ఆళ్ళ గురుప్రసాదరావు

మంచివాళ్ళని తలుచుకునేకొద్దీ ఆనందం అధికమవుతుంది అన్నాడు గురజాడ. మా బామ్మగారిని తలుచుకున్నప్పుడూ, నా తల్లిదండ్రుల్ని తలుచుకున్నప్పుడూ, నాకు చిన్నప్పుడు విద్యాబుద్ధులు నేర్పించిన గురువుల్ని తలుచుకున్నప్పుడూ అనుభవంలోకి వచ్చే ఈ మాట ఆళ్ళ గురుప్రసాదరావుగారిని తలుచుకున్నప్పుడు కూడా గుర్తొస్తూనే ఉంటుంది.

గురుప్రసాదరావు గారు ఈ లోకాన్ని వీడిపోయారని తెలిసినప్పుడు ఏవో నాలుగు వాక్యాలు రాయడం నాకు చాత కాదనిపించింది. ఎందుకంటే అటువంటి మనుషులకి జరామరణాలుండవు. వాళ్ళ ఆత్మీయతా స్పర్శ ఎప్పటికీ మనల్ని అంటిపెట్టుకునే ఉంటుంది. వాళ్ళ తలపు కలిగినా లేదా వాళ్ళ ప్రస్తావన వచ్చినా వాళ్ళింకా జీవించి ఉన్నారనే అనిపిస్తూ ఉంటుంది.  

ఆయనతో నాకు ఎక్కువ సాన్నిహిత్యం లేకపోవచ్చు, మేము కలుసుకున్న సందర్భాలు వేళ్ళ మీద లెక్కపెట్టేవే కావచ్చు, కలుసుకున్నప్పుడు కూడా మేమేదో విస్తారంగా మాట్లాడుకున్నదీ లేకపోవచ్చు. కాని అటువంటి మనుషుల్ని ఒక్కసారి చూసినా కూడా ఆ ప్రభావం నీ జీవితం పొడుగునా కూడా ఉంటుంది. కొందరు మనుషుల్ని చూస్తే కస్తూరి పరిమళం గుప్పుమంటుంది అని రూమీ అన్నది బహుశా ఇటువంటి వారిని ఉద్దేశించే కావచ్చు.

ముప్ఫై ఏళ్ళ కిందటి మాట. అప్పట్లో నేను పాడేరులో పనిచేస్తున్నాను. చలంగారి శతజయంతి ఒక ఉద్యమంలాగా తెలుగునాట నడుస్తున్న రోజులు. ఆ సందర్భంగా ‘నూరేళ్ళ చలం’ పేరిట  కాకినాడలో కూడా ఒక మీటింగు పెడుతున్నారని చెప్తూ మా అక్క నన్ను కూడా మాట్లాడమని అడిగింది. ఆ మీటింగులో ఇస్మాయిలుగారూ, వావిలాల సుబ్బారావు గారూ మాట్లాడేరు. వారితో పాటు నేను కూడా మాట్లాడేను. ఆ రోజే మొదటిసారి గురుప్రసాదరావుగారి పరిచయం. అప్పటికే మా అక్క ఆయన వ్యక్తిత్వం గురించీ, నిజాయితీ గురించీ, చలంగారితోనూ, సౌరిసుతోనూ వారికున్న అనుబంధం గురించి చాలా చెప్పింది. ముఖ్యంగా సౌరిసుగారు భీమిలిలో ఉన్నప్పుడు ఆ ‘స్నేహకుటి’ కి ఆయన  అందించిన తోడ్పాటు గురించీ చెప్పింది.  మొదటిసారి కలుసుకున్నప్పుడే  ఆయన ప్రసన్న వదనం, ముఖ్యంగా అత్యంత నిర్మలమైన ఆ మందహాసం నెమ్మదిగా, దాదాపు గొంతులోంచి కాకుండా నేరుగా గుండెలోంచే మాటలు బయటికొస్తున్నాయా అన్నంత సౌమనస్యం మూర్తీభవించిన ఆ సన్నిధి నన్ను ఆకట్టుకున్నాయి. ‘మిమ్మల్ని తీసుకుని ప్రతి ఊళ్ళోనూ నాన్నగారి గురించి మాట్లాడించాలని ఉంది’ అన్నారాయన. ఆయన ‘నాన్న ‘అని అంటూ ఉంటే, చిన్నప్పుడే ఇంట్లోంచి వెళ్ళిపోయిన చలంగారి కొడుకు మళ్ళా ఈయన రూపంలో వెనక్కి వచ్చాడా అనిపించింది.  కాని అప్పటి నా ఉద్యోగ జీవితం వల్ల ఊరూరా వెళ్ళి మాట్లాడే అవకాశం లేకపోవడం అలా ఉంచి, ఆయన్నే కలుసుకోడానికి వీలు చిక్కింది కాదు.

