తేనెటీగల కొలను-1

థియొడర్ స్టార్మ్ (1817-88) పందొమ్మిదో శతాబ్దపు జర్మన్ రచయిత. ఆయన రాసిన Immensee (1849) అనే నవలికతో సాహిత్యంలో Poetic Realism అనే ఒక కొత్త నవలా ప్రక్రియ మొదలయ్యింది. దాని ప్రభావానికి లోనుకాని తదనంతర జర్మన్ రచయితలు లేరు. ఒక్క జర్మన్ రచయితలే కాదు, టాల్ స్టాయి, తుర్జెనీవ్, చెహోవ్ లాంటి రష్యన్ రచయితల పైన ప్రత్యక్షంగానూ, టాగోర్, శరత్, విశ్వనాథ లాంటి భారతీయ రచయితల పైన పరోక్షంగానూ ఆ రచన ప్రభావం చూపించింది. పదేళ్ళ కిందట ఆ నవల చదివినప్పుడు దానిమీద రాసుకున్న ఒక పోస్టు (తేనెటీగల కొలను) మీరిక్కడ చూడవచ్చు. ఇన్నాళ్ళకి ఆ నవలికని తెలుగులోకి అనువదించగలిగాను. ఈ రోజునుంచీ దాన్నిక్కడ మీతో పంచుకోబోతున్నాను. మీరిది చదవడం పూర్తయ్యాక, ‘కావ్యాత్మక వాస్తవికత’ పైన ఒక విపుల పరిచయం కూడా మీకు అందించబోతున్నాను. ఈ అనువాదానికి ఆధారం C.W. Bell ఇంగ్లిషు అనువాదం. ఈ రేఖాచిత్రాలు జెమిని ఏఐ గీసిపెట్టింది.


మొదటి అధ్యాయం

వృద్ధుడు

శరదృతువు చివరి రోజుల్లో ఒక సాయంసంధ్య వేళ. ఒక వృద్ధుడు వీథమ్మట నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతడు చక్కటి వస్త్రాలు ధరించాడు కానీ కాళ్ళవి ఎప్పటివో పాతకాలపు బకిల్ బూట్లు. వాటిమీద పడ్డ దుమ్ముని బట్టి అతడు సాయంకాలం నడక ముగించుకుని ఇంటికి తిరిగివస్తున్నట్టుగా ఉంది.

అతడి చేత ఒక పొడవాటి చేతికర్ర ఉంది. దానికి బంగారు పిడి ఉంది. అతడి జుత్తు నెరిసి ఉంది. కానీ అందుకు విరుద్ధంగా అతడి గతయవ్వనమంతా ఇంకా ఆ నల్లని కళ్ళల్లో నిలిచినట్టే ఉంది. అతడు ప్రశాంత నేత్రాల్తో తన చుట్టూ ఉన్న దృశ్యాలు కలయచూస్తూ, సంధ్యాకాంతిలో మునిగిపోయిన నగరాన్ని పరికిస్తూ నడుస్తున్నాడు. చూడబోతే అతడు ఆ ఊరికి బొత్తిగా కొత్తవాడిలాగా కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఆ దారమ్మట పోతున్నవాళ్ళల్లో ఎవరో ఒకరిద్దరు మాత్రమే ఆయనకి అభివాదం చేసారు. కానీ, చాలామంది ఆ గంభీరమైన చూపుల వైపు అప్రయత్నంగానే దృష్టి సారిస్తూ ఉన్నారు.

మొత్తానికి అతడొక పాతభవంతి ముందు ఆగాడు. అదొక మిద్దె ఇల్లు. అతడు తాను నడిచి వచ్చిన దారమ్మటే ఆ నగరం వైపు మరోసారి చూసి ఆ ఇంటి ముఖద్వారం దగ్గర అడుగుపెట్టాడు. బయట ఉన్న గంట మోగించగానే లోపల గదిలోంచి ఎవరో ఆ హాల్లోకి వచ్చి అక్కడ కిటికీకి ఉన్న ఆకుపచ్చని తెర పైకి జరిపారు. దాని వెనక ఒక వృద్ధురాలి ముఖం కనిపించింది. అతడు తన చేతికర్ర ఆడిస్తూ ఆమెకేదో సైగ చేసాడు.

‘ఇంకా దీపాలు వెలిగించలేదా?’ అని అడిగాడు. ఆ గొంతులో దక్షిణప్రాంతాల యాస వినిపించింది. లోపల మనిషి ఆ తెర మళ్ళీ కిందకు దింపేసింది.

ఆ వృద్ధుడు ఆ ముఖద్వారం దాటి లోపల హాల్లో అడుగుపెట్టాడు. అక్కడ పెద్ద పెద్ద ఓక్ చెక్క పెట్టెలు గోడలకి ఆనించి ఉన్నాయి. వాటిమీద పింగాణీ పాత్రలు అలంకరణగా ఉన్నాయి. అతడు అక్కణ్ణుంచి ఎదురుగా ఉన్న తలుపు తెరిచి మరొక చిన్న వరండాలోకి ప్రవేశించాడు. అక్కడనుంచి సన్నటి మెట్లదారి ఒకటి ఇంటి వెనకవేపు నుంచి పై గదుల్లోకి దారితీస్తున్నది. అతడు నెమ్మదిగా ఆ మెట్లెక్కి, పైన గది తలుపు తాళం తీసి, గదిలో అడుగుపెట్టాడు. ఆ గది మరీ పెద్దదీ, మరీ చిన్నదీ కాకుండా ఓ మోస్తరుగా ఉంది.

ఎంతో ప్రశాంతంగానూ, హాయిగానూ విశ్రమించడానికి అనుకూలంగానూ ఉంది ఆ గది. అందులో ఒక వైపు గోడకి పుస్తకాల అరలూ, కొన్ని అలమారాలూ ఉన్నాయి. మరో వైపు కొందరు వ్యక్తుల ముఖచిత్రాలూ, ప్రకృతి దృశ్యాల చిత్రాలూ ఉన్నాయి. అక్కడొక బల్లమీద ఆకుపచ్చని వస్త్రం పరిచి ఉంది. దానిమీద కొన్ని పుస్తకాలు తెరిచి ఉన్నాయి. దానికి ముందు పెద్ద చేతుల కుర్చీ ఒకటి ఉంది. దానిలో ఎర్రటి వెల్వెటు మెత్త ఒకటి అమర్చి ఉంది.

ఆ వృద్ధుడూ, తన టోపీ, చేతికర్రా ఒక మూల ఉంచి, ఆ కుర్చీలో కూర్చున్నాడు. స్థిమితపడుతున్నట్టుగా చేతులు దగ్గరకి ముడుచుకున్నాడు.

అతడలా కూర్చుని ఉండగానే నెమ్మదిగా చీకట్లు ముసురుకున్నాయి. కిటికీలోంచి ఒక చంద్రరేఖ ఆ గదిలోకి ప్రసరించి గోడమీద ఉన్న చిత్రపటాల మీద పరుచుకుంది. ఆ వెన్నెల కాంతి అలా నెమ్మదిగా ప్రసరిస్తుండగానే అతడి కళ్ళు అప్రయత్నంగానే ఆ కాంతిని అనుసరించాయి. అక్కడ గోడమీద సాదాసీదాగా ఉన్న ఒక నల్లటి చట్రంలో బిగించిపెట్టిన చిన్న బొమ్మ మీద అతడి దృష్టి ప్రసరించింది.

“ఎలిసబెత్!” అని ఆయన నెమ్మదిగా ఉచ్చరించాడు. ఆ పదం పలుకుతూనే కాలం వెనక్కి మళ్ళి అతడు తన యవ్వనదినాలకు పయనమయ్యాడు.

రెండవ అధ్యాయం

పిల్లలు

అంతలోనే అందమైన ఒక చిన్నబాలిక రూపం అతణ్ణి సమీపించింది. ఆమె పేరు ఎలిసబెత్. దాదాపు ఐదేళ్ల వయస్సు ఉండవచ్చు. అతడి వయస్సు ఆమెకి సరిగ్గా రెట్టింపు. ఆమె తన కంఠం చుట్టూ ఎర్రటి పట్టు వస్త్రం చుట్టుకుని ఉంది. ఆమె గోధుమ రంగు నేత్రాల పక్కన అదొక వింత సొగసుతో కనిపిస్తున్నది.

‘రైన్‌హార్డ్!’ అంటూ ఆమె కేరింత కొట్టింది, ‘ఈ రోజు మనకి బడిలేదు. సెలవు. ఈ రోజంతా సెలవు. రేపు కూడా సెలవే’.

వెంటనే రైన్‌హార్డ్ తన చంకనున్న పలకతీసి ముందు గుమ్మం వెనక పెట్టేసాడు. అప్పుడా పిల్లలిద్దరూ ఇంట్లోంచి పెరట్లోకి, అక్కణ్ణుంచి తోట గుమ్మం దాటి పచ్చిక మైదానంలోకి పరుగుతీసారు. అనుకోకుండా దొరికిన ఈ సెలవు వాళ్ళకి బాగా కలిసొచ్చినట్టనిపించింది. వేసవి సాయంకాలాలు అక్కడ గడపాలని వాళ్ళ ఆలోచన. అందులో లేనిదల్లా కూర్చోడానికి ఓ బల్ల. అందుకని రైన్‌హార్డ్ వెంటనే పని మొదలుపెట్టాడు. సుత్తీ, మేకులూ, బల్లచెక్కలూ—కావలసినవన్నీ అక్కడ అప్పటికే సిద్ధంగా ఎదురుచూస్తున్నాయి.

ఈలోపు ఎలిసబెత్ మైదానం గట్టమ్మట నడుస్తూ అక్కడ అడవిపూల గింజలు ఏరుకుంటూ తన పరికిణీలో పోగేసుకోడం మొదలుపెట్టింది. వాటితో గొలుసులూ, హారాలూ అల్లుకోవాలని ఆమె ఉద్దేశ్యం. ఇక్కడ రైన్‌హార్డ్ ఎన్నో మేకులు వంకరగొట్టి మొత్తానికి ఎలాగో ఒకలాగ ఆ కుర్చీబల్ల పని పూర్తిచేసి ఎండలోకి వచ్చేటప్పటికి ఎలిసబెత్ ఆ మైదానంలో దూరంగా ఆవలి అంచున తిరుగుతూ ఉంది.

‘ఎలిసబెత్!’ అంటూ అతడు గట్టిగా పిలిచాడు.

‘ఎలిసబెత్!’ ఆ పిలుపు వినగానే ఆమె పరుగెత్తుకుంటూ వచ్చింది. ఆమె ముంగురులు గాలికి రేగిపోతూ ఉన్నాయి.

‘ఇదిగో, మన ఇల్లు పూర్తయింది. ఇక్కడికి రా. అబ్బో, నీకు బాగా చెమటలు పట్టేశాయే! లోపలికి రా, నేను తయారు చేసిన కొత్త బల్లమీద కూర్చుందాం. ఇప్పుడు నీకో కథ చెప్తాను’ అని అన్నాడు.

ఇద్దరూ ఆ గడ్డి ఇంట్లో అడుగుపెట్టి ఆ కొత్త బల్లమీద కూర్చున్నారు. రైన్‌హార్డ్ కథ చెప్తుండగా ఎలిసబెత్ తన ఒడిలో ఉన్న చక్రాల్లాంటి గింజలు తీసి పొడుగ్గా దారానికి గుచ్చడం మొదలుపెట్టింది.

‘అనగనగా ఒక ఊళ్ళో ముగ్గురు ఆడాళ్ళుండేవారు. వాళ్ళ ముగ్గురికీ పెళ్ళి కాలేదు.’

‘ఓహో! ఆ కథ మొత్తం నాకు కంఠోపాఠమే. ఒకసారి చెప్పేసిన కథ నాకు మళ్ళీ మళ్ళీ చెప్పక్కరలేదు’ అంది ఎలిసబెత్.

దాంతో రైన్‌హార్డ్ పెళ్ళికాని ఆ ముగ్గురు ఆడవాళ్ళ కథా అక్కడితో ఆపేసి సింహాల గుహలో చిక్కుకున్న పేదవాడి కథ చెప్పడం మొదలుపెట్టాడు.

‘అప్పటికి చీకటి పడింది. తెలుసు కదా, చిమ్మచీకటి—ఆ సింహాలు నిద్రపోతూ ఉన్నాయి. అలా నిద్రపోతూనే అవి అప్పుడప్పుడు తమ ఎర్రటి నాలుకలు బయటికి సాచి మరీ ఆవులిస్తూ ఉన్నాయి. ఆ నిర్భాగ్యుడు వణికిపోతూ ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూస్తూ ఉన్నాడు. ఇంతలో ప్రకాశవంతంగా ఒక వెలుతురు అతడి చుట్టూ పరుచుకుంది. తన ఎదట ఒక దేవదూత నిలబడి ఉన్నట్టుగా కనిపించింది అతడికి. ఆ దేవదూత అతణ్ణి తన దగ్గరకి రమ్మని చేత్తో సైగ చేసి ఆ రాళ్ళల్లోనే అదృశ్యమైపోయింది.’

ఎలిసబెత్ చాలా శ్రద్ధగా వింటోంది. ‘దేవదూతనా? మరి ఆమెకి రెక్కలున్నాయా?’

‘అదంతా వట్టి కథ మాత్రమే. దేవదూతలేమీ నిజంగా ఉండరు కదా’ అన్నాడు రైన్‌హార్డ్.

‘నిజంగా?’ అంటూ ఆమె అతడి ముఖంలోకి చూస్తూ అరిచినంతపనిచేసింది. కానీ అతడు మళ్ళా తన కళ్ళల్లోకి కళ్ళు పెట్టిచూడగానే, ఒకింత సందేహంగా ‘మరి ఎందుకని అమ్మా, అత్తయ్యా, బళ్ళో టీచర్లూ అందరూ కూడా దేవదూతలకి రెక్కలుంటాయని చెప్తారు?’ అనడిగింది.

‘ఏమో నాకు తెలీదు’ అన్నాడతడు.

‘మరి అలాగైతే సింహాలు కూడా లేనట్టేనా?’ అనడిగింది ఎలిసబెత్.

‘సింహాలా? సింహాలు నిజంగా లేవంటావా? ఇండియాలో ఉన్నాయంటారు. అక్కడ పూజారులు వాటిని బళ్ళకి పూన్చి ఎడారుల్లో తోలుకుంటూ పోతారని విన్నాను. నేను పెద్దయ్యాక ఏదో ఒకరోజు అక్కడికి వెళ్తాను. అక్కడ ఇక్కడ కన్నా వెయ్యి రెట్లు గొప్పగా ఉంటుంది. నీకు తెలుసా, అసలక్కడ శీతాకాలమే ఉండదట. నువ్వు కూడా రావాలి సుమా. వస్తావు కదా.’

‘తప్పకుండా. మనతో పాటు మా అమ్మ కూడా వస్తుంది మరి. అలాగే మీ అమ్మగారు కూడా రావాలి.’

‘లేదు, లేదు. అప్పటికి వాళ్ళు బాగా ముసలాళ్ళైపోతారు. వాళ్ళప్పుడు రాలేరు.’

‘కానీ నా అంతట నేను నీతో రాడానికి వాళ్ళు ఒప్పుకోరు కదా.’

‘ఎందుకు? నువ్వెలానూ వస్తావు. అప్పటికి నువ్వు నా భార్యవి అవుతావు కదా. అప్పుడు నువ్వేం చెయ్యాలో చెయ్యకూడదో వేరేవాళ్ళు చెప్పరు కదా.’

‘కానీ అప్పుడు మా అమ్మ ఏడుస్తుందే.’

‘మనం మళ్ళా తిరిగొచ్చేస్తాం కదా. ఒక్కమాట అడుగుతాను. సూటిగా చెప్పు. నువ్వు నాతో వస్తావా? రావా? నువ్వు రాకపోతే నేనొక్కణ్ణే వెళ్తాను. కానీ మళ్ళీ రావడంటూ ఉండదు.’

ఆ చిన్నారి బాలికకి ఏడవడమొక్కటే తరువాయి. ‘నువ్వు మరీ అలా ముఖం వేలాడేసుకోకు. నేను నీతో పాటు ఇండియా వస్తాలే’ అంది.

ఆ మాటలు వినగానే రైన్‌హార్డ్ సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బై ఆమె రెండు చేతులూ పట్టుకుని ఒప్పులకుప్పలు ఆడటానికన్నట్టుగా పచ్చికబయల్లోకి దారితీసాడు.

‘ఇండియాకి వెళ్తున్నాం, ఇండియాకి వెళ్తున్నాం’ అంటూ పాటపాడాడు. చివరికి ఆమె మెళ్ళో చుట్టుకున్న పట్టురుమాలు జారికిందపడిపోయేదాకా ఆమె చేతులు పట్టుకుని చుట్టూ తిరుగుతూ నాట్యం చేసాడు. కానీ ఇంతలోనే హటాత్తుగా ఆమె చేతులు వదిలిపెట్టేసి గంభీర స్వరంతో ‘కానీ ఏం లాభం—నీకు ధైర్యం లేదు’ అన్నాడు.

ఈలోపు తోట వాకిలికి బయటనుంచి ‘రైన్‌హార్డ్! ఎలిసబెత్!’ అని పిలుపులు వినిపించాయి.

‘ఇదుగో వస్తున్నాం’ అని ఆ పిల్లలు బదులు పలికారు. వెంటనే చెట్టపట్టాలు పట్టుకుని ఇంటికి దౌడు తీసారు.

(ఇంకా ఉంది)

2-11-2026

2 Replies to “తేనెటీగల కొలను-1”

Leave a Reply