
ఎనిమిదవ అధ్యాయం
తల్లి మాటను తలను తాలిచి
కొన్ని రోజుల తర్వాత, సాయంసంధ్య ముసురుకుంటున్న వేళ. ఆ కుటుంబమంతా రోజూలాగే తోట గదిలో కలిసి కూర్చున్నారు. తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి; సరోవరానికి ఆవలి వైపు అడవుల్లో దూరంగా సూర్యుడు అప్పటికే అస్తమించి ఉన్నాడు.
వాళ్ళు రైన్హార్డ్ను కొన్ని జానపద గీతాలు ఆలపించమని అడిగారు. ఎక్కడో దూర గ్రామసీమలో ఉంటున్న అతడి స్నేహితుణ్ణుంచి ఆ గీతాలు ఆ మధ్యాహ్నమే అతడికి అందాయి. అతడు పైకి వెళ్ళి తన గదిలోంచి ఆ గీతాల కట్టలు తీసుకుని కిందికి వచ్చాడు. విడివిడిగా కాగితాల మీద చక్కగా రాసిపెట్టిన గీతాల్ని అతడలా చుట్టిపెట్టుకున్నాడు.
అందరూ బల్ల చుట్టూ కూర్చున్నారు. ఎలిసబెత్ రైన్హార్డ్ పక్కనే కూర్చుంది. ‘నా చేతికి ఏ కాగితమొస్తే ఆ గీతం చదువుకుందాం’ అన్నాడు రైన్హార్డ్. ‘నేను కూడా వీటినింకా పూర్తిగా చదవలేదు’ అని కూడా అన్నాడు.
ఎలిసబెత్ జాగ్రత్తగా ఆ కాగితాల చుట్ట విప్పింది. ‘ఇక్కడ ఎలా పాడాలో ఆ సంగీతనిర్దేశం కూడా రాసిపెట్టి ఉంది. రైన్హార్డ్ నువ్వు తప్పకుండా వీటిని పాడి వినిపించు’ అని అంది.
మొదట అతను టైరోల్ ప్రాంతానికి చెందిన కొన్ని జానపద నృత్యగీతాలు వినిపించాడు. వాటిని పఠిస్తూనే అప్పుడప్పుడు ఉల్లాసభరితమైన బాణీల్లో వాటిని కూనిరాగాలు తీసాడు. దాంతో ఆ చిన్ని బృందం చుట్టూ ఒక ఆహ్లాదకర వాతావరణం అల్లుకుంది.
‘ఇంత అందమైన పాటలు ఎవరు రాసారంటావు?’ అనడిగింది ఎలిసబెత్.
‘అందులో ఏముంది? ఆ పిచ్చిమాటలు వింటుంటే తెలియడంలా? ఎవరో దర్జీపనివాళ్ళో, మంగలిపనివాళ్ళో, అలాంటి సరదా మనుషులే రాసి ఉంటారని’ అన్నాడు ఎరిక్.
రైన్హార్డ్ మాత్రం ‘అవి ఎవరో ఒకరు రాస్తే పుట్టినవి కావు. అవి తమంతట తామే పుట్టిపెరిగే పాటలు. మబ్బుల్లోంచి రాలిపడతాయి. సాలీడు దారాల్లాగా గాల్లో అక్కడా ఇక్కడా తేలుతూ ఏకకాలంలో వేలాది చోట్ల వేలాది కంఠాల ద్వారా వినవస్తాయి. ఈ పాటల్లో మనం మన అంతరంగ అనుభవాల్నీ, ఆవేదనల్నీ కనుగొంటాం. చెప్పాలంటే వీటిని రాయడానికి ఒక విధంగా మనమంతా కూడా సాయం చేసినట్టే’ అని అన్నాడు.
అలా అంటూ అతడు మరో కాగితం చేతుల్లోకి తీసుకున్నాడు: ‘ఆ కొండ శిఖరాన ఒంటిగా నిలుచుండి…’
‘ఓహ్! ఆ పాట నాకు తెలుసు. మొదలుపెట్టు రైన్హార్డ్! నేను కూడా నీతో పాటు గొంతు కలుపుతాను’ అంది ఎలిసబెత్.
మానవ హృదయం ఇంతటి అతిలోక మధురమైన గీతాన్ని ఎలా ఊహించగలిగిందో చెప్పలేని ఆ సుప్రసిద్ధ గీతాన్ని వాళ్ళిద్దరూ కలిసి ఆలపించారు. ఆ గీతంలోని రెండవ చరణాన్ని ఎలిసబెత్ ఒక నును లేత కంఠంతో ఆ యువకుడి పురుష స్వరానికి శ్రుతికలుపుతూ ఆలపించింది.