తర్వాత మళ్ళా 2010 లో అనుకుంటాను,చలం ఫౌండేషను తరఫున,  విజయవాడలో ఒక సమావేశం ఏర్పాటు చేసారు. వావిలాల సుబ్బరావు గారు అధ్యక్షత వహించిన ఆ సభలో కడియాల రామ్మోహన రాయి గారితో పాటు నేను కూడా ప్రసంగించేను. ఆ రోజు ఎందుకో రామ్మోహనరాయి తన ప్రసంగాన్ని చలంగారికి పరిమితం చెయ్యకుండా, చలం గారినీ, కుటుంబరావుని పోలుస్తూ చలంగారిని తక్కువ చేసే  మాటలేవో మాట్లాడేరు. బహుశా ఆ సమావేశంలో మాట్లాడేవాళ్ళంతా చలంగారిని పొగుడుతూ ఉంటేనే ఏం బావుంటుంది, కాబట్టి మరో దృక్కోణంలోంచి కూడా మాట్లాడాలని రామ్మోహనరాయి అనుకుని ఉండవచ్చు. కాని ఆ మాటలు నన్ను చాలా ఇబ్బంది పెట్టాయి. అందుకని నేను కుటుంబరావు ఒక రచయితగా చలంగారికి ఎందుకు సాటికాడో వివరంగానూ, ఒకింత గట్టిగానూ మాట్లాడేను. ఆ కథ అక్కడితో అవలేదు. అక్కడ ఆ రోజు సభలో ఉన్న వామపక్షవాది తన పత్రికలో సమావేశంలో మొత్తం జరిగినదంతా రాయకుండా, నేను కుటుంబరావు గురించి మాట్లాడిన మాటలే పాక్షికంగానూ, అసంపూర్ణంగానూ రాసి మరొక వివాదానికి ఆజ్యం పోసాడు. ఆ సమావేశం అయిపోయిన ఇన్నేళ్ళ తరువాత కూడా ఆ అసంపూర్తి వార్తానివేదికని పట్టుకుని ఆ వివాదాన్ని ఎవరో ఒకరు  కొనసాగిస్తూనే ఉన్నారు. ఇదంతా ఎందుకు చెప్పానంటే, స్వయంగా లాయరైన గురుప్రసాద రావుగారు, చలంగారి తరఫున నేను తీసుకున్న వకాల్తా ని సంపూర్ణంగా నెరవేర్చానన్నట్లుగా, ఆ రోజు  ఆదరపూర్వకంగా నాతో ఒక కరచాలనం చేసారు. ఎన్ని వివాదాలనైనా మరపించే శక్తి . ఆ ఒక్క కరస్పర్శకి ఉన్నట్టుగా నాకు అనుభవంలోకి వచ్చింది.

