ఫణిగిరి: బౌద్ధ శిల్పకళాపతాక-3

4

నేను పేర్కొన్న పుస్తకాలన్నీ అమరావతి చిత్రకళ దాకా వచ్చి ఆగిపోయినవే. కాని ఫణిగిరి శిల్పకళ శాతవాహన అనంతర కాలానికీ, ఇక్ష్వాకు వంశంలో కూడా చివరి రాజు కాలానికీ చెందిన కళ. ఇంతకుముందే చెప్పినట్టుగా అమరావతి శిల్పకళ క్షీణదశకు చేరుకున్న తరువాత ఫణిగిరి ఉచ్చ దశ మొదలయ్యింది. చరిత్రకారుల దృష్టిలో అమరావతి శిల్పానికి అత్యుచ్చదశ రెండవశతాబ్దంతోనే పూర్తయిపోయింది. ఆ తర్వాత కొనసాగిందంతా శిల్ప అభివ్యక్తి పరంగా రెండో స్థాయి కళ మాత్రమే.

ఫణిగిరిలో బౌద్ధ భిక్షువుల విహారాన్ని ఆలంబనం చేసుకుని వర్ధిల్లిన శిల్పానికి ప్రధానమైన దాతలు విజయపురి రాజవంశీకులు కారు. వారు ఫణిగిరి ప్రాంతంలో ఇక్ష్వాకుల ఏలుబడికి చెందిన స్థానిక పరిపాలకులు. వారిని మహాతలవరులు అని పిలిచేవారు. అటువంటి ద్వితీయ శ్రేణి రాచరిక వర్గం నుంచి, రాజవంశాలు నేరుగా ఆదరించిన కళతో, సమానమైన కళని మనం ఊహించలేం. కానీ ఫణిగిరిలో లభ్యమైన శిల్పాల్నీ, శిల్పశకలాల్నీ అధ్యయనం చేస్తున్న కొద్దీ, ఆ శిల్పకళ అమరావతిలోని అత్యున్నత శిల్పకళ వారసత్వాన్ని గ్రహించడమే కాక, ఒక అడుగు ముందుకు వేసిందని కూడా తెలుస్తున్నది.

నాకు బంగారు రామాచారిగారు పంపించిన పుస్తకాల్లో ఫణిగిరి మీద అత్యంత అపురూపమైన పుస్తకం కూడా ఒకటి ఉంది. Phanigiri: Interpreting an Ancient Buddhist Site in Telangana (2021) అనే ఆ పుస్తకం నాకు పంపించినందుకు రామాచారిగారికి నేను ఎంత ఋణపడిపోయానో చెప్పలేను. జె.ఎన్.యు లో భారతీయ చిత్రకళ బోధిస్తున్న నమన్ పి అహుజా అనే పండితుడు సంకలనం చేసిన ఆరు వ్యాసాల సంకలనం అది. మార్గ్ పబ్లికేషన్స్ వారూ, తెలంగాణా హెరిటేజి డిపార్ట్ మెంటూ వారూ కలిసి ప్రచురించిన ఆ పుస్తకం ఫణిగిరి గురించి తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఒక కరదీపికగా ఉపకరిస్తుంది. ఒక్క ఫణిగిరి గురించి మాత్రమే కాదు, అసలు దక్కన్ ప్రాంతపు చరిత్ర గురించి, ప్రాచీన యుగాల జనజీవితాన్ని శిల్పకళ ఎలా ప్రతిబింబిస్తూ వచ్చింది అన్నదాని గురించీ తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ ఆ పుస్తకం చదవక తప్పదు.

230 పేజీల ఆ పుస్తకాన్ని నేను ఆవురావురుమంటూ చదివేసాను. అది చదవగానే నేను గ్రహించినదాన్ని ఇలా సారాంశప్రాయంగా చెప్పవచ్చు:  అమరావతి శిల్పకళ బౌద్ధ సందేశాన్ని, విలాసమయ ప్రాపంచిక జీవితంతో అనుసంధానించి చూడటానికి ప్రయత్నిస్తే, ఫణిగిరి శిల్పులు ప్రజల దృష్టిని తిరిగి మళ్ళా బుద్ధుని జీవితం వైపూ, ఆయన త్యాగమయ సందేశం వైపూ మళ్ళించారనీ, ఆ ప్రయత్నంలో వారు సృష్టించిన శిల్పం ప్రపంచంలో ఇంతదాకా సృష్టించిన అత్యున్నత శిల్పాల సరసన నిలబడదగ్గది మాత్రమే కాదు, బౌద్ధ సందేశాన్ని అత్యంత సున్నితంగా వ్యక్తీకరించడంలో, తక్కిన శిల్పకళల్ని దాటిపోయిందని కూడా.

ఇంతదాకా నేను పేర్కొన్న పుస్తకాలు ఎక్కడ ఆగిపోయాయో, ఈ పుస్తకం అక్కడ మొదలవుతున్నది. ఇందులో సంపాదకుడి ముందుమాట కాక, ఆరు అధ్యాయాలున్నాయి. వాటిల్లో ముఖ్యవిషయాల్ని సంగ్రహంగా మీతో పంచుకుంటాను.

ఫణిగిరిలో బౌద్ధం అనే వ్యాసంలో భద్ర రుజిరాథట్ Deccan Gap అనే భావనని పరిచయం చేసారు. అంటే దక్కన్ ప్రాంతంలో విలసిల్లిన బౌద్ధంగురించీ, ఆ బౌద్ధాన్ని ఆదరించిన రాజవంశాల గురించీ మనకి చెప్పుకోదగ్గ సాహిత్య, వాజ్మయ ఆధారాలు లభ్యంగా లేకపోవడం, ఆ కాలం గురించి తెలుసుకోవడానికి మనం కేవలం పురావస్తు అవశేషాల వైపే చూడవలసి రావడాన్ని ఈ కెనెడియన్ చరిత్రకారుడు ప్రధాన సమస్యగా పేర్కొన్నారు. ఈ గాప్ వల్ల అప్పటి బౌద్ధ విహారాల దైనందిన జీవనసరళి ఎలా ఉండేదో మనకు తెలియకుండా పోయిందని చెప్తున్నాడాయన. అలాగే మనం స్థూలంగా’మహాయానం, హీనయానం అని బౌద్ధ విహారాలకి పేర్లుపెట్టలేమనీ, నిజానికి ఏ ఒక్క బౌద్ధ విహారమూ కూడా ఏదో ఒక ప్రత్యేక శాఖకు పరిమితమై ఉండేది కాదనీ కూడా అంటాడు. అలానే బౌద్ధం స్థానికంగా వ్యాప్తి చెందుతున్నప్పుడు ఇక్కడ ఎటువంటి సంవాదాలు చేసిందీ, స్థానిక తెగలను ఎలా ఒప్పించిందో ఆ వివరాలు కూడా మనకి తెలియకుండా పోయేయని చెప్తున్నాడు.

రెండో వ్యాసంలో John Guy అనే బ్రిటిష్ చరిత్రకారుడు, ధర్మచక్రాలు, యష్టి, యక్షుల పైన వివరంగా చర్చించాడు. ఫణిగిరి శాసనాల వల్ల ఇక్ష్వాకు చక్రవర్తుల పాలనా కాలం మరికొంత పొడిగించడం సాధ్యపడిందని చెప్తాడు. మహాస్తూపంతాలూకు యష్టి (అంటే శిఖర స్తంభం) మనకు లభ్యం కావడం చాలా అరుదైన అవశేషం అని చెప్తూ, దాన్నీ, విహార నిర్మాణ వాస్తునీ, గాంధార, తక్షశిల శైలులతోనూ, ద్వారవతి, మయన్మార్ శైలులతోనూ పోల్చి చర్చిస్తాడు. బౌద్ధ స్థలాల్ని కాచి రక్షించే యక్షుల మూర్తిరూపకల్పనలే తర్వాతి కాలంలో బోధిసత్త్వమూర్తులుగా పరిణామం చెందాయని చెప్తాడు. అలానే ఈ విహారం మీద దాడులు జరుగుతున్నప్పుడు భిక్షువులు పవిత్ర వస్తువుల్నీ, పూజనీయ ధాతువుల్నీ భద్రంగా, రహస్యంగా దాచిపెట్టుకున్నారనడానికి ఆధారాలున్నాయని కూడా చెప్తాడు.

మూడవ వ్యాసంలో ఫణిగిరి పురావస్తు క్షేత్రం గురించి హెరిటేజి డిపార్ట్ మెంటు డైరక్టరుగా పనిచేసిన ఎన్.ఆర్.విసాలాచ్చి సవివరంగా రాస్తారు. విహార క్షేత్ర నిర్మాణం, నీటిపారుదల, ఆర్థిక స్థితిగతులు, ఆరాధనా పద్ధతులు మొదలైనవాటి గురించి ఒక పురావస్తు శాఖాధిపతి ఎంత చెప్పగలరో అంతా ఆమె తన వ్యాసంలో  రాసారు. అలానే ఆ విహారం ఒక క్రూర విధ్వంసానికి లోనయి ఉండవచ్చునని కూడా ఊహిస్తారు.

నాలుగవ వ్యాసం ఇక్ష్వాకుల కాలంలో  బౌద్ధమత పరివ్యాప్తి గురించి చర్చిస్తుంది. వ్యాస రచయిత డా.అకిరా షిమదా న్యూయార్క్ లో చరిత్ర బోధిస్తున్నారు. కృష్ణాపరీవాహక ప్రాంతానికీ, గోదావరీ పరీవాహక ప్రాంతానికి చెందిన వాణిజ్య మార్గాల ఖండితబిందువులో ఫణిగిరి ఉందని చెప్తూ, ఆంధ్ర ప్రాంతంలోని విహారస్థలాలన్నీ మూగబోతున్నవేళ ఫణిగిరిలో కళాసృజన ముమ్మరమైందని చెప్తాడు. ఇక్ష్వాకుల ఏలుబడిలోని మహాతలవరులు తమ సొంత నాణేలు కూడా వేసుకున్నారని చెప్తూ వారు ఈ విహారానికి ఏ విధంగా తోడ్పడ్డారో చెప్పుకొస్తాడు.

ఇక ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చరిత్ర బోధిస్తున్న పరుల్ పాండ్య ధర్ ఫణిగిరి తోరణం ఒక్కదాన్నే  తీసుకుని ఎంతో లోతైన పరిశీలన చేసారు. ఇప్పుడు మనకి లభ్యమవుతున్న శకలాల్నీ, శిల్ప ఫలకాల్నీ బట్టి ఆమె ఫణిగిరి విహారతోరణాన్ని పునర్నిర్మించే ప్రయత్నం చేసారు. మొత్తం తోరణంలో మనకి లభ్యమవుతున్న అవశేషాలు ఎంతపాటివో ఆమె ఊహించిన ఈ ఊహాచిత్రాన్ని బట్టి చూడవచ్చు.

ఇది తోరణం ముందువైపు భాగం. ఆమె ఈ తోరణాన్ని సాంచి తోరణంతో పోల్చి చూసే ప్రయత్నం చేసారు. మనకి లభ్యమవుతున్న శిల్ప శకలాలు, ఫలకాలు సిద్ధార్థ-గౌతముడి జీవితప్రయాణంలో ఏ ఘట్టాలకు చెంది ఉండవచ్చునో కూడా ఆమె ఊహించే ప్రయత్నం చేసారు. అలానే ఆ తోరణం విహారంలో బౌద్ధభిక్షువుల నివాస స్థలం నుంచి వారి అర్చాస్థలాన్ని వేరుచేసే ఒక పవిత్రద్వారంగా ఎలా ఉండి ఉండవచ్చునో కూడా వివరించారు.

ఇక పుస్తకంలోని చివరి వ్యాసం నమన్ అహుజా రాసింది. The Jewel in the Crown: Lessons on Heritage from Phanigiri అని ఆయన రాసిన వ్యాసం ఈ పుస్తకానికే తలమానికం. సిద్ధార్థుడి ఉష్ణీశ త్యాగాన్ని చిత్రించే ఒక  శిల్పం ఫణిగిరిలో లభ్యమైందట. (ఈ ఉష్ణీశ త్యాగ శిల్పం హైదరాబాదు స్టేట్ మ్యూజియంలోనే ఉందని తెలిసింది. ఇప్పుడు వీలైనంత త్వరగా ఆ శిల్పాన్ని పోయి చూదాలని ఉంది.) అహుజా తన వ్యాసం మొత్తం ఆ ఒక్క శిల్ప ప్రాశస్త్యాన్నే ఉగ్గడిస్తూ రాసాడు. దాంతోపాటు  ఆ ప్రాంతాన్ని ప్రజల భాగస్వామ్యంతో, పర్యావరణసన్నిహితంగా, దీర్ఘకాలం పాటు విలసిల్లగల ఒక వారసత్వసంపదగా అభివృద్ధి చేయవలసిన అవసరం గురించి కూడా చర్చిస్తాడు.

ఉష్ణీశం ఒక సంస్కృత పదం. ధాతుపరంగా దాని అర్థం వేడినుంచి కాపాడేదని. రూఢ్యర్థంలో అది తలని వేడినుంచి కాపాడే జటాజూటానికీ, తలపాగాకీ, క్రమంగా, కిరీటానికీ కూడా వర్తించే పదం. సిద్ధార్థుడు ఇల్లు విడచి మహాభినిష్క్రమణం చేసినప్పుడు మొదట చేసిన పని తనతో వచ్చిన చండుడి దగ్గరనుంచి కత్తి తీసుకుని తన సిగముడిని కత్తిరించుకోడం.  దాంతో ఆయన  సన్న్యాస స్వీకారం మొదలైందని అర్థం. అంటే  అది ఆయన రాజ్యత్యాగానికీ, ఇహలోక సుఖాల్ని వదిలిపెట్టడానికీ, అంతిమంగా తనలోని అధికారవాంఛని పూర్తిగా నిర్మూలించుకోడానికీ చిహ్నంగా మారిపోయింది. కాబట్టి బుద్ధుడి జీవితాన్ని శిల్పాలుగా మలిచిన ప్రతి ఒక్కచోటా ఈ ఉష్ణీశత్యాగాన్ని కూడా ప్రముఖంగా ఉగ్గడిస్తూ వచ్చారు.

అయితే అహుజా చెప్పిందాని ప్రకారం-బార్హుత్, సాంచి, గాంధార, మధుర, అమరవాతి, కనగనహల్లి మొదలైన చోట్ల కూడా ఈ అంశాన్ని చిత్రించినప్పటికీ ఫణిగిరిలో చెక్కినంత నిర్దుష్టంగా, ప్రముఖంగా, విస్పష్టంగా ఈ ఇతివృత్తాన్ని మరెక్కడా శిల్పంగా మలచలేదని. ఆయన తన వ్యాసంలో పొందుపరిచిన ఈ శిల్పాన్ని ఇక్కడ మీతో పంచుకుంటున్నాను.

ఇందులో కింది భాగంలో ఉన్న భాగం సిద్ధార్థుడు ఇల్లు విడిచి పెట్టి వెళ్తున్న దృశ్యం. ఆయన గుర్రం కంఠకం, అనుచరుడు చండుడితో పాటు దేవతలు అతనికి దారి చూపిస్తూ దివిటీ ఎత్తి పట్టుకోవడం కూడా మనం ఇందులో చూడవచ్చు. దాని పైన ఉన్న భాగం (అంటే శిల్పంలో మధ్యభాగం) లో సిద్ధార్థుడు తన సిగముడిని కత్తిరించి పక్కన పెట్టడం చూడవచ్చు. ఆయన చుట్టూ దేవతాగణాలు అభినందిస్తూ, ప్రార్థిస్తున్న దృశ్యం అది. సిద్ధార్థుడు త్యజించిన ఉష్ణీశాన్ని ఒక బంగారుపళ్ళెంలో నెత్తిమీద పెట్టుకుని దేవతలు ఊరేగుతున్న దృశ్యం అన్నిటికన్నా పైనున్న భాగంలో చూడవచ్చు.

2017-18 లో ముంబైలో జరిగిన India and the World అనే ఎగ్జిబిషన్ జరిగిందట. అందులో ఈ శిల్పాన్ని, అలెగ్జాండర్, హాద్రియన్ లాంటి గ్రీకు, రోమన్ చక్రవర్తుల ముఖశిల్పాలతో పాటు ప్రదర్శించారట. ఆ విషయం చెప్తూ అహుజా ఇలా అంటున్నాడు (పే.192):

It was used to make the point that in an age when portrait statues served statecraft and the aggrandizement of power, at least some public statues in India were made that celebrated the sacrifice of material wealth and power.

ఈ మాటలు చదవగానే, ఈ శిల్పంతో శాతవాహన-ఇక్ష్వాకు బౌద్ధ శిల్పకళ పతాకస్థాయికి చేరుకుంది అనిపించింది. తన అత్యుచ్చ దశలో అమరావతి, నాగార్జున కొండ కూడా, బుద్ధుడి అధికారనిరాసాన్ని, ఇంత ఉజ్జ్వలంగా చిత్రించి ఉండలేదు. కానీ ఫణిగిరి కొండమీద విహారంలో ఒక స్మారక స్తంభాన్ని నిర్మిస్తున్నప్పుడు ఆ శిల్పులకి తమ సమకాలిక ప్రపంచానికి అత్యవసరంగా చెప్పవలసింది ఈ సందేశమేనని తోచిందని నాకు అర్థమవుతున్నది. గొప్ప కళ ఎప్పుడూ ఇలా రెండు తలాల్లో మాట్లాడుతుంది. పైన ఉపరితలంలో అది తన సమకాలిక సమాజం కోరుకునే మాటలు చెప్తున్నట్టు కనిపించినప్పటికీ, దాని అంతర్భాగంలో, అప్పటి సమాజానికి ఏది నిజంగా హితకరమో దాని  గురించే మాట్లాడుతుంది. ఆ విధంగా చూసినప్పుడు అమరావతి బిగ్గరగా చెప్పలేకపోయిన హితవచనాన్ని ఫణిగిరి లోకమంతా వినబడేలాగా ఈ శిల్పం ద్వారా ఎలుగెత్తి చెప్పిందనిపించింది.

అహుజా వ్యాసం చదివిన తరువాత చాలాసేపు ఆయన చెప్తున్న విషయాల గురించే ఆలోచిస్తూ ఉండిపోయాను. కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలో క్రీ.పూ. 2 వ శతాబ్ది మొదలుకుని, సా.శ.4 వ శతాబ్దిదాకా విలసిల్లిన బౌద్ధశిల్పకళ ఆరిపోయేముందు ఉజ్జ్వలంగా వెలిగిన చివరి క్షణాల్ని మనం ఫణిగిరిలో గుర్తపట్టవచ్చని నాకు ఆ వ్యాసం ద్వారా బోధపడింది. ఆ విధంగా ఫణిగిరి, తెలంగాణాకి, ఒక అమరావతి, ఒక నాగార్జున కొండతో సమానమైన ప్రాధాన్యత కలిగిన క్షేత్రమని కూడా అర్థమయింది.

5

ఈ నాలుగైదు రోజులుగా ఫణిగిరి గురించిన ఆలోచనలే నా మనసులో ఉన్నాయి. సాహిత్యప్రేమికులూ, శిల్పప్రేమికులూ, బౌద్ధ ప్రేమికులూ చెయ్యదగ్గ చాలా పనులు నాకు స్ఫురిస్తూ ఉన్నాయి. మొదటిది, అడవి బాపిరాజుగారు ఇక్ష్వాకుల్లోని వీరపురుషదత్తుడి కాలాన్ని చిత్రిస్తూ ‘అడవి శాంతిశ్రీ’ రాసినట్లుగా, రుద్రపురుషదత్తుడి కాలాన్ని చిత్రిస్తూ ఫణిగిరి కేంద్రంగా ఒక నవల రాయవచ్చు. శివరామ్మూర్తి అమరావతి శిల్పాల మీద రాసినట్టు ఫణిగిరి శిల్పాల పైన ఒక సమగ్రవివరణ రాయవచ్చు.

కొత్త తెలంగాణా బృందంవారుగానీ మరే బృందమైనా తెలంగాణాలో కృష్ణా-గోదావరీ పరీవాహక ప్రాంతాల్లోని బౌద్ధ క్షేత్రాలు- కోటిలింగాల, ధూళికట్ట, కొండాపూరు, ఫణిగిరి, వర్ధమానుకోట, జగ్గయ్యపేట మీదుగా అమరావతిదాకా ఒక యాత్ర చెయ్యవచ్చు. అలానే ఆంధ్ర ప్రాంతంలో కూడా శాలిహుండం నుంచి బొజ్జన్నకొండ, ఆదుర్రు, జీలకర్రగూడెం, అమరావతి దాకా ఒక యాత్ర గురించి ఆలోచించవచ్చు. ఇలా మరికొన్ని యాత్రాపథాల్ని కూడా గుర్తుపట్టి ఎక్కడికక్కడ చిన్న చిన్న యాత్రలు మొదలుపెట్టవచ్చు. మనం ఎంత అత్యున్నత వారసత్వ సంపదకి వారసులుగా ఉన్నామో ఈ యాత్రల వల్ల ప్రజలకి కొంతైనా తెలియచెప్పగలుగుతాం. దానివల్ల ప్రభుత్వాల ప్రాధాన్యతల్లో ఈ క్షేత్రాల పరిరక్షణకి కూడా ముఖ్యమైన స్థానం లభిస్తుంది. బుద్ధుడి సందేశం మరో మారు వినడం ద్వారా సమకాలిక సమాజం కూడా తన అశాంతి నుంచి ఎంతో కొంత బయటపడగలుగుతుంది.

(అయిపోయింది)

12-11-2026

Leave a Reply