కావ్యాత్మక వాస్తవికత-2

జీవితవాస్తవాల ఎదట మానవుడి పరిస్థితి

ఇలా అంతరంగంలోకి దృష్టి మళ్ళించడం Poetic Realism లో ప్రధానంగా ఒక నిశ్శబ్ద విరమణ (Entsagung) గా వ్యక్తమయింది. కానీ ఈ విరమణ లేదా ఈ పరిత్యాగం పలాయనం కాదని మనం గమనించాలి. ఇది బలహీనతా కాదు, నిస్సహాయతా కాదు. తీవ్రమైన పెనగులాట తర్వాత, నలుగులాట తర్వాత జీవితవాస్తవాల పట్ల కలిగిన ఒక మెలకువ ఇది. ఒక సరికొత్త తాత్త్విక వాస్తవికత. కాబట్టే ఈ నవలలో రైన్‌హార్డ్, ఎలిసబెత్ లు విడిపోవలసి వచ్చినప్పుడు, వాళ్ళు తమ పరిస్థితుల్ని ధిక్కరించి పెళ్ళి చేసుకున్నట్టో లేదా రైన్‌హార్డ్ ఇమ్మెన్సీకి వెళ్ళినప్పుడు ఎలిసబెత్ కీ అతనికీ మధ్య ఒక రహస్య ప్రణయం సాగినట్టో లేదా వాళ్ళిద్దరూ కలిసి అక్కణ్ణుంచి బయటకి వచ్చేసినట్టో రచయిత రాయలేదు. దానికి బదులు కథలో రైన్‌హార్డ్ పరిస్థితుల్లో సంభవించిన మార్పుని అర్థం చేసుకున్నాడు. అంగీకరించాడు. అలా అంగీకరించడంలోని హుందాతనం, అది అతణ్ణి మానసికంగా కూల్చివెయ్యకపోవడం—ఇది ఈ కొత్త sensibility లోని అత్యంత విలువైన అంశం. అంటే మనిషి తన ఇచ్ఛ ప్రకారం, సంకల్పం ప్రకారం బాహ్య వాస్తవాన్ని మార్చలేకపోవచ్చు. కాని అంతమాత్రాన అతడు ఓడిపోయినట్టు కాదు, నిస్సహాయుడైపోయినట్టు కాదు, తాను జీవించడానికి అర్థం లేకుండా పోయినట్టు కాదు. మారిన పరిస్థితుల ఎదట కూడా అతడు తన మానవీయ గౌరవాన్ని కోల్పోకుండా, నిబ్బరంగా నిలబడవచ్చు. రైన్‌హార్డ్, ఎలిసబెత్ ల ద్వారా, ముఖ్యంగా రైన్‌హార్డ్ ద్వారా స్టార్మ్ అటువంటి ఒక జీవితాదర్శాన్ని, అటువంటి ఒక సగౌరవ ప్రత్యామ్నాయాన్ని చూపించాడు. బయటి పరిస్థితుల్ని అతడు మార్చలేకపోయినప్పుడు కూడా అతడికి మరెన్నో ప్రత్యామ్నాయాలున్నాయి: ఒకటి సమాజానికి ఉపయోగపడే ఏదో ఒక కృషిని కొనసాగిస్తూనే ఉండటం—ఇమ్మెన్సీలో రైన్‌హార్డ్ జానపదగీతాల గురించి చేస్తూ వచ్చిన జీవితకాల అధ్యయనం లాగా. మరొకటి స్మృతి—మనిషి తన స్ఫూర్తిని తన జ్ఞాపకాల్లో సజీవంగా నిలుపుకోవడం. మూడవది అన్నిటికన్నా మించి, మనిషి తన ఆకాంక్షల పైన ఒక సంయమనాన్ని సాధించడం. ఈ ప్రత్యామ్నాయాలన్నీ స్టార్మ్ ఇమ్మెన్సీ నవలలో చూపించాడు.

మానవజీవితమూ, సంతోషమూ కూడా క్షణభంగురాలు కావడమే అన్నిటికన్నా ప్రధానమైన జీవితవాస్తవం అనీ, స్టార్మ్ ఇమ్మెన్సీలో చిత్రించింది ఈ వాస్తవాన్నే అనీ బేంట్ అంటాడు. నిజానికి ఇమ్మెన్సీ ఒక నవలా కథనంలాగా సాగదు. అది ఒక సన్నివేశం తర్వాత మరొక సన్నివేశం ప్రత్యక్షమయ్యే దృశ్యమాలికలాగా నడుస్తుంది. మొదటి సన్నివేశంలో కనిపించిన జీవితం రెండో సన్నివేశానికి కనిపించదు. రైన్‌హార్డ్, ఎలిసబెత్ ల వయసు మాత్రమే కాదు, వారి చుట్టూ ఉన్న పరిస్థితులు మాత్రమే కాదు, వాళ్ళ మనఃస్థితి కూడా సన్నివేశం నుంచి సన్నివేశానికి మారిపోతూనే ఉంటుంది. అలా క్షణక్షణ పరివర్తనశీల ప్రపంచంలో ఒక సుస్థిర సంతోషాన్ని చేజిక్కించుకోడం సాధ్యంకాదనేది నవలలో కథానాయకుడికి కలిగిన మెలకువ. ఇమ్మెన్సీ ఎస్టేటులో తేనెటీగల కొలనులో విరబూసిన కలువపువ్వులాగా, అతడు తనని సమీపిస్తున్నకొద్దీ, ఆ కలువ మరింత దూరంగా జరిగిపోతూనే ఉంటుంది.

కానీ, ఈ నవల్లోని బలం ఇక్కడే ఉంది. అది Bernd మాటల్లో “but it steers reader unrelentingly into reality, for it unflinchingly marks the limits of man’s abilities in coping with transience as an obtrusive force of destruction.”

స్టార్మ్ చిత్రించిన ఈ వాస్తవికత పాఠకుల్ని అశాంతికి గురి చేస్తుంది. కానీ, నిజంగా జీవితాన్ని వాస్తవికంగా చిత్రించడమంటే ఇదే. తన పూర్వపు రొమాంటిక్ రచయితల్లాగా, తన కాలపు డేనిష్ కాల్పనిక రచయితల్లాగా, అతడు తన పాఠకులకి సంతోషం కలిగించడం కోసం వారిని భ్రమపెట్టాలని చూడడు. అలాగని తన అదుపులోలేని జీవితవాస్తవాల ఎదట మనిషి కుప్పకూలిపోతున్నట్టూ చిత్రించడు. ఈ రెండు దారులకూ బదులు స్టార్మ్ ఎంచుకున్న దారి, ఆ వాస్తవాల ఎదట తన ఆదర్శాల పరిమితుల్ని అంగీకరించి, జీవితవాస్తవాన్ని యథాతథంగా అంగీకరించడం. అలా అంగీకరించడం నిస్సహాయంగా కాదు, ఒక మర్యాదతో, అత్యున్నత మానవసంస్కారంతో, ఒక నైతిక నిస్సంగత్వంతో.

