కొన్ని కలలు కొన్ని మెలకువలు-2

3

కొత్త ప్రపంచం

మేం ఆ పొద్దున్నే గుంటూరు బస్‌స్టాండ్‌లో తుళ్లూరు వెళ్లే బస్‌కోసం వెతుక్కు నేటప్పటికి నా మల్లే ఆ పాఠశాలలో ప్రవేశం దొరికిన మరి ఇద్దరు ముగ్గురు పిల్ల వాళ్లూ, వాళ్ల తల్లిదండ్రులూ కనబడ్డారు. పొద్దుట పదిగంటలవేళకి మేం తాడికొండ ఊరు బయట బేసిక్ ట్రయినింగ్ స్కూలు దగ్గరికి చేరేటప్పటికి అక్కడంతా ప్రారంభోత్సవ సంరంభంతో కలకల్లాడుతోంది.

నిలువెల్లా తెల్లని దుస్తుల్లో ధగధగలాడుతున్న నడివయసాయనొకరు చొక్కాకు బాడ్జితో చాలా హడావిడిపడుతూ కనిపించారు. సాధారణ కార్యకర్తగా కనిపించిన ఆయన చాడా సాంబశివరావు. కెమిస్ట్రీ ఉపాధ్యాయులు. ఆయన్ని అంతా సి.ఎస్.రావు అని పిలిచేవారు. ఆ తరువాత దాదాపు ఏడాదిన్నరపాటు ఆ పాఠశాలని సమగ్ర సంస్ధగా నిలబెట్టడానికి ఆయనే పునాదిరాయి.

ఆయన ప్రమేయం లేకుండా, ఆయన ఆజ్ఞల్లేకుండా, ఆయన అనునయం లేకుండా ఆ పాఠశాలలో ఒక్కరోజు కూడా గడిచేది కాదు. దేశ విద్యా చరిత్రలోనే నూతన ప్రయోగంగా ప్రారంభించబడ్డ ఆ పాఠశాల ఎలా నడవాలో, దాని రూపు రేఖలు ఏ విధంగా ఉండాలో ఎవరికీ కూడా తెలియని ఆ అస్పష్ట ప్రాచీదిశలో, తన ముందు మరే నమూనా లేని కొత్త ప్రయత్నాన్ని కేవలం తన జీవశక్తితో ముందుకు నడిపించిన మనిషి ఆయన.

మేం వెళ్లగానే సరాసరి ఆయన్నే కలిసామో, లేక ఆయనే మమ్మల్ని చూసి తనకై తాను ఎదురేగి పలకరించాడో గాని మాకు కొత్త స్థలానికి వచ్చిన బెరుకుగాని, తెలియనితనంగాని ఒక్క క్షణం కూడా కలుగలేదు. అక్కడేదో మాకు వసతి చూపించారు. కావడానికి అది ఉన్నతపాఠశాలే అయినప్పటికీ ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుల్ని ప్రిన్సిపాల్ అనే వ్యవహరించేవారు, ఆయన పేరు కందాళై శేషు అయ్యంగార్. ఆయన సాయంకాలం తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి ఆ పాఠశాల ఏర్పాటు నేపథ్యాన్ని వివరించారు. తమ పిల్లల భవితవ్యాన్ని పాఠశాల కప్పగించి తల్లిదండ్రులు నిశ్చింతగా ఇంటికి వెళ్లిపోవచ్చన్నారు.

ఆ మధ్యాహ్నం నా పేరు అడ్మిషన్ రిజిష్టర్‌లో రాయించడానికి మా నాన్నగారు క్యూలో నించుని నన్నక్కడ ఓ గదిలో కూచోబెట్టారు. నేనా గది కిటికీ పక్కన కూచున్నాను. ఆ కిటికీలోంచి వర్షాకాలపు గ్రామసీమ కనిపిస్తూ ఉంది. దూరంగా ఎలక్ట్రికల్ హై టెన్షన్ పవర్ లైను, పసుపుపచ్చని గడ్డిలాగా అల్లుకున్న పంటపొలాలు, వర్షాకాలపు తేమ ఇంకా వీడని ఆకాశం మధ్యాహ్నపు వేళల పల్లెల నిశ్శబ్ధం అక్కడ సుదూరానికీ వ్యాపించి కనిపిస్తున్నాయి. నా మనసునొక చెప్పలేని భావన అల్లుకుంది.

నేను బయలుదేరినప్పటి కుతూహలం స్ధానంలో ఏదో బరువైన భావన నెమ్మదిగా చోటుచేసుకుంటూ ఉంది. ఆ రాత్రి అక్కడొక డార్మిటరీ అరుగు మీద నా తండ్రి పక్కన పడుకున్నాను. ఆయన తన చిరునామా రాసిన అరడజను పోస్టుకార్డులు నా చేతిలో పెట్టి వారం వారం ఉత్తరాలు రాయమని చెప్పారు.

నాకోసం పండ్లపొడి, సబ్బు, తువ్వాలు వంటి దైనందిన సామగ్రిని వేరు వేరుగా నా ట్రంకుపెట్టెలో పెట్టి నాకు ప్రతి ఒక్కదాన్నీ విడివిడిగా చూపించి చెప్పవలసిన జాగ్రత్తలన్నీ చెప్పారు. ఎప్పుడు నిద్రకమ్ముకొచ్చిందో ఆయన మాటలు వింటూనే నేను నిద్రలోనికి జారిపోయాను.

మెలకువ వచ్చేటప్పటికి ఇంకా తెల్లవారని వేళ. ఇంకా కనుచీకటి వేళ ఎవరో పిల్లలందర్నీ నిద్ర లేపుతున్నారు. డ్రిల్లు మాస్టరు విజిల్ వినిపిస్తోంది. ఎవరా డ్రిల్లు మాస్టరు? సి.ఎస్.రావుగారే, తెల్లని మిలటరీ నిక్కరులో, కాన్వాసు షూస్‌తో ఆయన విజిల్ ఊదుకుంటూ పిల్లల్ని గ్రౌండ్‌కి రమ్మని పిలుస్తున్నారు. నాకు నా కొత్త జీవితం మొదలయిపోయిందని ఒక్కసారిగా అర్ధమయింది.

మా నాన్నగారు అప్పటికే నిద్రలేచి ముఖం కడుక్కుని సంచీ సర్దుకుంటున్నారు. తల్లిదండ్రులెవరూ ఇంక స్కూల్లో ఉండవద్దని, వీలయినంత త్వరగా వెళ్లిపొమ్మని ఎవరో మరీ మరీ అభ్యర్ధిస్తున్న స్వరంతోనే ఆజ్ఞాపిస్తున్నారు. నేను నా తండ్రిని చూసుకుని పలకరించేలోపే ఎవరో నా చేయి పట్టుకుని గ్రౌండ్ వైపు లాక్కుపోయారు.

నాన్నగారితో మాట్లాడటానికే కుదరలేదు. ఆయన్ని సరిగ్గా చూసినట్లు కూడా లేదు. ఆయన నా వైపొకసారి, ఆ మీదట ఆ పాఠశాల మెయిన్ గేటు వైపు నడుచుకుంటూ వెళ్లిపోతున్న దృశ్యం. ఆ మెయిన్‌గేటు ఎదురుగా చిన్నపాటి హరిత ఛాయ కూడా లేని రెండు కొండలు, నిశ్చలంగా, స్ధిరంగా, ఓదార్పుగా, బాసటగా..

తలచుకున్నప్పుడల్లా ఆ దృశ్యాన్ని నాకు చెకోవ్ కథ ‘స్టెప్సీ’ గుర్తొస్తుంది. చెకోవ్ గురించిరాయాలంటే ఆయన తన స్టెప్పీ కథలో వాడిన శైలి వంటి శైలి కావలసి ఉంటుందన్నాడు గోర్కీ. గరిక పచ్చ మైదానం గుండా సాగిన సుదీర్ఘ ప్రయాణం అనంతరం ఆ కథలో కధానాయకుడైన బాలుడు ఎగోర్‌ని పాఠశాలలో వదిలిపెట్టి అతని మావయ్య వెళ్లిపొయ్యే ఆ చివరి దృశ్యమే నాకు పదేపదే గుర్తొస్తూంటుంది. అందులో ఎగోర్‌కి అనిపించినట్టే నాకు కూడా ఆ క్షణంతో నా బాల్యం, అంతదాకా నేను జీవించిన ప్రతీదీ, నాకు చేరువగా ఉండిన ప్రతిదీ పొగలాగా కనుమరుగయినట్టే అనిపించింది.

అతనికి అనిపించినట్టే నాకు కూడా అపరిచితంగా ఉన్నదేదో, కొత్తదేదో నా ముందు విప్పారుతున్నట్టుగా అనిపించింది. ఆ కథను ముగిస్తూ ఆ కథకుడు ప్రశ్నించినట్టే నేను కూడా ప్రశ్నించుకున్నాను. ‘ఆ కొత్తదేదో ఏ విధంగా ఉండి ఉండవచ్చు?’ అని. 

4

ఇద్దరు ‘ఫాదర్ ఫిగర్స్

మారుతున్న ప్రపంచానికి అవసరమైన విద్యావిధానం రూపుతెన్నులేని విధంగా ఉండాలో పరిశీలించాలని యునెస్కో 1972లో విద్యాకమిషన్‌ని ఏర్పాటు చేసిన సంవత్సరమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాడికొండలో బాలుర గురుకుల పాఠశాలని ప్రారంభించడం యాదృచ్ఛికమే కావచ్చు. కాని ఆ రెండింటి లక్ష్యమూ విద్యని అందరికీ అందుబాటులోకి తెస్తే చాలదనీ, విద్యాలక్ష్యాలను పునర్నిర్వచించుకోవాలనీ కూడా విద్యాకమిషన్ అన్నది.

సాధారణంగా విద్య గురించి చర్చ మూడు అంశాల చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. కొఠారి కమిషన్ నివేదిక రూపకల్పనలో ప్రముఖ పాత్ర వహించిన ప్రసిద్ధవిద్యావేత్త జె.పి.నాయక్ ఆ మూడు అంశాల్నీ ‘క్వాంటిటీ, క్వాలిటీ, ఈక్విటీ’ అన్నాడు.

క్వాంటిటీ విద్యా సౌకర్యాల భౌతికవిషయాలకు సంబంధించిన అంశం. అందరికీ విద్యని అందుబాటులోకి తీసుకురావాలంటే అందరికీ పాఠశాలలు తెరవ వలసి ఉంటుంది. ఆ పాఠశాలల్లో అవసరమైన అన్ని సౌకర్యాల్నీ, భవనాల్నీ, బోధనాభ్యసన సామగ్రినీ సమకూర్చవలసి ఉంటుంది.

భారతదేశం లాగా జనాభా వేగవంతంగా అభివృద్ధి చెందే దేశంలో కేవలం క్వాంటిటీ అంశాల మీదనే మొత్తం శక్తి సామర్థ్యాలను వెచ్చించినా ఇంకా ఎంతో కొంత కొరత మిగులుతూనే ఉంటుంది. ఇక క్వాలిటీ పాఠశాలల్లో అందవలసిన విద్య గుణాత్మకంగా ఉండటాన్ని సూచిస్తుంది. అది సుశిక్షితులైన ఉపాధ్యాయులూ, ఉత్తమబోధనాపద్ధతులూ, చక్కని అభ్యసనప్రక్రియలూ, నిరంతర మూల్యాంకనం వంటి వాటి ద్వారా సాధ్యపడే విషయం.

చివరగా, ఈక్విటీ అనేది ఉత్తమ విద్య అన్ని సామాజిక వర్గాలకూ సమానంగా అందడానికి సంబంధించిన విషయం. సాధారణంగా ఉత్తమ గుణాత్మక విద్య అనేది పట్టణ ప్రాంతాలకూ అధిక ఆదాయవర్గాలకూ మాత్రమే సాధ్యపడే సౌకర్యం. వారి కోసమే పబ్లిక్ స్కూళ్లు, ఇంగ్లీషు మీడియం పాఠశాలలు పనిచేస్తుంటాయి. గ్రామ ప్రాంతాల్లో, అది కూడా అల్ప ఆదాయవర్గాలకు చెందిన కుటుంబాల నించి వచ్చే పిల్లలకు స్ధానిక సంస్ధలు నడిపే పాఠశాలలు వాటి అరకొర సౌకర్యాలతో తమకు చాతనైన విద్యను అందించవలసి ఉంటుంది.

గ్రామాల్లో నడిచే పాఠశాలలు సరయిన సౌకర్యాలు లేనందువల్లా, సరయిన మేలయిన బోధనాపద్ధతుల్ని పాటించే అవకాశాల్ని పొందలేకపోతాయి. అందువల్ల వాటిలో గుణాత్మక విద్యకు అవకాశాలు తక్కువ. ఎప్పుడయితే, ఆ పాఠశాలలు మెరుగైన విద్యను అందించడంలో విఫలమవుతాయో వాటివల్ల వివిధ సామాజిక వర్గాల మధ్య విద్యాపరమైన అసమానతలు చోటు చేసుకుంటాయి.

మన సమాజాల్లో ఉపాధికల్పనలో ప్రధానపాత్ర వహించేది విద్య కాబట్టి విద్యాపరమైన అసమానతలు ఉపాధి అసమానతలుగా, ఆదాయ అసమానతలుగా పరిణమిస్తాయి. తిరిగి అవి ఆయా ఆదాయవర్గాల పిల్లలకు అందే విద్యను కూడా అసమానం చేస్తాయి. ఈ విధంగా ఇదొక విషవలయంగా పనిచేస్తుంది.

అసమానతలు అసమానతల్ని పెంచి పోషించే ఈ విషవలయాన్ని ఎక్కడో ఒక చోట ఛేదించాలనే సదుద్దేశ్యంతో గురుకుల పాఠశాలలు ప్రయోగానికి అంకురార్పణ జరిగింది. మొదట్లో గుంటూరు జిల్లాలో తాడికొండలో, నల్గొండజిల్లాలో సర్వేల్‌లో, అనంతపురం జిల్లా కొడిగెనహళ్లిలో ఈ పాఠశాలలు ప్రారంభించబడ్డాయి. గ్రామీణ ప్రాంతాలకు చెందిన అల్పాదాయ వర్గాల కుటుంబాలకు చెందిన ప్రతిభా వంతులైన విద్యార్ధుల్ని వెలికి తీసి వారికి ఉత్తమ విద్యని అందించే లక్ష్యంతో అవి ప్రారంభమయ్యాయి.

సమితి స్ధాయిలో ఒకటి, తిరిగి జిల్లాస్ధాయిలో ఒకటి, మొత్తం రెండు ప్రవేశ పరీక్షల ద్వారా అయిదవ తరగతిలో ముఫ్పై అయిదు మందితో, ఎనిమిదవ తరగతిలో వందమందిని ఎంపిక చేసి వారికి ప్రవేశాన్నిచ్చి ఆ పాఠశాలలు ఆ ఆ పిల్లలకు పూర్తి ఉచిత విద్యను అందించడం మొదలుపెట్టాయి. అనతికాలంలోనే రాష్ట్ర విద్యా చరిత్రలో ప్రముఖ స్ధానానికి ఎదిగిన గురుకుల పాఠశాలల తొలితరం విద్యార్ధిగా ఆ విధంగా నేనొక న్యూ ఫౌండ్‌లాండ్‌లో అడుగుపెట్టాను.

మేం ఆ పాఠశాలలో చేరగానే మొదటి రోజులు నిజానికి మరే ధ్యాసా లేనంత ఉత్సాహంతో, పనితో గడిచిపోయాయి. మేం ఆగస్టులో 25న చేరామా, సెప్టెంబర్ 5వ తేదీ ఉపాధ్యాయ దినోత్సవం పెద్ద ఎత్తున జరిపారు. అందులో నేనొక ఏకపాత్ర అభినయం చేసాను.

అది కొర్రపాటి గంగాధరరావు రాసిన ‘సామ్రాట్ అశోక’ ఏకపాత్ర. కళింగ యుద్ధానంతరం అశోకుడి పశ్చాత్తాపాన్ని ప్రతిఫలించే స్వగతం అది. దాన్ని మా ఊళ్లో విలేజి లెవెల్ వర్కర్‌గా పనిచేస్తుండే సంగాని హనుమంతరావుగారు మా అన్నయ్యకు నేర్పుతుండగా చూసి నేను కూడా నేర్చుకున్నాను.

ఆ ఏకపాత్ర అభినయిస్తానని చెప్పగానే సి.ఎస్.రావుగారి ఉత్సాహానికి మేరలేదు. ఆయన స్వయంగా నాకు మేకప్ చేసి వేదికనెక్కించారు. నా ఉత్సాహానికొక వేదిక దొరికిందనిపించింది. నేను ఇంటికి దూరంగా ఉన్నానని గాని, నా వాళ్లెవ్వరూ నాకు దగ్గరలో లేరని గాని నాకు అనిపించలేదు.

మా పాఠశాల దైనందిన కార్యక్రమమే అలా ఉండేది. పొద్దున్నే నాలుగన్నర గంటలకి నిద్రమేలుకొలుపు. దాదాపు గంట పాటు వ్యాయామం ఉండేది. ముందొక అరగంటపాటు స్కూల్ కేంపస్ చుట్టూ పరుగు. ఆ తరువాత కొన్ని బ్రీతింగ్ ఎక్సర్ సైజులు. కొన్ని డ్రిల్లు టేబిల్స్, చాలా రోజుల పాటు మాకు సి.ఎస్.రావుగారే డ్రిల్ మాష్టర్. ఆయన వ్యాయామం జరుగుతుండగానో, లేదా అయిపోతుందనే సమయంలోనో గట్టిగా రకరకాలుగా అరిపించేవారు. వాటిని ‘ఎల్’ లు (కూతలు)  అనేవారు.

ఆయన అట్లా ఎల్ పెట్టి అరుస్తుండగా ఆయన వెనక మేం కూడా అలా ఎల్ లు అరుస్తూండటం వింతగా, హుషారుగా ఉండేది. కొన్ని ఎల్‌లు ఇప్పటికీ గుర్తున్నాయి నాకు. ‘చిగిలిగి చిగిలిగి చౌచౌచౌ / బొమ్మిలిగి బొమ్మిలిగి బౌబౌ బౌ / చిగిలిగి బొమ్మిలిగి చౌచౌచౌ / బొమ్మిలిగి బొమ్మిలిగి బొమ్మిలిగి బౌ బౌ బౌ / చౌ చౌ చౌ’ అనేది అట్లాంటి ఒక సుదీర్ఘమైన ఎల్.

ఆ తరువాత గంటసేపు పర్సనల్ టైం. మా కాలకృత్యాలకోసం. అది పూర్తి కాగానే గ్లాసు పాలు తాగి పొద్దుటి పూట పర్యవేక్షణ పఠనానికి తరగతి గదులకు హాజరయిపోయేవాళ్లం.

దాదాపు ఎనిమిదిన్నరకి బ్రేక్ ఫాస్ట్ విరామం. అరగంట పాటు ఉండే ఆ విరామంలో రోజుకో రకం టిఫిన్ పెట్టేవారు. టిఫిన్ తర్వాత మళ్లా పాలు. కొన్నాళ్లు పాలు, కాఫీ కూడా ఉండేవి. అది పూర్తయిన తర్వాత మార్నింగ్ స్కూల్ అసెంబ్లీ. దాదాపు పదిహేను నిమిషాల పాటు నడిచే ఆ అసెంబ్లీ ఆ స్కూలు దినచర్యలో చివరి దాకా కూడా అతి ముఖ్యకార్యక్రమం. ఆ రోజు చెయ్యవలసిన కార్యక్రమాలకి ఆ అసెంబ్లీలోనే దిశానిర్దేశం లభించేది.

కాలం గడిచేకొద్దీ అందులో రకరకాల ప్రయోగాలు కూడా చేపట్టబడ్డాయి. సాధారణంగా ఆ అసెంబ్లీలో ముందు జాతీయగీతాలాపన తర్వాత, మా పాఠశాల గీతం ఉండేది. మొదటి రోజుల్లో మేం అలపించే గీతాన్ని మా తెలుగు మాష్టారు రాళ్లబండి కృష్ణమూర్తిగారు రాసారు. ‘ఇదియే గురుకుల విద్యావనము, నవ్వెడు పూవుల నందనవనము’ అనే అత్యంత సాత్త్విక మృదుభరిత గీతమది.

ఆ మాష్టారు ఎంత నెమ్మది మనిషో మేం పాడేటప్ప్పుడు ఆ గీతం కూడా అంత నెమ్మదిగానూ నడిచేది. దాదాపు రెండేళ్ల తరువాత ఆ గీతం స్ధానంలో ‘నవ్వుల పువ్వుల కిలకిల్లాడే చక్కని చిక్కని గురుకులం, సమతా మమతా సమభావంతో చల్లగ సాగే గురుకులం’ వచ్చింది. దాన్ని మా మరొక తెలుగు మాష్టారు పాతకోట రాధాకృష్ణమూర్తిగారు రాసారు. ఆయన ‘భాగమతి’ అనే కావ్యం కూడా రాసారు. ఆ గీతాలాపన తర్వాత వార్తలు, కొన్ని ఆనౌన్స్‌మెంట్లు.

అసెంబ్లీ అయిన తర్వాత తరగతులు మొదలయ్యేవి. ఒంటిగంటన్నరదాకా పాఠ్యబోధన. మధ్యాహ్న భోజనం మరొక ముఖ్య కార్యక్రమం. ఎందుకంటే, అప్పుడు    ఉపాధ్యాయులు కూడా మాతో పాటే వర్కింగ్ లంచ్ తీసుకునేవారు. సి.ఎస్.రావుగారి ఏర్పాటు ప్రకారం ప్రతి పదిమంది విద్యార్ధులతో పాటు ఒక ఉపాధ్యాయుడు కూడా కలిసి భోజనం చెయ్యాలి.

మొదట్లో మాకు డైనింగ్ టేబుల్స్ లేవు. అంతా కింద కూచునే భోజనం చేసేవాళ్లం. ఆ తరువాత టేబిల్స్ వచ్చాక కూడా ఆ ఏర్పాటు అలానే కొనసాగింది. మేం నేర్చుకున్న విద్యలో ఎక్కువభాగం అలా ఉపాధ్యాయులతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు వారితో మాట్లాడటం ద్వారా నేర్చుకున్నదే.

మధ్యాహ్న భోజనం అయిన తర్వాత ఒకటి రెండు తరగతులు నడిచాక మళ్లా కామన్ యాక్టివిటీ కార్యక్రమాలుండేవి. సాయంకాలం నాలుగున్నర నుంచి దాదాపు ఆరుగంటలదాకా ఆటలూ, క్రీడలూ, ఆ తర్వాత కొద్దిసేపు పర్సనల్ టైం అయిన తర్వాత సాయంకాలం అసెంబ్లీ ఉండేది.

ఆ తరువాత ఎనిమిదింటిదాకా పర్యవేక్షణ పఠనం. రాత్రి భోజనం అయిన తర్వాత మళ్లా తొమ్మిదిన్నర దాకానో పదిగంటలదాకానో మళ్లా సెల్ఫ్ స్టడీ. అప్పటికే విపరీతంగా నిద్ర ముంచుకొచ్చేది. ఎప్పుడు వెళ్లి పక్కమీద వాలదామా అనిపించేది. నిద్రకుపక్రమించగానే ఇంతలో మళ్లా డ్రిల్లుమాస్టర్ విజిల్ చప్ప్పుడు వినిపించేది. ఇంతలోనే కదా పడుకున్నాం. అప్పుడే లేపేస్తున్నారేమిటి అనిపించేది.

మేం వెళ్లిన మూడేళ్ల దాకా కూడా అక్కడ సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉండేవి. డార్మిటరీల్లో పడుకోవడానికి కేవలం చాపలు మాత్రమే ఉండేవి. బాత్ రూమ్‌లు, టాయిలెట్లు ఉండేవి కావు. కొళాయిల ద్వారా నీటిసరఫరా ఉండేది కాదు. అప్పట్లో తాడికొండ ఇరవైవేల జనాభా గ్రామం. అంత జనాభాకి రెండే బావులు మంచినీటి అవసరాన్ని తీర్చవలసి ఉండేది. నీటి ఎద్దడి మాకు విపరీతంగా ఉండేది.

పాఠశాలకు చాలినన్ని తరగతి గదులు కూడా ఉండేవి కావు. బేసిక్ ట్రయినింగ్ స్కూలు పాత భవనమొకటి నాలుగ్గదులతో ఉండేది. దానిలోనే అయిదవ తరగతి సెక్షన్ ఒకటి, ఎనిమిదవ తరగతి సెక్షన్లు మూడూ నడిచేవి.

నెమ్మది నెమ్మదిగా మాకు ఇంటిమీద బెంగ కలగడం మొదలయ్యింది. కొందరు పిల్లలు ఎవరికీ చెప్పకుండా రాత్రి పూట బయటకి పారిపొయ్యేవారు. వాళ్లని ఎవరో ఒకరు తిరిగి తీసుకువచ్చి పాఠశాలకి అప్పగించేవారు. ఆ అరకొర సౌకర్యాల్లో, ఆ ఇబ్బందుల్లో మేం మా ఇంటినుంచి దూరంగా ఉండగలగడానికి శక్తి నిచ్చింది ఏది? నేననుకుంటాను మా ఉపాధ్యాయులతో సాన్నిహిత్యమేనని.

మాకు సౌకర్యాలంటూ ఏమీ లేవు కనుక మేం మా కొరతను, లేమిని ఆ ఉపాధ్యాయుల సాన్నిహిత్యంలో మరవడానికి ప్రయత్నించాం. వాళ్లల్లో ప్రతి ఒక్కరి పట్లా నేనూ, నాలానే ప్రతి ఒక్కరూ అపరిమితమైన ప్రేమని పెంచుకున్నాం. ఆ ప్రేమ ఎటువంటిదంటే మా సోషల్ స్టడీస్ మాస్టారు ఏ కారణం చేతనో మూడు నాలుగు రోజులు స్కూలుకి సెలవు పెట్టారు. ఆయన్ని మూడు నాలుగు రోజుల పాటు చూడకపోయేటప్పటికి నాకు కలిగిన బెంగ అంతా ఇంతా కాదు. ఆయన తిరిగి స్కూలుకి రాగానే పరుగెత్తుకుని వెళ్లి ఆయన ఎదట నిలబడ్డాను. ఆయన చిరునవ్వుతూ ‘హౌ డూ యూ డూ’ అని అడిగేప్పటికి నాకు మాట పెగలక కన్నీళ్లు జలజలా వొలికాయి.

ఆ రోజుల్లోనే ఆ పాఠశాలలోకి మా ఆర్ట్ మాష్టారు వారణాసి రామ్మూర్తి గారు ప్రవేశించారు. ఆయనే గాని లేకపోయుంటే నా ఆ చిన్నారి హృదయం ఇంటి మీది బెంగతో ఎండిపోయుండేది. ఆ చిన్ని గుండెకొక రసార్ద్రతని అందించాడాయన. ఆయన నన్నెందుకంతగా ప్రేమించాడో నాకు తెలియదు. నన్ను  ఒక్కరోజు చూడక పోయినా తల్లడిల్లిపోయేవాడు.

మా ‘ఎ’ డార్మిటరీకి అనుకుని ఉండే చిన్ని యాంటీరూమ్‌ని ఆయన స్టూడియోగా వాడుకునేవాడు. ఆయన కాల్చి పారేసిన బీడీపీకలతో ఆ స్ధలమంతా అస్తవ్యస్తంగా ఉండేది. కాని ఆ అశుభ్రస్థలం నాకెంత ప్రియాస్పదంగా ఉండేదని!

మా ఊరు గుర్తొచ్చినప్పుడు, మా అమ్మ గుర్తొచ్చినప్పుడు, మా చెల్లెళ్లు గుర్తొచ్చినప్పుడు ఆ యాంటీరూం కిటికీ దగ్గర తారట్లాడేవాణ్ణి. ఆయనేదో రేఖాచిత్రాన్నో, వర్ణచిత్రాన్నో గీస్తుండేవాడల్లా  ఆ కిటికీ పక్కన నా నీడ కదలాడగా ఒక్క ఉదుటున బయటకు వచ్చి నన్నా గదిలోకి తీసుకుపోయేవాడు. నా చిన్ని చుబుకాన్ని పట్టుకుని ‘ఏం నాన్నా, ఏం కావాలి?’ అని అడిగేవాడు.

పసితనపు చిన్నారి హృదయం మీద ముద్రలు వేసే ‘ఫాదర్ ఫిగర్స్’ ఆ ఉపాధ్యాయులే అనుకుంటే వారిలో సి.ఎస్.రావుగారు ఒక సభ్యతకీ, ఆర్ట్ మాస్టారు మరొక సభ్యతకీ నాకు ప్రతినిధులుగా కనిపించేవారు.

సి.ఎస్.రావుగారు శక్తికీ, సామర్ధ్యానికీ, పరిపాలనాదృఢత్వానికీ, శాసన స్వభావానికీ ప్రతినిధి. దేన్నైనా భౌతికంగా చేసి చూపించగలగడానికి, దేనికైనా సమర్ధుడాయన. కాని అదే ఆయన బలహీనత కూడా. ఆధారిటీ ద్వారా మాత్రమే తన శక్తుల్ని అభివ్యక్తీకరించగలిగే నేతలకు ఆయనొక ప్రతీక.

పనిచేసేటప్పుడు ఆయనొక కార్యకర్త. నిజమే. నేతగా ఉంటూ కార్యకర్తగా జీవించడంలోని థ్రిల్‌ని ఆయన అనుక్షణం అనుభవిస్తుండేవాడు. ఆయన పాఠశాల వదిలివెళ్లిపోయినప్పుడొక ఉపాధ్యాయుడు ఆయన్ని ‘వజ్రాదపి కఠోరాని, మృదూని కుసుమాదపి’ అన్నాడు. ఆయన హృదయం అందరికీ అందుబాటులో ఉన్నట్టే అనిపించినా దాని మాడు పగలగొట్టుకుని దానిలో ప్రవేశించగలవారు అరుదు.

రామ్మూర్తిగారు అందుకు భిన్నం. ఆయన నిజమైన కళాకారుడు. టాగోర్ మాటల్లో చెప్పాలంటే ‘వర్కర్స్ పారడైజ్‌లో పొరపాటున ప్రవేశించిన కళాప్రియుడు’. బాహ్య జీవిత ప్రమాణాల ప్రకారం అసమర్ధుడు. ఏమీ చెయ్యలేనివాడు. చాతకానివాడు. పాలనా సామర్ధ్యం మాట అలా ఉంచి పిల్లల్ని గట్టిగా అదిలించడం కూడా చాతకాని వాడు. అతడు నేత కాడు. కనీసం కార్యకర్త కూడా కాడు. కాని నిజమైన మనిషి.

అతని హృదయం ఎప్పుడూ తలుపులు తెరిచి ఉండే పూలతోట. నిజానికి ఆ తోటకి తలుపులున్నాయనడం కూడా నిజం కాదు. ఆ నా పసితనంలో ఈ ఇద్దరు ముఖ్యవ్యక్తులూ నాలోని రెండు పార్శ్వాల్ని పైకి జాగృతం చేసారు. నా జీవితమంతా ఆ రెండు విరుద్ధ పార్శ్వాల్నీ సమన్వయించుకుంటూండటంతోనే గడిచిపోయింది.  


3

A New World

That morning at the Guntur bus stand, as we searched for the bus to Thullur, we came across two or three other children who, like me, had gained admission to the school, along with their parents. By the time we reached the Basic Training School on the outskirts of Tadikonda around ten o’clock, the place was bustling with the excitement of the opening ceremony.

A middle-aged man in shimmering white clothes, wearing a badge on his shirt, caught our eye as he bustled about. He appeared to be a simple worker, but he was actually Chada Sambasiva Rao, the Chemistry teacher. Everyone called him C.S. Rao. For the next year and a half, he would be the foundation stone that built the school into a complete institution.

In those early, uncertain days when no one knew how a school that was a new experiment in the nation’s educational history should run or what it should look like, he was the man who drove the project forward through sheer life force, without any prior model to follow. Nothing happened in that school without his involvement, his orders, or his encouragement.

Whether we went directly to him or he saw us and came forward to greet us, I don’t recall, but we never felt a moment of hesitation or the typical shyness of being in a new place. We were shown to our accommodations. Although it was a high school, the head of the institution was referred to as the Principal; his name was Kandālai Sēshu Ayyangar. That evening, he held a meeting with the parents, explaining the background of the school’s establishment and assuring them that they could return home without worry, leaving their children’s future in the school’s hands.

That afternoon, while my father stood in a queue to enter my name into the admission register, he sat me down in a room. I sat by the window, looking out at the monsoon countryside. In the distance, I could see high-tension power lines, Fields spread out like a carpet of yellow grass, and a sky that hadn’t yet let go of its seasonal moisture. The silence of a rural afternoon stretched across the horizon. A feeling I couldn’t quite describe began to wrap itself around my heart.

The excitement I had felt when we started our journey was slowly being replaced by something heavy. That night, I slept beside my father on the porch of a dormitory. He placed half a dozen postcards, already addressed to him, into my hand and told me to write to him every week.

He showed me each item in my trunk—the tooth powder, soap, and towels—giving me all the necessary instructions and precautions. I drifted off to sleep while still listening to the sound of his voice.

I woke up before dawn. In the fading darkness, someone was already waking the children. I heard a drill master’s whistle. Who was the drill master? It was C.S. Rao again, in white military shorts and canvas shoes, blowing his whistle and calling the students to the ground. I realized all at once that my new life had truly begun.

My father was already awake, washing his face and packing his bag. A voice, both pleading and commanding, urged the parents to leave as soon as possible. Before I could even greet my father properly, someone grabbed my hand and led me toward the ground.

I didn’t even get a chance to speak with him. I barely even got a good look at him. I only saw the image of him walking toward the main gate, glancing back at me once. Beyond that gate stood two hills, devoid of even a shade of green—still, steady, and offering a silent kind of support.

Whenever I recall that scene, I am reminded of Chekhov’s story, The Steppe. Gorky once said that to write about Chekhov, one would need a style similar to the one Chekhov used in The Steppe. That final scene, where the young boy Yegor is left at school by his uncle after a long journey across the green plains, haunts me. Just like Yegor, I felt at that moment that my childhood, everything I had lived until then, and everyone close to me was vanishing like smoke.

And like him, I felt something unknown and new unfolding before me. As the narrator asks at the end of that story, I asked myself: “What will that new thing be like?”

4

Two ‘Father Figures’

It was perhaps a coincidence that the Andhra Pradesh government launched the boys’ residential school in Tadikonda in 1972, the same year UNESCO appointed an education commission to examine the future of education in a changing world. The commission emphasized that making education accessible was not enough; the very goals of education needed to be redefined.

Discussions on education typically revolve around three pillars: Quantity, Quality, and Equity—a framework famously proposed by the educator J.P. Naik.  

Quantity is an aspect related to the physical dimensions of educational facilities. To make education accessible to everyone, schools must be opened for all. In those schools, all necessary facilities, buildings, and teaching-learning materials must be provided.

In a country like India, where the population is growing rapidly, even if all energy and capabilities are spent solely on quantitative aspects, some shortage or deficit will still remain. On the other hand, quality in schools signifies that the education provided must be qualitative. This is achievable through well-trained teachers, excellent teaching methods, effective learning processes, and continuous evaluation.

Finally, Equity is a matter concerning the equal accessibility of quality education to all social classes. Generally, high-quality education is a privilege accessible only to urban areas and high-income groups. Public schools and English medium schools operate exclusively for them. In rural areas, schools run by local bodies—with their meager facilities—must provide whatever education they are capable of to children coming from low-income families.

Because schools operating in rural areas lack proper facilities, they miss out on the opportunities to adopt proper, high-quality teaching methods. Consequently, the opportunities for qualitative education in them are low. Whenever these schools fail to provide better education, it gives rise to educational inequalities among various social groups.

Since education plays a primary role in generating employment in our societies, educational inequalities eventually turn into inequalities in employment and income. In turn, these income inequalities, also make the education imparted to the children of those respective income groups unequal. In this manner, it functions as a vicious cycle.

With the noble intention of breaking this vicious cycle where inequalities breed and sustain further inequalities at some point, the seed was sown for the experimental Gurukulam schools. Initially, these schools were started in Tadikonda of Guntur district, Sarvail of Nalgonda district, and Kodigenahalli of Anantapur district. They were launched with the objective of scouting talented students belonging to low-income families from rural areas and providing them with the finest education.

By conducting two entrance exams—one at the Samithi, block, level and another at the district level—they selected thirty-five students for the fifth class and one hundred students for the eighth class. Upon granting them admission, those schools began providing completely free education to those children. Having stepped in as a first-generation student of these Gurukulam schools, which rose to a prominent position in the state’s educational history in a very short time, I thus set foot into a ‘New Found Land’.

Our early days were filled with such excitement that we had little time for anything else. Just days after I joined on August 25th, we celebrated Teacher’s Day on September 5th with great fanfare. I performed a monologue as “Emperor Ashoka,”.

That was ‘Samrat Ashoka’, a monologue written by Korrapati Gangadhara Rao. It was a soliloquy reflecting Ashoka’s remorse after the Kalinga War. I learned it by watching Sangani Hanumantha Rao, who was working as a Village Level Worker in our village, teach it to my elder brother.

C.S. Rao was so enthusiastic that he personally applied my makeup and led me to the stage; in that moment, I felt I had found a platform for my passion and no longer felt the sting of being away from home.

Our daily routine began at 4:30 AM with an hour of physical exercise, including runs around the campus and breathing exercises. C.S. Rao acted as our drill master in those days, leading us in rhythmic, spirited chants known as “Yells”. I still remember the long, strange cadence of one: “Chigiligi chigiligi chouchouchou / Bommiligi bommiligi bouboubou / Chigiligi bommiligi chouchouchou / Bommiligi bommiligi bommiligi bou bou bou / Chou chou chou”. It felt strange yet exhilarating to shout these after him.

Following exercise, we had personal time, a glass of milk, and supervised morning study. Breakfast was served around 8:30 AM, with a different snack every day, followed by milk or coffee. The morning assembly was the heart of our day, where our tasks were briefed to us and the school song was sung.

As time passed, various types of experiments were also undertaken in it. Generally, in that assembly, the national anthem would be sung first, followed by our school song. In the initial days, the song we used to sing was written by our Telugu teacher, Rallabandi Krishnamurthy Garu. It was a deeply serene and gentle song that went, ‘Idiye Gurukula Vidyavanamu, Navvedu Poovula Nandanavanamu’ (This is the garden of Gurukulam, a garden of smiling flowers). Just as that teacher was an incredibly calm person, the song would also flow just as calmly and gently when we sang it.

After about two years, that song was replaced by ‘Navvula Puvvula Kilakillade Chakkani Chikkani Gurukulam, Samatha Mamatha Samabhavamtho Challaga Saage Gurukulam’ (The beautiful and closely-knit Gurukulam chirping with smiling flowers, the Gurukulam that moves along pleasantly with equality, affection, and harmony). It was written by our another Telugu teacher, Pathakota Radhakrishnamurthy Garu. He had also written a poetic work titled ‘Bhagamathi’. After the singing of that song, there would be news and a few announcements.

After the assembly, classes would begin. Instruction went on until one-thirty. The afternoon lunch was another important program. Because back then, the teachers also used to have working lunch along with us. As per the arrangement made by C.S. Rao, one teacher joined every group of ten children at the dining table.

In the beginning, we did not have dining tables. We all used to sit on the floor and eat. Later on, even after the tables arrived, that arrangement continued in the same way. A major part of the education we learned was acquired through those informal talks with the teachers while having lunch with them.

After the lunch, following one or two classes, there would be common activity programs again. From four-thirty in the evening until almost six o’clock, there were games and sports, followed by a brief period of personal time, after which the evening assembly took place.

Following that, supervised reading  went on until eight o’clock. After dinner, there was self-study again until nine-thirty or ten o’clock. By then, extreme sleepiness would wash over us. We would just feel like going and collapsing onto the bed. No sooner had we fallen asleep, it felt as though we could already hear the drill master’s whistle blowing. It felt like we had only just gone to sleep, and we wondered why they were waking us up so soon.

Facilities were sparse during those first three years. We slept on mats in dormitories, and there were no proper toilets or running water. Tadikonda was a village of twenty thousand people served by only two wells, making water scarcity a constant struggle.

The school did not even have a sufficient number of classrooms. There was an old Basic Training School building with four rooms. In that small structure, one section of the fifth class and three sections of the eighth class were run.

Slowly, we began to feel homesick. Some children would run away at night without telling anyone. Someone or the other would bring them back and hand them over to the school. In those meager facilities and through those hardships, what gave us the strength to be able to stay away from our homes? I believe it was the close bond and intimacy with our teachers.

Since we had no facilities whatsoever, we tried to forget our shortages and deprivation in the closeness of those teachers. I, and everyone else just like me, developed a boundless love for each and every one of them. To give you an idea of what that love was like—our social studies teacher went on leave from school for three or four days for some reason. Not seeing him for those three or four days brought me an immense amount of anxiety and longing. The moment he returned to school, I ran and stood right in front of him. When he smiled and asked, ‘How do you do?’, words failed me, and tears streamed down my face.

It was during those very days that our art teacher, Varanasi Ramamurthy Garu, joined the school. Had he not been there, my tender little heart would have withered away from homesickness. He brought a soothing, emotional tenderness to that small heart. I do not know why he loved me so deeply. Even if he didn’t see me for a single day, he would feel completely restless and anguished.

He used a small room attached to our dormitory as a studio, a space often cluttered with discarded bidi stubs, yet it was my favorite place to be.

Whenever I remembered my village, my mother, or my sisters, I would loiter around the window of that anteroom. While he was drawing a line sketch or painting a color portrait, the moment my shadow flickered by that window, he would come out in one swift stride and take me inside that room. Holding my small chin, he would ask, ‘What is it, my child? What do you need?

If those teachers were the “father figures” who left deep impressions on a tender, innocent childhood heart, then among them, C.S. Rao Garu appeared to me as a representative of one kind of culture, and the Art Master as the representative of another.

C.S. Rao Garu was the embodiment of strength, capability, administrative firmness, and a commanding nature. He was capable of anything, possessing the ability to physically execute and demonstrate any task. Yet, that was also his weakness. He was a symbol of leaders who could express their powers and capabilities only through authority.

When working, he was a grassroots worker. It is true. While remaining a leader, he experienced the thrill of living as a volunteer  every single moment. When he left the school, a teacher described him using the phrase, “Vajradapi Kathorani, Mruduni Kusumadapi” (Harder than a diamond, yet softer than a flower). Although it felt as though his heart was accessible to everyone, those who could break through its hard shell and enter it were rare.

Ramamurthy Garu was the exact opposite of that. He was a true artist. To borrow Tagore’s words, he was “a wrong man in a worker’s paradise.” By the standards of external life, he was incompetent—someone who could achieve nothing, someone incapable. Leaving administrative capability aside, he was a person who did not even know how to chide a child. He was not a leader; he was not even a worker. But he was a true human being.

His heart was a flower garden whose doors were always open. In fact, it wouldn’t even be true to say that the garden had doors at all. In that childhood of mine, these two important individuals awakened two distinct dimensions within me. My entire life has been spent trying to reconcile and harmonize those two opposing sides of myself.

8-7-2026

14 Replies to “కొన్ని కలలు కొన్ని మెలకువలు-2”

  1. పసితనపు చిన్నారి హృదయం మీద ముద్రలు వేసే ‘ఫాదర్ ఫిగర్స్’ ఆ ఉపాధ్యాయులే….

    In that childhood of mine, these two important individuals awakened two distinct dimensions within me. My entire life has been spent trying to reconcile and harmonize those two opposing sides of myself.

    Unfolding future….

  2. అమీర్ ఖాన్ ‘ తారే జమీన్ పర్ ‘ సినిమా,అందులోని పిల్లవాడూ గుర్తొచ్చాడు సర్!

  3. నన్ను మరవని రెండు కళ్లు కథ గుర్తొచ్చింది. ఆ కథ గుర్తు రాగానే కళ్లలోకి నీళ్లు వచ్చేస్తాయి

  4. “ఆయన నా వైపొకసారి, ఆ మీదట ఆ పాఠశాల మెయిన్ గేటు వైపు నడుచుకుంటూ వెళ్లిపోతున్న దృశ్యం… తలచుకున్నప్పుడల్లా ఆ దృశ్యాన్ని నాకు చెకోవ్ కథ ‘స్టెప్సీ’ గుర్తొస్తుంది.”

    Chekhov’s ‘Steppe’ reference is so beautiful, Sir. It made that moment even more touching.

    ‘Father figures’ లాంటి మీ గురువుల గురించి, ముఖ్యంగా రామ్మూర్తి గారు చూపించిన ఆప్యాయత చదువుతుంటే, తన lunch box లో నుంచి నాకు అన్నం పెట్టిన మా తెలుగు టీచర్, అప్పటి కఠినమైన బోధనా పద్ధతులకు భిన్నంగా class లోనే experiments చేసి చూపించి Science మీద ఆసక్తి పెంచిన మా Science teacher గుర్తొచ్చారు.

    హాస్టల్లో ఉండి ఇంటి మీద, ఊరి మీద బెంగ పెట్టుకున్న రోజులు, school schedule, assemblyలో news చదివిన సందర్భాలు, mono actingలో గెలుచుకున్న prize, హాస్టల్ లో పడిన ఇబ్బందులు ఇలా ఎన్నో జ్ఞాపకాలను ఈ భాగం మళ్లీ గుర్తు చేసింది.

    చదువుతున్నది మీ జ్ఞాపకాలే అయినా ,నా బాల్యమే కళ్లముందు తిరిగింది.
    🙏🏽

    1. మన చిన్నప్పటి ఉపాధ్యాయులకి మనం జీవితకాలం రుణపడి ఉంటాము. నేను కలాం రాసుకున్న ఆత్మకథ అనువాదం చేయకపోయి ఉంటే ఈ మెలకువ దొరికి ఉండేది కాదు. ఎప్పట్లానే మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.

  5. గొప్ప మహానుభావుడు తయారైన విద్యాకేంద్రం.విజ్ఞానాన్ని,సాహిత్యాన్ని పంచి పెట్టాలనుకునేవాళ్లు చాలా అరుదు.
    అది మీరు కావడం,ఇక్కడ మేము చదవగలగడం మా అదృష్టం

  6. అద్భుతం గా పరిచయం చేశారు మీ కొత్త ప్రపంచాన్ని, కొఠారి కమిషన్ నివేదిక రూపకల్పనలో ప్రముఖ పాత్ర వహించిన ప్రసిద్ధవిద్యావేత్త జె.పి.నాయక్ ప్రతిపాదించిన ‘క్వాంటిటీ, క్వాలిటీ, ఈక్విటీ’ అంశాల చట్రంలో బిగిస్తూ. మీ దినచర్యలు, మాస్టర్లతో సావాసాలు చదువుతుంటే.. మీతో పాటే మీ క్లాస్ రూమ్ లో , తాడికొండ డార్మిటరి లో, ప్లే గ్రౌండ్ లో మీతో పాటే చదువుకున్న స్కూల్ మేట్, రూమ్మేట్ , టీమ్మేట్ , క్లాస్మేట్ , బెంచి మేట్ లా ఉండి ఉంటే ఎంత బాగుండేదో అనిపిస్తోంది…

  7. ఇదంతా చదవడం ఎంతో అదృష్టంగా అనిపిస్తోంది సర్. నిజానికి ఇదంతా ఒక పూలతోట. ఇక్కడ మీ బాల్యాన్ని చూడడం , ఆ అమాయకత్వాన్ని వినడం పూలపరిమళాల గాలి వలె తోస్తోంది. ఈ అర్థరాత్రి చదివే ఛాన్స్ దొరికింది. నిధురలో మెలుకువ మీ కుటీ రం లో తిరిగే అవకాశం లభించి మీ అక్షరాల జ్ఞాఒకాల్లో తిరుగాడడం హాయిగా అనిపిస్తోంది. సర్ మీ దగ్గర మాత్రమే నేను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడగలను. నమస్సులు

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading