
ఈ మధ్య వెంకట సిద్ధారెడ్డి ఒక మెసేజి పెట్టారు: ‘రామానాయుడు స్టూడియోస్ లో డోరతీ అని ఒక సినిమా ప్రివ్యూ ఉంది, తప్పకుండా వచ్చి చూడండి’ అని. అంతేకాకుండా ఫోన్ చేసి మరీ చెప్పారు. కాని నేను ఆ రోజు వెళ్ళలేకపోయాను. రాలేకపోయానని మర్నాడు మెసేజి పెడితే మరోసారి కూడా ప్రివ్యూ వేస్తున్నారు రమ్మని పిలిచారు. ఈసారి ప్రివ్యూ ట్రాన్స్ జెండరు పర్సన్లకోసం ప్రత్యేకించి వేస్తున్నారని చెప్పారు.
ఆ సినిమా ఏమిటో, దాన్ని ప్రత్యేకించి ట్రాన్స్ జెండరు వ్యక్తుల కోసం మళ్ళీ ఎందుకు వేస్తున్నారో నాకేమీ తెలీదు. కానీ సిద్ధారెడ్డి మరీ మరీ పిలిచారంటే అది తప్పకుండా చూడవలసిందే అని అనుకున్నాను. అందుకని అందరి కన్నా ముందే స్టూడియోకి వెళ్ళి కూచున్నాను. నెమ్మదిగా ముప్ఫై నలభై మంది దాకా ట్రాన్స్ జెండర్లు వచ్చాక ఆ సినిమా మొదలుపెట్టారు.
అది తమిళ సినిమా అనీ, ఇప్పటికే తమిళనాడులోనూ, దేశంలోనూ కూడా సంచలనం రేకెత్తిస్తూ ఉందనీ నాకు తెలియదు. నేను చూస్తున్నది డబ్బింగు అని కూడా అనుకోలేదు. సినిమా మొదలైన చాలాసేపటిదాకా, ఎక్కడో చిత్తూరు జిల్లా నేపథ్యంగా తీసిన సినిమా కావచ్చు అనుకున్నాను. ఏదో ఒక గ్రామంలో పితృస్వామ్యమూ, ధనస్వామ్యమూ కలిసి సృష్టించగల క్రూరత్వం మధ్య నెమ్మదిగా కథ సాగుతూ ఉండగా, దానికి ట్రాన్స్ జెండర్లని ఎందుకు పిలిచారా అని అనుకున్నాను.
కాని సినిమా సగం గడిచేటప్పటికి, అర్థమయింది, ఇది 2026 లో మాత్రమే రాగల కథ అని. ఇరవయ్యేళ్ళ కిందటిదాకా ఎందుకు, కనీసం పదేళ్ళ కిందటిదాకా కూడా ఇటువంటి కథని మనం ఇంత పెద్ద తెర మీద చూడటం దాదాపుగా అసంభవం అనీ.
మన దేశానికి సంబంధించినంతవరకూ, 2018 దాకా, మనుషుల మధ్య లైంగిక సంబంధాల్ని 1860 లో రూపొందించిన ఇండియన్ పీనల్ కోడ్ (ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత), సెక్షన్ 377 నిర్వచిస్తూ వచ్చింది. దాని ప్రకారం చట్టబద్ధంగా వివాహితులైన ఇద్దరు స్త్రీపురుషుల మధ్య తప్ప మరే విధంగానైనా ఏ ఇద్దరు వ్యక్తుల మధ్యనైనా లైంగిక సంబంధాలు ఏర్పడితే, అవి పరస్పర అంగీకారంతో ఏర్పడ్డా (consensual adult sex) వాటిని నేరంగానూ, ప్రకృతి విరుద్ధంగానూ పరిగణిస్తూ వచ్చారు. బ్రిటిషువాళ్ళు రూపొందించిన ఈ న్యాయస్మృతి నూటయాభై ఏళ్ళకు పైగా నిరాఘాటంగా రాజ్యం చేసింది. దానివల్ల ఇద్దరు పురుషుల మధ్యగానీ, ఇద్దరు స్త్రీల మధ్యగానీ, లేదా ఇద్దరు ట్రాన్స్ జెండర్ల మధ్యగానీ లేదా స్త్రీపురుషులకీ, ట్రాన్స్ జెండర్ల మధ్య కానీ, ఒక్కమాటలో చెప్పాలంటే, ఏ ఇద్దరు మేజర్ వ్యక్తులమధ్యనైనా ఏర్పడే ఎటువంటి లైంగిక సంబంధమైనా నేరమైపోయేది. అది మానవ సమానత్వానికీ, వ్యక్తిగత జీవితపు ఎంపికలకి సంబంధించిన మర్యాదకీ, వ్యక్తి గౌరవానికీ భంగం కలిగించే విధంగా రాజ్యం వ్యక్తుల జీవితాల్లో తలదూర్చడమే అవుతుందని మానవహక్కుల కార్యకర్తలు వాదిస్తూ వచ్చారు.
అందుకని వారు ఈ సెక్షన్ని రద్దుచేయాలని దశాబ్దాల తరబడి న్యాయపోరాటం చేస్తూ వచ్చారు. వారి వాదనని అంగీకరిస్తూ, ఇద్దరు మేజరు వ్యక్తుల మధ్య consensual adult sex కి ఈ సెక్షన్ ని వర్తింపచెయ్యకూడదని 2009 లో ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ, మొదట్లో సుప్రీం కోర్టు ఇది పార్లమెంటు చట్టం ద్వారా సవరించవలసిన విషయమని అభిప్రాయపడింది. కాని Navtej Singh Johar v. Union of India కేసుని విచారిస్తూ అయిదుగురు సభ్యులున్న సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ సెక్షన్ రాజ్యాంగ విరుద్ధమంటూ 6 సెప్టెంబరు 2018 న చారిత్రాత్మకమైన తీర్పునిచ్చింది. అంతే కాదు, constitutional morality కీ societal morality మధ్య సున్నితమైన తేడా ఉందని కూడా గుర్తుచేసింది.
ఇంత జరిగాక కూడా, ఇప్పుడు ప్రపంచమంతటా LGBT హక్కుల కోసం ఒక చైతన్యం స్థిరపడ్డాక, ఆ పవనాలు మన దేశంలోనూ, యుగాలుగా కరడుగట్టిపోయిన మన సామాజిక-మతధార్మిక విశ్వాసాల్లోనూ కూడా కదలిక తేవడం మొదలయ్యాక కూడా మన ధర్మశాస్త్రాలూ, మన ప్రవచనకారులూ దాంపత్యమూ, ప్రేమా, సెక్సూ ఒకే మతానికీ, ఒకే కులానికీ, ఒకే శాఖకీ (పైకి చెప్పకపోయినా ఒకే ఆర్థిక స్తోమతుకీ) చెందిన స్త్రీపురుషులకి మాత్రమే పరిమితమై ఉండాలని ముందటికన్నా కూడా మరింత బిగ్గరగా ఘోషిస్తున్న కాలంలో, ఒక పురుషుడికీ, ఒక ట్రాన్స్ జెండర్ కీ మధ్య స్నేహమూ, ప్రేమా, అన్యోన్య దాంపత్యమూ కూడా సాధ్యమేననీ, ప్రతి ఒక్క బుద్ధి జీవీ, ప్రతి ఒక్క సహృదయుడూ అటువంటి దాంపత్యాన్ని హృదయపూర్వకంగా ఆశీర్వదించాలనీ చెప్పే ఇటువంటి కథని తెరకి ఎక్కించి ఆ కార్తిక్ సుబ్బరాజు ఎవరో గొప్ప సాహసం మాత్రమే కాదు, గొప్ప సామాజిక బాధ్యత కూడా నెరవేర్చాడనిపించింది.
నేను చూస్తున్న కథ ఏమిటో నాకు అర్థం కావడం మొదలుపెట్టాక సినిమా చూస్తున్నంతసేపూ నాలో ప్రగాఢ స్పందనలు కలుగుతూనే ఉన్నాయి. ఇన్నాళ్ళూ ‘ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడికాన్పించని ‘ కథ ఇది అన్న మాట నిజమేగాని, అంతకన్నా కూడా నాకు పదే పదే అనిపిస్తూ వచ్చింది ఒకటే: ఒకసారంటూ ‘ప్రధానస్రవంతి’ కథనాలు బీటలు వారడం మొదలుపెట్టాక, ఇంతదాకా అప్రధానీకరణకి లోనయిన కథనాలు ఎంత బలంగా, ఎంత కొత్తగా, ఎంత హృద్యంగా వినిపించడం మొదలుపెట్టగలవూ అన్నదే.
సాధారణంగా ఇటువంటి కథలు భారతప్రభుత్వం వారి సాంగ్ అండ్ డ్రామా తరహా ప్రచారపద్ధతిలోకి జారిపోకుండా ఉండటం కష్టం. కానీ దర్శకుడు అన్నిటికన్నా ముందు దీన్ని ఒక కళాత్మక కథనంగా తీర్చిదిద్దడం మీద చాలా దృష్టి పెట్టాడు. మామూలుగానే పరువు హత్యలు ఒక సంక్లిష్ట ఇతివృత్తం. అందులో పితృస్వామ్యంతో పాటు కులమో, మతమో, సామాజిక అంతరాలో కలగలిసి కథని చాలా సంక్లిష్టపరుస్తాయి. ఇక దానికి తోడు, ఇటువంటి లింగ వివక్ష కూడా చేరడమే కాక, అదే ప్రధానమైన కోణంగా మారేసరికి, దాన్ని నమ్మదగ్గ కథగా, మెచ్చదగ్గ కథగా చిత్రించడం నిజంగా కత్తిమీద సాము.
దర్శకుడు తన intricate storytelling వల్ల దీన్ని సాధ్యం చేసుకోగలిగాడు. చివరికి కొండమీద, కార్తి సుబ్బుని చంపెయ్యడానికి పిస్టల్ పట్టుకుని వెళ్ళినప్పుడు-దాదాపు పదినిముషాల పాటు- వారిద్దరి మధ్యా నడిచే సన్నివేశం మనం షేక్స్పియర్ నాటకాల్లో మాత్రమే చూడగలం. ఇక చివరి దృశ్యంలో సుబ్బూ డోరతిగా మారేక ఆ అద్దంలో తన వదనాన్ని చూసుకున్నప్పుడు, ఆ స్త్రీగా మారిన పురుషుడిలో, ఒక కన్యా సౌందర్యం గోచరించడంతో, పాపపంకిలమైన సమాజంలో అప్పుడే విరిసిన నిండు తామరపువ్వును చూసిన సాక్షాత్కార సంతోషానికి మనం లోనవుతాం. ఆ చివరిక్షణం కోసమేనా మనం మొత్తం సినిమా మళ్ళా మరోసారి మొదటినుంచీ చూడవచ్చు.
ప్రివ్యూ పూర్తయ్యాక బయట ఒక ఎలక్ట్రానిక్ ప్రెస్ బృందం ప్రేక్షకుల అభిప్రాయాలు అడిగి తెలుసుకుంటూ ఉంది. అభిప్రాయాలు చెప్పినవాళ్ళల్లో ట్రాన్స్ జెండర్ వ్యక్తుల్తో పాటు, వారికోసం పని చేస్తున్న ఒక ప్రొఫెసరూ, ఒక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధీ కూడా ఉన్నారు. వారందరి అభిప్రాయాలూ రికార్డు చెయ్యడం పూర్తయ్యాక నా అభిప్రాయం కూడా రికార్డు చేసుకొమ్మని వారిని అభ్యర్థించి మరీ నా వంతు మాటలు కూడా నాలుగు చెప్పాను.
సినిమా చూడటం ఒక ఎత్తైతే, ఆ తర్వాత ట్రాన్స్ జెండర్ల ఫీడ్ బాక్ వినడం మరో ఎత్తు. ఆ సినిమా వల్ల కదా: వారికి ఒక గొంతు లభించింది, ఆ గొంతు వినడానికి ప్రపంచం తరఫున ఆ పాత్రికేయులు అక్కడికి చేరింది అనుకున్నాను. అక్కడ మాట్లాడిన ప్రతి ఒక్కరి అభిప్రాయాలూ నేను కూడా విన్నాను. దర్శకుడు తమ జీవితాల గురించి చెప్పడంలో ఏదో ఒక పొరపాటు చేసాడని ఏ ఒక్కరూ కూడా చెప్పలేదు. పైగా తాము తమ జీవితాల్లో మర్చిపోయిన ఎన్నో అంశాల్ని దర్శకుడు గుర్తుచేసాడని కూడా చెప్పారు. ఇటువంటి సామాజిక అంశాల్ని కళారూపాలుగా మార్చడంలో అధ్యయనం ఎంత కీలక పాత్ర పోషిస్తుందో నాకు మరోసారి అర్ధమయింది.
కానీ అన్నిటికన్నా కూడా, సినిమా కన్నా కూడా, నన్ను తీవ్రంగా కదిలించిన మాట ఒకటి, ఒక ట్రాన్స్ జెండర్ చెప్పినమాట. ఆమె అంది కదా: ‘ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క ప్రాణీ తోడు కోరుకుంటుంది. చివరికి పక్షులూ, పశువులూ కూడా కంపేనియన్లని కోరుకుంటాయి. కాని ఒక్క ట్రాన్స్ జెండర్ మాత్రమే ఒంటరిగా పుట్టి ఒంటరిగా మరణించే పరిస్థితి. మాక్కూడా ప్రేమించాలని ఉంటుంది కదా! మాక్కూడా ఎవరినుంచేనా ప్రేమ లభించాలని ఉంటుంది కదా!’
ఈ మాటలు ఇప్పటికీ నా చెవిలో గింగురుమంటూనే ఉన్నాయి.
ఆ అభిప్రాయాలు వినాలనుకుంటే ఈ లింకు చూడవచ్చు:
16-10-2026