నవల, నవలిక

ఈ సందర్భంగా ఒక ప్రశ్న తలెత్తుతుంది. జర్మన్ సాహిత్యంలో వాస్తవికతా వాదం Poetic Realism గా వ్యక్తమవుతున్నప్పుడు సమకాలిక ఫ్రాన్సులో, ఇంగ్లాండులో, రష్యాలో, స్పెయిన్ లో అది ధరించిన వాస్తవికతా రూపాలు ఎందుకు భిన్నంగా ఉన్నాయి? 1848-49 సంక్షోభం దాదాపుగా మొత్తం యూరోపు అంతటా సంభవించిందే కదా. అంటే అక్కడ అప్పటికే విస్తృత జాతీయ రాజ్యాలు ఏర్పడి ఉన్నాయి అన్నది ఒక కారణంగా చెప్తారు. కాబట్టి ఫ్రాన్సులో స్టెంధాల్ (1783-1842), బాల్జాక్ (1799-1850), ఫ్లాబే (1821-80), ఇంగ్లాండులో ఛార్లెస్ డికెన్స్ (1812-70), థాకరే (1811-63), జార్జి ఇలియట్ (1819-80), రష్యాలో గొగోల్ (1809-52) వంటి రచయితలు తాము చూస్తున్న సామాజిక వాస్తవాన్ని బృహద్రచనలుగా చిత్రించగలిగారు అనేది ఒక విశ్లేషణ. వారందరిలోనూ కూడా బాల్జాక్ తరహా వాస్తవికతనే వాస్తవికతావాదానికి, అంటే Realism కి ప్రతినిధిగా గుర్తింపు పొందింది. రోజువారీ జీవితాన్నీ, కొత్త మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, శ్రామిక తరగతి జీవితాల్ని చిత్రించడం, అభూతకల్పనలకీ, ఊహాగానాలకీ చోటివ్వకపోవడం, పాత్రలు మామూలు మనుషులు మామూలు జీవితాల్లో ప్రవర్తించినట్టే నవలల్లో కూడా ప్రవర్తించడం వాస్తవిక చిత్రణగా భావించారు. అయితే రాను రాను, అది సామాజిక అసమానతల పట్ల ధిక్కారంగా, అణచివేతల పట్ల తిరుగుబాటుగా, ద్వంద్వ ప్రామాణాల పట్ల నిరసనగా బలపడుతూ వచ్చింది. కానీ జర్మనీ 1871 కి గాని పూర్తి అర్థంలో ఒక జాతీయ రాజ్యంగా రూపొందలేదనీ, లండన్ లాగా, పారిస్ లాగా, సెంట్ పీటర్స్‌బర్గ్ లాగా దానికొక ఏకైక రాజకీయ, సాంస్కృతిక కేంద్రం లేకపోయిందనీ, కాబట్టి ఇతిహాస సమానమైన ఒక నవలని మనం 1871 కన్నా ముందటి జర్మనీలో ఊహించలేమనేది ఒక విశ్లేషణ.

నిజానికి ఒక భాషగా ఆధునిక యుగానికి తలుపు తెరవడంలో తక్కిన యూరపియన్ భాషలన్నిటికన్నా కూడా జర్మన్ ముందుంది. ఒక గొథే, ఒక షిల్లర్ చూపించిన దారిలోనే తక్కిన యూరపియన్ రచయితలు నడిచారు. ఒక్క సెర్వాంటిస్ మినహా తక్కిన యూరపియన్ మహారచయితలకి నవల, కవిత్వం, నాటక రచనల్లో గొథేనే స్ఫూర్తి. పద్ధెనిమిది-పందొమ్మిది శతాబ్దాల మేరకు విస్తరించిన గొథే నీడ నుంచి పంతొమ్మిదో శతాబ్దిలో ఆయన తదనంతర జర్మన్ రచయితలు బయట పడటం అంత సులభం కాదు. అందుకనే పందొమ్మిదో శతాబ్ది ఉత్తరార్థంలో మనకు జర్మన్ సాహిత్యంలో చెప్పుకోదగ్గ నాటకమేదీ కనిపించదు.

ఇక పందొమ్మిదో శతాబ్ది వాస్తవికవాద మహారచయితలు డికెన్స్, థాకరే, బాల్జాక్, ఫ్లాబే, గొగోల్ మొదలైనవారంతా గొథే దారిలో నడిచినవాళ్ళు. కాబట్టి వారి సమకాలిక జర్మన్ రచయితలకి మళ్ళా గొథేలాగా Wilhelm Meister’s Apprenticeship లాంటి మరో నవల రాయడం పట్ల ఆసక్తి ఉండదు. అలాగని వాస్తవికత పేరిట జీవితవాస్తవాల వివరాల్ని చిట్టాలాగా రాసుకుంటూ పోవడంలోనూ వారికి ఆసక్తి ఉండదు. కాబట్టి బృహత్ ప్రమాణాల వాస్తవికతావాద నవల కన్నా, లేదా ఒక మహానాటకం రాయడం కన్నా కూడా ప్రజాహృదయాల్ని స్పందింపచేయగల మరొక కొత్త ప్రక్రియ కోసం 1815-71 మధ్యలో జర్మన్ భాష ఎదురుచూస్తూ ఉందని చెప్పవచ్చు. German Poetic Realism నేపథ్యంలో అది German Novella గా అవతరించింది.

ఇమ్మెన్సీ నవల రాసినప్పుడు స్టార్మ్ ఇదంతా ఆలోచించి మరీ రాసాడని నేను చెప్పను. కాని ఏళ్ళ తరువాత 1881 లో ఒక ముందుమాట రాసుకుంటూ, అతడు ఈ సరికొత్త novella ను చాలా స్పష్టంగా నిర్వచించగలిగాడు. ఈ కొత్త తరహా నవలికను అతడు దాని విమర్శకుల నుంచి రక్షించడానికి చేపట్టిన వాదనలో మూడు ముఖ్యాంశాలున్నాయి. మొదటిది, దాన్ని రినైజాన్సు కాలం నాటి కథలతో పోల్చకూడదనేది. అంటే బొకాషియో రాసిన డెకామెరాన్ లో కథల్లాగా అది కాలక్షేపం కోసం రాసేది కాదు. రెండోది, దాన్ని ‘నాటకానికి సోదరి’గా పరిగణించాలనేది. ఎంతో క్రమశిక్షణా, నైపుణ్యమూ, సంయమనమూ ఉంటే తప్ప రాయగలిగే వచన రచన కాదనేది. నాటకంలోలానే దానిలో కూడా ఒక సంఘర్షణ కేంద్రబిందువుగా ఉంటుంది. దాని చుట్టూ కథ అల్లినప్పుడు, దానిలో ఏది అవసరంలేదో దాన్నంతా నిర్దాక్షిణ్యంగా తొలగించాలి. ఏ విశేషాలూ, వర్ణనలూ, మనఃస్థితులూ చిత్రించినా అవన్నీ కూడా ఆ కేంద్రబిందువుని అనుసంధానించుకునే ఉండాలి తప్ప కేవల అలంకారాలుగా ఉండకూడదు. ఒక రకంగా ఇది, అప్పటికి నలభయ్యేళ్ళ కిందటనే ఎడ్గార్ అలన్ పో చిన్న కథ గురించి రాస్తూ చెప్పిన single effect లాంటిదే. కాని పో ఎత్తిచూపని ఒక నాటకీయ నిర్మాణాన్ని స్టార్మ్ novella కి అవసరమని చెప్పడం గమనించాలి. ఇక మూడవది, తీరుబాటుగా పేజీలకు పేజీలు రాసుకుంటూ పోయ్యే ఐతిహాసిక నవల (Roman) కన్నా కూడా ఒక novella రాయడానికి ఎక్కువ నేర్పు, ఎక్కువ కవిత్వ క్రమశిక్షణ కావాలనేది.

బృహత్ కథనాలూ, సరళ కథనాలూ

సమాజంలో ఉండే బృహత్ రాజకీయ ఆకాంక్షల ప్రతిబింబమే సాహిత్యం అనుకున్నప్పుడు, బయటి జీవితంలో బృహత్ ప్రయత్నాలు విఫలమైనప్పుడు, సాహిత్యకారుడు తిరిగి సాహిత్యంలో వాటిని పునర్నిర్మిస్తాడని ఊహించలేం. అతడు అందుకు బదులుగా చిన్న చిన్న కథలవైపూ, చిన్న చిన్న జీవితసంఘటనలవైపూ, మొత్తం ప్రజానీకాన్నంతటినీ కుదిపేసే మహత్తర ఆదర్శాల్ని ప్రచారం చెయ్యడానికి బదులు మనుషులు తమ తమ జీవితాల్లో నిలబడగల చిన్న చిన్న విలువలు, చిన్నపాటి త్యాగాలూ, చిన్నపాటి మెలకువలూ—వీటిమీదనే దృష్టిపెడతాడు. ఇటువంటి మార్పు మనం మొత్తం ప్రపంచ సాహిత్యంలో 1950 తర్వాత చూస్తున్నాం. కానీ ఇటువంటి దృక్పథాన్ని స్టార్మ్ వందేళ్ళ ముందే చూపించగలిగాడని నాకు అర్థమవుతూ ఉంది.

