ఫణిగిరి:బౌద్ధ శిల్పకళాపతాక-2

మేము మ్యూజియం నుండి బయటకు వచ్చాక ఆ గుట్ట ఎక్కుదామా అని ఒక క్షణం ఆలోచించాం. కానీ మాకు సమయం సరిపోదని అర్థమయింది. ఆ పక్కనే అందమైన తామరపూల కొలను ఒకటి కనిపించింది. ఆ మధ్యాహ్నం వేళకి తామరపూలు ఒకటీ ఒకటీ విచ్చుకుంటున్నాయి. దానికి కొద్ది దూరంలో రెండు కొండలు కలుస్తున్న  లోయలో కాకతీయుల కాలం నాటి ఒక రామాలయం  ఉంది. దానిపక్కనే ఒక గుండం లాంటి కొలనూ, ఒక బావీ కూడా ఉన్నాయి. అంత మిట్టమధ్యాహ్న వేళప్పుడు కూడా అక్కడ చల్లగా, యాత్రీకుల్ని ఒట్టి గాలుల్తోటే సేదతీర్చేట్టుగా ఉంది.

ఆ మ్యూజియం  ని  ఇప్పుడు కట్టినట్టుగా ఒక షెడ్డులాగా కాకుండా, బౌద్ధవిహారాల పద్ధతిలో కట్టి, ఆ తోరణ ఫలకాల్ని ఒక్కొక్కటీ ఒక్కొక్క పెద్ద హాల్లో ప్రదర్శిస్తే బావుంటుంది అనిపించింది. కానీ తెలంగాణా ప్రభుత్వం కాబట్టి ఈ మాత్రమేనా ఆ శిల్పాలకి ఆ నీడ దక్కింది. అదే ఆంధ్రప్రదేశ్ సంగతి చూస్తే— ఒకప్పుడు దక్షిణాపథాన్నంతా పరిపాలించిన వేంగీ చాళుక్యుల కాలం నాటి శిల్పాలకి ఆ దిక్కు కూడా లేదు. వాటిల్లో కొన్ని ఇప్పటికీ అక్కడి శివాలయంలో ఆరుబయట ఎండకి ఎండి వానకి తడుస్తూ ఉన్నాయి.

ఆ మ్యూజియం, ఆ కొలను, ఆ రామాలయం— మూడింటినీ కలిపి ఒక విహారస్థలంగా మార్చవచ్చు. అలాగే ఎవరేనా అక్కడ ఉండి ఆ శిల్పాల్ని అధ్యయనం చెయ్యాలనుకుంటే, లేదా బొమ్మలు గీసుకోవాలనుకుంటే వారికి ఉండటానికి చిన్న వసతిగృహం కూడా ఏర్పాటు చెయ్యవచ్చు. ఇటువంటి ఆలోచనలే మాకు  మేం పరస్పరం చెప్పుకుంటూ కోదాడ బాట పట్టాం.

3

ఆ రాత్రి  ఇంటికి తిరిగి వచ్చాక కూడా ఆ చలనశీల శిల్పతోరణమే నా కళ్ళముందు కనిపిస్తూ ఉంది. ఆంధ్ర శిల్పకళ గురించి ఎప్పుడో ఏదో స్థూలంగా చదివింది నా దాహాన్ని తీర్చలేదనిపించింది. అందుకని వచ్చిన రెండు మూడు రోజులుగా ఆనంద కుమారస్వామి రాసిన The Origin of the Buddha Image (1927) నీ, స్టెల్లా క్రామ్ రిష్ రాసిన Indian Sculpture, 1933, The Art of India: Traditions of Indian Sculpture, Painting and Architecture, 1954 పుస్తకాలు తెరిచి ఆంధ్ర బౌద్ధ శిల్పకళ గురించి వారు రాసింది చదివాను. కాని ఆర్.సి. ముజుందార్ సంకలనం చేసిన The History and Culture of the Indian People 1951 రెండవ సంపుటంలో ‘శిల్పం’ అనే అంశం పైన నిహార్ రంజన్ రే రాసిన వ్యాసం చదివాక నాకు పూర్తిగా కళ్ళు తెరుచుకున్నాయి. భారతీయ శిల్పకళ గురించి, ఆంధ్ర శిల్పకళ గురించి తెలుసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరూ చదివి తీరవలసిన వ్యాసం అది. (ఆ పుస్తకం ఇక్కడ నుంచి డౌన్ లోడు చేసుకోవచ్చు.)

దాదాపు ఇరవై పేజీల ఆ వ్యాసంలో మౌర్యుల కాలం తరువాత చిత్రకళ ఏ విధంగా నూతన జవసత్త్వాల్ని సముపార్జించుకుందో నిహార్ రంజన్ రే చాలా వివరంగా రాసాడు. ఆయన చెప్పిన దాన్ని ప్రకారం తొలి బౌద్ధ శిల్పులు రెండు కొలతలుండే చరణచిత్రాలు, పటచిత్రాల మీది బౌద్ధ గాథల్ని శిల్పాలుగా మలిచేటప్పుడు, వాటికి మూడవ కొలతని తీసుకు రావడం ఎలా అన్నదానిమీద తీవ్రంగా సాధన చేసారు. బర్హౌత్, సాంచి శిల్పులు తమ శిల్పాల్లో మూడవ కొలతని, అంటే పొడవు, వెడల్పులతో పాటు లోతుని కూడా తీసుకురాగలిగినప్పటికీ, ఆ శిల్పాలలో ఆకృతులు ఇంకా ఒకదానికొకటి ఆనుకునే  ఉన్నాయి.

మనం మామూలుగా జనసమ్మర్దంగా ఉండే ఒక దృశ్యాన్ని చూసినప్పుడు, మనుషుల ఆకృతుల్లో ముందు ఉండేవాళ్ళు వెనక ఉన్నవాళ్ళని ఎంతో కొంత కప్పేస్తారు. దాన్ని డా.రే oversecting అన్నాడు. అలానే ఆ దృశ్యంలో మనకి మరీ దగ్గరగా ఉన్న మనుషుల దేహాంగాలు, మనకి మరీ దగ్గరగా కనిపిస్తున్నప్పుడు, అవి సాధారణమైన పరిమాణం కన్నా మరింత పొడుగ్గా కనిపించడం సహజం. బొమ్మలు వేసేవాళ్ళకి ఇది తెలిసిన అంశమే. దాన్ని foreshortening అని అంటారు. అంటే మనకు దగ్గరగా ఉన్నవాళ్ళు మనకి కుడిచేయి చూపిస్తున్నప్పుడు ఆ కుడి చేయి వాళ్ళకి వెనగ్గానో, పక్కగానో ఉన్న ఎడమచేయికన్నా పెద్దదిగా, పొడుగ్గా కనిపిస్తుంది. ఇది ఒక దృగ్భ్రమ. కానీ మనం ఈ భ్రమకి లోనుకాకపోతే, మనం చూస్తున్నదాన్ని నిజమని నమ్మలేం. భారతీయ శిల్పులు బర్హౌత్, సాంచిల కాలం నుండి వేంగీ శిల్పకళకు వచ్చేటప్పటికి ఈ రెండు నైపుణ్యాల్నీ పూర్తిగా సాధించారని రే చెప్తున్నాడు. ఇక అమరావతికి వచ్చేటప్పటికి, ఆ ఆకృతులు ఒక విలాసాన్నీ, లాలిత్యాన్నీ కూడా సాధించాయి. ఈ మూడు లక్షణాలూ కూడా ఫణిగిరి శిల్పాలలో చూడవచ్చు.

ఉదాహరణకి ఫణిగిరిలోని ఈ శిల్పం చూడండి. ఇందులో ఏనుగు పైన గుర్రం పైన ప్రయాణిస్తున్న ఇద్దరి ఆకృతులూ చూడండి. ఇందులో ఆశ్వికుడు ఏనుగుపైనున్నవాడిపక్కన కాక వెనక కనిపిస్తున్నాడు. అంటే ముందు తలంలో కాక, చిత్రంలో వెనకతలంలో ఉన్నాడు. అలానే గుర్రానికీ, ఏనుగుకీ పక్కన నడుస్తున్నవాళ్ళు కూడా అందరూ ఒకే సమతలంలో కాక పై తలంలోనూ, దానికి వెనగ్గానూ కూడా కనిపిస్తున్నారు. దీన్ని మనం oversecting అనవచ్చు.

అలానే ఈ రెండో శిల్పంలో రథ చక్రాన్ని చూడండి. అది మనవైపు వంగి ఉన్నట్టుగా కనిపిస్తున్నది కదా. దాన్నే foreshortening అంటారు. అలానే ఆ రథమూ, దానికి పూన్చిన రెండు గుర్రాలూ, ఏనుగూ, ఏ ఏనుగుకి అటూ ఇటూ మరో రెండు గుర్రాలూ వాటి పగ్గాలూ, రథారూఢుడైన సిద్ధార్థుడికి పడుతున్న ఛత్రం, వాలుగా వంగిన  ఆ గొడుగూ, దాన్ని పట్టుకున్న పరిచారకుడి ఒకింత వెనక్కి వంచిన ముఖం— ఇవన్నీ, ఒక దృశ్యం మన కళ్ళముందు ఎలా రెండుమూడు తలాల్లో కిక్కిరిసి కనిపిస్తుందో, అలానే కనిపిస్తోంది కదా.

ఇక ఈ మూడో శిల్పం చూడండి. ఇందులో కనిపిస్తున్న స్త్రీ ఒక యక్షి కావచ్చు. ఆమె నృత్త భంగిమలో ఒకచేత కట్యావలంబితంగా, మరొక చేత పైన ఒక పూలకొమ్మను పట్టుకున్నట్టుగా కనిపిస్తున్నది. ఆమె కేశాభరణాలూ, కంఠాభరణాలూ, కట్యాభరణాలూ, ఆమె నడుముకి చుట్టుకున్న వస్త్రం మొత్తమన్నీ ఆ త్రిభంగి దేహాకృతికి వన్నెతెచ్చేవిగానే ఉన్నాయి. ఆమె వెనక ఉన్న ఇద్దరు ఒక వస్త్రాన్ని పట్టుకుని ఉన్నట్టుగా ఉంది. వాళ్ళ చేతివేళ్ళు చూడండి. ఆ వేళ్ళ అమరికలోని సూక్ష్మవివరాలతో పాటు ఆ లాలిత్యం కూడా మనం గమనించదగ్గది. వారికి వెనగ్గా అంటే మూడవతలంలో మృదంగవాద్యకారుడు కనిపిస్తున్నాడు. మొత్తం దృశ్యమంతా కూడా ఒక అతిలోక పారవశ్యంలో తేలియాడుతున్నట్టుగా కనిపిస్తోంది కదా.

శాతవాహన శిల్పకళలోని ఈ లక్షణాల్ని గుర్తించే నిహార్ రంజన్ రే ఇలా రాస్తున్నాడు:

కాబట్టి గంగామైదానానికి పరిమితమైన, రాజస్థాన గాంభీర్యానికీ, ఆధికారిక దర్పానికీ ప్రతినిధిగా, సామాన్య జనానికి దూరంగా వికసించిన మౌర్యకాలపు శిల్పం శుంగ-కణ్వయుగాల్లో ప్రజలకు సమీపంగా వచ్చిందనీ, ప్రధానంగా మధ్యభారతదేశపు శిల్పంగా సాంచిలో వికసించి, ఒకవైపు కళింగనీ, మరొకవైపు పశ్చిమ భారతదేశపు లక్షణాల్నీ  కూడా తనలో కలుపుకుని గోదావరీ-కృష్ణా పరీవాహక ప్రాంతానికి చేరుకునేటప్పటికి, భారతీయ శిల్పానికి ప్రగాఢమైన మానవీయతనీ, జీవనోల్లాసాన్నీ, భంగిమా లాలిత్యాన్నీ సంతరించుకున్నాదని  నిహార్ రంజన్ రే ని చదివాక నాకు అర్థమయింది. ఈ మొత్తం పరిణామాన్నంతటినీ, ఆయన తన వ్యాసం చివరలో, మరొకసారి సంగ్రహంగా పేర్కొన్నాడు. ఆ మొత్తం భాగాన్ని మీతో పంచుకోవాలని ఉంది. చూడండి, ఆయనిలా అంటున్నాడు:

ఈ వివరణని మనం లోతుగా పరిశీలించినప్పుడు అమరావతి శిల్పకళలో మనకొక విరోధాభాస ఉన్నదా అని అనుమానం కలుగుతుంది. ఒకవైపు అది సంసారం పట్లా, తృష్ణమీద ఆధారపడ్డ జన్మవలయం పట్లా విరక్తిని పెంపొందించి, మనిషి తన మనస్సునీ, ఇంద్రియాల్నీ కూడా స్వాధీన పరుచుకోవలసిన ధర్మోపదేశాన్ని ఇతివృత్తంగా తీసుకుంది. కానీ, ఆ ధర్మాన్ని అనుసరిస్తున్న రాజులూ, రాజపరివారమూ, సంపన్నులూ, వర్తకులూ, నాగరికులూ, సామాన్యప్రజలూ మొత్తమంతా కూడా ఒక విలాసమయ జీవితాన్ని జీవిస్తున్న వాస్తవికతను శిల్పపరంగా ప్రతిబింబిస్తున్నది. నగలు, అలంకరణలు, భవనాలు, వాస్తు, వస్తుసామగ్రి మొదలైనవన్నీ అమరావతి కళలోఅంతవరకూ భారతీయ చిత్రకళలో కనిపించనంత విస్తారంగా, పుష్కళంగా కనిపించడం చూస్తాం. ఆ శిల్ప ఫలకాల్లో మనకి కనిపించే భంగిమా వక్రతా, తనూలావణ్యం, రేఖావిలాసం— ఆ మొత్తం  levitation అంతా కూడా  ఒక విధంగా సముద్ర వర్తకం వల్ల సమకూరుతున్న సంపదలు తీసుకువస్తున్న నవీన జీవనశైలికి చిహ్నాలా అని మనం అనుమానించవలసి వస్తున్నది.

కాని సి. శివరామ్మూర్తి రాసిన Amaravati Sculptures in the Madras Government Museum (1956) చదివినప్పుడు ఆయన నిహార్ రంజన్ రే కి భిన్నమైన వాదన వినిపిస్తున్నట్టుగా అనిపించింది. (ఈ పుస్తకం కూడా ఇంటర్నెట్ లో లభ్యంగా ఉంది. ఆసక్తి ఉన్నవారు పే.44-54 దాకా చూడవచ్చు.) శివరామ్మూర్తిని చదవగానే నాకు కలిగిన మొదటి భావన ఇంత మహోన్నతుడైన పండితుడు అమరావతి శిల్పకళ పైన మరొకరు ఇప్పటిదాకా రాలేదన్నదే. ఏమి పాండిత్యం! ఏమి సమ్యగ్దర్శనం! ఆయన దృష్టిలో అమరవాతి చిత్రకళ provincial కాదు, అది national, అంటే ఆ శిల్పాలు మాట్లాడుతున్నది కూడా యావద్భారతదేశం మాట్లాడుతున్న భాషనే. ఆ మాటకొస్తే వివిధ ప్రాంతాల్లో వివిధ కాలాల్లో విలసిల్లిన అనేక భారతీయ శిల్పకళారీతుల్లో ఆయన ఏకత్వాన్నే కనుగొన్నాడు.

ఇప్పుడు మనం చెయ్యవలసింది, శివరామ్మూర్తి ప్రతిపాదిస్తున్న ఏకత్వ ప్రాతిపదిక మీద నిహార్ రంజన్ రే వివరిస్తున్న అమరావతి ప్రత్యేకతల్ని పోల్చుకోవడం. అప్పుడు మనం ఫణిగిరి వైపు చూపు సారించవలసి ఉంటుంది.

ఎందుకంటే, అమరావతి శిల్ప వికాసం ఎక్కడ ఆగిపోయిందో ఫణిగిరి వికాసం అక్కడ మొదలవుతున్నది. అంతేకాదు, అమరావతి కృష్ణాపరీవాహక ప్రాంతంలో దిగువభాగానికి చెందిన కేంద్రం కాగా, ఫణిగిరి మధ్య పరీవాహాక ప్రాంతానికి చెందింది. తెలంగాణాలోని ఇతర బౌద్ధ కేంద్రాలు కొండాపురం, ధూళికట్ట, పెద్ద బంకూరు మొదలైన స్థలాలతో పాటు ఫణిగిరి కూడా ఏకకాలంలో తూర్పు పశ్చిమ భారతదేశాలు రెండింటితోనూ అనుసంధానమై ఉంది. శాతవాహన-ఇక్ష్వాకు రాజవంశాలు రోముతో జరిపిన వాణిజ్యంలో తూర్పు రేవుపట్టణాలు ఎంత ప్రాధాన్యత వహించాయో, పడమటి రేవు పట్టణాలు కూడా అంతే ప్రాధాన్యత వహించాయి. అంతేకాదు, ఇక్ష్వాకుల కాలం నాటికి, శకులతో సంబంధబాంధవ్యాలు కూడా బలపడ్డాయి. ఫణిగిరిలో ప్రదర్శిస్తున్న శిల్పాల్లో కనీసం రెండు శిల్పాలు శిథియన్లని  చిత్రించినవి కనబడ్డాయి. ఈ కారణాల వల్ల, అమరావతిలో ఏ విలాసజీవితాన్ని నిహార్ రంజన్ రే ఊహించాడో , అది ఫణిగిరి నాటికి మరింత బలపడిందని అనుకోవచ్చు.

అయితే, ఫణిగిరిలో కనిపిస్తున్న ఆ దేహాకృతుల లాలిత్యం విలాసమయ జీవితపు అలసతలోంచి పుట్టుకొచ్చిందా లేక బౌద్ధ ధర్మాన్ని మరింత జాగరూకతతో సమీపిస్తూ ఇహలోక ఆశాశ్వతత్త్వం  నుంచి విడుదల కావాలనే తీవ్ర ముముక్షత్వం వల్ల సంభవించిందా?

(ఇంకా ఉంది)

11-11-2026

One Reply to “”

  1. జీవితాన్ని నిశ్చింతగా ఆస్వాదించే తత్వమే అక్కడి మానవాకృతులకు ప్రాణం పోసింది.

    ఎంత మాట! చక్కని బాటను చూపిస్తూ….

Leave a Reply