయి. ఎల్లప్పుడూ ఒకేరకమైన దూది పరుపుల మీద పడుకోకూడదని, వాతావరణాన్ని బట్టి చాపలు, గొంగళ్ళు వాడాలని, సామాన్య ప్రజలు కూడా ఈ నియమాలను పాటించేవారని అందులో ఉంది.’

‘ఇప్పుడు మనం గ్రామాల్లో చూస్తున్న ఇండ్లన్నీ ‘కామ్  చలావ్’ తరహా. వీటిలో అందం లేదు. కానీ పాతకాలపు గ్రామాల శిథిలాలను చూస్తే, నాటి ప్రజల ఊహలు ఎంత అందంగా ఉండేవో అర్థమవుతుంది. వారి ఇండ్ల తలుపులు, గవాక్షాలూ చాలా అద్భుతంగా ఉండేవి. గవాక్షము అంటే ఆవు కంటి ఆకారంలో ఉండే చిన్న చిన్న గుండ్రటి కిటికీలు. అలాగే తలుపులమీద ప్రతి గ్రామానికీ కొన్ని ప్రత్యేక చిహ్నాలుండేవి-కొన్ని ఇండ్ల తలుపులమీద గుర్రం  ఆకారం, మరికొన్నింటిమీద ఏనుగు, నెమలి, లేదా చిలుక ఆకృతులు చెక్కించేవారు. గ్రామాన్ని బట్టి ఆయా చేతివృత్తుల వారి నైపుణ్యం కనిపించేది. ఇప్పుడు కడుతున్న ఇండ్లలో అస్సలు అందం లేదు.’

గురూజీ చెప్తున్న మాటలన్నీ నోరుతెరుచుకుని వింటున్నారంతా! ఎప్పటి కాలం ఇది! ఏ దేశం ఇది! నేను ఎమ్మేదాకా చదువుకున్నాను. కాని ఇటువంటి గ్రామాల గురించి ఒక్క తరగతిగదిలో కూడా, ఒక్క పాఠ్యపుస్తకంలో కూడా ఇంతదాకా చదువుకోలేదు. నాకు తెలిసి, ఒక్క నవల్లోగాని, లేదా ఒక్క కథలోగాని లేదా చివరికి ఒక ఆత్మకథలో కూడా ఇటువంటి విషయాలు చదివిన జ్ఞాపకం లేదు.

గురూజీ ఇంకా చెప్తున్నారు:

‘పూర్వం ఇంటి ప్రధాన ద్వారం తలుపు ఎత్తు అయిదు అడుగుల కంటే ఎక్కువ ఉండేది కాదు. ఆ తలుపు మీద ఖచ్చితంగా గణేష్ విగ్రహం చెక్కేవారు. తలుపు  అంత చిన్నగా ఎందుకుంచేవారంటే- ఒకటి, పైన వినాయకుడు ఉంటాడు కాబట్టి వంగుని లోపలకి వెళ్ళాలి. రెండోది, ఇంటిలోపల పెద్దవారు, ముసలివారు, లేదా ఎవరైనా సాధువులు కూర్చుని ఉంటారు కాబట్టి వారి ముందుకు వెళ్ళేటప్పుడు తల వంచుకుని, వినమ్రతతో వెళ్ళాలనే సంస్కారం కోసం తలుపులను చిన్నవిగా చేసేవారు. పెద్ద పెద్ద తలుపులు ఉంటే మనిషి అహంకారంతో ఎలా పడితే అలా వెళ్తాడు. అలా వెళ్ళకూడదు. లోపల ఉన్న పెద్దల పట్ల గౌరవం ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఈ పద్ధతి పెట్టారు.’

‘మన సంస్కృతిలో ఎవరి ముందు ఎలా నడుచుకోవాలనేదానికి కొన్ని నియమాలున్నాయి. పూర్వం రోజుల్లో ఒక నియమముండేది- ఒక మనిషి కాలినడకన వెళ్తున్నాడు, ఇంకొకడు గుర్రమ్మీద వెళ్తున్నాడు, మరొకడు రథమ్మీద వెళ్తున్నాడనుకోండి. గుర్రం మీదా, రథం మీదా వెళ్ళే వ్యక్తులు కాలినడకన వెళ్ళే సామాన్యుడికి ప్రణామం చేసి మరీ ముందడుగు వేయాలి. అలా నమస్కరించకుండా వారిని దాటి వెళ్ళకూడదు. కాలినడకన వెళ్ళేవాడు ఎవరైనా మహాత్ముడు కావచ్చు లేదా వయసులో పెద్దవాడు కావచ్చు కాబట్టి వాహనాల పైన ఉన్నవారే కింద నడిచి వెళ్తున్నవారికి గౌరవమివ్వాలి. ఇదొక గొప్ప పద్ధతి. అలాగే అరుగులమీద పెద్దలు కూచున్నప్పుడు వారి పక్కనుండి ఎలా వెళ్ళాలనే సంస్కారం ఉండేది. ఎలా పడితే అలా చేతులు ఊపుకుంటూ వెళ్ళకూడదు. ఈ సంస్కారాలన్నీ గోండుగ్రామాల్లో నిన్నమొన్నటివరకూ చాలా ఖచ్చితంగా ఉండేవి. ఇంట్లో ఎవరైనా పెద్దవారు మంచం మీద కూర్చుంటే, వయసులో చిన్నవారైన కుర్రవాళ్ళెవరూ మంచం మీద కూర్చోకూడదు. కిందనే కూర్చోవాలి. పెద్దలకు మాత్రమే ఆ గౌరవం దక్కాలి. ఇవన్నీ నాటి సామాజిక నియమాలు.’

‘గోండుల ఈ సంస్కారం ఎంత పెద్దదంటే- కుమ్రం భీమ్ యుద్ధం జరిగిన సమయంలో, మిలటరీ అంతా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిందని తెలిసినప్పుడు, అప్పటి కలెక్టరు అబ్దుల్ సత్తార్ చర్చలు జరపడానికి వచ్చాడు. ఆ సమయంలో భీమ్, అతని అనుచరులూ కలెక్టరు కూచోడానికి ఒక మంచం పంపించి, దానిమీద పరవడానికి మంచి గొంగళికూడా పంపి, వాళ్ళు తాగడానికి ఒక నీళ్ళ కుండ కూడా పంపించారు. శత్రువని తెలిసినప్పటికీ, వాడు చర్చలకు వచ్చినప్పుడు వాడికి ఇవ్వవలసిన మర్యాదను ఖచ్చితంగా ఇచ్చారు. పొద్దున్న ఏడు గంటలనుంచి రాత్రి పదింటిదాకా చర్చలు జరిగాయి. ఆ తర్వాతే ఫైరింగ్ జరిగింది.’

గురూజీ ఈ మాటలు చెప్పేటప్పటికి నా మనస్సు చాలా భారంగా అయిపోయింది. నేనింక ఏమీ వినలేననిపించింది. నా చేతుల్లో ఉన్న రికార్డరు పాజ్  బటను నొక్కి లేచి నిల్చున్నాను. నేను లేవడం చూసి గురూజీ తన మాటలు ఆపేసారు. తక్కినవాళ్ళంతా నన్నే చూస్తున్నారు. నేనక్కణ్ణుంచి లేచి, రెండు మూడు నిమిషాల పాటు ఆ మందిరంలో నడుస్తూ ఉండిపోయాను. మళ్ళీ వచ్చి కూచుని రికార్డరు ఆన్ చేసాక, గురూజీ మళ్ళా చెప్పడం మొదలుపెట్టారు:

‘ఈ విషయాలన్నీ ఆ కాలంలో బతికి ఉన్న మారూ మాష్టర్, భాధూ మాష్టర్, రాంజీ మాష్టర్ మాకు చెప్పేవారు. వాడు మనల్ని చంపడానికి వచ్చాడని తెలిసినప్పటికీ సంస్కారం ప్రకారం వాడు కూచోడానికి ఆసనంగా మంచం, తాగడానికి నీళ్ళు ఇచ్చి ఆ తర్వాతే మాట్లాడారు. ఇదీ మన భారతదేశపు జీవనవిధానం.

‘కానీ ఈ మధ్యకాలంలో కొందరు సోషియాలజీ లెక్చరర్లు వనసంరక్షణ సమితుల పేరిట గ్రామాల్లోకి వచ్చి- ‘ఎవరికీ మర్యాదలు చేయకండి, కలెక్టరు వచ్చినా కిందే కూచోబెట్టండి, ఫారెస్టు అధికారుల్ని కిందనే కూచోబెట్టి మాట్లాడండి, వారికోసం మంచాలు ఎందుకు వేస్తారు?’ అని ప్రజలకు నూరిపోస్తున్నారు. నేను వారికి పదే పదే చెప్పేవాణ్ణి- ‘చూడండి-మన ప్రజల్ని సంస్కారహీనులుగా మార్చకండి. కొమరం భీమ్ అంతటివాడే తన శత్రువుకి మంచం వేసి మర్యాదనిచ్చాడు. మీరేమో వీరిని సంస్కారహీనులుగా మార్చి వెళ్ళిపోతున్నారు. రేపు వీరు ఎవరికీ మర్యాదనివ్వరు. అసలు మర్యాదనే మర్చిపోతారు’ అని.  ఉద్ధరించడం అంటే సంస్కారాన్ని నాశనం చేయడం కాదుకదా! అది వారి సంప్రదాయం. మీరు వస్తే మీకూ మంచం వేస్తున్నారు. మరి ఇంకొకరొస్తే వారికి వేయకూడదా? ఈ ఆధునిక చదువులు చదువుకున్నవాళ్ళు గ్రామాల్లోకి వచ్చి ప్రజల సంస్కారాన్ని నశింపచేస్తున్నారు. లేకపోతే మన గ్రామాల్లో ఎన్నో అద్భుతమైన పద్ధతులుండేవి.’

‘పూర్వం చర్మకారుడు వీథి గుండా వెళ్తుంటే, అరుగుమీద కూచున్న యాదవులు లేచి నిలబడేవారట, ఎందుకంటే వరస ప్రకారం వాడు వీరికి పెద్దన్న అవుతాడు కాబట్టి! ఈ రకమైన బంధాలు, గౌరవాలు ఉండేవి. ఇండ్ల తలుపులు, కిటికీలు అన్నీ మనిషిలో ఇలాంటి మంచిలక్షణాలు పెంపొందించడానికే నిర్మించబడేవి.’

‘ఎండాకాలంలో పండే పెద్ద జొన్నల పంట చాలా ఎత్తుగా పెరిగేది. దాని కంకి చాలా బలంగా ఉండి కిందకి వంగి ఉండేది. ఆ కంకి ఎంత గట్టిగా ఉండేదంటే, దాంతో ఎవరితలమీదనన్నా కొడితే, ఆ తలపగిలిపోయేదట! కానీ ఆ జొన్నల్తో అన్నం తిన్న ప్రజలు ఎంతో బలిష్ఠులుగా ఉన్నప్పటికీ ఎంతో వినయంగా వంగి బతికేవారు. కానీ ఈ రోజుల్లో వస్తున్న హైబ్రిడ్ జొన్న మొక్క ఎత్తు పెరగదుగానీ, దాని కంకి మాత్రం నిటారుగా చూస్తుంది. దీన్ని తినే ఈ తరం పిల్లల్లో బలం ఉండదు, సత్తువ ఉండదు, కానీ అహంకారం మాత్రం నిటారుగా ఉంటుంది. ఎలా పడితే అలా కాలరేసి తిరుగుతారు. ‘ఎలాంటి అన్నం తింటే మనసు అలాంటిదే అవుతుంది ‘ అనే సామెత ఇందుకే వచ్చింది.’

‘మన ఇండ్ల డిజైనింగులో ఈ విషయాలన్నింటినీ చాలా జాగ్రత్తగా చూసేవారు. మహారాష్ట్ర పరిసరాల్లో ఇప్పటికీ ఎంతో అందమైన ఇండ్లున్నాయి. ఇంటి గడప లేదా తలుపు ఫ్రేము ప్రతి ఒక్క ఇంటికీ ప్రత్యేకమైన డిజైనుతో ఉండేది. ఆ చౌకట్టు డిజైను చేసేటప్పుడు ఊళ్ళోని ముఖ్యులంతా- ఇంటి యజమాని, పురోహితుడు, ఊరి సాలెవాడు, కుమ్మరి, కుంకుమ, గులాల్ తయారు చేసే బుక్కా సమాజమంతా- అక్కడే కూచుని ఆ డిజైను ఖరారు చేసేవారు. ఎందుకలా చేసేవారంటే, ఆ ఇంటి చౌకట్టుమీద ఎలాంటి బోర్డరు డిజైను చెక్కుతారో, ఆ ఇంటిసాలెవాడు అదే డిజైను బోర్డరుతో ఆ ఇంటిమహిళలకు చీరలు నేయాలి! రేపు ఆ ఇంటికి వచ్చే కొత్తకోడలు, పెళ్ళి నిశ్చయమయ్యాక, ఆ గడపమీద ఉన్న డిజైనుతో కూడిన చీర కట్టుకునే ఆ ఇంట్లో అడుగుపెట్టాలి. అలానే పెళ్ళికుండలమీద, పెళ్ళికొడుకు తలకు కట్టే బాసికం మీద కూడా అదే గడప డిజైను చిత్రించేవారు. ఇంటి వస్తువులన్నింటిలోనూ ఆ డిజైను ప్రతిబింబించేది. ఆ వస్తువుల్ని చూసి ‘ఇది ఫలానావారి ఇంటి వస్తువు, ఇది వారి ఇంటి చీర ‘ అని ఊరి జనాలు గుర్తుపట్టేవారు. అంతటి ఆత్మీయమైన డిజైను పద్ధతులుండేవి.’

‘గ్రామాల్లో  ఇండ్లు కట్టేటప్పుడు ప్రజలు తాము సొంతంగా కట్టుకునేవారు కాదు. బేల్దార్లనే ఒక ప్రత్యేక శిల్పిసమాజం ఉండేది. వారే వచ్చి ఇండ్లు నిర్మించేవారు. ఇక్కడ కొత్తూరు అనే గ్రామం ఆ బేల్దార్లదే. పూర్వం ఎవరికైనా  ఇల్లు కావాలంటే, బేల్దార్లు రాకముందే ఇంటికి కావలసిన వెదురు, కట్టెలు, తలుపులు, కిటికీలు, పెంకులు మొత్తం సిద్ధం చేసి పెట్టుకునేవారు. ఈ బేల్దారు సమాజం మహారాష్ట్రనుండి లేదా కరీంనగర్ పరిసరాలనుండి వచ్చేవారు, వారి గ్రూపులో వడ్రంగులనుండి మేస్త్రీల దాకా అందరూ ఉండేవారు. వారు వచ్చి పునాదినుంచి కప్పుదాకా మొత్తం ఇల్లు కట్టి ఇచ్చేవారు. ఇల్లు కట్టుకోవడం కోసం ఎవరూ తమ కూలిపనులు మానుకోవలసి వచ్చేది కాదు. మొత్తమంతా బేల్దార్లే చూసుకునేవారు.’

‘ఇల్లు మొత్తం పూర్తయిన తర్వాత ‘చీకటిదేవర’ అనే ప్రత్యేకమైన పూజ చేసేవారు. ఇల్లు కట్టిన మేస్త్రీలు, కూలీలు ఎవరైతే ఉన్నారో వారిని మొదట గౌరవించడం ఆ పూజ ముఖ్య ఉద్దేశ్యం. ఆ రోజు వారికి కొత్త బట్టలు పెట్టి, చేతికి ఉంగరాలు తొడిగి, వారికి కావలసిన ఆహార సామగ్రినిచ్చేవారు. వారు ఆ కొత్త ఇంట్లోనే వంట చేసుకుని, తిని, ఆ పూజ చేసేవారు. వంట చేసాక మిగిలిన ఆహారపదార్థాలను ఆ ఇంటిలోపల్నే ఒక చోట పాతిపెట్టేవారు. వాటిని బయటకు తీసుకెళ్ళకూడదు, ఇంటి యజమాని వారికివన్నీ ఇచ్చాక, వెనక్కి తిరిగి చూడకుండా అక్కడినుండి వెళ్ళిపోవాలి. దీన్నే ‘చీకటిదేవర’ అంటారు- అంటే ఆ దేవతలు, అనగా ఆ కూలీలు మాయమైపోతారు, మళ్ళీ ఆ ఇంట్లో ఎప్పటికీ కనిపించరు. ఆ ఇల్లు కట్టడానికి వారి రక్తం, చెమట అన్నీ ధారపోసినప్పటికీ ఇల్లు పూర్తయ్యాక వారు ఆ ఇంటిమీద ఎలాంటి హక్కులూ కోరరు. అందుకే వారికి అంతటి దైవసమానమైన గౌరవాన్ని ఇచ్చి చీకటిదేవర పూజ చేసేవారు. ఆ తర్వాతే ఇంటి వాస్తుశాంతి జరిగేది.’

‘ఈ బేల్దారు మేస్త్రీలు ఇల్లు కట్టేటప్పుడు దానికి కావలసిన మట్టి కూడా స్వయంగా తయారుచేసుకునేవారు. మన అదిలాబాదు ప్రాంతంలో ఎక్కువగా పాండ్రీమట్టి అంటే తెల్లమట్టితో కచ్చాగోడల ఇండ్లు కట్టేవారు. ఆ మట్టిని, ఆ సున్నాన్ని బేల్దార్లే సిద్ధం చేసేవారు. ఇక్కడి పెద్ద పెద్ద కోటలు కూడా ఆ మట్టితోనే కట్టారు. ఆ మట్టినెలా తయారుచేసేవారంటే- వారి దగ్గర చాలా పశువులుండేవి. ఊళ్ళో ఒక పెద్ద గొయ్యి తవ్వి, అందులో పిడకలు నింపి, దానిమీద మట్టి వేసి, మళ్ళీ పిడకలు, మళ్ళీ మట్టి వేసి దానికి నిప్పుపెట్టేవారు. ఆ మట్టిని పూర్తిగా కాల్చేవారు. ఆ తర్వాత ఆ కాల్చిన మట్టిని తీసుకెళ్ళి ఊరిబయట ప్రజలు నడిచే దారుల్లో పోసేవారు. ఆ దారమ్మట నిరంతరం ఎడ్లబండ్లు, పశువులు నడవడం వల్ల ఆ మట్టి బాగా నలిగిపోయేది. ఆ మట్టిలో వారు బంక, చింతగింజల పొడి లేదా మారేడుకాయల గుజ్జు కలిపేవారు. ఆ దారిలో పశువులు, బండ్లు ఏడాది పొడుగునా తిరగడం వల్ల ఆ మట్టి ఎంతో బలంగా తయారయ్యేది. ఎవరికైనా ఇల్లు కావాలన్నప్పుడు వారు ఆ మట్టి తెచ్చి ఇంట్లో పెట్టుకునేవారు. బేల్దార్లు వచ్చాక ఆ మట్టిలో జొన్నపొట్టు కలిపి పశువుల చేత బాగా తొక్కించేవారు. ఆ తర్వాతే దాంతో గోడలు కట్టేవారు.’

‘ఆ గోడల ప్రత్యేకత ఏమిటంటే, మట్టిగోడల మీద గుర్తులు కనిపిస్తాయి కదా, ఆ ఇండ్ల గోడల గీతలు కనుక కరిగిపోతే, ఆ ఇల్లు కూలిపోతుందని అర్థం. అందుకే వారు మొదటి వర్షం పడేవరకు ఆ గోడల్ని గమనించేవారు. ఆ మట్టి వర్షపునీటిని లోపలకి లాక్కుంటుందా లేదా అనేది చూసేవారు. ఒకవేళ నీటిని లాక్కుంటే ఆ గీతలు కనబడవు. ఆ ఇల్లు కూలిపోతుంది. కాని వారి సాంకేతికత వల్ల నీరు గోడమీంచి కిందకి జారిపోయేదే తప్ప లోపలకి ఇంకేది కాదు. అందువల్ల వర్షం ఎంత పడ్డా ఆ మట్టిగోడలు అస్సలు కూలేవి కావు. ఆ మట్టిని అంత గట్టిగా దంచి తయారు చేసేవారు. అందుకే ఆ ఇండ్లు ఏడెనిమిది తరాల దాకా, వందల ఏళ్ళు అలానే స్థిరంగా నిలబడేవి.’

‘ఇండ్లు కట్టేటప్పుడు మన దేశంలో ఒక నియమం ఉండేది-ఊళ్ళో ఏ ఇల్లు కూడా స్థానిక దేవాలయ శిఖరం కంటే ఎత్తుగా ఉండకూడదు. అలా కడితే అది వాస్తుకు విరుద్ధం. ఊరి మధ్యలో ఉండే దేవాలయం చాలా ఎత్తుగా ఉండేది. ఆ దేవాలయం నీడ ఊల్లో  ఏ ఇంటిమీదా పడకూడనే నియమం ఉండేది. అందుకే దేవాలయం చుట్టూ చాలా పెద్ద మైదానం వదిలేసేవారు. అక్కడ యజ్ఞాలూ, మేళాలు జరిగేవి. దేవాలయ శిఖరం నుండి కిందకి ఒక ఊహాజనిత రేఖను లెక్కించేవారు. ఊళ్ళోని ఇండ్ల ఎంత్తు అంతా ఆ రేఖ లోపలనే ఉండాలి తప్ప దాన్ని దాటకూడదు. కొన్ని గ్రామాల్లో తాటిచెట్టును ప్రమాణంగా తీసుకుంటే మరికొన్ని చోట్ల దేవాలయ గోపురాన్ని ప్రమాణంగా తీసుకునేవారు. అందుకే దక్షిణభారతదేశంలో దేవాలయ గోపురాలు అంత ఎత్తుగా కట్టేవారు. బహుశా ఇస్లాంలో కూడా అందుకే మీనార్లను చాలా ఎత్తుగా కడతారేమో. ఆ మినార్ కంటే ఎత్తుగా ఏ ఇల్లూ ఉండకూడదనే నియమం ఉండి ఉండవచ్చు. కానీ ఈ రోజుల్లో ఆ పద్ధతులన్నీ పోయాయి. దేవాలయాలు చిన్నవైపోయాయి. ఇండ్లు ఎత్తుగా ఎదుగుతున్నాయి.’

‘ఇల్లు కట్టేటప్పుడు పక్క ఇంటి కొలతనుబట్టి కట్టేవారు. అందులో ఉన్న భావన ఏమిటంటే-‘నేను నా సొంతంగా కొత్త ఇల్లు కట్టడం లేదు, ఊళ్ళో ఉన్న ఇంటినే నేను కాస్తముందుకు విస్తరిస్తున్నాను’ అని. అదొక ఉమ్మడిభావన. ఎవరూ వ్యక్తిగతస్వార్థంతో ఇండ్లు కట్టేవారు కారు. పక్క ఇల్లు ఒక అంతస్తు ఉంటే, వాడు తన ఇల్లు కూడా అంతే ఎత్తులో కట్టాలి తప్ప ఒక అంతస్తు ఉండే ఇంటి పక్కన పది అంతస్తుల బిల్డింగు కట్టే పద్ధతి ఉండేది కాదు. ఒక ఇంటివల్ల ఇంకో ఇంటి అందం పాడవకూడదనే నియమం పాటించేవారు.’

‘మరో విశేషం- ఒక ఇంటిమూల ఇంకొక ఇంటిమూలతో నేరుగా కలవకూడదు. ఇండ్లు కొద్దిగా ముందుకో, వెనక్కో జరిగి ఉండాలి తప్ప కోణాలు ఎదురెదురు కలవకూడదు. ఒకవేళ కోణాలు కలిస్తే, ఆ ఇండ్లలో ఉండేవారి మధ్య పోటీ తత్త్వం పెరుగుతుందని నమ్మేవారు. ఊళ్ళు కలిసి బతికేటప్పుడు ఒకరితో ఒకరికి పోటీ ఎందుకుండాలి? ఆ భావన రాకూడదనే ఇండ్లను కొద్దిగా మార్చి కట్టేవారు. ఈ విషయంలో చాలా ఖచ్చితంగా ఉండేవారు.’

‘అలాగే వీథులు కట్టేటప్పుడు- తూర్పున ఉన్న ఇల్లు రెండు అడుగులు ముందుకు ఉంటే, పడమర ఇల్లు రెండు అడుగులు వెనక్కి ఉండేది. వీథులన్నీ ఒక క్రమబద్ధమైన వంపు, గోళాకృతికి తగ్గట్టుగా, కలిగి ఉండేవి. ఆ వంపు వల్ల ఇక ఇంటి అరుగుమీద కూచున్న వ్యక్తి వీథిలో ఉన్న మిగతా పది యిండ్ల వారితోనూ సులభంగా మాట్లాడగలిగేవాడు. ఆ నిర్మాణ శైలి మనుషుల్ని సామాజికంగా కలిసి బతికేలా చేసేది.’

‘దూరం నుంచి చూస్తే ఆ వీథులు ఆవులమంద ఒకదాని వెనక ఒకటి వెళ్తున్నట్టుగా గోముఖాకృతిలో కనిపించేవి. అందుకే కిటికీలకి గవాక్షాలు అని పేరుపెట్టారు. ఆ దారమ్మట వెళ్ళే బాటసారులు ఆ ఇంటి అరుగులమీద కాసేపు కూచుని విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా పందిళ్ళు వేసేవారు.  ప్రతి పాత ఇంట్లోనూ ఈ సదుపాయం ఉండేది. యాత్రీకులకీ, అతిథులకీ ఇబ్బంది కలగకూడదనే అరుగులమీద అలాంటి ఏర్పాట్లు చేసేవారు.’

‘గ్రామాల్లో ప్రతి సమాజమూ తన ఇండ్లు ఇలానే నిర్మించుకునేది. కాని లోపలి డిజైను మాత్రం వారి వృత్తుల్ని బట్టి మారేది. నిర్మల్ ప్రాంతంలో ‘ఖసార్ ‘ అనే ఒక రకమైన వృత్తిపనివారుండేవారు. అక్కడ దాదాపు వంద ఇండ్ల దాకా వారివే ఉండేవి. అక్కడ రోజుకి ఇరవైనాలుగ్గంటలూ ఇత్తడిపాత్రల పని జరుగుతూనే ఉండేది. అంత పెద్ద ఎత్తున శబ్దాలు వస్తున్నప్పటికీ పక్క ఇండ్ల వాళ్ళకి ఎలాంటి ఇబ్బందీ కలిగేది కాదు!  నేను నిర్మల్ వెళ్ళినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. మనం వీథిలో నిలబడ్డా కూడా లోపల అంత పెద్ద ఎత్తున ఇత్తడి పాత్రలు కొడుతున్న శబ్దం బయటకు వినిపించేది కాదు. ఎందుకంటే వారి ఇండ్ల గోడల నిర్మాణం ఆ శబ్దాన్ని నేరుగా పైకి ఆకాశంలోకే పంపించేలా ఆ డిజైన్ చేసి ఊండేది తప్ప, ఆ చప్పుడు పక్క ఇండ్ల వైపు వెళ్ళేది కాదు. ఈ రకమైన పర్యావరణ స్పృహ అప్పటి ఇండ్లల్లో  ఉండేది. ఇలాంటి ఎన్నో అద్భుతమైన పద్ధతులు మన బ్రాహ్మణవాడి, జింగర్ల మొహల్లాలు, లేదా కోలీల మొహల్లాల్లో మొన్నటివరకూ కనిపించేవి. కానీ ఇప్పుడు పాత ఇండ్లన్నీ కూల్చేసి కొత్త సిమెంటు బిల్డింగులు కట్టడం వల్ల ఈ వ్యవస్థ అంతా గందరగోళంగా మారిపోయింది.’