వాళ్ళమ్మగారు కుట్లూ, అల్లికల పనిలో నిమగ్నులై ఉండగా, ఎరిక్ రెండు చేతులూ జోడించి ఆ గీతాన్ని విన్నాడు. పాట ముగియగానే, రైన్హార్డ్ ఆ కాగితం మౌనంగా పక్కన పెట్టాడు. ఆ సాయంకాలపు నిశ్శబ్దంలో సరస్సు ఆవలి ఒడ్డు వైపునుంచి ఆవుల మెళ్ళో గంటల చప్పుడు వినవచ్చింది; తెలియని తన్మయత్వంతో అందరూ అటువైపే వినసాగారు. ఇంతలో ఒక గొల్లపిల్లవాడి స్పష్టమైన గొంతు పాడుతూ వినిపించింది:
ఆ కొండ శిఖరాన ఒంటిగా నిలుచుండి
అట్టడుగు లోయలో అందాలు కనుచుంటి
రైన్హార్డ్ మందహాసం చేసాడు. ‘వింటున్నావు కదా! ఈ పాట ఇలానే మనిషి నుంచి మనిషికి ప్రవహించుకుంటూ పోతుంది.’
‘ఈ పాట ఈ ప్రాంతాల్లో తరచూ వినబడుతూ ఉంటుంది’ అంది ఎలిసబెత్.
‘అవును’ అన్నాడు ఎరిక్. ‘వాడు పశువుల కాపరి కాస్పర్. ఆవుల్ని ఇంటికి తోలుకుపోతున్నాడు.’
ఆ క్షేత్రంలో ఉన్న భవనాల వెనగ్గా ఆ గంటల చప్పుడు నెమ్మదిగా సద్దుమణిగేదాకా వారు ఆ పాట ఆలకిస్తూనే ఉన్నారు. ‘ఈ ప్రపంచం ఎంత పురాతనమో ఈ బాణీలు కూడా అంతే పురాతనం. అవి ఈ అడవి గర్భంలో నిద్రాణంగా ఉంటాయి. వాటిని మొట్టమొదట కనుగొన్నదెవరో ఆ దేవుడికే తెలియాలి’ అన్నాడు రైన్హార్డ్.
అప్పుడు అతడు మరొక కాగితం చేతుల్లోకి తీసుకున్నాడు.
అప్పటికి చీకటి మరింత చిక్కనైంది. సరోవరానికి ఆవలి వైపు అడవుల మీద సాయంకాలపు సంధ్యాకాంతి ఎర్రటి వెలుగు నురగలాగా పరుచుకుంది. రైన్హార్డ్ ఆ కాగితం చుట్ట విప్పుతుండగా, ఎలిసబెత్ దాన్ని మరో వైపు పట్టుకుంది. ఇద్దరూ కలిసి ఆ గీతాన్ని పరిశీలించారు. అప్పుడు రైన్హార్డ్ దాన్ని పైకి చదవసాగాడు:
తల్లి మాటను తలను తాలిచి
వేరొకనికిల్లాలినైతిని
దేనినాదని తలచినానో
దానినిప్పుడు తాకలేనను
తలపు గుండెను చీల్చుచున్నది
కన్నకూతురి గొంతుకోసిన
తల్లి నేరము తలవకుందున?
ఏది ఘనమని ఎంచినామో
దాని నీడన దాగి ఉండిన
నష్టభాగ్యమునెట్లు మరచుట?
శోకవహ్నుల దగ్ధమాయెను
స్వాతిశయ సంపద సమస్తము
బతుకు భగ్నము కాకపోయిన
అడవిదారుల కొండవాలుల
ఇంతబిచ్చము నెత్తుకొననో?
తాను ఆ కాగితంలో ఉన్న గీతాన్ని చదువుతున్నంతసేపూ ఆ కాగితం సూక్ష్మంగా కంపిస్తుండటం రైన్హార్డ్కు అనుభవమైంది. అతడు పఠించడం ముగించగానే ఎలిసబెత్ తాను కూర్చున్న కుర్చీ వెనక్కి జరిపి ఒక్కమాట కూడా మాట్లాడకుండా తోటలోకి వెళ్ళిపోయింది. వాళ్ళమ్మ ఆమె వెనకనే తన చూపులు సారించింది. ఎరిక్ ఆమె వెనకనే వెళ్ళబోయాడు కానీ వాళ్ళమ్మ వారిస్తూ ‘ఎలిసబెత్కి బయట చిన్న చిన్న పనులేవో చెయ్యవలసినవి ఉన్నట్టున్నాయి’ అంది. దాంతో ఎరిక్ తానున్న చోటే ఉండిపోయాడు.
