
అరకులోయ దారుల్లో
4
ప్రీ-హిస్టారిక్ అనుభవం
బొర్రా స్టేషన్లో రైలు దిగినప్పుడు మాతో పాటు దిగిన టూరిస్టులు ఆట్టే లేరు. ఆ మాటే అంటే రమణ అన్నాడు: ‘ఆ రైల్లో ఉన్నవాళ్లంతా టూరిస్టులనుకున్నారా. అంత అభివృద్ధి సాధించేలేదండీ మనమింకా. వాళ్లంతా సునాబేడా, కోరాపుట్, జయపూర్ లాంటి పట్నాలకు పోయేవాళ్లు. ఆ పట్నాలంతటా తెలుగువాళ్లు అధిక సంఖ్యలోఉన్నారు. ఈ రైల్లో ఆ ట్రాఫిక్ చాలా ఎక్కువే అన్నాడు.
ఆ స్టేషన్లో సున్నపురాళ్ల గుట్టలమధ్య దూరంగా కొండల్లోకీ సాగిపోయే ఎలక్ట్రిక్ రైల్వే లైనూ, ఆ కొండవాలుల్లోని చిన్నపల్లెలూ మధ్యాహ్నం రెండుగంటలకే చలిగాలి వీస్తున్న వాతావరణమూ అదేదో దూరదేశంలో ఏదో హిల్ స్టేషన్లో అడుగుపెట్టిన అనుభూతి కలిగించాయి.
“బొర్రా: సముద్రమట్టానికి 758 అడుగుల ఎత్తు” అన్న రైల్వే వారి బోర్డు తప్ప అక్కడ మరే సమాచారమూ లేదు. ఆ గుహలు ఏమిటో, అవెక్కడున్నాయో, ఎలా పోవాలో ప్రతి ఒక్కడూ ప్రతిసారీ ఎవరో ఒకర్ని అడిగి తెలుసుకోవలసిందే.
రమణ తనకు అలవాటైన దారిన మమ్మల్ని రైల్వేట్రాక్ వెంబడి నడిపించడం మొదలుపెట్టాడు. మాతోపాటు దిగిన టూరిస్టుల్లో చాలామంది యువతులు దిగినప్పటినుంచే పట్టపగ్గాల్లేకుండా ఉన్నారు. వాళ్లకి దూరంగా వడివడిగా నడుస్తున్న మాకు ఎదురుగా అయిదారుగురు యాత్రికుల బృందమొకటి ట్రాక్ వెంబడే స్టేషన్ వైపుగా వస్తూ కనబడ్డది.
“యు ఆర్ ప్రమ్ విచ్ ప్లేస్?” అడిగాడు ప్రకాష్ వాళ్లని కుతూహలంగా.
“బీహార్’ అన్నారు వాళ్లు.
“ఆర్ యు కమింగ్ ఫ్రమ్ ద కేన్స్? హౌడు యు ఫీల్’ మళ్లా అడిగాడు ప్రకాష్.
ఈ సారి వాళ్లు చాలా అవేశంగా కేవ్స్! హారిబుల్! డోస్ట్ గో దేర్, ఫర్ గాడ్స్ సేక్, దేరీజ్ నథింగ్ బట్ టోటల్ డార్క్ నెస్. డార్మ్ నెస్ అండ్ డార్క్ నెస్’ అంటూ స్టేషన్ వైపుగా వెళ్లిపోయారు. వాళ్ల మాటలకి నవ్వూ, ఆశ్చర్యమూ కూడా కలిగేయి మాకు.
“వీళ్లు రాష్ట్ర పర్యాటకశాఖకి ఎదురుపడిఉంటే ఎంతబాగుణ్ణు’ అన్నాడు రమణ. కానీ సన్నని కాలిబాట వెంబడి నడుచుకుంటూ పోతున్న మాకు మా ఎదురుగా పృథ్వి ఆవులించినట్టుగా ఎదురైన పెద్దకొండబిలం కనబడగానే అన్నిటినీ మరచిపోయి ఏదో థ్రిల్‌కి లోనుకాకుండా ఉండలేకపోయాం.
అక్కడ చాలామంది కొండజాతుల కుర్రవాళ్లు టూరిస్టు గైడ్డుగా ఉన్నారు. వాళ్లలో ఒక యువకుడు చురుగ్గా మమ్మల్ని అనుసరించాడు. అతనికీ, రమణకూ పూర్వపరిచయమున్నట్టుంది. అతను మాకు ఆ గుహల గురించి చెప్పడం మొదలుపెట్టాడు. అందులో కల్పన, మైథాలజీ, స్థలపురాణం అన్నీ కలగలిసిపోయాయి.
కానీ మేం అతనివెనుకనే ఆ బిలంలోకి ప్రవేశించిన తర్వాత నన్నా స్థలపురాణాలేవీ ఆకర్షించలేదు. అంధకారబంధురమైన ఆ గుహలో టూరిజం డిపార్ట్‌మెంటువాళ్లు మైసూరులాంప్స్ వారిచేత ఇల్యూమినేషన్ ఏర్పాటు చేయించారు. ఆ ఇల్యూమినేషన్ ఎర్రరంగులో, పచ్చరంగులో – అదంతా విఠలాచార్యసినిమాలో మాంత్రికుని గుహలాగా తయారైంది.
మేం కొద్దిదూరం నడిచేమో లేదో పవర్‌సప్లయి పోయింది. ఆ గుహ అంతా గాఢాంధకారం అలముకుంది. ఆ గుహలో అంతదాకా తిరుగుతున్న మనుషులు ఒక్కసారిగా గట్టీగా రకరకాలుగా అరవడం మొదలుపెట్టారు. వాళ్ల కేకలు ఆ గుహ అంతటా ప్రతిధ్వనిస్తున్నాయి
చీకట్లో, అంధకారభరితమైనగుహల్లో, అర్ధం లేని అరుపుల్లో ఏదో తెలియని వివశత్వాన్ని పొందుతున్న ఆ మనుషుల్ని చూస్తుంటే, నా అవ్యక్తమానసపాతాళంలో అణగిఉన్న ఆదిమానవుడి ప్రాచీనస్మృతులేవో కదలాడేయి.
ఎన్నో యుగాలకు పూర్వం, బయట పెనుతుపానులూ, మంచుప్రళయాలూ తీండడ్రిస్తున్నప్పుడు, మృగాల మందలు వెంట తరుముకొస్తున్నప్పుడు అనాగరికుడైన ఆ నా పూర్వమానవుడు ఇట్లాంటి గుహల్లోనే కదా తల దాచుకున్నాడు అనిపించింది.
మా వెంట వచ్చిన టూరిస్టు గైడు టార్చ్ వేసి ఆ సన్నని వెలుతుర్లో మమ్మల్ని ముందుకు నడిపించడం మొదలుపెట్టాడు. పై నుంచి సున్మ్నప్రురాయి కరిగి స్టాలక్టెట్లుగా, స్టాలగ్మెట్లుగా గుహ అంతటా ఏర్పడ్డ వింత ఆకృతులు, విచిత్రాకృతులు.
ఆ ఆకృతుల్లోనే ఒక మూల ఎత్తున, చిన్న లింగాకృతి. అక్కడొక పూజారి దీపం వెలిగించి అర్చన చేస్తున్నాడు. యాత్రికులు అక్కడ ఊగుతున్న ఇనపనిచ్చెన జాగ్రత్తగా ఎక్కి ఒక్క మనిషి మాత్రమే పట్టేటంత ఆ కొద్ది చోటులోనే నిలబడి దేవుడి ఎదట మోకరిల్లుతున్నారు. ఆ గుహలో మధ్యన పైనుంచి కారుతున్న నీరు రాళ్లమీద పడి చిట్లుతున్న చిరుజల్లులు. మా గైడ్ మమ్మల్నిఇంకా ముందుకు తీసుకెళ్లాడు. అక్కడొక చోట ఆంజనేయుడి పాదమూ, సీతమ్మవారు జలకాలాడిన పసుపునీళ్లు చూపించాడు. అక్కడితో స్థలపురాణం పూర్తయింది.
ఈ దేశంలో పాండవులు నివాసముండని చోటూ, సీతమ్మవారు జలకమాడని తీర్ధమూ ఉండదని గురజాడ అప్పారావు రాసింది గుర్తొచ్చింది. మా గైడ్ ఆ పైన మమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్లి ఇక్కడ నుంచి ముందుకు నడవడానికి వీలుకాదు. మీరు ముందుకు నేలమీదకు పాకాలి” అన్నాడు.
తిరిగి గైడ్ మమ్మల్ని జాగ్రత్తగా మేం వచ్చిన చోటుకు తీసుకొచ్చాడు. ఆ గుహలోంచిబయట బిలం ముఖద్వారం లోంచి విశాలంగా, విస్త్రృతంగా, ధావళ్యంతో ఎండలో మెరుస్తోన్ననీలిఆకాశం, గుహ రెండంచులమీంచీ వేలాడుతున్న అడవితీగలు, ఆకుపచ్చని రెపరెపలు,
ఆ కొద్దిసేపటి చీకట్లూ, మానసాంతరాల్లోంచి, పురాతనభయాల కదలికల్లోంచీ, తిరిగినీలిమనీ, ఆకుపచ్చదనాన్నీ, విస్తారమైన వెలుతుర్నీ చూసేటప్పటికి ఏదో విముక్తానుభూతికలిగింది.
నెమ్మదిగా బయటకు వచ్చాం. అప్పుడు చూసాం. దిగువన సున్నపురాళ్ల మీంచి నీలిపరదాజార్చినట్లు గోస్తనీ నది. పాలధారల్లో నీలాకాశం ప్రతిఫలిస్తున్నట్టుందా దృశ్యం.
“ఈ గుహల్లో ఉన్నదేమిటి?”, “నీకేమనిపించింది?’ ఈ ప్రశ్నలకు నిజంగా అర్థం లేదు. ఈ గుహల్లో అడుగు వెనక అడుగు వేస్తో దిగుతో ఉంటే మనిషి తన లోపల కప్పడిపోయిన పూర్వయుగాల్లోకి అడుగు పెడుతున్నట్టు. ఇదొక మాససికానుభవం.
“ఇక్కడ ప్రీ-హిస్టారిక్ అవశేషాలేమన్నా దొరికాయా’ ప్రకాష్ అడుగుతున్నాడు రమణని.
“అవశేషాల సంగతేమోగాని ఇదే పెద్ద ప్రీ-హిస్టారిక్ అనుభవం’ అంది ప్రశాంతి నవ్వుతూ.
“అవునవును. ఒకవైపు గాఢరహస్యలోకాలు. దానిమీద ఆచ్చాదనగా రంగులు, పువ్వులు, నవ్వులు. లోపల డీప్ సబ్‌కాన్షస్ మైండ్, పైనంతా సబ్లెమ్‌బ్యూటీ. బొర్రాగుహల్లో కనిపించేది మన అంతరంగమే’ అన్నాన్నేను.
ఇక్కడ కేవలం డార్క్ నెస్ తప్ప మరేమీ చూడలేకపోయిన ఆ బీహార్ యాత్రీకులెంత దురదృష్టవంతులో కదా అని కూడా అనుకున్నాను.
5
పెక్యూలియర్ మార్కెట్ ప్లేస్
ప్రయాణంలో ఆలస్యం వల్ల కొంతా, గుహలో అనుకున్నదాని కన్నా ఎక్కువసేపే గడిపినందువల్ల కొంతా మేం బయటకు వచ్చేటప్పటికి సాయంకాలం నాలుగ్గంటలయింది. సాయంకాలపు ఎండ కొండలమీంచి వాలుగా పడుతోంది. గుహల్లో తిరిగినందువల్లా, ఆ గబ్బిలాల వాసనకీ కడుపులో తిప్పినట్లయిఎవరికీ ఏమీ తినాలనిపించలేదు. నిజానికి అక్కడ చెప్పుకోదగ్గ హోటల్ గానీ, రెస్టారెంట్ గానీ ఏదీ లేదు. ఉన్నదల్లా ఒకటి రెండు పాకబడ్డీలు. అట్లాంటి బడ్జీలోనే కూలబడి మాతో పాటు తెచ్చుకున్న ట్రెడ్డూ, పళ్లూ బయటకు తీసాం.
ఆస్ట్రియాసుంచి వచ్చిన విదేశీయుల జంటా, విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి వచ్చిన హిందీ బెంగాలీ మాట్లాడుకుంటున్న ఉద్యోగులూ, స్థానికులైన గిరిజనులూ, ఇతర జాతులవాళ్లూ- అక్కడ అందర్ని చూస్తుంటే “ఇదం విశ్వం ఏకనీడం ఖలు” అన్న బుషి శుభాకాంక్ష సత్యంగా తోచింది. అలసటగా, మత్తుగా అక్కడే కునుకు తీద్దామా అనిపించిందిగానీ, ‘మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్’,
అక్కణ్ణుంచి మమ్మల్ని అరకు తీసుకుపోయే ప్రయత్నంలో రమణ ఎవరెవరినో సంప్రదిస్తున్నాడు. అతని ప్రయత్నాలేవీ ఫలించినట్టు లేదు. మా దగ్గరకొచ్చి “మనం ఇక్కడ అరకు రోడ్డు జంక్షన్ దాకా ఎవరో ఒకరిని పట్టుకుపోదాం. అక్కడనుంచి బస్సులు దొరుకుతాయి అరకు పోవడానికి’ అన్నాడు.
ఎలాగైతేనేం, స్టీల్‌ప్లాంట్ వాళ్ల బస్సులో మేం మూలియగూడ జంక్షన్‌కి వచ్చేటప్పటికి అయిదయ్యింది. సూర్యుడు తన చివరి కిరణాన్ని కూడా మృదువుగా వెనక్కి తీసేసుకున్నాడు. ఎదురుగా కెరటాల్లాగా అనంతగిరి కొండలు. ఆ కొండల వెనకనుంచి ముంచుకొస్తున్న మంచూ, తరలివస్తున్న చలిగాలులూను.
అర్ధగంటకు పైగా వెయిట్ చేసిన తర్వాత ఆర్టీసీ పాసెంజరు బస్సు నెమ్మదిగా కొండ ఎక్కుతూ వచ్చింది. బస్సు ఖాళీగానే ఉండటంతో ఎక్కేసాం. “కొద్దిగా ముందయి ఉంటే బాగుణ్ణు. ఇప్పుడు చీకటి పడిపోతోంది. అనంతగిరి కనుమల అందాలు మిస్సయిపోతున్నాం మనం” అన్నాడు రమణ.
అప్పటికీ, కొండలపైన వాలు అంచు వెంబడి మెలికలు తిరిగిన ఘాట్ రోడ్డులో కనుచీకటి పడుతున్న ఆ సంధ్యవేళ, ఆ అడవిదారిన ప్రయాణం నాకేదో గంభీరమైన మహాసౌందర్యాన్ని కొద్దికొద్దిగా పరిచయం చేస్తూనే ఉంది.
బస్సు అనంతగిరిలో ఎక్కువసేపు ఆగలేదు గానీ, ఆ తర్వాత సుంకరమెట్ట అన్న ఊళ్లో చాలాసేపు ఆగింది. అక్కడ ఆదివారం సంతరోజట. సంతనించి వెళ్లిపోయే జనం, వ్యాపారస్టులూ, సరుకుల మూటలతో కిక్కిరిసిపోయింది బస్సు. ‘మనం కొద్దిగా ముందు రాగలిగిఉంటే ఈ సంత చూసిఉండేవాళ్లం. ఈ ప్రాంతంలో ఇది బాగా ప్రసిద్ధమైన సంత’ అనాడు రమణ. ఆపైన సంతల గురించి వివరంగా చెప్పుకొచ్చాడు.
గిరిజనులు కొండల్లో, అడవుల్లో ఏరుకుని తెచ్చే చిన్నతరహా అటవీ ఫలసాయం చింతపండు, తేనె, కరక్కాయలు, కుంకుళ్లు, సీకాయా, అడ్డాకులూ, చీపుళ్లూ లాంటివి వారు సంతలకు తెచ్చి అమ్ముతారు. ఆ వచ్చిన డబ్బులతో వాళ్లకి కావలసిన నిత్యావసరవస్తువులు కొనుక్కుంటారు.
“ఇదొక పెక్యూలియర్ మార్కెట్ ప్లేస్. ఇక్కడ తరతరాలుగా గిరిజనుడు మోసపోతూనే ఉన్నాడు. అయినప్పటికీ సంతల ప్రాధాన్యం ఏమీ తగ్గకపోగా రాను రాను పెరుగుతూనే ఉంది” అని చెప్పాడు రమణ.
బస్సు అరకు బస్‌స్టాండ్‌లో ఆగింది. అప్పటికే బాగా చీకటి పడిపోవడంతో ఆ రాత్రికరెంటు దీపాల వెలుతుర్లో మాకు కనిపించిన ఊరు తక్కిన ఊర్లకంటే ప్రత్యేకంగా ఏమీకనిపించలేదు. బస్టాండ్ దగ్గర్లోనే టూరిజం డిపార్ట్ మెంట్ వారి గెస్ట్ హవుస్‌కి తీసుకుపోయాడురమణ. పొద్దుణ్ణించీ చేసిన ప్రయాణంపల్ల బాగా అలిసిపోయాం. చలి బాగా ఎక్కువైంది. ఎక్కడైనా ఇంత నీడ దొరికితే నిద్రపోవాలనుంది. కానీ మా దురదృష్టం, ఆ రోజే ఎవరో గవర్నమెంట్ అధికారుల ప్రోగ్రాం. ఆ గెస్ట్ హవుస్ నిండా ఒకటే జనం, వాహనాల హడావిడి. అంత హడావిడిలోనూ రమణ మా కోసం ఒక్కగదైనా సంపాదించాలని ప్రయాసపడ్డాడు. కానీ గెస్ట్ హవుస్ సిబ్బంది విసుక్కోవడంతో చిన్నబుచ్చుకుని బయటకొచ్చాడు. పొద్దుణ్ణించీ ఎంతో ఉత్సాహంగా, కాన్ఫిడెంట్‌గా ఉన్న అతని ముఖంలో ఇప్పుడు టెన్షన్. ఈ రాత్రి ఎక్కడ గడపాలా అని ఆలోచిస్తున్నట్టున్నాడు. ‘హోటల్సేవీ దొరకవా ఇక్కడ?’అనడిగాను.
“ఈ ఊరితో సమస్యే ఇది. ఇక్కడకు వచ్చినవాళ్లకి కంఫర్టబుల్ ప్లేస్ దొరకడం చాలా కష్టం. నేనే తప్పు చేసాను. మీరు ముందుగానే ఏర్పాట్లు చేసుకుంటామంటే వద్దన్నాను. ఈ గవర్నమెంట్ ప్రోగ్రాములతో ఇంతే. మొత్తమంతా ఆక్రమించేస్తారు వాళ్లు. హోటళ్లలో తిండీ, దుకాణాల్లో దండలూ కూడా వాళ్లే రిజర్వ్ చేసేసుకుంటారు’ రమణ మాటల్లో అసహనంతో కూడిన బాధ.
“ఇప్పుడెలా” అని రమణ అంటున్నంతలో ‘ఎప్పుడొచ్చారు’ అంటూ అతని భుజాన్ని తడుతూ ఎవరిదో పలకరింపు. ఆ వచ్చినతను స్థానిక పత్రికావిలేకరి. అప్పుడే గెస్ట్ హవుస్‌లో ప్రెస్‌మీట్ చూసుకుని తిరిగి వెళ్లిపోతూ రమణని చూసి పలకరించాడు. అతనికి రమణ బాగా తెలుసునట.
మా పరిస్టితి చూసి ఒక్క క్షణం ఆలోచించాడు.
“మిమ్మల్ని మా ఇంటికి తీసుకుపోదామా అంటే మా ఇల్లు బాగా చిన్నది. మీకు వీలుగా ఉండకపోవచ్చు. మనం ఒక పని చేద్దాం. ఇక్కడ ట్రైబల్‌పిల్లల కోసం స్కూలు ఉంది. ఆ హెడ్మాష్టారు నాకు బాగా తెలుసు. ఆయన్ని కలిస్తే ఈ రాత్రికి స్కూల్లో మనకి ఏదో కొంత వసతి చూపించకపోడు’ అన్నాడు. ఆ మాటలు వింటూనే మాకు ప్రాణం లేచివచ్చింది. ఆ చలిలో ఆ మార్గదర్శి వెంట ఊరి లోపల ఉన్న గిరిజన పాఠశాల దారిపట్టాం.
6
పద్మాలే అరుదు
ఆ గిరిజన పాఠశాల హెడ్మాప్టారు చాలా సహృదయుడు. ఆయన మాకు ఎంతో చక్కని ఆతిథ్యమిచ్చాడు. ఆ రాత్రి మా స్పానానికి వేణ్లీళ్లు ఏర్పాటు చేసాడు. ఆయనా, ఆయన తోటి సిబ్బందీ తమ ఇళ్లనుంచి మంచాలూ, దుప్పట్లూ తీసుకొచ్చారు. ఆయన తన ఇంట్లోనే మా కోసం చక్కనివిందు సిద్ధం చేయించాడు. మా స్నానాలూ, భోజనం అయ్యేటప్పటికి రాత్రి తొమ్మిదిగంటలైంది. అప్పుడాయన ‘ఎలాగూ ఈ రాత్రి ఇక్కడుంటున్నారు కదా, ఈ ఆదివారం
రాత్రి మా పిల్లలతో కొంతసేపు గడపండి’ అని కేంప్ ఫైర్ ఏర్పాటు చేసాడు.
ఆ రాత్రి ఆరుబయట పిల్లలందరూ వలయాకారంగా కూర్చున్నారు. మధ్యలో పెద్దనెగడి. ఆ నెగడి వెలుతుర్లో పిల్లలు తమకు వచ్చిన పాటలు పాడేరు. డాన్సులు చేసారు. తాము తమ గ్రామాల్లో చిన్నప్పటినుంచీ చూస్తున్న ఒరియానాటకాల్లోంచి పద్యాలు పాడేరు. ఒకవైపు మంట చిరువేడిగాలి వెచ్చగా తాకుతూంటే, వెనక వైపు వీపు మంచుకి చల్లబడుతుంటే, ఆ పిల్లల పాటలు, ఆటలు, నవ్వులు, నాట్యాలు మాకేదో కొత్త అనుభవాన్సిచ్చాయి.
ఆ క్షణాన్న, మా విశ్వవిద్యాలయాన్ని మించిన గొప్ప విశ్వవిద్యాలయం, ప్లేటో అకాడెమీ లాంటిది, ఆ ఆకాశఛత్రం కింద, పృథ్వీపీఠం మీద ప్రతిష్టించబడినట్టుగా మాకనిపించింది.
“గోర్కీ మై యూనివెర్సిటీస్ గుర్తొస్తోంది” అన్నాను రమణతో.
ఆ పిల్లల ఉత్సాహం సరస్వతితో పాటలు పాడించింది. ఆమె తన పసితనం నుంచీ విన్న పాటలు ‘కలవారికోడలు కలికికామాక్షి’ మొదలుకుని ‘జయజయజయ ప్రియభారత జనయిత్రీ, దివ్యధాత్రి’ దాకా తనకు వచ్చిన పాటలెన్నో పాడింది.
ఆ కార్యక్రమం ముగిసేటప్పటికి ఆకాశంలో చుక్కలు మెరుస్తూఉన్నాయి. దూరంగా అరకువేలీ అంతటా విద్యుద్దీపాలు. ఆ రాత్రి మేం నిద్రపోనేలేదు. హెడ్మాష్టరుగారూ, ఆయన తోటి టీచర్లూ మాకెన్నో సంగతులు చెప్తూఉండిపోయారు.
పొద్దున్నే తెల్లవారకుండానే పిల్లలంతా లేచి ఉదయం వ్యాయామానికి గ్రౌండ్ లోచేరిపోయారు. రిథమిక్‌గా వినిపించే విజిల్ చప్పుడుకి మెలకువ వచ్చి బయటకు వచ్చాను. దూరంగా తెల్లని పొగమంచు. ఆ మంచులోంచి అస్పష్టంగా మెరుస్తున్న చుక్కలు చూస్తూండగానే ప్రాతఃకాలపు వెలుగురేకలు ఆకాశమంతా వ్యాపించేయి. మిత్రులంతా లేచి తొందరతొందరగా తెమలడం మొదలుపెట్టారు.
హెడ్మాష్టారు ఏడున్నరకల్లా తెల్లని దుస్తులు ధరించి పువ్వులాగా మా ముందు ప్రత్యక్షమయ్యారు. ఒక వంక మా ఏర్పాట్లు చూస్తూనే మరో వంక పాఠశాల దైనందిన కార్యక్రమాన్ని పర్యవేక్షించుకుంటున్నారు.
‘మీ పిల్లలు చాలా తెలివైనవాళ్లండీ” అంది ప్రశాంతి.
ఆయన కళ్లల్లో మిలమిల. “అవునా, ఇంతకాలానికి మీ ఒక్కర్నించే విన్నానా మాట. నేను ఎంత చెప్పినా మా చుట్టూ ప్రపంచం ఒప్పుకోదే ఈ మాటని. మా చుట్టూ ఉన్న సమాజం, వాళ్ల చుట్టూ సమాజం వాళ్లని మొద్దులంటూ ముద్రవేసేసింది. టైబల్ ఛైల్డ్ డిసేబుల్డ్ ఛైల్డ్ కాదమ్మా. ఆ పిల్లవాడు మనకన్నా ఎంతో క్రియేటివ్. వాడు వచ్చింది ఎక్కణ్ణుంచని! ప్రకృతి ఒడిలోంచి కదా. ప్రకృతి ఎంత పంక్చువల్‌గా, డిసిప్లిన్ట్‌గా, క్రియేటివ్‌గా ఉంటుందని!మనం అలా ఉండగలమా?”
“చైత్రమాసం వస్తే మావిళ్లు చిగుళ్లు తొడగాల్సిందే. అడివిలో పాలపువ్వులు, సంపెంగపువ్వులు విచ్చుకోవలసిందే. శ్రావణమాసంలో ఆకాశమూ, నేలా ఏకం కావలసిందే.ఇదుగో, ఈ శీతాకాలంలో ప్రపంచమీ పొగమంచు తలపాగా చుట్టాల్సిందే. ఇటువంటి క్షణక్షణం రంగులు మారే సుందరమయ ప్రపంచంలోంచి ఈ పిల్లలు, ఇదుగో, ఈ నాలుగ్లోడల మధ్యకొచ్చి వాలతారు. మనం విద్య గురించి ఏదో చెప్పుకుంటాంగానీ, స్కూల్ ఎంత కన్సర్వేటివ్ సంస్థనో ఊహించగలరా!”
“మన పాఠశాల ప్రకృతికన్నా ఆకర్షణీయం కాగలదా? చూడండి, మా విరిగిపోయిన కుర్చీలు, ఆ టెక్ట్స్ పుస్తకాలూ, మా రుటీన్ లెసన్‌ప్లాస్లూను. అందులో ఈ పిల్లవాణ్ణి తమకి కట్టిపడేసుకునే అద్భుతమేముంటుంది చెప్పండి?”
“మొద్దులు వాళ్లు కాదు, మనం. మన విద్యావిధానాలూ, మన టెక్ట్స్ బుక్స్, మన స్కూలు కమిటీలూ, మన తనిఖీ అధికారులూ.. మారవలసింది మనమంతా. నిజంగా డిసేబుల్డ్ మనమే…
మాష్టారి మాటల్లో కవిత్వమూ, వయసు వల్లా, అనుభవం వల్లా వికసించిన వివేకం కలగలిసి ఆ ప్రాతఃకాలాన పుణ్యనదీ జలాలమీంచి వీచే మందానిలాల్లాగా తాకేయి మమ్మల్ని, “రవీంద్రుడి శాంతినికేతనం గురించి విన్నాను గానీ మీ పాఠశాల నిజంగా శాంతినికేతనంగా ఉంది” అంది సరస్వతి.
కానీ, ఒక వైపు ఆ పాఠశాలలోని అరకొర సౌకర్యాలూ, పిల్లల అనారోగ్యపూరిత దేహాలూ, వాళ్ల ఇబ్బందులూ కూడా మా దృష్టి దాటిపోవడం లేదు. కాని ‘జీవితంలో పంకం లేనిదెక్కడ? పద్మాలే అరుదు” అనుకున్నాను.
ట్రేక్ ఫాస్ట్ అయిన తర్వాత నిన్నటి పత్రికా విలేకరి, ఆయన పేరు ప్రసాద్, వచ్చి కలిసాడు మమ్మల్ని. ఇప్పణ్ణుంచీ ప్రోగ్రామంతా తన చేతుల్లోకి తీసుకున్నాడు. “చూడండి. అందరూ మీకుమల్లే అరకువేలి అంటే ఏమిటో చూడాలన్న ఆసక్తితో ఎంతో దూరం నుండి వస్తారు. మీకు లాగా అన్ని ఇబ్బందులూ పడతారు. తీరాచేసి ఇక్కడకొచ్చేటప్పటికి ఇక్కడేం చూడాలో తెలియడు వాళ్లకి. ఎవరూ చెప్పేవాళ్తుండరు కూడా. అటూ ఇటూ తిరిగి విసుక్కుంటూ అరకుని తిట్టుకుంటూ తిరిగిపోతారు”
ప్రసాద్ ఇంకా చెప్పుకొచ్చాడు. “ఇప్పుడు మనం వాళ్లలాగే చూడదల్చుకుంటే ఇక్కడ పద్మాపురంగార్డెన్స్ చూసి అక్కణ్ణుంచి రణజిల్లెడలో వాటర్‌ఫాల్స్ చూసి యాత్ర ముగించాలి. కాని ఈ సారి మనం కొత్తదారుల్లో పోదాం. ముఖ్యంగా రమణగారికి చూపించవలసినవి కూడా ఒకటి రెండున్నాయి” అన్నాడు.
మేం బయల్దేరబోతూండగా హెడ్మాప్టారు వచ్చి ‘మా పదవతరగతి పిల్లలకు ఏవన్నా నాలుగు మంచిమాటలు చెప్పిపొండి” అన్నాడు. కొద్ది సేపు వాళ్లతో గడపాలనుకున్నవాళ్లం, ఆ తరగతిగదిలో గంటకి పైనే కూచుండిపోయాం. ఆ గిరిజన శిశువుల అమాయికమైన ప్రశ్నలూ, వాళ్ల వదనాల్లోని నిర్మలత్వం, వాళ్ల ఆసక్తి మేం పలికే ప్రతిమాటనీ ఎంతో బాధ్యతాయుతంగా పలికేటట్టు చేసాయి. పదవతరగతి చదివాక పై చదువుల కోసం ఏమి అవకాశాలుంటాయో ఒక్కొక్కరం వివరంగా చెప్పాం. కొందరు పిల్లలు “అక్కా మీకు ఉత్తరాలు రాయొచ్చునా’ అని అడిగారు. అడ్రసులు తీసుకున్నారు.
ఆ పాఠశాలనుండి బయటకు వస్తున్నప్పుడు నిజంగానే ప్రాచీన గురుకులమొకదాన్ని చూసి వస్తున్న భావనకలిగింది.
Waling Through the Araku Valley
4
A Prehistoric Experience
When we got off the train at Borra station, there were hardly any tourists with us. When I mentioned this, Ramana remarked, “Did you think everyone on that train was a tourist? We haven’t developed that much yet! Most of them are headed to towns like Sunabeda, Koraput, and Jeypore. There is a large Telugu population in all those towns, so this train carries quite heavy passenger traffic.”
At the station, the electric railway line stretching into the distant hills amidst mounds of limestone, the small hamlets along the slopes, and the chilly winds blowing even at two in the afternoon gave us the distinct feeling of having arrived at a hill station in a faraway land.
Apart from the railway board reading “Borra: 758 Feet Above Sea Level,” there was no other information available. What those caves were, where they were located, and how to reach them had to be found out by asking someone every single time.
Ramana led the way along the railway tracks via a route he knew well. Among the tourists who got off with us, several young women had been wandering freely and unrestrained right from the moment of arrival. As we walked briskly away from them, a group of five or six travelers appeared ahead, heading along the tracks toward the station.
“Which place are you from?” Prakash asked them curiously.
“Bihar,” they answered.
“Are you coming from the caves? How do you feel about them?” Prakash asked again.
This time, they replied quite agitatedly: “The caves! Horrible! Don’t go there, for God’s sake! There is nothing but total darkness. Darkness and darkness!” With that, they walked away toward the station. Their reaction brought both laughter and surprise to us.
“How great it would have been if they had run into the state tourism department instead,” said Ramana.
However, as we walked along the narrow footpath, a massive chasm opened up ahead like the earth yawning wide before us. Catching sight of it, we could not help but forget everything else and feel a sudden thrill.
Many local tribal youths were working there as tourist guides. One energetic young man stepped forward to guide us; he and Ramana seemed to know each other from before. He began telling us about the caves, blending fiction, mythology, and local folklore into one narrative.
Once we followed him into the chasm, none of the folklore held my interest. Inside those pitch-black caverns, the tourism department had arranged illumination through Mysore Lamps. Glowing in shades of red and green, the entire cavern looked like a sorcerer’s den from a B. Vittalacharya movie.
We had barely walked a short distance when the power supply went out. Pitch darkness engulfed the entire cave. All at once, the people wandering inside began screaming and shouting in all sorts of ways. Their cries echoed throughout the cavern.
Watching these people find an inexplicable thrill in the darkness, the pitch-black caves, and meaningless screams, ancient memories of early man buried deep in the abyss of my subconscious began to stir.
I thought to myself: ages ago, when fierce storms and blizzards raged outside and herds of wild beasts gave chase, wasn’t it in caves just like these that my uncivilized ancestors sought shelter?
Our guide switched on his torch, leading us forward in that narrow beam of light. All around the cave, bizarre and intricate shapes formed from limestone melting from above into stalactites and stalagmites.
Among these formations, perched high in a corner, was a small lingam shape. A priest had lit an oil lamp and was performing worship there. Carefully climbing a rickety iron ladder, travelers stood in that cramped space—just large enough for one person—and knelt before the deity. In the middle of the cave, water dripping from the ceiling splashed into fine sprays against the rocks.
Our guide took us further inside. At one spot, he pointed out the footprint of Lord Hanuman and the turmeric water in which Goddess Sita had bathed. With that, the local folklore was complete.
I was reminded of Gurajada Apparao’s famous words: there is hardly a place in this land where the Pandavas haven’t lived, nor a sacred pond where Sita hasn’t bathed. Our guide then took us a step further and said, “You cannot walk beyond this point. You will have to crawl forward on your bellies.”
The guide then carefully brought us back to where we started. Looking out from the cave’s opening, we saw the wide, vast, pristine blue sky glowing in the sunlight, with wild creepers hanging from both rims of the cavern and green leaves fluttering gently.
Emerging from that brief darkness, from the inner recesses of the mind and the stirrings of primal fears, to see the blueness, the greenery, and the expansive light once again brought an overwhelming sense of liberation.
We slowly stepped outside. Only then did we see it: flowing below over the limestone like a blue curtain drawn across the rocks was the Gosthani River. The scene looked as if the blue sky itself were reflected across streams of milk.
“What is in these caves?” “How did it make you feel?” Such questions are truly meaningless. Step by step, descending into these caverns feels as though one is journeying into the buried, ancient epochs within oneself. It is an internal, psychological experience.
“Were any prehistoric artifacts discovered here?” Prakash asked Ramana.
“Artifacts aside, this in itself is a grand prehistoric experience,” Prasanthi said with a smile.
“Yes, exactly. On one side are deep, mysterious worlds; overlaid above them are colors, blossoms, and laughter. Within lies the deep subconscious mind, and above is sublime beauty. What we see in the Borra Caves is our own inner self,” I remarked.
I also thought to myself how unfortunate those travelers from Bihar were, who could see nothing there but the darkness.
5
A Peculiar Marketplace
Due partly to travel delays and partly to spending more time in the caves than planned, it was already four in the afternoon by the time we came out. The evening sun cast its slanted rays across the mountain slopes. Having walked extensively inside the caves and feeling nauseated by the stench of bats, none of us felt like eating anything. In fact, there were no proper hotels or restaurants to speak of—only one or two small thatched shacks. Slumping down at one such shack, we took out the bread and fruit we had brought along.
Looking at the crowd around us—a foreign couple from Austria, Hindi- and Bengali-speaking employees from the Vizag Steel Plant, local tribal folks, and people from various other communities—the ancient sage’s blessing, “Idam viśvam ekanīḍam khalu” (“This entire world is indeed one nest”), felt genuinely true. We felt so tired and drowsy that we were tempted to take a nap right there; yet, there were “miles to go before I sleep.”
Ramana was busy approaching various people in an effort to get us to Araku, but none of his attempts seemed to yield results. Approaching us, he said, “Let’s catch a ride with someone up to the Araku Road junction. From there, we can find buses to Araku.”
Somehow, by hitching a ride on a bus belonging to the Steel Plant folks, we reached Muliyaguda junction by five o’clock. The sun had softly withdrawn its very last rays. Rising before us like rolling ocean waves were the Ananthagiri hills, with thick mist gathering behind them and chilly winds sweeping in.
After waiting for over half an hour, an RTC passenger bus came slowly chugging up the hill. Finding it fairly empty, we climbed aboard. “If only it had been a little earlier! Darkness is falling now, and we are missing the scenic beauty of the Ananthagiri ghats,” Ramana said with regret.
Even so, traveling along that forest path in the gathering dusk, as the ghat road wound along the steep edges of the hills, continued to gently introduce me to a solemn, majestic beauty.
The bus did not halt for long at Ananthagiri, but stopped for quite a while at the next village, Sunkarametta. It was a Sunday, which was their weekly market (santa) day. The bus quickly packed to the brim with merchants, people heading home from the market, and heavy bundles of goods. “If we had arrived a little earlier, we could have seen this market. It is quite famous in this region,” Ramana remarked, going on to explain the significance of these rural markets in detail.
The tribal folk collect minor forest produce from the hills and forests—such as tamarind, wild honey, myrobalan (karakkaya), soapnuts (kunkudu), shikakai, adda leaves, and brooms—and bring them to sell at the weekly markets. With that income, they purchase their daily essential provisions.
“This is a peculiar marketplace. Generations of tribal people have been exploited and cheated here. Yet, far from diminishing, the importance of these weekly markets only continues to grow with time,” Ramana explained.
The bus pulled into the Araku bus stand. As deep darkness had already fallen, the town seen under the glow of electric streetlights looked no different from any ordinary town. Ramana led us to the Tourism Department Guest House near the bus stand. Exhausted from a full day’s travel and shivering as the cold intensified, all we wanted was a bit of shelter to sleep.
Unfortunately for us, there was an official government program scheduled for that very day. The entire guest house was swarming with people and buzzing with official vehicles. Amidst all that chaos, Ramana tried his best to secure at least a single room for us. But when the guest house staff snapped at him in frustration, he walked back out crestfallen. The enthusiasm and confidence he had carried all day were now replaced by sheer tension on his face. He seemed lost in thought about where we would spend the night.
“Can’t we find any hotels here?” I asked.
“That is the problem with this town. It is very hard for travelers who come here to find a comfortable place to stay. I made a mistake—when you offered to make arrangements in advance, I turned it down. It’s always like this with government programs. They take over everything completely. They even reserve all the food in the hotels and all the garlands in the shops!” Ramana’s voice was laden with frustration and regret.
Just as Ramana was wondering, “What do we do now?”, someone tapped him on the shoulder with a warm greeting: “When did you arrive?”
It was a local journalist. Having just attended a press meet at the guest house, he had spotted Ramana on his way out. He knew Ramana quite well.
Taking in our situation, he thought for a moment.
“I would invite you to my home, but it is very small and might not be comfortable for you all. Let’s do this: there is a school here for tribal children. I know the headmaster very well. If we meet him, he will surely arrange some accommodation for us in the school for the night,” he offered.
Hearing those words brought immense relief to us. In that biting cold, following our new guide, we set out along the path leading to the tribal school situated within the town.
6
A Rare Lotus
The headmaster of that tribal school was a deeply kindhearted man. He offered us wonderful hospitality. That night, he arranged hot water for our baths. He and his staff brought cot-beds and blankets from their own homes. He even had a delicious dinner prepared for us at his house. By the time we finished our baths and dinner, it was nine at night. He then suggested, “Since you are staying here tonight anyway, spend some time with our children this Sunday evening,” and arranged a campfire.
That night, all the children sat in a circle outdoors around a roaring bonfire. In the warm glow of that fire, the children sang songs and danced. They recited verses from the Odia plays they had grown up watching in their native villages. With the gentle warmth of the flames touching our faces from the front and the mist chilling our backs from behind, their songs, games, laughter, and dances gave us an entirely fresh experience.
In that moment, it felt to us as though a great university far surpassing our own—something akin to Plato’s Academy—had been established beneath the canopy of the sky, upon the pedestal of the earth itself.
“This reminds me of Gorky’s My Universities,” I remarked to Ramana.
The children’s enthusiasm inspired Saraswati to sing as well. She sang many songs she had known since childhood, starting from the folk tune “Kalavari Kodalu Kaliki Kamakshi” all the way to the patriotic hymn “Jaya Jaya Jaya Priya Bharata Janayitri, Divya Dhatri”.
By the time the program concluded, stars were glittering across the sky, with electric lights shimmering throughout the distant Araku Valley. We did not sleep at all that night; the headmaster and his fellow teachers stayed up late, sharing countless stories and experiences with us.
Early in the morning, before dawn could even break, the children woke up and gathered on the ground for physical training. Awakened by the rhythmic sound of the whistle, I stepped outside. In the distance lay a blanket of white mist. Even as the stars glimmered faintly through that fog, the first rays of morning light spread across the entire sky.
My friends woke up and began getting ready briskly.
By seven-thirty, the headmaster appeared before us dressed in crisp white clothes, looking as fresh as a flower. While seeing to our comfort on one hand, he was supervising the school’s daily routine on the other.
“Your children are remarkably intelligent, sir,” Prasanthi remarked.
A sparkle appeared in his eyes. “Is that so? In all these years, I have heard those words from you alone. No matter how much I explain, the world around us refuses to accept this truth. Society around us, and society around them, has branded them as dullards. A tribal child is not a disabled child. In fact, they are far more creative than we are. Where did they come from, after all? From the lap of nature! And nature is so punctual, disciplined, and creative. Can we ever match that?”
“When the month of Chaitra arrives, the mango trees must put forth fresh shoots. In the forest, wild jasmine and champak blossoms must unfurl. In the month of Sravana, the sky and the earth must unite. And in this winter, the world must wrap itself in this turban of mist. From such an exquisite world of shifting colors, these children come and settle between these four walls. We preach endlessly about education, but can you imagine how conservative an institution a school really is?”
“Can our school ever be more captivating than nature? Look at our broken chairs, these textbooks, and our routine lesson plans. What wonder do they hold to captivate these children?”
“It is not them who are dull, but us. It is our educational systems, our textbooks, our school committees, and our inspecting officers… We are the ones who must change. Truly, it is we who are disabled…”
The headmaster’s words, blending poetic insight with the wisdom of age and experience, brushed past us on that early morning like gentle breezes sweeping over sacred river waters. “I have heard of Rabindranath Tagore’s Santiniketan, but your school is a true abode of peace,” Saraswati said.
At the same time, we could not overlook the meager facilities in the school, the undernourished bodies of the children, and the hardships they endured. Yet I thought to myself: “Where in life is there no mud? It is the lotus that is rare.”
After breakfast, yesterday’s journalist, whose name was Prasad, came to join us. From that point on, he took charge of our itinerary. “Look,” he said, “everyone comes from afar just like you, eager to see what Araku Valley is all about. They face all the same hassles as you did. But once they arrive, they don’t know what to look for, and there is no one around to guide them either. They wander aimlessly, get frustrated, curse Araku, and head back home.”
Prasad continued, “If we want to see it like everyone else, we can just visit the Padmapuram Gardens, see the waterfalls at Ranajilleda, and wrap up the trip. But this time, let’s walk down newer paths. In particular, there are a couple of things I want to show Ramana.”
As we prepared to leave, the headmaster came up and requested, “Please share a few good words with our tenth-grade students before you go.” Though we had planned to spend only a few minutes with them, we ended up sitting in that classroom for over an hour. The innocent questions of those tribal children, the purity on their faces, and their genuine curiosity made us weigh every word we spoke with deep responsibility. Each of us explained in detail the various opportunities available for higher studies after the tenth standard. A few children asked, “Didi, may we write letters to you?” and took down our addresses.
Stepping out of the school premises, we truly felt as though we were walking away from an ancient Gurukulam.
21-8-2026


ఆ రాత్రి ఆరుబయట పిల్లలందరూ వలయాకారంగా కూర్చున్నారు. మధ్యలో పెద్దనెగడి. ఆ నెగడి వెలుతుర్లో పిల్లలు తమకు వచ్చిన పాటలు పాడేరు. డాన్సులు చేసారు. తాము తమ గ్రామాల్లో చిన్నప్పటినుంచీ చూస్తున్న ఒరియానాటకాల్లోంచి పద్యాలు పాడేరు. ఒకవైపు మంట చిరువేడిగాలి వెచ్చగా తాకుతూంటే, వెనక వైపు వీపు మంచుకి చల్లబడుతుంటే, ఆ పిల్లల పాటలు, ఆటలు, నవ్వులు, నాట్యాలు మాకేదో కొత్త అనుభవాన్సిచ్చాయి.
— ఈ పారాగ్రాఫ్స్ చదువుతుంటే .. నేను మా ఇంజనీరింగ్ కాలేజ్ రోజుల్లో వెళ్ళిన ఎస్కర్షన్ ట్రిప్ లో డార్జిలింగ్ లో కొంత మంది లోకల్స్ తో టూర్ కి వచ్చిన మా క్లాస్మేట్స్ అందరం కలిసి వేసుకున్న క్యాంఫైర్ , ఎన్నో భాషల్లో పాటలు పాడుకుంటూ , డాన్స్ చేసుకుంటూ రాత్రంతా గడిపిన సంగతి గుర్తొచ్చింది.
మీరన్నట్టు ఆ క్షణాన్న, మా విశ్వవిద్యాలయాన్ని మించిన గొప్ప విశ్వవిద్యాలయం ఎక్కడా లేదనిపించింది..
“టైబల్ ఛైల్డ్ డిసేబుల్డ్ ఛైల్డ్ కాదమ్మా. ఆ పిల్లవాడు మనకన్నా ఎంతో క్రియేటివ్. వాడు వచ్చింది ఎక్కణ్ణుంచని! ప్రకృతి ఒడిలోంచి కదా. ప్రకృతి ఎంత పంక్చువల్‌గా, డిసిప్లిన్ట్‌గా, క్రియేటివ్‌గా ఉంటుందని!మనం అలా ఉండగలమా?” How True this statement is? 🙏🙏🙏
సర్, “ఈ దేశంలో పాండవులు నివాసముండని చోటూ, సీతమ్మవారు జలకమాడని తీర్ధమూ ఉండదు” అని గురజాడ అప్పారావుగారు రాశారని నాకు తెలియదు. మా ఊళ్ళో కూడా గుట్ట మీద పాండవులు నివాసం వున్నారని చెప్తారు. 😁
“అంధకారభరితమైన గుహల్లో…, నా అవ్యక్తమానసపాతాళంలో అణగిఉన్న ఆదిమానవుడి ప్రాచీనస్మృతులేవో కదలాడేయి”
“మనిషి తన లోపల కప్పడిపోయిన పూర్వయుగాల్లోకి అడుగు పెడుతున్నట్టు. ఇదొక మానసిక అనుభవం.”
“ఒకవైపు గాఢరహస్యలోకాలు. దానిమీద ఆచ్చాదనగా రంగులు, పువ్వులు, నవ్వులు. లోపల డీప్ సబ్‌కాన్షస్ మైండ్, పైనంతా సబ్లైమ్ బ్యూటీ. బొర్రాగుహల్లో కనిపించేది మన అంతరంగమే.”
A very internal experience!!
“చైత్రమాసం వస్తే మావిళ్లు చిగుళ్లు తొడగాల్సిందే… ఇటువంటి క్షణక్షణం రంగులు మారే సుందరమయ ప్రపంచంలోంచి ఈ పిల్లలు ఈ నాలుగు గోడల మధ్యకొచ్చి వాలతారు. స్కూల్ ఎంత కన్సర్వేటివ్ సంస్థనో ఊహించగలరా!” ☹️
బొర్రాగుహల్లో ఆదిమానవుడి ప్రాచీన స్మృతులు, గిరిజన పాఠశాలలో పిల్లల మధ్య మీ అనుభవం, ప్రయాణంలో మీరు చూసిన, పొందిన అనుభవాలు!!
అందరు టూరిస్టులు తిరిగి చూసినట్టు కాకుండా, మీరు పొందిన ఒక unique experienceని మాకూ అనుభవమయ్యేలా రాశారు!! 🙏🏽
ధన్యవాదాలు మాధవీ!
అక్కడి పిల్లల గురించి హెడమాస్టర్ గారి మాటలు నేను ఎంత మంది తోనో అనాలని అనని మాటలు. మీ వ్యాసం చదవకపోతే అయన గురించి తెలిసేది కాదు. ఒక మంచి మనిషి గురించి వింటే చాలా సంతోషం కలుగుతుంది.
అవును సార్! ఆయన మహనీయుడు. భగవంతుడు ఆయన్ని అనుగ్రహించాడు. వాళ్ళ పిల్లలు వృద్ధిలోకి వచ్చారు.