సి.వి.కృష్ణారావు శతజయంతి

సి.వి.కృష్ణారావుగారి శతజయంతి (1926-2026) చేస్తున్నాం అని రఘు శేషభట్టార్ చెప్పగానే ‘అప్పుడే వందేళ్ళా?’ అని ఆశ్చర్యపోయాను. ఎందుకంటే నిన్నమొన్నటిదాకా ఆ మహాశిఖరం పక్కనే మనమింకా తిరుగాడుతున్నాం. ఆ మానవుడూ, ఆయనతో మన సహవాసమూ ఎప్పుడో ముప్ఫై నలభై ఏళ్ళకిందటి ముచ్చట అయి ఉంటే, ఆయన ఒక సుదూర జ్ఞాపకంగా మారిపోయి ఉండి ఉంటే నాకు ఆశ్చర్యం కలిగి ఉండేది కాదు. కానీ,  ఇంకా మనమధ్యనే మసలుతున్నట్టుగా ఉన్న ఒక మనిషికి శతవసంతాలు పూర్తయ్యాంటే అది వినగానే అబ్బురపాటు కలగడం సహజం కదా.

మరో కారణం కూడా ఉంది. 2015 లో  ఆయన 90  ఏళ్ళు పూర్తిచేసుకున్నారన్న వార్త వినగానే ఆయన్ని చూడటానికి వెళ్ళాను. అప్పుడే రాసాను, ఒక మనిషి తొంభై ఏళ్ళు పైబడి జీవిస్తూ ఉన్నాడంటేనే ఆయన శతాయుష్కుడైనట్టే అని. ఆయన్ని కలిసి వస్తే నడుస్తున్న ఒక శతాబ్దాన్ని చూసి వచ్చినట్టుంది అనుకున్నాను.

కాని మొన్న మధ్యాహ్నం రవీంద్రభారతిలో మాలాంటి ఆయన శిష్యులూ, ఆయన కుటుంబసభ్యులూ కలిసి ఆయన్ని తలుచుకున్నప్పుడు ఆయనింకా అంతే వాత్సల్యంతో, అంతే ఉత్సాహంతో మన మధ్య సంచరిస్తూనే ఉన్నారని అర్థమయింది. కృష్ణారావుగారిలాంటి ఒక మహామనీషి శతజయంతి అంటే, అందరికన్నా ముందు, తెలంగాణా ప్రభుత్వం కదా ఒక పెద్ద సభ పెట్టి ఘనంగా నివాళి ఘటించవలసింది అని ముందు అనుకున్నాను.

ఎందుకంటే ఆయన పుట్టింది తెలంగాణా పల్లెలో అయినందువల్లమాత్రమే కాదు, మధ్యలో మూడేళ్ళు గుంటూరులో చదువుకున్న కాలమూ, రెండేళ్ళ పాటు తూర్పుగోదావరి జిల్లాలో పనిచేసిన కాలమూ మినహాయిస్తే ఆయన జీవితమంతా తెలంగాణాలోనే గడిచినందువల్ల మాత్రమే కాదు, తెలంగాణా దళిత, గిరిజన సంక్షేమానికే ఆయన జీవితమంతా అంకితం చేసినందువల్ల, ముఖ్యంగా. ఆయన రిటైరయ్యింది వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖకి డైరక్టరుగా కాబట్టి మూడు సంక్షేమశాఖల్లోనూ పనిచేసి ఆయా వర్గాల అభివృద్ధి పథం పైన ఆయనలాగా చెరగని ముద్రవేసిన మరొక అధికారి రెండు రాష్ట్రాల్లోనూ లేడు. అందుకని నిజానికి రెండు రాష్ట్రాలూ ఆయనకి నివాళి సమర్పించవలసి ఉంది కదా అనుకున్నాను.

పాతికేళ్ళ కిందట నేను ‘వందేళ్ళ తెలుగుకథ’ పుస్తకం వెలువరిస్తూ, అందులో నిజాం మీద ప్రజలు తిరగబడ్డ కాలానికి ప్రతినిధి కథగా కృష్ణారావుగారు రాసిన ‘నోటీస్’ కథ ఎంపికచేసాను. ఆ పుస్తకం  మీద ఒక సమీక్షకుడు తనకు తోచిందేదో రాస్తూ, తెలంగాణా పోరాటానికి ప్రతినిధిగా ఈ సంకలనకర్తకి ఒక ఆంధ్రారచయిత కథనే దొరికిందా అని సన్నాయినొక్కులు నొక్కాడు. అతనికి తెలియదు, కృష్ణారావు గారు పుట్టాడమే నైజాం పౌరుడిగా పుట్టాడనీ, ఆ కథ రాసిన రోజుల్లో ఆయన మీద నిజాం ప్రభుత్వం కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు విధించిందనీ! అంతే కాదు, ఆ సమీక్షకుడు ఎన్నడూ చూసి ఉండని, విని ఉండని, ఊహించడానికి కూడా అందని మారుమూల తెలంగాణా గిరిజనపల్లెల్లోనూ, దళితవాడల్లోనూ కృష్ణారావుగారు ఒక జీవితకాలం పాటు లక్ష బొటిమనవేళ్ళు చదువుతూ వచ్చాడని!

ఒక జాతిగాని,  సాహిత్యంగాని మహనీయులైన తన మార్గదర్శకుల్ని  మర్చిపోవడం చరిత్రలో కొత్తకాదు. మరీ ముఖ్యంగా, పీడితప్రజలకోసం తన జీవితంలో ప్రతి ఒక్కక్షణాన్నీ అంకితం చేసి కూడా, అద్భుతమైన సాహిత్యం సృష్టించి ఉండీ, తన కన్నా పిన్నవయస్కుల్ని కవులుగా దీవించడం కోసం తాను ఎల్లప్పుడూ వెనకబెంచీలోనే కూర్చున్న కృష్ణారావు గారి విషయంలో మరింత సహజం కూడా.  కేవలంసౌజన్యం వల్ల మాత్రమే ఆ వినయశీలి తన ఆధిక్యాన్ని ఉగ్గడించుకోలేదని తెలిసిన తర్వాత కూడా, ఆయన ప్రాపకంవల్లా, ఆశీస్సులవల్లా, నాబోటి వాళ్ళు విస్తృత ప్రపంచానికి పరిచయమై ఉండి కూడా ఆ ఉదారచరితుడి గురించి సమాజానికి తెలియవలసినంతగా తెలియలేదంటే, అది ఆయన లోపం కాదు. నాబోటి వాళ్ళ దోషం.

కాని మొన్న మధ్యాహ్నం జరిగిన శతజయంతి సభలో పాల్గొని వచ్చాక నాకు చాలా సంతోషం కలిగింది.  అధికారమూ, పదవీ, పేరుప్రతిష్ఠలూ, సాహిత్యంవల్లనో, సమాచారప్రసారసాధనాల వల్లనో తోటిమనుషుల మీద ఆధిపత్యం నెరపాలనే ఉబలాటమూ- వీటన్నిటికీ దూరంగా, కేవలం మనుషుల మీద ప్రేమ ఒక్కటే తన జీవితానికి చుక్కానిగా బతికిన అటువంటి మనిషిని తలుచుకోవలసిన తీరు అలాగే ఉండాలనిపించింది. ఆయన పట్ల ఎన్నటికీ తీర్చుకోలేని ఋణభారంతో అవనతశిరస్కులైన కొందరు కవులూ, ఆయన బిడ్డలు సరే, వారిబిడ్డలూ, వారి బిడ్డలూ కూడా కలిసి కృష్ణారావుగారిని తలుచుకున్న ఆ రీతి- ప్రభుత్వాలో, సాహిత్యసంఘాలో ఏర్పాటుచేసే సభలకీ లేదా పత్రికలు మొక్కుబడిగా రాయించే నివాళి వ్యాసాలకీ సాధ్యమయ్యేది కాదని మరీ మరీ బలంగా అనిపించింది.

‘తమ  మధ్య లేని ఒక మనిషిని తలుచుకోడానికి నలుగురు ఒకచోట చేరారంటేనే ఆ మనిషికి తాము చెల్లించవలసిన కృతజ్ఞతలింకా మిగిలిపోయాయని అర్థం’ అన్నాడు రఘు సమావేశం ప్రారంభిస్తూ. నిజానికి ఇది ఒక రఘుకి కలిగిన సంకల్పం. కాని ఆ సంకల్పశుద్ధి అమోఘం. అతడు ముందుకు  రాగానే ఆ సంకల్పాన్ని ప్రతి ఒక్కరూ ఆమోదించారు, అందిపుచ్చుకున్నారు.

‘ఆయన ఒక ఇంద్రధనుస్సు’ అన్నాడు నాళేశ్వరం శంకరం కృష్ణారావుగారి గురించి తలుచుకుంటూ. ఆ ఇంద్ర ధనుస్సు అనే మాట వినగానే నాకు నెల్సన్ మండేలా గుర్తొచ్చాడు. దక్షిణాఫ్రికాని వర్ణవివక్షనుంచి బయటపడేసిన తర్వాత ఆయన తన దేశం ఒక Rainbow Nation కావాలని కోరుకున్నాడు. కృష్ణారావుగారి సన్నిధి అటువంటి మంత్రకార్ముక సన్నిధి. శంకరంగారే తలుచుకున్నట్టుగా ఆయన దగ్గర వేదాల గురించీ కవిత్వం వినిపించేది, విప్లవాల గురించీ కవిత్వం వినిపించేది. ఒక మనిషి మాటల్లో కాదు, స్వభావంలో ప్రజాస్వామికుడైతేనే అటువంటి ఉమ్మడివేదిక సాధ్యపడుతుంది. ఇవాళ ప్రపంచం మాత్రమే కాదు, సాహిత్యం మాత్రమే కాదు, చివరికి సాహిత్యాన్ని పంచుకునే సమాచారసాధనాలు కూడా గోడలుగా చీలిపోయాయంటే దానికి కారణం కృష్ణారావులాంటి వ్యక్తులు మన మధ్య కనుమరుగైపోతుండటమే.

‘నువ్వు ఆయన ముందు ఒక కవిత చదివితే, ఆ కవితలో  తన బయోగ్రఫీ వెతుక్కునేవాడు ఆయన’ అన్నాడు సిద్ధార్థ ఆయన గురించి. ఎంత అద్భుతమైన మాట! ఒకప్పుడు తమ గురించి కవిత్వం రాసుకునేవాళ్ళని ఆత్మాశ్రయకవులనీ, సమాజం గురించి రాసేవాళ్ళని సామాజిక కవులనీ అనేవారు. కానీ గమనించారా? ఇప్పుడు ప్రతి ఒక్కరూ రాస్తున్నది ఆత్మాశ్రయ కవిత్వమే! ఎందుకని? ఎందుకంటే తమ బాధ ఏదో ప్రపంచం వినటంలేదనీ, వినిపించుకోడం లేదనీ మనుషులు మరింత బిగ్గరగా అరవడానికి కవిత్వాన్ని ఎంచుకుంటున్నారు కనుక. కానీ కృష్ణారావుగారి వంటి వ్యక్తికి ‘తనది’ అనేది ఏమీ లేదు, జీవితంలోనూ, సాహిత్యంలోనూ కూడా. అందుకనే ఏ వ్యథిత హృదయుడుగానీ, లేదా ఏ ఉల్లసిత మనస్కుడుగానీ ఒక  కవిత చదివితే  అది ఆయనకి తన జీవితకథలానే  వినిపించేది. ఎందరు ఎన్ని కవితలు చదివితే తాను అన్ని అనుభవాల్ని పోగేసుకుంటున్నట్టు. ఇప్పుడెక్కడున్నాడు అటువంటి శ్రోత?

వసుధైకకుటుంబీకుడైన ఆ మానవుడు తన కుటుంబసభ్యుల హృదయాల్ని కూడా ఎల్లల్లేని వసుధగా మార్చేసాడు. వారి కుటుంబీకులంతా కలిసి ఆయన మీద ‘నడక నావ’ అని ఒక పుస్తకం వెలువరించారు. ఆ పుస్తకాన్ని వరవరరావుగారితో కలిసి ఆవిష్కరించే భాగ్యం నాకు లభించింది.

అప్పుడు కూడా రాసాను – కొందరు సమాజాన్ని పట్టించుకునే తాపత్రయంలో తమ సొంత కుటుంబాన్ని నిర్లక్ష్యం  చేస్తారు. కొందరు సొంతకుటుంబాల్ని పైకి  తెచ్చుకునే క్రమంలో సమాజాన్ని పక్కనపెట్టేస్తారు. కాని కృష్ణారావుగారు ఈ రెండు దోషాలకూ పాల్పడలేదు.  మొన్న ఆయన కుటుంబసభ్యులు మాట్లాడినమాటల్లో ఆ విషయం మరోమారు అర్థమయింది.

సభలో ప్రారంభ  ప్రసంగం చేసిన మోహనరావుగారు నిజానికి కృష్ణారావుగారి అల్లుడు. కాని పెద్దకొడుకు మాట్లాడినట్టుగా  మాట్లాడేడు. కృష్ణారావుగారి తల్లి ఆయన శిశువుగా ఉండగానే కాలం చేసారు. అందుకని ఆయన మాతామహుడు  ఆ నిసుగుని తన ఒళ్ళో పెట్టుకుని ఆ ఊళ్ళో ఏ తల్లి తన బిడ్డకు పాలుపడుతుందా అని చూస్తూ ఉండేవాడట. అలా ఎందరో తల్లుల స్తన్యంతో ప్రాణం పోసుకున్నాడు కాబట్టే కృష్ణారావుగారు జీవితమంతా మనుషులకోసమే బతికాడు అని మోహనరావుగారు చెప్తున్నప్పుడు నాలో చెలరేగిన అనుతాపతరంగాన్ని నేను వర్ణించలేను.

నేను కూడా మాట్లాడేను. బహుశా చాలా సుదీర్ఘ ప్రసంగమే చేసినట్టున్నాను. కాని రఘు చెప్పినట్టుగా, ఎంత సేపు మాట్లాడినా, చెప్పుకోవలసిన ధన్యవాదాలు పూర్తిగా చెప్పుకోలేదన్న అసంతృప్తినే మిగిలిపోతుంది. నా ప్రసంగమంతా, నేను నా పదమూడో ఏట మా గిరిజన గ్రామంలో ఆయన మొదటిసారి అడుగుపెట్టిన ఆ దృశ్యం దగ్గరే ఆగిపోయాను. అప్పటిదాకా ఒక గ్రామాధికారి కొడుకుగా నేను చూస్తూ వచ్చిన రాజ్యస్వరూపాన్నీ, ఆధికారిక అంతరాల్నీ ఆ మొదటిసందర్శనలోనే ఆయనెలా తల్లకిందులు చేసాడో అదే చెప్తూ వున్నాను. బాస్టిలీ జైలు బద్దలుగొట్టిన ఫ్రెంచి విప్లవం లాంటిదేదో ఆ రోజు నా పసికళ్ళముందు సంభవించడం గురించి చెప్పాను. 75-76 నాటి సంగతి. సరిగ్గా యాభై ఏళ్ళు గడిచాయి. ఆ మొదటి సమావేశం గురించే నేను చెప్పవలసింది పూర్తిగా చెప్పనేలేదు, ఇక ఆ తర్వాత యాభై ఏళ్ళ మా అనుబంధం గురించి ఎప్పటికి పూర్తిగా చెప్పగలను?

నా ఉద్యోగ జీవితం పొడుగునా నేను కూర్చున్న ప్రతి ఒక్క కుర్చీ ఒక సాలభంజికలాగా నన్ను అడుగుతూనే ఉంది: నువ్వు కృష్ణారావుగారిలాగా ఉద్యోగం చెయ్యగలుగు తున్నావా అని. కాని మొన్న ఆయన గురించి మిత్రుల కలబోత విన్నతరువాత, అక్కడ మాట్లాడిన ప్రతి ఒక్క గొంతూ నన్ను రహస్యంగా ప్రశ్నిస్తూనే ఉన్నది: నువ్వు కృష్ణారావుగారిలాగా జీవించగలవా అని.

ఇన్నేళ్ళుగా నేను ఉద్యోగజీవితంలోనూ, సాహిత్య జీవితంలోనూ కూడా రెండు రకాల మనుషుల్ని చూస్తూ వచ్చాను. ఒక వర్గం వారున్నారు. వాళ్ళెప్పుడూ మనం ఏం చెయ్యాలో చెప్తుంటారు, ఫలానవాళ్ళు ఇలా చెయ్యలేదనీ, ఇలా చేసి ఉండవలసింది కాదనీ చెప్తుంటారు, తామైతే ఏమి చేసి ఉండేవారో కూడా చెప్తుంటారు. కాని చెప్పటమే, ఎంతసేపూ చెప్తుండటమే. తక్కెడలో ఒక సిబ్బె నిండా వాళ్ళే ఉన్నారు. ఇక కృష్ణారావుగారి లాంటి వాళ్ళున్నారు. వాళ్ళు ఏదీ చెప్పరు, చెప్తూ ఉండరు, చేస్తూ ఉంటారు, నడుస్తూ ఉంటారు, వింటూ ఉంటారు, మాటాడిస్తూ ఉంటారు, నోరుపెగలని వాళ్ళ పక్కన నిలబడి వెన్ను తడుతూ ఉంటారు, ఒక చాక్లెటో, కప్పు చాయ్ నో ఏది దొరికితే అది వారికిచ్చి వారి గొంతు సవరించుకునేలా చేస్తారు. నేను చూస్తున్న తక్కెడలో ఆ రెండో సిబ్బెలో కృష్ణారావుగారిలాంటి వాళ్ళని నేను పట్టుమని పదిమందిని కూడా చూడలేదు. అయితేనేం, నా కళ్ళముందు ఆ సిబ్బె ఎప్పటికీ బరువుతూగుతూనే ఉంది. భూమిని నిలబెడుతూనే ఉంది.

మొన్నటినుంచీ కృష్ణారావుగారు మళ్ళీ మరో వందేళ్ళ జీవితం మొదలుపెట్టారు.

6-7-2026

3 Replies to “సి.వి.కృష్ణారావు శతజయంతి”

  1. ఎవరు వింటారిక ముందు కవితలైనా, దళిత గిరిజన బాధలైనా? మళ్లీ ఎన్ని జన్మలకు చూడగలం ఇంతటి కర్మయోగి అయిన శ్రోతని! భద్రడుగారూ! దయచే సి కృష్ణారావుగారి జీవిత చరిత్ర రాయండి. వర్తమాన జెన్ జీలకే కాదు: భావి తరాలకు కూడా అది కరదీపిక అవుతుంది! 👌👍💐🙏🤝

  2. రాత్రి ఫణికుమార్ గారి గోదావరి కథలు వెతికి వెలికి తీసి చివరలో రాసిన ‘అడవి మనిషి’అని రాసిన అంతిమ వాక్యం చదివాను .మొన్నటి సమావేశపు సమాచారమంతటినీ కలుపుకుని నేను చూడలేకపోయిన మనిషిని చూసాను. పాల్గొనకపోయి వుంటే ఇక ఎన్నటికీ చూడలేకపోయే వాణ్ని . నా ఉద్యోగపర్వంలో ఆయన నీడల జాడలు వెదుకుతున్నాను. మీకు నమస్సులు.

  3. మనుషుల్ని ప్రేమించడం కూడా ఒక మహత్తర జీవన తత్వమని గుర్తు చేసిన గొప్ప నివాళి. సి.వి. కృష్ణారావు గారికి వినమ్ర నమస్సులు. 🙏

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading