
తొమ్మిదవ అధ్యాయం
ఎలిసబెత్
ఆ మర్నాడు అపరాహ్ణం వేళ ఎలిసబెత్, రైన్హార్డ్ కలిసి సరస్సు అవతలి వైపుకు నడుచుకుంటూ వెళ్ళారు. వాళ్ళు కొన్నిసార్లు ఆ అడవిదారుల్లో పచార్లు చేసారు. కొన్ని సార్లు చెరువులోకి చొచ్చుకుపోయిన గట్టమ్మటే తిరిగారు. తాము ఊళ్ళో లేనప్పుడు రైన్హార్డ్ను తీసుకువెళ్ళి ఆ చుట్టుపక్కల ఉండే సుందర దృశ్యాలు చూపించమని ఎరిక్ ఆమెకి చెప్పి వెళ్ళాడు. ముఖ్యంగా సరస్సుకి అవతలి వైపు నుంచి తమ తోటా, తోటలో మేడా ఎలా కనిపిస్తాయో చూపించమని చెప్పాడు. అందుకని వాళ్ళిద్దరూ ఇప్పుడు ఒకచోటినుంచి మరోచోటకి నడుచుకుంటూ వెళ్ళారు.
అలా నడిచినంతసేపు నడిచాక ఎలిసబెత్ అలిసిపోయి అక్కడే కిందకు వాలిన కొమ్మల నీడన కూచుంది. రైన్హార్డ్ ఆమెకి ఎదురుగా ఒక చెట్టు బోదెని ఆనుకుని నిలబడ్డాడు. అడవుల్లోంచి దూరంగా ఎక్కడో ఒక కోకిల కూస్తూ ఉన్నది. రైన్హార్డ్కు అకస్మాత్తుగా ఇదంతా ఎప్పుడో గతంలో జరిగినట్టే తోచింది. అతడు ఆమెకేసి చూస్తూ ఒక వింతైన చిరునవ్వుతో అడిగాడు:
‘మనం స్ట్రాబెర్రీలు ఏరుకుందామా?’
‘ఇది స్ట్రాబెర్రీల కాలం కాదు’ అంది ఆమె.
‘లేదు. ఆ రోజులు తొందరలోనే రాబోతున్నాయి.’
ఎలిసబెత్ మౌనంగానే తన తల అడ్డంగా ఊపింది. అప్పుడామె మళ్ళీ లేచి నిలబడింది. వాళ్ళిద్దరూ కలిసి పచార్లు చేసారు. వాళ్ళిద్దరూ అలా పక్క పక్కనే నడుస్తుండగా అతడి చూపులు మాటిమాటికీ ఆమె వైపే వాలుతున్నాయి. ఆమె నడకలో ఒక విలాస సౌందర్యం, ఒక లాలిత్యం అతనికి గోచరిస్తున్నాయి. అతను తనకు తెలీకుండానే నడకలో ఆమెకి వెనకబడి ఆమె సంపూర్ణ రూపాన్ని కన్నుల పండువుగా ఆస్వాదిస్తూ ఉన్నాడు.
అలా వాళ్ళిద్దరూ గడ్డిగులాబీలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిన ఒక విశాలమైన ప్రదేశానికి చేరుకున్నారు. అక్కణ్ణుంచి సుదూర గ్రామసీమ కనిపిస్తూ ఉంది. రైన్హార్డ్ కిందకి వంగి తన పాదాలదగ్గర ఒత్తుగా కనిపిస్తున్న ఒక చిన్ని మొక్కనుంచి ఒక గడ్డిగులాబీ తెంచి మళ్ళా తలెత్తి చూసేటప్పటికి, అతడి వదనంలో ఏదో గాఢవేదన కనిపిస్తూ ఉంది.
‘ఈ పువ్వేమిటో నీకు తెలుసా?’ అనడిగాడతడు.
ఆమె అతణ్ణి ప్రశ్నార్థకంగా చూసింది. ‘ఇదొక ఊదా గులాబి. నేను చాలా సార్లు ఈ అడవుల్లోంచి ఏరుకొస్తుంటాను దీన్ని.’
‘ఇంట్లో నా దగ్గర ఒక పాత పుస్తకం ఉంది. అందులో నేనొకప్పుడు గీతాలూ, గేయాలూ రాసుకునేవాణ్ణి. కానీ ఇప్పుడదంతా గడిచిపోయిన సంగతి. సుదీర్ఘ మౌనం కింద ఆ పుస్తకమూ, ఆ గీతాలూ మరుగున పడిపోయాయి. ఆ పుస్తకం పేజీల మధ్యలో ఒకచోట ఈ ఊదాగులాబీ పువ్వుంది. వాడిపోయిన పువ్వు. అదెవరిచ్చారో తెలుసా నీకు?’ అనడిగాడు అతడు.
ఆమె మాటల్తో ఏమీ జవాబివ్వకుండా తల అడ్డంగా ఊపింది. కానీ తన తల వాల్చి అతడు తన చేతిలో పట్టుకున్న ఆ పువ్వుపైనే చూపులు నిలిపింది. వాళ్ళిద్దరూ చాలాసేపు అలానే ఉండిపోయారు. ఆమె మళ్ళా తన కళ్ళెత్తి చూసేసరికి ఆ కళ్ళల్లో నీళ్ళు కదలాడుతుండటం అతడు చూసాడు.
‘ఎలిసబెత్! దూరంగా ఆ నీలికొండల వెనక మన యవ్వనదినాలు ఉండిపోయాయి. అవేమైపోయాయి?’ అనడిగాడు.
ఆ తర్వాత వాళ్ళ మధ్య మరేమాటా దొర్లలేదు. వాళ్ళు ఒకరి పక్కన ఒకరు నిశ్శబ్దంగా సరసువైపుకు నడిచారు. గాల్లో చాలా ఉక్కపోతగా ఉంది. పడమటిదిక్కున కారుమబ్బులు కమ్ముకుంటున్నాయి. ‘పెద్ద తుపాను వచ్చేలాగా ఉంది’ అంది ఎలిసబెత్ తన నడక వేగం పెంచుతూ. రైన్హార్డ్ మౌనంగా తలూపాడు. వాళ్ళిద్దరూ త్వర త్వరగా ఆ ఒడ్డమ్మట నడిచి తమ పడవ దగ్గరికి చేరుకున్నారు.
సరోవరాన్ని దాటుతున్నప్పుడు ఎలిసబెత్ ఆ పడవ అంచుమీద తన చేయి ఆనించింది. రైన్హార్డ్ పడవ నడుపుతూ తన చూపులు ఆమె వైపు సారించాడు, కానీ ఆమె చూపులు అతణ్ణి దాటి సుదూరంలోకీ చూస్తున్నాయి. అతడి చూపు ఆమె మీంచి కిందకి వాలి ఆమె చేతిమీద పడింది. ఆమె పెదాలు పలకలేకపోతున్నదాన్ని ఆ కోమలహస్తం వెల్లడి చేస్తూ ఉంది.
రాత్రుళ్ళు తన వ్యథాభరిత హృదయంపైన ముడుచుకున్నప్పుడు ఒక స్త్రీ కోమల హస్తం పైన ఆమె రహస్యవేదన దిగవిడిచే సుకుమారవేదనా రేఖ ఆ చేతిపైన కనిపిస్తూ ఉన్నది. అతడి చూపులు తన చేతిపైన నిలుస్తున్నవని గ్రహించడంతో ఎలిసబెత్ ఆ చేతిని ఆ అంచుమీంచి నీళ్ళల్లోకి జారవిడిచింది.
వాళ్ళిద్దరూ ఇంటికి చేరుకునేటప్పటికి ఆ సస్యక్షేత్ర భవంతి ముందు కత్తులు సానబెట్టేవాడి బండి ఒకటి ఆగి ఉండటం కనిపించింది. తన నల్లని జుత్తు గాలికి రేగుతుండగా ఒక మనిషి తన పళ్ళబిగువున సంచారజీవుల గీతమొకటి పాడుతూ ఆ బండి చక్రాన్ని వేగంగా తిప్పుతున్నాడు. ఒక కుక్క ఆ బండికి కట్టిఉంది. అది ఆ పక్కనే పడుకుని రొప్పుతూ ఉంది. చింకిపాతలు ధరించిన ఒక యువతి ఎలిసబెత్ ఇంటి గుమ్మం దగ్గర నిలబడి అడుక్కుంటూ ఉంది. ఆమె దేహాంగాల్లో సౌందర్యం వెలిసిపోయిన జాడలు కనిపిస్తున్నాయి.
రైన్హార్డ్ తన జేబులోకి చెయ్యిపోనిచ్చాడు. కానీ ఎలిసబెత్ అతని కన్నా ముందే తన పర్సులో ఉన్నదంతా ఆ భిక్షగత్తె దోసిట్లో త్వరత్వరగా కుమ్మరించేసింది. ఆ వెనువెంటనే ఆమె గిరుక్కున వెనక్కి తిరిగి మెట్లెక్కుతూ విలపిస్తుండటం రైన్హార్డ్కు వినిపించింది.
ఆమెను ఆపాలని అతనికి అనిపించింది. కానీ తన మనసు మార్చుకుని ఆ మెట్లకిందనే ఉండిపోయాడు. ఆ బిచ్చగత్తె తన చేతుల్లో వర్షించిన ఆ సొమ్ముని అట్లానే పట్టుకుని నిశ్చలంగా ఆ గుమ్మం దగ్గరే ఇంకా నిలబడిపోయి ఉంది.
‘నీకింకేం కావాలి?’ అనడిగాడు రైన్హార్డ్.
ఆమె ఉలిక్కిపడింది. ‘నాకింకేమీ వద్దు’ అని అతడి వైపు తిరిగి వెర్రి చూపుల్తో అతణ్ణే చూస్తూ నెమ్మదిగా ఆ గుమ్మం దగ్గరనుంచి కదిలిపోయింది. అతడేదో ఒక పేరు పలికాడు కానీ ఆమె అది వినిపించుకోలేదు. ఆమె తన రొమ్ముపై చేతులుంచుకుని తల దించుకుని ఆ సస్యక్షేత్రానికి అడ్డం పడి వెళ్ళిపోయింది.
రేపు ముంగిట మృత్యుదేవత
వచ్చి పిలిచిన వెంట పోదును
ఎప్పటిదో ఒక పాత పాట రైన్హార్డ్ చెవుల్లో ప్రతిధ్వనించింది. అతనికి ఊపిరాడలేదు. కొంతసేపటికి అతడు వెనక్కి తిరిగి పైనున్న తన గదికి వెళ్ళాడు.
ఏదన్నా పనిచేసుకుందామని కూర్చున్నాడు. కానీ అతని ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాయి. అలానే ఒక గంటసేపు నిష్ఫల ప్రయత్నం చేసాక అతడు తిరిగి తోటపక్క గదిలోకి వచ్చాడు. అక్కడెవరూ లేరు. చల్లని ఆకుపచ్చ సంధ్యాకాంతి మాత్రమే అక్కడ పరుచుకుని ఉంది. ఎలిసబెత్ రాసుకునే బల్లమీద ఎర్రటి రిబ్బన్ ఉంది. ఆ మధ్యాహ్నం తన కంఠసీమచుట్టూ ఆమె దాన్ని అలంకరించుకుంది. అతడు దాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. కానీ అది అతణ్ణి కరిచినట్టనిపించింది. వెంటనే దాన్నక్కడే పెట్టేసాడు.
అతనికి మనశ్శాంతి దొరకలేదు. సరస్సు వద్దకు వెళ్లి పడవ కట్లు విప్పాడు. నీటిపై నడుపుకుంటూ వెళ్లి, కొన్ని గంటల క్రితం తానూ ఎలిసబెత్ కలిసి నడిచిన ఆ బాటలన్నింటిలో మళ్లీ నడిచాడు. అతడు ఇంటికి తిరిగి వచ్చేసరికి చీకటి పడింది. పొలం దగ్గర బగ్గీ నడిపే మనిషి ఎదురయ్యాడు. అతడు తన గుర్రాల్ని విప్పి మేతకు వదలబోతున్నాడు. అంటే ఆ ప్రయాణీకులు ఇప్పుడే వచ్చారన్నమాట.
అతడు గుమ్మం దగ్గర అడుగుపెడుతుండగా ఎరిక్ ఆ తోటగదిలో అటూ ఇటూ పచార్లు చేస్తున్న సవ్వడి వినిపించింది. రైన్హార్డ్ అతడి దగ్గరికి వెళ్ళలేదు. ఒక క్షణం అక్కడే నిశ్చలంగా నిలబడి అప్పుడు నెమ్మదిగా మెట్లెక్కి తన గదిలోకి వెళ్ళిపోయాడు. గదిలో కిటికీ పక్క చేతుల కుర్చీలో కూచున్నాడు. తాను కింద ఎక్కడో తోటకి ఆవల కంచెదగ్గర నైటింగేలు పాడుతున్న పాట వింటున్నానని తనను తాను మభ్యపరుచుకోబోయాడు. కానీ నిజానికి అతడు వింటున్నది కొట్టుకుంటున్న తన గుండె చప్పుడు మాత్రమే. కింద ఇంట్లో అందరూ నిద్రకి ఉపక్రమించారు. రాత్రి గడుస్తున్నది. కానీ అతని దృష్టి దానిమీద లేదు.
గంటల తరబడి అతడు అలానే కూచుండిపోయాడు. చివరకు లేచి తెరిచి ఉన్న కిటికీలోంచి బయటికి చూసాడు. ఆకులమీంచి మంచుబొట్లు రాలుతున్నాయి. నైటింగేలు తన గానం ఆపేసింది. తూర్పువైపున లేత పసుపు రంగు వెలుతురు పరుచుకుంటున్న కొద్దీ చిమ్మచీకటి ఆకాశపు నీలిమ కరిగిపోతూ ఉంది. ఒక ప్రత్యూష పవనం కదలాడుతున్నది. అప్పటిదాకా వేడెక్కిన రైన్హార్డ్ నుదుటిని ఆ చల్లగాలి సోకింది. తొలివేకువకే మేల్కొనే భరద్వాజ పక్షి ఒక్క ఉదుటున ఆకాశంలోకి రెక్కలు చాపింది.
రైన్హార్డ్ హటాత్తుగా వెనక్కి తిరిగి బల్లదగ్గరికి వచ్చాడు. ఒక పెన్సిలు కోసం వెతుక్కుని అది దొరకగానే అక్కడే కూచుని తెల్లకాగితం మీద ఏదో రాశాడు. రాయడం పూర్తవగానే తన చేతికర్రా, టోపీ తీసుకుని, ఆ కాగితం అక్కడే వదిలిపెట్టి, నెమ్మదిగా తలుపు తెరిచి కింద నడవాలోకి దిగివచ్చాడు.
ప్రత్యూషవేళల మసక వెలుతురు ఇంటిమూలమూలనా ఇంకా ఆవరించి ఉంది. అక్కడ తుంగచాప మీద ఆ ఇంటివాళ్ళ పెద్ద పిల్లి బద్ధకంగా వళ్ళు విరుచుకుని రైన్హార్డ్ అప్రయత్నంగానే తనవైపు చాపిన చేతికి తన వీపు ఆనించింది. బయట తోటలో కొమ్మల్లో పిచుకలు అప్పుడే కిలకిలారావాలు మొదలుపెట్టాయి. రాత్రి గడిచిపోయిందంటూ సుప్రభాతం వినిపిస్తున్నట్టుగా మొత్తమందర్నీ మేల్కొల్పుతున్నాయవి.
ఇంతలో పైన మేడ మీద ఒక తలుపు తెరుచుకున్న చప్పుడు వినిపించింది. ఎవరో మెట్లు దిగి కిందకి వస్తున్నారు. తలెత్తి పైకి చూస్తే అతడి ఎదట ఎలిసబెత్ కనిపించింది. ఆమె అతడిముందుకు వచ్చి నిలుచుంది. అతడి ముంజేతిపైన తన చెయ్యి వేసింది. ఆమె పెదవులు సంచలిస్తున్నాయి. కానీ అవేమీ చెప్పాలనుకుంటున్నాయో అతడికి ఒక్క మాట కూడా వినబడలేదు.
కాసేపటికి ఆమె ‘నువ్వెప్పటికీ ఇంక తిరిగిరావు. నాకు ఆ సంగతి తెలుస్తోంది. కాదని చెప్పకు. అవును. నువ్వు ఎప్పటికీ తిరిగి రావు’ అంది ఆమె.
‘అవును ఎప్పటికీ తిరిగి రాను’ అన్నాడతడు.
ఆమె అతడి చేతిమీంచి తన చేయి జారవిడిచింది. మరింకేమీ మాట్లాడలేదు. అతడు ఆ నడవా దాటి గుమ్మం దగ్గరకి వెళ్ళాడు. అక్కడనుంచి ఒకసారి వెనక్కి తిరిగి చూసాడు. ఆమె అక్కడే నిశ్చలంగా నిలబడి ఉంది. జీవరహితమైన చూపుల్తో అతణ్ణే చూస్తూ ఉంది. అతడు ఒక అడుగు ఆమె వైపు వేసి చేతులు చాపాడు. కానీ మళ్ళా అతి కష్టమ్మీద తనను తాను నిగ్రహించుకుంటూ గుమ్మం దాటి బయటికి వెళ్ళిపోయాడు.
బయట లోకమంతా ప్రభాతకాంతిలో మునిగిపోయి ఉంది. సాలీడు గూళ్ళ దారాలమీద నిలిచిన ముత్యాల్లాంటి మంచుబిందువులు ఉదయసూర్యుని తొలికిరణాల్లో మెరుస్తున్నాయి. వెనక్కి తిరిగి చూడకుండానే అతడు వడివడిగా అడుగులు వేసుకుంటూ సాగిపోయాడు. తన వెనగ్గా ఆ ప్రశాంత సస్యక్షేత్రం నెమ్మదిగా కనుమరుగవుతుండగా, అతడి ముందు విశాలప్రపంచం విస్తారంగా తెరుచుకుంటూ ఎదురయ్యింది.
పదవ అధ్యాయం
వృద్ధుడు

ఇప్పుడు ఆ కిటికీ అద్దాల్లోంచి చంద్రుడు ప్రకాశించడం ఆగిపోయింది. మొత్తమంతా చీకటి అలముకుంది. కానీ ఆ వృద్ధుడు అట్లానే చేతులు ముడుచుకుని తన చేతుల కుర్చీకి అతుక్కుపోయి తన ఎదట గదంతా పరుచుకున్న శూన్యాన్ని తదేకంగా చూస్తూ ఉండిపోయాడు.
క్రమక్రమంగా అతని కళ్ళముందు ఆ సంజ చీకటి కరిగిపోతూ నల్లని విశాల సరోవరంగా మారిపోయింది. ఒకదానివెనక ఒకటి సరోవరజలరాశులు లోతుగా సుదూరంలోకీ వెనుదిరుగుతున్నాయి. ఆ చిట్టచివరి జలరాశిపైన ఆ వృద్ధుడి దృష్టి కూడా చేరలేనంత దూరంలో వెడల్పాటి ఆకుల మధ్య ఒక తెల్లకలువ పువ్వు ఏకాకిగా తేలియాడుతున్నది.
ఇంతలో గది తలుపు తెరుచుకుంది. ప్రకాశవంతమైన కాంతిపుంజం గదిలోకి ప్రసరించింది. ‘ఓ బ్రిడ్జెట్! నువ్వొచ్చి మంచిపనిచేసావు. అదుగో, ఆ దీపం తీసి ఆ బల్లమీద పెట్టు’ అన్నాడు ఆ వృద్ధుడు.
అప్పుడతడు తన కుర్చీ ఆ బల్ల దగ్గరకీ లాక్కుని, ఆ బల్లమీద తెరిచి ఉన్న పుస్తకాల్లో ఒకటి చేతుల్లోకి తీసుకున్నాడు. ఒకప్పుడు తన యవ్వనకాలంలో తన సమస్తశక్తినీ ధారపోసి మరీ సాగించిన అధ్యయనంలోకి అప్పుడు మరోసారి మునిగిపొయ్యాడు.
(సమాప్తం)
2-11-2026


రాత్రుళ్ళు తన వ్యథాభరిత హృదయంపైన ముడుచుకున్నప్పుడు ఒక స్త్రీ కోమల హస్తం పైన ఆమె రహస్యవేదన దిగవిడిచే సుకుమారవేదనా రేఖ ఆ చేతిపైన కనిపిస్తూ ఉన్నది.
ఒంటరి తెల్ల కలువపువ్వు…
ధన్యవాదాలు సోమ శేఖర్!
తేనెటీగలకొలనుఓఅపురూపం…ఐనకధ…అదిమీమనస్సుద్వారాఅనువదించబడి….ఆప్రణయాక్షరమాలజారువాలి..మాహ్రదయాంతరాలలోనిసున్నితపొరలనుతాకిఓమ్రుధుమధురమైనభావనగామిగిలిపోతుంది…….అదితలచుకున్నప్పుడల్లాఅదేభావనకలుగుతుంది……ఈరచనమత్తుమందులాంటిది……ఈమత్తుఎన్నాళ్ళైనావదలదు…..తలచుకున్నప్పుడల్లాఅలానేఉంటుంది….తేంక్యు భధ్రుడుసారు…..తేంక్యు.
హృదయపూర్వక ధన్యవాదాలు మాష్టారూ!
చాలా beautiful and melancholic love story. చెప్పుకోలేక మిగిలిపోయిన feelings, కాలంతో మారిపోయిన జీవితాలు, చిన్ననాటి జ్ఞాపకాలు, ప్రకృతి వర్ణనలూ, కవిత్వం, జానపద గీతాలూ ఎంత అందంగా రాశారు! మీ అనువాదం అనువాదంలా లేదు, it’s like reading an original story.
Thank you for bringing this beautiful work to us, Sir.🙏🏽
హృదయపూర్వక ధన్యవాదాలు మాధవీ!
దాచిపెట్టిన కథ వెయ్యిపేజీలది. పాఠకుల గుండెకెక్కిన బరువు వెయ్యి కేజీలది
నీవంటి రసజ్ఞురాలు ఈ కథ చదివి స్పందించిన తర్వాత స్టార్మ్ జన్మ ధన్యమైంది అని భావిస్తున్నాను.
Sir, AIతో గీయించిన చిత్రాలు కూడా చాలా బాగున్నాయి.
I really appreciate your ability to keep up with the changing technology and, more importantly, to put it to such appropriate and creative use. 🙏🏽
అడుగడుగునా కవిత్వం కలగలిసిన కథ. ఆ దృష్టి వుండాలే గానీ మన జీవితంలోని ప్రతి క్షణంలో కవిత్వముంది కదా. 😊
హృదయపూర్వక ధన్యవాదాలు మాధవీ!
మనది కాదని తెలిసినా ఆరాధించకుండా ఉండలేని నిస్సహాయత,రెండు హృదయాలకి ఏక కాలంలో గులాబీ గుబాళింపునీ ముల్లు గుచ్చుకోడంలోని నొప్పిని అనుభూతం చేయగల తీపి వేదన ఒక చిత్రకారుడు మాత్రమే చేయగల అనుసృజన జ్ఞాపకాల తేనెతుట్టె రేగి ఎదలో ఏదో తీయనిసలుపు
హృదయపూర్వక ధన్యవాదాలు విద్యాధరి గారూ!