
దేవతలకీ, తల్లిదండ్రులకీ, ఋషులకీ పడ్డ ఋణాలు తీర్చుకోడం మనిషి కర్తవ్యం అని పెద్దలు చెప్తూ ఉన్నారుగాని, నిజానికి ఇవి ఎప్పటికీ తీరని ఋణాలు. బహుశా ఈ ఋణాలు తీర్చుకోవాలన్న కోరిక బలంగా ఉన్నంతకాలమే మనిషికి జీవితేచ్ఛ కూడా బలంగా ఉంటుదనుకుంటాను. బతకడానికొక అర్థం వెతుక్కుంటూ ఉంటామనుకుంటాను. నా జీవితంలో నేను చూసి ఉండని, కాని తమ రచనల ద్వారా నాకు జ్ఞానభిక్ష ప్రసాదించిన గురువులు చాలామందే ఉన్నారు. కాని నన్ను ప్రత్యక్షంగా ఆశీర్వదించి జ్ఞానామృతం ధారపోసిన గురువులు కూడా కొందరున్నారు. వారి ఋణాన్ని తీర్చుకోవడం నాకు చాతనైన పనికాదు. కాని గురూజీ చెప్పినట్టుగా మనం మనకందిన ఆ జ్ఞానాన్ని మనకి తారసపడ్డవారందరికీ పంచుకుంటూపోవడమొక్కటే మనం చెయ్యగలిగింది.
కానీ గురూజీ విషయంలో నేనింతకాలం అది కూడా చెయ్యలేకపోయాను. ఆయన్ని కలిసిన ప్రతిసారీ ఆయన తాను జీవితకాలం కూడాబెట్టుకున్న జ్ఞానాన్ని, అనుభవాన్ని, తాను మాత్రమే కనుగొనగలిన సత్యాల్ని నా జోలెలో కుమ్మరిస్తూనే ఉన్నారు. అది చాలదన్నట్టు ఒక వారం రోజుల పాటు నాకోసం తాను చెప్పగలిగినంతా చెప్పారు. ఆ సంభాషణలు రికార్డు చేసుకుని కూడా వాటిని ఏళ్ళ తరబడి నా దగ్గరే పెట్టుకున్నాను. ఆ తర్వాత కూడా ఆయన్ని కలిసిన సందర్భాలున్నాయిగాని ఆయన ఎప్పుడూ మాట మాత్రంగా కూడా అప్పుడు నాతో మాట్లాడించిన మాటల్ని పుస్తకంగా తెస్తున్నారా లేదా అని ఒక్కసారిగా అడగలేదు. ఆయన చెప్పిన నిర్వచనం ప్రకారమే చూస్తే, ఇది కేవలం ఋషి లక్షణం మాత్రమే కాదు, దైవలక్షణం కూడా. ఇవ్వడమే, ఎటువంటి ప్రతిఫలాపేక్షా లేకుండా ఇవ్వడం మాత్రమే తెలిసినవాణ్ణి దేవుడంటారనే కదా ఆయన చెప్పింది!
ఏమైతేనేం ఇన్నాళ్ళకు వీటినిలా నా తెలుగులో మీతో పంచుకున్నాను. ఈ సంభాషణల్ని నా వ్యావహారిక భాషలోకి అనువదించి పంచుకుంటున్నప్పుడు నేను గురూజీ భావాల్నీ, వాక్యాల్నీ, మాటల్నీ వీలైనంతవరకూ యథాతథంగా అందివ్వడానికే ప్రయత్నించాను. ఎక్కడా ఆయన నోటివెంట నా మాట ఒక్కటి కూడా పలికించలేదు. అయితే ఆయన మాట్లాడుతున్న విషయానికి చెందిన భావాలు విడివిడిగా ఉన్నవాటిని కొన్నిసార్లు ఒక్కచోటకి తీసుకొచ్చాను. ఒక సంకలనకర్తగా ఆ స్వాతంత్ర్యం నేను తీసుకోదగ్గదే. అలానే మొత్తం సంభాషణల్లో అక్కడక్కడా కొన్ని పదప్రయోగాలో, ఉదాహరణలో, లేదా కొన్ని వాక్యాల్లో అపోహకి తావిస్తాయనుకున్నచోట వాటిని కావాలనే వదిలిపెట్టాను. అలానే మరొక ముప్ఫై నలభై పేజీల నిడివి గల సంభాషణల్ని కూడా వదిలిపెట్టేసాను. వాటిల్లో ఆయన కొత్త విషయాలు చెప్పినప్పటికీ, ముందు మాట్లాడినవాటికే పునరుక్తిలాగా అనిపించవచ్చుననీ, అవి లేకపోయినందువల్ల సంభాషణలకు ఎటువంటి లోటూ రాదనీ అనుకున్నందువల్ల అలా చేశాను.
ఈ సంభాషణలిలా పంచుకోవడం పూర్తయినవెంటనే ఆ ఆడియో ఫైళ్ళు గురూజీ కుమారుడు అపూర్వశర్మకి పంపించేసాను. ఇక వాటిమీద పూర్తి హక్కు ఆ కుటుంబానిదే.
ఈ రూపంలో వెలువడ్డ ఈ సంభాషణల్ని త్వరలో పుస్తకరూపంలో ఎలానూ తీసుకురాబోతున్నాను. కానీ, ఇప్పుడు గురూజీ గురించి మరింత తెలుసుకోవాలన్న కుతూహలం ఉన్నవారు యూట్యూబులో గురూజీ పేరు మీద ఉన్న సంభాషణలు వినవచ్చు. అలానే రజని బక్షి రాసిన Bapu Kuti, ఆశిష్ గుప్తా, పవన్ గుప్తా సంకలనం చేసిన ‘స్మృతి జాగరణ్ కే హర్కారే‘ రెండు సంపుటాలు, ఆశిష్ గుప్తా సంకలనం చేసిన ‘భారత్ గాథా ఏవమ్ భారత్ కథా‘ పదిహేను సంపుటాలు పరిశీలించవచ్చు. అపూర్వ శర్మ త్వరలోనే Unchaas అనే పుస్తకం వెలువరించబోతున్నారు కూడా.
కళాశ్రమం వెబ్ సైట్, బ్లాగ్, ఆయన ప్రసంగాల యూట్యూబు లింకుల ఇన్వెంటరీ కూడా సిద్ధమవుతూ ఉన్నాయి. ఎవరైనా మిత్రులు కళాశ్రమం సందర్శించదలచుకుంటే, +91 80562 47841 ని సంప్రదించవచ్చు. ఈ నెల 11 వ తేదీనుంచి మూడు నెలలపాటు జరగబోతున్న పాటరీ వర్క్ షాపు కూడా చూడవచ్చు.

ఈ సంభాషణల్ని నడిపించిన ఆశీష్ కుమార్ గుప్తకీ, వీటిని కాసెట్లనుండి డిజిటల్ ఫైళ్ళుగా మార్చిన గోపగాని రవీందర్ కు, 2017 లో నేను అడగ్గానే గురూజీ ఫొటోలు ప్రత్యేకంగా తీసి నాకు పంపించిన సర్దార్ హర్ పాల్ సింగ్ గారికి, కళాశ్రమం ఫొటోలు పంపిన అపూర్వ శర్మకు నా ధన్యవాదాలు. ఈ నెలరోజుల పాటు ఎందరో మిత్రులు ఈ సంభాషణల్తో కలిసి నడిచారు. కొందరు ప్రతి ఒక్క సంభాషణమీదా తమ స్పందనల్ని సవివరంగా ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉన్నారు. వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ముఖ్యంగా జీడిగుంట విజయసారథిగారికీ, మాధవి రెడ్డివారి గారికీ మరిన్ని ధన్యవాదాలు.
గురూజీ కంఠస్వరం ఎలా ఉంటుందో అనీ, ఈ సంభాషణల మూలస్వరూపం ఎలా ఉంటుందో అనీ తెలుసుకోవాలన్న కుతూహలం ఉండటం సహజం, కాబట్టి మొదటిరోజు మొదటి గంట సంభాషణ ఆడియో ఫైలు ఇక్కడ పొందుపరుస్తున్నాను.
Featured image: Photography by Sardar Harpal Singh, Adilabad
4-7-2026


Thank you for the writing..so looking forward for the book!!!!
🙏🙏
భద్రుడు గారు, గురూజీ సంభాషణలను ఈ జీవనశిల్పి సిరీస్ ద్వారా అక్షరీకరించినందుకు చాలా మటుకు రుణం తీరిపోయిందనే అనుకుంటున్నాను. చాలా చక్కని నివాళి ఇచ్చారు. గురూజీ ఎక్కడున్నా మిమ్మల్ని తప్పకుండా అభినందించి ఆశీర్వదిస్తారు. గురూజీ కంఠస్వరం పరిచయం చేసినందుకు, మీ పోస్టులకు మా స్పందనలు తెలియజేయడం వల్ల కొద్దో , గొప్పో గురూజీ కి మా నివాళులు కూడా సమర్పించిన ఆనందం కలిగించినందుకు మీకు మా ధన్యవాదాలు.
ఆ చిన్న టేప్ రికార్డర్‌లో ఎంత అమూల్యమైన treasureను భద్రపరిచి, ఇన్నాళ్ల తర్వాత ఇంత అందంగా అక్షరబద్ధం చేసి మాతో పంచుకున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు, సర్. 🙏🏽
ఈ సంభాషణలు చదివిన తర్వాత, మీరు వివరించిన settings, కొన్ని భాగాల్లో మీరు పెట్టిన కళాశ్రమం ఫోటోలు చూస్తూ, గురూజీ voiceను వెనక పక్షుల soundsతో కలిసి వింటుంటే, మీరు గురూజీ చుట్టూ కూర్చుని ఈ సంభాషణలు వింటున్న దృశ్యం కళ్లముందు కనిపిస్తుంది.
These conversations have been an unforgettable journey into knowing Guruji, his profound wisdom, his invaluable insights, and the wealth of traditional knowledge he learned, preserved, practiced, and so generously shared.
Very grateful for the time, dedication, and effort you took to visit Guruji, record these conversations, preserve them so carefully, and bring this invaluable treasure to all of us.
Thank you for sharing this precious audio file, Sir, It’s a fitting conclusion to this extraordinary series! 🙏🏽
హృదయపూర్వక ధన్యవాదాలు మాధవీ!
సర్,
మీరు తీసుకు రాబోయే పుస్తకం గురించి ఆతృతతో ఎదురుచూస్తూ…
కృతజ్ఞతలతో-
త్వరలోనే తీసుకువస్తాను.