వైట్ నైట్స్

ప్రసిద్ధ రష్యన్ రచయిత డాస్టొవిస్కీ (1821-81) రాసిన మొదటి నవలల్లో ఒకటైన White Nights (1848) ని అనిల్ బత్తుల పబ్లికేషన్స్ వారు మళ్ళా కొత్తగా ప్రచురించారు. ప్రసిద్ధ కవి, యూట్యూబరు ప్రసాదమూర్తి అనువాదంలో మళ్ళా కొత్తగా వెలువడ్డ ఈ పుస్తకం ఆవిష్కరణ పదో తేదీ పొద్దున్న ‘తలపు బుక్ హౌస్’ లో జరిగింది. ఆ సందర్భంగా పుస్తకం పరిచయం చేస్తూ నేనో పెద్ద ప్రసంగం చేసాను.

ఇప్పుడు జెన్ జడ్ నుంచి ఊహించని ఆదరణకి నోచుకుంటున్న ఈ చిన్న నవల చదవడం- నేనిది రెండో సారి. మొదటిసారి నలభయ్యేళ్ళ కిందట, నేను రాజమండ్రిలో ఉద్యోగం చేసుకునే రోజుల్లో చదివాను. ప్రగతి ప్రచురణాలయం వారు వెలువరించిన రెండు నవలల సంపుటి ‘పేదజనం, శ్వేతరాత్రులు’ (1979) నిడమర్తి ఉమారాజేశ్వరరావుగారి అనువాదం చదివిన చాలా కాలందాకా అది నా కథ అన్నట్టుగానే ఉండేది. అప్పట్లో రాజమండ్రిలో నేనొక క్లర్కుగా పనిచేసేవాణ్ణి. చాలీచాలని జీతం. ఎదుగూబొదుగూ లేని జీవితం. ఒక్కణ్ణీ రూములో ఉండేవాణ్ణి. ఆ ఒంటరితనంలో ఒక పరాయీకరణ నన్ను పూర్తిగా ఆవహించి ఉండేది. అటువంటి రోజుల్లో నేను కూడా ఆ నవలల్లోని పాత్రలానే ఆ ఊరమ్మట తిరుగుతుండేవాణ్ణి. ఆ గోదావరి నెవా నదిలానూ, ఆ పురాతనపట్టణం సెంట్ పీటర్స్ బర్గులానూ తోచేవి. ఆ నవలలు నా మనసుమీద విడిచిన ముద్రలు అంతవరకే పరిమితం.

కానీ ఇప్పుడు ఈ నవల మళ్ళా చదివినప్పుడే నిజంగా కొత్తగా చదివినట్టుంది. ఇది డాస్టొవిస్కీ తొలిరోజుల్లో రాసిన ఒక చిన్నపాటి నవలికగా కాకుండా ఆయన తదనంతర జీవితాన్నీ, సాహిత్యాన్నీ తనలో ఇమిడ్చిపెట్టుకున్న ఎంతో భావగర్భితమైన రచనగా కనిపించింది. దాని గురించే ఆ ప్రసంగంలో వివరంగా చర్చించాను.

అయిదు రచనలు అయిదంకాల నాటకం

డాస్టొవిస్కీ రచనలన్నింటిలోనూ Crime and Punishment (1866), The Idiot (1869), Demons (1872), The Adolescent (1875), Brothers Karamazov (1880) అనే అయిదునవలల్ని అతడి జీవితనాటకానికి సంబంధించిన అయిదు అంకాలుగా భావించే ఒక విమర్శ సంప్రదాయముంది. ఆ నాటకం కేవలం అతని జీవితగాథ మాత్రమే కాదు, మొత్తం పందొమ్మిదో మహాశతాబ్ది అనే మహానాటకంగా భావించేవారూ ఉన్నారు. వాటిలో క్రైమ్ అండ్ పనిష్మెంట్ మొదటి అంకమైతే, కరమజోవ్ సోదరులు అయిదో అంకం. డాస్టొవిస్కీ జీవితకాల కృషికి పతాకగా ఆ నవలని మొత్తం ప్రపంచమంతా భావిస్తూ ఉంది. జోసెఫ్ ఫ్రాంక్ అనే ఒక విమర్శకుడు ఈ అయిదు నవలలూ అయిదు అంకాలైతే, డాస్టొవిస్కీ 1864 లో రాసిన Notes from the Underground ని దీనికి పీఠికగా భావించవచ్చని అన్నాడు. ‘I am a sick man.. I am a spiteful man. I am an unattractive man.. ’ అని మొదలయ్యే ఆ నవలిక మొత్తం ఆధునిక మానవుడి అస్వస్థతని గుర్తుపట్టిన రోగనిదానం. అసలు తానో మనిషిగా పుట్టడం కన్నా ఒక కీటకంగా ఎందుకు పుట్టలేకపోయానా అని అనుకుంటాడు అందులో కథానాయకుడు. ( ఆ మాట పట్టుకునే కాఫ్కా ‘మెటమార్ఫసిస్’ కథ రాసాడు). అసలు అతిగా ఆలోచించడం ఒక జబ్బని చెప్తూ పందొమ్మిదో శతాబ్ది మానవుణ్ణి ఈ జబ్బునుంచి బయటపడేసే మార్గం కనిపించట్లేదని చెప్తాడు.

వైట్ నైట్స్ ఒక నాందీ శ్లోకం

అలా చూసినప్పుడు ఈ అయిదంకాల నాటకానికీ, White Nights (1848)కి ఉన్న సంబంధం ఎటువంటిదై ఉండవచ్చు? డాస్టొవిస్కీ పండితులెవరూ ఇంతదాకా ఈ ప్రశ్న వేసుకున్నట్టు తోచదు. కానీ నా దృష్టిలో Notes from the Underground ఆ నాటకానికి ప్రస్తావన అనుకుంటే, వైట్ నైట్స్ నాందీ శ్లోకం వంటిది. నాందీ-ప్రస్తావనని మనం కలిపే వ్యవహరిస్తున్నప్పటికీ సంస్కృత నాటక సంప్రదాయంలో వాటిమధ్య సున్నితమైన భేదం ఉంది. నాంది ఒక ప్రార్థనాశ్లోకం. ఒక మంగళమయ శుభాచరణ. ఒక invocation, ఒక benediction. సామాజికులంతా నాటకం చూడ్డానికి వచ్చి కూచున్నప్పుడు, రంగస్థలమ్మీద యవనిక తొలగడానికి ముందు వారందరిలోనూ ఒక మంగళమయ భావనని మేల్కొల్పి వారిని నాటకప్రదర్శన చూడటానికి సంసిద్ధుల్ని చేసే ఒక భూమిక. ఆ తర్వాత వచ్చే ప్రస్తావనలో ఆ నాటకం గురించిన సూచన ఉండాలని చెప్తారు. అయితే నాందీశ్లోకం కూడా సూక్ష్మ స్థాయిలో నాటక సారాంశాన్ని ప్రేక్షకులకి ముందే పరిచయం చేస్తుంది. పరిచయం చేసి ఊరుకోకుండా వారి హృదయాల్లో ఒక సానుకూలతని కలిగిస్తుంది. ఈ లక్షణాల్ని బట్టి ఈ చిన్న నవలికని డాస్టొవిస్కీ తదనంతర మహాజీవితనాటకానికి ఒక ప్రారంభ మంగళాశాసనంగా భావించవచ్చు.

డాస్టొవిస్కీ సాహిత్యబీజరూపం

సాధారణంగా విమర్శకులు పేదజనం, శ్వేతరాత్రుల్ని డాస్టొవిస్కీ తొలిరోజుల్లో రాసిన పుస్తకాలుగానే చూస్తారు తప్ప, వాటికీ, ఆ తర్వాత రచనలకీ మధ్య ఉన్న అంగాంగీణ సంబంధం మీద దృష్టి పెట్టరు. కానీ లోతుగా చూసినప్పుడు, అతడి తదనంతర రచనల్లో కనిపించే విషాధమయ, అంధకారపూరిత, భావోద్విగ్నభరిత జీవితనాటకమంతా కూడా ఈ చిన్న నవలికలో బీజరూపంలో కనిపిస్తుంది. వాటికీ, ఈ నవలికకీ మధ్య కనీసం మూడు సరూపాంశాల్ని మనం గుర్తుపట్టవచ్చు. కథానాయకుడి ఒంటరితనం, అతడు అనుభవించే పరాయీకరణ, జీవితవ్యర్థత్వం, వీటన్నింటితోనూ అతడొక స్వాప్నికుడిగా జీవించడం__ ఇవన్నీ మొదటి లక్షణం. రెండోది, తన మొత్తం జీవితపరమార్థాన్ని తన జీవితాన్ని వెలిగించగల ఏకైక క్షణంలో దర్శించాలనుకోవడం, ఆ క్షణానికి అపారమైన పవిత్రతనూ, ఔజ్జ్వల్యాన్నీ ఆపాదించడం. మూడోది, ఆ ఒక్క క్షణం ముందు తన సమస్త జీవితానుభవాల్నీ రిక్తం చేసుకోవడానికి సిద్ధపడటం. దీన్ని kenosis అంటారు. ఇదొక ఆధ్యాత్మికానుభవం. జీవితాన్ని క్రీస్తులాగా సమీపించాలనుకోవడం. ఒక ఖండకావ్యసదృశంగా గోచరించే వైట్ నైట్స్ లో మనకి చాలా గాఢంగా కనిపించే ఈ మూడు లక్షణాలే మరింత గాటుగా, మరింత చీకటితో, మరింత భావోద్వేగప్రకంపితాలుగా తదనంతర సాహిత్యంలో కనిపిస్తాయి. చివరికి కరమజోవ్ సోదరులు నవలలో ఈ చిన్ని కథనే మరింత విస్తారంగా, మరింత లోతుగా, మొత్త రష్యను సమాజాన్నంతా తనలో ఇముడ్చుకుని మరీ వినిపిస్తుంది.

రచనాకాలం 1848 కావడం యాదృచ్ఛికం కాదు

డాస్టొవిస్కీ ఈ నవలికని 1848 లో తన ఇరవై ఏడేళ్ళ వయసులో రాసాడు. ఇప్పుడు దాదాపు రెండు శతాబ్దాల దూరం తర్వాత మనం వెనక్కి తిరిగిచూసినప్పుడు రచయిత ఈ నవలను 1848 లో రాయడం యాదృచ్ఛికం కాదనిపిస్తుంది.

1849 యూరప్ చరిత్రలో ఎన్నో చారిత్రిక సంఘటనలకు ఒక కొండగుర్తు. రొమాంటిక్ మహాయుగానికి దాన్ని చివరి సంవత్సరంగా విమర్శకులు గుర్తిస్తారు. మార్క్స్ ఎంగెల్స్ లు తమ కమ్యూనిస్టు మానిఫెస్టో వెలువరించింది ఆ ఏడే. మార్క్స్ ని చివరి రొమాంటిక్ గా కూడా భావించే ఒక సంప్రదాయం ఉంది. (మార్క్స్ కవి కూడా. ఆయన కవిత్వం మీద ‘చివరి రొమాంటిక్’ అని రాసిన వ్యాసం ఇక్కడ చూడవచ్చు.)1848-49 మధ్యకాలంలో చిన్నవీ పెద్దవీ కలిపి దాదాపు యాభై ఉద్యమాల దాకా, విప్లవాల దాకా యూరోపులో సంభవించాయి. 1789 లో ఫ్రెంచి విప్లవానికీ, 1914 లో మొదటి ప్రపంచయుద్ధానికీ మధ్యకాలంలో యూరప్ రాజకీయ నిర్మణాల్నీ, దేశపటాల సరిహద్దుల్నీ మార్చిన సంఘటనలు అవి. భూగర్భఫలకాలు భూమిలోపల సంచలిస్తున్నప్పుడు పైన ఉపరితలం మీద భూకంపాలు ఏర్పడతాయని మనకి తెలుసు. అటువంటి ఒక tectonic shift ఆ ఏడాది యూరప్ అంతా సంభవిస్తూ ఉండింది. ఆ భూగర్భ సంచలనమే ఐరోపా మానవుడి మనోసంచలనంగా ఈ చిన్న నవలికలో మనకు మొదటిసారిగా ప్రత్యక్షమవుతుంది.

రొమాంటిసిజానికీ మాడర్నిజానికీ ఖండిత బిందువు

1848 ని మనం యూరపులో రొమాంటిసిజానికీ, మాడర్నిజానికీ మధ్య ఒక విస్పష్టమైన ఖండితబిందువుగా గుర్తుపట్టవచ్చు. రొమాంటిసిజం అంటే ఒక స్వాప్నిక భావోద్వేగం. తన ఎదట ఉన్నదే వాస్తవం కాదనీ, దాన్ని మించిన ఒక మహోన్నత ఆదర్శాన్ని మనిషి కలగని దాన్ని నిజం చేసుకోవచ్చుననీ భావించే ఒక కాల్పనిక భావావేశం. ఆ ధోరణికి జర్మన్ సాహిత్యంలో గొథే, షిల్లర్ లు ప్రవక్తలు. వారినుంచి ఇంగ్లిషు కవులు వర్డ్స్ వర్త్, కాలరిడ్జి, బైరన్ లు మొదటి తరంలోనూ, షెల్లీ, కీట్సులు రెండో తరంలోనూ ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకుని రొమాంటిసిజాన్ని ఒక ప్రపంచ భావవిప్లవంగా మార్చేసారు. డాస్టవిస్కీ నేరుగా షిల్లర్ నుంచే తన స్వాప్నికతను అందిపుచ్చుకున్నాడు. షిల్లర్ రాసిన On Naïve and Sentimental Poetry(1785-96) డాస్టొవిస్కీకి ఒక మానిఫెస్టో లాంటిది.

దానిలో షిల్లర్ ఆలోచనాపరుడైన మానవుడి ఆవశ్యకత గురించి మాట్లాడేడు. అటువంటి ఆలోచనాపరత్వాన్ని ఆయన sentimental అని అన్నాడు. షిల్లర్ తాత్త్వికతలో మూడు అంశాలున్నాయి. మొదటిది, వాస్తవానికీ, ఆదర్శానికీ మధ్యనుండే వైరుధ్యం, రెండోది, వాస్తవ ప్రపంచాన్ని దాటి ఒక అత్యున్నత సౌందర్యాన్ని సాక్షాత్కరించుకునే తపస్సు. మూడవది, అటువంటి తపోశీలి ప్రధానంగా స్వాప్నికుడిగా ఉంటాడనేది. డాస్టవిస్కీ తన తొలిరోజుల్లో ఈ మూడింటినీ ఎంత హృదయస్థం చేసుకున్నాడంటే, వాటిని ఒక్కచోట కుక్కిపెడితే, ఈ శ్వేతరాత్రులు నవలగా రూపొందిందా అనిపిస్తుంది.

ఇక మాడర్నిజం అంటే, ఈ మూడూ కూడా వాటి పరిమితుల్ని దాటిపోవడం. మనిషిని భావావేశపరవశుణ్ణి చేసే స్వాప్నికత ఒక sickness గా మారడం. మనిషి తనకీ, తన చుట్టూ ఉన్న ప్రపంచానికీ కూడా పరాయిగా మారడం. 1864 తర్వాత డాస్టొవిస్కీ రచనల్లో కనిపించేది అదే.

ఈ అస్వస్థత ఒక వ్యక్తికి పరిమితం కాదు

అయితే ఈ అస్వస్థత ఒక వ్యక్తికి పరిమితం కాదు. తర్వాత రోజుల్లో విమర్శకులు, (ఇప్పటికీ తెలుగు విమర్శకులూ) ఈ లక్షణాల్ని వ్యక్తికి సంబంధించిన మానసిక వక్రతగా, అస్వస్థతగా పరిగణిస్తూ వచ్చారు. కాని నిజానికి ఈ అనారోగ్యం మొత్తం వ్యవస్థకి సంబంధించింది. మొత్తం ప్రపంచ గమనానికి సంబంధించింది. హద్దుల్లేని పారిశ్రామికీకరణ, అవధిలేని నగరీకరణ, కొత్తగా విస్తరిస్తున్న కార్మిక వర్గం, వారి జీవితాల్లో సంభవిస్తున్న పరాయీకరణ, మొత్తం మానవజీవితాన్ని చుట్టుముడుతున్న యాంత్రికీకరణలవల్ల 1750-1850 మధ్యకాలంలో Enlightenment తాత్త్వికులూ, రొమాంటిక్ కళాకారులూ కలగన్న ఆదర్శాలన్నీ వీగిపోయే ఒక మహావిపత్తు కళ్ళముందు ప్రత్యక్షం కావడం మొదలుపెట్టింది.

1850- 1917 మధ్యకాలంలో ఈ ఉపద్రవాన్ని తమ రచనల్లో పరీక్షకు పెట్టిన రష్యన్ రచయితలు ఒక్కొక్కరూ ఒక్కొక్క పరిష్కారాన్ని వెతుక్కున్నారు. దీనికి విప్లవమొక్కటే పరిష్కారమని మాక్సిం గోర్కీ భావిస్తే, మనుషులు స్వంత ఆస్తినీ, విలాసాల్నీ పరిత్యజించడం, రాజ్యానికీ, రాజ్యశాసనానికీ సహకరించకపోవడం, కాయకష్టం మీద ఆధారపడటం పరిష్కారమని టాల్ స్టాయి భావించాడు. దానికి ఆయన క్రీస్తును ఆదర్శంగా తీసుకున్నాడు, కాని చర్చినీ, చర్చి బోధించే నీతిసూత్రాల్నీ నిరాకరించాడు. డాస్టవిస్కీ కూడా క్రీస్తునే ఆదర్శంగా తీసుకున్నాడుగానీ, ఆయన దృష్టిలో అది ప్రేమ వల్ల సాధ్యమవుతుంది. క్రీస్తులాగా క్రియాశీలక ప్రేమ, తోటిమనిషిని ఆర్థిక దారిద్ర్యం నుంచి మాత్రమే కాదు, ఆధ్యాత్మిక దారిద్ర్యం నుంచి కూడా విడుదలచెయ్యడానికి తనే ఆ వేదన మొత్తం తలదాల్చాలని భావించాడు. ఆధ్యాత్మికంగా బోలుగా ఉన్నంతకాలం ఎటువంటి రాజకీయ, లౌకిక, ఆర్థిక, సామ్యవాద సంస్కరణలూ మానవుణ్ణి విడుదల చేయలేవని భావించాడు. ఆయన అటువంటి నమ్మకానికి ఒక్కరోజులో రాలేదు. ఒక జీవితకాలపు వేదనలో, ఒక జీవితకాలపు అన్వేషణ ద్వారా అక్కడికి చేరుకున్నాడు.

సూత్రప్రాయంగా ఇదంతా శ్వేతరాత్రుల్లో కనిపిస్తుంది

అయితే ఈ నలుగులాట, చివరికి సంప్రాప్తించిన జ్యోతిర్దర్శనమంతా సూత్రప్రాయంగా ఈ శ్వేతరాత్రులు నవలలో కనిపిస్తుంది. ఇది నాలుగున్నర రాత్రుల కథ. నాలుగున్నర కూడా కాదు. నాలుగు రాత్రులూ, ఒక ప్రభాతమూను. సెంట్ పీటర్స్ బర్గ్ లో ఒక అనామక రష్యన్ యువకుడికి, జీవితానికొక గమ్యమూ, సాధించుకోవడానికి స్వప్నమూ లేని ఒక నిరర్ధక జీవికి ఒక సాయంకాలం ఒక యువతి కనిపిస్తుంది. ఆమె జీవితంలోకి ఒక ఏడాది కిందట ఒక స్నేహితుడి రూపంలో ప్రేమ ప్రవేశించింది. ఆమె ప్రేమించిన ఆ యువకుడు తిరిగి ఏడాది తర్వాత రావలసి ఉంది. వాళ్ళు ముందే నిర్ణయించుకున్న సంకేత స్థలం దగ్గర ఆమె అతనికోసం ఎదురు చూస్తూ ఉంది. కాని ఆ యువకుడికి బదులు ఆమెకి అక్కడ ఆ సమయానికి ఈ ప్రాణి కనిపించాడు. అలా వాళ్ళిద్దరూ మూడు సాయంకాలాలు అక్కడ కలుసుకున్నారు. నెమ్మదిగా ఒకరి వేదన మరొకరు పంచుకున్నారు. చివరికి నాలుగో రోజు సాయంకాలం, వారిద్దరూ, తమ ప్రేమని పెళ్ళిగా మార్చుకునే నిర్ణయం తీసుకోబోతున్న క్షణాల్లో, ఆమె అంతదాకా ఎదురుచూస్తూ, ఇక రాడేమో అనుకున్న ఆ ప్రేమికుడు హటాత్తుగా ఊడిపడ్డాడు. ఆమె ఒక క్షణం పాటు ఎటూ తేల్చుకోలేకపోయింది. కాని చివరికి తాను ఏడాదిగా ఎదురుచూస్తున్న ప్రేమికుడితో కలిసి వెళ్ళిపోడానికే సిద్ధపడుతుంది. కాని మనవాణ్ణి ఒక్కసారి ప్రేమగా పలకరించి వీడ్కోలు తీసుకుంటుంది.

ఇదీ కథ. కానీ, ఇప్పటి సమాజంలో మరే యువకుదైనా  ఆ స్థానంలో ఉండి ఉంటే ఆమె తన ప్రేమకి ద్రోహం చేసిందంటూ ఆమెని వేధించి ఉండేవాడు. కాని డాస్టొవిస్కీ మనకి చూపిస్తున్న ఆ కథానాయకుడు ఇలా అంటున్నాడు:

Christ-like kenosis అంటే ఇది. తనని తాను రిక్తం చేసుకునే ప్రేమ. ‘తేన త్యక్తేన భుంజీథాః’ అని ఉపనిషత్తులు ప్రవచించిన జీవితాదర్శం. ఎన్నెన్నో చీకటివలయాల చుట్టుదారుల్లో పరిపరిపరిభ్రమణాల తర్వాత, కరమజోవ్ సోదరులు నవల చివరి పుటల్లో ఇల్యూష లో డాస్టొవిస్కీ మనకి చూపించేది తిరిగి ఈ ప్రేమనే. ఈ నిర్మల, నిర్లేప క్షణం కోసమే అతడు జీవితమంతా పదే పదే వెతుక్కుంటూ వచ్చాడు. తాను నేలకొరిగినప్పుడు తిరిగి మళ్ళా అపారమైన పంటగా పునర్జన్మించే ఏ గోధుమగింజ గురించి క్రీస్తు మాట్లాడేడో ఆ గోధుమ గింజ, ఇల్యూషలో మనకి ఒక పంటగా కనిపించిందంతా, ఒక గింజగా, ఒక బీజరూపంలో, ఇదుగో, ఈ క్షణంలో ఈ నవలికలో కనిపిస్తున్నది.

‘వలసిన కాలం క్షణమాత్ర సంజవేళ’

అందుకనే బైరాగి ఆగమగీతిలో ఒక మాటంటాడు: ‘వలసిన కాలం క్షణమాత్ర సంజవేళ ‘అని. ఆ ముందు జీవితం, ఆ తర్వాతి జీవితం ఎలాగేనా నడవనీ, ఎలాగేనా గడవనీ, కానీ నువ్వు నువ్వుగా జీవించగలిగే ఆ ఏకైక క్షణం, ఆ most authentic moment అదే మన జీవితాన్ని సార్థకం చేసేది. అందుకని ఈ నవల్లో డాస్టవిస్కీ రాసిన చివరి వాక్యాలిలా ఉన్నాయి:

పెళ్ళికానుకగా పంచదగ్గ రచన

ఇదే ఈ నవలికలోని మంగళమయ సారాంశం. ఎదటిమనిషి సంతోషంలోనే తన సంతోషాన్ని వెతుక్కోవడం. తాము కలిసి జీవించిందీ, హృదయాలు పంచుకున్నదీ ఒక్క క్షణమే కావొచ్చు, కానీ సత్యత్వం ఒక్కటిచాలు, అది నిత్యత్వంగా మారి తక్కిన జీవితమంతా వెలిగించడానికి. డాస్టోవిస్కీ రాసిన తదనంతర సాహిత్యంలో ఈ grace కనిపిస్తుంది గాని అది dark grace. ఈ నవల్లో మాత్రమే అది చాలా pure grace గా కనిపిస్తుంది. అందుకనే ఈ పుస్తకాన్ని మీ పిల్లల్తో చదివించండి, మీ మిత్రుల గృహాల్లో పెళ్ళి కానుకగా అందించండి అని చెప్పాను మొన్న నా ప్రసంగం ముగిస్తూ. ప్రసాదమూర్తి స్వయంగా కవి కాబట్టి ఈ పుస్తకమంతా కూడా ఒక కావ్యసమానంగా తెలుగు చేసాడనీ, అనిల్ బత్తుల తన హృదయాన్ని ప్రతి ఒక్కరికీ పంచలేడు కాబట్టి ఈ పుస్తక రూపంలో మనతో పంచుకున్నాడని కూడా చెప్పాను.


వైట్ నైట్స్, దోస్తోయేవ్ స్కీ, అనువాదం, ప్రసాద మూర్తి, అనిల్ బత్తుల పబ్లికేషన్స్, వెల రు.150/- నవోదయ, విశాలాంధ్ర, లోగిలి, అటక షాపుల్లో లభిస్తుంది.

13-10-2026

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading