
ఆగస్టు 26 రాత్రి. గాంధీగారి గురించి ఒక సమాచారం కోసం నెట్ గాలిస్తున్నప్పుడు Meeting the Mahatma: Gandhiji’s Visits to Orissa (2006) అనే పుస్తకం నా కంటపడింది. రూపాంతర్ అనే సంస్థ ప్రచురించిన ఆ పుస్తకం కొన్ని వ్యాసాల సంకలనం. మహాత్మా గాంధీ భారతదేశానికి వచ్చిన తరువాత 1921 లో మొదటిసారి ఒరిస్సా పర్యటించారు. అప్పణ్ణుంచీ 1946 దాకా, ఆ మధ్యకాలంలో, మొత్తం ఏడుసార్లు ఒరిస్సాలో ఆయన పర్యటించారు. ఆ సందర్భంగా ఆయన్ని చూసినవాళ్ళూ, కలుసుకున్నవాళ్ళూ, మాట్లాడినవాళ్ళూ, ఆ తర్వాత తమ తమ ఆత్మకథల్లోనో లేదా జ్ఞాపకాల్లోనో ఆ క్షణాల్ని తలుచుకున్న విశేషాలకు సంబంధించిన వ్యాసాలు అవి. వాటిని వివిధ రచయితలు ఒడియానుంచి ఇంగ్లిషులోకి అనువదించారు. జతీంద్ర. కె. నాయక్ అనే ప్రొఫెసరు దాన్ని సంకలనం చేసారు. దానికి రామచంద్ర గుహ ముందుమాట రాసారు.
ఆ పుస్తకం పబ్లిక్ డొమైన్ లో అందుబాటులో ఉండటంతో నేను వెంటనే డౌను లోడు చేసుకుని చదవడం మొదలుపెట్టాను. సగం చదివేటప్పటికి దాన్ని తెలుగులోకి తీసుకురావాలని చాలా బలంగా అనిపించింది. అప్పటికి రాత్రి పది దాటింది. అయినా నా ఉత్సాహాన్ని అణచుకోలేక, నెట్ ద్వారానే, ప్రొఫెసరు జతీన్ నాయక్ ఈ మెయిల్ సంపాదించి, ఆయనకి మెయిల్ పెట్టాను. ‘మీ పుస్తకం నన్ను చాలా ఉద్విగుణ్ణి చేసింది. కొన్ని చోట్ల నాకు కళ్ళ నీళ్ళు తెప్పించింది. నేను దాన్ని అనువదించాలనుకుంటున్నాను. అయితే ఆ అనువాదాన్ని ప్రింటు చేయకుండా ఈ-బుక్ గా నా బ్లాగులో తెలుగు పాఠకులకి అందుబాటులో పెడతాను. అనుమతించగలరా?’ అని. ఆశ్చర్యం. అరగంట లోపే ఆయన్నుంచి మెసేజి వచ్చింది. ‘సంతోషంగా అనువదించండి, నాక్కూడా ఒక కాపీ పంపించండి’ అంటూ.
ఆ ఔదార్యానికి నాకు నోటమాట రాలేదు. ఆయనకు మనః పూర్వకంగా నమస్కరిస్తూ, ఈ రోజునుంచీ, ఆ వ్యాసాల తెలుగు అనువాదాల్ని మీతో వరసగా పంచుకోబోతున్నాను.
ముందుమాట
రామచంద్ర గుహ
మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ పుట్టుకతో గుజరాతీ బనియా అయినప్పటికీ, ఆయన ఆకర్షణ కులాల్నీ భాషల్నీ, మతాల్నీ, లింగభేదాల్నీ దాటి విస్తరించింది. ఆయన మహిళల సంపూర్ణ విశ్వాసాన్ని చూరగొన్న మహనీయుడు; ముస్లింలతో మైత్రి కోసం చేతులు చాచిన హిందువు; నిమ్న కులాల హక్కుల కోసం అలుపు లేకుండా పోరాడిన సవర్ణుడు. అన్నింటికీ మించి—తమిళులూ, మలయాళీలు, ఆంధ్రులూ, కన్నడిగులూ, మహారాష్ట్రులూ, హిందీవాళ్లూ, పంజాబీలూ, బెంగాలీలూ, అస్సామీలు, అలాగే వారెవరికీ తీసిపోని విధంగా ఒరియా ప్రజలు కూడా అమితంగా ఆరాధించిన ఒక గుజరాతీ.
1920, 1930 దశకాల్లో గాంధీ ఒరిస్సాలో పర్యటించినప్పుడు అక్కడి వివిధ వర్గాల ప్రజల స్మృతుల్ని ఈ పుస్తకం మన ముందుకు తెస్తుంది. ఈ జ్ఞాపకాల్లో ఎక్కువ భాగం ఒరియా మాట్లాడే వాళ్ళు రాసుకున్నవే వాటితో పాటు, ఆయన ఆ ప్రాంతాలు సందర్శించినప్పుడు ఆయన వెంట ఉన్న ఇద్దరు ఐరోపా మహిళలు రాసుకున్న అనుభవ కథనాలు కూడా ఇందులో ఉన్నాయి.
ఈ సంకలనం చదువుతున్నప్పుడు, విభిన్న సామాజిక వర్గాల్లో గాంధీ సంపాదించుకున్న గౌరవాదరణలూ భక్తిప్రపత్తులూ నన్ను అమితంగా ఆకట్టుకున్నాయి. ఒక విద్యార్థి బృందం మహాత్ముణ్ణి ఒక్కసారేనా చూడాలని, బస్సు ప్రయాణానికి డబ్బులు లేకపోతే, తమ మిత్రుడి బంగారు గొలుసు తాకట్టుపెట్టింది. అదే భాగ్యం కోసం మరికొంతమంది మైళ్లకు మైళ్లు కాలినడకనే నడుచుకుంటూపోయారు. గాంధీకి క్షవరం చేయడానికి వచ్చిన ఒక మహిళ, మానవరూపంలో ఉన్న ఆ దివ్యపురుషుని ముందు సరైన రీతిలో కనిపించాలన్న తపనతో అరువు తెచ్చుకున్న నగలు ధరించి మరీ హాజరయ్యింది.
నన్ను కదిలించిన రెండో విషయం—అస్పృశ్యతా నివారణ పట్ల గాంధీ చూపిన తిరుగులేని నిబద్ధత. హిందూ ధర్మానికే ఒక మచ్చగా ఆయన భావించిన ఆ సాంఘిక దురాచారానికి వ్యతిరేకంగా ఆయన ఒరిస్సాలో ఎక్కడికి వెళ్లినా రాజీలేని గళంతో తన అభిప్రాయాలు ప్రకటిస్తూ వచ్చారు. నిమ్న కులాలవారితో కలిసి భోజనం చేయమనీ, వారి పిల్లల చదువులకు తోడ్పడమనీ, తమ ఆలయాల్లోకి వారిని అనుమతించమనీ ఆయన తన సభలకు హాజరైన అగ్రవర్ణ హిందువులకు పదే విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు.
గాంధీని చూడటానికి ప్రజలు మైళ్లకు మైళ్ళు నడిస్తే, వారితో మాట్లాడటానికి గాంధీ కూడా మైళ్లకి మైళ్ళు నడిచారు. వీలైనంత ఎక్కువమంది ఒరియా ప్రజల్ని చేరుకోవాలన్న తపనతో ఆయన కాలినడకన ఎలా సాగారో, అది కూడా గడ్డు దారుల్లో ఎలా నడిచారో ఈ పుస్తకం వివరిస్తుంది. ఆయన అపార శక్తిమంతుడు; ఆ బక్కపలచని శరీరం వెనుక ఉన్న దేహదారుఢ్యం అందరి అంచనాల్నీ తల్లకిందులు చేసేది. కష్టనష్టాలు ఓర్చుకోడానికి ఆయన చూపించిన సంసిద్ధతా, ఆనిరాడంబర జీవితమూ—ప్రస్తుత కాలంలో భారత ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకుంటూ వారి తరఫున మాట్లాడేవారి జీవనశైలితో పోలిస్తే, ఆ వైరుధ్యం స్పష్టంగా తెలుస్తూనే ఉంది .
అలాగే, తన సభలకు వచ్చిన వారందరినీ గాంధీ పూర్తిగా తన ఆలోచనల వైపు తిప్పుకోలేకపోయారన్న యథార్థం కూడా నన్ను ఆలోచనలో పడవేసింది. ఆ సభలకు హాజరైన వాళ్ళల్లో చాలామంది కేవలం ఆయన దర్శనం కోసమే వచ్చారు; ఆయన వినిపించిన సామాజిక సందేశంమీద వారికి ఏమాత్రం ఆసక్తి లేదు. మరికొందరైతే దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు కూడా. అందుకే అప్పటి సనాతన హిందువులు దళితులతో కలవడానికి ససేమిరా ఒప్పుకోలేదు, తమ బడుల్లోంచీ గుళ్లల్లోంచీ వారిని వెలివేశారు.
ఆధునిక కాలంలో జీవించి సంచరించిన అత్యంత ఆసక్తికరమైన, అత్యంత ప్రభావశీలుడైన ఒక భారతీయుడి అంతరంగాన్ని లోతుగా అర్థం చేసుకోడానికి ఈ అద్భుత సంకలనం గొప్ప అంతర్దృష్టిని అందిస్తుంది. అందుకని ఈ పుస్తకం చదవమని పాఠకులకి సంతోషంగా సిఫార్సు చేస్తున్నాను. అంతేకాక, భారతదేశంలో ఇతర ప్రాంతాల పరిశోధకులు కూడా తమతమ రాష్ట్రాల్లో, స్త్రీపురుషులు రాసిన గాంధీ స్మృతుల్ని సేకరించి, సంకలనం చేసి, అనువదించడానికి ఈ పుస్తకం ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశిస్తున్నాను.
పరిచయం
జతీంద్ర కె. నాయక్
1921 నుండి 1946 దాకా ఆ మధ్యకాలంలో మహాత్మా గాంధీ ఒరిస్సాలో ఏడుసార్లు పర్యటించారు. ఆయన తన ప్రసిద్ధ హరిజన పాదయాత్రను ప్రారంభించడానికి ఆయన ఎంచుకున్నది కూడా ఒరిస్సా గడ్డనే. ఈ పర్యటనల్నీ, ఒరిస్సా ప్రజలమీద అవి చూపిన విద్యుత్ప్రభావాన్నీ చరిత్రకారులూ, పరిశోధకులూ, జీవిత చరిత్రకారులూ, స్వయంగా స్వాతంత్ర్య సమరయోధులూ ఎంతో విపులంగా రాసిపెట్టారు. వీటిలో వినోద్ కానుంగో రాసిన ‘బాపూజింక ఉత్కళరే పాదయాత్రా’ (1950), పావక్ కానుంగో గ్రంథం ‘ఒరిస్సా అండ్ గాంధీ’ (1999) ముఖ్యంగా పేర్కోదగ్గవి. వీటిలో రెండోది అప్పటి పత్రికా నివేదికల్నీ, ఛాయాచిత్రాల్నీ, కవితల్నీ, వ్యక్తిగత స్మృతివృత్తాంతాల్నీ- గాంధీజీ ఏడు పర్యటనలకు సంబంధించిన ఎంతో విలువైన సమాచారాన్ని అందిస్తూ, గాంధేయ ప్రతిఘటన వైపు ఒక లోకం మొత్తం ఎలా మేల్కొందో పాఠకులకు కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది.
అయితే ఈ ప్రస్తుత సంకలనం దృష్టి మరింత నిర్దిష్టం. మరింత పరిమితం. గాంధీ ఒరిస్సా పర్యటనలతో ముడిపడిన వ్యక్తిగత జ్ఞాపకాలకే ఈ సంకలనం పరిమితమైంది. వీటిలో ఎక్కువ భాగం కేవలం గాంధీని ఒక్కసారి దర్శించుకుని, తమ జీవితాల్లోని ఆ మధుర క్షణాన్ని పదిలపరుచుకోవాలని వచ్చిన సామాన్యులు రాసినవే. మరికొన్ని మహాత్ముడు ఒరిస్సాలో బస చేసినప్పుడు ఆయనతో కలిసి పనిచేసే, సంభాషించే అవకాశం దక్కించుకున్న వ్యక్తులు రాసినవి. గాంధీజీకి అత్యంత సన్నిహితురాలైన మీరాబెహెన్ స్మృతులతో పాటు, ఒరియాకు చెందిన ఒక ఇంజనీర్ని వివాహం చేసుకున్న ఒక స్విస్-జర్మన్ మహిళ ఫ్రీడా హౌస్‌వర్త్ రాసిన వృత్తాంతం కూడా ఇందులో ఉన్నాయి. వీటన్నింటినీ కలిపి చూసినప్పుడు—మానవ చరిత్రలోనే అత్యంత విలక్షణమైన, సమ్మోహనకరమైన ఒక మహనీయుని రూపాన్ని సామాన్య స్త్రీపురుషులు ఎలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారో, అలాగే ఆయన కూడా వారి జీవితాలను ఎలా స్పృశించారో మనకు స్పష్టమవుతుంది. ఆధికారిక పత్రాలూ, పాండిత్య పరిశోధనలూ, పాత్రికేయ కథనాలూ ఏమాత్రం చూపించలేని ఆ యాత్రల తాలూకు నాటకీయతనూ, ఉద్వేగాన్నీ, అలసటతో కూడిన విసుగునూ కూడా ఈ జ్ఞాపకాలు ఎంతో సహజంగా పునర్నిర్మిస్తాయి. వీటికి ఇంతటి ప్రత్యేక విలువా ప్రాముఖ్యతా సమకూరడానికి కారణం అదే. బ్రిటిష్ సామ్రాజ్యపు సంకెళ్ల నుంచి భారతదేశం ఎలా విముక్తమైందో చూపే ఒక మహత్తర చారిత్రక పరిణామాన్ని విభిన్న కోణాల నుండి అర్థం చేసుకోడానికి కూడా ఈ కథనాలు తోడ్పడతాయి.
ఈ సంకలనంలోని అధికభాగం రచనలు రెండు ప్రధాన పర్యటనల చుట్టూనే తిరుగుతాయి: మొదటిది 1921లో గాంధీ ఒరిస్సాకు వచ్చినప్పటిది కాగా, రెండోది 1934లో ఆయన చేపట్టిన పాదయాత్ర. 1921లో గాంధీ చేసిన మొదటి పర్యటన ఒరిస్సా స్వాతంత్ర్యోద్యమ చరిత్రలోనే ఒక నాటకీయ మలుపు. అది ఒక నాటి తరాన్ని సహాయ నిరాకరణోద్యమం వైపు నడిపించి, వారి జీవిత గమనాన్ని శాశ్వతంగా మార్చివేసింది. ప్రజాబాహుళ్యంలో గాంధీని ఒక దైవాంశసంభూతుడిగా, ఒక విముక్తిప్రదాతగా నిలబెట్టింది. గాంధీ భారీ బహిరంగ సభ నిర్వహించిన కాట్జూరి నదీతీరంలోని ఇసుకను ప్రజలు ఆరాధనాభావంతో దోసిళ్లకొద్దీ తమ ఇళ్లకు తీసుకెళ్లారు.
అయితే 1934 నాటి పాదయాత్రకు సంబంధించిన కథనాలకి వచ్చేటప్పటికి ఈ దృశ్యం మారుతుంది. అప్పటికి ఆయన పట్ల ప్రజల ప్రతిస్పందన ఎంతో సంక్లిష్టంగానూ, పరస్పర విరుద్ధంగానూ మారుతూ, ఒక్కోసారి బహిరంగ వ్యతిరేకతగా కూడా రూపుదాల్చింది; తను తలకెత్తుకున్న కార్యం ఎంత గురుతరమైందో, తను సంస్కరించాలని తపిస్తున్న ఆ సమాజంలో, మార్పు పట్ల ప్రగాఢ వ్యతిరేకత ఎంతగా పాతుకుపోయి ఉందో చూసి ఎవరికైనా సంభ్రమం కలుగుతుంది. అస్పృశ్యులుగా చూడబడుతున్న వారి మధ్య కూడా మళ్లీ రకరకాల అస్పృశ్యతా భేదాలు ఆచరణలో ఉన్నాయని తెలిసి మహాత్ముడు తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది సరిగ్గా ఈ ఒరిస్సా గడ్డమీదనే! నిరుపేదలనూ, సర్వస్వం కోల్పోయినవారినీ చేరుకోవడానికీ, చివరకు తనని తీవ్రంగా వ్యతిరేకించే వారితో సైతం సంభాషించడానికీ గాంధీ రూపొందించుకున్న ప్రభావశీల రాజకీయ భాషాశైలి కూడా ఇక్కడ మనకు పరిచయమవుతుంది.
బ్రిటిష్ పాలకుల ఆగ్రహాన్ని సైతం లెక్కచేయకుండా ఆయన్ను చూడటానికి తరలివచ్చిన వేలాది మంది ప్రజలకూ, గాంధీకీ మధ్య జరిగిన ఆ సంభాషణల్లో మాటల పాత్ర చాలా తక్కువనిపించే సందర్భాలూ ఉన్నాయి. కేవలం మహాత్ముని ఒక్క చూపు దర్శనంతోనే సంపూర్ణ తృప్తిని పొందిన ఎందరో మనుషుల ఉదంతాలు ఈ సంకలనంలో కనిపిస్తాయి. వారి అనుభవం దాదాపు ఒక ఆధ్యాత్మిక పారవశ్యం లాంటిది. అయినప్పటికీ ఒరిస్సా పర్యటనల్లో గాంధీకి ఎల్లప్పుడూ గుడ్డి ఆరాధన మాత్రమే దక్కలేదు. ఆయన సామాజిక దృక్పథం మీదా రాజకీయ ఆదర్శాల మీదా తమకున్న సంపూర్ణ అపనమ్మకాన్ని బాహాటంగా ప్రకటిస్తూ నిరసనకారులు ఆయనకు నల్ల జెండాలు చూపించిన సందర్భాలూ ఉన్నాయి. సంకుచిత మనస్తత్వం గల వలస పాలనా యంత్రాంగం కల్పించిన ఆటంకాలను కూడా ఆయన ఎదుర్కోవలసి వచ్చింది. వీటన్నింటి మధ్యనే ఆయన నిధులు సేకరించారు, ఒక హిందీ మాస్టారుకు జీతం అందేలా చూశారు, ఆచరణాత్మక సమస్యల్ని పరిష్కరించారు, జమాఖర్చుల లెక్కల పుస్తకాలు నిశితంగా పరిశీలించారు, అలాగే పిల్లల్తో ఆడుకోవడానికీ, పరిహాసాలు ఆడటానికీ కూడా సమయం కేటాయించుకోగలిగారు.
ఈ సంకలనంలోని వివిధ వ్యాసాలు గాంధీ బహుముఖ వ్యక్తిత్వపు విభిన్న కోణాలను ఆవిష్కరించడమే కాకుండా, ఆయన్ను చూసినవాళ్ళ, ఆయన మాటలు విన్నవాళ్ళ, ఆయనతో ప్రత్యక్ష సంబంధం ఏర్పరచుకున్న వాళ్ళ మనస్సుల్లో ఆయన ఎంతటి ప్రగాఢ ముద్ర వేశారో స్పష్టం చేస్తాయి. వాళ్ళు మహాత్ముణ్ణి చూసిన క్షణాల వృత్తాంతాలు భారత స్వాతంత్ర్య పోరాటపు ఆత్మీయ చరిత్రకు మనల్ని మరింత దగ్గర చేస్తాయి.
29-9-2026


Nice sir. In which site is it available
You may go to Google and type the title ‘Meeting the Mahatma’ edited by Jatindra K Nayak.
Very grateful to you, Sir, for bringing such hidden treasures and sharing them with us. Looking forward to reading this series. 🙏🏽
హృదయపూర్వక ధన్యవాదాలు మాధవీ!