బయట తోటపైనా, సరసు పైనా సాయంకాలం మరింత దట్టంగా అలుముకుంటోంది. తెరిచి ఉన్న ద్వారాల్లోంచి రెక్కలపురుగులు ఎగురుతూ ఉన్నాయి. వాటి వెంబడే పూల పరిమళాలు కూడా మరింత గాఢంగా లోపలకి ప్రసరిస్తున్నాయి. చెరువులోంచి కప్పల బెకబెక వినిపిస్తున్నది. కిటికీ చెంత ఒక నైటింగేలు సుమధుర గానం మొదలుపెట్టగానే తోటలోపలనుంచి మరొక గొంతు దానికి బదులిస్తున్నది. చెట్ల కొమ్మల మీంచి చంద్రుడుదయించాడు.
శాఖోపశాఖల్తో చిక్కగా అల్లుకున్న తోటదారిలోకి ఎలిసబెత్ సుకోమల సుమధుర మూర్తి ఎక్కణ్ణుంచి కనుమరుగయ్యిందో ఆ ప్రదేశం వైపు రైన్హార్డ్ కొంతసేపు అట్లానే తదేకంగా చూసాడు. అప్పుడు తన చేతుల్లో ఉన్న కాగితాలు చుట్టచుట్టి తన మిత్రులనుంచి సెలవు తీసుకుని ఆ ఇంటిదగ్గరనుంచి సరస్సు వైపు అడుగులేసాడు.
అడవులు నిశ్శబ్దంగా ఉన్నాయి. వాటి చిక్కని నీడలు ఆ సరోవరతలం పైన సుదూరానికీ పరుచుకుని ఉన్నాయి. ఆ సరోవరమధ్యం మాత్రం మసక వెన్నెల ఛాయలో తడిసిముద్దవుతున్నది. గాలి లేకపోయినప్పటికీ అప్పుడూ అప్పుడూ చెట్ల సందుల మధ్యలో ఒక రెపరెప వినవస్తున్నది. అది నడివేసవిరాత్రి విడుస్తున్న నిట్టూర్పు.
రైన్హార్డ్ ఆ సరస్తీరం వెంబడి అలానే నడుచుకుంటూ పోయాడు. తానున్నచోటునుంచి అల్లంత దూరంలో అతనికొక తెల్లని కలువ పువ్వు కనిపించింది. దాన్ని మరింత దగ్గరగా చూడాలన్న కోరిక అతణ్ణి ఆవహించింది. దాంతో దుస్తులు విప్పి పారేసి ఆ నీళ్ళల్లో అడుగుపెట్టాడు. ఆ చెరువు ఏమంత లోతుగా లేదు. కరుకురాళ్ళూ, నీటితుప్పలూ అతని పాదాలకి అడ్డం పడుతున్నాయి. అలాగని ఈదుకుంటూ పోయి ఆ కలువపువ్వు తెచ్చుకునేటంతగా ఆ నీళ్ళల్లో లోతు తగల్లేదు.
అంతలోనే హటాత్తుగా అతడి కాళ్ళు లోతుల్లోకి జారాయి. నీళ్ళు అతణ్ణి ముంచెత్తి చుట్టూ సుళ్ళు తిరిగాయి. అతడు తనని తాను కూడదీసుకుని పైకి లేవడానికి కొంతసేపు పట్టింది. అతడు తన కాళ్ళూ చేతులూ ఆడిస్తూ ఒక వలయం చుట్టి తాను ఆ నీళ్ళల్లో ఎక్కడ అడుగుపెట్టాడో ఆ చోటు నిర్ధారించుకోడానికి ప్రయత్నించాడు. ఇంతలోనే మళ్ళా మిలమిలా మెరుస్తున్న ఆ వెడల్పాటి ఆకుల మధ్య ఆ కలువ పువ్వు ఒంటరిగా తేలియాడుతూ అతనికి కనిపించింది.
అతను నెమ్మదిగా ముందుకి ఈదాడు. ఈదుతూనే మధ్యమధ్యలో తన చేతులు నీళ్ళల్లోంచి పైకెత్తుతూ ఉన్నాడు. అలా చేతులు పైకెత్తినప్పుడల్లా వాటిమీంచి కిందకి జారుతున్న నీటిబొట్లు ఆ వెన్నెల్లో తళతళలాడుతున్నాయి. అయినా కూడా అతనికీ, ఆ పువ్వుకీ మధ్య ఉన్న దూరం తగ్గుతున్నట్టు కనబడటం లేదు. అతడు తల వెనక్కి తిప్పి తాను వదిలిపెట్టిన తీరం కేసి చూసాడు. అది మరింత పొగమంచులో దట్టంగా కూరుకుపోయి మరింత దూరమవుతూ ఉంది. కానీ అతను తన ప్రయత్నం విరమించాలనుకోలేదు. ఆ పువ్వు కనిపిస్తున్న దిక్కు వైపు మరింత ఈదసాగాడు.
ఎట్టకేలకు అతడు ఆ పువ్వుకి ఎంత దగ్గరగా పోగలిగాడంటే ఆ వెన్నెల్లో దాని వెండిరెక్కల్ని పోల్చుకోగలిగాడు. కానీ అదే సమయంలో ఆ సరస్సు లోపల ఉన్న నీటిమొక్కల నున్నని కాండాలూ, తీగల వలలూ అతడి నగ్నదేహావయవాల్ని చుట్టేస్తున్నట్టుగా అతడికి అనుభవమవుతున్నది.
అతని చుట్టూ ఉన్న ఆ అపరిచిత జలాలు నల్లగా మారిపోయాయి. అతనికి తన వెనగ్గా ఒక చేప ఎగిరి దూకిన చప్పుడు వినిపించింది. హటాత్తుగా ఆ వింత వాతావరణంలో అతణ్ణొక అసాధారణమైన అనుభూతి చుట్టుముట్టింది. దాంతో అతడు తన యావచ్ఛక్తీ వినియోగించి ఆ మొక్కల, తీగల అల్లికల వలని ఛేదించుకుంటూ, ఊపిరిబిగబట్టి మరీ తాను వచ్చిన వైపే వెనక్కి ఈదుకుంటూ పోయాడు. గట్టుమీదకు చేరుకున్నాక అతడు మళ్ళా ఆ కొలను వైపు చూసినప్పుడు ఆ కలువ పువ్వు ఆ చీకటిజలాల మధ్య అంతే దూరంగా, అంతే ఒంటరిగా తేలియాడుతూ కనిపించింది.
అతడు దుస్తులు తొడుక్కుని నెమ్మదిగా తన ఇంటిబాట పట్టాడు. తోటదారిన అతడు ఇంటికి చేరుకుని గదిలో అడుగుపెట్టేటప్పటికి ఎరిక్, ఎలిసబెత్ వాళ్ళమ్మగారూ ప్రయాణసన్నాహాల్లో కనిపించారు. వ్యాపారానికి సంబంధించిన పనుల మీద వాళ్ళు ఆ మర్నాడు పొద్దున ఎక్కడికో చిన్న ప్రయాణం చేపట్టబోతున్నారు.
‘ఇంత పొద్దుపోయిన దాకా ఈ చీకట్లో నువ్వెక్కడికి వెళ్ళావు?’ అనడిగారు ఎలిసబెత్ వాళ్ళమ్మగారు.
‘నేనా? ఒక కలువపువ్వుని పలకరించి వద్దామనుకున్నాను. కానీ కుదిరింది కాదు’ అన్నాడు రైన్హార్డ్.
‘నువ్వు చెప్పేవి మనిషన్నవాడికి అర్థమయ్యే విషయాలు కాదు. లేకపోతే కలువపువ్వుల్తో నీకేం పని?’ అనడిగాడు ఎరిక్.
‘అదా, నేను ఆ కలువపువ్వుతో ఒకప్పుడు స్నేహం చేసినవాణ్ణి. కానీ అది చాలా కాలం కిందటి సంగతిలే’ అన్నాడు రైన్హార్డ్.
(ఇంకా ఉంది)
2-11-2026


శోకవహ్నుల దగ్ధమాయెను
స్వాతిశయ సంపద సమస్తము
బతుకు భగ్నము కాకపోయిన
అడవిదారుల కొండవాలుల
ఇంతబిచ్చము నెత్తుకొననో?
ధన్యవాదాలు సోమ శేఖర్!
Especially beautiful chapter ఇది! Folk songs గురించి Reinhard చెప్పిన మాటలు, వాటి పట్ల అతనికున్న appreciation చాలా బాగుంది. ఆ పాటలు మబ్బుల్లోంచి రాలిపడతాయి, వేలాది గొంతుల ద్వారా వినిపిస్తాయి అన్న అతని మాటలే కవిత్వం లాగా వున్నాయి!
Elisabeth గురించి అతను రాసుకున్న పాట, అది చదివినప్పుడు ఆమె మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోవడం, కలువపువ్వుని చేరుకోవడానికి Reinhard చేసిన ప్రయత్నం, చివరికి దాన్ని అందుకోలేక వెనుదిరగడం అతని మనసులోని longing కి metaphors లాగా అనిపించాయి.
అవును. ఈ అధ్యాయం ఈ కథలోనే పతాక సన్నివేశం.