
మొన్న ఒక రోజు సన్నిధానం నరసింహ శర్మగారి నుంచి ఫోన్. ఆయన పలకరిస్తున్నారంటేనే గోదావరి ఫోన్ చేస్తున్నట్టు. (ఇంతకుముందు ఒకసారి ఆయన మా ఇంటికొచ్చినప్పుడు ‘గోదావరి మా ఇంటికొచ్చింది’ అని రాసాను. ఆ వ్యాసం ఇక్కడ చూడవచ్చు.) ఇప్పుడాయన 81 వ ఏడాదిలో ఉన్నారు. ఇన్నేళ్ళ తన జీవితంలో తాను అప్పుడూ అప్పుడూ తన గురువుల గురించీ, సన్నిహితుల గురించీ రాస్తూ వచ్చిన పద్యాలతో ఒక చిన్న పుస్తకం వెలువరించామని చెప్పారు. దానికి ‘వ్యక్తీకరణం: గుణ గణ గేయం’ అని పేరుపెట్టామని కూడా చెప్పారు.
ప్రాచీన సాహిత్య ప్రమాణాల్లో సుశిక్షితులైనవాళ్ళు ఏం చేసినా ఇలా ఉంటుంది. ‘వ్యక్తీ’కరణం అనే మాటలో వ్యక్తి చుట్టూ రెండు ఇన్వర్టెడ్ కామాలు పెట్టారు. అంటే ఆ వ్యక్తి అనే మాట మీద ఒక ఊనిక ఉంది చూడండి అన్నట్లు. సంస్కృతంలో వ్యక్తి అనే పదానికి మూలం ‘అంజ్’ అనే ధాతువు. దానికి అర్థం, అభిషేకించడం, అలంకరించడం, విస్పష్టం చెయ్యడం అని. అంజనం అనే మాట కూడా ఈ ధాతువు నుంచి పుట్టిందే. ‘వ్యక్తి’ అంటే తాను చూపించదలచుకున్నదాన్ని మరింత వివరంగా, మరింత విస్పష్టంగా, మరింత ప్రకాశవంతంగా చూపించడం అని అర్థం . మన మనసులో ఉన్న భావాన్ని మనం విస్పష్టంగా పైకి చెప్పడం అనే అర్థంలో మనం వాడే ‘అభివ్యక్తి’ అనే మాట కూడా దీన్నుంచి వచ్చిందే. ఇక వ్యక్తీకరణం అంటే- అటువంటి విస్పష్టతను ఆవిష్కరించడం లేదా దానికొక రూపాన్నివ్వడం అని అర్థం.
మామూలుగా వ్యక్తీకరణం అనగానే మన మనసులో భావాల్ని మాటల్లో పెట్టడం అని అర్థం చేసుకుంటాం. అది రూఢ్యర్థం. కాని ధాతురూపం తెలుసుకుని ఆ పదాన్ని అర్థం చేసుకోడానికి ప్రయత్నించినప్పుడు, అది ‘మనసులో భావాన్ని మరింత ప్రకాశవంతంగా చెప్పడం’ అనే లోతైన అర్థాన్నిస్తుంది. ఇక ఇక్కడ ‘వ్యక్తి’ అనే మాటమీద ఊనిక పెట్టినందువల్ల ఇది కేవలం మనసులో ఆలోచనల్ని మాటల్లో పెట్టడం మాత్రమే కాదనీ, కవి కొందరు వ్యక్తుల గురించిన తలపుల్ని మాటల్లో పెడుతున్నారనీ, ఆ ప్రక్రియలో భాగంగా, వారి వ్యక్తిత్వాల మీద మరింత వెలుగు ప్రసరింపచెయ్యబోతున్నారనీ అర్థం. అందుకనే ఆ శీర్షిక కి ‘గుణగణ గేయం’ అనే ఉపశీర్షిక కూడా కూడా జోడించారు.
గేయం అంటే పాడేది అని అర్థం. గుణగణం అంటే గుణాల సమూహం, దాన్ని కీర్తించడం అని అర్థం చేసుకోవచ్చు. లేదా గుణ+గణగేయం అంటే గణబద్ధ ఛందస్సుల్లో పాడటం అని కూడా అర్థం చేసుకోవచ్చు. ఇందులో ఉన్న 30 కవితల్లోనూ, 4 మాత్రమే వచనకవితలు. ఆ నాలుగూ కూడా తన మిత్రుడిమీదా, తన మిత్రుడి కూతురిమీదా, డా.కలాం మీదా, తన శ్రీమతి మీదా రాసినవి. తక్కినవన్నీ గణగేయాలే. అంటే పద్యాలు, లేదా గేయాలు.
ఇవన్నీ ఒక్కసారి కూర్చుని పనిగట్టుకుని రాసినవి కావు. తన జీవితయాత్రలో ఆయా సందర్భాల్లో వారి గుణగణాల్ని తాను విస్పష్టంగా చెప్పాలనుకున్నప్పుడల్లా నోరారా ఎలుగెత్తి చెప్పినవి. అంటే ఒక జీవితకాల కవిత్వ వ్యవసాయం అన్నమాట. తాను ఎవరెవరిమీద ఈ పద్యాలు చెప్పారో వాటిని ఈ పుస్తకంలో కూర్చిన విధానంలో కూడా ఒక క్రమపద్ధతి ఉంది. తాను ఎవరెవరికి తన మనసులో ఎటువంటి ప్రాథమ్య స్థానాన్ని ఏ క్రమంలో ఇస్తూ వచ్చారో ఈ పుస్తకంలో కూడా అదే క్రమంలో కనిపిస్తారు. కాబట్టే మొట్టమొదటగా జానపద వాజ్ఞ్మయోద్ధారకులు నేదునూరి గంగాధరం గారు, ఆ తర్వాత శర్మగారికి రెండు నేత్రాలతోనూ సమానులైన మధునాపంతులవారూ, శరభయ్యగారూ, ఆ తర్వాత తాను తనకి మూడవ గురువుగా చెప్పుకునే ఆరుద్ర, తనకి ఎన్నో విషయాల్లో బాసటగా నిలబడ్డ జయధీర్ తిరుమలరావు, తన ‘స్వస్థాన మిత్రుడు’ కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ, అదే వరసలో సతీష్ చందర్- ఇక్కడితో ఆయన హృదయవేదిక మీద బొమ్మల కొలువు పూర్తయ్యింది.
ఆ తర్వాత తాను తన శిరసుకెత్తుకుని ఊరేగించే బ్రౌన్, కాటన్, వీరేశలింగం, ఇందిరాగాంధి వంటి వారు కనిపిస్తారు. ఆ వరస కూడా దాటాక, తాను తన మనసులో కొంత చోటు మిగిల్చిపెట్టుకున్న మరికొందరు మిత్రులు కనిపిస్తారు. ఇక అందరికన్నా చివరగా, ఇటీవలే దివంగతురాలైన వారి శ్రీమతి శతకీర్తి కనిపిస్తారు. తన అర్ధాంగి గురించి రాసుకోవడమంటే తన గురించి రాసుకోవడమే కాబట్టి, వినయవినమిత శిరస్కుడిగా ఆయన ఆ పద్యాల్ని చిట్టచివర పేర్చిపెట్టడంతో ఈ కావ్యం మరింత ఔచిత్యవంతంగా శోభిస్తున్నది.
పద్య నిర్మాణ కౌశల్యమూ, ప్రేమవివశత్వమూ మాత్రమే కాదు, ఇటువంటి ఔచిత్యం ఈ పుస్తకంలో అడుగడుగునా కనిపిస్తుంది. ఉదాహరణకి పుస్తకంలో మొట్టమొదట నేదునూరి వారి ప్రశంస ఉందని చెప్పాను కదా. ఆయన జానపద సాహితీవేత్త కాబట్టి పద్యాల్లో కాక ఆయన మీద ఒక గేయం రాయడంలోని ఔచిత్యం ఎంత ఉదారం! అది కూడా ఏదో మామూలు గేయం కాదు:
పథమంతా జానపదం
ధనమంతా తెలుగుదనం
తెలుగు వాజ్ఞ్మయంపు వెలుగు
తెలిపినట్టి దిట్టలలో
చూడంగా గంగాధరం
మేరువురా గంగాధరం
ఆ సంబోధనలో ‘రా’ కొట్టింది- ఏకకాలంలో- గంగాధరాన్నీ, అది వింటున్న మననీ కూడా.
ఇందులో పద్యాభిషేకాలు చేసిన వ్యక్తుల గురించి ఆయన ఏరి తెచ్చిన దీనారటంకాల్ని గీచి చూడగల పరీక్షాశక్తి నాకు లేదు. అవి ఎవరికి వారు చదువుకోవలసినవి, లేదా ఎప్పుడేనా ఆయనే వినిపిస్తే, కళ్ళు అరమూసుకుని, ధ్యానంతో వినదగ్గవి.
ఇందులో వ్యక్తుల పట్ల తన ప్రేమ ప్రశంస గంభీరంగా ఉంటూనే, దానిలోనే చిరుచమత్కారం చిరువెండివెలుగులా మెరుగులీనుతూనేఉంది. ఒకటి రెండు ఉదాహరణలు చూడండి.
సతీష్ చందర్ మీద రాస్తూ ఇలా అంటున్నారు:
చెల్లెమ్మ గౌరమ్మని
చక్కగా చూసుకుంటున్నారని
రాజమహేంద్రవరాన్నే కట్నకానుకగా ఇస్తే …
దోపిడీలకు వ్యతిరేకమైన మీరు
రాణ్మహేంద్ర నగర సాంస్కృతిక వైభవాన్ని
అలా అంతగా దోచేసుకుంటారా!!
ఎస్.పి.బి గాయకుడు, కాబట్టి అటు పద్యమో, ఇటు గేయమో రాయకుండా, కూనలమ్మ పదాలు రాస్తూ ఇలా అంటున్నారు-
భావాలు పూయగా
పాడు ‘తా’ తీయగా
అందరకు హాయిగా
ఓ కూనలమ్మా!
పెమ్మరాజు గోపాలకృష్ణ పైన రాసిన పద్యానికి ‘కీర్తిభయస్థుడు’ అనే శీర్షిక పెట్టడం పెమ్మరాజుని దగ్గరగా చూసినవారికి మనసులో ఎటువంటి పులకింత కలిగిస్తుందో మాటల్లో చెప్పలేనిది.
ఇక తన శ్రీమతి పైన రాసిన కవితలో, ఆమె శతకీర్తి కాబట్టి, మధ్యలో ఒకచోట ఆమెని సంబోధిస్తూ
‘శ.కీ! సఖీ’
అని అంటారు.
నా వరకూ నాకు నేనూహించని సంతోషమేమిటంటే, ఇందులో నా గురించి కూడా రెండు పద్యాలకి చోటు దక్కడం. గోదావరి పట్లా, గౌతమీ గ్రంథాలయం పట్లా, మా మాష్టారు శరభయ్యగారి పట్లా, శర్మ గారికున్న పూజ్యభావం వంటిది నాక్కూడా ఉన్నందువల్లనే, శర్మగారు నాక్కూడా ఈ సంకలనంలో చోటిచ్చారని భావిస్తున్నాను.
ఈ పుస్తకాన్ని ఒమ్మి రమేష్ బాబు ఎంత అందంగ తీర్చి దిద్దాడో నేను పొడిపొడి మాటల్లో చెప్పలేను. పుస్తకం చూడగానే శర్మగారికి అభినందనలు చెప్పడం కన్నా కూడా ముందు రమేష్ కి ఫోన్ చేసి మరీ నా సంతోషాన్ని నోరారా పంచుకున్నాను.
నరసింహశర్మగారు ఎనభైకి పైగా పుస్తకాలు వెలువరించారు. వాటన్నింటిలోనూ ఇది ఆయన సాహిత్యకృషికి కలికితురాయిగా నిలబడిపోతుందనడంలో సందేహం లేదు.
(ఆయన గురించి మరోసారి రాస్తూ ‘సాహిత్య సంకీర్తకుడు‘ అని రాశాను. ఆ వ్యాసం కూడా ఇక్కడ చూడొచ్చు.)
‘వ్యక్తీ’కరణం: గుణగణగేయం, సన్నిధానం నరసింహ శర్మ, వెల రు.100/-, ప్రతులకు సన్నిధానం శాస్త్రి, మొబైలు 98491-68894
18-10-2026