అలాగని ఆయన ఒక్క చలంగారికే అభిమాని అనడానికి లేదు. తన మనసుకి నచ్చిన ఏ రచయితకైనా, కవికైనా, వక్తకైనా ఆయన తన గుండెని గుడిగా కట్టడానికి సిద్ధంగా ఉండేవారు. 2007 లో వరల్డ్ స్పేస్ రేడియో లో నేను ‘మోహనరాగం’పేరిట కొన్ని సాహిత్య ప్రసంగాలు చేసాను. ఆ ప్రసంగాలు ఆయన వింటానంటే, ఒక పెన్ డ్రైవులో పెట్టి ఆయనకిచ్చాను. కొన్నాళ్ళకు ఆయన్నుంచి ఒక సిడిల బాక్సు నాకు పోస్టులో వచ్చింది. నా ప్రసంగాల్ని ఆయన సిడి రూపంలోకి కన్వర్టు చేయించడమే కాక, వాటికి లేబుళ్ళు కూడా తయారుచేయించి అతికించి మరీ పంపారు! అంతేనా! ఆ ప్రసంగాలు పాటల్తో పాటు వినడానికి చేసినవి కాబట్టి మధ్యలో విరామాలుండేవి. ఆయనకి ఆ విరామాలు నచ్చలేదు. అందుకని విరామాలేవీ లేకుండా తెంపులేని ప్రసంగాలుగా మళ్ళా ఎడిటు చేయించి మళ్ళా సిడిలుగా మార్చి మరొక సెట్టు పంపించారు! ఇటువంటి సాహిత్యప్రేమ, ఒక పాఠకుడు ఒక వక్త పట్ల చూపించడం అనూహ్యం. చూపించే సందర్భాలున్నా, అవి బహుశా ఒక వయోవృద్ధుడైన సాహిత్యవేత్తపట్ల ఒక యువకుడెవరేనా చూపించవచ్చేమో. కానీ ఆయన ఉన్న పరిస్థితుల్లో, ఆయన ఎదుర్కొంటున్న ఇబ్బందుల్లో, తన కన్నా వయసులో చిన్నవాణ్ణయినా,  ఆయన నా పట్ల చూపించిన ఆ ప్రేమ, ముఖ్యంగా ఆ శ్రద్ధ,  work is love made visible అని జిబ్రాను చెప్పినమాటలకి నిజమైన ఉదాహరణగా కనిపించింది.

చలంగారికి సంబంధించి ఆయన నాతో చాలా చేయించాలనుకున్నారు. చలంగారి పైన ఒక పత్రిక నడుపుతూ ఆ బాధ్యతలు నాకు అప్పగించాలనుకున్నారు. మేము కలుసుకున్న కొన్నిసార్లూ, ఎప్పుడేనా ఫోనులో మాట్లాడుకుని ఉంటే ఆ మరికొన్నిసార్లూ కూడా ఆయనకీ నాకూ మధ్య నడిచిన సంభాషణల్లో మాట్లాడుకున్నవి మూడే మాటలు: చలం, చలం, చలం.

ఒకసారి కోసలరాజు ప్రసేనజిత్తు బుద్ధుడితో అన్నాడట, మీ శిష్యుల జీవితవిధానాన్ని చూసేకనే  మీ మహత్వం నాకు అర్థమయ్యింది  అని. గురుప్రసాదరావుగారిని చూసాక నాకు చలంగారి మహత్వం మరింత బోధపడింది.  రక్తబంధంతో ఏర్పడే సహోదర బంధాలైనా విడిపోవచ్చేమోగాని, ఇటువంటి ఆత్మీయతాబంధంతో అల్లుకున్న అనుబంధాలకి  జరలేదు, మృత్యువు విడదీయలేదు.

23-12-2025

5 Replies to “ఆళ్ళ గురుప్రసాదరావు”

  1. రక్తబంధంతో ఏర్పడే సహోదర బంధాలైనా విడిపోవచ్చేమోగాని, ఇటువంటి ఆత్మీయతాబంధంతో అల్లుకున్న అనుబంధాలకి జరలేదు, మృత్యువు విడదీయలేదు.

  2. ఇది కేవలం గురుప్రసాదరావుగారిని స్మరించుకున్న నివాళి మాత్రమే కాదు. ఒక మనిషి వ్యక్తిత్వం మరొకరి జీవితంలో ఎలా చిరస్థాయిగా నిలిచిపోతుందో చెప్పిన ఆత్మీయమైన స్మృతిగానం.

    రచన అంతటా గురుప్రసాదరావుగారి గురించి రచయిత చెప్పిన సంఘటనలు చిన్నవిగా కనిపించినా, వాటి వెనుక ఉన్న ఆయన హృదయ విశాలత చాలా గొప్పది. ముఖ్యంగా “ఎక్కువగా కలవకపోయినా కొందరు మనుషుల ప్రభావం జీవితాంతం ఉంటుంది” అనే భావన ఈ రచనకు ప్రధానమైన అంతస్సూత్రంగా నిలిచింది. వ్యక్తులతో గడిపిన కాలం కన్నా, వారి వ్యక్తిత్వం మన మీద వేసిన ముద్రే గొప్పదని ఈ స్మృతి చెబుతోంది.

    చలంగారిపై గురుప్రసాదరావుగారికి ఉన్న అభిమానం సాధారణ అభిమానంగా కాకుండా ఒక ఆత్మీయ వారసత్వంగా చిత్రితమైంది. “చలం, చలం, చలం” అనే మూడు మాటలలో వారి అనుబంధం మొత్తం కుదించబడింది. అదే సమయంలో ఆయన కేవలం చలం అభిమానిగానే కాకుండా, తనకు నచ్చిన సాహిత్యాన్ని, రచయితలను, వక్తలను ప్రేమతో ఆదరించే అరుదైన సాహిత్యాభిమాని అని ‘మోహనరాగం’ ప్రసంగాల సీడీల సంఘటన ఎంతో హృద్యంగా నిరూపిస్తుంది. ప్రేమ మాటల్లో కాకుండా శ్రద్ధగా, పనిగా, సేవగా వ్యక్తమైతే ఎలా ఉంటుందో ఆ సంఘటన చూపిస్తుంది.

    విజయవాడ సభలో జరిగిన వివాదం సందర్భంలో గురుప్రసాదరావుగారి ఒక్క కరచాలనానికి రచయిత ఇచ్చిన అర్థం అత్యంత అందమైనది. ఎన్నో మాటలకంటే ఒక నిజమైన మనిషి ఇచ్చే ఆత్మీయమైన స్పర్శ గొప్పదని ఆ ఘట్టం తెలియజేస్తుంది.

    చివరికి బుద్ధుడి శిష్యులను చూసి బుద్ధుడి మహత్వాన్ని గుర్తించిన ప్రసేనజిత్తు ఉదాహరణను తీసుకుని, గురుప్రసాదరావుగారిని చూసి చలంగారి మహత్వాన్ని మరింతగా అర్థం చేసుకున్నానని చెప్పడం ఎంతో ఉన్నతమైన ముగింపునిచ్చింది.

    మొత్తంగా ఇది మరణించిన వ్యక్తిని గురించి రాసిన సంతాపవ్యాసం కాదు. మరణాన్ని దాటి నిలిచిపోయే ఆత్మీయతకు రాసిన నివాళి. గురుప్రసాదరావుగారి వ్యక్తిత్వాన్ని స్మరిస్తూనే, నిజమైన సాహిత్యప్రేమ అంటే ఏమిటో, ఆత్మీయబంధం అంటే ఏమిటో, ఒక మనిషి స్పర్శ ఎంతకాలం మరొక మనిషిలో జీవించి ఉంటుందో ఈ రచన ఎంతో మృదువుగా, హృద్యంగా ఆవిష్కరించింది.

    “ఇటువంటి ఆత్మీయతాబంధంతో అల్లుకున్న అనుబంధాలకు జరలేదు, మృత్యువు విడదీయలేదు” అనే చివరి భావమే ఈ మొత్తం స్మృతిరచనకు హృదయం వంటిది.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading