కొన్ని కలలు కొన్ని మెలకువలు-1

నా బ్లాగుకి కొత్త మిత్రులు వస్తున్నందుకు వారికి హృదయపూర్వక స్వాగతం. ఈ రోజునుంచీ నా

‘కొన్ని కలలు కొన్ని మెలకువలు’ సీరియలైజు చెయ్యబోతున్నాను. 2005 లో వెలువడ్డ పుస్తకం చాలామంది ఉపాధ్యాయులు చదివారుగాని, విద్యారంగానికి బయట ఉన్నవారికి ఈ పుస్తకం చేరినట్టు లేదు. అందుకని రోజూ ఒకటి రెండు భాగాలు చొప్పున పంచుకోబోతున్నాను. ప్రతి రోజు తెలుగు అధ్యాయంతో పాటు ఇంగ్లిషు అనువాదం కూడా అందిస్తున్నాను.


1

న్యూ ఫౌండ్ లాండ్

1972 ఆగష్టు 25. అప్ప్పుడప్పుడే తెల్లవారుతోంది. ఎక్కడో తూర్పుగోదావరి అడవుల్లోని మా గ్రామం నుంచి నన్ను గుంటూరుజిల్లాలోని తాడికొండకు తీసుకు వెళ్లడానికి నా తండ్రి నన్ను వెంటబెట్టుకుని రైల్లో ప్రయాణిస్తున్నాడు.

నాకప్ప్పుడు తొమ్మిదేళ్లు. మా నాన్నగారికిగాని, నాకు గాని తాడికొండ ఎక్కడుందో తెలియదు. చాలామందికి కూడా అప్పటిదాకా అదొక అపరిచిత గ్రామం. అక్కడ ప్రభుత్వం కొత్తగా ఒక గురుకుల పాఠశాల తెరిచింది. ఆ ప్రవేశపరీక్షలో నేను ఉత్తీర్ణునయ్యానని మా నాన్నగారు నన్నందులో చేర్పించాలని తీసుకువెళ్తున్నారు.

అంత చిన్నప్పుడే నన్ను వదిలిపెట్టి ఉండటానికి మా అమ్మ ఎట్లా సిద్ధపడిందో తెలియదు. నేనెట్లా పోగలిగానో కూడా నాకు తెలియదు. ఆ రోజుల్లో అంత దూరానికి నన్ను పంపే స్తోమతు కూడా నా తండ్రికి లేదు. మా దారిఖర్చుల కోసం ఆ ముందు రోజే మా ఇంట్లో ఎప్పటినుంచో వస్తున్న వెండికంచం, మట్టుగిన్నెని తాకట్టుపెట్టారు. అంతదాకా మా ఊళ్లో ఉన్న పంచాయితీ సమితి ప్రాధమిక పాఠశాలలోనే చదివిన నాకు నేను వెళ్లబోతున్న స్కూలు ఎలా ఉంటుందో అక్కడ ఎవరుంటారో, పాఠాలు ఎలా చెప్తారో నాకేమాత్రం ఊహకి అందలేదు.

ఆ ముందురోజు రాత్రి నాన్నగారు అక్క దగ్గరికి తీసుకువెళ్లారు. అక్క అప్పుడు రాజమండ్రిలో సదనంలో చదువుకుంటోంది. ‘వీడికి సరిగ్గా గుడ్డలు తొడుక్కోవడమే రాదు. అక్కడ హాస్టల్లో ఒక్కడూ ఎలా ఉండగలుగుతాడో’ అంటున్న అక్క మాటలు ఇంకా చెవుల్లో మోగుతూనే ఉన్నాయి. పక్కన గోదావరి ప్రశాంతంగా ప్రవహిస్తూ ఉంది.

ఆ ముందునాటి సాయంకాలం నాన్నగారు రాజమండ్రిలో ఆయన స్నేహితు లొకాయన ఇంటికి తీసుకు వెళ్లారు. ఆయనుండేదొక మేడమీద గది. ఆ గదిలో విద్యుత్ బల్బు వెలుతురు.

అప్పటికింకా మా ఊళ్లో కరెంటు లేదు. సాయంకాలం కాగానే మా అమ్మ హరికెన్ లాంతరు చిమ్నీలు ముగ్గుబెట్టి తుడిచి దీపం వెలిగించి వీథరుగు మీద పెట్టి ఉంచేది. ఊరంతా అప్పటికే మాటు మణిగేది. ఇంటివెనుక కొండలమీంచి, అడవు లోంచి ఏవేవో పశుపక్ష్యాదుల అరుపులు మాత్రం వినబడేవి. ఆ వాతావరణం నుంచి వచ్చి ఉన్నవాణ్ణేమో ఎక్కడన్నా విద్యుత్‌బల్బుగాని, ఫ్లోరెసెంట్ వెలుతురుగాని కనబడితే ఆశ్చర్యంగా ఉండేది.

ఆ వెలుతురులో ఆ మిత్రుడొక కుర్చీలో కూచుని ఉన్నాడు. ఆయన ఎదురుగా పాఠశాల టేకుబల్ల. దాని మీద పుస్తకాలు, కాగితాలు, పెన్నులు, దయాల్ కంపెనీ ఇంకుబాటిలు. ఆ బల్లమీద గ్లోబు కూడా ఉంది. మా నాన్నగారు నన్నాయనకు పరిచయం చేసారు. నేను రెండు చేతులు జోడించి ఆయనకు నమస్కారం చేసాను. ఎవరన్నా అపరిచితులు మనకి పరిచయమైనప్పుడు మనమట్లా రెండు చేతులూ జోడించి నమస్కారం పెట్టాలనేది మా నాన్నగారు మాకు నేర్పిన పాఠాల్లో ఒకటి.

ఆ పెద్దాయన నన్ను చూసి మృదువుఆ నవ్వి నా వీపు మీద చేయి వేసి నిమిరాడు. ‘అయితే, పరీక్ష పాసయ్యి మంచి స్కూలుకి వెళ్తున్నావన్నమాట. నీగురించి మీనాన్నగారు నాకు ఉత్తరంలో రాసారు. నువ్వు బాగా తెలివైనవాడివట కదా’ అన్నాడాయన. నేనాయన మాటలు వింటున్నాను.

‘అయితే, నేన్నీకో పరీక్ష పెడతాను, పాసవుతావా?’ అని అడిగాడాయన. ఆయన ప్రశ్నకు జవాబుగా తలూపాను. పరీక్ష అంటే నాకెందుకంత సరదా ఉండేదో  ఆ రోజుల్లో. ఆ పసితనపు తొలిదినాల్లో ఏ పరీక్షనయినా పాస్ కాగలవని నాకెందుకంత నమ్మకం    ఉండేదో. అప్పుడాయన ఒక్క క్షణం పాటు ఏ పరీక్ష పెట్టాలా అని ఆలోచిస్తున్నట్టుగా అటూ ఇటూ చూసాడు. అప్పుడా గ్లోబుని చేతుల్తో ముందుకు జరిపి, ‘నీకు అక్షాంశ రేఖాంశాలు తెలుసా? ఖండాలు తెలుసా? మహాసముద్రాలు తెలుసా?’ అని అడిగాడు.

నేను తెలుసని జవాబు చెప్పేదాకా ఆగకుండానే ‘కాని నేనిప్పుడు నిన్ను వాటి గురించి అడగడం లేదు. న్యూ ఫౌండ్ లాండ్. అదీ ప్రశ్న. న్యూ ఫౌండ్‌లాండ్ ఎక్కడుందో తెలుసా? ఇదిగో ఈ గ్లోబు మీద చూపించు’ అని అడిగాడాయన. నేను నిశ్చేష్టుణ్ణయ్యాను. నేనంతదాకా ఆ పేరే వినలేదు. గ్లోబు మీద చూపించడం ఎలాగ?

అంతదాకా నా పసికళ్లల్లో కనిపించిన ఆత్మవిశ్వాసం ఆయన్ను అంతగా కవ్వించిందా? నా తండ్రి నామీదనుండే అపరిమితమైన నమ్మకంతో కుర్చీ మీద ముందుకు వంగి నా కేసే చూస్తున్నాడు.

నేను ఏం చెప్పను? నేను పుట్టిన ఊరొక గిరిజన గ్రామం. కరెంటుగాని, వార్తాపత్రికగాని, టెలిగ్రాఫ్, టెలిఫోన్ గాని లేని గ్రామం. అప్పటికి నాకు తొమ్మిదేళ్లు. నేనొక గ్లోబుని చూసి దాన్ని గ్లోబని గుర్తించగలగడమే గొప్ప విశేషమనుకొనవలసిన పరిస్ధితి. అప్పటికెన్నో సార్లు ఆయన మా ఊరుకి వచ్చి వెళ్లినవాడే. అయినా కష్టసాధ్యమైన ప్రశ్నే అడిగాడు.

కాని నా మౌనాన్ని అర్ధం చేసుకున్నవాడివల్లే నవ్వి, ‘ఇదిగో ఇక్కడ చూడు. ఈ ఉత్తరమెరికా ఖండానికి తూర్పువైపున, ఈ ఉత్తర అట్లాంటిక్ సముద్రానికి పశ్చిమ తీరంలో, ఇదిగో చూడు ఈ దీవిలాంటిదాన్ని’ అని చూపించాడు. ఆ పాతకాలపు గ్లోబు మీద ఆ విద్యుత్ బల్బు మసక వెలుతుర్లో నాకొక చిన్న చుక్క లాంటిది తప్ప మరేమీ కనిపించలేదు. అప్పుడు, ‘ భేష్, మీ పిల్లవాడు చాలా తెలివైనవాడు, బాగా పైకొస్తాడు’ అన్నాడాయన నా తండ్రితో.

తరువాత తరువాత అనిపించింది. ఆ సంఘటన నాకు రెండు అంశాల్ని సూచించిందని. ఒకటి, నేను నిజంగానే ఒక న్యూ ఫౌండ్ లాండ్ వైపు ప్రయాణించానని, జీవితగమనాన్ని సమూలంగా మార్చివేసే మహత్తరమైన ఘటనలన్నిటిలోనూ ఉండే అనిశ్చితి, ఉత్కంఠ, ఉద్వేగం నేనొక కొత్తపాఠశాలలో చదువుకోవడానికి వెళ్లడంలో కూడా ఉందన్నదానికి సంకేతప్రాయంగా ఆయనా ప్రశ్న అడిగాడని.

రెండవ అంశంలో ఆ ప్రశ్న మరింత సంకేత ప్రాయం. విద్యానుభవం దాని నిజమైన అర్ధంలో ఎప్పటికీ కొత్త భూమినీ, కొత్త భూమికనీ కనుగొనడమేనని. అది మన నిశ్చలనిశ్చితాల్ని ఎప్పటికప్పుడు తల్లకిందులు చేసే నవీనానుభవమని. నూతనాధ్యాయమని.

మనిషి తన కాళ్లకింద నేలకే చిరకాలంగా, మార్పులేకుండా అంటిపెట్టుకుని   ఉండిపోయి ఉంటే, అటువంటి పరిమితానుభవంతో తృప్తి చెంది పోయి ఉంటే అతడెప్పటికీ ఈనాటి స్ధానానికి చేరి ఉండేవాడు కాడు. మహాసముద్రాల్లో, వినీలాకాశంలో, అపారరోదసిలో అతడు దారులు వెతుక్కుంటూ పోయి ఉండేవాడే కాడు. అతడి ఆ జ్ఞానతృష్ణ వల్లే ఈ పురాతన పృథ్వి అతడికెప్పటికప్పటికి న్యూ ఫౌండ్‌లాండ్‌గా గోచరిస్తూ ఉంది.

2

తొలి ఉపాధ్యాయిని

రైలు మంగళగిరి వచ్చేటప్పటికి తెల్లవారింది. అంత పెద్ద రైలుస్టేషన్ నిర్మానుష్యంగా    ఉంది. నన్ను నా పాత జ్ఞాపకాలొక్కసారి ముసురుకున్నాయి.

ఉన్నత పాఠశాల విద్యకు నోచుకోని మా అమ్మ మా చదువుల కోసం ఎంతగానో తపించింది. ఆమె అనుక్షణం మా చదువు గురించే చెవిలో ఇల్లు కట్టుకుని పోరాడింది. మా ఊళ్లో మా పొరుగు కుటుంబం రిటయిర్డ్ హెల్తు ఇనస్పెక్టర్ గారిది. మా అమ్మ ఆయన్ను బతిమిలాడి మాకు ప్రైవేట్ పెట్టించింది. అందుకు ప్రతిఫలంగా ప్రతి సంక్రాంతికీ కొత్త పంచెల జత మా ద్వారా ఆయనకు సమర్పించేది. ఆయన తీర్చగా మిగిలిన తృష్ణని మా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయిని వజ్రమ్మ పంతులమ్మగారు పూరించేది.

మా ప్రాథమిక పాఠశాల చాలాకాలం గచ్చు పూర్తిగా పెచ్చులాడిపోయిన ఊరి రామకోవెల. మరి కొన్నాళ్ల పాటు విలేజి చావడి. అది ఎప్పుడు కూలిపోతుందో అన్నట్టుండేది. అటువంటి పాఠశాలమీద ఇంద్రచాపం విరిసినట్టుగా మా కొత్త పంతులమ్మగారు వచ్చేరు. ఆమెని చిత్రించాలంటే, ఆమె మా చిన్ని తలపుల్లో వికసింప చేసిన వెలుతుర్ని చిత్రించాలంటే చింగిజ్ అయిత్‌మాతొవ్ రాసినట్టుగా ‘తొలి ఉపాధ్యాయుడు’ లాంటి పుస్తకమే రాయవలసి ఉంటుంది.

ఆమె మా ఊళ్లోనే ఒక గిరిజన పెద్ద ఇంట్లో ఒక గదిలో అద్దెకుండేవారు. ప్రతి రెండవశనివారం, ఆదివారం మాత్రం రాజమండ్రి వెళ్లి వచ్చేవారు. ఆ మర్నాడు వచ్చే సోమవారం కోసం నేనెంతో ఇష్టంగా ఎదురుచూసేవాణ్ణి. ఎందుకంటే, అప్పుడామె తన వెంట కొత్త చందమామ తెచ్చేవారు. అందులో మహాభారతాన్ని చదివి వినిపిస్తారని ఆ ఎదురుచూపు. ఆమె క్రిస్టియన్. మాకు పాతనిబంధనలోని జోసెఫ్, అతని సోదరుల కథ కూడా చెప్పిందామె. మతాలకతీతమైన మానవత్వ పరిమళం ఆమెలోనే నేను మొదటిసారి చూసాను.

మా అన్నయ్య భద్రం నన్ను ఆమె ఇంటికి తీసుకువెళ్లాడొకసారి. ఆ గది క్రైస్తవ సన్యాసిని గదిలా ఉంది. గోడమీద ‘లాస్ట్ సప్పర్ ’ బొమ్మ. సాధారణ దైనందిన జీవితానికి అవసరమైన వస్తువులకన్నా అదనంగా మరే వస్తుసంచయం అక్కడ లేదు. సరళజీవనం, విరళ చింతనం అనేదెలా ఉండాలో ఇప్పటికీ ఆ గది నాకు దిశానిర్దేశం చేస్తూ   ఉంటుంది.

ఏదన్నా చదవాలనీ, తెలుసుకోవాలనీ మాకు కలిగే ప్రథమ కుతూహలాన్ని మా ఊరు చాలావరకు తనే తీర్చడానికి ప్రయత్నించింది. మా పొరుగు కుటుంబమైన హెల్తు ఇనస్పెక్టర్‌గారి పెద్దబ్బాయి శ్రీధర సత్యనారాయణమూర్తి దక్షిణమధ్య రైల్వేలో పనిచేస్తుండేవారు. ఆయన ఉద్యోగజీవితం ఎక్కువకాలం ద్రోణాచలం, గుంతకల్లు, అనంతపురాల్లో సాగింది. ఆ రోజుల్లో అంటే యాభయిల్లోనే ఆయన నెలనెలా భారతి కొని చదివి ఆ పత్రికను భద్రపరిచేవారు.

అడవిబాపిరాజు, విశ్వనాథ, పానుగంటిలక్ష్మీ నరసింహారావు వంటివారి రచనల్ని కూడా ఆయన కొనుక్కుని చదివి ఆ పుస్తకాల్ని తన తండ్రిగారి ఇంట్లో భద్రపరిచేవారు. అవికాక పంచాయితీ సమితి ద్వారా గ్రామగ్రంథాలయాలకు అందిన పుస్తకాల్లో కొడవటిగంటి రచనలు కూడా మాకు అందుబాటులోకి వచ్చాయి.

మేం కళ్లు తెరిచేటప్పటికే మా కోసమొక సాహిత్య భాండాగారం సిద్ధంగా ఉండేది. మా అక్క, మా అన్నయ్య, పొరుగింటి కృష్ణబాబాయి, శంకర్, విజయక్క అంతా మా వీథరుగు మీద కూచుని సాక్షి వ్యాసాల గురించీ, భారతిలో సాహిత్య చర్చల గురించీ మాట్లాడుకుంటుండేవారు. ఆ రోజుల్లో ప్రతి వేసవీ ఒక సాహిత్య చర్చగా సాగేది. అయినా నా తృష్ణ తీరేది కాదు.

నాకోసం మా అన్నయ్య తను రోజూ హైస్కూలు నుంచి వచ్చేటప్పుడు రాజవొమ్మంగి బ్రాంచి లైబ్రరీ నుంచి ఏదో ఒక పుస్తకం తెచ్చేవాడు. వాడు సాయంకాలం బస్సుదిగి ఇంటికి వచ్చేటప్పటికి నేనా పుస్తకాల కోసం ఎదురుచూస్తుండేవాణ్ణి. రాత్రి అందరూ నిద్రపోయాక బుడ్డి హరికెన్ లాంతరు వెలుతుర్లో ఆ పుస్తకాన్ని ముగించి మర్నాడు మా అన్నయ్య స్కూలుకి బయలు దేరే వేళకి అప్పగించేసేవాణ్ణి.

అలా చాలా పుస్తకాలు చదివాను. ‘మొగలాయి దర్బారు కుట్రలు’, నోరి నరసింహశాస్త్రి చారిత్రక నవలలు, తెన్నేటి సూరి ‘చెంఘిజ్ ఖాన్ ’, శ్రీనివాస సోదరులు రచించిన విజయ నగర చారిత్రక నవలలు, చిలకమర్తి ‘రాజస్ధాన కథావళి’.. ఒకటేమిటి, ఎన్నో పుస్తకాలు.

నాకు బాగా గుర్తున్న సంఘటన ఒకటుంది. మా అన్నయ్య నాకు ఎప్పుడూ పాత చందమామ కథలు చెప్పి ఊరించేవాడు. ముఖ్యంగా పరోపకారి పాపన్న కథలు. అవెక్కడ దొరుకుతాయంటే రాజవొమ్మంగిలో ఒక బట్టలషాపు షావుకారి దగ్గరున్నాయనీ, మనం ఆయన దగ్గరికే వెళ్లి చదువుకోవాలి గాని ఇంటికివ్వడనీ చెప్పాడు. చాలాకాలం పాటు అదొక కల నాకు. ఆ రోజుల్లో అయిదుమైళ్ల అవతల ఉన్న ఊరికి పుస్తకాలు చదువుకోవడం కోసమే వెళ్లడం అంత సులభసాధ్యం కాదు. అయినా మా అన్నయ్య దాన్ని సాధ్యం చేసాడు.

ఒక రోజు నన్ను వెంటబెట్టుకుని ఆ వస్త్రాల వ్యాపారి దుకాణానికి తీసుకు వెళ్లాడు. అతని పేరు మాడా వీర్రాజు. ఆయన కొన్ని షరతులు పెట్టి మరీ ఆ పాత చందమామల్ని తన దుకాణంలోనే కూచుని చదువుకునే షరతు మీద నా ముందు పెట్టాడు. ఆ రోజంతా నా మనసెక్కడికో తేలిపోయింది.

ఆ రోజు ఎలా గడిచిపోయిందో తెలియదు. మా అన్నయ్య స్కూలు విడిచి పెట్టగానే షాపుకి వచ్చి ‘పద, ఇంక బస్సు టైమయ్యింది’ అని చెప్పేటప్పటికి ఇంక ఒకటి రెండు చందమామలే మిగిలి ఉన్నాయి. అన్ని చందమామల్ని చదివిన ఆనందం ఒకవైపూ, అయినా ఇంకా ఒకటి రెండు మిగిలిపోయాయన్న విచారం మరొకవైపూ ముప్పిరిగొనగా బస్సు దారిపట్టాను. (ఇంకా ఉంది)


1

The New Found Land

August 25, 1972. The first light of dawn was just beginning to break. My father and I were already aboard a train, journeying from our village—tucked away somewhere in the forests of East Godavari—toward Tadikonda in Guntur district. I was nine years old at the time. Neither my father nor I truly knew where Tadikonda was; back then, it was an unfamiliar place to many. The government had recently opened a new residential school there. I had passed the entrance exam, and my father was taking me there to enroll. Looking back, I wonder how my mother found the strength to let me go at such a young age, or how I even managed to leave. During those days, my father did not have the financial means to send me so far away. To cover our travel expenses, my parents had to mortgage a silver plate and a bowl that had been in our family for generations. Up until then, I had only attended the local panchayat primary school, so I had no idea what this new school would be like, who would be there, or how the lessons would be taught.

The night before we left, my father took me to see my sister, who was studying in Rajahmundry. I can still hear her worried words: “He doesn’t even know how to dress himself properly. How will he manage alone in a hostel?”. Nearby, the Godavari River flowed peacefully through the night. That same evening, we visited one of my father’s friends who lived in a room on an upper floor that was lit by electricity. In those days, our village had no power. My mother would simply clean the chimneys of our hurricane lamps, light them, and set them on the porch as the village grew quiet, surrounded by the sounds of animals from the nearby hills and forests. Seeing an electric bulb or a fluorescent light felt like a wonder to me.

Inside that room, the friend sat at a teak table covered with books, papers, and a bottle of ink. There was also a globe on the table. When my father introduced me, I greeted him with folded hands, a lesson in politeness my father had always taught us when meeting strangers. The gentleman smiled, patted my back, and mentioned that my father had written to him about how smart I was. He then asked if he could give me a small test. In those early days, I had a strange, innocent confidence that I could pass any exam put before me. He pulled the globe toward him and asked if I knew about latitudes, longitudes, or continents, but before I could answer, he gave me the real challenge: “Newfoundland. That is the question. Do you know where Newfoundland is? Show it to me on this globe”.

I was completely stunned because I had never even heard that name before. I didn’t know how to find anything on a globe. Coming from a tribal village without electricity, newspapers, or telephones, simply recognizing the object as a globe was an achievement for a nine-year-old. My father watched me with intense trust, but I remained silent. Eventually, the friend laughed and pointed it out for me, showing a spot east of North America on the western coast of the North Atlantic. In the dim light of that old globe, it looked like nothing more than a tiny dot to me. He turned to my father and said, “Well done, your son is very intelligent. He will go far”.

Later, I realized that this moment was a symbol of my own life. I was truly traveling toward my own “New Found Land,” experiencing the same uncertainty and excitement that comes with any event that changes one’s life. I learned that true education is the constant discovery of new perspectives and new chapters that challenge what we think we know. If humans had always stayed tied to the same familiar ground, we would never have explored the oceans or the stars. It is only because of this thirst for knowledge that this ancient Earth continues to feel like a “New Found Land” to us every single day.

2

The First Teacher

By the time the train pulled into Mangalagiri, the sun had risen. The large station was deserted, and in that quietness, memories of the past began to crowd around me. I thought of my mother, who had never been able to attend high school herself but was deeply passionate about our education. She was constant in her efforts, always nagging and fighting to ensure we studied. In our village, our neighbor was a retired health inspector. My mother had pleaded with him until he agreed to give us private lessons; in return, she would present him with a pair of new dhotis every Sankranti.

Whatever thirst for knowledge he couldn’t quench was filled by Vajramma, our primary school headmistress. For a long time, our school was held in an old village temple where the floor was peeling away, and later in the village community hall, which always looked as if it were about to collapse. Into such a school, our new teacher arrived like a rainbow stretching across the sky. To truly describe her, and the light she kindled in our young minds, one would have to write a book like Chingiz Aitmatov’s The First Teacher. She lived in a rented room in the house of a tribal elder in our village. Every second Saturday and Sunday, she would travel to Rajahmundry, and I would wait for her return on Monday with great excitement. She always brought a new Chandamama magazine with her, and I looked forward to hearing her read the stories of the Mahabharata. As she was Christian, she also told us the story of Joseph and his brothers from the Old Testament. It was through her that I first experienced a scent of humanity that transcended religion.

My elder brother, Bhadram, once took me to her room. It felt like the cell of a Christian nun. There was a picture of “The Last Supper” on the wall, but otherwise, there wasn’t a single object beyond the bare necessities. That room remains a guide for me even today, showing me what it means to live simply and think deeply. My village did its best to satisfy my early curiosity to read and learn. Our neighbor’s eldest son, Sridhara Satyanarayana Murthy, worked for the South Central Railway and lived in places like Dronachalam and Guntakal. Since the 1950s, he had been buying and preserving Bharati magazines, along with the works of writers like Adavi Bapiraju, Viswanatha, and Panuganti. Through the Panchayat Samithi libraries, we also found the writings of Kodavatiganti. By the time I was old enough to notice, a literary treasure was already waiting for me. My sister, my brother, and our neighbors would sit on our porch discussing literary debates and essays from the magazines. Every summer felt like one long literary conversation, yet my own thirst was never quite satisfied.

Every day, my brother would bring a book for me from the branch library in Rajavommangi on his way home from high school. I would wait for him to get off the evening bus, grab the book, and finish reading it by the light of a small kerosene lamp late at night after everyone else had gone to sleep. I would hand it back to him the next morning just as he was leaving for school. In this way, I devoured countless books—historical novels, stories of the Mughal court, tales of Genghis Khan, and the history of Vijayanagara. One memory stands out clearly. My brother used to tempt me with stories of “Paropakari Papanna” from old Chandamama issues. He told me they belonged to a cloth merchant in Rajavommangi named Mada Veeraju, who wouldn’t let anyone take them home. For a long time, reading them was a dream, especially since the town was five miles away. But one day, my brother made it happen. He took me to the shop, where the merchant allowed me to sit and read on the condition that the magazines stayed in the store. That day, my mind drifted far away into those stories. I lost all track of time until my brother finished school and came to tell me it was time for the bus. I left with a heart full of joy for the stories I had read, but also a lingering sadness for the one or two magazines I hadn’t managed to finish. (to be continued)

7-7-2026

10 Replies to “కొన్ని కలలు కొన్ని మెలకువలు-1”

  1. true education is the constant discovery of new perspectives and new chapters that challenge what we think we know.

  2. నేను చదివిన మీ మొదటి పుస్తకం ఇదేనని నాకు గుర్తు. చాలా మందికి చదవమని ఇచ్చిన పుస్తకం కూడా ఇదే. నాకు చాలా ఇష్టమైన పుస్తకం.

    మళ్ళీ ఇప్పుడు ఇంగ్లీషులో కూడా చదువుతుంటే సంతోషంగా ఉంది సర్!

    ఈమధ్యనే మా మొండెంఖల్లులో 1వ తరగతి లో నాకు పాఠాలు చెప్పిన పంతులమ్మ గారి ఫోటో దొరికింది. వజ్రమ్మ గారి గురించి చదువుతుంటే మళ్ళీ మా పంతులమ్మ గారు జ్జప్తికి వచ్చారు.

  3. “న్యూ ఫౌండ్ లాండ్” incident కి మీరు ఇచ్చిన సంకేతార్థం మీ personal experienceని దాటి మానవ జీవితానికే అన్వయించి చెప్పిన ఈ మాటల్లో

    “మనిషి తన కాళ్లకింద నేలకే చిరకాలంగా, మార్పులేకుండా అంటిపెట్టుకుని ఉండిపోయి ఉంటే… మహాసముద్రాల్లో, వినీలాకాశంలో, అపారరోదసిలో అతడు దారులు వెతుక్కుంటూ పోయి ఉండేవాడే కాడు. అతడి ఆ జ్ఞానతృష్ణ వల్లే ఈ పురాతన పృథ్వి అతడికెప్పటికప్పటికి న్యూ ఫౌండ్‌లాండ్‌గా గోచరిస్తూ ఉంది.”

    ఒక చిన్న అనుభవానికి ఎంత wider meaning ఉండొచ్చో ఎంత గొప్పగా చెప్పారు. But it takes a special eye to see such deeper meaning in life’s simple moments.

    గురుకుల పాఠశాలకు బయలుదేరిన ఆ చిన్నారి మనసులోని excitement, uncertainty, curiosity ని కళ్లకు కట్టినట్టు చూపించారు.

    చదువు చెప్పించాలన్న మీ తల్లిదండ్రుల తపన,
    వజ్రమ్మ పంతులమ్మగారి ‘సరళ జీవనం, విరళ చింతనం’, ‘మతాలకు అతీతమైన మానవత్వం’,
    మీ మీద వారి lasting influence ఎంతో inspiring గా అనిపించింది, Sir.

    అలాగే మీ అన్నయ్యగారు, అక్కగారు, ఇరుగుపొరుగు స్నేహితులతో కలిసి ‘సాక్షి’ వ్యాసాలు, ‘భారతి’ పత్రికలోని సాహిత్య చర్చలు గురించి మాట్లాడుకోవడం గురించి చదువుతుంటే, మీరు ఎటువంటి సాహిత్య సాంగత్యంలో పెరిగారో అర్థమవుతోంది.

    ఆ చిన్న వయసులోనే అన్ని పుస్తకాలు చదవడం, పాత చందమామలు మీరు చదవడానికి మీ అన్నయ్యగారు చేసిన ప్రయత్నం, పక్కూరికి మీరు చేసిన ప్రయాణం చాలా ముచ్చటగా అనిపించింది.

    Very beautiful beginning to this series, Sir! 🙏🏽

  4. అమ్మయ్య ఇప్పుడు నాకు చందమామ చదువుతున్న ఫీల్. మీరే కాదు. నేనూ మా నాన్నగారి చెయ్యి పట్టుకుని వచ్చేస్తున్నాను. భలేగా ఉంది చదువుతూ ఉంటే.

  5. మీ న్యూ ఫౌండ్ ల్యాండ్.. మాకు మీ గురించిన మాకు తెలియని ఎన్నో కొత్త విషయాలు తెలుపుతూ మన మధ్య మరొక “న్యూ ఫాండ్ బాండ్” ఏర్పడుతోందని తెలుస్తోంది ఈ సిరీస్ లో మీ పుస్తకం మొదటి భాగం చదువుతుంటే.
    పుస్తకం శీర్షిక ‘కొన్ని కలలు కొన్ని మెలకువలు’ చాలా యాప్ట్ గా ఉంది. రెండు దశాబ్దాల క్రితం ప్రచురితమయిన పుస్తక మైనా.. ఏభై నాలుగేళ్ల క్రితం ప్రారంభమైన మీ “న్యూ ఫౌండ్ ల్యాండ్” ప్రస్థానమైనా.. నిత్య నూతనంగా అనిపిస్తోంది.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading