నేను తిరిగిన దారులు-18

రాళ్ళల్లో చెక్కిన కావ్యాలు

1

విముక్త స్థలం

తొలి శరత్కాలపు ఎండ. శ్రావణ బెళగొళలో గోమఠేశ్వరుడి ముందు నిల్చొని ఉన్నాను. పైన ఆకాశంలో ఒక్కమబ్బుపుంజ కూడా లేదు. ఉక్కులాగా మెరుస్తున్న ఆకాశం శ్వేతఛత్రం పట్టినట్టుగా ఉంది. నా ఎదుట 58 అడుగుల గోమఠేశ్వరుడు. ఆ మహామూర్తి ఈ ప్రాపంచికబంధాలనుంచి ఎన్నడో బయటపడి విముక్తమానవులకీ, నిజమైన శ్రమణులకీ ఒక ఉదాహరణగా అనేక శతాబ్దాలుగా అక్కడే నిలబడి ఉన్నాడు.

ఆశ్చర్యంతోనో, కుతూహలంతోనో లేదా సరదాగా ఒక వారాంతం గడపడంకోసమో అక్కడికి వచ్చే యాత్రికులతోపాటు ఆ స్థలానికే అంటిపెట్టుకుని తమ జీవితం పొడుగునా ఆ మహామూర్తినే ధ్యానించే, అర్చించే భక్తులతో కూడా ఆ ప్రాంతమంతా నిండిఉంది. నేను ఆ విగ్రహాన్ని అనేక పార్శ్వాలనుంచి, పరిపరివిధాల చూశాను. ఏ కోణంనుంచి చూసినా ఆ మూర్తిలో అదే గాంభీర్యం. అదే ప్రశాంతత. తనదేహాన్ని జయించిన తృప్తి. తన మనస్సును అరికట్టగలిగిన శాంతి. దేహాన్నీ, మనస్సునూ జయించడంతో తన కర్మను జయించి, బంధంనుంచి బయటపడ్డ మానవుడిలో కనవచ్చే బలం, సత్త్వం, ధీరత్వం.

భారతీయ భాషల్లో ఉత్తమ అనువాదాలకు కేంద్ర సాహిత్యఅకాడమీ ప్రతీ ఏడాది ఇచ్చే బహుమానం 2009లో నాకు లభించింది. ఆ పురస్కారం అందుకోవడానికి గాను సకుటుంబంగా బెంగుళూరు వెళ్లాను. మాతోపాటు అక్కా, బావగారు, రాజా కూడా వచ్చారు. అవి దసరా రోజులు కావడంతో అంతా మైసూరు వెళ్లాలనుకున్నాం. మైసూరుతో పాటు చాలాకాలంగా చూడాలనుకుంటున్న శ్రావణబెళగొళ, హళేబీడు, బేలూరు కూడా చూడాలనుకున్నాం. వాటన్నిటితోపాటు పిల్లలు ఊటి కూడా చూడాలన్నారు.

బెంగుళూరునుంచి ఒక ఇన్నోవా మాటాడుకుని శ్రావణబెళగొళ బయలుదేరాం. మూడుగంటల పైనే ప్రయాణం. కొంతదూరం పోయిన తర్వాత దారి బాగోలేనందువల్ల మరింత ఆలస్యమైంది. మేము బెంగుళూరులో బయలుదేరడమే ఆలస్యంగా బయలుదేరాం. దారిలో నిండుగా పూసిన తామరపూల కొలను ఒకటి మమ్మల్ని ఆపేసింది. అక్కడ ఫొటోలు తీసుకుంటూ చాలాసేపే గడిపేసాం. మేము శ్రావణబెళగొళ సమీపిస్తుండగానే దూరంగా కొండమీద నిర్మాణం కనిపించడం మొదలైంది. ఆ నిర్మాణం మధ్యలో ఒక ఎత్తైన విగ్రహం కూడా కనిపిస్తూంది. ఆ వెనుక, దిగంతరేఖను తాకుతూ గోమఠేశ్వరుడి శిరస్సు సమున్నతంగా ప్రత్యక్షం కాగానే మేమొక గంభీరమైన ప్రాంతంలో అడుగుపెడుతున్నామని ప్రతిఒక్కరికీ స్ఫురించింది. అప్పటికి పదకొండు గంటలపైనే అయింది. కొండ ఎక్కడం మొదలుపెట్టిన కొద్దిసేపటికే చుట్టూ సముద్రతరంగాల్లాగా పచ్చటి పొలాలు, నీలిరంగు దిగంతం కనిపించడం మొదలుపెట్టాయి. ఊరిమధ్యలో పెద్ద సరస్సు. దాన్నే బెళగొళ అంటారట. అదొక ఆకుపచ్చని ఊహలాగా ఉంది. దాన్లో మబ్బుల్లేని నీలాకాశం ప్రతిఫలిస్తూ ఉంది.

సముద్రమట్టానికి 3350 అడుగుల ఎత్తున, దొడ్డబెట్ట పర్వతశ్రేణిలో వింధ్యగిరి మీద ఈ శిల్పాన్ని చౌడరాయుడనే మంత్రి చెక్కించాడు. జైనసాహిత్యంలో ప్రసిద్ధి చెందిన బాహుబలి మూర్తి అది. జైనతీర్థంకరుల్లో మొదటివాడైన ఆదినాథుడి పుత్రుల్లో భరతుడు, బాహుబలి అనేవాళ్లిద్దరుండేవారు. వాళ్లల్లో భరతుడు తక్కిన ప్రపంచాన్నంతటినీ జయించి తన ఆధిక్యాన్ని ఒప్పుకొమ్మని బాహుబలికి కబురు చేసాడు. కాని, బాహుబలి అందుకు అంగీకరించలేదు.

ఈ వృత్తాంతాన్ని తన కావ్యంలో అద్భుతంగా చిత్రించిన కన్నడ ఆదికవి పంప(902-?). మాటల్లో చెప్పాలంటే, బాహుబలి ఇలా అన్నాడు: ‘నా అన్నకి నమస్కరించడానికి నాకు అభ్యంతరం లేదు. కాని నా మెడమీద కత్తి పెట్టి బలవంతంగా శిరసువంచమంటే మాత్రం నాకు చాతకాద’న్నాడు. అంతేకాదు, నిజంగా తన అన్న తనకన్నా బలవంతుడైతే ఆ సంగతి తేలవలసింది రణరంగంలోనేనన్నాడు. ఇద్దరూ పోరుకి సిద్ధపడ్డారు. తమ సైన్యాల్ని పక్కన నిలబడి చూడమని, తామిద్దరే హోరాహోరీ తలపడ్డారు. యుద్ధంలో విజయం బాహుబలినే వరించింది. కాని, ఆ విజయక్షణాన్న బాహుబలిని సంతోషానికి బదులు వైరాగ్యం ఆవహించింది. తనవంతు రాజ్యాన్ని కూడా తన అన్నకే ధారపోసేసాడు. తన రాజ్యాన్నీ, కుటుంబాన్నీ, ప్రాపంచిక జీవితాన్నీ వదిలిపెట్టి ఒక శిలలాగా ధ్యానస్థుడై నిలిచిపోయాడు. తనదనే ప్రతి ఒక్కభావాన్నీ త్యజిస్తే తప్ప మనిషి నిజమైన శ్రమణుడిగా మారలేడనడానికి రామకథలాగా, బుద్ధకథలాగా బాహుబలి కథ కూడా ఒక అత్యున్నత ఉదాహరణ. ‘తేన త్యక్తేన భుంజీథాః’ అనే ఉపనిషద్వాక్యానికి ఒక జైనదృష్టాంతం.

జైనపరిభాష ప్రకారం ప్రతి మానవుడినీ ఎనిమిది మదాలూ, ఎనిమిది మాలిన్యాలూ చుట్టుముడుతుంటాయి. కులం, రూపం, వయస్సు, భుజబలం, తపస్సు, కళ, దేవతానుగ్రహం, రాజ్యం వల్ల సంప్రాప్తించేవి అష్టమదాలు. శంక, ఆకాంక్ష, విచికిత్స, అన్యదృష్టి, ప్రశంస, సంస్తవం, సమ్యక్ దృష్టి, అతిచారం అనేవి అష్టమాలిన్యాలు. వీటితో పాటు సాధకుడి తపస్సుకి దేవతలద్వారా, మానవులద్వారా, జంతువులద్వారా, చివరికి, అచేతనాలద్వారా కూడా ఆటంకాలు ఎదురవుతుంటాయి. వీటిని ఉపసర్గలంటారు. ఇవి శ్రమణుడి ధైర్యాన్నీ, చిత్తాన్నీ, స్థిరత్వాన్నీ, ఇంద్రియనిగ్రహాన్నీ పరీక్షిస్తుంటాయి. వీటితో పాటు సాధకుడి తపస్సు సక్రమంగా కొనసాగకుండా 22 పరిషహలు అడ్డుపడుతుంటాయి. అటువంటి పరిషహల్ని తట్టుకుని ధర్మాధ్యయనాన్ని చేపట్టగలిగేవాళ్లని ‘ఉపసర్గకేవలు’లంటారు. వాళ్లనే ‘మహాపురుషు’లని కూడా పిలుస్తారు.

ప్రాచీనకన్నడసాహిత్యంలో అటువంటి మహాపురుషుల 19 జీవితగాథలతో ‘వడ్డారాధన’ పేరిట ఒక గద్యరచన వెలువడింది. అది క్రీ.శ. 8 వ శతాబ్దంలో మాన్యఖేటంలో జీవించిన భ్రాజిష్ణు రాసిన ‘ఆరాధన కర్నాట టీక’ పేరిట రాసిన గ్రంథమనీ, దానికి శివకోట్యాచార్యుడనే రచయిత ప్రాకృతంలో రాసిన ‘మూలారాధన’ ఆధారమనీ చెప్తున్నారు. ఏమైనప్పటికీ, జీవితం పట్ల తితిక్షవహించి మనిషి మహాపురుషుడిగా మారడమనే జీవితాదర్శాన్ని జైనంనుంచి కన్నడ దేశం గ్రహించింది. క్రీ.శ 8 నుంచి 12 శతాబ్దాల మధ్యకాలంలో గాంగుల, చాళుక్యులకాలంలో ఆ ఆదర్శాన్ని పద్యగద్యరూపంలో, శిల్పరూపంలో వ్యక్తీకరించే గొప్ప ప్రయత్నాలు జరిగాయి. అటువంటి అత్యున్నతస్థాయి వ్యక్తీకరణగా గోమఠేశ్వరుడి శిల్పాన్ని చూడవలసివుంటుంది.

ఆ మూర్తి పూర్తిదిగంబరమూర్తి. అయినా, అశ్లీలత స్ఫురించదు. జుత్తు ఉంగరాలుగా చుట్లు తిరిగిఉంది. పెద్దచెవులు. నేత్రాలు విస్ఫారితాలు. కాని అవి ఈ లోకాన్నికాక, దూరదిగంతరేఖమీద దృష్టిపెట్టినట్టుంటాయి. పెదాలకొసలనుంచి చిరుమందహాసరేఖ కనిపించీకనిపించనట్టుగా మెరిసిపోతున్నది. మొత్తం మూర్తి ఒక పద్మం మీద నిలిచివుంది. ఆయన వెనగ్గా ఒక మహావల్మీకం తీవ్రతపస్సుకు గుర్తుగా వుంది. ఆ పుట్టనుంచి ఒక పాము, ఒక లత ఒకదాన్నొకటి పెనవైచుకుని ఆయన కాళ్లచుట్టూ, చేతులచుట్టూ అల్లుకునివున్నాయి. మొత్తం ప్రతిమ ఒక కాయోత్సర్గభంగిమలో, ఈ లోకంనుండి విముక్తిచెంది కూడా ఈ లోకం పట్ల ప్రేమతో ఈ లోకాన్నే అంటిపెట్టుకునివున్నట్టుగా వుంది. అక్కడున్నంతసేపూ మేమే కాదు, పిల్లలు కూడా ఏదో మహనీయమైనదాన్ని దేన్నో చూసిన సంతోషానికి లోనయ్యారు. వాళ్ల కళ్లల్లో, చూడవలసిన దాన్ని దేన్నో చూసిన, తృప్తి. నాకు ఈ స్థలం గురించి చెప్పింది రావెలసోమయ్యగారు. అందుకని, అక్కడనుంచే ఆయనకు ఫోన్ చేసి ఆ క్షణాన్న నాకు కలుగుతున్న అనుభూతినంతటినీ ఫోన్లోనే కుమ్మరించేసాను.

శ్రావణబెళగొళలో ఒక జైనహొటల్లో మధ్యాహ్న భోజనం చేశాం. పాతకాలపు ఒక సత్రంలాంటి ఇంటిలో, నేలమీద పీటలు వేసి, మా ఎదుట పళ్లాలు పెట్టి వేడివేడి అన్నం వడ్డించారు. అన్నం తినగానే హళేబీడు బయలుదేరాం.


Poems Carved in Stone

1

A Liberated Space

The sun of early autumn beat down upon the heights. I stood at Shravanabelagola before Gommateshwara. Above, not a wisp of cloud drifted across the firmament; the sky gleamed like burnished steel, spreading overhead like a white parasol. Before me rose the fifty-eight-foot colossus. That magnificent form, having stepped out of worldly entanglements long ages ago, had stood on that very spot for centuries—a living exemplar for liberated beings and true shramanas.

The summit was alive not only with sightseers drawn by wonder, curiosity, or the leisure of a weekend, but also with pilgrims bound to the sanctuary, spending their lifetimes in deep contemplation and worship of that sublime figure. I walked around the image, observing it from varied angles and perspectives. Yet from every side, the same majesty endured: an unshakable serenity, the fulfillment of one who had conquered the flesh, the deep stillness of a mind thoroughly mastered. In that conquest of body and mind lay the triumph over karma—the fortitude, vitality, and heroic quietude of a human being delivered from bondage.

In 2009, I was awarded the Kendra Sahitya Akademi Prize for translation. To receive the honor, I traveled to Bangalore with my family, joined by my sister, brother-in-law, and Raja. Since it was the season of Dasara, we planned to visit Mysore. Alongside Mysore, we also wished to visit the ancient sites I had long yearned to see—Shravanabelagola, Belur, and Halebidu. The children asked to include Ooty as well. Hiring an Innova from Bangalore, we set out toward Shravanabelagola.

It was over a three-hour drive. After some distance, poor roads slowed our progress further, compounding our already late departure from the city. Along the way, a pond brimming with blooming lotus flowers arrested us; we lingered there at length, taking photographs. As we drew near Shravanabelagola, the stone structures atop the hill began to emerge in the distance, and at their center, a towering silhouette. When the noble head of Gommateshwara rose against the horizon, touching the skyline, an immediate awareness took hold of everyone: we were crossing the threshold into an austere, consecrated realm.

It was already past eleven in the morning. Within moments of beginning our ascent up the rock, verdant fields rippling like ocean swells and the blue horizon unfolded around us. In the heart of the settlement below lay a vast tank—Belagola, the white pond. It appeared like a green reverie, mirroring the cloudless azure expanse above.

Carved at an altitude of 3,350 feet above sea level, upon the crest of Vindhyagiri in the Doddabetta range, this monolithic wonder was commissioned by the Ganga minister Chavundaraya. It depicts Bahubali, celebrated throughout Jaina lore. Among the sons of Adinatha, the first Tirthankara, were Bharata and Bahubali. Having subjugated the rest of the earth, Bharata sent word demanding that Bahubali acknowledge his suzerainty. Bahubali refused.

In the words of Pampa (c. 902–?), the father of classical Kannada poetry who depicted this conflict with supreme mastery:

“I have no hesitation in bowing before my elder brother; but if a blade is set to my throat to force my head low, that I cannot do.”

Moreover, he declared that if his brother was indeed the mightier, the matter had to be settled upon the battlefield.

Both marshaled their hosts, but commanding their armies to stand aside as silent witnesses, the two brothers locked in fierce personal combat. Victory crowned Bahubali. Yet at the exact instant of triumph, not pride or joy, but an overwhelming renunciation swept over him. Pouring out his share of the kingdom as an offering to his elder brother, he relinquished sovereign rule, family, and worldly existence, taking his stand in unmoving, rock-like contemplation. Like the epics of Rama and the Buddha, the narrative of Bahubali stands as a supreme testament that a human being cannot become a true shramana without relinquishing every claim of ‘mine’—a striking Jaina embodiment of the Upanishadic dictum: Tena tyaktena bhuñjīthāḥ (“Enjoy through renunciation”).

In Jaina philosophy, eight primal conceits (ashta-mada) and eight stains (ashta-mālinya) encircle every human soul. The eight conceits spring from pride of caste, physical beauty, youth, bodily prowess, ascetic penance, learning or arts, divine favor, and sovereignty. The stains comprise doubt, worldly longing, squeamish aversion, alien doctrine, uncritical praise, flattery, laxity of vision, and moral lapse.

Beside these, a seeker’s strivings are beset by upasargas—adversities that test the fortitude, will, constancy, and self-restraint of the shramana, visited upon him through gods, humans, beasts, and insentient nature. Furthermore, twenty-two parīshahas (hardships or afflictions) arise to disrupt rigorous spiritual practice. Those who endure such trials while remaining steadfast in their study and observance of the Dharma are known as Upasarga-Kevalins, honored as Mahāpurushas.

In classical Kannada literature, nineteen life narratives of such exalted beings were gathered in the prose masterpiece Vaddārādhane. Scholars identify this work as the Ārādhanā Karnāṭa Tīkā composed by Bhrajishnu at Manyakheta in the eighth century, drawing upon the Prakrit Mūlārādhanā of Shivakotyacharya. In every sense, the Kannada land absorbed from Jainism this singular ideal: that through enduring forbearance toward life (titikshā), a mortal rises into a Mahāpurusha. Between the eighth and twelfth centuries, under the patronage of the Gangas and the Chalukyas, profound efforts flowered in verse, prose, and stone to manifest this ideal. The colossus of Gommateshwara stands as its supreme aesthetic and spiritual summit.

The statue stands completely sky-clad (digambara), yet evokes no trace of the profane. The hair gathers in tight, orderly ringlets; the ears are elongated; the eyes wide and unblinking, fixed not on this world, but gazing into the distant horizon. Across the corners of the lips plays a faint, elusive smile, luminous yet barely discernible.

The entire figure rests poised upon an open lotus. Behind him rises a great anthill, testifying to the unyielding duration of his penance. From that earthen mound, a serpent and a climbing vine twist together, winding around his legs and arms. Standing in the pristine stillness of the kāyotsarga posture, the colossus appears to have transcended this mortal world, yet remains anchored to it out of boundless compassion.

All while we stood there, not only we elders, but the children too were overcome with quiet reverence, as if having beheld something truly monumental. In their eyes shone the fulfillment of seeing that which was destined to be seen. It was Sri Ravela Somayya garu who had first spoken to me of this sanctuary; right from the summit, I called him on the phone, pouring out the surge of feelings that flooded me at that very moment.

Descending to the town below, we had our midday meal at a modest Jaina dining home. In that old-world pilgrim hospice, wooden seats (peetas) were set upon the floor, platters were placed before us, and steaming rice was served with traditional simplicity.

Having eaten, we set out on the road to Halebidu.

17-9-2026

4 Replies to “నేను తిరిగిన దారులు-18”

  1. బెంగళూరులో TCH చదువుతున్నప్పుడు 1992 లో ఎడ్యుకేషనల్ టూర్ లో భాగంగా హళేబీడు, బేలూరు, శ్రావణ బెళగొళ, శృంగేరి, హొరనాడు, కుక్కి, కార్కళ , ధర్మస్థళ, ఉడిపి, మల్పె, మణిపాల్ వంటి ఊళ్ళని చూసాము. గొప్ప అనుభూతి ఇంకా పచ్చగానే ఉంది. గోమటేశ్వరుని రూపం ఎప్పటికీ అపురూపమే. మళ్ళీ ఆ బాహుబలిని, ఆ శాంత మూర్తిని, ఆ విరాగిని గుర్తు చేసినందుకు ధన్యవాదములు 🤍🪷🙏🏼

  2. ఒక విషయాన్ని ఆలంబన చేసుకుని దాని గురించిన సమస్త వివరాలు తెలిపే మీ రచన చదువుతుంటే , శ్రవణ బెళగొళ లోని బాహుబలి విగ్రహం ఏ వివరాలు తెలియకుండా చూస్తే లాభం లేదని తెలిసింది . శ్రవణ బెళగొళ వెళ్లలేదు కానీ , యూరపు సందర్శించినప్పుడు ఫ్లోరెన్స్ శిల్పకళా మ్యూజియంలో మైఖెలాంజిలో సృష్టించిన అద్భుత కళాఖండం బైబిలికల్ హీరో డేవిడ్ పాలరాతి విగ్రహం స్ఫురణకు వచ్చింది. పూర్తిగా నగ్నశిల్పమే ఐనా ఇసుమంత అశ్లీలత అనిపించకపోవడం , మీరన్నట్లుగా ఆ గాంభీర్యం వెనుక ఉన్న పవిత్రత కావచ్చు . మీకు నమస్సులు

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading