
త్రిపురనేని గోపీచంద్ (1910-1962) 116 వ జయంతి సందర్భంగా మొన్న ఎనిమిదో తేదీనాడు లామకాన్ లో సాయిచంద్ గారూ, బి.నరసింగరావుగారూ ఒక సభ ఏర్పాటు చేసారు. ఆ సందర్భంగా గోపీచంద్ గురించి తలుచుకోడానికీ, ఆయన పుస్తకాల గురించి కొత్త ఆలోచనలు పంచుకోడానికీ ఆలోచనాపరులైన కొందరు రచయితల్ని ఆహ్వానించేరు. నన్ను కూడా రమ్మని సాయిచంద్ గారు అడిగితే వెళ్ళాను. కానీ ఆ సభను నిర్వహించే బాధ్యత నాకు అప్పగించారు.
ఇది నేను ఊహించని గౌరవం. నేను ఇంటర్మీడియేటు చదువుకుంటున్న రోజుల్లో, నాగార్జున సాగర్ వెళ్ళడానికి గుంటూరు బస్టాండులో బస్సుకోసంచూస్తున్నాను. బహుశా 1979 లో. అక్కడ ఆ బస్ స్టాండులో (అవును బస్ స్టాండ్ లోనే!) ఒక స్టాల్లో ‘అసమర్థుని జీవయాత్ర’ (1947) కనిపిస్తే కొనుక్కున్నాను. సాగర్ వెళ్ళే లోపు ఆ పుస్తకమూ, దానికి ఆర్.ఎస్.సుదర్శనం గారు రాసిన ముందుమాటా చదివేసాను.
తన కాలపు రష్యా గురించి చెప్తూ అన్నా అఖ్మతోవా చెప్పిన మాట నేను పదే పదే ఉదహరిస్తుంటాను. ఆమె అన్నది కదా, రష్యాకి సంబంధించినంతవరకూ,20 వ శతాబ్దం 1914 లో మొదలయ్యిందని. ఆ మాట నా గురించి కూడా చెప్పుకోగలను. నా జీవితంలో 20 వ శతాబ్దం ఆ రోజు గుంటూరు బస్ స్టాండులో ‘అసమర్థుని జీవయాత్ర ‘ రూపంలో ప్రవేశించింది. అప్పటిదాకా శరత్ బాబునీ, బాపిరాజూ, విశ్వనాథా వంటివారినే చదువుతూ వస్తున్న నాకు, మొదటిసారిగా, ఆధునిక మానవుడి అవస్థ పరిచయమైంది. అప్పటికి మహాప్రస్థానం చదవకపోలేదు, కాని ఆ భావావేశమూ, భాషాగాంభీర్యమూ నేను ఆధునికత అనే సుడిగుండంలో పూర్తిగా మునిగిపోకుండా అడ్డుపడ్డాయి. ఆ మరుసటి ఏడాదే నాకు బైరాగి కవిత్వం దొరికింది. ఇక ఆ తర్వాత నేను వెనక్కి తిరిగి చూడలేదు.
అటువంటి ఒక రచయిత గురించిన తలపోతల సమావేశాన్ని నన్ను నిర్వహించమనడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. కొన్నేళ్ళ కిందట, శివరాజు సుబ్బలక్ష్మిగారు బుచ్చిబాబుగారి చిత్రలేఖనాల పుస్తకం తీసుకొస్తూ దాన్ని ఆవిష్కరించమని అడగడం లాంటిదే ఇది కూడా. ఒక మనిషి జీవితంలో పురస్కారాలంటే ఇవే.
సాధారణంగా జరిగే సాహిత్యసభల్లాగా కాకుండా ఆ సమావేశం ఆద్యంతం ఎంతో ఆహ్లాదకరంగా, ఉత్సాహవంతంగా, స్ఫూర్తిశీలకంగా నడిచిందంటే అందుకు కారణం గోపీచంద్ జీవితకాలపు సత్యాన్వేషణనే కారణం. ఆ సత్యాన్వేషణను ఏ అజెండాకీ కుదించకుండా అంతే నిజాయితీగా పునఃస్మరించుకోవాలన్న సంకల్పశుద్ధి కారణం. అందుకు సాయిచంద్, నరసింగ రావుగారల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
సమావేశం మొదలైన కొంతసేపటికే లామకాన్ మేడ మీద హాలు నిండిపోయింది. ఇంకా ఇంకా కుర్చీలు తెచ్చి వేస్తూనే ఉన్నారు. అయినా ఇంకా బయట సాహిత్యాభిమానులు పోగవుతూనే వున్నారు. వచ్చినవాళ్ళల్లో కూడా ముందు అనుకున్నవాళ్ళే కాక, మరికొంతమందికూడా గోపీ చంద్ గురించి తాము కూడా తమ భావాలు పంచుకోడానికి ముందుకొచ్చారు. గోపీచంద్ గారిని దగ్గరగా చూసి, ఆయన్ని వ్యక్తిగతంగా బాగా తెలిసి ఉన్న నగ్నమునిగారు, అక్కినేని కుటుంబరావుగారూ, వి. రాజారామ్మోహనరావు గార్లతో పాటు, ఆయన తత్త్వశాస్త్ర రచనల వల్ల స్ఫూర్తి పొందిన బి.ఎస్.రాములుగారూ, ఆడెపు లక్ష్మీపతిగారూ, అంబటి సురేంద్రరాజుగారూ, తల్లావఝ్ఝుల శివాజీగారూ, గోపీచంద్ రచనల్లో తమ అంతరంగాన్ని వెతుక్కున్న రమణజీవిగారూ, కాసుల ప్రతాప్ రెడ్డిగారూ, పులికొండ సుబ్బాచారిగారూ, పున్నా కృష్ణమూర్తిగారూ మాట్లాడుతుంటే ఒక మామూలు సాహిత్యాసభాలాగా కాక, ఒక సింపోజియం నడుస్తున్నట్టుగా అనిపించింది.
తనకి చిన్నప్పుడు ఇటువంటి పుస్తకాలు చదువుకొమ్మని ఎవరూ చెప్పలేదనీ, అందుకని ఇప్పుడు తాను చదువుకున్న పాఠశాలలో తానే ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసానని గంగారెడ్డి గారు చెప్పినప్పుడు కరతాళ ధ్వనులు మోగాయి. ఇక ఓల్గా గారు గోపీచంద్ నవల గురించీ, ఆ నవలల్లో స్త్రీపాత్రల గురించీ చెప్తూ, త్వరలోనే గోపీచంద్ సాహిత్యం పైన తానొక పుస్తకం తీసుకొస్తామని చెప్పడం మరో విశేషం.
అందరూ మాట్లాడిన తరువాత నేను కూడా ఒక విషయం చెప్పాను. అదేమంటే, ఈ మధ్య అనిల్ బత్తుల తాను సెకండ్ హాండ్ పుస్తకాల షాపుల్లో కొన్న తెలుగు పుస్తకాల కవర్ పేజీల ఫొటోలు పంపిస్తూ వాటిల్లో ఏవైనా చదవాలనుకుంటే చెప్పమన్నాడు. ఆ లిస్టు చూస్తే విశ్వనాథ సత్యనారాయణవి రెండు నవలలు కనబడ్డాయి. వాటిలో ‘గంగూలీ ప్రేమకథ’ గురించి ఎప్పుడో కవితాప్రసాద్ చెప్పినట్టు గుర్తు. నేనా నవల చదవలేదు. అందుకని ఆ పుస్తకం కావాలని చెప్తే అనిల్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ పుస్తకం తెరిచి చూద్దును కదా దాన్ని విశ్వనాథ గోపీచంద్ కి అంకితమిచ్చినట్టు ఉంది.
ఆక్కడ- ‘అంకితం, కీ.శే. త్రిపురనేని గోపీచంద్ కు, అతని అకాలమరణమునకు నేను పొందుతున్న దుఃఖమునకు చిహ్నముగా, విశ్వనాథ సత్యనారాయణ, విజయవాడ,16-12-62’ అని ఉంది. ఆ అంకితం నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. అందుకు రెండు కారణాలు. మొదటిది, ఆయన సాధారణంగా దేవుడికో లేదా దాతలకో లేదా రాజకీయనేతలకో లేదా తన కుటుంబసభ్యులకో పుస్తకాలు అంకితమిస్తూ వచ్చాడుకాని, ఒక ఆధునిక రచయితకు, అందులోనూ తన సమకాలికుడు, తనకన్నా వయసులో చిన్నవాడైన ఒక రచయితకు ఇలా అంకితమివ్వడం అదే మొదటిసారి. చివరికి తాను గర్వంగా చెప్పుకునే తన గురువు చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారికి కూడా ఆయన అప్పటికి ఏ పుస్తకమూ అంకితం ఇవ్వలేదు. ఆ తర్వాత ఎప్పుడో ఆరేడేళ్ళకి గాని చెళ్ళపిళ్ళకి పుస్తకం అంకితమివ్వలేదు.
ఇక రెండో కారణం, 34 లో ఆయన ‘వేనరాజు’ నాటకం రాసాక, దానికి ప్రతిస్పందనగా త్రిపురనేని రామస్వామి ‘ఖూనీ’ (1935) నాటకం రాసినప్పటినుంచీ వారిద్దరూ తమ తమ దృక్పథాల రీత్యా బద్ధశత్రువులుగా మారిపోయేరు. ఆ వివాదం విశ్వనాథను చాలా కలతపెట్టిందని చెప్తారు. అటువంటిది, ఆయన తన ప్రత్యర్థి కుమారుడి అకాలమరణానికి శోకిస్తూ ఒక పుస్తకం అంకితమివ్వడం మామూలు విషయం కాదు. ఏ విధంగా చూసినా ఇది ఒక అసాధారణమైన పని అని చెప్పవచ్చు.
అందుకని ఆ నవల వెంటనే ఆత్రుతగా చదివేసాను. శిల్పరీత్యా అదేమంత గొప్ప నవల కాదు. కాని అది, రచయిత అంతదాకా తాను చర్చించని కొన్ని కొత్త విషయాల్ని తరచి తరచి చూడటంకోసం, తన సాహిత్యప్రయోగశాలలో సరికొత్త ప్రయోగంగా చేపట్టినట్టుగా అనిపించింది. ఎక్కడో అది గోపీచంద్ భావనా ప్రపంచంతో సంవదిస్తూన్నట్టుగా కూడా నాకు అనుమానం కలిగింది. ఆలోచించి చూడగా నాకు తట్టిందేమిటంటే,గోపీచంద్ 1949 లో రాసి,1955 లో పుస్తకరూపంగా తీసుకొచ్చిన ‘పోస్టు చేయని ఉత్తరాలు’ లోని ప్రతిపాదనల్ని విశ్వనాథ తనదైన ధోరణిలో తాను నిగ్గుతేల్చడానికి పూనుకున్న ప్రయత్నంగా అనిపించింది.
ముఖ్యంగా గోపీచంద్ భౌతికవాదాన్ని, భావవాదాన్ని సమన్వయించే ప్రయత్నంలో అరవిందుల ఆలోచనల నుంచి కొంత స్ఫూర్తి పొందిన విషయం మనకు తెలిసిందే. అరవిందులు ఇనార్గానిక్-ఆర్గానిక్-సూపర్ ఆర్గానిక్ అనే క్రమంలో పరిణామం సంభవిస్తూ ఉందనీ, అది జంతుదశవరకూ యాదృచ్ఛికంగా సంభవిస్తే, మానవ దశలో మనిషి సంస్కారం వల్ల మనిషి తన పరిణామాన్ని తాను ప్రభావితం చేసుకోగలిగే స్థితికి చేరుకున్నాడనీ, దానివల్ల రానున్న కాలంలో ఒక అతీతమానసిక స్థితిని అందుకోగలడనీ అరవిందులు చెప్పారన్నది గోపీచంద్ ప్రతిపాదన.
ఈ భావనని విశ్వనాథ లోతుగా పట్టించుకున్నాడనీ, కానీ మానవదశలో కూడా కేవలం ఆర్గానిక్ నుంచి సూపర్ ఆర్గానిక్ కి జరిగే పరిణామాన్ని గోపీచంద్ భావించినట్టుగా పూర్తిగా భౌతికవాద దృక్కోణంలోంచే వివరించలేమని భావించినట్టుగా ఆ నవల చర్చిస్తున్నది. కానీ మనస్సు వరకూ, అంటే పాశ్చాత్యుల భాషలో mind, పాదార్థికమే అనే అంశాన్ని విశ్వనాథ ఈ నవల్లో అంగీకరించినట్టుగా కనిపించింది. ప్రపంచం వల్ల మనసు రూపొందుతుంది అనేది ఆయన నోటివెంట ఈ నవలలోనే నేను మొదటిసారి విన్నాను. ఇది నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. ఒక బౌద్ధుడిలాగా, ఒక పాశ్చాత్య భౌతికవాదిలాగా విశ్వనాథ కూడా ఈ ప్రత్యయాన్ని మొదటిసారిగా అంగీకరించాడు. ఆ తర్వాత దానితో విభేదించడానికి తనదైన ఒక వాదనని ఆ నవలలో నిర్మించుకుంటూ పోయాడు. అది వేరే విషయం.
రానున్నరోజుల్లో ఈ అంశం గురించి మరికొంత వివరంగా రాయాలనుకుంటున్నాను. కాని ఇప్పటికి ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. అదేమంటే, తన సమకాలిక ఆధునిక రచయితల్లో విశ్వనాథను గోపీచంద్ ఏదో ఒక మేరకు స్పందింపచెయ్యగలిగాడన్నది. అందుకనే, గోపీచంద్ స్మారక సంచిక (1963) లో ‘గొప్ప గోపీచంద్’ అనే కవిత రాస్తూ విశ్వనాథ-
మరియును నా వెంబడి బడి యూహ కలిగియుంట గొప్ప గోపీచంద్
పరమ రహస్యమ్ములు తెలుసుక మెలగుట యది గొప్ప గోపీచంద్
అని రాసాడనుకుంటున్నాను.
హైదరాబాదులో ఒక సాహిత్యసభ ఇలా మనసునీ, మేధనీ కూడా సమానంగా స్పందింపచెయ్యడం, చాలా రోజుల తర్వాత, ఇదే.
10-9-2926


ఎట్లాంటి సభలోనైనా సభికుల అటెన్షన్ పక్కకు తిరిగే వీల్లేకుండా, మ్యాజిక్ ఎలిమెంట్ లాంటి సాహిత్య రహస్యాలు మీరెలా దొరకబుచ్చుకుంటారు? బుక్ angels ఎప్పుడూ మీ వెంటే ఉంటారా, లేదంటే విశ్వనాథ అంకితం ఇచ్చిన పుస్తకం మీకు దొరకడమా !
ఈ పుస్తకాలు దొరికాయని మీరు రాయడం గుర్తుంది..
ఈ సభలో నేనూ ఉండి ఉంటే బాగుండనిపించింది.
బుక్ ఏంజెల్స్ పుస్తక ప్రేమికుల రూపంలోనూ, పుస్తక ప్రేమికులని ప్రేమించే పుస్తక ప్రేమికుల రూపంలోనూ నన్ను ఎన్నడూ వెన్నంటే ఉంటారు!
విశ్వనాథ వారు తన ‘గంగూలీ ప్రేమకథ’ని గోపీచంద్ గారికి అంకితం ఇవ్వడమన్న విషయం చాలా గొప్ప విషయం.
గోపిచంద్ గారి ‘పోస్టు చేయని ఉత్తరాలు’ సాఫ్ట్ కాపీ ఉంది. చదవాలి.
తప్పకుండా చదవండి. చదివాక మాట్లాడుకుందాం.
అయ్యో మంచి సమావేశంలో పాల్గొనలేక పోయాను. తెలిసి ఉంటే తప్పకుండా వచ్చేవాడిని. నిన్ననే విశ్వనాథుని స్మరించుకున్నాను. ఈ రోజు మట్టా సంపత్కుమార్ రెడ్డి మా బాబు , మ్రోగు తుమ్మెదల గురించి రాసారు . గోపీచంద్ నవలతో మీ ఇరవయ్యవ శతాబ్దం మొదలైందని చెప్పడం బాగుంది.
చాలా చాలా సంతోషం సార్. మీరు నా పోస్ట్ చదివితే అది చేరవలసిన చోటికి చేరింది అనిపిస్తుంది.
Pr