నోలాన్  ఒడిస్సీ

క్రిస్టఫర్ నోలాన్ తీసిన ఒడెస్సీ సినిమా అంత తొందరగా చూస్తానని అనుకోలేదుగానీ నిన్న ప్రమోద్ పట్టుబట్టి  తీసుకెళ్ళి చూపించాడు. మేము చూసింది మామూలు థియేటరు కావడంతో, ఆ సినిమాలోని ఆ సాంకేతిక మహేంద్రజాలాన్ని పూర్తిగా అనుభవంలోకి తెచ్చుకోలేకపోయాం. కాని ఒక విధంగా అదీ మంచిదే అయింది, ఎందుకంటే, నాకు అందులోని సాంకేతిక పార్శ్వం కన్నా, ఆ ఇతిహాసంలోని కథనకౌశల్యాన్ని మరొకసారి లోతుగా, దగ్గరగా, కళ్ళముందు కనుగొనే అవకాశం లభించింది. సినిమా చూడటం పూర్తయ్యాక నాకు కలిగిన అనుభూతి ఒక్కటే: హోమర్ సినిమా మాధ్యమాన్ని దాటి నిలబడుతున్నాడు అనే.

సాధారణంగా నోలాన్ లాంటి దర్శకులు ఇటువంటి కథని తెరకి ఎక్కిస్తున్నప్పుడు ప్రేక్షకుల్ని ఉత్కంఠభరితుల్ని చెయ్యగల అంశాలు రెండుంటాయి. ఒకటి కథ. ఆ కథ మనం వింటూ ఉండగా, అది ఏకకాలంలో కథగానూ, మరొక తలంలో అత్యున్నత రూపకాలంకారంగానూ మనకి స్ఫురిస్తూ, ఆ కథలోని ప్రతి ఒక్క మాటా, ప్రతి ఒక్క చేతా, ప్రతి ఒక మలుపూ మన మనసులో మరెన్నో తలుపులు తెరుస్తూ ఉండగా, ఒక ప్రాచీన మానవుడి జీవితం గురించి మరొక ప్రాచీన కవి అల్లిన ఆ గీతంలో ఇప్పటి నా జీవితానికీ, మన జీవితాలకీ సంబంధించిన ఎన్నో అంశాలకు సంబంధించిన ఎన్నో స్ఫురణలు, అంతరాలోకనలూ తరంగాల్లాగా మనసులో లేచి పడుతూ ఉండగా, ఆ కథ వినడం ఒక అత్యున్నత రసానుభవంగా మారడం. రెండవది, ఆ కథలోని ఇమేజినేషన్. దాన్ని మనం కావ్యంగా చదువుతున్నప్పుడు  ఆ mythological imagination ని మనం మన మనసుల్లో చిత్రించుకుంటూ ఉండటానికి, ఏ దృశ్యమాధ్యమమూ సరిపోలదు. కాని ఇలాంటి దర్శకులు అత్యున్నత సాంకేతిక పరిజ్ఞాన్నంతా ఉపయోగించి, ఆ ఇమాజినేషన్ కి ఒక దృశ్య రూపం సమకూరుస్తున్నప్పుడు, దాన్ని చూడటంలో కూడా ఒక సంతోషం లేకపోలేదు. ఒక విధంగా ఆ దృశ్యీకరణని కూడా ఆ ఇతిహాసానికి ఒక వ్యాఖ్యానంగా మనం భావించవచ్చు. కానీ నా దృష్టిలో దీనిది రెండో స్థానం మాత్రమే. ఈ సినిమా చూసినప్పుడు కూడా నాకు అదే అనిపించింది.

అందుకనే సినిమా చూస్తున్నంతసేపూ దర్శకుడు ఒడిస్సీని తాను ఏ విధంగా అర్థం చేసుకున్నాడూ, దానిలోని ఏ భాగాల్ని వదిలిపెట్టి, మరే భాగాల్ని పెద్దవి చేసి, పదే పదే వాటిమీదుగా తన పఠనానుభవాన్ని మనతో పంచుకుంటున్నప్పుడు, అతణ్ణి వెంటాడుతున్న ఒడిస్సీ ఏమిటి దాన్నుంచి మనం తెలుసుకోదగ్గది ఏమిటి అన్నదే నన్ను క్షణం కూడా ఏమరనివ్వకుండా కట్టిపడేసింది.

ఒడిస్సీ, రామాయణం లాంటి లాంటి ఇతిహాసాలు కాలం గడిచేకొద్దీ అలిగరీలుగా మారి అసంఖ్యాకమైన వ్యాఖ్యానాలకు అవకాశమిస్తాయి. వాటిలోని విశేషమేమిటంటే అవి ప్రతి ఒక్క వ్యాఖ్యానాన్నీ మన్నిస్తున్నట్టే ఉంటాయి. ఆ కథాగమనం అటువంటి ప్రతి ఒక్క  వ్యాఖ్యానాన్నీ  అంగీకరిస్తున్నట్టే వినిపిస్తుంది. ఒడిస్సీకి కూడా అటువంటి ఎన్నో వ్యాఖ్యానాలున్నాయి. ఒక విధంగా దాన్ని పాశ్చాత్యమానవుడి అంతరంగానికి బాగా చేరువై, అతడి అంతరంగాన్ని దాదాపుగా ప్రతిబింబించే కథగా చెప్పవచ్చు. అందుకనే ఇరవయ్యవ శతాబ్దంలో ఆధునిక రచయితలు తిరిగి మళ్ళా తమ తమ పద్ధతుల్లో ఆ కథ చెప్పడానికి పూనుకున్నారు. జేమ్స్ జాయిస్, నికోస్ కజంట్జికస్, మార్గరెట్ అట్ వుడ్, సైమన్ ఆర్మిటేజి లాంటి రచయితలు ఒడిస్సీని తిరిగి చెప్తున్నప్పుడు ఆ రచనల్ని  ఒకవిధంగా ఒడిస్సీ వ్యాఖ్యానాలుగానే పరిగణించవచ్చు.

ఒడిస్సీ కథని ఎలా అర్థం చేసుకోవాలన్నదానికి పాశ్చాత్య ప్రపంచం ఇచ్చుకుంటూ వస్తున్న వ్యాఖ్యానాల్ని స్థూలంగా మూడు తరహాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి, అది ఒక మానవుడి గృహోన్ముఖ ప్రయాణానికి సంబంధించిన కథగా. రెండవది, అది ఎప్పటికప్పుడు కొత్తదారుల్నీ, కొత్త సీమల్నీ, నూతన అనుభవాల్నీ కోరుకునే అన్వేషకుడి కథగా, మూడవది, అది ఒక చతురమానవుడి కథగా. పెంగ్విన్ సంస్థ ప్రచురించిన ఒడిస్సీ వచన అనువాదానికి ముందుమాట (1991) రాస్తూ పీటర్ జోన్స్ అనే హోమర్ పండితుడు, ఈ మూడింటిలోనూ, రెండవ వ్యాఖ్యానానికి హోమర్ లో అంతగా ఆధారం లేదని చెప్తూ, మూడవ వ్యాఖ్యానం అంటే ఒడేసియస్ ని ఒక anti-hero గా చూడటానికే పూర్వకాలపు గ్రీకులూ, రోమన్లూ ఎక్కువ ఇష్టపడ్డారని రాసాడు.

కానీ ఇప్పుడు నోలాన్ వ్యాఖ్యానం ఈ మూడు మూసల్నీ దాటి ఒడిస్సీని మళ్ళా సరికొత్తగా చదవడానికి ప్రయత్నించింది అన్నది నేను గమనించిన సంగతి. దాన్ని ముందు నాకై నేను అర్థం చేసుకోడానికి ప్రయత్నించాను. అంటే ఒడేసియస్ ని హోమర్ చిత్రించడంలో లేవనెత్తిన కొన్ని ప్రశ్నలు ( లేదా ఆ కథ మనకి చెప్తూ నోలాన్ లేవనెత్తిన ప్రశ్నలు) నన్ను ఆలోచనలో పడేసాయి. అలా ఏ కావ్యం తన వ్యాఖ్యాతనీ, మనల్నీ కూడా ఎప్పటికప్పుడు విభ్రాంతపరుస్తుందో దానే మనం మహాకావ్యంగా పరిగణిస్తాం. అంతే తప్ప కేవలం వర్ణనాబలమో లేదా అభిప్రాయబలమో ఒక సాహిత్యకృతికి సార్వకాలికతను సాధించిపెట్టలేదు.

మనసులేనితనం పట్ల ఆగ్రహం

నోలాన్ చెప్పిన ఒడెస్సీ కథలో కనీసం మూడు ఇతివృత్తాలు మొదటినుంచీ ముప్పేటగా అల్లుకుని కనబడ్డాయి. మొదటిది, ఒక ఇతిహాసాన్ని సినిమాగా మలుస్తున్నప్పుడు, అందులో నాటకీయత కోసం నోలాన్ ఆ narrative ను తీవ్రీకరించిన పద్ధతి. ఆ కథలో అతడు Antinous ను ప్రతినాయకుడిగా చూపించడం. గ్రీకులో antinous అంటే anti-mind. అంటే మనసులేని వాడు అని అర్థం. ఒడేసియస్ అనే పదం odussomai అనే ధాతువు నుంచి, అంటే కోపగించుకోవడం అనే అర్థాన్నిచ్చే పదంలోంచి పుట్టింది.  కాబట్టి ఒడేసియస్ అంటే కోపగించుకునేవాడు అని అర్థం. అతడు దేనిపట్ల కోపగించుకున్నాడు? ఈ ప్రశ్నకి అర్థం వెతకడంకోసమే నోలాన్ ఈ సినిమా తీసాడా అనిపిస్తుంది. అతడు మనిషి మనిషిగా ప్రవర్తించకపోవడం పట్ల కినుక వహిస్తూ వచ్చాడు. మొదట్లో కినుకగా ఉన్నది కాస్తా చివరికి Antinous పట్లా, తన ఇంటిమీద పడి దోచుకుతింటున్న తోటి ప్రభువర్గం పట్లా తీవ్రాతితీవ్రమైన ఆగ్రహంగా మారడం మనం చూస్తాం. మనుషుల్లో మనసు పూర్తిగా అడుగంటిపోతే తప్ప అలా ఒక కుటుంబమ్మీద పడి మూడేళ్ళ పాటు దోచుకుని తింటూ ఉండరు. మరీ ముఖ్యంగా  Antinous జీవితం ఒడేసియస్ ఒకప్పుడు చూపించిన క్షమాభిక్ష. అటువంటిది అతడు ఒడేసియస్ పట్ల గాని, అతడి భార్యపట్ల గాని, అతడి కొడుకుపట్లగాని ఎటువంటి క్షమనీ చూపించకపోవడమే ఒడేసియస్ కి అంత ఆగ్రహకారణమైంది. ఎన్నో పొరలుపొరలుగా పేరుకుని ఉన్న ఒక ఇతిహాసాన్ని మూడుగంటల సినిమాగా మార్చడానికి పూనుకున్నప్పుడు దాని ఇతివృత్తాన్ని ఇలా సరళీకరించి తీవ్రీకరించడంలో నోలాన్ కృతకృత్యుడయ్యాడు.

ఒక యుగాంత కథ

రెండవది , నీ ద్వీపానికి, నీ తీరానికి, నీ నగరానికి, నీ ఇంటికి అతిథిగా వచ్చిన ఆగంతకుణ్ణి సాదరంగా స్వాగతించవలసిన దైవశాసనానికి సంబంధించింది. ఈ నీతి సూత్రాన్ని గ్రీకులో xenia అంటారు. అంటే మన సంప్రదాయంలో ‘అభ్యాగతః స్వయం విష్ణుః’ అనుకుంటామే అలా అన్నమాట. అపరిచితులు, విదేశీయులు, వికాలాంగులు, నిరాశ్రయులు గౌరవానికి పాత్రులనేది ఒక దైవశాసనం. అంటే నువ్వు నీ ఇంటికొచ్చిన అతిథిని గౌరవించకపోయినా, లేక నువ్వు యుద్ధం కోసమే కావచ్చు, అడుగుపెట్టిన మరొకస్థలంలో, మరొకదేశంలో మానవుడిగా ప్రవర్తించకపోయినా, దాని పర్యవసానం నుంచి నువ్వు తప్పించుకోలేవు అనేది.

పదేళ్ళపాటు వేచి చూసినా ట్రాయి నగరం గ్రీకులకి పట్టుబడలేదు. అది చివరికి ఒడేసియస్ చతురత వల్ల మాత్రమే సాధ్యమైంది. కానీ తీరా ఆ గ్రీకు సైన్యాలు ఆ అర్థరాత్రి ట్రాయి నగరంలో అడుగుపెట్టాక చేసిందేమిటి? పదేళ్ళ పాటు అణచిపెట్టుకున్న కోపం, కసి వాళ్ళని రాక్షసులుగా మార్చేసాయి. ‘మనుషుల మధ్య ఉన్న ప్రతి ఒక్క పవిత్ర అనుబంధాన్నీ మేం ఉల్లంఘించాం ‘ అని చెప్తాడు ఒడేసియస్ అణచిపెట్టుకుంటున్న దుఃఖంతో. ఒక రకంగా ఇది ఓపెన్ హీమర్ కథ కూడా. తాము ఏ విధంగానూ లొంగదీసుకోలేకపోతున్న జపాన్ ని అమెరికా ఒక ఆటంబాంబుతో లొంగదీసున్న కథ. ఆటం బాంబు ప్రయోగం తర్వాత, ఆ బాంబుని కనిపెట్టిన, ఓపెన్ హీమర్ ఎటువంటి ఉద్విగ్నతకి లోనయ్యాడో అటువంటిదే Trojan Horse ని రూపొందించిన ఒడేసియస్ కూడా ఈ సినిమాలో లోనవుతాడు. సినిమా మొత్తం ఈ ఇతివృత్తం చుట్టూతానే తిరిగింది. అందుకని నోలాన్ ఒడిస్సిని ఒక యుగాంత కథగా భావించాడు. (మన దగ్గర కూడా మహాభారతాన్ని ప్రధానంగా ఇటువంటి యుగాంత కథగా చదివే ఒక సంప్రదాయం ఉంది.) తాము ధ్వంసం చేసింది ఒక్క ట్రాయి నగరాన్ని మాత్రమే కాదనీ కాంస్య యుగపు సమస్త విలువల్నీ, కాస్య యుగ దేవతల్నీ,  కాంస్య యుగ సభ్యతనీ అనే ఎరుక ఒడేసియస్ కలగడమే ఈ కథలోని కీలక పరిణామం.

కాబట్టి మనకి ఈ కథ వింటున్నంతసేపూ, ఇది ఒక ప్రాచీన కాలపు కథ కాదనీ, అత్యంత సమకాలికమైన కథ అనీ పదే పదే స్ఫురిస్తూ ఉంటుంది. ఏ గ్రీకు నాగరికతకీ, విజ్ఞానానికీ, హేతువాదశీలతకీ తాము వారసులమని పాశ్చాత్యులు భావిస్తూ వచ్చారో, అదే పాశ్చాత్యులు ఆగంతుకులుగా ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ద్వీపాలమీద అడుగుపెట్టినప్పుడు, అక్కడి మనుషులు తమని ఆదరించినప్పుడు, తాము తిరిగి వారిని ఆదరించకపోగా, వారిని అమానుషంగా వేటాడూ వచ్చిన కలొనియల్ యుగ చరిత్ర మొత్తం మన మనసులో చుట్టు తిరుగుతుంది.

నువ్వు ఒక ఆగంతుకుణ్ణి ఎందుకు ఆదరించాలంటే, అతడు మారువేషంలో ఉన్న ఒక దేవత అయినందువల్ల మాత్రమే కాదు, రేపు నీకు కూడా అటువంటి పరిస్థితి తటస్తించినప్పుడు నీక్కూడా ఆశ్రయం, అన్నం, ఆదరం లభించాలి కాబట్టి. ఒడిస్సీలోని మహోన్నత కావ్యధ్వని ఇక్కడే ఉంది. అతడు తన ఇంటికే తానొక నిరాశ్రయుడిగా, అడుక్కుతినేవాడిగా తిరిగి వచ్చినప్పుడు తన భార్య తనని గుర్తుపట్టకపోయినా ఆమె ముందు తనని ఆదరించడానికి కారణం ఆ దైవశాసనమే. ఇంకా చెప్పాలంటే, ఆమె దాన్ని దైవశాసనం అని కూడా కాకుండా తన భర్త (అంటే ఒడేసియస్ నే ) తన కుపదే పదే చెప్తూ వచ్చాడని మాత్రమే. అంటే ఒడేసియస్ ఏ విలువని నమ్మాడో, ఆచరించమని తన వాళ్ళకి చెప్పాడో చివరికి ఆ విలువనే అతణ్ణి కాపాడింది. కాబట్టి నోలాన్ ఈ సినిమా ద్వారా తన కాలం నాటి పాశ్చాత్యసమాజానికి చెప్తున్న సందేశాన్ని మనం ఇక్కడ స్పష్టంగా పోల్చుకోవచ్చు.

తోటిప్రాణిపట్ల దయచూపడమే నిజమైన దైవశాసనం

ఇక మూడవది, మరింత సున్నితమైనదీ, సూక్ష్మమైందీనూ. హోమర్ ఇలియడులో అకిలిస్ క్రోధం ప్రధాన ఇతివృత్తం. ఒక వీరుడు కోరుకునేది మనభాషలో చెప్పాలంటే వీరస్వర్గం. దాన్ని గ్రీకులు kleos అన్నారు. అంటే నీ గురించి నలుగురూ ఏం చెప్పుకుంటారనేది. దాన్ని యశం అనవచ్చు. కాయం నశిస్తుంది. కాని యశఃకాయం అజరామరం. అయితే అదొక్కటే విలువ కాదు, ఒక మనిషి యుద్ధంలో విజయం సాధించి తిరిగి స్వదేశానికి రాగలిగితే, స్వజనాన్ని చేరగలిగితే, స్వగృహంలో అడుగుపెట్టగలిగితే, అప్పుడు ఆ మనిషికి పూర్తి ఫలం లభించినట్టు. ఈ గృహోన్ముఖ అభిలాషని గ్రీకులు nostos అన్నారు. హోమర్ రెండవ ఇతిహాసం ఒడిస్సీలో ఈ nostos ప్రధాన ఇతివృత్తం అనేది అందరూ అంగీకరించినమాట.

కానీ తీరా ఒడిస్సీ చదవడం మొదలుపెట్టాక, తన గృహోన్ముఖ ప్రయాణాన్ని ఒడేసియస్ తనే కావాలని ఇబ్బందుల పాలు చేసుకుంటూ వస్తున్నాడా అని అనిపించకపోదు. యుద్ధం పూర్తయ్యాక ఇంటికి పోవాలన్న కోరిక అంత బలంగా ఉన్నవాడు తాను కూడా ఆగమెమ్నాన్ తో కలిసి వెళ్ళిపోవచ్చునే! కాని ఎందుకని తాను మరోదారి ఎంచుకుని, ఆ దారిపొడుగునా, ప్రతి ఒక్కసారీ కావాలని ప్రమాదాల్ని వెతుక్కుంటూ పోయాడు? ఇది యుగాలుగా ఒడిస్సీ పాఠకుల్ని కలవరపెడుతున్న ప్రశ్న. తన తండ్రిని చంపిన తన పినతండ్రిని చంపగలిగీ, చంపే అవకాశాలు దొరుకుతున్నా కూడా చంపకుండా హామ్లెట్ చేసిన తాత్సారం లాంటిదే ఇది కూడా. దీన్ని వివరించే ప్రయత్నంలోనే డాంటే, టెన్నిసన్ లాంటి వాళ్ళు ఒడేసియస్ ని ఒక అన్వేషకుడిగా చూసే ప్రయత్నం చేసారు. అంతేకాదు, మరో సమస్య కూడా ఉంది. ఆ దారిపొడుగునా చాలాసార్లు ఒడేసియస్ దైవశాసనాల్ని చిన్నాపెద్దా ఉల్లంఘిస్తూనే వచ్చాడు. తన సహచరులు దైవశాసానికి కట్టుబడి ఉండమని తనతో చెప్తున్నప్పటికీ తాను వాటిని పెడచెవిని పెడుతూ వచ్చాడు. ఒక విధంగా ఆ ఉల్లంఘనలు సముద్రదేవత పొసైడన్ కి ఆగ్రహం తెప్పించినందువల్లనే ఆ మొత్తం బృందమంతా చిక్కుల్లో పడుతూ వచ్చారు. కానీ మళ్ళా ఇదే ప్రశ్న. దైవశాసనాల్ని ఉల్లంఘించకూడదని చెప్పిన సహచరులంతా ఎందుకు మరణించారు? వాటిని ఉల్లంఘిస్తూ వచ్చిన ఒడేసియస్ ఒక్కడూ ఎందుకు ప్రాణాల్తో మిగిలి, చిట్టచివరికి  తన ఇంటికి చేరుకోగలిగాడు? ఇది, ఒకరకంగా,  పాండవుల్లో నలుగురు తమ్ముళ్ళూ, ద్రౌపది కూడా మరణించగా యుధిష్టిరుడు ఒక్కడే (తన కుక్కతో కలిసి) స్వర్గారోహణ చెయ్యడం లాంటిది.

ఈ ప్రశ్నని నోలాన్ ఇలా పరిష్కరించుకున్నాడనిపించింది : అదేమంటే ఒడేసియస్ కి మొదణ్ణుంచీ యుద్ధం పట్ల వ్యామోహం లేదు. తప్పనిసరి పౌరధర్మంగా, సామాజిక ధర్మంగా మాత్రమే అతను కూడా యుద్ధంలో పాల్గొన్నాడు. కాబట్టే  యుద్ధం ముగిసాక తోటి గ్రీకులు జరుపుకుంటున్న విజయోత్సవంలో అతడు భాగం కాలేకపోయాడు. ఒక నిర్లిప్త మనఃస్థితి అతణ్ణి ఆవహించింది. అందుకనే అతను ఆగమెమ్నాన్ తో కలిసి ఇంటిబాట పట్టలేకపోయాడు. తనది విజేతల దారి కాదని అతడికి తెలుసు. అయితే తనని నమ్మి తనతో కలిసి నడుస్తున్న తోటి సైనికులపట్లా, నావికుల పట్లా, అనుచరులపట్లా తనకున్న బాధ్యతని అతడు తిరస్కరించలేదుసరికదా, దాన్ని తన ప్రాణాల కన్నా మిన్నగా తలకెత్తుకున్నాడు. తన అనుచరులకి హాని తలపెట్టినవారిపట్ల అతడు ఎటువంటి కనికరాన్నీ చూపించలేకపోయాడు. అటువంటి సందర్భాల్లో అతడు దైవశాసనాల్ని కూడా పక్కనపెట్టేసాడు. ముఖ్యంగా సైక్లోప్స్ విషయంలో అతడి ప్రవర్తన, పైకి hubris గా కనిపిస్తున్నా, దానికి కారణం ఇదే . అతడికి స్వదేశం చేరడం ఎంత ముఖ్యమో తనని అనుసరిస్తున్న అనుచరులందరినీ క్షేమంగా చేర్చడం కూడా అంతే ముఖ్యం. బతికున్న మనుషుల పట్ల అతడికి ఉన్న ఈ బాధ్యత ముందు యుద్ధంలో తమకోసం చనిపోయినవారి అంత్యకర్మల పట్ల చూపించవలసిన బాధ్యత ఏమంత ముఖ్యమనిపించలేదు. చివరికి తనతో వస్తున్న అనుచరుల్లో అధికభాగాన్ని కాపాడుకోడానికి నలుగైదుగిరిని వదులుకోవలసి వచ్చినా కూడా అతడేమీ సంకోచించలేదు. సిల్లా, చారిబ్డిస్ ల ఉదంతమే దీనికి నిరూపణ.

కానీ అతని అనుచరుల పరిస్థితి మరోలా ఉండింది. వాళ్ళకి కూడా ఎంత తొందరగా ఇంటికి వెళ్ళిపోదామా అని ఉంది. వాళ్ళకి దైవశాసనాన్ని పాటించడం ముఖ్యమేగాని, అది తమకి ఆకలికి అడ్డురానంతవరకే. అదీకాక, తమకేదైనా కష్టం వస్తే ఒడేసియస్ ఏదో ఒక చతురతతో దాన్నుంచి తప్పించగలడని అనుకున్నారు. ఆ క్రమంలో ఒడేసియస్ ఒక్కడే జాగరూక మానవుడిగా ఉంటూ రాగా, వాళ్ళంతా పూర్తిగా తమ తెలివితేటలకి మాత్రమే కాదు, తమలోని మానవీయ చైతన్యానికి కూడా దూరమైపోయారు. సర్సి వాళ్ళని పందులుగా మార్చడానికి ముందే వాళ్ళు మానసికంగా పశువులుగా మారిపోయారు.

తమ తిరుగుప్రయాణంలో ఒడేసియస్ దైవశాసనాల్ని ఉల్లంఘించినట్టు కనబడ్డా, లోతుగా చూస్తే అందులో ఒక సూక్ష్మ జాగరూకత కనిపిస్తుంది. తన అనుచరుల్ని ఎవరేనా బాధించినప్పుడు మాత్రమే అతడు దైవశాసనాన్ని కూడా పక్కనపెట్టాడు. కృష్ణుడు అర్జునుడి కోసం యుద్ధంలో కర్ణుడిపట్ల అన్ని ధర్మాల్నీ పక్కనపెట్టడం లాంటిదిది. కానీ సూర్యుడి గోవులు తన అనుచరులకు ఎటువంటి హానీ కలిగించనప్పుడు కూడా,  వాళ్ళు ఆకలికి ఆగలేక ఆ గోవుల్ని వధించి తిన్నప్పుడు మాత్రం తాను వాళ్ళని కాపాడలేనని ఒడేసియస్ కి అర్థమయింది. తన అనుచరులే కాదు,  తను కూడా అప్పుడు ఆకలితో ఉన్నాడు కదా. కాని ఒడేసియస్ అక్కడ తన ఆకలిని అణచుకోగలిగాడు. అంటే అక్కడ దైవశాసనానికి పూర్తి విధేయంగా నడుచుకున్నాడు. అదే అతణ్ణి కాపాడింది. పన్నెండు నౌకల్తో తిరుగు ప్రయాణం మొదలుపెట్టినవాడు చివరికి తాను ఒక్కడే స్వదేశానికి చేరుకోగలడంలోని అంతరార్థం అదే.

నోలాన్ మనకి చెప్తున్నదేమంటే, మన చుట్టూ కూడా దైవం గురించీ, పవిత్రత గురించీ, ఆధ్యాత్మిక ధర్మాల  గురించీ మాట్లాడేవారు తక్కువేమీ లేరు. కానీ వాళ్ళు దైవం పట్ల విధేయతని మాటల్లో మాత్రమే చూపిస్తూ, తమ పాశవిక ప్రవృత్తుల్ని మాత్రం యథేచ్ఛగా పబ్బం గడుపుకుంటూనే ఉన్నారు. అందుకనే వాళ్ళ piety, charity వాళ్ళనీ గట్టెక్కించవు, వాళ్ళని నమ్ముకున్నవాళ్ళనీ గట్టెక్కించవు. నిజమైన విముక్తి ఇష్టాపూర్తాల్లో లేదని అంటున్నప్పుడు యుగాల కిందట ముండకోపనిషత్తు బిగ్గరగా చెప్తున్నది ఈ విషయమే. ఇష్టాపూర్తం అంటే చెరువులు తవ్వించడం, దేవాలయాలు నిర్మించడం లాంటి ధార్మిక కార్యకలాపం. వాటన్నిటికన్నా కూడా తోటిప్రాణి పట్ల నిబద్ధత కలిగి ఉండటమే  దైవం పట్ల నువ్వు చూపించగల అత్యున్నత విధేయత. తోటిప్రాణి మనిషినే కానక్కరలేదు, ఒక కుక్క కూడా కావచ్చు. తన అనుచరుల్ని బతికించుకునే ఆత్రుతలో చనిపోయినవారి అంత్యకర్మల గురించి ఆలోచించని ఒడేసియస్ ఇథకాలో అడుగుపెట్టాక, తన కోసం పదేళ్ళుగా ఎదురు చూస్తున్న తన కుక్క తన చేతుల్లో మరణించినప్పుడు, చెప్పిన మొదటిమాట, దానికి సగౌరవంగా శిఖరాగ్రమ్మీద అంత్యక్రియలు నిర్వహించమనే.

నేరుగా వాచ్యంగా చెప్పకపోయినా నోలాన్ తన కాలం నాటి అంటే మన కాలం నాటి fundamentalist శక్తులకి  చెప్తున్నదిదే. మీరు మీ తోటిప్రాణికోసం దైవ శాసనాన్ని పక్కన పెట్టినా తప్పులేదు. విశ్రాంతిదినం రోజు  ఒక మేకపిల్ల తప్పిపోతే దానికోసం మీరు వెతుక్కుంటూ పోరా అని యేసు పరిసయ్యుల్ని ప్రశ్నించడంలో ఉన్నది ఈ అనుతాపమే. దైవం పట్ల ఒడేసియస్ చూపించిన విధేయత horizontal, అది తన చుట్టూ ఉన్న ప్రపంచంలో దైవాన్ని వెతుక్కునదే తప్ప vertical కాదు, అంటే తన జీవితానికి సార్ధకత కోసం ఆకాశం వైపు చూసేది కాదు.

తిరుగు ప్రయాణంలో ఒడేసియస్ మొత్తం పన్నెండు స్థలాల్లో అడుగుపెట్టాడు. ఆ మొత్తం సందర్శనలన్నింటినీ నోలాన్ తన కథలో చెప్పలేదు. తాను ఒడేసియస్ లో కనుగొన్న ఈ మానవీయ పార్శ్వాన్ని వివరించగలిగిన ఉదాహరణలు మాత్రమే అతడు సినిమాలోకి తీసుకొచ్చాడు. ఈ కీలకం గ్రహించకుండా అతడు ఒడిస్సీనీ మక్కీకి మక్కీ అనువదించలేదనడంలో అర్థం లేదు. అందుకని నోలాన్ చూపించిన ఒడేసియాస్ కాంస్య యుగపు hero కాదు, కాలాతీతమైన anti-hero. అటువంటి మనిషిని దేవతలు కూడా ఇష్టపడతారు.

ఇక ఇమాజినేషన్ విషయానికి వచ్చినప్పుడు సినిమాలో సైక్లోప్స్ ని చిత్రించిన తీరులాంటివి సహజంగానే ఏ  దర్శకుడైనా ఊహించగలిగిన చిత్రణలే. కానీ నోలాన్ నన్ను కూడా నివ్వెరపరిచిన చిత్రణలు మూడు కనిపించాయి.  ఒకటి, ఏ వదనం కోసం వేలాది నౌకలు యుద్ధ సుడిగుండంలో అడుగుపెట్టాయో ఆ హెలెన్ గా ఒక నల్లజాతి స్త్రీని చూపించడం. రెండవది, సర్సి ఒడేసియస్ అనుచరుల్ని పందులుగా మార్చిన దృశ్యం. ఇక మూడవది, నా ఊహకి కూడా అందని చిత్రణ, ఒడేసియస్ ముందు నరకం ప్రత్యక్షం కావడం. ఇటువంటి చిత్రణలు కేవలం సాంకేతిక ప్రతిభ వల్ల మాత్రమే సాధ్యమయ్యేవికావు. ఒక text ని పదే పదే చదువుతూ, మననం చేస్తూ, సంభావిస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి ఊహలు స్ఫురిస్తాయి.

ఒక్కమాటలో చెప్పాలంటే నోలాన్ తీసిన ఒడెస్సీ చూస్తున్నంతసేపూ అది నాకు హోమర్ నే మరొకసారి మరింత లోతుగా మరింత కొత్తగా చదువుతున్నట్టుగా అనిపించింది. ఆ ఐతిహాసిక ప్రపంచంలోకి ప్రయాణించడానికి నోలాన్ ఒక కొత్త రూటుమాపు తయారుచేసాడుకానీ, ఆ ప్రపంచం మాత్రం ఇంకా హోమర్ ఆధీనంలోనే ఉందన్నది నిశ్చయమైంది.


Nolan’s Odyssey: A Fresh Interpretation of a Timeless Epic

I hadn’t expected to watch Christopher Nolan’s Odyssey so soon, but yesterday Pramod insisted and took me along. Since we watched it in a standard theater, we couldn’t fully experience the film’s grandeur of technical magic. But in a way, that turned out to be a good thing: rather than its technical side, it gave me an opportunity to rediscover, up close and deeply before my eyes, the narrative craft of the epic. The singular feeling I was left with after the film ended was this: Homer surpasses the cinematic medium.

Generally, when a director like Nolan steps up to bring a story like this to the screen, there are two elements that can thrill an audience. First is the story itself. As we listen to it, it strikes us simultaneously as a narrative and, on another plane, as a supreme allegory. Every word, every deed, every turn opens countless doors in our minds. In that song woven by an ancient poet about an ancient human life, sparks and insights regarding my current life and our collective lives rise and fall like waves, transforming the listening into a profound aesthetic experience (rasanubhava). Second is the visual imagination. When reading it as poetry, no visual medium can match the mythic imagination we construct in our minds. Yet, when directors like him use cutting-edge technology to give visual form to that imagination, there is undeniable joy in watching it. In a sense, we can view this visualization as a commentary on the epic. But in my view, this holds only second place. Watching this film left me with the exact same impression.

That is why, throughout the film, what held me spellbound without a moment’s distraction was observing how the director understood the Odyssey—which parts he left out, which parts he magnified, and what kind of Odyssey was haunting him as he shared his reading experience with us. What is it that we ought to learn from it?

Epics like the Odyssey and the Ramayana turn into allegories over time, inviting endless interpretations. Their specialty is that they seem to honor every single interpretation; the narrative flow appears to accept each one. The Odyssey, too, has many such interpretations. In a way, it can be called a story that lies very close to the inner psyche of Western man, almost mirroring it. That is why modern 20th-century writers set out to retell that story in their own ways. When writers like James Joyce, Nikos Kazantzakis, Margaret Atwood, and Simon Armitage retell the Odyssey, those works can be considered commentaries on the epic.

The interpretations the Western world has provided to understand the story of the Odyssey can be broadly categorized into three types: a) as the story of a man’s journey homeward (nostos), b) as the story of an explorer perpetually seeking new paths, new realms, and new experiences, and c) as the story of a clever, resourceful man (polytropos).

In his introduction to the Penguin prose translation of the Odyssey (1991), Homeric scholar Peter Jones noted that among these three, the second interpretation has little basis in Homer himself. He wrote that ancient Greeks and Romans preferred the third interpretation—viewing Odysseus as an anti-hero.

However, what I observed is that Nolan’s interpretation attempts to transcend these three molds to read the Odyssey anew. I first tried to process this for myself. That is, certain questions raised in Homer’s depiction of Odysseus (or the questions raised as Nolan tells us the story) set me deep in thought. Any epic that mystifies its commentator and its readers anew at every turn is what we truly consider a masterpiece (Mahakavya). Descriptive power or ideological strength alone cannot secure timelessness for a literary work.

In Nolan’s telling of the Odyssey, at least three themes appeared intricately interwoven from the start:

1. Anger over lack of empathy

The first is the way Nolan intensified the narrative for dramatic impact while adapting an epic into a film—specifically, depicting Antinous as the primary antagonist. In Greek, Antinous means ‘anti-mind’ —one who is devoid of mind or empathy. The name Odysseus derives from the root odussomai, meaning ‘to be angry’ or ‘to cause/feel wrath.’ Thus, Odysseus is ‘the angry one.’ What was he angry about? It feels as though Nolan made this film to search for the answer to this question.

Odysseus grew resentful over people failing to act like human beings. What began as resentment eventually transformed into fierce, burning rage toward Antinous and the surrounding suitors who descended upon his home to plunder it. Unless empathy has completely dried up in human beings, they do not prey upon a family and consume their wealth for three straight years. More importantly, Antinous’s life was once saved by an act of mercy shown by Odysseus. Yet, he showed no mercy toward Odysseus, his wife, or his son—and this total lack of gratitude and empathy was the root cause of Odysseus’s immense rage. In attempting to condense a multi-layered epic into a three-hour film, Nolan succeeded in simplifying and intensifying its core theme this way.

2. An end-of-an-era narrative

The second theme relates to the divine commandment that requires one to warmly welcome a stranger who arrives as a guest at one’s island, shore, city, or home. This ethical principle is called Xenia in Greek—akin to what we refer to in our tradition as ‘ Abhyagatah Svayam Vishnu‘ (the unannounced guest is God Himself). Strangers, foreigners, the disabled, and the homeless are worthy of respect by divine decree. That is to say: if you fail to respect a guest in your house, or if you fail to act humanely in another land or country where you have set foot—even if for war—you cannot escape the consequences.

Even after ten years of siege, the city of Troy did not fall to the Greeks; it was made possible only through the cunning of Odysseus. But what did the Greek armies do once they stepped inside Troy that midnight? A decade of pent-up rage and malice turned them into monsters. ‘We violated all that’s ever sacred between people‘ Odysseus says with suppressed grief. In a way, this is also the story of Oppenheimer—the story of America subduing a non-yielding Japan with an atomic bomb. The emotional turmoil Oppenheimer suffered after inventing and deploying the atomic bomb is similar to what Odysseus experiences in this film as the architect of the Trojan Horse. The entire movie revolves around this motif. Hence, Nolan treats the Odyssey as an end-of-an-era narrative (much like our tradition of reading the Mahabharata primarily as an epochal decline). The key realization in this story is Odysseus’s awareness that they destroyed not just the city of Troy, but the entire value system, the deities, and the civilization of the Bronze Age.

Therefore, as we listen to this story, it repeatedly strikes us not as an ancient tale, but as an intensely contemporary one. The Western world, which considers itself the heir to Greek civilization, science, and rationality, acted as strangers arriving on the shores of Asia, Africa, and Australia. When the native peoples welcomed them, the colonizers failed to offer refuge in return; instead, they hunted them down inhumanely. The entire history of the Colonial Era flashes before our minds.

Why must you honor a stranger? Not merely because they might be a deity in disguise, but because if you ever face a similar fate tomorrow, you too will need shelter, food, and compassion. Here lies the magnificent poetic resonance (kavya-dhvani) of the Odyssey. When Odysseus returns to his own home as a destitute beggar, even if his wife does not recognize him at first, her reason for welcoming him is that very divine law. More accurately, she honors it not just as a abstract divine law, but as something her husband (Odysseus himself) repeatedly instructed her to uphold. In other words, the very value Odysseus believed in and practiced ultimately saved him. Thus, we can clearly discern the message Nolan is conveying to the Western society of his time.

3. To love thy neighbour is the highest worship of the Divine

The third theme is even more delicate and subtle. In Homer’s Iliad, Achilles’ wrath is the central theme. What a warrior desires, in our terminology, is Veerasvargam (a warrior’s heaven). The Greeks called this kleos—glory, or what people say about you. It is fame. The physical body perishes, but the body of fame (yasa-kaya) is immortal. However, that is not the only value. If a man can win a war and return to his homeland, rejoin his people, and step into his own house, then he has achieved complete fulfillment. The Greeks called this homeward longing nostos. It is universally accepted that nostos is the central theme of Homer’s second epic, the Odyssey.

Yet, once you begin reading the Odyssey, it hard to avoid feeling that Odysseus intentionally brings troubles upon his own homeward journey. If his desire to go home after the war was so strong, why didn’t he simply sail back alongside Agamemnon? Why did he choose a different path and deliberately seek out dangers at every turn? This question has troubled readers of the Odyssey for ages—much like Hamlet’s procrastination in killing his uncle, despite having both the reason and the opportunity. In trying to explain this, figures like Dante and Tennyson viewed Odysseus as an eternal explorer. Furthermore, there is another issue: along the way, Odysseus repeatedly breaks divine laws, big and small. Even when his companions plead with him to adhere to divine ordinance, he turns a deaf ear. In a way, those transgressions anger the sea god Poseidon, plunging the entire crew into trouble.

But this brings us back to the core question: Why did all the companions who urged obedience to divine law perish, while Odysseus—the one who kept breaking those laws—remained the sole survivor to reach home? In a way, this resembles Yudhishthira ascending to heaven alone (along with his dog), while his four brothers and Draupadi perish along the journey.

Nolan seems to resolve this question as follows: Odysseus never had a obsession with war in the first place. He participated in the war only out of mandatory civic and social duty. That is why, once the war ended, he could not partake in the victory celebrations of his fellow Greeks. A state of detachment overwhelmed him; he knew his path was not that of the conquerors, which is why he could not set sail with Agamemnon. However, far from rejecting his responsibility toward the soldiers, sailors, and followers who trusted and walked with him, he held that responsibility higher than his own life. He showed no mercy to those who harmed his men—and in such moments, he even set aside divine laws. His behaviour with the Cyclops, though appearing as hubris on the surface, stems from this very drive. Returning to his homeland was vital, but bringing every follower back safely was equally crucial. Before this responsibility to the living, the duty to perform last rites for those already fallen in battle seemed less urgent. Ultimately, even if he had to sacrifice four or five men to save the majority of his crew, he did not hesitate—as proven in the episode of Scylla and Charybdis.

His crew, however, was in a different state of mind. They were merely anxious to get home quickly. Following divine law was important to them, but only so long as it didn’t interfere with their hunger. Moreover, they assumed that whenever trouble struck, Odysseus would use his cleverness to bail them out. In that process, while Odysseus remained the sole vigilant human being, the crew became disconnected not only from their own intellect, but from their human consciousness altogether. Long before Circe turned them into swine, they had mentally descended into beasts.

Though Odysseus appeared to break divine laws on their return journey, a closer look reveals a subtle, vigilant awareness. He set aside divine law only when someone harmed his companions—much like Krishna setting aside all rules of dharma against Karna for Arjuna’s sake. But when the Cattle of the Sun posed no threat to his crew, and the men slaughtered and ate them out of uncontrollable hunger, Odysseus knew he could not save them. Odysseus himself was starving then, yet he restrained his hunger. He rendered complete obedience to the divine law there, and that is what saved him. That is the inner meaning behind why a man who set sail with twelve ships ultimately reached his homeland alone.

Nolan is telling us that there is no shortage of people around us who speak of God, sanctity, and spiritual righteousness. Yet, they render obedience to God only in words, while freely indulging their brute instincts. That is why their piety and charity fail to save them or those who rely on them. When the Mundaka Upanishad proclaimed ages ago that true liberation does not lie in Ishta-Purta, it was shouting this exact truth. Ishta-Purta refers to ritualistic religious acts like digging wells or building temples. Higher than all of that is commitment to your fellow living beings—that is the highest obedience you can render to the Divine.

That fellow being need not even be a human; it can be a dog. Odysseus, who had no time to ponder burial rites for the dead while frantically trying to keep his crew alive, utters his very first words upon landing in Ithaca—after his dog, who waited ten years for him, dies in his arms—to order a dignified funeral for it on the clifftop.

Though not stated explicitly, this is what Nolan is communicating to the fundamentalist forces of his time—our time. There is no sin in setting aside a rigid divine commandment for the sake of a fellow creature. This is the very compassion behind Jesus asking the Pharisees whether they wouldn’t go searching for a single lost lamb on the Sabbath. Odysseus’s obedience to the Divine was horizontal—seeking God in the world around him—rather than vertical, looking up at the sky to validate his existence.

Odysseus stepped onto twelve different shores during his return journey. Nolan did not depict all of those visits in his narrative. He brought into the film only those examples that could illuminate this human dimension he discovered in Odysseus. Without grasping this key, it is pointless to complain that he didn’t translate the Odyssey word for word. Thus, the Odysseus shown by Nolan is not a Bronze Age hero, but a timeless anti-hero—a human whom even the gods favour.

When it comes to visual imagination, depictions like the Cyclops are what any capable director might conceive. But three depictions by Nolan left me stunned: a) casting a Black woman as Helen—the face for which thousands of ships were launched into the whirlpool of war, b) the scene where Circe transforms Odysseus’s crew into swine, and c) a depiction beyond my own imagination: the physical manifestation of the Underworld before Odysseus.

Such imagery isn’t achieved through technical prowess alone. Such visions spark only when one reads, re-reads, meditates upon, and deeply contemplates a text time and again.

In a word, while watching Nolan’s Odyssey, it felt as though I was reading Homer once more—deeper and anew. Nolan created a fresh route map to travel into that epic world, but it is certain that the world itself remains under the sovereign domain of Homer.

20-7-2026

5 Replies to “నోలాన్  ఒడిస్సీ”

  1. What an insightful review, Sir!

    I haven’t read Homer’s Odyssey or watched this film yet, but after reading your earlier posts on the Odyssey and now these perspectives you’ve shared on Nolan’s version, I feel I have some meaningful background before experiencing the movie.

    Looking forward to watching it with these reflections in mind. 😊

  2. Excellent Review & Analysis భద్రుడు గారు. నేను ఈ సినిమా రిలీజ్ అయిన రోజే చూసాను. హోమర్ కావ్యం ఒడిస్సీ గురించి నాకు తెలిసినంత వరకూ అనేకన్నా నాకర్థమయినంతవరకూ Nolan తీసిన విధానం ప్రేక్షకుడికి కథ మానవీయ కోణంలో అర్థమయ్యేలా చెప్పడం లో కృతకృత్యుడయ్యానించింది. ఇప్పుడు మీ సమీక్ష, విశ్లేషణతో ఆ సినిమా మరోసారి చూడాలనిపించేలా చేశారు.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading