
మూడేళ్ళ తరువాత మళ్ళా ఒక కథ రాసాను. అది కూడా తెలుగు ప్రభలో కథల విభగాన్ని చూస్తున్న నా చిరకాలమిత్రుడు వొమ్మి రమేష్ బాబు ప్రోత్సాహం వల్ల. ఆ కథ ఈ రోజు తెలుగు ప్రభ పత్రికలో అచ్చయింది. 2016 లో ‘అవినిమయం’ కథ తర్వాత నా కథ ఒకటి పత్రికల్లో అచ్చవడం ఇదే. రమేష్ బాబుకి ధన్యవాదాల్తో ఆ కథని ఇక్కడ మీతో పంచుకుంటున్నాను.
ఫ్యూచర్ సిటీ
ఇది శంకర్ పల్లి కాదు, శంకర్ పట్నం- బస్సు దిగి బస్టాండులో నిలబడగానే వి-కి అనిపించిన మొదటి తలపు అది. చాలా రోజులుగా ఇంట్లోనే కూచుని బొమ్మలేసుకుంటున్న వి-కి ఆరుబయటకి పోయి ప్లెయిన్ ఎయిర్ పెయింటింగ్ చేయాలనిపిస్తూ ఉంది. ఫొటోలు చూసి బొమ్మలెయ్యడం చిత్రకారుడు తనని తాను మోసపుచ్చుకోడమే అని అతని నమ్మకం . అసలు కళ అంటేనే కాపీని కాపీ చెయ్యడం అన్నాడొక తత్త్వవేత్త. అలాంటిది ఇప్పుడు చిత్రకారులు ఇళ్ళల్లో కూచుని ఫొటోలు చూసి బొమ్మలేస్తున్నారంటే ఏమంటాడో అని అనుకున్నాడు.
చాలాకాలంగా వి-ని వెన్నాడుతున్న బలమైన కోరిక- ఆరుబయట ఎండ పడుతున్నప్పటి ఒక చెట్టునో, వాగునో, వంకనో చూస్తూ బొమ్మ గియ్యాలని. నీటిరంగుల చిత్రంగా మార్చాలని. ఈసారి మాన్ సూన్ సీజన్ వస్తూనే తొలివానాకాలపు మబ్బుల్ని గియ్యాలని ఎన్నో కలలు గన్నాడు.
బస్టాండ్ నుంచి బయటకి అడుగుపెట్టాడు. ఆటోలు, బస్సులు, సైకిళ్ళు, స్కూటర్లు, గుండుసూదినుంచి వీలైతే రైలింజనుదాకా ఏదో ఒకటి అమ్మడానికి కిక్కిరిసిపోతున్న పట్నం.
చుట్టూ కలయచూసాడు వి-. ఒక చెట్టు కూడా కనిపించలేదు. ఊరి బయటకి వెళ్తే బహుశా పల్లెటూరి వాతావరణం కనిపించవచ్చనుకున్నాడు. కనిపించిన ఒక ఆటోదగ్గరకి వెళ్ళి అడిగాడు.
‘ఇక్కడ దగ్గర్లో చెరువులుగాని, వాగులు గాని ఉన్నాయా?’
ఆటోడ్రైవర్లు ఒకరు కాదు, ఇద్దరు అతని వైపు తిరిగారు. ఒక నల్లటి బాక్ పాక్ తగిలించుకున్న ఒక పెద్దమనిషి తమ ఎదట నిలబడి చెరువులుగాని, వాగులుగాని ఉన్నాయా అని అడుగుతుంటే వాళ్ళకేమీ అర్థం కాలేదు.
ఎందుకని అడిగారు.
పెయింటింగు వేసుకోడానికి అన్నాడు.
పెయింటింగు ఇళ్ళకి కదా వేస్తారు, చెరువుల్తో పనేమిటి అనడిగారు.
మొత్తానికి ఎలాగైతేనేం వి-మరొక ఆటో పట్టుకున్నాడు. ఆటో అతను దగ్గరలో ఒక వాగు ఉందనీ అక్కడికి తీసుకుపోయి దింపుతాననీ అన్నాడు. వందరూపాయలకి బేరం కుదిరింది.
ఆటోడ్రైవరు పట్నం దాటాడు. చిన్న ఓవర్ బ్రిడ్జి వచ్చింది. దానిమీంచి చూస్తుంటే అక్కడక్కడ చిన్న చిన్న చెట్లు కనిపిస్తున్నాయి. బ్రిడ్జి దిగాక ఆటో ఒక పక్కన ఆపి, ‘ఇదుగో, ఈ పక్కనుంచి నడుచుకుంటూ పోతే నాలా కనిపిస్తుంది చూడు ‘ అని చెప్పి, డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు.
ఆటోడ్రైవరు చూపిన సర్వీసురోడ్డమ్మట నడవడం మొదలుపెట్టాడు వి-. అక్కడంతా దుర్గంధం. అది పచ్చదనం వైపు తీసుకుపొయ్యే తోవలాగా అనిపించలేదు. మొత్తానికి కొంతదూరం నడిచాక ఒక కాలవలాంటిది కనిపించింది. బ్రిడ్జి దానిమీదనే కట్టారని అర్థమయింది. కానీ ఆ కాలవలో నీళ్ళు లేవు. అంతా ఇసుక. పోనీ ఆ ఇసుకమేటనైనా బొమ్మ గీద్దామనుకుంటే అక్కడ నిలబడ్డం కూడా కష్టంగా ఉంది.
నెల రోజుల్లో వి-కి ఇది రెండో చేదు అనుభవం. రెండువారాల కిందట ఇట్లానే ఒక పల్లెటూరు వెతుక్కుంటూ వికారాబాదు దారిన ప్రయాణించేడు. సిటీబస్సు దిగి చూస్తే, ఊరు లోపలకి ఉన్నట్టుంది. దారి పొడుగునా తురాయి చెట్లు. వాన పడని మబ్బులు ఆకాశాన్ని ఆవరించి ఉన్నాయి. తాను వెతుక్కుంటున్న చోటుకే వచ్చాననుకుని వి – నెమ్మదిగా ఊళ్ళోకి నడిచాడు.
కాని అక్కడ ఊరేదీ?
బహుశా ఒకప్పుడు ఉండి ఉండేది. ఇరవై ముప్ఫై ఏళ్ళకిందటిదాకా ఉండి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఇళ్ళకన్నా గోడలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఫార్మ్ హౌసుల గోడలు, రిసార్టుల గోడలు, గోడౌన్ల గోడలు-ఒకప్పటి పచ్చటి పల్లెటూరు మధ్యలో ఆ గోడలు అడ్డదిడ్డంగా వచ్చిపడ్డాయి.
ఊరులాగా కనిపిస్తున్న ఆ గోడలమధ్య నలుగురైదుగురు యువకులు కనిపిస్తే వాళ్ళ దగ్గర ఆగాడు. వాళ్ళేదో ఒక కాలేజీలో చేరినపిల్లల్లాగే ఉన్నారుగానీ, చదువుకుంటున్నట్టు మాత్రం కనిపించలేదు.
‘మీరు చదువుకుంటున్నారా?’ అనడిగాడు వి-
అవును అన్నారు. ఒకరిద్దరు ఇంటర్మీడియేటు. ఒకరిద్దరు ఇంకా హైస్కూల్లోనే ఉన్నారు. ఒకరిది ఎంపిసి గ్రూపు. ‘ఏం చేస్తావు ఇంటరయాక?’ అనడిగాడు వి-అతణ్ణి.
‘సాఫ్ట్ వేర్ ‘ అన్నాడా పిల్లవాడు.
వాళ్ళకి అతణ్ణి చూస్తే నవ్వొస్తూ ఉంది. తమ ఊళ్ళోకి ఒక జంతువు నడుచుకుంటూ వచ్చి తమతో మాట్లాడితే ఎంత అర్థంపర్థం లేకుండా అనిపిస్తుందో వి-ని చూస్తే కూడా వాళ్ళకి అంతే అర్థంపర్థం లేకుండా అనిపించింది.
వి- చిత్రకళలో సాధన దశలోనే ఉన్నాడు. కాని చిత్రకళాచరిత్ర గురించి మాత్రం చాలా చదివాడు. ముఖ్యంగా, ఒకప్పుడు, అంటే పందొమ్మిదో శతాబ్దంలో ఫ్రాన్సులో చిత్రలేఖనాన్ని కొత్త మలుపు తిప్పిన చిత్రకారుల గురించి చాలా చదివాడు. ఆ రోజుల్లో పారిశ్రామిక విప్లవం పురాతన ఫ్రెంచి గ్రామసీమల్ని శరవేగంగా కబళించుకుంటూ పోతున్నప్పుడు ఇలానే కొందరు చిత్రకారులు గ్రామసీమల్లోకి పోయి ఎక్కడెక్కడ పచ్చదనం మిగిలి ఉందో దాన్ని చిత్రించాలని తపించారు. పచ్చటి పల్లెలకోసం వెతుక్కుంటున్నప్పుడు వాళ్ళకి బార్బిజాన్ అనే ఊరు కనిపించింది. దానికి దగ్గరలో ఫాంటెన్ బ్లూ అనే అడవి కూడా కనిపించింది. మొదట్లో కోరో, మిల్లే, రూసో అనే చిత్రకారులు ఆ పల్లెనీ, ఆ అడవినీ చూడగానే పారడైజుని చూసినట్టు సంబరపడిపోయారు. ఆ తర్వాత ముప్ఫై నలభయ్యేళ్ళ పాటు యూరోపులో చిత్రకళ నేర్చుకున్న ప్రతి ఒక్క చిత్రకారుడికీ అదొక యాత్రాస్థలంగా మారిపోయింది. అక్కడ నివాసముంటూ ఆ పల్లెల్నీ, ఆ పచ్చికనీ చిత్రించే శైలికి బార్బిజాన్ స్కూలు అని కూడా పేరొచ్చింది.
పందొమ్మిదో శతాబ్ది ఫ్రాన్సులో బార్బిజాను కోసం తపించినట్టు ఇరవై ఒకటో శతాబ్ది హైదరాబాదులో కూడా పరితపించగల చిత్రకారులెవరూ వి-కి కనిపించలేదు. ఇక్కడ కూడా చిత్రకారులున్నారు. గాలరీల్లో ఎగ్జిబిషన్లు నడుస్తుంటాయి. కాని వాటిల్లో ఎక్కడా ఒక వాగుగాని, వంకగాని, చెరువుగాని, చెట్టుగాని అతడికి కనిపించలేదు.
మొదటిసారి అలా ఆ పల్లెకు, అంటే రిసార్టుగా మారిపోయిన పల్లెకి వెళ్ళినప్పుడు వి-కి తనకి ఇన్నాళ్ళుగా తెలియని కొత్త హైదరాబాదు కనిపించింది. ఇప్పటివరకూ తనకు తెలిసింది మూడు నగరాలే- హైదరాబాదు, సికిందరాబాదు అనే జంటనగరాలు, ఆ తర్వాత సైబరాబాదు. ఇప్పుడు నాలుగో నగరం పుట్టుకొస్తున్నది- ఫ్యూచర్ సిటీ. ప్రపంచపెట్టుబడిదారులంతా ఏకమై హైదరాబాదు మీద పెడుతున్న పెట్టుబడి మొత్తం దేశంలో పెడుతున్న పెట్టుబడిలో అయిదో వంతట!
ఈసారి వి-బ్రిడ్జికి ఇటువైపు రోడ్డమ్మట నడిచి చూద్దామనుకున్నాడు. నాలుగడుగులు వెయ్యగానే తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. అక్కడ ముళ్ళమధ్య, ఇనపతీగల కంచె మధ్య ఒక గులాబి తోట!
వి- మనసులో సందేహిస్తూనే, జల, స్థల, వృక్షదేవతలకు నమస్కారాలు పెట్టుకుంటూనే ఆ తోట దగ్గర నిలబడి లోప లకి చూసాడు. గులాబీ రంగు గులాబీలతోట. నిండుగా పూసి ఉంది. సాయంకాలపు బంగారు రంగు ఎండజాలు ఆ మొక్కలమీద జలతారులాగ పరుచుకుని ఉంది. ఆ మొక్కలమధ్య ముగ్గురు నలుగురు స్త్రీలు పనిచేసుకుంటున్నారు. ఒకడు, బహుశా వాళ్ళ మేస్త్రీ కావచ్చు లేదా తోట యజమాని కావచ్చు, నిలబడి ఉన్నాడు.
వి- అతణ్ణి బెరుగ్గానే పలకరించాడు ‘అయ్యా, నేను ఫలానా-, హైదరబాదు నుంచి వస్తున్నాను. మీరు అనుమతిస్తే, ఈ తోటలో ఒక పక్కన నిలబడి బొమ్మలు వేసుకుంటాను. మీ మొక్కల్ని తొక్కను. నా వల్ల మీ తోటకి ఏ ఇబ్బందీ ఉండదు. లోపలకి రావచ్చునా?’ అనడిగాడు.
ఆ పెద్దమనిషి విచిత్రంగా చూసాడు. కాని అతని కళ్ళల్లో అనుమానమైతే కనిపించలేదు. మొత్తానికి మరోసారి వి-అతనికి అర్థమయ్యేలాగా చెప్పాక, ‘సరే, వచ్చి ఈ చెట్టు నీడన కూచోండి. మీకు కావలసిన బొమ్మలు వేసుకోండి’ అన్నాడు.
‘మమ్మల్ని మాత్రం దింపొద్దు ‘అన్నారు ఆ ఆడవాళ్ళు, అప్పటిదాకా చేస్తున్న పని ఆపి వి-నే చూస్తున్నవాళ్ళు.
‘లేదు లేదు, మిమ్మల్ని గియ్యను, నా ఫోనుతో ఈ పూలు మాత్రమే ఫొటో తీసుకుంటాను. మిమ్మల్ని పొరపాటున కూడా ఫొటో తియ్యను’ అన్నాడు వి-.
కాని ఆ కూలిమనుషులు తమని ఫొటోలోకో, బొమ్మల్లోకో ఎందుకు దింపొద్దు అన్నారో అతడికి అర్థం కాలేదు. వాళ్ళ భయాలేమై ఉండవచ్చు? అతడికి ఫ్రెంచి చిత్రకారుడు మిల్లె గీసిన శ్రామిక ప్రజల చిత్రలేఖనాలు గుర్తొచ్చాయి. విత్తనాలు చల్లేవాళ్ళూ, కలుపు తీసేవాళ్ళూ, పరిగె ఏరేవాళ్ళూ మొదటిసారి ఆధునిక చిత్రకారుడి కాన్వాసు మీద ప్రత్యక్షమయ్యింది మిల్లే వల్లనే. వాళ్ళు ఆ రోజు తమని బొమ్మల్లోకి దింపొద్దని మిల్లేతో అని ఉంటే?
వి- తన బాగు తెరిచి సామాన్లు బయటికి తీసి ఈజిలు నిలబెట్టాడు. దానిమీద ఒక కాగితం అమర్చిపెట్టుకున్నాడు. ఒకసారి ఆ తోటమొత్తం కలయచూసాడు. ఫ్రెంచి ఇంప్రెషనిస్టు చిత్రకారుడు మానె చెప్పినట్టు, తన కళ్ళముందు ఉన్నది గులాబితోట అన్న విషయం మర్చిపోయి, ఓరకంటితో, ఆ రంగుల్ని మాత్రమే చూసే ప్రయత్నం చేసాడు. దూరంగా తోట వెనక కనిపిస్తున్న చెట్లవరసని మనసులోనే రంగుల్లోకి మార్చుకున్నాడు. తన ఎదట ఉన్న గులాబీ పూలు గులాబీ రంగు కెరటంలాగా ఉన్నాయి. వాటికింద ఆకులూ, కొమ్మలూ కలిసి దట్టంగా అల్లుకున్న నీడల్ని సియన్నా, అల్ట్రా మెరైన్ బ్లూ ల మిశ్రమంగా మనసులోనే కలుపుకున్నాడు. ఆ రెడ్ వయొలెట్ రంగులమధ్య, యెల్లో-గ్రీన్ నీడల మధ్య వంగి పనిచేసుకుంటున్న ఆ ముగ్గురు స్త్రీలనీ చూస్తుంటే మానె గీసిన పాపీ పూల మధ్య పడతులు గుర్తొచ్చారు. ఆ పనివాళ్ళే లేకపోతే ఆ తోటకి పూర్ణత్వం లేదనిపించింది అతడికి.
ఆ మొక్కల మధ్య వాళ్ళ భంగిమల్ని చిత్రించాలన్న తలపుని తమాయించుకుని తన ఎదట ఉన్న చిన్న గులాబీదుబ్బుని చిత్రించడానికి పూనుకున్నాడు.
ఈలోపు ఒక కుర్రవాడు, కుర్రాడంటే పిల్లవాడు కాదు, యువకుడే, హడావిడిగా ఆ తోటలో అడుగుపెట్టాడు. వి-పక్కన నిలబడ్డ పెద్దమనిషితో ‘లైనుమేన్ వచ్చాడా?’ అనడిగాడు.
రాలేదన్నాడు ఆ పెద్దమనిషి. ‘ఇందాకణ్ణుంచి ఫోను చేస్తున్నాను. ఫోన్ ఎత్తడం లేదు. ఇక్కడికి వచ్చేడేమో అనుకున్నాను. రాలేదా?’ అని అంటూనే, ఆ తోటలో వి-ని చూసి అర్థంకాక దగ్గరికొచ్చాడు.
‘ఈ సారు హైదబాదు నుంచి వచ్చాడు. బొమ్మలేసుకుంటున్నాడు’ అన్నాడు ఆ పెద్దమనిషి.
ఆ కుర్రవాడు వి-దగ్గరకి వచ్చి ఆ సెటప్ అంతా చూసాడు. అతడు చూస్తూండగానే వి- ఈజిలు మీద ఉన్న కాగితం మీద తొలిపూత పూసాడు. ఆ పూత ఆరకముందే మరో పూత పూస్తూ ఆ కాగితం మీద గులాబీని పూయించే పనిలో పడ్డాడు.
ఆ వచ్చిన కుర్రవాడు ఆసక్తిగా, మనసులో ఏదో తెలియని ఉత్సాహం కలుగుతున్నట్టుగా కొంతసేపు అదంతా కళ్ళప్పగించి చూసాడు.
ఈలోపు అతడి ఫోన్ మోగింది.
ఆ తర్వాత రెండు మూడు నిమిషాల పాటు ఆ కుర్రవాడికీ, ఫోనులో అవతల వాడితోనూ, ఇవతల పెద్దమనిషితోనూ నడిచిన సంభాషణ వి- చెవిలో పడుతూనే ఉంది. విషయం అర్థమయింది. మొక్కలకి నీళ్ళు పట్టాలి కాని కరెంటు లేదు. ఎక్కడో లైను తెగిపోడమో, ట్రాన్స్ ఫార్మరు కాలిపోడమో ఏదో జరిగింది. వాళ్ళు లైను మేను కోసం ఎదురుచూస్తున్నారు.
‘డబ్బులుకి డబ్బులు తీసుకున్నాడు, మనిషి కనబడ్డం లేదు’ అన్నాడు కుర్రవాడు.
‘డబ్బులా? ‘ వి-కి అర్థం కాలేదు.
‘వెయ్యి రూపాయలిచ్చాం. ఎప్పుడు లైను పాడైనా డబ్బులిస్తూనే ఉంటాం. కానీ ఈ సారి డబ్బులు తీసుకుని కూడా రావట్లేదు’ అన్నాడు కుర్రవాడు.
‘అతను గవర్నమెంటు ఉద్యోగి కదా, జీతమొస్తుంది కదా. మళ్ళీ మీరెందుకు డబ్బులివ్వాలి?’ అనడిగాడు వి-
ఆ కుర్రవాడు జవాబివ్వలేదు. ఈసారి మళ్ళీ ఎవరికో ఫోన్ చేసాడు. కిందకి వంగి మొక్కల కేసి చూసాడు. ‘పువ్వులు చూడండి సార్, ఎలా తలలు వాల్చేస్తున్నాయో! ఇలా ఉంటే మార్కెట్లో కొనరు’ అన్నాడు.
వాళ్ళు ఆ పూలు గుడిమల్కాపూర్ మార్కెట్టుకి తెచ్చి అమ్ముతారట. రాత్రి పన్నెండు దాటాక, తెల్లవారు జాము రెండింటిలోపు ఆ పూలు కోస్తారట. వాటిని పాకింగు చేసి నాలుగింటికల్లా మార్కెటుదగ్గరకి చేరుకుంటారట.
‘మరి ఈ ఆడవాళ్ళు మళ్ళా అర్ధరాత్రి పనికి రావాలా? ‘ అనడిగాడు వి-.
వాళ్ళు వస్తారుట. పాముల బెడద ఉండొచ్చు. వాన కురిస్తే మరీ కష్టం. కానీ అవేవీ పెద్ద సమస్యలు కావు. కరెంటు లేక నీళ్ళు రాకపోతే, పూలు వాడిపోతాయి. మార్కెటు పాడైపోతుంది. ఆ పెద్దమనిషీ, ఆ పిల్లవాడూ- ఇద్దరూ ఆ రాత్రికి కరెంటు వస్తుందా రాదా అన్న ఆలోచనలోనే ఉన్నారు. భయంకరమైన తుపానులో చిక్కుకున్నవాళ్ళ ముఖాల్లో ఈ కాళరాత్రి ఎప్పటికన్నా తెల్లవారుతుందా లేదా అని కనిపించే ఆందోళన లాంటిది వాళ్ళ ముఖాల్లో.
ఈసారి ఆ కుర్రవాడికి మరో ఫోన్ వచ్చింది.
‘ఇక్కడే తోటలో ఉన్నాను. చూడు ఒకాయన పెయింటింగు వేస్తున్నాడు-’
‘అవును. పెయింటింగే, చూడు, వీడియో కాల్ చేస్తాను-’
ఆ పిల్లవాడి చేతుల్లో స్మార్ట్ ఫోన్. వీడియో కాల్ చేసి వి-గీస్తున్న బొమ్మని చూపించాడు ఫోనులో అవతల ఉన్న స్నేహితుడికి.
‘ఇప్పుడు అదంతా అవసరమా?’- లాంటి ప్రశ్నలేవో అవతలవైపు నుంచి వి-చెవిలో పడుతున్నాయి. ఆ సంభాషణ నడుస్తుండగానే వి- బొమ్మ ముగించి, టేపు ఊడదీసి, ఆ బొమ్మతీసి ఆ కుర్రవాడి చేతుల్లో పెట్టాడు.
‘ఇది నాకేనా?’ ఆ కుర్రవాడి కళ్ళల్లో ఒక పసితనపు సంతోషం. ఫోనులోనే అవతలి వాడితో చెప్తున్నాడు. ‘ఈ బొమ్మ నాకిచ్చేసాడు తెలుసా!’
అవతలి వాడికి బొమ్మమీద ఆసక్తి లేదు. సినిమాకి వెళ్ళడం గురించి మాట్లాడుతున్నాడు.
‘ఏ సినిమా’ అనడిగాడు వి-
‘లెనిన్’ అన్నాడు ఆ కుర్రవాడు.
లెనిన్! ‘లెనిన్ అంటే ఎవరో తెలుసా నీకు?’ అన్న ప్రశ్న నోటిదాకా వచ్చింది వి-కి. నీకు మిల్లే తెలుసునా? మానె తెలుసునా? కోరో తెలుసునా? అనడిగితే ఎలా ఉంటుందో లెనిన్ తెలుసునా అనడిగితే కూడా అలానే ఉంటుందనిపించింది.
‘ఎవరు హీరో’ అనడిగాడు వి-
‘అఖిల్! అక్కినేని నాగార్జున కొడుకు’ అని అన్నాడు ఆ కుర్రవాడు. బహుశా రేపటినుంచి అఖిల్ కి మరో పేరు లెనిన్ అనుకున్నాడు వి-
‘మీరు చదువుకుంటున్నారా?’ అనడిగాడు వి- ఆ కుర్రవాణ్ణి.
‘ఇంటర్మీడియేటు’ అని చెప్తూ తన చేతుల్లో పెట్టిన బొమ్మని ఆ కుర్రవాడు ఆప్యాయంగా తడిమి చూసాడు. అప్పుడు తన ఫోను స్క్రీను మీద ఫొటోలో ఉన్న ఒక అమ్మాయిని చూపిస్తూ ‘ఈమె బొమ్మ గియ్యగలరా?’ అనడిగాడు.
వి-ఆ ఫోటో కేసి చూసాడు. చిన్న పిల్ల, బహుశా ఇంటర్మీడియేటు చదువుతూ ఉండవచ్చు. ఆ కుర్రవాడి గర్ల్ ఫ్రెండ్ అని తెలుస్తూనే ఉంది.
‘నేను మనుషుల బొమ్మలు గియ్యలేను. అంత ప్రావీణ్యం లేదు’ అన్నాడు వి-
‘ఎందుకు గియ్యలేరు? ఈ పువ్వు ఇంత బాగా గీసారు కదా?’ అన్నాడు ఆ కుర్రవాడు.
ఈలోపు ఆ పెద్దమనిషి ఆ కుర్రవాడితో ‘వాడు కూడా చచ్చిపోయాడంట, తెలుసునా?’ అనడిగాడు.
‘అవును, విన్నాను. పెస్టిసైడ్సు తాగి చచ్చిపోయాట్ట’అని అన్నాడు ఆ కుర్రవాడు అతని వైపు తిరక్కుండానే. ఆ పిల్లవాడు దృష్టి ఇంకా ఆ స్క్రీన్ మీదనే ఉంది .
హటాత్తుగా వచ్చిన ఆ ప్రస్తావన వి-కి అర్ధం కాలేదు. ‘ఏమయ్యింది? ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు?’ అనడిగాడు.
‘ఈ మధ్య ఒకడు షాబాదు మండలంలో ఆరుగుర్ని చంపేసాడు. పోలీసులు వెతుకుతున్నారు. ఈ లోపు వాడు సూయిసైడు చేసుకున్నాడు’ అన్నాడు ఆ కుర్రవాడు.
‘ఆరుగుర్ని చంపేసాడా?’ వి- కి ఏమీ అర్థం కాలేదు. ‘ఎందుకని? ఏమయ్యింది?’
‘వాడిమీద పోక్సో కేసు పెట్టారు. బెయిల్ మీద ఇంటికొచ్చాడు. రాగానే ముందు తన మీద కేసుపెట్టిన అమ్మాయి ఇంటికి వెళ్ళాడు. ఆ పిల్లని కత్తితో పొడిచేసాడు. అడ్డొచ్చిందని వాళ్ళ అమ్మమ్మని చంపేసాడు. అప్పుడు ఆ పిల్లదాని తల్లిని కూడా చంపేసాడు. అప్పుడు ఇంటికెళ్ళి తన భార్యని చంపేసాడు. ఆమెతో పాటు ఇద్దరు పిల్లల్ని కూడా’ అన్నాడు ఆ కుర్రవాడు.
మళ్ళీ వెంటనే ‘చిన్నపిల్లలంట-ఒకడికి ఏడాదో రెండేళ్ళో, ఇంకో పిల్లాడు పాలుతాగే పిల్లాడంట. నెలలపిల్లాడు ‘అని అన్నాడు ఆ కుర్రవాడు.
వి-కి ఒక్కసారిగా మనసంతా చేదుగా అయిపోయింది. తనని ఇందాకా బ్రిడ్జి అవతల ఊపిరాడకుండా చేసిన దుర్గంధం ఇప్పుడు తోటమొత్తం వ్యాపించినట్టుగా అనిపించింది. అతడికి ఇంక మరో బొమ్మ గియ్యాలనిపించలేదు.
‘ఎందుకని అంత దారుణానికి పాల్పడ్డాడు? ‘ అనడిగాడు అ కుర్రవాణ్ణి. అలా అడుగుతుంటే తన గొంతు తనకే పీలగా వినిపించింది. అసలు ఆ ప్రశ్న ఆ కుర్రవాణ్ణి అడిగాడో లేక తనని తనే ప్రశ్నించుకున్నాడో చెప్పడం కష్టం.
‘ఏముంది సార్! పోక్సో కేసంటే మామూలు కాదు కదా. వాడి జీవితం నాశనమైపోయింది కదా. ఇరవయ్యేళ్ళైనా జైలు శిక్ష పడుతుంది కదా. వాడి జీవితమే దారుణమైపోయింది కదా’ అని ఆ పెద్దమనిషి వైపు తిరిగి ‘బాగా అప్పులు కూడా ఉన్నాయిట ‘అని ఇంకేదో చెప్తున్నాడు.
వి-కి ఆ మాటలేవీ ఎక్కడంలేదు. అతడు రంగులపళ్ళెం తుడుచుకోకుండానే అలానే బాగులో పెట్టుకున్నాడు. ఈజిల్ విప్పేసి మడిచి బాగులో సర్దుకోడం మొదలుపెట్టాడు. అతడికి తన మనసు నెమ్మదిగా మొద్దుబారుతోందని తెలుస్తొంది. కానీ, ఒక విషయం మాత్రం అతడి దృష్టి దాటిపోలేదు- ఇందాకా కరెంటు గురించి మాట్లాడుకుంటున్నప్పుడూ , లైన్ మేను ఫోన్ ఎత్తడం లేదని కంగారు పడుతున్నప్పుడూ వాళ్ళ గొంతులో వినిపించిన ఆందోళన లాంటిది మాత్రం ఇప్పుడు మాట్లాడుకుంటున్న మాటల్లో వినిపించడం లేదు.
‘ మరి నేను బయల్దేరతాను, చీకటి పడుతోంది’ అన్నాడు వి-.
రోడ్డు మీదకొచ్చి సిటీబస్సు ఎక్కాక, కొంతసేపటికి, తనను తాను కూడ దీసుకున్నాక, వి- ఫోనులోనే ఇంటర్నెట్టు తెరిచి షాబాదు మండలంలో కేసు గురించిన వివరాలు చూసాడు.
షాబాదు మండలంలో పెంజెర్ల గ్రామానికి చెందిన పి.రాజ్ కుమార్ ఒక రైతు, ముప్ఫై అయిదేళ్ళుంటాయి. నెమ్మదిగా ఆన్ లైను బెట్టింగులకి అలవాటు పడ్డాడు. తొందరగా డబ్బు సంపాదించాలన్న అత్యాశకో లేదా బెట్టింగుల్లో ఉండే మత్తుకో లోబడ్డాడు. ఆ క్రమంలో రెండు కోట్ల దాకా అప్పులు చేసాడు. ఆ అప్పులు కొంత తీర్చడానికి తన వాటాగా వచ్చిన పొలం, ఇతర నగానట్రా అమ్మేసుకున్నాడు. ఇదిలా ఉండగా మే నెలలో ఒక పదిహేడేళ్ళ అమ్మాయి అతడిమీద పోక్సో కేసు పెట్టింది. అతణ్ణి జైలుకి పంపించారు. కిందటి జూలై నెలలో అతడు బెయిల్ మీద బయటికొచ్చి ఆ పిల్ల కుటుంబంలో ముగ్గురినీ, తన కుటుంబంలో ముగ్గురినీ ఒక్కరోజులో చంపేసాడు. అప్పణ్ణుంచీ పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు వెతుకుతుంటే ఇప్పుడు అతడి శవం కనిపించింది. పక్కన పెస్టిసైడు డబ్బా. తను అప్పులపాలైనందువల్ల బతుకు మీద ఆశపోయిందనీ, అందుకని ఆత్మహత్య చేసుకుంటున్నాననీ- ఇలాంటిదే ఏదో ఒక ఉత్తరం కూడా.
అతడు బెయిల్ మీద వచ్చిన తరువాత అతణ్ణి సరిగ్గా కనిపెట్టి ఉండలేదనే కారణం మీద ఇద్దరు ముగ్గురు పోలీసు అధికారుల్ని సస్పెండు చేసినట్టు కూడా వార్తల్లో ఉంది.
వి- మనసులో అన్నీ అలుక్కుపోయాయి. బార్బిజాన్, ఫాంటెన్ బ్లూ, మిల్లె చిత్రించిన ‘ద గ్లీనర్స్’, శంకర్ పల్లి, షాబాద్, పోస్కో కేసు, లైన్ మేన్, గుడిమల్కాపూర్ పూలమండి- అస్పష్టంగా అల్లుకుపోయిన ఆ నామవాచకాల మధ్య అతడికి తాను ఇంతకు ముందు ఎక్కడో చదివిన సంగతి ఒకటి గుర్తొచ్చింది.
పందొమ్మిదో శతాబ్ది ఫ్రాన్సులో చిత్రకారులు ఒక పల్లె కోసం, ఒక అడవి కోసం వెతుక్కుంటున్న రోజుల్లో, ఆ పారిశ్రామిక విప్లవ కాలంలో ఇలాంటి ఘాతుకమే ఒకటి జరిగిందని తనెప్పుడో చదివింది గుర్తొచ్చింది. పాంటిన్ మసకర్ గా పేరొందిన ఆ సంఘటనలో కూడా ఇలానే ఒక ఇరవయ్యేళ్ళ యువకుడు ఆస్తిపరులైన ఒక కుటుంబం మీద కన్నేసి ఆ కుటుంబంలో మొత్తం ఎనిమిది మందిని ఒక్కసారే చంపేసిన ఉదంతం. ఇద్దరు భార్యాభర్తల్నీ, వారి ఆరుగురు పిల్లల్నీ. అతను ఆ హత్యకి పాల్పడ్డప్పుడు ఆ భార్యాభర్తల్లో ఆ భార్య గర్భవతిగా కూడా ఉందట.
మొద్దుబారిపోయిన మనస్సుతో వి- సిటీబస్సు విండో లోంచి తన కళ్ళముందు కనిపిస్తున్న నగరాన్నే చూస్తుండిపోయాడు. చెట్లు కనిపించని, వాగులూ, వంకలూ కనిపించని, చివరకి ఆషాఢమేఘాలు కూడా కనిపించని దారి పొడవునా- మహానిర్మాణాలు, నిర్మాణంలో ఉన్న ఇనుము, ఉక్కు కాంక్రీటు ఎత్తిపెడుతున్న టవర్ క్రేన్లు, జిబ్ క్రేన్లు, ఫ్లాట్ టాప్ క్రేన్లు, తనున్నచోటనే 360 డిగ్రీలు తిరిగే హామర్ హెడ్ క్రేన్లు –
బస్సు నగరంలో అడుగుపెడుతూనే పెద్ద కమానులాగా ఎత్తిపట్టుకున్న బానరు మీద Your dream house starts at ₹11 Crore అంటూ నిలువెత్తు అక్షరాలతో స్వాగతమిస్తూ పెద్ద అడ్వర్టైజ్ మెంటు.
వి- మరోసారి ఫోను కేసి చూసుకున్నాడు. ఆ దుర్ఘటన గురించి ఇంకా తెలుసుకోవాలనీ ఉంది అతడికి, ఏమీ తెలుసుకోకూడదనీ ఉంది. ‘ఈ కేసును ఫ్యూచర్ సిటీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు’ అన్న ఒక్క వాక్యం తప్ప మరేదీ చదవలేకపోయాడు.
12-8-2026


What a suspense thriller! Sir…
శైలి కి ఫిదా!
ధన్యవాదాలు రామ్ భాస్కర్!
కథా శిల్పం.. కథాంశం… కథనం.. శైలి.. అన్నీ టాప్ క్లాస్.. మీనుంచి మరిన్ని కథలు రావాలి భద్రుడు గారు…🙏🙏🙏
ధన్యవాదాలు సార్!
చాలా బావుంది సర్! ఇది కథ కాదు… జరిగిన కథేనని నాకనిపిస్తోంది.
గులాబీల్లాంటి బాలలందరూ సరియైన కాలానికి సరిపడినంత నీరులేక, పోషణ లేక ఎండిపోయినట్లే….భవిష్యత్తులో వాడిపోయిన గులాబీల్లా మారిపోతున్న బాలల కథ.
ఉపాధ్యాయులపై దాడి చేస్తున్న బాలలు, ఖరీదైన సెల్ ఫోను కొనమని వత్తిడి చేసి లోయలో దూకుతానని భయపెట్టి చివరకు దూకేసిన అబ్బాయి… ఇలా ఎంతమంది బాలల గాథలు.
మన భవిష్యత్తు కథ.
అవును సోమశేఖర్! హృదయ విదారకమైన వర్తమానం. అంతే హృదయ విదారకమైన భవిష్యత్తు.
చాలా బాగుంది. ఏదో పెయింటింగ్ చూపిస్తారను కుంటే, ఇంకా పెద్ద చిత్ర మే చూపించారండీ. ఆలోచింప చేసే కథ🙏
హృదయపూర్వక ధన్యవాదాలు మేడం!
ఫ్యూచర్ సిటీ కథ సహజత్వమూ వాస్తవమూ కలిసి పాఠకుణ్ణి క్షణాల్లో కథకుని వెంట తీసుకు వెళ్తాయి.కాబోయే మహానగరం తీరుతెన్నులు ఎలా ఉండబోతున్నాయో కథ సూచిస్తున్నది. ఎక్కువ చెప్పక్కర్లేదు . వర్ణనలు పేర్లు అవసరమే లేదు . లైన్ మెన్ నిర్లక్ష్యం , డబ్బులు లంచం ఇవ్వడం ప్రభుత్వం పని తీరు తెలియజెబుతున్నది. ఫోన్లో మాట్లాడిన ఫ్రెండు లెనిన్ సినిమా ప్రపోజల్ కంటే తనకు వి- గీసిచ్చిన బొమ్మ సంతోషం కలిగించినా , దానికి కొనసాగింపు ఉండే స్థితిలేదు. తన గర్ల్ ఫ్రెండ్ బొమ్మ గీయమని అడగటానికి సంకోచించని యువకుడు నేటి యువతకు సహజ ప్రతీక అనవచ్చు. ఇవాళ రేపు రీల్స్ కల్చర్ మితిమీరిన సంగతి అందరికీ తెలిసింది. పని వాళ్లు ఎందుకైనా మంచిదని తమ ను ఫోటో తీయవద్దని ఉంటారు. మొత్తానికి కథ ముచ్చట చెప్పినట్టే అనిపించినా అనేక విషయాలు ప్రస్తావించబడటం మీ అనుభవ పారీణతకు మచ్చు . అభినందనలు సర్.
చాలా చక్కని సమీక్ష. చాలా సంతోషంగా ఉంది.
కథలు జీవితాలనుంచే పుడతాయి. మోసాలు, దొంగతనాలు, హత్యలు మన చుట్టే జరుగుతున్నా పరిష్కారం దొరకని నిస్సహాయతలో కృగిపోతున్నాము. మూలాలు ఆలోచిస్తే సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేయడమే మన ముందున్న కర్తవ్యం. మీ అంతర్మథనం కొందరినైనా ఆలోచింపజేస్తుందని ఆశిస్తున్నాను.
ధన్యవాదాలు ప్రసూనా!
చాలా బెదురుగా భయంగా అనిపించింది. ఇంకేం తెలుసుకోవాలని అనిపించలేదు. ఆ పారిశ్రామిక విప్లవ కాలాల నుండి ఇప్పటి దాకా ఈ ఘోరాలు ఆగవనా చెప్పారు? ఇంత సాధించి కూడా మళ్ళీ మళ్ళీ అవే తప్పులు ప్రతీ తరం చేస్తూనే ఉందనా?
ఒక పక్క తమని బొమ్మకి ఎక్కించవద్దనే ఆడవాళ్లు, పోక్సో కేసు పెట్టిన అమ్మాయి, తన ప్రమేయం ఉందో లేదో కానీ మరొకరి ఫోన్ లో స్క్రీన్ సేవర్ లా మారిన ఇంకో అమ్మాయి, చనిపోయిన అందరూ ఆడవాళ్ళు…
కరెంట్ అంటే మరి వాళ్ళకి జీవనాధారం కనుక గొంతులో కంగారు..
ఎక్కడో పోయిన ప్రాణాలకు ఏమి కంగారు.. ఎంత మొద్దుబారిపోతున్నాం ఈ వార్తలు వినీ వినీ…
సృష్టిలో ఎంతో సౌందర్యం ఉంది. మనం లోకాన్ని కూడా మనుషులని, మనసులని సౌందర్యవంతం చేసుకోనంతకాలం ఆ సౌందర్యం నిండా అనుభవించలేం అని గుర్తు చేసిన కథ.
బెంగగా అనిపించింది.
ఎంతో విలువైన స్పందన. హృదయం లోతుల నుంచీ వచ్చిన స్పందన. ఒక భావుకురాలి మనసు అక్రోశించినస్పందన.
హీరో పేరులో ఒక్క అక్షరమే రాయడం చూస్తే రాజమండ్రి డైరీ గుర్తొచ్చింది 🙂
😀
Sir, this was a very uncomfortable read.
What makes it even more unsettling is the realization that the past was not very different either. We have moved forward in time, but have we really moved towards a better future?
A very real and disturbing picture of the future we are building. 😟
‘చరిత్ర పునరావృతమైంది. అవుతూ ఉంటుంది’ అని కథలో ఒక భాగం. ఈ కథలో పునరావృతమౌతున్న మన చరిత్ర కళ్ళ ముందు కనిపించి, దిగులు మేఘం కమ్మేసింది. కళ్ళు చెమ్మగిల్లాయి. మనం ఆపలేని సునామి కళ్ళ ముందు కనిపిస్తూంటే ‘సరే… ఏదైతే అది కానీ’ అనే ఒక నిర్లప్తత ఆవహించింది.
కథ చదివిన వెంటనే గుర్తొచ్చిన పెయింటింగ్ ఎడ్వర్డ్ మంచ్ చిత్రించిన The Scream. ఆధునిక మానవుడి ఆందోళన ఆ చిత్రం చూపించినంతగా మరేదీ చూపించలేకపోయిందని విమర్శకులంటారు.
పురోగమనం ఎంత కోరుకున్నా కనీసం పాతికేళ్ల వెనక్కైనా వెళ్లగలమా అనిపిస్తుంది అప్పుడప్పుడు. మరి 130 ఏళ్లు వెనక కూడా, ఈ చిత్రకారుడి లోపల్నుంచి ఇంతటి ఆక్రందన చిత్రంలోకి ప్రవహించిందంటే అతడి మనసులో ఏ తడి కల్లోల సముద్రమై పొంగిందో! ప్రపంచ మానవాళి అంతటినీ ఆ ఒక్క ఆకారంలోకి దింపి ఒక నిశ్చల చిత్రంలో వేదన విశ్వరూపాన్ని చూపించాడంటే ఎలాంటి ఆందోళన అతన్ని కుదిపేసిందో!
మనిషి ఆశపోతు మనస్తత్వం ప్రపంచపు వినాశనానికే దారితీస్తుందని తెలిసినా, దాదాపు 99 శాతం మనుషులు ఆశల వలయంలోనే పరిభ్రమిస్తూ ఉంటారు! సంతృప్తి అనే చిత్రం ఇంత అద్భుతంగా ఎవరైనా గీయగలిగితే బాగుండును. అలా గీసే పరిస్థితులు అధికశాతం మనుషులకి అనుభూతిలోకి వస్తే బాగుండును.
విచిత్రం ఏమిటంటే ఈ చిత్రం ఎన్నోసార్లు దొంగతనానికి గురవడం!! దానర్థం దుఃఖాన్ని కూడా సొంతం చేసుకోవాలనుకోవడం కాకపోతే ఏమిటి??
భద్రుడు గారి ఈ కథ, ఈనాటి The Scream. దీన్ని దొంగిలించేవాళ్ళు కూడా ఉంటారు!
ఎంత అద్భుతమైన స్పందన! అది కూడా ఒక చిత్రకారిణి నుంచి! మనుషుల పట్ల ఆపారమైన దయ కలిగిన భావుకురాలు మాత్రమే ఇలా రాయగలుగుతారు!
ధన్యవాదాలు భద్రుడిగారూ!
రమేష్ బాబు గారి లాగా ఎవరో ఒకరు మిమ్మల్ని తరచుగా కథ కోసం ఒత్తిడి పెడుతూ ఉంటే బాగుండును.
మరొక మారు శిరస్సు వంచుతున్నాను.