‘గ్రామాలతో పాటు ప్రతి పాత ఊరికీ ఒక గడీ ఖచ్చితంగా ఉండేది. ఊరు మొత్తం ఆ గడీలోపలనే ఉండేది. లేదా ఊరి పక్కనే గడీ నిర్మించేవారు. ఊరిమీద ఎప్పుడైనా శత్రువుల దాడులు జరిగినప్పుడు ప్రజలంతా ఆ గడీ లోపలకి వెళ్ళి తలదాచుకునేవారు. తమను తాము రక్షించుకునేవారు. ఈ ప్రాంతంలోని గడీలన్నీ చాలావరకూ మట్టితోనే కట్టారు. వాటికి పెద్ద పెద్ద బురుజులుండేవి. మన అదిలాబాద్ లో ప్రతి పాత ఊరికీ ఒక గడీ ఉండేది. ఇక్కడ బేలా గ్రామంలో ఉన్న గడీ చాలా ప్రసిద్ధమైంది. ఆ గడి ప్రత్యేకత ఏమిటంటే- వర్షాకాలంలో ఆ గడీ పరిసరాలనుండి కస్తూరి సువాసన వచ్చేదట!’

‘దానికి కారణం ఒక కథ చెప్తారు- పూర్వం ఆ ఊరి పటేల్ పొద్దున్నే చెంబు పట్టుకుని ఊరి బయటకు వెళ్తుంటే, అక్కడ వేరే ప్రాంతాలనుండి వచ్చిన వ్యాపారుల ఎడ్లబండ్ల సమూహం ఆగి ఉంది. పటేల్ వారిని ‘బండ్లలో ఏం తీసుకెళ్తున్నారు?’ అనడిగితే, వారు నిర్లక్ష్యంగా ‘ఇది మీలాంటి వారికి అర్థం కాదు, ఇందులో కస్తూరి ఉంది’ అని అన్నారట. ఆ మాట పటేల్ కి పట్టుదలగా అనిపించి ‘మాకు కొనడం చేతకాదా?’ అని బళ్ళల్లో  ఉన్న కస్తూరి మొత్తం తనే కొనేసి, అప్పుడు ఆ ఊళ్ళో గడీ కడుతుంటే, ఆ గడీ మట్టిలో ఆ కస్తూరి మొత్తం కలిపేయమన్నాడు! ఆ కస్తూరితో తడిసిన మట్టితోనే ఆ గడీకోటలు కట్టారు. అందుకే వర్షం పడగానే ఆ గోడలనుండి కస్తూరి సువాసన వచ్చేదట. ఇలా ప్రతి గడీ వెనక ఎన్నో కథలున్నాయి.’

‘అదిలాబాదులో కూడా ఒకప్పుడు ఒక కోట ఉండేది. ఇక్కడినుండి నాలుగుకిలోమీటర్ల దూరంలో ఉన్న చాందా అనేది క్రీ.శ.4-5 శతాబ్దాల్లో చాలా పెద్దనగరంగా ఉండేది. అది నాశనమయ్యాక, తిరుపత్ రాయ్ అనే రాజు ఇక్కడికి వచ్చి, ఇల్లు కట్టుకుని, ఊరిని స్థాపించాడు. మొదట వాడు ఇల్లు కట్టి, చెరువును తవ్వించి, ఈ ఊరికి తిరుపల్లె అని పేరుపెట్టాడు. అదే కాలక్రమేణా అదిలాబాద్ గా మారింది. ఆ చెరువు తవ్వించేటప్పుడు నీరు పడకపోతే, తన కోడలైన నాగమ్మను బలిచ్చాడట. ఆమె గుడి ఇప్పటికీ ఆ చెరువు పక్కనే ఉంది. ఊళ్ళో ఎవరి పెళ్ళయినా మొదట ఆ నాగమ్మ గుడికి వెళ్ళి మొక్కుకునే ఆచారం మా చిన్నతనం వరకు ఉండేది. ఇప్పుడు జనాలు మర్చిపోయారు. ఆ తిరుపల్లె కాలక్రమేణా ఎడ్లబండ్ల సంతవల్ల ఎడ్లపురంగా మారి, ఆ తర్వాత ఎడ్లాబాద్ అయ్యింది. చాలామంది దీన్ని ఆదిల్ షాతో ముడిపెడతారుగాని అది నిజం కాదు. ఇది చాలా ప్రాచీనమైన ఊరు. ఇక్కడ అన్నింటికంటే పాత ఊరు తాంసీ, ఆ తర్వాత బేలా, ఆ తర్వాతే అదిలాబాద్ ఏర్పడింది. బేలా గ్రామం పాడుపడిన తర్వాతే వ్యాపారులంతా అదిలాబాద్ కు వలస వచ్చారు.’

‘పూర్వపు రోజుల్లో ఇక్కడొక పద్ధతి  ఉండేది. ప్రతి పదిపన్నెండు గ్రామాలకి కలిపి ఒకే ఒక పెద్ద దేవాలయం ఉండేది. అక్కడ పెద్ద ఎత్తున జాతరలు, మేళాలు జరిగేవి. ప్రతి చిన్న ఊరిలోనూ ఒక చిన్న గుడి ఉన్నప్పటికీ, జాతరలు మాత్రం ఆ పెద్ద దేవాలయం ఉన్నచోటనే జరిగేవి. చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా అక్కడికే వచ్చేవారు.’

‘గ్రామాన్ని స్థాపించేటప్పుడు గ్రామదేవత ప్రతిష్ఠ చాలా ముఖ్యమైనది. ఊరి ప్రజలంతా కలిసి ఆ గ్రామదేవతను పూజించేవారు. ఊళ్ళో ఏ సామాజిక వర్గం వారైనా సరే ఆ గ్రామదేవతను ఖచ్చితంగా నమ్మాల్సిందే. గ్రామదేవతతో పాటు ప్రతి ఒక్క కులానికి ఒక కులదేవత, ప్రతి ఒక్క మనిషికీ ఒక ఇష్టదేవత ఉండేవారు. ఇష్టదేవత వ్యక్తిగతమైనది. కులదేవత ఆ వంశానికి సంబంధించింది. కానీ కులదేవత గుడిని ఊరి మధ్యలో కట్టే పద్ధతి లేదు. ఎందుకంటే ఊరి మొత్తానికి కలిపి ఒకే ప్రధాన దేవాలయం ఉండేది. వైష్ణవులు ఎక్కువగా ఉంటే, హయగ్రీవుడు, జనార్దనుడు లేదా నరసింహస్వామి ఆలయాన్ని కడితే, అదంతా విష్ణుదేవాలయ శిఖరం అయ్యేది. అలాగే శైవులు ఉంటే, వీరభద్రుడు, భృంగి, నంది విగ్రహాలున్నప్పటికీ ఆలయం మాత్రం శివాలయంగానే ఉండేది తప్ప కులదేవతల పేరిట విడివిడిగా కట్టేవారు కాదు. సమస్త సమాజానికీ ఆ ప్రధాన దేవాలయమే కేంద్రంగా ఉండేది. కానీ గ్రామదేవత మాత్రం ఊరి సరిహద్దులో ఉండి ఊరిని రక్షించేది.’

‘పూర్వం గ్రామాల్లో ఒక ఆచారం ఉండేది-ప్రతి ఏటా వృత్తిపనివారంతా కలిసి ఒక పెద్ద ఊరేగింపు తీసేవారు. ప్రతి ఒక్కరూ తమ ఎడ్లబండిమీద తమ వృత్తికి సంబంధించిన చిన్న కార్ఖానా ఏర్పాటు చేసుకునేవారు-కంసాలి తన కొలిమి, సాలె తన మగ్గం, కుమ్మరి తన కుండలు, వెదురుపనివారు తమ వస్తువులు అన్నీ ఆ బండ్లమీదనే ఉంచి ఊరంతా తిరిగేవారు. ఆ బండ్లమీదనే వారి వారి వస్తువులకు ఫినిషింగ్ పూర్తయ్యేది. ఆ ఊరేగింపు అంతా తిరిగి ఊరి మధ్యలో ఉన్న గ్రామదేవత దగ్గరకు వచ్చేది. అక్కడకు వచ్చాక ప్రతి ఒక్క వృత్తిపనివాడూ తను చేసిన ఎంతో అందమైన వస్తువును ఆ అమ్మవారికి అలంకరింపచేసేవాడు. సాలె చీరని కడితే, కంసాలి ముక్కుపుడక పెట్టేవాడు. గొర్రెలకాపరి మంచి గొంగళి కప్పేవాడు. అలా అందరి వస్తువులతో అలంకరించబడిన ఆ రూపమే ‘గ్రామదేవత!’-అంటే ఆ గ్రామమే ఒక దేవత, ఆ సమస్త వృత్తుల కలయికనే దైవత్వం అనే భావన ఆనాటి ప్రజల్లో ఉండేది. గ్రామం ఒక శరీరం అయితే, గ్రామదేవత ఆ ఊరి ఆత్మ.’

‘అందుకే ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా- పురుళ్ళు, పెళ్ళి- ప్రజలు మేళతాళాలతో ఆ గ్రామదేవత దగ్గరికి వెళ్ళి పూజచేసి వచ్చేవారు. దాని అర్థం ఏమిటంటే ‘మేము ఈ కార్యక్రమం చేసుకోడానికి గ్రామం పర్మిషన్ తీసుకున్నాం’ అని. గ్రామదేవతకు మొక్కితే ఊరి మొత్తానికి మొక్కినట్లే అనే భావన ఉండేది. ఆ పూజ చూసి ఊరిజనం కూడా ‘ఫలానావారి ఇంట్లో శుభకార్యం జరుగుతోంది ‘ అని తెలుసుకునేవారు.’

‘మన భారతదేశపు పాత గ్రామాలన్నీ ఇంతటి స్వయం సమృద్ధితో, ఒకరికొకరు తోడ్పడుతూ బతికేలా నిర్మించినవి. నాటి సమాజం డబ్బు చుట్టూ కాకుండా, మానవ సంబంధాలు, సంస్కారంచుట్టూ తిరిగేది. ఈ విషయాలన్నింటినీ మనం గుర్తుంచుకుని మన మూలాల్ని కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.’

అని గురూజీ తన ప్రసంగం ఆపారు. నేను అంతకుముందు ఇలాంటి చిత్రణ కొంతదాకా వేయిపడగలు నవల్లో చూసాను. కానీ గురూజీ వివరిస్తున్న సమాజం  వేయిపడగలు కాదు, వేయి గొడుగులు అనిపించింది.


Feature image photography by Sardar Harpal Singh, Adilabad

17-6-2026

6 Replies to “జీవనశిల్పి-15”

  1. ఇల్లు, వృత్తి, సంస్కారం, ప్రకృతి, సమాజం అన్నీ ఒకటిగా మిళితమైన జీవన విధానాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు సార్. చదువుతుంటే ఆశ్చర్యం, ఆనందం, కొంత వేదన కూడా కలిగాయి.

  2. “గురూజీ చెప్తున్న మాటలన్నీ నోరుతెరుచుకుని వింటున్నారంతా!”
    మేము కూడా సర్!
    క్రీ.శ. 1025లో రచించబడిన *మానసోల్లాసం*లో ఋతువులను బట్టి ఇంటి రంగులు మారే సాంకేతికత, వాతావరణానికి అనుగుణంగా పరుపులు, దుప్పట్లు, జీవనశైలి గురించిన వివరాలు చాలా ఆశ్చర్యం కలిగించాయి.
    నేటి Smart Technology ని గుర్తు చేసే ఈ ఆలోచనలు మన పూర్వీకుల వద్ద కూడా వున్నాయి అనిపిస్తుంది. ప్రకృతిని గమనించి, దానికి అనుగుణంగా జీవన విధానాలను రూపొందించుకున్న తీరు నిజంగా అద్భుతం.
    అలాగే అదిలాబాద్ formation, గ్రామ నిర్మాణం, వివిధ వృత్తుల వారు తమ అవసరాలకు అనుగుణంగా ఇండ్లను నిర్మించుకున్న విధానం, గ్రామదేవత గురించి చదవడం ఎంతో interesting గా వుంది.
    “మన భారతదేశపు పాత గ్రామాలన్నీ ఇంతటి స్వయం సమృద్ధితో, ఒకరికొకరు తోడ్పడుతూ బతికేలా నిర్మించినవి.”
    మన పూర్వీకులు అనుసరించిన పద్ధతులు ఒక జ్ఞాపకంగా మాత్రమే కాకుండా, అందులోని విలువలను, technologyని అర్థం చేసుకుని, సాధ్యమైన చోట ఈ పద్ధతులను నేటి పరిస్థితులకు అనుగుణంగా revive చేస్తే ఇంకా ఎంతో beneficial గా వుంటుందేమో.
    Another informative and interesting conversation, Sir!

    1. అవును ఇవి గతించిపోయిన విలువలు కావు. ఆధునిక జీవితంలో కూడా, ఆధునిక సందర్భంలో కూడా ఈ విలువల్ని కనుగొనగలిగితే చాలా ప్రభావశీలంగా ఉంటుంది.

  3. “పాతకాలపు గ్రామాల శిథిలాలను చూస్తే, నాటి ప్రజల ఊహలు ఎంత అందంగా ఉండేవో అర్థమవుతుంది. వారి ఇండ్ల తలుపులు, గవాక్షాలూ చాలా అద్భుతంగా ఉండేవి. గవాక్షము అంటే ఆవు కంటి ఆకారంలో ఉండే చిన్న చిన్న గుండ్రటి కిటికీలు. అలాగే తలుపులమీద ప్రతి గ్రామానికీ కొన్ని ప్రత్యేక చిహ్నాలుండేవి-కొన్ని ఇండ్ల తలుపులమీద గుర్రం ఆకారం, మరికొన్నింటిమీద ఏనుగు, నెమలి, లేదా చిలుక ఆకృతులు చెక్కించేవారు. గ్రామాన్ని బట్టి ఆయా చేతివృత్తుల వారి నైపుణ్యం కనిపించేది. ఇప్పుడు కడుతున్న ఇండ్లలో అస్సలు అందం లేదు.”

    మొదటిసారి కల్యాణ చాళుక్యరాజైన సోమేశ్వరదేవుడు క్రీ.శ. 1025 లో రాసిన ‘మానసోల్లాసం’ పుస్తకం గురించి వింటున్నాను. అలాగే బేల్దార్లనే ఒక ప్రత్యేక శిల్పిసమాజం గురించి వివరించిన విషయాలు – అక్కడ అప్పుడు గురూజీ చెప్తున్న ఆ మాటలన్నీ నోరు తెరుచుకుని వింటున్నారంతా అన్నారు మీరు భద్రుడు గారు. నేను కూడా ఈ సంభాషణలు చదువుతుంటే అలాగే నోరు తెరుచుకుని ఆశ్చర్యపోతూ మీలాగే “ఎప్పటి కాలం ఇది! ఏ దేశం ఇది! నేను కూడా చాలానే చదువుకున్నాను. కాని ఇటువంటి గ్రామాల గురించి ఒక్క తరగతిగదిలో కూడా, ఒక్క పాఠ్యపుస్తకంలో కూడా ఇంతదాకా చదువుకోలేదు. నాకు తెలిసి, ఒక్క నవల్లోగాని, లేదా ఒక్క కథలోగాని లేదా చివరికి ఒక ఆత్మకథలో కూడా ఇటువంటి విషయాలు చదివిన జ్ఞాపకం లేదు.” అనుకుని సిగ్గు పడడం తప్ప ఏ చెయ్యగలను అనిపించింది.

    ​”గ్రామం ఒక శరీరం అయితే, గ్రామదేవత ఆ ఊరి ఆత్మ.” అని చెప్పడానికి గురూజీ గ్రామంలో
    వృత్తి పనివారంతా కలిసి బండ్ల మీద ఊరేగింపుగా వెళ్లి, తాము చేసిన అత్యంత అందమైన వస్తువులతో (సాలె చీర, కంసాలి ముక్కుపుడక, కాపరి గొంగళి) సరిహద్దుల్లోని అమ్మవారిని అలంకరించడం. ఆ సమస్త వృత్తుల కలయికే, ఆ సమష్టి రూపమే ‘గ్రామదేవత!’ అని నిర్వచించడం నిజంగా అద్భుతం అనిపించింది.

    మీరు చివర్లో ఇలాంటి చిత్రణ కొంతదాకా వేయిపడగలు నవల్లో చూసానన్నారు. కరెక్టే విశ్వనాథ సత్యనారాయణ గారు ‘వేయిపడగలు’ లో సాంప్రదాయ వ్యవస్థల క్షీణతను చూపిస్తే, గురూజీ రవీంద్ర శర్మ గారు ఈ సంభాషణల ద్వారా వివరిస్తున్న ఆ ప్రాచీన గ్రామీణ వ్యవస్థ సమస్త వృత్తులనూ, మానవ సంబంధాలనూ సమానంగా రక్షించే ‘వేయి గొడుగుల’ సురక్షిత నీడలా అనిపిస్తోంది.

    అపురూపమైన, మరెక్కడా ఏ రూపంలోనూ లభ్యం కాని గురూజీ తాత్విక సంభాషణలను, మన మూలాల వైభవాన్ని మీ జీవనశిల్పి బ్లాగు పోస్టుల ద్వారా మాకందిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు భద్రుడు గారు.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading