అవిముక్తం

ఉభయ గోదావరి జిల్లాల కవులు, రచయితలు ఈ నెల 25 న భీమవరంలో ఒక సాహిత్య ఉత్సవం నిర్వహించారు. ఆ సందర్భంగా తాము రాసిన కవితల్నీ, కథల్నీ ‘గోదారి అలలు: కవితలు కథలు‘ పేరిట ఒక సంపుటిగా విడుదల చేసారు. నేను ఆ ఉత్సవంలో పాల్గొనలేకపోయానుగాని, ఆ పుస్తకంలో మాత్రం నా కవితకీ, కథకీ చోటు లభించింది. నిన్ననే కుమార్ కూనపరాజు గారినుంచి ఆ పుస్తకం అందుకున్నాను. చాలా బాగా తీసుకొచ్చారు పుస్తకాన్ని. అందులో నేను రాసిన కథ ఇక్కడ మీతో పంచుకుంటున్నాను. గోదావరి జిల్లాల సాహిత్య సంకలనం కాబట్టి గోదావరిచుట్టూ అల్లిన కథ ఇది.


గోదావరి ఒడ్డు.  చిరుచలిగాలులు అతణ్ణి తాకిపోతున్నాయి. ‘గోదావరి, గోదావరి’ అని పదే పదే మనస్సులో అప్రయత్నంగా అనుకుంటూ ఉన్నాడు శ్రీనాథుడు. గోదావరీ, గోదావరీ, గోదావరీ అని మనసులో అనుకుంటే చాలు ఆ గోదావరి తల్లి మనిషికి గొప్ప శుభాలు చేకూరుస్తుందని తాను భీమఖండంలో రాసుకున్న పద్యం గుర్తొచ్చింది.

దూరంగా పట్టణంలోంచి గుర్రాల సకిలింతలు వినవస్తున్నాయి. సాయంకాలమైనట్టుగా నగారా మోగింది.  తాను కూచున్న ఒడ్డుదగ్గరనుంచి దూర దిగంతరేఖ దాకా సూర్యాస్తమయ సంధ్య కాంతి పరుచుకుంది. తన వెనక రాజమహేంద్రవర పట్టణం మీద కూడా చీకట్లు కమ్ముకుంటున్నాయి. నేల, నది, ఆకాశం- మొత్తం భూమండలమే కొంత ఎర్రగా, కొంత నల్లగా, బాగా మిగలముగ్గిన తాటిపండులాగా కనిపిస్తున్నది. అది ఏ క్షణాన్నైనా తొడిమ తెగి కిందకు రాలిపోతుందా అనిపిస్తున్నది.

తాటిపండ్లు గుర్తురాగానే శ్రీనాథుడికి కొండవీడు గుర్తొచ్చింది. తాను పుట్టిపెరిగిన కర్ణినాడు గుర్తొచ్చింది. ఎంత దూరం ప్రయాణించాడు తాను ఈ ఒక్క జీవితంలో! గడిచిన జీవితమంతా తాను ఏదో కలలో హడావిడిగా చదివిన ఏదో పురాణకావ్యంలాగా తోచింది. ఒక సముద్రతీరపట్టణంలో పుట్టిన రోజులనుంచి, కాకతీయుల ఆదరాన్ని పొందిన తన తాత, తన చిన్నప్పటి ఆ  రోజులు, ఆయన శుశ్రూషలో తాను చదువుకున్న కావ్యాలు గుర్తొచ్చాయి. ఆ చిన్నవయసులోనే తనలో కూడా ఒక కావ్యోత్సాహాన్ని మేల్కొల్పిన కాలం అది. ఆ చిన్నారిపొన్నారి చిరుతకూకటి రోజుల్లోనే తాను మరుత్తరాట్చరిత్ర రాయడం గుర్తొచ్చింది. తనకి నూనూగు మీసాల నవ యవ్వనం సంప్రాప్తిస్తున్న రోజుల్లోనే శాలివాహన సప్తశతి తనల్ని ఆవహించింది. ఆ పల్లెటూళ్ళు, ఆ గ్రామరథ్యలు, ఆ గాథల్లోనే మొదటిసారి పరిచయమైంది తనకి గోదావరి.

తన జ్ఞాపకాలు తనల్ని ఎక్కడికో తేల్చుకుంటూ పోతున్నట్టుగా అనిపించింది అతనికి. ఒక్కసారి తనను తాను విదిలించుకున్నాడు. లేదు, సప్తశతి గాథలు తన ఆత్మలోకీ ఇంకిపొయ్యాయి. అప్పుడప్పుడే లోకం తెలుస్తున్న ఆ కౌమారప్రాయంలో, తనలో అంకురిస్తున్న నవయవ్వనదినాల్లో ఆ పద్యాలు తనలో ఒక మనోజ్ఞ లోకాన్ని సృష్టించాయి. అప్పటికి తనకి ఏ రాజులతోటీ పరిచయం లేదు, ఏ రాజకీయాలూ  తెలియదు. తనకి తెలిసిందల్లా ఒక పచ్చనిలోకం. వెచ్చని మనుష్య ప్రేమ.  ఆ గాథలు ప్రతి ఒక్కటీ ఒక ముక్తకం- కానీ ఆ ప్రతి ఒక్క ముక్తకంలోనూ ఒక నిండైన ప్రపంచాన్ని తనలో ఇముడ్చుకుని ఉంటుంది. తాను ఎంత చెప్పాలో అంతే చెప్తుంది, ఎంత చూపించాలో అంతే చూపిస్తుంది. తక్కింది  సహృదయుడికి వదిలిపెడుతుంది. ఆ పసితనపు రోజుల్లో తనకి పదే పదే అనిపించేది- తాను కూడా తన పూర్వజన్మల్లో ఆ గాథాసప్తశతి కవుల్లో ఒకడై ఉండి ఉంటాడని. ఎంతటి వాళ్ళకైనా శీలాన్ని పెళ్ళగించి పక్కన పడేసే  ఆ గోదావరి ఒడ్డునే  తాను కూడా పుట్టి ఉంటాడని!

‘తలపులు చాలా చిత్రమైనవి. అవి నీకే తెలియకుండా నీ ఆత్మలోతుల్లో అణగి ఉన్న పూర్వజన్మల సంస్కారపరిమళాలు. అటువంటి తలపులు నీకెందుకు కలుగుతున్నాయో అప్పుడు నీకు తెలీదు. కానీ జీవితానుభవాలు నిన్ను ఎక్కడెక్కడికో తిప్పి మళ్ళా అక్కడికే నెట్టుకొచ్చినప్పుడు, అప్పుడు గ్రహిస్తావు, నీ లోపలి ప్రపంచమే నెమ్మదిగా బయటి ప్రపంచంలో కనిపిస్తూ ఉందని’ అని అనుకున్నాడు శ్రీనాథుడు.

లేకపోతే ఎక్కడి కొండవీడు! ఎక్కడి రాజమహేంద్రవరం! శాలివాహన సప్తశతినే కదా తనని పెదకోమటి వేమారెడ్డికి పరిచయం చేసింది. తనలానే అతడు కూడా సప్తశతి దారుల్లోనే పిచ్చివాడిలా తిరిగేవాడు. ఎన్ని వెన్నెల రాత్రులు, ఎన్ని సాయంకాలాలు, ఎన్ని తొలివానాకాలాలు ఆ గాథల్ని తామిద్దరూ  కలిసి తలుచుకుంటూ ఉండేవారు. ముందు అతడొక గాథ తలుచుకునేవాడు. వెంటనే తననొక కావ్యోన్మత్తత ఆవహించేది. ఆ చిన్నచిన్నమాటల్లోనే ఒక దూరదిగంతం తమల్ని దగ్గరకు రమ్మని పిలిచేది. అమృతం ప్రాకృత కావ్యం అన్న మాట నిజం. అందులో ప్రతి ఒక్క పదం, ప్రతి ఒక్క విరుపు, ప్రతి ఒక్క సంజ్ఞ- ఆలంకారికులు ఆ గీతాల్ని పదే పదే చదువుకోవడం కోసమే అలంకార శాస్త్రాలు రాసారా అనుకునేవాళ్ళు. ‘అక్కడక్కడ మలుపులు, మలుపు మలుపుకీ రెల్లుపొదలు’- అని చదువుతుంటే, ఆ మురళానది, ఆ రేవాతీరం కళ్ళముందు కనిపించేవి.  అలానే ఆ ఎగుడు దిగుడు గోదావరి గట్లు, ఆ ఇప్పచెట్లు- అవెలా ఉంటాయో ఊహించుకుంటూనే ఉండేవారు.

అప్పణ్ణుంచీ వేమారెడ్డిని కూడా గోదావరి అతడి జీవితకాలమంతా పిలుస్తూనే ఉందనుకున్నాడు శ్రీనాథుడు. రాజమహేంద్రవరం కోసం ఎన్ని యుద్ధాలు చేసాడు. ఎన్ని కుయుక్తులు పన్నాడు, ఎంత కూహకం చేసాడు! సొంత బావమరదితోనే  ఆజన్మాంత వైరం సాగించాడు.

గతించిపోయిన ఆ కాలం మనసులో మెదలగానే శ్రీనాథుడి మనసు చేదుగా అయిపోయింది. ఎటువంటి రసజ్ఞులు వాళ్ళిద్దరూ! పెదకోమటి వేమారెడ్డీ, కాటయ వేమారెడ్డీ సంస్కృతంలో ఎంత గొప్ప పండితులు! పాండిత్యం అలా ఉంచి, అసలు ఎంత రసజ్ఞత వాళ్ళిద్దరిలో! తనకి చాలా సార్లు అనిపించేది, ఈ యుద్ధాలూ, ఈ పగలూ, ఈ రక్తపాతం లేని రోజులుండవా? వేమారెడ్డీ, కాటయవేమారెడ్డీ, తానూ కూచుని ఈ గోదావరి ఒడ్డున అమరుకాన్నో లేదా కాళిదాస నాటకాల్నో కలిసి చదువుకునే రోజులు రావా అనిపించేది. కాని ఎంత పగ! కొండవీటినుంచి రాజమండ్రిదాకా కవిత్వం ప్రవహించవలసిన నేలమీద గుర్రాలు పరుగెత్తాయి, కత్తులూ, బాణాలూ వర్షించాయి, చివరికి ఈ కుటుంబ కలహంలో మొత్తం దక్షిణాపథమంతా వచ్చి చేరింది! విజయనగర రాజులూ, గజపతులూ కాటయవేముడి వైపు, ఫిరోజ్ షాతో పాటు రాచకొండ నాయకులు వేముడి వైపు- వాళ్ళందరిలో  ఏ ఒక్కరూ ఏ ఒక్కరికీ నిజంగా మిత్రులు కారు. వాళ్ళల్లో ఏ ఒక్కరు కూడా వేమారెడ్డిలానో, కాటయవేముడిలానో కావ్యానందం రుచి తెలిసిన వాళ్ళు కారు. చివరికి ఏమయ్యింది? గుండుగొలనులో వేమారెడ్డి సైన్యాలు కాటయవేముణ్ణి చంపేసాయి. అది జరిగి ఆరేళ్ళు తిరక్కుండానే, ఒకప్పుడు తనతో చేతులు కలిపిన రేచెర్ల రాజులే కొండవీడుమీద పడి వేమారెడ్డిని చంపేసారు.

శ్రీనాథుడు మరొకసారి గోదావరి వైపు చూసాడు. స్వర్గానికి నిచ్చెనకట్టినుండే ఈ నది ఒడ్డున మనుషులు నిజంగా చెయ్యవలసిన పని అంటూ ఉంటే కావ్యాలు చదువుకోవడమే కదా! కాని ఈ నీళ్ళకోసం రక్తాలు ప్రవహింపచేసుకున్నారే! కొండవీడు కూలిపోయిన తర్వాత తాను మొదటిసారిగా గోదావరీ తీరమంతా కలయదిరిగింది గుర్తొచ్చింది. వెయ్యేళ్ళ కిందట చాళుక్య ప్రభువులు వేంగిలో రాజ్యం మొదలుపెట్టినప్పటినుంచి గోదావరీ తీరంలో తెలుగు భాషా, తెలుగు పద్యం కూడా వికసించడం మొదలుపెట్టాయి. అన్నదమ్ముల మధ్య ఎడతెగని యుద్ధాన్ని చూసి చూసి విసుగెత్తి కదా, ఆదికవి ఇక్కడ మహాభారతాన్ని తెలుగువాళ్ళకి వినిపించాలనుకున్నాడు. నాలుగు శతాబ్దాలు గడిచాయి. కాని ఈ నేల ఏమి నేర్చుకుంది?

శ్రీనాథుడు మళ్ళా తన గతాన్ని ఒకసారి సింహావలోకనం చేసుకున్నాడు. రాజమహేంద్రవరం మీద  ఆధిపత్యం కోసం పోరాడి పోరాడి తన కలలు నెరవేరకుండానే తన మిత్రుడు వేమారెడ్డి ఈ లోకం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అతడు ఎవరితో పోరాడేడో, ఆ కాటయవేముడి అల్లుడి రాజ్యంలో తానిప్పుడు ఆశ్రితుడిగా ఉన్నాడు. ఒక యుగం గడిచిపోయింది. తన కళ్ళెదుటనే ఒక రాజ్యం అంతరించిపోయింది. కొండవీడు వీథుల్లో కొమరగిరిరెడ్డి కర్పూరం వెదజల్లిన ఆ రోజులు కల కరిగిపోయినట్టుగా కరిగిపొయ్యాయి. అతడి భావుకతకీ, రాసిక్యానికీ-పెదకోమటి వేమారెడ్డీ, కాటయవేమారెడ్డీ- ఇద్దరూ వారసులే.  ఆ కావ్యప్రపంచానికి వాళ్ళిద్దరూ కూడా ఎవరికి వారే వారసులమనుకున్నారు, ఎవరి దారిన వారు కవుల్నీ, పండితుల్నీ ఆదరించారు. కానీ ఇదుగో, ఈ నేల మీద రాజ్యాధికారానికి వచ్చేటప్పటికి మాత్రం తమలో ఒకరు మాత్రమే కొమరగిరిరెడ్డికి నిజమైన వారసులు కావాలనుకున్నారు. చివరికి ఆ అగ్ని మొత్తం కొండవీడుని దగ్ధం చేసాకగానీ చల్లారలేదు.

కొండవీడు కూలిపోయాక తాను తిరిగిన చోట్లన్నీ గుర్తొచ్చాయి శ్రీనాథుడికి. అప్పుడే మొదటిసారి ఆకలి అంటే ఎలా ఉంటుందో తెలిసింది. పల్నాటి సీమ పల్లెటూళ్ళల్లో తిరిగినప్పుడు ఇంత సజ్జసంగటీ, జొన్న కూడూ దొరికితేనే అమృతం దొరికినట్టు అనిపించిన రోజులు. అందుకనే అన్నదమ్ముల కలహం మంచిది కాదని పల్నాటి చరిత్ర వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పుకొచ్చాడు.

అక్కణ్ణుంచి గోదావరీ మండలానికి వచ్చిన రోజులు అతని మదిలో ఇంకా నిన్న మొన్న గడిచినట్టే ఉన్నాయి. బెండపూడి అన్నయ మంత్రిని వెతుక్కుంటూ వచ్చాడు. ఒకప్పుడు మామిడి సింగనని వెతుక్కుంటూ వెళ్ళినట్టే. కాల ప్రవాహంలో రెండు బిందువుల్లాంటి సంఘటనలు. కానీ ఆ తొలిరోజుల శ్రీనాథుడు వేరు, ఈ మలిరోజుల శ్రీనాథుడు వేరు. అప్పుడు నైషధాన్ని శృంగార నైషధంగా తెలుగు చెయ్యాలనుకున్న రోజులు. ఆ తర్వాత రెండు దశాబ్దాలు గడిచిపోయాయి.  ఆ రాజ్యం, ఆ వైభవం, ఆ శాసనలేఖనాలు, ఆ విద్యాపరీక్షలు- ఆ కాలమంతా ఒక పొగలాగా కళ్ళముందే కదిలిపోయింది. పల్నాటిసీమనుంచి భీమఖండానికి బయల్దేరినప్పటి తను వేరు. ఆ రోజులు గుర్తొస్తే తనకి పదే పదే ఇద్దరు గుర్తొస్తున్నారు. ఒకరు వ్యాసుడు, ఆకలి బాధ తట్టుకోలేక, కాశీనగరాన్నే శపించడానికి పూనుకున్న ఆయన విహ్వల క్షణాలు. రెండవవాడు అగస్త్యుడు. ఒక బాధ్యత కోసం కాశీనగరాన్ని వదిలిపెట్టి వెళ్ళక తప్పనివాడు.

భీమఖండంలో అడుగుపెట్టాక తనకి తన జీవితం మొదటిసారిగా రెండుగా విడిపోయినట్టనిపించింది. ఒకటి ఆ భోగ జీవితం, రెండవది, తనని చిన్నప్పణ్ణుంచీ కూడా విడిచిపెట్టని శివానుగ్రహం. తన యవ్వనదినాల్లో తానెలాంటి శివపూజ చేసేవాడు. మామిడి సింగన్న అనేవాడు ‘అందరూ వట్టి పూజలు చేస్తారు. కాని నువ్వు పూజచేస్తుంటే అదొక పద్యం చెప్పినట్టు ఉంటుంది. నీది ఈశ్వరార్చన కళ’ అనే వాడు. ఆ రోజుల్లోనే పెదకోమటి వేముడు కాశీయాత్ర చేస్తూ తనని కూడా తీసుకువెళ్ళాడు. కాని కొండవీటిలో ఉన్నంతకాలం ఆ కాశి తనకి గుర్తురాలేదు. కాని ఆ శివుణ్ణి, తన ఆత్మలోతుల్లో సంచరిస్తున్న ఆ శివుణ్ణి తాను దక్షవాటికి వచ్చాక కదా మళ్ళా స్పష్టంగా చూడగలిగాడు. నిజమే, ఆ తొలిరోజుల్లోనే హరవిలాసం రాసాడు తాను. కాని గోదావరీ తీరానికి వచ్చినప్పుడు కదా, తనకి ఆ శివస్మరణ ఇచ్చే శక్తి ఎటువంటిదో తెలిసింది. ఆ గంగానది, ఆ త్రివేణి మలుపులు, ఆ దేవాలయం లోపలా, బయటా ఆ కక్ష్యలు, ఆ శ్రీవిశ్వేశ్వర జ్యోతిర్లింగం, ఆ కాశీపట్టణం అప్పుడు కదా తనకి నిజంగా కళ్ళముందు ప్రత్యక్షమయ్యాయి.

తను అధికారమధ్యంలో ఉన్నప్పుడు, చుట్టూ మనుషులు నీరాజనాలెత్తుతున్నప్పుడు తనకి శివుడు గుర్తురాలేదు. కానీ రాజ్యం, ఆశ్రయం, వైభవం పోగొట్టుకుని ఒక ఆశ్రితుడిగా, ఒక కాందిశీకుడిగా, మరొక దాతని వెతుక్కుంటూ వచ్చినప్పుడు, అప్పుడు చూసాడు తాను- మనుషులెలా ఉంటారో. ఒకప్పుడు తనని విద్యాధికారిగా అంగీకరించినవాళ్ళే ఇప్పుడు కాకుల్లాగా తన చుట్టూ చేరి బిగ్గరగా కూస్తుంటే తనని తాను సముదాయించుకుని మౌనంగా వుండిపోక తప్పలేదు. తాను గడిచిన తన జీవితం పొడుగునా ఎన్ని భాషలు విన్నాడు-అరబ్బీ, తురుష్కం, గజపతుల భాష, కర్ణాటం, గాంధారం, ఘూర్జరం, మలయాళం, శక, సింధు, సౌవీర, బర్బర భాషలు-ఎన్ని విన్నాడు. ఎన్ని భాషలు విన్నా దేశభాషల్లో తెలుగుని మించింది లేదని తెలుసు తనకి. కాని ఇక్కడి పండితులో! వీళ్ళు బావిలో కప్పలు. తెలిసింది తక్కువ, కాని ఆ కాస్తకే ఎంతో మిడిసిపాటు వాళ్ళకి. అసూయా గ్రస్తులు.  తాను విన్న ఏ భాషల్లోనూ చేరని వితండ భాష వాళ్ళది.  నిజంగా భాషాజ్ఞానం ఉన్నవాళ్ళు కొంతమంది తన పలుకుబడి చూసి గొప్ప తెలుగు కవి అన్నారు, మరికొంతమంది తన వాగ్వైదగ్ధ్యం చూసి తనది సంస్కృతం అన్నారు. ఎవరు ఏమనుకుంటే ఏమిటి, తనది నిజంగా చెవులకి ఇంపైన భాష అని సరిపెట్టుకున్నాడు.

ఇంతలో ఎవరో ‘కవిసార్వభౌములవారూ!’ అని పిలవడం వినిపించింది.  గోదావరి గట్టున కూచున్న శ్రీనాథుడు తలతిప్పి చూసాడు. ఆ కనుచీకటిలోనే వాళ్ళని గుర్తుపట్టాడు. రాజమహేంద్రవర పండితులు. ఒకప్పుడు దర్భలు మాత్రమే ధరించినవేళ్ళకి ఇప్పుడు మాణిక్యపుటుంగరాలు ధరించారు. నుదుటిన గోదావరి మృత్తికతో పెట్టుకున్న తిలకం మీదనే కస్తూరి తీర్చిదిద్దుకున్నారు. ఇప్పుడు వారి వక్షస్థలమ్మీంచి యజ్ఞోపవీతాలతో పాటు ముత్యాలహారాలు కూడా ఆ మసకచీకటిలో మెరుస్తున్నాయి.

ఒకప్పుడు తనకి డుమువులు తప్ప మరేమీ రావని ఈసడించినవాళ్ళు ఇప్పుడు తనన్ని కవిసార్వభౌముడని నోరారా పిలుస్తున్నారు.

ఆశ్చర్యమేముంది? ఈ దేశంలో రాజు గౌరవిస్తేనే పండితుడికి పాండిత్యమున్నట్టు. రాజు సత్కరిస్తేనే కవికి కావ్యం రాయడం చాతనయినట్టు. ఈ నేలని తలుచుకుని శ్రీనాథుడు మనసు మరోసారి నిట్టూర్చింది. ఇక్కడ పాలకుల్లోనూ రాజకీయ వైరాలే, పండితుల్లోనూ రాజకీయ వైరాలే.

ఆ పండితులు మరో అడుగు ముందుకేసి ‘అయ్యా, శ్రీనాథ కవిసార్వభౌములవారూ’ అని మరోసారి పిలిచారు.

ఇన్నాళ్ళూ తన తలవాల్చుకుని, తనని తాను తగ్గించుకుని గడిపిన ఆ రోజులు ఈ క్షణంతో పూర్తిగా అదృశ్యమైపోయాయని శ్రీనాథుడికి అర్థమయింది. దక్షిణాధీశుడి ముత్యాలశాలలో తాను దీనారటంకాలతో తీర్థమాడి వచ్చాక ఒక్కసారిగా వీళ్ళందరి దృష్టిలో తాను నిజంగానే సార్వభౌముడైపోయాడన్నమాట.

శ్రీనాథుడి పెదాలమీద చిరుమందహాసం కదిలిపోయింది. ఇదేమిటి, రాజ్యం అస్తమించాక ఈ కవి- ‘సార్వభౌముడు’ కాగలిగాడు అని అనుకున్నాడు.

ఆ పండితుల ముఖాల్లో సంకోచం, భీతి- ఇప్పుడు వాళ్ళు తనలో పూర్వపు శ్రీనాథుణ్ణి కాదు, వీరభద్రారెడ్డి విద్వాంసుణ్ణి చూస్తున్నారని గ్రహించాడు శ్రీనాథుడు. ఏమిటన్నట్టు వాళ్ళకేసి తలపంకించాడు.

‘ఈ భూమ్మీద మీలాంటి సత్కవులు మరొకరు లేరని నిండుసభలో మహారాజు తమతో అన్నారని విన్నాం. మిమ్మల్ని వారొక ప్రబంధం రాయమని అడిగారని కూడా విన్నాం’ అన్నాడు వారిలో ఒకడు. అతడి మాటల్లో వ్యంగ్యం లేదు, భక్తి, భయం పొంగిపొర్లుతున్నాయి.

శ్రీనాథుడు ఆ మాటలకేమీ సమాధానం చెప్పలేదు.

‘వట్టి ప్రబంధం కాదు. పూర్వమహాకవులందరినీ తమలోకి ఆవాహన చేసుకుని మరీ కావ్యం రాయమని అడిగారట కదా. వేములవాడ భీమకవి ఉద్దండలీల, నన్నయభట్టారకుని ఉభయవాక్ప్రౌఢి, తిక్కయజ్వకి సాధ్యమైన రసాభ్యుచితబంధం, ప్రబంధ పరమేశ్వరుడి సూక్తి వైచిత్రి-అన్నింటినీ  కలిపి మరీ ఒక కావ్యం రాసిమ్మని అడిగారు మహారాజని విన్నాం’ అని అన్నాడు మరొక పండితుడు.

‘ఈ గౌతమీ తీరంలో కవిసార్వభౌములవారిని చూస్తుంటే మరొక మహాకావ్య రచనకి మనసులో అంకురార్పణ జరుగుతున్నట్టుంది. అప్పుడు తమరు నైషధం సగంలోనే ముగించేసారు. ఇప్పుడు ఆ మిగిలిన కథ చెప్పబోతున్నారనుకుంటున్నాం’ అని అన్నాడు మూడవవాడు.

కానీ ఆ మాటలేవీ  శ్రీనాథుడి హృదయంలోకి ప్రవేశించకుండా, అక్కడి రావిచెట్లమీంచి వీస్తున్న సాయంకాలపు గాలుల్లో కలిసిపోతున్నాయి.

శ్రీనాథుడు ఏమి జవాబిస్తాడో అన్నట్టుగా ఆ పండితులు ఒకటి రెండు క్షణాలు అక్కడే నిలబడ్డారు. కానీ అతడేమీ మాట్లాడకపోవడం చూసి నెమ్మదిగా అక్కణ్ణుంచి వెళ్ళిపోయారు.

కంపిస్తున్న అడుగుల్తో అక్కణ్ణుంచి జారుకుంటున్న ఆ పండితుల్ని చూసి శ్రీనాథుడికి జాలి కలిగింది. ఒకప్పుడు వీళ్ళు తననెంత బాధపెట్టారు. అప్పుడిన్ని నీళ్ళు చేతుల్లోకి తీసుకుని వీళ్ళనీ, ఈ నగరాన్నీ, ఈ రాజ్యాన్నీ శపించాలని తనకెంతలా అనిపించిందో గుర్తొచ్చింది. కాని ప్రజల్నీ, నగరాల్నీ, సమాజాన్నీ శపించడం కవి ధర్మం కాదు, ఇంకా చెప్పాలంటే ఋషి ధర్మం కాదు అనుకున్నాడు. ఆ ఎరుక కలిగాకనే తాను భీమఖండం రాయగలిగాడు.

నిజమే, మహారాజు అడిగాడనే కాదు, తనకే మళ్ళా ఒక మహాకావ్యం రాయాలనిపిస్తున్నది. కాని తనని తాను నిరూపించుకోడానికి కాదు.  ప్రౌఢ నిర్భర వయః పరిపాకానికి చేరుకున్నాక ఒక కవి రాయగల కావ్యమెలా ఉంటుందో, భీమఖండంతోటే తాను చూపించాడు.

ఇప్పుడు తనముందున్నది కాశీనగరాన్ని శపించబోయిన వ్యాసుడు కాడు. లోకానికి మంచి చెయ్యడం కోసం అవసరమైతే కాశీనగరాన్ని వదిలిపెట్టి వెళ్ళక తప్పని అగస్త్యుడు. అగస్త్యుణ్ణి తలుచుకోగానే శ్రీనాథుడి కళ్ళల్లో సన్నని కన్నీటిపొర అల్లుకుంది. తాను కూడా అగస్త్యుడిలాంటివాడే అనుకున్నాడు. ఇన్నాళ్ళూ తాను పొట్టకూటికోసం రాజ్యం నుంచి రాజ్యానికి తిరుగుతూ వచ్చాడని తన గురించి తాను తక్కువగా అనుకున్నాడనిపించింది. లేదు, తాను రాజ్యాలకి అతీతమైన ఒక మహాసామ్రాజ్యానికి రాయబారిగా ఈ రాజ్యాలంతటా సంచరిస్తూ వచ్చాడు. తనకి తెలిసి ఏ ఒక్క పూర్వకవికూడా తాను తిరిగినంత దేశం తిరగలేదు. తాను చూసినన్ని రాజ్యాలు చూడలేదు. అలాగే తాను చూసినంత సంక్షోభమూ చూడలేదు. అలాగే తన కాలం నాటి ఏ ఒక్క కవి కూడా తాను చూస్తున్న  ఆనందకాననాన్ని దర్శించనూ లేదు.

కాశీని వదిలిపెడుతూ అగస్త్యుడు తాను బయటి కాశీని వదిలిపెడుతున్నాడేగానీ అదే సమయంలో తన లోపలి కాశీకి దగ్గరవుతున్నట్టుగా ఉందనుకున్నాడు. శ్రీనాథుడికి మొదటిసారిగా తనలోపలి కాశీనే ఇన్నాళ్ళుగా కవిత్వరూపంలో తన కూడా వస్తున్నదని అర్థమయింది. తాను చిన్నప్పుడు చదువుకున్న ఆ ముక్తకాలే తనలోని ఒక అవిముక్త క్షేత్రాన్ని తనకి పరిచయం చేసాయి. హాలచక్రవర్తి చూపించిన గోదావరి బయట ప్రవహిస్తున్న గోదావరి. దాన్ని పట్టుకుని ఇన్నాళ్ళకి తాను తన అంతర్వేదికి చేరుకోగలిగాడు.

తన ఎదట ప్రవహిస్తున్న గోదావరిని శ్రీనాథుడు ప్రేమగా, ఆప్యాయంగా, తల్లిని కనుగొన్న బిడ్డలాగా చూసాడు. తన గతించిన జీవితం నిజంగా గతించలేదనిపించింది అతడికి. అదే జీవితం, కానీ రూపు మారింది. ఇప్పుడిక్కడ రాజమహేంద్రవర పాలకుల్లో ప్రవహిస్తున్నది కూడా కుమారగిరి రెడ్డి వారసత్వమే. కాని స్వరూపం మారింది. కొండవీడులో ఆనాడు వసంతరాయలు చల్లిన ఆ కర్పూరపు తావినే ఇప్పుడిక్కడ రాణ్మహేంద్రవరంలో వీరభద్రారెడ్డి చేస్తున్న శివపూజాపరిమళంగా మారింది.

ఆ క్షణాన అతడికి వారణాసీ,  రాజమహేంద్రవరాలు రెండూ బింబ ప్రతిబింబాలుగా తోచాయి. అక్కడ గంగ, ఇక్కడ గోదావరి. అక్కడ శ్రీవిశ్వేశ్వర జ్యోతిర్లింగం, ఇక్కడ మార్కండేయేశ్వరమహాలింగం. అక్కడ అడుగడుగునా కోట్లాది లింగాలు. ఇక్కడ ఒక్కచోటనే కోటిలింగాలు. ఇది శీలోన్మూలక గోదావరీ తటం కాదు. జన్మచక్రాన్నే కూల్చివేసే చరమతీరం. తానింతదాకా జీవించింది ఒక ముక్తకంలాంటి పద్యమైతే ఇప్పుడు తాను అవిముక్తాన్ని చేరుకున్నాడు.

అగస్త్యుడు కాశీ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు చేతులెత్తి ‘ఆ మచ్చిక, ఆ చనువు, ఆ ప్రేమాతిశయం మాటల్లో చెప్పలేను’ అని విలపిస్తూ వెళ్ళిపోయాడు. కానీ తన భాగ్యానికి మేరలేదనిపించింది శ్రీనాథుడికి. ఏ జన్మలో ఏ భాగ్యమో తాను మాత్రం ఈ జన్మలోనే మళ్లా మరొక కాశీ చెంతకి చేరుకున్నాడు.

తాను దక్షారామంలో దక్షిణ కాశిని చూసాడు. కాని రాజమహేంద్రవరం సాక్షాత్తూ వారణాసిగా గోచరిస్తున్నది. తానిప్పుడు ఏ రాజునీ, ఏ మంత్రినీ, ఏ సెట్టినీ మెప్పించవలసిన పనిలేదు. ఎప్పుడో చిన్నప్పటి స్నేహితుడు చాలా ఏళ్ళ తరువాత పలకరించినట్టుగా దక్షారామంలో  శివుడు తనని పలకరించాడు. కాని అప్పటికి తన రక్తిజీవితపు వాసనలు తననింకా వదిలిపోలేదు. అందుకని అక్కడ ఆయన్ని సరిగ్గా గుర్తుపట్టలేకపోయాడు. ఇప్పుడిక్కడ ఆయన్ని పూర్తిగా పోల్చుకోగలుగుతున్నాడు. గుణనిధిలాగా తాను కూడా ఒకప్పుడు దారితప్పాడు. తిరగరాని దారుల్లో తిరిగాడు. కాని శివానుగ్రహం ఎంత సూక్ష్మం! తనని చివరికి ఇక్కడికెలా చేర్చింది!

లేకపోతే ఎక్కడి పెదకోమటి వేమారెడ్డి! ఎక్కడి అల్లాడరెడ్డి! ఎక్కడి వీరభద్రారెడ్డి! ఒకప్పుడు తను కూడా ఆజన్మ వైరులుగా భావించిన కుటుంబం దగ్గరికే మళ్ళా ఎవరు తీసుకొచ్చారు! నిజమే, కోమటివేమారెడ్డిలాగా, కాటయవేమారెడ్డిలాగా వీరభద్రారెడ్డి శాకుంతలం  పండితుడు కాడు, గాథాసప్తశతి ప్రేమికుడు కాడు. అయితేనేం, ఆ కావ్యానందాన్ని మించిన మహర్లోకం మరొకటి ఉందని తెలిసినవాడు. మొదటిసారిగా శ్రీనాథుడికి కాటయవేముడిపైనా, కోమటివేముడి పైనా జాలి కలిగింది. వాళ్ళు జీవించి ఉండగా తానిక్కడికి వచ్చి ఉంటే ఒక రససామ్రాజ్యంలో సంచరించి ఉండవచ్చునేమోగానీ, ఇప్పుడు తెరుచుకున్నట్టుగా ఈ శివసామ్రాజ్యం తలుపులు తెరుచుకుని ఉండేవి కావు.

శ్రీనాథుడు లేచి గోదావరిదగ్గరకి వెళ్ళాడు. నది పొడవునా స్త్రీలు వదిలిపెడుతున్న కార్తికదీపాలు. శ్రీనాథుడు ఆ దీపాలకు ప్రేమతో నమస్కరించాడు. తాను రాయవలసిన కావ్యానికి అవి దారిచూపుతున్నట్టు అనిపించింది. తాను రాయవలసిన పద్యాలు, సరిగ్గా ఆ క్షణాన్నే, తన మనసు పొలిమేరల్లో భాషావధూటి తనకి వినిపిస్తున్నట్టనిపించింది.


Featured image photography courtesy Mamunur Rashid via pexels.com

30-10-2026

11 Replies to “అవిముక్తం”

  1. శివానుగ్రహం ఎంత సూక్ష్మం! ఈ కార్తీక మాసపు ఉదయాన ఆ స్పర్శ నన్నెట్లా తాకిపోయిందో వెదుక్కునేలా చేసారు. కథ ఎన్నో లోకాల్లో తిప్పి తీసుకొచ్చింది. థాంక్యూ సర్.

  2. కార్తీకమాసం తొలి రోజు ఒక అద్భుత సాహిత్య చారిత్రక కథ అదీ దక్షిణ గంగ గోదావరీ తీరం అపర కాశి రాణ్మహేంద్ర పురంలో కవిసార్వభౌముని అంతరంగ తరంగ కురంగ గమనం . “ఈ దేశంలో రాజు గౌరవిస్తేనే పండితుడికి పాండిత్యమున్నట్టు. రాజు సత్కరిస్తేనే కవికి కావ్యం రాయడం చాతనయినట్టు.” ఈ వాక్యాలు కథకు ఆయువు పట్టు . కథలో శ్రీనాథుణ్ని మీరు ఆవాహన చేసుకున్న ఆనవాళ్లు కనిపించడం విశేషం .మీకు అభినందనలు.

    1. చాలా సంతోషం సార్! ఒక నెల అంతా ఈ కథ నా మనసులో వాక్యాలు వాక్యాలుగా పేరుకుంటూనే ఉంది.

  3. శివానుగ్రహం అంటే ఇది.. 🙏 కార్తీకమాస ఆరంభాన మీ ఈ కథ చదవడం. మాటల్లో పెట్టలేని అనుభూతి. ధన్యవాదాలండీ🙏🙏🙏

    కార్తీకమాస ఆరంభాన

  4. “ఈ దేశంలో రాజు గౌరవిస్తేనే పండితుడికి పాండిత్యమున్నట్టు. రాజు సత్కరిస్తేనే కవికి కావ్యం రాయడం చాతనయినట్టు. ఈ నేలని తలుచుకుని శ్రీనాథుడు మనసు మరోసారి నిట్టూర్చింది. ఇక్కడ పాలకుల్లోనూ రాజకీయ వైరాలే, పండితుల్లోనూ రాజకీయ వైరాలే.” – నాటికీ.. నేటికీ.. ఏనాటికీ.. ఈ కవి నిట్టూర్పులు ఆగిపోవేమో…

    “ఆ క్షణాన అతడికి వారణాసీ, రాజమహేంద్రవరాలు రెండూ బింబ ప్రతిబింబాలుగా తోచాయి. అక్కడ గంగ, ఇక్కడ గోదావరి. అక్కడ శ్రీవిశ్వేశ్వర జ్యోతిర్లింగం, ఇక్కడ మార్కండేయేశ్వరమహాలింగం. అక్కడ అడుగడుగునా కోట్లాది లింగాలు. ఇక్కడ ఒక్కచోటనే కోటిలింగాలు. ఇది శీలోన్మూలక గోదావరీ తటం కాదు. జన్మచక్రాన్నే కూల్చివేసే చరమతీరం. ” – అద్భుతః

    గోదావరి అంటే నాకొక ఎమోషన్ భద్రుడు గారు. అందులో శ్రీనాథుణ్ణి తీసుకొచ్చారు.. ఇంక హిస్టారిక్ ఫిక్షన్ నాకు చాలా ఇష్టమైన జెనర్. చాలా చాలా ఎమోషనల్ అయిపోయా కథ చదువుతూ.. ఈ సారి bplus కథాకళ వేదికలో అవకాశం వచ్చినప్పుడు ఈ కథ చదువుతాను.

    1. హృదయపూర్వక ధన్యవాదాలు సార్! మీ వంటి రసజ్ఞులు చదివినప్పుడే ఇటువంటి రచనలకు సార్థకత చేకూరుతుంది.

  5. హృదయపూర్వక ధన్యవాదాలు సార్! మీ వంటి రసజ్ఞుల్ని చేరుకున్నప్పుడే ఇటువంటి కథలకు సార్ధకత.

  6. కార్తీకమాసపుతొలిఉషోదయానమీరురాసినకధచదువుతున్నప్పుడుమొదటసాదాసీదాగాఅనిపించినతరువాతతొంభైఐదుపర్సెంటుచదువుతున్నప్పుడుతీవ్రఆనందానికికొంచెంసేపుభాధకిలోనయ్యాను…..శ్రీనాధుడ్నిమీకధలోచాలాగొప్పగాచూపించారు…నిజాన్ని….నిజంగా….పోస్టుచేయడంయాద్రుచ్చిఖంకాదు…..ఆశివునిఅనుగ్రహమే…గోదావరిఅలలుచూస్తున్నప్పుడుకానీ,స్నానానికి వెళ్ళినప్పుడు కాని,వచ్చేపుష్కారాలకువెళ్ళినపుడుకాని”గోదారి అలలు”లోమీ,కధ…..జీవితమంతాగుర్తుండిపోతుంది….ఎన్నిసార్లుచదివినామానసికోల్లాసాన్నికలిగిస్తుంది…….ముఖ్యంగాఆఅలలులోమీఅలఉండటం100కి100శాతంఅర్హతకలదే…..కార్తీకమాసము మొదటిరోజు నాకు చాలామంది భద్రులుదర్శనమిచ్చారు…అద్రుష్టం….నమస్కారములతో.

Leave a Reply