3

కావ్యాత్మక వాస్తవికతలోని కావ్య పార్శ్వం

Poetic Realism ని కవితాత్మక వాస్తవికత అని అనువదించడం కన్నా కూడా కావ్యాత్మక వాస్తవికత అని అనువదించడం సరైంది అనుకుంటున్నాను. కవిత్వం ఊహాశీలత్వాన్నీ, వర్ణనగుణాన్నీ, కాల్పనిక శక్తినీ సూచించే పదం. రొమాంటిక్ నవలల్లో అది ఎలానూ పుష్కళంగా ఉంది. కానీ ఇప్పుడు ఈ కొత్త ధోరణిలో poetic దేన్ని సూచిస్తుంది? అది కావ్యనిర్మాణ సామర్థ్యాన్ని సూచిస్తుంది. స్టార్మ్ తో సహా, జర్మన్ నవలికల రచయితలెవరూ సంస్కృత ఆలంకారికుల్ని చదివి ఉండకపోవచ్చుగాని, వారు సాధన చేసిన నవలిక శిల్పం దాదాపుగా సంస్కృత కావ్య శిల్పం లాంటిదే. అందుకనే, ఇమ్మెన్సీ రాసిన తరువాత, స్టార్మ్ తో సహా తదనంతర రచయితలెవరూ ఇమ్మెన్సీ లోని కావ్య నిర్మాణ ప్రౌఢిని అందుకోలేకపోయారని చెప్పాలి.

కావ్యాలంకారికులు ఏమి చెప్పారు?

కావ్యానికి ఆత్మ ఏది అనే అంశం మీద సంస్కృత అలంకారికులు కనీసం వెయ్యేళ్ళ పాటు చాలా లోతైన, సూక్ష్మమైన, సార్థకమైన చర్చలు చేసారు. వాటన్నిటినీ సంగ్రహంగా చెప్పమంటే, పదకొండో శతాబ్దానికి చెందిన మమ్మటాచార్యుడి ‘కావ్యప్రకాశం’ లోంచి ఈ నిర్వచనాన్ని ఎత్తి రాయవచ్చు:

తదదోషౌ శబ్దార్థౌ సగుణావనలంకృతీ పునః క్వాపి

(కావ్యం దోషరహితమైన శబ్దార్థాల్తో కూడుకుని ఉండాలి, కొన్ని సార్లు అలంకారాలు లేకపోయినా సరే, ముఖ్యంగా సద్గుణాలు కలిగి ఉండాలి.)

తిరిగి మళ్ళా ఏ దోషాల్ని కవి పరిహరించాలో చెప్తూ, వాటిల్లో శబ్ద దోషాలు, అర్థదోషాలతో పాటు రసదోషాల్ని కూడా పేర్కొన్నాడు. మొదటి రెండు రకాల దోషాలూ సాధారణంగా కవిత్వానికి వర్తించేవే కాని, రసదోషాలు మాత్రం కావ్య నిర్మాతలు తప్పనిసరిగా జాగ్రత్త పడవలసిన అంశాలు. ఆయన వాటిని 13 రకాలుగా చెప్పాడు (కావ్యప్రకాశం, 7:60-62). వాటిలో ముఖ్యంగా పదింటి గురించి చూద్దాం.

అవి: ‘స్వశబ్దవాచ్యత్వం’, అంటే ఏ రసం పాఠకుడిలో కలగాలో, అది చూపించడం ద్వారా సాధించకుండా చెప్పడం ద్వారా సాధించాలని చూడటం. ఆధునిక కాలంలో కథకులు show, don’t tell అని దీన్నే వేరే మాటల్లో చెప్పినట్టు. రెండోది, ‘కష్టకల్పన’. అంటే, కవి పాఠకుడిలో ఉద్దేశించిన రసానుభూతి సులభంగా కలగడానికి బదులు కష్టమ్మీద కలగడం. మూడోది, ‘ప్రతికూల విభావాదిగ్రహత’, అంటే రసానుభూతి కలగడానికి ఏవి అడ్డంకికాగలవో వాటిని చెప్పుకుంటూ పోవడం. తీవ్ర రసోద్దీప్తి కలిగించవలసిన సమయంలో తత్త్వశాస్త్ర చర్చలు చెయ్యడమన్నమాట. నాలుగోది, ‘పునః పునః దీప్తి’. అంటే చెప్పిందే చెప్పడం, లేదా మరీ అతిగా చిత్రించడం. అయిదోది, ‘అకాండే ప్రథనం’. అంటే తగిన సన్నివేశ కల్పన చెయ్యకుండానే ప్రధానమైన భావావేశాన్ని ఆవిష్కరించాలని చూడటం. ఆరోది, ‘అకాండే ఛేదః’. అంటే, ప్రధాన భావోద్వేగాన్ని రసపుష్టి పొందకుండానే మధ్యలో తుంచెయ్యడం. ఏడోది, ‘అంగస్య అతివృష్టి’. అంటే ఏదో ఒక చిన్న సంఘటనమీదనో, లేదా అల్ప విషయం మీదనో ఎక్కువ శ్రద్ధ పెట్టడం. ఎనిమిదోది, ‘అంగినః అనుసంధాన విచ్ఛేదం’, అంటే, అసలు విషయాన్ని పక్కనపెట్టి ముఖ్యంగాని విషయాలచుట్టూతానే తిరుగుతుండటం. తొమ్మిదవది, ‘ప్రకృతి విపర్యయం’. అంటే, పాత్రలు తమ స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించడం. పదవది, ‘అనంగాభిధానం’. అంటే, రసకల్పనకి ఎంత మాత్రం ఉపకరించని అంశాల మీద దృష్టి పెట్టడం.

వీటిని ఇంత వివరంగా ఎందుకు పేర్కొన్నానంటే, ఇవి చక్కని కావ్యశిల్పానికి ఎంత అవసరమో, ఒక చక్కని నవలిక రాయడానికీ, కథ రాయడానికీ, నాటకానికీ, చివరికి చక్కని స్క్రీన్ ప్లే కి కూడా అంతే అవసరం. ఈ దోషాలు రసస్ఫూర్తినివ్వడానికి బదులు రసభంగానికి దారితీస్తాయి. ఈ రసభంగ కారణాల గురించి, మమ్మటుడికన్నా ముందే, తొమ్మిదో శతాబ్దానికి చెందిన ఆనందవర్ధనుడు ధ్వన్యాలోకంలో ఇలా చెప్పాడు:

విరోధిరససంబంధివిభావాదిపరిగ్రహః |
విస్తరేణాన్వితస్యాపి వస్తునోఽన్యస్య వర్ణనమ్ ||
అకాండ ఏవ విచ్ఛిత్తిరకాండే చ ప్రకాశనమ్ |
పరిపోషం గతస్యాపి పౌనఃపున్యేన దీపనమ్ ||
రసస్య స్యాద్విరోధాయ వృత్త్యనౌచిత్యమేవ చ ||

విభావ, అనుభావ, సంచారీ భావాల సరైన కలయిక వల్ల రసం పుడుతుందని భరతముని చెప్పాడు. అటువంటి భావాల్లో పరస్పరం పొసగని భావాల్నో, విరుద్ధ భావాల్నో మరి ఎక్కువ పెంచిపోషించడంవల్లా, ప్రధాన రసాన్ని నిర్లక్ష్యం చేసి అప్రధానమైన అంశాలమీద మరీ ఎక్కువ దృష్టి పెట్టడం వల్లా, ఒక రసం పరిపుష్టం కావడానికి తగిన సన్నివేశాన్ని నిర్మించకుండానే ఆ రసాన్ని ప్రవేశపెట్టడం వల్లా, లేదా రసం పరిపుష్టికాకుండానే దాన్ని సగంలో తుంచెయ్యడం, మరీ ముఖ్యంగా పాత్రల ప్రవర్తనలో అనౌచిత్యం రసభంగానికి కారణాలవుతాయి. వీటిని పరిహరించాలి అని చెప్తున్నాడు ఆనందవర్ధనుడు.

ఇక్కడ ‘ఔచిత్యం’ అనే మాట చాలా ముఖ్యమైనమాట. ఈ శ్లోకానికి తనే రాసుకున్న వ్యాఖ్యలో ఆయనిలా అంటున్నాడు:

అనౌచిత్యాదృతే నాన్యద్రసభంగస్య కారణం |
ప్రసిద్ధౌచిత్యబంధస్తు రసస్యోపనిషత్ పరా ||

(రసభంగం జరిగిందంటే అందుకు అనౌచిత్యం కన్నా మించిన కారణం మరొకటి ఉండదు. అలానే ఔచిత్యాన్ని పాటించడాన్ని మించిన రసోపనిషత్తు మరోటి లేదు కూడా.)

ఇక్కడ ఔచిత్యం అంటే, కేవలం propriety కాదు. అది ఆ సందర్భానికీ, ఆ పాత్రల స్వభావానికీ, కవి ఉద్దేశిస్తున్న రసావిష్కరణకీ తగిన విధంగా కావ్యశబ్దాల్నీ, అర్థాల్నీ వినియోగించడం. ఒక్కమాటలో చెప్పాలంటే, ఔచిత్యం అంటే realism. అంటే contextual truth. అలాగే సమతూకం. ఒక శిల్పి శిల్పాన్ని చెక్కుతున్నప్పుడు దాని వివిధ అంగాల మధ్య ఒక నిష్పత్తిని ఎలా పాటిస్తాడో అలానే శబ్దాల పట్లా, అర్థాల పట్లా, పాత్రల ప్రవర్తన పట్లా, సంఘటనల పట్లా, వాటి అమరిక పట్లా ఒక appropriate proportion ని సాధించడం.

ఇమ్మెన్సీలో కావ్యాత్మకత

ఇమ్మెన్సీ చదువుతున్నప్పుడు ఆ నవలిక బాగా సూటిగా చెక్కిన బాణం ములికిలాగా మన హృదయంలో దిగబడుతుంది. ఇందుకు కారణం అలంకారికులు చెప్పిన జాగ్రత్తల్లాంటివి అతడు తన మనసులో పెట్టుకోడం కారణమనిపిస్తుంది. వాటిని ఎంచి చెప్పమంటే, కనీసం అయిదు లక్షణాలు కనిపిస్తున్నాయి. మొదటిది, అన్నిటికన్నా ముఖ్యమైంది, అతడు ఈ కథని విస్తరించి చెప్పాలన్న ప్రలోభానికి లోను కాకపోవడం. ఇందులో ప్రతి ఒక్క సన్నివేశాన్నీ ఎంతో విస్తరించి చిత్రించవచ్చు. నేర్పుగా చెప్పగలిగితే రసభంగం కాకుండా కూడా చూసుకోవచ్చు. కానీ అప్పుడు ఆ రచన సుదీర్ఘమైన రచనగా మారి ఒక అస్పష్టమైన జ్ఞాపకంగా మనకు గుర్తుండిపోతుందే తప్ప మన తలపుకి వచ్చినప్పుడల్లా మన హృదయంలో కలుక్కుమనే తియ్యని ముల్లులాగా మారి ఉండదు. ఒక నాటకం చూసినప్పుడు మనం చేరుకునే ఆ రసపరాకాష్టని ఒక single sitting లో మనకి ఈ నవలిక సాధ్యం చెయ్యగలుగుతోంది. ఇతిహాససమానాలైన జర్మన్ Bildungsroman లు గానీ, బాల్జాక్, డికెన్స్, గొగోల్ ల బృహత్ సామాజిక చిత్రణలుగానీ మనకి ఇటువంటి అనుభూతిని ఇవ్వలేవు. అవి చదివితే కూడా గొప్ప సంతోషం కలుగుతుందిగానీ, దాన్ని ఈ నవలిక చదవడంలో కలిగే కావ్యానందంతో పోల్చలేం.

రెండోది, నవలని రచయిత ఒక హంసతూలికతో రాసాడా అన్నంత సున్నితమైన కథనం. అతడు ఎక్కడా తన గొంతు బిగ్గరగా వినిపించడు. అతడే కాదు, అతడి పాత్రలు కూడా పెద్ద గొంతుతో మాట్లాడవు. చివరకి రెస్టారెంటులో జిప్సీపిల్ల పాట కూడా మంద్రగతిలోనే వినబడుతుంది. తన చుట్టూ తిరుగుబాట్లు, విప్లవాలు, యుద్ధాలు సంభవిస్తుండగా, అతడు ఇంత సున్నితమైన కంఠస్వరంతో ఈ కథ చెప్పగలగడం చాలా ఆశ్చర్యకరమనిపిస్తుంది.

మూడవది, ఒక్క చిన్న వాక్యంతో, లేదా అతి చిన్న వర్ణనతో, ఒక పాత్ర మనఃస్థితిని చెప్పగలగడం. ఇది మామూలు కౌశల్యం కాదు. లక్షశ్లోకాల ఇతిహాసాన్ని రాసిన వ్యాసుడికి మాత్రమే సాధ్యమైన శిల్పం ఇది. ఉదాహరణకి, ఎనిమిదో అధ్యాయంలో రైన్‌హార్డ్ ఒక జానపద గీతం కాగితం చుట్ట చేతుల్లోకి తీసుకున్నప్పుడు, రచయిత, ఆ కాగితం మరొక కొస ఎలిసబెత్ పట్టుకుంది అని చెప్తాడు. ఆ తర్వాత రైన్‌హార్డ్ ఆ గీతం పైకి చదివినప్పుడు అది ఎలిసబెత్ కథలానే మనకు వినిపిస్తూంటుంది. కానీ రచయిత అప్పటిదాకా కూడా ఎలిసబెత్ మనసులో ఏముందో చెప్పడు. ఆమె మనసులో ఎటువంటి దుఃఖసముద్రం ఘూర్ణిల్లుతూ ఉందో మనం పసిగట్టలేం. కానీ ఆ గీతం వినిపించడం పూర్తికాగానే తన చేతుల్లో ఉన్న ఆ కాగితం కంపిస్తున్నదని రైన్‌హార్డ్ కి తెలుస్తున్నదని చెప్తాడు కథకుడు. నేను చదివిన సాహిత్యంలో ఇంత ధ్వనిపూర్వకమైన సన్నివేశాల్ని వేళ్ళ మీద మాత్రమే లెక్కపెట్టగలను.

నాలుగవది, మొత్తం నవలికలో సంఘర్షణ కేంద్రంలో కథకుడు ఒక పువ్వుని ప్రతీకాత్మకంగా ప్రవేశపెట్టడం. ఇది ఈ వాస్తవిక నవల పరిపూర్ణ కావ్యంగా మారిపోయిన ఘట్టం. ఒకసారి ఈ నవలిక చదివిన పాఠకుడు ఆ తెల్లకలువని తన జీవితాంతం మరవలేడు.

అయిదవది, ఇందులో ఉన్న గీతాలు. ఇవి జర్మన్ జానపద గీతాలు. తనకన్నా ముందు రొమాంటిక్ కవులు ఇటువంటి జానపద గీతాల బాణీల్ని తీసుకునే కవిత్వం రాసారు. వాటిద్వారానే వారు కవిత్వస్వరూపాన్ని మార్చెయ్యగలిగారు. స్టార్మ్ తన నవలికలో ఈ గీతాల్ని ప్రవేశపెట్టడం ద్వారా తన పూర్వపు రొమాంటిక్ యుగానికీ, తనకాలపు వాస్తవికతావాదానికీ మధ్య ఒక సున్నితమైన వంతెన నిర్మించాడని చెప్పవచ్చు. (ఇంకా ఉంది)

23-11-2026

2 Replies to “కావ్యాత్మక వాస్తవికత-2”

  1. Sir, it feels like you are peeling away layer after layer, helping us understand this novel from so many different dimensions. Its historical context, the changing literary sensibilities of that time, and now the craft that went into creating this classic.

    ఈ నవలలోని పరిస్థితులూ, పాత్రలూ ఒక దృశ్యమాలికలా ఒక్కో సన్నివేశంలో ఒక్కో విధంగా మారుతూ ఉండటం, ఆ మార్పుల ద్వారానే నవల చెప్పాలనుకున్న తాత్త్విక భావన మనకు మరింతగా అర్థమవుతూ ఉండటం చాలా ఆసక్తికరంగా అనిపించింది.

    అలంకారికులు నిర్వచించిన కావ్యశిల్ప నిర్మాణంలో ఒక కవి జాగ్రత్త పడవలసిన సూత్రాలు చాలా enlightening గా ఉన్నాయి. వాటి దృష్టిలో నుంచి ఈ నవలను చూసినప్పుడు, Theodor Storm ఎంత పకడ్బందీగా, ఒక్క మాట కూడా ఎక్కువ తక్కువ కాకుండా ఈ నవలను రాశారా అనిపిస్తుంది. Your translation is equally beautiful and effective.

    అందుకనే మీరు అన్నట్టు, “ఆ నవలిక బాగా సూటిగా చెక్కిన బాణం ముల్లులాగా మన హృదయంలో దిగబడుతుంది.” అలాగే, “ఒకసారి ఈ నవలిక చదివిన పాఠకుడు ఆ తెల్లకలువని తన జీవితాంతం మరవలేడు.”

    ఒక చిన్న అందమైన నవల చదివినప్పుడు కలిగిన experience ని, దాని వెనుక ఉన్న ఇన్ని విషయాలనూ, ఇంత లోతైన విశ్లేషణనూ పరిచయం చేస్తూ మరింత enrich చేస్తున్నారు. 🙏🏽

Leave a Reply