అమేయమైన మెర మెర

48

‘దఃఖనీ పీఠమంతా బొమ్మలబాయి ‘ అంటో సిద్ధార్థ తెచ్చిన కొత్త కవితాసంపుటి ‘బొమ్మల బాయి’ చదువుతుంటే, కవి మాటల్లోనే చెప్పాలంటే ‘జీవిలోపల చెయ్యిపెట్టి తిప్పుతున్నట్టు ఒక అమేయమైన మెర మెర ‘.

ఆదివారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఆ పుస్తకం ఆవిష్కరణ జరిగింది. గాయనీమణి రావుబాలసరస్వతి ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆ రోజు తక్కిన వక్తలతో పాటు నేను కూడా పంచుకున్న ఆలోచనల్లో కొన్ని:

ఒక విధంగా చెప్పాలంటే, బొమ్మలబాయి చాలా ఆలస్యంగా వెలుగుచూసిందనాలి. ఇరవయ్యేళ్ళకిందనుంచీ రాస్తున్న కవితలు కూడా ఇందులో ఉన్నాయి. చాలా కవితలు తెలంగాణా స్పృహ నిర్దిష్ట రాజకీయ స్వరూపాన్ని తీసుకోకముందే ఆ పురిటినొప్పుల్ని పసిగట్టినకవితలు. ఈ పుస్తకం పదేళ్ళ కిందట వచ్చిఉంటే ఈ కవిత్వానికి ఎంతో రాజకీయ ప్రాసంగికత వచ్చి ఉండేది.

కాని మరొక విధంగా చూస్తే, ఈ పుస్తకం కాలం కన్నా చాలా ముందే వచ్చినట్టు. ఇందులోని బతుకుబాధనీ, ఆ బాధని వ్యక్తం చెయ్యడానికి వాడిన భాషనీ అర్థం చేసుకోవడానికి తగిన సామాజికశాస్త్రంకానీ, సాహిత్య శాస్త్రం కానీ మనకింకా సిద్ధంగా లేవు.

ఒక మనిషి ఇట్లాంటి కవిత్వం ఎందుకు రాస్తాడు? అది చదివినందువల్ల మనకి సమకూరే సాహిత్య ప్రయోజనమేమిటి? పుస్తకం మొదలుపెట్టినప్పణ్ణుంచీ ఈ ప్రశ్నలే నన్ను వెన్నాడేయి. చాలా సార్లు ఇట్లాంటి కవిత్వం వచ్చినప్పుడు సామాజికంగా ఏదో పరివర్తన తున్నదని అర్థం. దాన్ని మనం పోల్చుకోకముందే,అర్థం చేసుకోకముందే, కవులూ, కళాకారులూ ఆ ప్రకంపనల్ని సిస్మోగ్రాఫులాగా రికార్డు చేస్తారు. అటువంటి ఏ ప్రకంపనల్ని ఈ కవిత్వం నమోదు చేస్తున్నది? ఎవరి సంవేదనల్ని ప్రకటిస్తున్నది?

కవి మాటల్లో చెప్పాలంటే,

‘ఔసులోళ్ళం, పట్కరోళ్ళం, గౌండ్లోళ్ళం
కుమ్మరోళ్ళం,జంగపోళ్ళం, సాకలి, సగరోళ్ళం ‘

తెలంగాణా ప్రధానంగా చేతివృత్తులవాళ్ళ, వెనకబడ్డ కులాలవాళ్ళ భూమి. రకరకాల సర్వేల ప్రకారం తెలంగాణా జనాభాలో వెనకబడ్డ కులాల వారు 43 నుంచి 57 శాతం దాకా ఉన్నారు. వీరికి దళితుల్నీ, గిరిజనుల్నీ కూడా జోడిస్తే, జనాభాలో సుమారు 90 శాతందాకా ఉంటారు. చారిత్రికంగా చూస్తే భారతదేశ చరిత్రలో వాయవ్యభారతదేశం ఎటువంటి ఆటుపోట్లు అనుభవించిందో, దక్షిణభారతదేశంలో తెలంగాణా అటువంటి ఆటుపోట్లు అనుభవించింది.

దక్షిణభారతదేశంలో రాజ్యాధికారంకోసం సంభవించిన ప్రతి పెద్ద యుద్ధానికీ తెలంగాణా రక్తం చిందించిది. అటువంటి యుద్ధాల్లో రాష్ట్రకూటులనుంచి నిజాం నవాబులదాకా ప్రతి సైన్యంలోనూ అధికసంఖ్యలో పాల్గొన్నవాళ్ళు వెనకబడ్డ కులాలవాళ్ళే. జైనం, బౌద్ధం, వీరశైవం వంటి మతాలుమొదలుకుని, తెలంగాణా సాయుధపోరాటం, నక్సలిజం వంటి నేటికాలపు ఉద్యమాలదాక ప్రధానంగా ఈ కులాల్నే ఆకర్షించడానికీ, తమవైపు తిప్పుకోడానికీ ప్రయత్నించాయి.

కాని ఆధునిక తెలంగాణా సాహిత్యంలో ఈ కులాల, తరగతుల సంఘర్షణని ఉన్నదున్నట్టుగా చిత్రించే రచనలు, ఇప్పటిదాకా చెప్పుకోదగ్గవి, రాలేదు. కాని 90 ల తర్వాత, గ్లోబలైజేషన్ మొదలయ్యాక, పల్లెలు ధ్వంసమయ్యాయనీ, పట్టణాలకు వలసలు మొదలయ్యాయనీ కథకులు రాయడం మొదలుపెట్టిన కథలు ప్రధానంగా రైతు జీవితంకన్నా, చేతివృత్తులవాళ్ళ జీవనపోరాటాన్నే ఎక్కువ చిత్రించేయి.రైతుల గురించి మాట్లాడినకథలు కూడా చిన్నకారు, సన్నకారు రైతులగురించే చిత్రించాయి కాబట్టి అవి కూడ వెనకబడ్డ కులాల, దళితుల సమస్యల్నే చిత్రించాయి. కాని, కవిత్వంలో దళిత స్పృహ గోచరించిన స్పష్టంగా వెనకబడ్డ కులాల జీవితాల గురించిన స్పృహ అంతగా గోచరించదు. (జూకంటి జగన్నాథం కవిత్వం, జూలూరి గౌరీశంకర్ వంటివారు తెచ్చిన ఒకటిరెండు కవితాసంకలనాలు మినహా).

ఆ స్తంభనని బద్దలుకొట్టి, వెనకబడ్డ కులాల, తరగతుల మౌలిక సంఘర్షణని కొత్త కవిత్వభాషలో చెప్పడానికి ప్రయత్నించిన ముగ్గురు కవులు, నాకు తెలిసి, అయిల సైదాచారి (ఆమె నా బొమ్మ), దెంచనాల శ్రీనివాస్ (భస్మసారంగి), సిద్ధార్థ (బొమ్మలబాయి). ఈ ముగ్గురిలోనూ, ఈ విధ్వంసాన్ని సిద్ధార్థ మరింత ఐతిహాసిక ప్రమాణాల్తో చిత్రించాడు.

ఈ కవిత్వమంతటా ‘చితికిన ‘, ‘పగిలిన’, ‘పెగిలిన’, ‘కూలిన ‘, సిన్నబోయిన’, ‘ఏడుపు మరిగిన ‘, మురిగిన’, ‘దారితప్పిన’, ఇగిరిన ‘, ‘కాలిన’, ‘కమిలిన’, ‘చిట్లిన’ వంటి క్రియావిశేషణాలు కొల్లలు. ఎక్కడోగాని ‘దొరికిన’, ‘నిమిరిన’ లాంటి పదాలు కనిపించవు. ఈ విధ్వంసాన్ని కవి ఎంత తీవ్రంగా దర్శించాడంటే. చివరికి ‘కవిత్వమంతా చిట్లిన కనుగుడ్ల మైదానమే’ అంటాడు.

అందుకు కారణం కూడా కవి చెప్పాడు. అతడు అన్వేషిస్తున్న వాక్యం ‘కలకూ,చింతకూ మధ్య వేలాడుతున్న’ దంటాడు. ఇంకా ఇలా అంటున్నాడు:

‘కల్లు కంపౌండ్లల్ల, గుడంబ బట్టీలల్ల, మెహందీ చెమటసుక్కలల్ల
పనిముట్ల పుండ్లల్ల, రక్తపంకాలల్ల, వొంటరికాష్టాలల్ల
పతాలేని ప్రేమలల్ల, దిక్కులేని సావుల కడుపుకోతలల్ల
కుత్కెలో కూడులాగా ఉంటాది బిడ్డా వాక్యం ‘

ఈ వాక్యాన్ని పట్టుకోడానికి కవిచేసిన సఫల, నిష్ఫల అన్వేషణ ఈ కవిత్వం.

