
శివసాన్నిధ్య సుఖం
1
ఉమామహేశ్వరం
ఫాల్గుణ మాసపు తొలిజాముల ఎండ. కారు మహబూబ్‌నగర్ జిల్లా గ్రామాల మధ్యనుండి, అక్కడక్కడ సేద్యం చేసి, విస్తారంగా బీడుగా వదిలిన పొలాలమధ్యనుండి ప్రయాణిస్తోంది. అప్పుడప్పుడు గాల్లోంచి నవజాత వేపపూల పరిమళాలు తీపిగా అల్లుకు పోతున్నాయి.
‘ఇప్పుడు మనం మొదట ఎక్కడికి వెడుతున్నాం?’ అని అడిగింది సుచరిత తన మృదువైన అమెరికన్ యాసతో.
“మన శ్రీశైలయాత్రలో భాగంగా మొట్టమొదట చారిత్రాత్మకమైన ఉమామహేశ్వరానికి వెడుతున్నాం” అన్నాను.
సుచరిత నా మేనకోడలు. పుట్టింది అమెరికాలో అత్యంత పురాతన సాంస్కృతికనగరాల్లో ఒకటైన ఫిలడెల్ఫియాలో. నా సోదరి సులక్షణ, ఆమె భర్త డా. సుధీర్ పాతికేళ్ల కిందటనే అక్కడ స్థిరపడ్డారు. యూనివెర్సిటీ ఆఫ్ పెనిసెల్వేనియాలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ ఈ మధ్యనే పూర్తి చేసుకుని కొన్నాళ్లు మన దేశంలో మా మధ్యన గడపడానికి వచ్చిందీ అమ్మాయి. తిరిగి వెళ్లిపోబోయేముందు దగ్గర్లో ఉండే ఏదన్నా స్థలాన్ని చూపించమంది. తను చూడబోయే ప్రదేశం ఇండియన్ ఎక్స్ పీరియన్స్ కి ప్రతీకగా ఉండాలంది. “అక్కడ పాతా, కొత్తా మేలుకలయికగా ఉండాలనీ, అజేయమైన, అప్రతిహతమైన మానవజీవితేచ్ఛ బలంగా ఉండాలనీ మాటల్లోనైతే చెప్పలేదు గానీ, ఇండియన్ ఎక్స్ పీరియెన్స్ సారాంశమదేకదా అనుకున్నాను.
హైదరాబాద్ నుంచి నాలుగైదు గంటల ప్రయాణంలో, ఒకటి రెండు రోజులు గడిపి తిరిగి రావడానికి అనువుగా ఉండేది నల్లమల అడవుల మధ్యలో నెలకొన్న శ్రీశైలమే కనుక ఆ యాత్రే చేద్దామన్నాను.
సుచరితకి ఇది మొదటిసారి. కాని నాకు గత పదేళ్లుగా ఆ అడవులూ, లోయలూ, ఆ మనుషులూ ఎట్లా సన్నిహితులైనారని! నువ్వు నీ గృహాన్ని ఒదిలిపెట్టిన ప్రతిసారీ యాత్రీకుడివైనట్టే. నీ మిత్రుడి ఇంటికో, చిరపరిచితుడే కావచ్చుగాక, నీ బంధువు ఇంటికో, పచ్చికబయలుకో, మామిడితోటకో ఒక సెలవుదినాన్న పోయి రాగానే నీలో ఎంత కొత్త రక్తం ప్రవహిస్తుందని! నేను మానవకంఠస్వరాల్లో స్నానం చేసాను అన్నాడొక కవి తనొక మహానగరాన్నిచూసినప్పుడు. నువ్వు నీ ఇంటిని వదిలిపెట్టిన వెంటనే ప్రపంచం వెయ్యిచేతుల్తో దగ్గరకుతీసుకోవడం ఎంత ధైర్యానిస్తుందని. అప్పుడు నువ్వు మళ్లా గృహోన్ముఖుడివై నప్పుడు ఒట్టి మనిషిగా కాక మహామానవుడిగా తిరిగివస్తావు.
“శ్రీశైలమంటే టెంపులే కదా అంకుల్, అక్కడేముంది రెండురోజులు గడపడానికి” అంది సుచి, నా యాత్ర ప్రతిపాదన వినగానే.
“టెంపుల్ అంటే నువ్వేమనుకుంటున్నావోగాని, ఆ మాటకి చాలా విశాలార్థముంది. అసలు చూడగలిగితే నల్లమల అడవి మొత్తమే దేవాలయం” అన్నాను. నిండుగా చిగిరించిన మద్దిచెట్ల అడవిని తలదాల్సిన శ్రీపర్వతమంతా సాకార శివమహిమ్న స్తోత్రంగా కళ్లముందు కనిపిస్తుంది నాకు.
కారు అచ్చంపేట వీథుల్లోంచి ముందుకు సాగింది. ఇంకా నిజాం రోజుల్ని తలపించే స్థూల వాస్తు. రోడ్ల మీద పండ్లు, కూరగాయల దుకాణాలు. ఏ వాహనం వచ్చిపోతున్నా పైకి ఎగిసి ఆవరించే దుమ్ము. అచ్చంపేట దాటి రంగాపూరు చేరగానే కారు కుడివైపు తిప్పాను.
అక్కడే రోడ్డుపైన ఆలయ బాహ్యప్రాకారద్వారం. ఆ ద్వారం గుండా కొండల్లోకి దారి తీస్తూ సన్నని బాట. దూరంగా కొండల వరుస మధ్య ఏటవాలు అంచుల్లో సేదదీర్చుకుంటున్న ఎడ్లగుంపులా ఆలయశిఖరాలు. ఆ సన్ననిమలుపు తిరుగుతూ కొద్దిసేపట్లోనే ఘాట్ మీదుగా కొండపైకి చేరాం.
“అబ్బ, ఎంత చల్లగా వుందిక్కడ’ అంది సుచి కారులోంచి కిందకి గెంతుతూనే.
“అయితే, శివస్వరూపం నీకప్పుడే అనుభవమయ్యిందన్నమాట” అన్నాను. ఆమె ముందుకు అడుగు వెయ్యబోతూంటే “ఒక్కసారి ఆగి, ఇటు మనం వచ్చిన దారి వైపు చూడు” అన్నాను.
ఆమె వెనక్కి తిరిగి కొద్దిసేపు కన్నార్పకుండా చూస్తూండిపోయింది.
మేం వచ్చిన దారిపొడవునా పరచుకున్న ఆకుపచ్చలోయ విస్తరించి, విస్తరించి ముదురాకుపచ్చ సస్యక్షేత్రాలుగా, ఆ పైన పృథ్వి అంతా ఆవరించిందేమో అనిపించే దక్కన్ పీఠభూమి నీలిఅలగా, ఆ పైన మబ్బులేని ఆకాశం నీలిజలతారుగా, కనిపించే దృశ్యమంతా నేత్రానందాన్ని ఒలకపోస్తున్న పండుటాకుల దోసిలిగా కనిపించింది.
‘వెళ్లిరండి, పర్వతాల్లోకి వెళ్లి రండి, మీ యాత్ర శుభప్రదం కావాలి. ఆ లోపల అందాల్ని మేం ఎన్నో మార్లు మా ద్వారా నడిచి వెళ్లిన యాత్రీకుల ద్వారా విన్నాం. మేం ఇక్కడే నిలిచి ఉంటాం. మీరు క్షేమంగా వెళ్లి లాభంగా రండి” అన్నట్టున్నాయి ఆ లోయలూ, ఆ దిగంతమూను.
“ఈ దేవాలయం శ్రీశైలానికి ఉత్తరప్రాకారం. ఇది కాకతీయుల కాలం నుంచీ బాగా ప్రాచుర్యానికి వచ్చింది. రేచెర్ల మాదననాయకుడనేవాడు ఈ కొండకి మెట్లు కట్టించాడు. పదమూడో శతాబ్దిలోనే ‘రసరత్నాకరం’ అనే గ్రంథం ఈ క్షేత్రాన్ని ప్రస్తుతించింది. ఆలయనిర్మాణం పధ్నాలుగో శతాబ్దిలో జరిగిందని గుర్తించారు” గైడ్ లాగా చెప్తున్న నా మాటల్ని ఒక చెంప వింటూనే, మరొక చెంప సుచి ఆ రాళ్ల మధ్యనుంచి వూటలూరుతున్న పరిశుద్ధ జలాల్ని నెత్తిన జల్లుకుంటోంది.
“ఈ దేవాలయం బ్రహ్మోత్సవాలు సంక్రాంతికి జరుగుతాయి. విశేషమొకటుందిక్కడ. ఇప్పుడు మనం దాటి వచ్చామే, రంగాపూర్, అక్కడొక మహనీయుడైన సూఫీ సాధువు వుండేవాడు, నిరంజన్ షా వలీ అని. ఆయన దర్గా ఉందక్కడ. ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడే అక్కడ చందనోత్సవమూ జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన భక్తులంతా అక్కడికీ వెళతారు. అక్కడికి వచ్చిన శ్రద్ధాళువులంతా ఇక్కడికీ వస్తారు’ అంటుంటే, ‘నువ్వెప్పుడన్నా ఆ ఉత్సవాలు చూసావా?” అనడిగింది.
ఆ ప్రశ్నవినగానే ఒకానొక సంక్రాంతి చివరి పుష్యమాసపు సంధ్యాధూళిలో సంరంభంలో గడిపిన సాయంకాలస్మృతి మనసంతా ఆవరించింది. గాలుల్లో ఆవరించిన శ్రీచందన సుగంధాలు, దర్గాపై కప్పిన పవిత్రవస్త్రాలు, వర్షించిన ఎర్రగులాబీ పూలరేకులు, లిల్లీపూలమాలలు, పిల్లలూదిన బూరాలు గుర్తొచ్చాయి.
‘చూడకేమి, చూసాను, ఆ ఆనందాన్ని ఎన్నటికీ మరవలేను” అన్నాను.
ఉమామహేశ్వరం నుంచి కిందకిదిగి మన్ననూరు ఘాట్ ఎక్కి శ్రీశైలం వైపు ప్రయాణిస్తూండగా అడవి ఒక సమూహంలాగా మాకు ఎదురొచ్చింది. వివిధ వాద్యాల, గానాల, సంతోషపారవశ్యాల బృందగానం లాంటి ఆ తరుతనువుల, దారుదేహాల మధ్య “ఈ అడవిని ఇట్లా రోడ్డు మీంచి కాదు, లోపలినుంచి చూడాలి పద” అని ఫరహాబాద్ జంక్షన్ నుంచి కారు లోపలకి తిప్పాను. దాదాపు పది కిలోమీటర్ల పాటు, కొండ అంచుదాకా లోపలకీ ప్రయాణం చేస్తున్నంతసేపూ, సుచి నేత్రాలే రెక్కలుగా ఎగుర్తున్న పాలపిట్టలాగా కనిపించింది.
శుష్కపాండురమైన హేమంతవృక్షాలతో అడివి ఎవరితలపులోనో నిమగ్నమైన అడవికన్నెలా ఉంది. ఏదో ప్రియాతి ప్రియసాన్నిధ్యం కోసమే తన జీవితవికాసాన్నంతటినీ నివేదించుకోవాలనే నిష్కళంక ప్రేమాతిశయంలోనే అడివీ, సుచీ ఒకరికొకరు ఎదురైనట్టుగా తోచింది. అప్పుడు అడివికీ, ఈ బాలికకీ మధ్య భేదమే కనిపించలేదు. సుచరిత అడవినే చూస్తున్నదో లేదా అడవి కళ్లారా సుచరితనే చూస్తున్నదో తేల్చుకోలేకపోయాను.
ఫర్హాబాద్ పాయింట్ దగ్గరకు చేరేటప్పటికి అడవి మమ్మల్ని పూర్తిగా ఆవహించింది. సెల్ ఫోన్లు, ఇ-మెయిల్ లు, ఇంటర్నెట్ మాత్రమే అలవాటైన ఈ బాలికకి మొదటిసారిగా దిగంతపరివ్యాప్త సందేశ సాన్నిధ్యమెలాఉంటుందో పరిచయమయ్యింది. ఇది సందేశమూ, అనుభవమూ కూడా.
వెబ్సైట్ సందేశాన్ని మాత్రమే అందించగలదు. అది మీడియం లేదా మెసేజ్ మాత్రమే. నువ్వక్కడ ఆ సందేశాన్ని నీ మనోదేహాలతో నిలువెల్లా ఆస్వాదించలేవు. అది అపరిపూర్ణ, అసంతృప్త సంకేతం మాత్రమే. కాని ఇక్కడ నీ ఎదురుగా ఆవరించిన మహాకాశమూ, నీలి తరంగాలూ, ధూమసదృశమైన శిశిరకాననమూ, ఆ మధ్యలో వికసిస్తున్న నవకింజల్కాలూ, కిసలయాలూ, అడవిలో వినవస్తున్న అడివికోళ్ల అరుపులూ, నెమళ్ల క్రేంకారాలూ, వాటివల్ల మరింత సజీవంగా, సుస్పష్టంగా వినవస్తున్న అడివిగర్భంలోని ప్రగాఢ నిశ్శబ్దమూ- ఇవన్నీ నా చిన్నారిబాలికని సీతాకోకచిలుకల్లా చుట్టుముట్టాయి.
“మామయ్యా, అట్లాంటిక్ మహాసముద్రాన్ని తరంగితమవుతున్న ఎమరాల్డ్ తో పోల్చాడొక కవి. మొదటిసారిగా అట్లాంటిక్ చూసినప్పుడు ఎలావుందో ఇప్పుడలా ఉంది నాకు” అంది సుచి. తన మొత్తం మెరైన్ బయోఫామిలీ అంతటితోనూ కూడా అట్లాంటిక్ ఇంత శోభాయమానంగా వుండదేమో అనిపించింది, ఆ మహాసముద్రాన్ని ఎన్నడూ చూసిఉండని నా కళ్లకి.
ఇప్పపూల గాలుల్లోంచి, అడవిలోతుల్లోంచి వినవచ్చే లేళ్ల అరుపుల్లోంచి, శిశిరాంతంలో మిగిలిన శీర్ణపత్రాలు చెలరేగుతూండగా మూర్తీభవించిన వనదేవతల సన్నిధిలో ఈ తరుణికూడా కణ్వాశ్రమబాలికవలెనే నా కళ్లకు కన్పట్టింది.
కారు తిరిగి ఘాట్‌రోడ్ మలుపులో ముందుకు సాగుతోంది. మహాసముద్ర తరంగాల ఉత్థానపతనాల వెంబడి సాగుతుండే చిన్న తెప్పపడవలా ఆ తూర్పుకనుమల వరసలో, మలుపుల్లో, వాలుల్లో ఎగుడుదిగుళ్లలో కారు సాగుతోంటే బాటకిరువైపులా వసంతాగమన ప్రతీక్షలో అడివి నిల్చిఉంది. ఎండిన మాకుల మధ్యనుండి, రాలుతున్న పండుటాకుల గాలుల్లోంచి, చివుళ్లు మోసులెత్తుతున్న తరువుల నవజీవన ప్రసూతిశోభలో దూరంగా నీలిగీతలా కృష్ణవేణి.
“ఇప్పుడు పాల్కురికి సోమనాథుడిని వినిపించాలని ఉంది’ అని పండితారాధ్య చరిత్రను గుర్తు చేసుకున్నాను. నాకు ఎంత ఇష్టమో ఆ కావ్యమంటే. శ్రీశైలం గురించి అంత పారవశ్యాన్ని పొందిన భావుకుడు మరొకడున్నాడనుకోను. మనం వచ్చినట్టే తెలంగాణా దారుల్లోంచే ఆయన కూడా శ్రీశైలాన్ని సందర్శించాడు. అప్పుడీ రహదారులూ, ఏ వాహనాలూ కూడా లేని రోజులు. కాలినడకన ఈ కొండలెక్కి శివసందర్శన కుతూహలంతో ముందుకు సాగిన రోజులు. ఇక్కడ, ఇదుగో, ఈ ముందుండే ఆకాశాన్ని అంటుకున్నట్లుండే కొండ, దీన్నెక్కితే చుక్కల్ని తాకినట్టే. ..’ అని అంటుండగానే, శివకవులు, శివకవితలు, శివభక్తులు నా మనసంతా నిండిపోయేరు. ఏ మహిమ ఈ దుర్గమారణ్యాల్లోంచి వాళ్లని అంత తీవ్రంగా దగ్గరకు పిలుచుకుంది?
“ఇంతకష్టపడి ఈ కొండల్లోని దేవుడి దగ్గరకే ఎందుకొచ్చేరు వాళ్లు?” సుచి సరిగ్గా నా మనసులో మాటనే పైకి పలికింది.
కొద్ది సేపు నేనేమీ మాట్లాడలేదు. మహాగంభీరమైన విషయమేదో నాలో వ్యక్తీకరణ కోసం పెనగులాడుతున్నట్టుగా అనుభవమయ్యింది. మనమేదన్నా ప్రగాఢమైన విషయాన్ని వెల్లడి చేయబోయేటప్పుడు మనకి సాధారణంగా అనుభవమయ్యే ధీరత్వమేదో నాకు కూడా కలిగింది. ఈ చిన్నబాలిక అడిగిన ప్రశ్నకి జవాబివ్వడానికని కాదు, నాకై నేనే ఏదో విషయాన్ని స్పష్టం చేసుకోవలసిన సందర్భం వచ్చినట్టుగా చెప్పడం మొదలుపెట్టాను.
“అసలు శివుడు అనాది దేవుడు. దేవదేవుడు. అందుకనే ఆయన్ని మహాదేవుడని కూడా అంటారు. ఆయన పృథ్వీదేవుడు”
“విష్ణువట్లా కాదు. ఆయన ఆకాశదైవం. జ్యోతిర్మయమూర్తి. వైభవమూర్తి. పీతాంబరుడు. త్రివిక్రముడు. ఉరుక్రముడు. భగవద్గీతలో విభూతియోగమని ఉంది. అందులో విష్ణువు తన స్వరూపాలుగా చెప్పినవన్నీ ఐశ్వర్యరూపాలు, వైభవరూపాలు. లక్ష్మీనిలయాలు. ఎక్కడెక్కడ జీవితం తన సమస్తవైభవంతో, ఉచ్చరీతిలో విరాజిల్లుతుందో అదంతా విష్ణుమయమే. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన లార్డ్ ఆఫ్ ద సెంటర్. కాని శివుడట్లా కాదు. ఆయన లార్డ్ ఆఫ్ ద పెరిఫెరీ. శుష్కభూముల్లో, ఊషరక్షేత్రాల్లో, దొంగల్లో, కుక్కల్లో కూడా ఆయన్ని చూడగలమంది వేదం. ఎక్కడెక్కడ జీవితం విస్మృతికి లోనయ్యిందో, శ్రద్ధకి నోచుకోకపోయిందో, ఏది నిర్ణనం, దుర్గమం, అగమ్యంగా గోచరిస్తుందో అదంతా ఆయన నివాసమే. పశువులమందలు, గడ్డిభూములు, వేటగాళ్లు, ఎక్కుపెట్టిన విల్లమ్ములు, వనమూలికలు, చివరికి గుడ్లగూబలు కూడా ఆయన మహిమరూపాలే’
“ఆయన సతత విషపాయి. పాములు, పశువులు, నిషాదులు ఆయన నేస్తాలు. వైభవదర్పిత మానవసమాజం వల్ల నిరాదరణకు గురవుతూ వచ్చినవారెల్లరికీ, కులాలకీ, సాంఘికాంతరాలకూ అతీతమైన సమాజాన్ని కోరుకున్నవారెల్లరికీ ఆయన పిలుపొక వేకువ. నిరాడంబరులు, నిగర్వులు, నిరక్షరాస్యులు ఆయనకెక్కువ దగ్గర.”
“ఈ అడవినే చూడు. ఇది దండకారణ్యంలాగా మహారణ్యం కాదు. కాని ఈ సవానా గడ్డిభూములూ, ఈ తరుగుల్మాలూ, ఈ చిట్టిపొట్టిమాకులూ, ఈ నల్లరాళ్లూ, భూమి అంతరాగ్ని చల్లారుతున్నప్పుడు ఈ శిలావిన్యాసమేర్పడిన క్రమంలోనే, ఈ జియోమెటామార్ఫిజంలోనే ఒక పరమేశ్వర పరామర్శ ఉందనిపిస్తుంది’
“అయినా, సుచీ, ఈ అనుభూతి నీ అంతట నీకు అందాలని కదా నువ్వు వస్తున్నది. నా ఆలోచనల్ని నాలోనే ఉండనివ్వు’ అన్నాను.
The Bliss of Shiva’s Presence
1
Umamaheshwaram
The early morning sun of the month of Phalguna shone gently. Our car drove through the villages of Mahabubnagar district, passing fields that were sparsely cultivated and vast stretches left fallow. Now and then, the sweet fragrance of newly blossomed neem flowers drifted in with the breeze.
“Where are we heading first?” Sucharitha asked in her soft American accent.
“As the first part of our journey to Srisailam, we are going to the historic Uma Maheshwaram,” I said.
Sucharitha is my niece. She was born in Philadelphia, one of the oldest cultural cities in America. My sister Sulakshana and her husband, Dr. Sudheer, settled there twenty-five years ago. Having recently completed her postgraduate studies at the University of Pennsylvania, Suchi came to spend some time with us in India before returning. Before leaving, she asked me to take her somewhere nearby. She wanted the place to reflect a quintessential “Indian experience.” She did not put it in so many words, but I felt she was looking for a place where the old and the new blend seamlessly, and where the invincible, unyielding human will to live shines bright—for isn’t that the very essence of the Indian experience?
Since Srisailam, nestled in the heart of the Nallamala forests, is just a four to five-hour drive from Hyderabad and ideal for a short two-day getaway, I suggested we go there.
For Sucharitha, this was her first visit. But for me, over the past ten years, how close those forests, valleys, and people had become! Every time you leave home, you become a pilgrim. Whether you visit a friend’s house, a relative’s home, an open pasture, or a mango orchard on a holiday—how refreshed you feel when you return! A poet once said upon seeing a great metropolis: “I breathed in human voices.” The moment you step outside your home, what courage it gives you when the world embraces you with a thousand arms! And when you finally turn back toward home, you return not as an ordinary person, but as someone transformed.
“Srisailam is just a temple, isn’t it Uncle? What is there to spend two days on?” Suchi asked as soon as she heard my proposal.
“I don’t know what you think a temple is, but the word has a very vast meaning. If you can truly see it, the entire Nallamala forest is a shrine,” I replied. Whenever I think of Sriparvata, crowned with forests of maddi trees in full bloom, it appears before my eyes as the living embodiment of the Shiva Mahimna Stotram.
Our car passed through the streets of Achampet. The rough architecture still carried the lingering charm of the Nizam era. Fruit and vegetable stalls lined the streets. With every passing vehicle, clouds of dust rose into the air. Leaving Achampet behind, we reached Rangapur, where I turned the car to the right.
Right on the roadside stood the outer gateway of the temple complex. Through that archway, a narrow path led up into the hills. In the distance, along the sloping edges of the mountain range, the temple spires looked like a herd of cattle resting peacefully. Negotiating those narrow bends, we soon ascended the hill via the ghat road.
“Oh, it’s so delightfully cool here!” Suchi exclaimed, hopping out of the car.
“So, you have already experienced the presence of Shiva,” I remarked. As she was about to take a step forward, I said, “Pause for a moment and look back at the path we just traveled.”
She turned around and gazed in awe without blinking.
Along the path we had come, the green valley unfurled—stretching out into deep-green cultivated fields, rising into the blue wave of the Deccan plateau that seemed to encompass the entire earth, and melting under a cloudless sky of blue brocade. The entire panorama looked like an offering bowl of golden autumn leaves spilling pure joy into our eyes.
The valleys and the distant horizon seemed to say: “Go, journey into the mountains; may your pilgrimage be blessed. We have heard tales of the inner beauty from the pilgrims who walked through us countless times. We shall wait here. Go safely, and return enriched.”
“This temple is the northern gateway to Srisailam. It came into great prominence during the Kakatiya period. A nobleman named Recherla Madana Nayaka built stone steps up this hill. As early as the thirteenth century, the text Rasaratnakaram praised this sacred site, and historians date the temple construction to the fourteenth century,” I explained like a tour guide. Listening to me with one ear, Suchi was busy sprinkling pure spring water over her head as it trickled through the rocks.
“The temple’s annual Brahmotsavams take place during Sankranti. There is something unique here. The village of Rangapur we just passed had a great Sufi saint named Niranjan Shah Vali. His dargah is located there. Whenever the Brahmotsavams happen here, the Sandalwood festival (Chandanotsavam) is celebrated there. All the devotees who come here visit the dargah, and all who visit the dargah come here.”
Hearing this, she asked, “Have you ever witnessed those festivities?”
At that question, the memory of an evening spent amidst the festive dust and bustle of a Sankranti twilight in the month of Pushya filled my heart. I remembered the scent of sandalwood paste hanging in the breeze, the sacred green sheets draped over the tomb, the shower of red rose petals, jasmine and lily garlands, and the playful sound of bugles blown by children.
“Of course I have! I can never forget that joy,” I said.
Descending from Uma Maheshwaram, we climbed the Mannanur ghat road toward Srisailam. As we drove, the forest came forward to greet us like a living community. Amidst those tree trunks and wooden limbs that resembled a joyous choir of diverse instruments and songs, I said, “Let’s not look at this forest merely from the road; let’s see it from within.” I turned the car onto the trail from Farhabad junction.
For almost ten kilometers up to the cliff’s edge, Suchi’s eyes darted with wonder, like the fluttering wings of an Indian Roller (pala pitta).
With its dry, pale winter trees, the forest looked like a woodland maiden lost in thought. It felt as if the forest and Sucharitha had met in an act of pure, selfless love—a surrender of one’s entire blossoming being for the sake of a cherished presence. In that moment, the distinction between the forest and the young girl blurred. I could not tell whether Sucharitha was gazing at the forest, or if the forest was looking back at Sucharitha with all its eyes.
By the time we reached the Farhabad viewpoint, the forest had completely enveloped us. For a girl accustomed only to mobile phones, emails, and the internet, this was her first encounter with a presence whose message spread to the very edges of the horizon. It was both a message and a lived experience.
A website can deliver only data; it is merely the medium or the message. You cannot savor that message with every fiber of your mind and body; it remains an incomplete, unsatisfying symbol. But here, the vast expanse stretching before us, the blue rolling ridges, the smoky winter woodlands, the blooming tender buds and sprouts within them, the calls of wild fowl and the cries of peacocks echoing through the trees—and the deep, profound silence of the forest’s womb made even clearer and more vibrant by those sounds—all encircled my young niece like a flutter of butterflies.
“Uncle, a poet once compared the Atlantic Ocean to an undulating emerald. Looking at this expanse, I feel the exact same way I felt when I saw the Atlantic for the first time,” Suchi said. Looking through my own eyes—eyes that had never seen that great ocean—it seemed that even with its entire marine bio-family, the Atlantic could hardly surpass this splendor.
In the breeze carrying the scent of mahua (ippa) blossoms, in the distant calls of deer echoing from the forest depths, and amidst the falling dry leaves of late winter, she stood before the embodiment of forest deities, looking to my eyes like a hermit girl from Sage Kanva’s hermitage.
The car resumed its winding course along the ghat road. Like a small raft rising and falling upon ocean waves, our car navigated the bends, slopes, and crests of the Eastern Ghats. On either side of the path, the forest stood in quiet anticipation of spring’s arrival. Through the dry branches, in the winds carrying shedding yellow leaves, and amidst the newborn beauty of sprouting twigs, the Krishna river appeared in the distance like a delicate blue line.
“I feel like reciting Palkuriki Somanatha right now,” I said, recalling his classic Panditaradhya Charitra. How much I love that epic poem! I don’t think there was another visionary poet who experienced such pure ecstasy describing Srisailam. He, too, visited Srisailam through these very trails of Telangana, just as we did. Those were days without paved highways or motor vehicles—days when pilgrims climbed these hills on foot, driven solely by the longing for Shiva’s darshan.
Pointing ahead, I said, “Look here, this hill ahead seems to touch the sky; if you climb it, you could almost touch the stars…” As I spoke, the Shaiva poets, their verses, and the devotees of Shiva filled my consciousness. What divine grace drew them so powerfully through these impassable, rugged jungles?
“Why did they take so much trouble just to reach a deity nestled deep in these remote hills?” Suchi asked, voicing the exact thought echoing in my mind.
For a moment, I fell silent. I felt as if something profound and solemn within me was struggling for expression. I experienced that quiet composure that usually settles upon us when we are about to articulate something deeply felt. Not merely to answer this young girl’s question, but as though an occasion had arrived to clarify something to myself, I began to explain:
“Shiva is the primordial God. The God of Gods. That is why He is called Mahadeva. He is the God of the Earth (Prithvi).
Vishnu is not like that. He is the God of the Sky—a radiant form of splendour and royal majesty. He is the one draped in golden robes (Pitambara), the one who measures the cosmos in cosmic strides (Trivikrama, Urukrama). In the Bhagavad Gita, there is the chapter on Vibhuti Yoga. Everything Vishnu describes there as His manifestations are forms of wealth, opulence, and sovereign majesty—abodes of Lakshmi. Wherever life flourishes in its supreme grandeur and pinnacle of achievement, that is Vishnu. In a word, He is the Lord of the Centre.
But Shiva is different. He is the Lord of the Periphery. The Vedas proclaim that He can be seen even in barren lands, in fallow wastelands, among thieves, and even among stray dogs. Wherever life has been forgotten or neglected, whatever appears desolate, inaccessible, and abandoned—that is His dwelling place. Herds of cattle, open savannah grasslands, hunters, drawn bows and arrows, wild medicinal herbs, and even screeching owls are manifestations of His glory.
He is the eternal consumer of poison (Visha-payi). Serpents, animals, and forest dwellers (Nishadas) are His companions. To all those who have been marginalized by a prideful, affluent society, and to all who yearn for an egalitarian world beyond caste and social divisions, His call is a dawn of awakening. The simple, the humble, and the unlettered are closest to Him.
Look at this forest. It is not a colossal rainforest like Dandakaranya. Yet, in these savannah grasslands, these shrubs, these stunted trees, these black rocks—and in the very process of geomorphism where rock formations settled as the earth’s internal fire cooled—one can sense the comforting touch of the Supreme Lord.
Still, Suchi, you have come so that this realization may dawn upon you on your own. Let my thoughts remain with me for now,” I concluded.
5-8-2026


ఇది నాకెంతో ఇష్టమైన వ్యాసం, పుస్తకంలో. పుస్తకాలు సర్దుకుంటూ, ఈ పుస్తకం చేతిలో పడ్డప్పుడల్లా ఒక్క అక్షరమూ వదలకుండా చదువుకుంటాను
(ఈ కామెంట్ పబ్లిషింగ్ కి కాదు.. , అందుకే విడిగా రాస్తున్నాను)
తెలుగు వ్యాసంలో చాలా అచ్చు తప్పులు దొర్లాయండి. You may want to check once and fix.
అన్ని తప్పులూ సరిదిద్దాను. హెచ్చరించినందుకు ధన్యవాదాలు.
నువ్వు నీ గృహాన్ని ఒదిలిపెట్టిన ప్రతిసారీ యాత్రీకుడివైనట్టే.
శుష్కపాండురమైన హేమంతవృక్షాలతో అడివి ఎవరితలపులోనో నిమగ్నమైన అడవికన్నెలా ఉంది.
ఎన్నిసార్లు చదివినా మళ్ళీ మళ్లీ చదవాలనిపించే యాత్రానుభవాలు.
హృదయపూర్వక ధన్యవాదాలు సోమశేఖర్!
Beautiful travelogue!! 🙏🏽
“ నువ్వు నీ ఇంటిని వదిలిపెట్టిన వెంటనే ప్రపంచం వెయ్యిచేతుల్తో దగ్గరకుతీసుకోవడం ఎంత ధైర్యానిస్తుందని. అప్పుడు నువ్వు మళ్లా గృహోన్ముఖుడివై నప్పుడు ఒట్టి మనిషిగా కాక మహామానవుడిగా తిరిగివస్తావు.”
హృదయపూర్వక ధన్యవాదాలు మాధవీ!