ఇందుకతడు ఒక కొత్తభాషని సృష్టించే ప్రయత్నం చేసాడు. ఈ భాష పాలకుడి భాష కాదు, పండితుడి భాష కాదు. ఇది చేతిపనివాడి భాష. మన సాహిత్య శాస్త్రాలు, లక్షణగ్రంథాలు- సంప్రదాయకాలానివీ, ఆధునిక కాలానివీ కూడా శిష్టవర్గానికి చెందినవి. పనివాళ్ళు, ముఖ్యంగా చేతిపనివాళ్ళ సాహిత్యలక్షణశాస్త్రం ఎలా ఉంటుందో మనమెప్పుడూ చర్చించలేదు. కాని, ఛార్లట్ వాడవిల్లి, లిండా హెస్ వంటివారు కబీర్ కవిత్వాన్ని అర్థం చేసుకునే క్రమంలో అటువంటి చర్చ కొంత చేసారు. కబీర్ నేతపనివాడు. ఆయాన్ని ప్రభావితం చేసిన నామ దేవ్ దర్జీ. వీళ్ళ రెటారిక్ ని అర్థం చేసుకోవడానికి ఎ.క్. రామానుజన్ rhetoric of spontaneity అనే ఒక భావనని పరిచయం చేసాడని లిండా హెస్ రాసింది. దీన్ని సద్యఃసృజన అనవచ్చు. అంటే ఎప్పుడేది స్ఫురిస్తే అప్పుడట్లా చెప్పడం,నిస్సంకోచంగా, అద్వితీయంగా.

తమ తమ వృత్తుల్లో, నగిషీకి, చెక్కడానికి ఎంతో ప్రాధాన్యమిచ్చే ఈ వృత్తిపనివారు సాహిత్యసృజనలో మాత్రం నగిషీని పక్కన పెట్టి తమ ఆత్మఘోషనే వినిపించడానికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. ఎందువల్ల? ఎందుకంటే, సాహిత్యసృజనలో నగిషీ శిష్టలక్షణం. దాన్నుంచి విడిగా తమ అస్తిత్వాన్ని నిరూపించుకోవడానికి వారికన్నా భిన్నమైన లక్ష్య సాహిత్యాన్ని సృష్టించవలసి ఉంటుంది.

సిద్ధార్థ అభివ్యక్తిలో కూడా ఈ rough rhetoric తీవ్రంగా కనిపిస్తుంది. కాని, మధ్యయుగాల భక్తికవులకన్నా ఇప్పటి కవిది మరింత తీవ్రవేదన. ఇతడిమీద అనేక ప్రపంచాల పదజాలం,భావజాలం బరువుగా పడిపోతున్నాయి. ఆ భావజాలాన్ని, పదజాలాన్ని పరిహరించి తాను చెప్పాలనుకున్నది చెప్పడం ఒక పద్ధతి. కాని సిద్ధార్థ దృష్టిలో అది శిష్టపద్దతి. అలాకాక తనకి ఏది కనిపిస్తే దాన్ని, ఏది స్ఫురిస్తే దాన్ని చెప్పుకుంటూ పోవడాన్నే అతడు ఎంచుకున్నాడు. దానివల్ల బయటి జీవితం ఎంత కలగాపులగంగా కనిపిస్తున్నదో, అతడి కవిత్వభాషకూడా అంత చిక్కుముడిగానూ కనిపిస్తుంది. కాని ఆ ముడిని నెమ్మదిగా విప్పుకుంటూ, నిసర్గసుందరమైన అతడి జాతిలక్షణాన్ని, అతడి ఇష్టదేవతల్నీ, కులదేవతల్నీ, గ్రామదేవతల్నీ గుర్తుపట్టడంలోనే మన సాహిత్యానుభవం ఇమిడిఉంది.

ఉదాహరణకి, అతడి అసలైన భాష, అతడి గ్రామభాష, గోత్రభాష ఇలా ఉంటుంది:

‘గచ్చకాయల కాంతి/వానరాశుల కాంతి’

తేనెటీగలు ముసిరిన పున్నమి’

‘పజ్జొన్నల విత్తులోన దాక్కొన్న పొద్దు’

‘మన్నుగోలెం పక్కన పొట్టుపొయ్యిలో చిట్లిన సొగసు’

‘కర్యాపాకు విత్తనాల నడుమ భూమిలో పొర్లాడిన కుమ్మరి పురుగు’

‘రాళ్ళతోటన రోహిణికార్తెలో అంబటాలె కురిసిన వాన’

‘అప్పుడప్పుడూ గాలికి తీగల్ని జరుపుకుంటున్న దిల్ రుబా’

‘మడుగునీళ్ళల్లో మునకలాంటి మధ్యాన్నం నిద్ర’

కాని తాను చదువుకున్న సాహిత్యం ఇట్లాంటి పదబంధాల్ని కూడా పలికిస్తుంది:

‘దు: ఖస్రావం ‘, ‘యవ్వనగగనం ‘, ‘పురాతన సత్సంగం ‘, ‘శుభ్రసంధ్యాసరోవరం’, దు:ఖించడంలోని రంగునీ, రుచినీ బోధించిన శుభ్రకాంతి’, ‘నా ఏకాంతమొక ఆముష్మిక ఖననం’

ఈ రెండు భావజాలాలూ సంగమించి/సంఘర్షించి ఒక్కొక్కప్పుడు ఇట్లాంటి పదసందోహం పుట్టుకొస్తుంది:

‘ఏడుపు మరిగిన భాష’

‘పాత లైఫ్ బాయ్ వాసనొచ్చే దేహమై జీవికి తగుల్తుంటది’

‘జ్వరమొచ్చిన బంతిమొగ్గ’

‘అలుపెరగని అనాసపండు’

‘కలల చిలుము’

‘కమురెక్కుతున్న స్వప్న తటాకం’

‘రాతలవాసనలో వెబ్బుల వాసన’

‘మహాస్మశాన వాటిక నా నాలుక’

బహుశా ఈ నగరం, ఈ ఆధునిక జీవితం అతడికి పరిచయం కాకపోయుంటే అతడొక బహురూపిగా, బాలసంతుగా పాటలు పాడుకుంటూ ఉండేవాడు. అతడి హీరోలు సుస్పష్టమే. వాళ్ళు బైరూపులు, బాలసంతులు, గొల్లసుద్దులు, శివసత్తులు, కాటమరాజుపాటగాళ్ళు, చిందుబాగోతులు, చుక్కసత్తెయ్యలు, తాన్ పుర గోరటెంకన్నలు, కిన్నెర శంకరమ్మలు, ధర్మపురి శతకకర్తలు.

కాని అతడి మనోప్రంచాన్ని,భావావేశాల్ని పాలించే వాళ్ళల్లో అజంతా, మడొన్నా, బంకింబాబు, రూమీ,నమ్మాళ్వారు, తార్కొవిస్కీ, కెన్ సారొ వివా, అనావీలర్ లతో పాటు తథాగతుడినుంచి డెరిడా దాక ఉన్నారు. కాని వీళ్ళ మాటలు తనవి కావేమో, తన జాతివి కావేమో అన్న స్పృహ కూడా. అందుకనే

‘మాటకారోన్నైనందుకు సిగ్గుబడుతున్నాను’

అంటాడొకచోట.

తన

‘నరాన బడుతున్న భాషలొ మునుపటివాక్యమేదో ఇరుక్కుని పోయింది’.

అది ఒక బహురూపి పాట. బాలసంతు మాట. కాని తానిప్పుడు అటువంటి విశుద్ధిమార్గానికి పాత్రుడు కాడు. తానిప్పుడు ఆధునికతావ్యాధిగ్రస్తుడు. అందుకని ‘కవిత్వం తనని ఏటవాలుగా కోస్తున్న’ నరకయాతనని అనుభవిస్తున్నాడు. ఆ యాతన మనతో పంచుకోడానికి ఉవ్విళ్ళూరుతున్నాడు.

ఇది ఒక ఆశ్వాసాంత కవిత్వం. ఇది చిత్రిస్తున్న యుగాంతంలోనే ఒక నవీన యుగోదయ సూచనలు కూడా ఉన్నాయి. ఆ యుగమెట్లా ఉంటుందో, మరింత మంది వెనకబడ్డ కులాలవాళ్ళు, దళితులు, గిరిజనులు రాస్తే తప్ప మనకి స్పష్టంగా బోధపడదు.

12-1-2016

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading