
మూడవ రోజు: మొదటి సంభాషణ
గ్రామం కూడా ఒక దేహమే
మూడో రోజు పొద్దున్న నేను గురూజీ దగ్గరకి వెళ్ళేటప్పటికే అప్పటికే మరికొందరు శ్రోతలు అక్కడికి చేరుకుని ఉన్నారు. గురూజీతో సంభాషణలు నడుస్తున్నాయని తెలియడంతో వారు కూడా వచ్చారు. వారిలో కొందరు ఇంతకు ముందు ఎన్నోసార్లు గురూజీ ఇవి చెప్తుండగా విన్నవారే కావొచ్చు, కానీ, ఏథెన్సు పౌరులు సోక్రటీసుతో మాట్లాడించినట్టే వీళ్ళు కూడా గురూజీతో ఏదో ఒకటి మాట్లాడించాలని అనుకుంటూ ఉంటారు. వారు దాన్ని ఎంత వరకూ గ్రహించారూ, తాము తెలుసుకున్నది ఎంత వరకూ ఆచరణలో పెట్టారూ అన్నది వేరే సంగతి. కాని అలాంటి ఒక సంభాషణ నడుస్తూ ఉంటే ఆ సంగతి తెలిసి ఒక ప్లేటో లాంటివాడో, నాలాంటి వాడో పోయి ఆ విన్నదేదో రాసుకుని నలుగురికీ పంచుతాడు కదా!
ఆ రోజు కూడా అదే జరిగింది. నేను వెళ్ళేటప్పటికే ఎవరో ‘భారతీయత’. హిందుస్తాన్’, ‘సభ్యత’ లాంటి పదాలేవో మాట్లాడుతున్నారు. నేను కూడా వెళ్ళి అక్కడ కూచున్నాను. గురూజీ మా మధ్యకు వస్తున్నప్పుడే ఆ మాటలు ఆయన చెవిన పడి ఉంటాయి. ఆయన వచ్చి కూచుంటూనే-
‘ఇప్పుడు చెప్పండి. మీ గురించి మీకు ఏం తెలుసు? భారతదేశం గురించి, సమాజం గురించి మీ అవగాహన ఏమిటి? దీన్ని మీరెలా అర్థం చేసుకుంటారు?’ అనడిగారు.
వారిలో ఒకరు ‘భారతీయ సమాజం చాలా ఉదారమైన సమాజం. ఎన్నో సంస్కృతులు కలిసి జీవించే సమాజం. ఇక్కడి తత్త్వశాస్త్రం Live and Let live. కానీ పాశ్చాత్య సమాజాల్లో survival of the fittest నడుతుంటుంది’ అని అన్నారు.
గురూజీ చిరునవ్వారు.
‘కానీ చూడండి, చెప్పేదానికీ, చేసేదానికీ తేడా ఉందిక్కడ. మనది ఉదారసమాజమే అయితే, మరి ఆ ఉదారత ఎందుకు కనిపించడం లేదు? ప్రజలకు ఇది చాలా భయంకరంగా కనిపిస్తోంది. అత్యాచారం, అన్యాయం-ఇవే కదా కనిపిస్తున్నాయి. ఇక్కడంతా చూడటానికి చాలా కఠినంగా కనిపిస్తోంది. ఉదారత అనేది ప్రాచీన కాలం నాటి మాట-‘
అని గురూజీ ఒక్క క్షణం ఆగారు. ఆయన ఈ రోజు సంభాషణ ఇలా మొదలుపెడతారని మేమెవ్వరం ఊహించలేదు. అది మా ముఖాల్లో కనిపించిందనుకుంటాను. ఆయన ఇలా చెప్పడం మొదలుపెట్టారు:
‘చూడండి. మనం అద్వైత సిద్ధాంతాన్ని నమ్ముతాం. పాశ్చాత్య దేశాలు ద్వైత సిద్ధాంతాన్ని నమ్ముతాయి. ఇస్లాం కూడా ద్వైత సిద్ధాంతమే. కాని వారి సామాజిక జీవనం అద్వైతం లాంటిది. మనం అద్వైతం నమ్ముతాం. కాని మన దగ్గర బహుళత్వం చాలా ఎక్కువ. నిర్లిప్తత గురించి మాట్లాడుకుంటాం. కానీ అమెరికా వాడు చాలా పెద్ద ఎత్తున నిర్లిప్తంగా జీవిస్తాడు. ఒక రకంగా చూస్తే వాడికి ఎవరితోనూ అనుబంధం ఉండదు. తన పిల్లలతో కూడా అనుబంధం ఉండదు. వారు చాలా నిర్లిప్త భావంతో జీవిస్తారు. అవునా? కాదా?’
‘ఇదంతా చూడటానికి చాలా వింతగా అనిపిస్తుంది. మూడు విషయాలున్నాయి- కొన్నిసార్లు అనిపిస్తుంది ఇస్లాంలోని ‘సోదరభావం’, క్రైస్తవులలోని ‘సేవాభావం’, సిక్కులలోని ‘ఐక్యత’- ఈ మూడింటిలో ఒక్కటి కూడా మనవాళ్లలో కనిపించదు. ఇస్లాంలో సోదరభావం చాలా బలంగా ఉంటుంది, వారు ఎక్కడి నుండైనా బంధుత్వాన్ని వెతుక్కుంటారు. క్రైస్తవులలో సేవాభావం చాలా ఎక్కువ. ఇక్కడ సేవ ఆధారంగానే వారి కార్యక్రమాలు ఎన్నో సాగుతున్నాయి. వారేం చేసినా చాలా నిజాయితీగా చేస్తారు, ఏదో ఊరికే చేయరు. అలాగే, ఒక సిక్కు ట్రక్కు పాడైపోతే, ఆ దారిలో వెళ్లే మిగతా సిక్కులందరూ అక్కడ ఆగి, ‘ఏదైనా సహాయం కావాలా?’ అని అడిగి మరీ వెళ్తారు. ఈ విధమైన అలవాటు వేరే ఏ సమాజంలోనూ కనిపించదు, మిగతావాళ్లు ముఖం చాటేసి వెళ్ళిపోతారు. సిక్కు సమాజంలో ఎవరూ యాచకులుగా (భిక్షగాళ్లుగా) ఉండరు, వారు ఎక్కడో ఒకచోట ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు.’
‘నిజానికి మన దగ్గర కూడా భిక్షగాళ్లు ఉండేవారు కాదు, మనది భిక్షావృత్తి. అది భిక్షం అడుక్కోవడం కాదు. మన దగ్గర మూడు వృత్తులు ఉన్నాయి: కర్మవృత్తి, వైశ్యవృత్తి, మరియు భిక్షావృత్తి. సమాజమంతా ఈ మూడు వృత్తులలోనే ఎక్కడో ఒకచోట ఇమిడి ఉండేది. కర్మవృత్తిలో ఉన్నవారు జడ పదార్థాల నుండి అంటే నిర్జీవం నుంచి సృష్టి చేస్తారు. కలప, బంగారం, వెండి లాంటివన్నీ నిర్జీవాలే కదా. చేతివృత్తుల వారంతా ఈ వృత్తి కిందికే వస్తారు. చేతనం నుండి చేతనాన్ని వృద్ధి చేసేవారు వైశ్య సమాజం. ఉదాహరణకు ఒక రైతు ఒక గింజను భూమిలో నాటి, దాని నుండి వేల గింజలు ఉత్పత్తి చేస్తాడు. అతను తన చేతులతో గింజను తయారు చేయడు కదా? అలాగే ఒక గొల్లవాడు పది ఆవుల్ని వంద ఆవులుగా చేస్తాడు. గొర్రెలు, మేకలు కాసేవాడు వంద మేకల్ని వెయ్యి మేకలుగా చేస్తాడు. ఈ విధంగా చేతనాన్ని వృద్ధి చేసేవారు వైశ్య వృత్తిలోకి వస్తారు.’
‘దీని తర్వాత ఉన్నది భిక్షావృత్తి. మన దగ్గర భిక్షగాళ్లు లేరు, భిక్షం అడగడం అనేది ఒక వృత్తిగా, జీవన విధానంగా ఉండేది. ఇలా భిక్షావృత్తిపైనే ఆధారపడి జీవించే ఉపకులాలు ఎన్నో ఉన్నాయి. దాదాపు ఏడెనిమిది వేల దాకా భిక్షా వృత్తి కులాలుండేవి మన దగ్గర. ఒక గ్రామమంటే వీరంతా కలిస్తేనే. పూర్వం గ్రామ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు అందులో వ్యాపారుల్ని, వాణిజ్యం చేసేవారిని ఎందుకుంచారు? ‘వచ్చి నన్ను పొడిచిపో’ అని పిలవడానికా? ‘రండి, మమ్మల్ని దోచుకోండి’ అని అరవడానికా? గ్రామ సంపదని, సమృద్ధిని ఎలా పెంచాలనే దానికోసం వారిని ఉంచారు. ఒకవేళ వారు గ్రామ సమృద్ధిని పెంచకుండా గ్రామాన్ని పేదరికం వైపు తీసుకువెళ్ళే వాళ్ళైతే వారిని గ్రామంలో ఎందుకు ఉంచుతారు? కాబట్టి ఆ కాలంలో వ్యాపారం అంటే అర్థం వేరేలా ఉండేది. వాణిజ్యం వ్యాపారంలో ఒక భాగం మాత్రమే. వైశ్యవృత్తిలో వాణిజ్యం చాలా చిన్నభాగం. అది గ్రామంలో నడవదు. గ్రామీణ వ్యాపారశైలి వేరేగా ఉండేది.’
‘ఇంతకీ గ్రామం అని దేనిని అనాలి? గ్రామానికి ఉన్న నిర్వచనం ఏమిటి? అదొక సమూహం. కుటుంబాల సమూహం.వారెందుకలా కలిసి జీవించాలి? ఒకేచోట ఎందుకు గుమికూడి ఉండాలి? మనుషులు పూర్వం అలా జీవించడానికి ప్రయత్నించినప్పుడు దాని గురించి ఏదో ఒక ఆలోచన ఉండే ఉంటుంది కదా? అలా జీవించడంలో ఒకరి వల్ల ఒకరికి ఏదో ఒక ప్రయోజనం ఉండి ఉండాలి కదా. లేకపోతే అలా కలిసి జీవించడంలో అర్థం లేదు.’
‘సమూహంలో ఒకరి గురించి ఒకరు ఆలోచించరు. అలా సమాజంలో మటుకే ఆలోచిస్తారు. కాబట్టి మొదట మనమొక విషయాన్ని స్పష్టం చేసుకుందాం: గ్రామం అని దేన్నంటారు? సమాజమంటే ఏమిటి? సామాజికత అంటే ఏమిటి?’
‘సమాజానికి ఒకే నిర్వచనం ఉంది: మన చుట్టూ ఉన్న ప్రాణిసమూహమే సమాజం. మరి మనం మాత్రమే ప్రాణులమా? పశువులు, పక్షులు, చెట్లు, మొక్కలు-ఇవన్నీ కూడా ప్రాణులే. వాటితో పాటు మనం కూడా ప్రాణులం. అంతకంటే ఎక్కువ కాదు. సమాజం అంటే జీవించే ప్రాణుల సమూహం.’
‘మరి సామాజికత అంటే? ప్రాణుల సమూహం సహజంగానే తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంది. ఒక చెట్టు ప్రాణవాయువును ఇస్తుంది. ఇంట్లో కుక్క కట్టేసి ఉంటే, ఎవరో కొత్త వ్యక్తి రాగానే అది మొరుగుతుంది. కుక్కకి ఎవరూ చెప్పక్కరలేదు కదా, కొత్తవాడొచ్చాడు మొరుగు అని. అది సాహసంగా మొరుగుతుంది. ఈ పశువులు, పక్షులు, చెట్లు, మొక్కలు అన్నీ సహజంగానే తమ కర్తవ్యాన్ని నిర్ణయించుకుని ప్రవర్తిస్తాయి. ఏ రోజైతే మనుషులు కూడా వీటన్నింటిపట్లా ఒక కర్తవ్యభావనతో జీవించడం ప్రారంభిస్తారో అప్పుడు అతణ్ణి సామాజిక జీవి అంటారు. కేవలం తనలాంటి మనుషుల పట్ల మాత్రమే కాదు, వీటన్నిటి పట్లా కర్తవ్యాన్ని కలిగి ఉండటమే సామాజికత. ఈ విషయాలన్నింటి ఆధారంగానే మన వ్యవస్థలు ఏర్పడ్డాయి. కనీసం మనం సామాజిక జీవులుగా జీవించాలి. అసామాజికంగా కాదు.’
‘మరి ఎలాంటి జీవితం జీవిస్తే మనం సామాజిక జీవితం జీవించినట్టవుతుంది? మన దగ్గర గ్రామానికి ఎలాంటి నిర్వచనం ఉండేది? పంజాబ్ లో గ్రామాన్ని ‘పిండ్’ అంటారు. ఉత్తర భారతదేశంలో ‘దేహాత్’ అంటారు. పిండ్ అంటే శరీరం అని కూడా అర్థం. దేహాత్ అంటే ‘శరీరంలో ఉన్నది’ అని అర్థం. అంటే గ్రామాన్ని కూడా తనంతట తానుగా ఒక శరీరం లేదా శరీరంలో ఉన్నదిగా భావించేవారు.’
‘మనం మన శరీరాన్ని ఎలాగైతే కాపాడుకుంటామో, అలాగే ఎక్కడైతే ప్రతి ఒక్కరి ఆహారభద్రతా, గౌరవం కాపాడేలా మనుషులు జీవిస్తారో దాన్ని గ్రామం అంటారు. అక్కడ ప్రతి ఒక్కరి పట్లా ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉంటుంది. అక్కడ కొందరు పాలన చేయడం, మరికొందరు బానిసలుగా ఉండటమనేది జరగదు. అక్కడ ప్రతి ఒక్కరూ బాధ్యతపడాలి. ఎక్కడైతే ప్రతి ఒక్కరి ఆహారభద్రత, గౌరవమర్యాదలు కాపాడుకుంటూ మనుషులు కలిసి జీవిస్తారో దాన్ని గ్రామం అంటారు. ఒక శరీరంలాగా అది తనను తాను భావించుకుంటుంది.’
‘మన దగ్గర గ్రామాలు ఎలా ఏర్పడ్డాయి? మన దగ్గర గూడెం లేదా గూడా లేదా పల్లె అంటారు. పల్లెకి, గూడేనికీ తేడా ఉంది. గూడెంలో ఒకే రకమైన సమాజం నివసిస్తుంది. పల్లెలో కొన్ని రకాల పనులు చేసేవాళ్ళుంటారు. గూడెంలో ఒకే భాష మాట్లాడేవాళ్ళూ, ఒకే రకమైన పనిచేసే వాళ్ళూ ఉంటారు. వారిదంతా ఒకేలా సాగుతుంది. పల్లెలో అలా కాదు, రకరకాల పనులు చేసేవాళ్ళుంటారు. ఒక గ్రామంలో చాలా రకాల పనులుంటాయి. కనీసం పద్ధెనిమిది రకాల చేతివృత్తులవాళ్ళుంటారు. ఇప్పుడు గోండులది గూడా అంటారు కదా. అక్కడ దాదాపు ఒకే గోత్రం వాళ్ళు లేదా ఒకే రకమైన పనులు చేసేవాళ్ళే ఉంటారు.’
‘ఇప్పుడిక్కడ ఉన్న గ్రామాలన్నీ చాలా కొత్త గ్రామాలు. ఇవి అతి ప్రాచీన గ్రామాలు కావు. ఈ ప్రాంతంలో ఉన్న గ్రామాల్ని చూస్తే మనకి చాణక్యుడి పద్ధతి అర్థమవుతుంది. చాణక్యుడు గ్రామాన్ని ఎలా నిర్మించాలి, ఎలా ఏర్పాటు చేయాలి అనే పద్ధతులు చెప్పాడు. ఒక గ్రామానికి, ఇంకో గ్రామానికి మధ్య ఎంత దూరం ఉండాలి? కనీసం రెండు లేదా మూడు క్రోసుల దూరం కన్నా ఎక్కువ ఉండకూడదు. ఒక గ్రామం నుంచి చూస్తే ఇంకో గ్రామం కనిపిస్తూ ఉండాలి. చాణక్యుడు అలా అనుకోడానికి కారణమేమిటంటే, ఒక గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగితే, చుట్టు పక్కల గ్రామాల ప్రజలు సహాయం అందించడానికి వెంటనే చేరుకోడానికి వీలుగా ఉండాలి. అలానే ఒక గ్రామంలో దొంగతనం లేదా ఏదైనా గందరగోళం జరిగితే వారి అరుపులు విని పక్క గ్రామాలవాళ్ళు అప్రమత్తం అవ్వాలి. ఈ రకమైన భద్రతా కారణాల్ని దృష్టిలో పెట్టుకుని గ్రామాల నిర్మాణాన్నీ, వాటి మధ్య దూరాన్నీ నిర్ణయించారు. చాణక్యుడి కంటే ముందు కూడా మనం ఎన్నో గ్రామాలను చూస్తాం. ఇక్కడి పాత గ్రామాలు నాల్గవ, లేదా ఐదవ శతాబ్దానివి కావచ్చు. ఆ గ్రామాల్ని మూడు వైపులా కొండలు, ఒక వైపు నది ఉండేలా చూసుకుని నిర్మించుకునేవారు.’
‘గ్రామాల నిర్మాణానికి మనకంటూ కొన్ని పద్ధతులుండేవి. గ్రామం కోసం భూమిని పరీక్షించేటప్పుడు ఒక గంపలో నవధాన్యాలు తీసుకువెళ్ళేవారు. ఆ గంపని ‘పాట్లా’ అంటారు. దాన్ని తీసుకుని వెళ్ళేవాణ్ణి ‘పటేల్’ అంటారు. అతను వెళ్ళి ఆ భూమిని పరీక్షిస్తాడు. నవధాన్యాలు అక్కడక్కడ చల్లి చూస్తాడు. అవి సరైన సమయానికి మొలకెత్తితే అక్కడ గ్రామాన్ని ఏర్పాటుచేసుకోవచ్చని అర్థం. అది వ్యవసాయానికి అనుకూలమైన మంచి భూమి అని అర్థం. తొమ్మిది రకాల ధన్యాలు వాటి సమయానికి మొలకెత్తాలి. ప్రతి ఒక్కదానికి ఒక సమయం ఉంటుంది కదా, రెండు రోజులు, మూడు రోజులు లేదా ఇరవై నాలుగ్గంటలు-అలా అవి మొలకెత్తితేనే ఆ భూమి గ్రామానికి యోగ్యమైనది.’
‘గ్రామ సరిహద్దు, అంటే, శివారును నిర్ణయించేటప్పుడు ఆ గ్రామంలో జనాభా ఎంత ఉంది, వారికి ఎంత వనరులు కావాలి అనేదాన్ని బట్టి నిర్ణయించేవారు. అందులో ఒక నియమం ఖచ్చితంగా పెట్టుకునేవారు. అదేమంటే, ఒకసారి గ్రామం ఏర్పాటయ్యాక, కనీసం 500 సంవత్సరాల వరకు ఇక్కడి ప్రజలు జీవనం కోసం బయటకు వెళ్ళాల్సిన అవసరం రాకూడదు. 500 సంవత్సరాల కాలంలో ఇక్కడ జనాభా ఎంత పెరగవచ్చు, అంతమందికి సరిపడా ఏర్పాట్లు ఎలా చేయవచ్చు అనేదాన్ని బట్టి ఆ భూమిని సరిహద్దుగా నిర్ణయించుకునేవారు. 500 సంవత్సరాల నియమం ఎందుకు పెట్టారంటే, ప్రకృతిలో ఒక నియమం ఉంది- 500 సంవత్సరాల వరకు జనాభా పెరుగుతుంది, ఆ తర్వాత 500 ఏళ్ళ పాటు అడవి పెరుగుతుంది. జనాభా తగ్గడం మొదలవుతుంది, ఆ తర్వాత మళ్ళా జనాభా పెరుగుతుంది. అడవి తగ్గుతుంది. ఇది ప్రకృతి నియమం. దాని ప్రకారమే అలా ఏర్పాటు చేసుకునేవారు.’
‘అక్కడొక విషయం స్పష్టంగా చూసుకునేవారు: ఒక చీమ తన ఆహారం కోసం ఎంతదూరం వెళ్తుంది? మహా అయితే పది నుంచి ఇరవై గజాలు. ఒక ఆవు లేదా మేక తన ఆహారం కోసం ఎంత దూరం వెళ్తుంది? మహా అయితే రెండు మూడు కిలోమీటర్లు. ఒక పక్షి తన ఆహారం కోసం ఎంత దూరం వెళ్తుంది? మహా అయితే అయిదారు కిలోమీటర్లు. మళ్ళీ సాయంత్రానికి అది తన గూటికి చేరుకోవాలి. అలాగే ఒక మనిషి తన ఆహారం సంపాదించుకోవడానికి ఎంత దూరం వెళ్ళాలి? దానికి ఎంత స్థలం అవసరం? ఉదయం అతను పనికోసం బయలుదేరితే సాయంత్రానికి మళ్ళీ ఇంటికి చేరుకోవాలి. ఆ కాలంలో రవాణాసాధనం ఎడ్లబండి. ఆ బండిమీద వెళ్ళి పని ముగించుకుని తిరిగి రావాలి. ఆ పరిమితిని బట్టి వాళ్ళు శివారు నిర్ణయించుకునేవారు. ఆ మేరకి మనిషి బతకగలడు అని. పన్నెండు నెలలూ అతనికి ఇక్కడే ఆహారం దొరుకుతుంది. దీనికంటే బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎడ్లబండి వేసుకుని వెళ్తే సగం రోజు వెళ్ళడానికే అయిపోతే, సగం రోజు రావడానికే అయిపోతే మరి పనెప్పుడు చేస్తాడు? తక్కువ సమయంలో వెళ్ళి, రోజంతా పనిచేసుకుని, సాయంత్రానికి మళ్ళీ ఇంటికి చేరుకునేలాగా ఉండాలంటే, మహా అయితే ఇరవై కిలోమీటర్లు ఉంటుంది. గ్రామానికి ఇటువైపు అయిదారు కిలోమీటర్లు, అటువైపు అయిదారు కిలోమీటర్లు, అంతకంటే ఎక్కువ ఉండదు. మనిషి ఆహారం సంపాదించుకోవడానికి ఎంత దూరం వెళ్ళాలో అంతవరకే. ఆ పరిధిలో అతను హాయిగా బతకవచ్చు. మిగతా పశుపక్ష్యాదులన్నింటికీ పన్నెండు నెలలు అందులోనే ఆహారం దొరుకుతున్నప్పుడు మనిషికి ఎందుకు దొరకదు? మనిషికి కూడా దొరుకుతుంది. కాబట్టి ఆ పరిధి చాలు. అంతకంటే ఎక్కువ వారు ఆలోచించలేదు.’
‘ఇప్పుడు ఈ అదిలాబాద్ బస్తీ ఉంది కదా. ఇది తీర్పల్లి ప్రాంతం. ఈ ఆశ్రమం తర్వాత ‘మావల’ సరిహద్దు వస్తుంది . ఈ రోడ్డు అవతలి ప్రాంతాన్ని మావల అంటారు. ఇటువైపు అదిలాబాద్. దీని చుట్టూ ఉన్నది ఇంతే భూమి. గ్రామం సరిహద్దుని నిర్ణయించేటప్పుడు, ఆ సీమాబంధనం కోసం, చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వచ్చేది. ఆ ప్రాంతమంతా తిరగాలి. ఒక రాత్రిలో ఆ ప్రదక్షిణ అంతా పూర్తవ్వాలి. మన దగ్గర చాలా రకాల ప్రదక్షిణలున్నాయి. కొన్ని గ్రామం చుట్టూ చేసే ప్రదక్షిణలు. కొన్ని గ్రామం సరిహద్దు చుట్టూ చేసే ప్రదక్షిణలు. అవి నిరంతరం సాగుతూనే ఉండేవి. గ్రామం చుట్టూ చేసే ప్రదక్షిణ ఎప్పుడూ సాగుతూనే ఉండేది. ఎవరో ఒక గుంపు భజనలు చేస్తూ యాత్ర చేస్తూనే ఉండేవారు. నా చిన్నతనం వరకు ఇది సాగింది.’
‘గ్రామాన్ని నిర్మించేటప్పుడు పటేల్ ఆ నవధాన్యాలు చల్లి పరీక్షించిన తరువాత భూమి పూజ చేసేవారు. భూమి పూజ అయ్యాక గ్రామాన్ని ఏర్పాటు చేసేవారు. దాన్ని చాలా అందంగా నిర్మించేవారు. గాలి ఏ వైపు నుండి వస్తుందో చూసుకుని , నిప్పుతో పనిచేసే కమ్మరులూ, కుమ్మరులూ ఏ దిశలో ఉండాలో చూసుకునేవారు. నిప్పుతో పనిచేసే వాళ్ళ ఇళ్ళన్నీ ఆగ్నేయ దిశలో ఉండాలి. ఎందుకంటే మన గాలంతా పశ్చిమ, వాయవ్య దిశలనుండి వస్తుంది. వీరిదంతా నిప్పుతో కూడిన పని. ఇప్పటివరకు ఇంట్లో పొయ్యి అంటుకుని గ్రామం తగలబడటం చూసుంటాం గానీ, కుమ్మరి ఆవం వల్ల గ్రామం తగలబడటం ఎప్పుడన్నా విన్నారా? విని ఉండం. అలా ఆ దిశలన్నింటినీ చూసుకుని ఏ సమాజం ఎక్కడ ఉండాలో అక్కడ కూర్చోబెట్టేవారు. చర్మకారులు ఎప్పుడూ తూర్పువైపున ఉండేవారు. తూర్పు లేదా ఉత్తర దిక్కున. ఎందుకంటే వారి పని వల్ల వచ్చే మురికినీరు ఎటువెళ్ళాలో ఆ వాలు చూసుకుని గ్రామాన్ని నిర్మించేవారు.’
‘అదిలాబాద్ బస్తీ కూడా చాలా అందంగా నిర్మించారు. ఇక్కడంతా వాస్తు ప్రకారం జరిగింది. ఇక్కడున్న కలెక్టరాఫీసు చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంది. ఎస్పీ ఆఫీసు కూడా చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంది. అక్కణ్ణుంచి చూస్తే గ్రామమంతా కనిపిస్తుంది. ఇక్కడి పెద్ద చెరువు ఈశాన్యదిశలో ఉంది. ఆ వాలుని బట్టి ఈ అదిలాబాద్ గ్రామాన్ని నిర్మించారు. పూర్వం ఇది చాలా అందమైన గ్రామం. ప్రతి ఒక్కరి ఇళ్ళు చాలా బాగుండేవి. అందరికీ రెండంతస్తుల ఇళ్ళుండేవి. ఇక్కడ దేశ్ పాండేలు చాలా మంది ఉండేవారు. జమీందారులు. వారి ఇళ్ళకీ, మిగతావారి ఇళ్ళకీ చాలా ఎక్కువ తేడా ఉండేది కాదు. రెండు మూడు పెద్ద పెద్ద హవేలీలున్నాయి. అవి కూడా ఈ రోజుల్లో ఒక క్లర్కు కట్టుకునే ఇళ్ళకంటే పెద్దవేమీ కావు. ఆ ఇళ్ళన్నీ రెండు అంతస్తుల ఇళ్ళే. అందరి ఇళ్ళూ ఒకే డిజైనులో ఉండేవి. బ్రాహ్మణుల ఇళ్ళు రెండు అంతస్తులే, కోమట్ల ఇళ్ళు రెండు అంతస్తులే, రైతుల ఇళ్ళు రెండు అంతస్తులే, కుమ్మరుల ఇళ్ళు కూడా రెండు అంతస్తులే ఉండేవిక్కడ. అన్నీ ఒకే శైలిలో ఉండేవి.’
‘దాంతో పాటు రోడ్ల వ్యవస్థ, నాలాల వ్యవస్థ కూడా అందంగా ఉండేది. ఇక్కడ పదే పదే నిర్మాణాలు జరిగేవి కావు. ఇప్పుడు సిమెంటు వచ్చాక ప్రతి బస్తీలోనూ ఎప్పుడూ ఏదో ఒక నిర్మాణం జరుగుతూనే ఉంది. ఏ ఒక్క గల్లీ లేదా ఏ స్థలమూ ఖాళీగా లేదు. ఇళ్ళు కడుతూనే ఉన్నారు. ప్రతి పది పదిహేను సంవత్సరాలకీ ఇళ్ళు కూల్చేస్తున్నారు, మళ్ళీ కడుతున్నారు. ఆ కాలంలో అలా ఉండేది కాదు. ఎప్పుడోగాని ఒక ఇల్లు కట్టేవారు కాదు గ్రామంలో. ఒక గ్రామంలో ఒక ఇల్లు కట్టాలంటే ఆ కాలంలో పెద్ద పద్ధతిగా ఉండేది. ఎప్పుడో ఎవరిదో ఇల్లు కట్టేవారు, అది కూడా చాలా ఏళ్ళకొకసారి. అంతవరకూ అందరి ఇళ్ళూ ఒక్కలాగే ఉండేవి.’
‘ఇక్కడ నకాషీ వారి ఇళ్ళు అన్నిటికంటే అందంగా ఉండేవి, జమీందారుల ఇళ్ళ కంటే అందంగా ఉండేవి. అవి కూడా రెండు అంతస్తుల ఇళ్ళు. నకాషీలు చేతిపనులు చేసేవారు. పెయింటింగు పనులు. స్వయంగా కళాకారులు కావడం వల్ల వాళ్ళ ఇళ్ళు చాలా అందంగా ఉండేవి. ఇప్పటికీ ఇక్కడ చూడొచ్చు. రెండు అంతస్తుల ఇళ్ళు. వారు ఇళ్ళు కట్టుకునేటప్పుడు ఒకరి వంటగదిలోంచి మరొకరి వంటగదికి దారి ఉండేది. లోపల లోపలే అందరి ఇళ్ళకీ దారులుండేవి. ఒక ఇంట్లో అడుగుపెడితే ఆ లొపల్లోపలే ఎన్నో ఇళ్ళు తిరిగి బయటకు రావచ్చు. ఆ ఇళ్ళల్లోకి ఒక వైపు నుంచి వెళ్తే లోపల లోపలే ఎన్నో ఇళ్ళు దాటుకుని ఇంకో వైపు ఎక్కడో బయటకు వచ్చేవారం. ఎవరి ఇల్లూ విడిగా ఉండేది కాదు. ఒకవేళ మధ్యలో గోడ ఉన్నాసరే, ఖచ్చితంగా ఒక దారి ఉండేది. ఇప్పటికీ పాతబస్తీల్లో ఇవన్నీ అలాగే ఉన్నాయి. లోపల లోపలే దారులుంటాయి. అది ఈ బస్తీ ప్రత్యేకత. ఇళ్ళు కట్టుకోవడానికి వారికంటూ ఒక డిజైన్ ఉండేది. కానీ ఆ ఇళ్ళన్నీ ప్రకృతిని, పర్యావరణాన్నీ చూసుకుని కట్టినవే. ఏదో ఒకటి కట్టేయడం కాదు. చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉంది, చెట్లు ఎలా ఉన్నాయి-వాటన్నింటికీ సరిపోయేలా ఇల్లు కట్టేవారు.’
‘మన ప్రాంతంలో నాలుగు రకాల ఇళ్ళున్నాయి. ఏకశాల, ద్విశాల, త్రిశాల, చతుశ్శాల. అదిలాబాద్ ఇళ్ళన్నీ ఏకశాల ఇళ్ళు. చెన్నూరు ఇళ్ళు ద్విశాల. లక్సెట్టిపేట వైపు ఉన్న ఇళ్ళు త్రిశాల ఇళ్ళు. భైంసా ప్రాంతంలో చతుశ్శాల ఇళ్ళున్నాయి. వాటిదంటూ ఒక శైలి ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా ఏకశాల ఇళ్ళే ఉన్నాయి, ద్విశాల, త్రిశాల లేవు. ఆ కాలంలో ఇళ్ళు కట్టేటప్పుడు ఆయా ప్రాంతాల ప్రకృతిని, వాతావరణాన్ని చూసుకుని వాటికి తగ్గట్లుగా డిజైన్ చేసేవారు. దేవాలయాల డిజైన్ కూడా అలాగే చేసేవారు. మీరు ఎప్పుడైనా తంజావూరు బృహదీశ్వరాలయాన్ని చూస్తే, దాని పక్కన కైలాస పర్వతం ఫొటో పక్క పక్కన పెట్టి చూడండి. రెండూ ఒకేలా ఉంటాయి. దూరం నుండి కైలాస పర్వతం ఎలా కనిపిస్తుందో బృహదీశ్వరాలయం కూడా అలాగే నిర్మించారు. కైలాస పర్వతానికి ఎన్ని కొండలున్నాయో, ఎన్ని శిఖరాలు ఉన్నాయో ఇక్కడ కూడా అన్ని శిఖరాలు నిర్మించారు. రెండు ఫొటోలు చూస్తే ఒకేలా అనిపిస్తుంది. చాలా అందంగా ఉంటుంది. ఇలాంటి అధ్యయనాలు చేసే వారు గ్రామాల్ని నిర్మించుకునేవారు.’
‘ఏకశాల ఇల్లు అంటే తూర్పుపడమరల్ని బట్టి ఒకే వైపు ఇల్లు ఉంటుంది. ద్విశాల అంటే ఇంగ్లిషు అక్షరం L ఆకారంలో ఉంటుంది. త్రిశాల అంటే మూడు వైపులా ఇల్లుంటుంది. మీరెప్పుడైనా హైదారాబాదునుంచి వచ్చేటప్పుడు ఆర్మూరు వైపు చూస్తే అక్కడున్న ఇళ్ళన్నీ త్రిశాల ఇళ్ళే. ముందు ఒక భాగం, అటు ఇటు రెండు భాగాలు ఉంటాయి. అంటే U ఆకారంలో అన్నమాట. అవి త్రిశాల ఇళ్ళు. ధర్మపురిలో ఇళ్ళన్నీ చతుశ్శాల ఇళ్ళు. నాలుగు వైపులా ఇల్లు ఉండి, మధ్యలో అంగణం ఉంటుంది. భైంసా ప్రాంతంలో కూడా అలాంటి ఇళ్ళే ఉన్నాయి. ధర్మపురి అంతా అలాగే ఉంటుంది. వేములవాడ అంతా ద్విశాల, చెన్నూరు ద్విశాల.’
‘దీని వెనుక కూడా ఒక సైన్సు ఉంది. కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాల వ్యాధులు వస్తుంటాయి. వాటినుంచి రక్షించుకోడానికి ఇళ్ళలా నిర్మించేవారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన వ్యాధులు ఉంటాయి కదా, వాటినుంచి తప్పించుకోడానికి గాలి ఎటునుంచి రావాలి, ఎలా ఉండాలి అనేదాన్ని బట్టి ఇళ్ళు కట్టేవారు. అది వారి విజ్ఞానం. ఏ ఇంట్లో నివసిస్తే ఏమవుతుంది అనేది వారికి తెలుసు. అదంతా ప్రకృతి ఆధారంగా చేసుకున్నది. ఇక్కడ ఒక మఠం ఉంది. అక్కడ ఎందుకో తెలీదు కానీ ఎంతమంది మహంతులని చూసినా వారికి ఆస్త్మా వ్యాధి వస్తూంటుంది. ఆ మఠం నిర్మించిన విధానం అలాంటిది. ఆ డిజైను లోపం, అక్కడ ఎవరున్నా సరే ఆస్త్మా వస్తుంది.’
‘మన దగ్గర ప్రతి కార్తెలోనూ ఒక కీటకం పుడుతుంది. ప్రతి నక్షత్రంలోనూ ఒక కీటకం పుడుతుంది, ఆ కీటకాలను చంపడం మీద కన్నా వాటినుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి అనేది మనవాళ్ళు ఆలోచించేవారు. అవి ప్రకృతిసహజంగా పుడతాయి. అయితే వాటినుండి మనం తప్పించుకోవచ్చు కదా? అలా తప్పించుకోడానికి, మనల్ని కాపాడుకోడానికి ఎన్నో పద్ధతులున్నాయి. ఇల్లు కూడా అందులో ఒక భాగం.’
‘ఇక్కడ ప్రతి ఒక్క ప్రాంతంలోని నీటి గురించీ మన దగ్గర పెద్ద సమాచారం ఉంది. ఏదో ఒక పురాణంలో చదివాను కూడా-హిందుస్తాన్ లో నదులగురించి, ఇక్కడి భూమి గురించి, ఆ నీటి ప్రత్యేకత గురించి రాసి ఉంది. గంగానది నీరు వాతం చేస్తుందా, పిత్తం ప్రకోపింప చేస్తుందా లేక కఫం చేస్తుందా అనేది. ప్రతి ఒక్క నదినీటికీ ఒక గుణం ఉంది. ఒకచోట నీరు వాతం చేస్తే ఇంకో చోట నీరు పిత్తం అధికం చేస్తుంది. ఇంకో చోట కఫం. ఇవన్నీ ఆయా ప్రాంతాల నీటిగుణాలు. చెరువునీటి గురించి కూడా వారు చాలా బాగా అధ్యయనం చేసారు. బావుల నీటి గురించి కూడా. ప్రతి ప్రాంతంలోని బావి నీటికీ ఎలాంటి గుణముంటుందనేది ఉంది. ఆయుర్వేదం ప్రకారంప్రతి ఒక్క నదినీటికి ఎలాంటి గుణముంటుందనేది ఎక్కణ్ణుంచో ఎత్తి రాసుకున్నాను. నల్లమట్టి ఉన్న చెరువు నీటి గుణం ఏమిటి? ఎర్రమట్టి ఉన్న చెరువునీటి గుణం ఏమిటి? కొండల మధ్యనుంచి ప్రవహించే నది నీటిగుణం ఏమిటి? అలా నీటి గుణాలన్నింటినీ వారు చాలా బాగా అధ్యయనం చేసారు. అవన్నీ రాసి ఉంచారు. ప్రతి చిన్న నది నీటిగుణాన్ని కూడా చెప్పారు. ఆ నదీతీరాన ఉన్న వారికి ఎలాంటి వ్యాధులు వస్తాయి? వాటినుండి తప్పించుకోడానికి ఏం చేయాలో ఆలోచించారు. ఇల్లు కూడా అందులో ఒక భాగమే. ఆయా ప్రాంతాల్లో ఇళ్ళను అలా డిజైను చెయ్యడానికి కారణం అక్కడి నీరూ, వాతావరణమూను. నేనెక్కడో చూసాను, గంగానది నీటి గుణం ఏమిటి, యమున గుణం ఏమిటి, గోదావరి గుణం ఏమిటి? ఆ నీటిగుణాలనుంచి మనల్ని రక్షించుకోడానికి ఏం తినాలి, ఎలాంటి ఇంట్లో ఉండాలి మొదలైనవన్నీ అందులో రాసి ఉన్నాయి.’
‘ఒక గ్రామంలో ఎవరెవరు ఉండాలి, ఏయే పనులు చేసేవాళ్ళు ఎంతమంది ఉండాలి అనే ఒక నిష్పత్తి కూడా ఉంటుంది. అది కూడా ఒక లెక్కనే. ఎంతమంది ఉండాలి, ఏ పనులు చెయ్యాలనేది. ఇవన్నీ ఒక ప్రణాళిక ప్రకారమే ఏర్పడ్డాయి. యాదృచ్ఛికంగా కాదు. ఒక ప్లానింగు ప్రకారమే జరిగాయి. పూర్వం మనదగ్గర నగరాలకు అంత ప్రాధాన్యత లేదు. మనకు కేవలం ఏడు నగరాల గురించే ప్రస్తావన ఉంది. అయోధ్య, మధుర, కాశి మొదలైన ఏడు నగరాలు. ఈ ఏడు నగరాలూ ప్రాచీన కాలం నుంచీ ఉన్నాయి.’
అప్పుడొక శ్రోత ‘పాటలీపుత్రం లేదా? వాటిల్లో?’ అనడిగాడు.
‘లేదు’ అని చెప్పారు గురూజీ ఖండితంగా. ‘పాటలీపుత్రాన్ని ఎన్నో సార్లు కట్టారు. అది ఎన్నో సార్లు నాశనమైపోయింది.’
‘మరి హస్తినాపురం ఉందా? ‘ మళ్ళీ అడిగాడు ఆ శ్రోత.
‘హస్తినాపురం ఉంది కానీ,’ అని గురూజీ ఒకసారి ఆ ఏడు నగరాల పేర్లూ చెప్పి, ‘ఆ ఏడు నగరాల జాబితాలో దాని పేరు లేదు. ఎందుకంటే హస్తినాపురం మోక్షాన్నిచ్చే నగరం కాదు. ఈ ఏడింటిని మాత్రమే మోక్షానిచ్చే నగరాలుగా భావిస్తారు. ఆ తర్వాత నగరాల్లేవు. ఎందుకంటే మన దగ్గర పట్టణాల్నీ, నగరాల్నీ అంత మంచిగా భావించలేదు. ఇంద్రుడి పని ఏమిటంటే, ఏదైనా ఒక నగరంలో జనాభా అయిదు లక్షల కంటే ఎక్కువైతే దాన్ని నాశనం చేసేవాడు. చెరువుల్ని నాశనం చేసేవాడు. పెద్దపెద్ద చెరువుల్నీ, నగరాల్నీ నాశనం చేసేవాడు. అందుకే అతనికి ‘పురందర’ అనే పేరు వచ్చింది. పురందరుడంటే నగరాల్ని నాశనం చేసేవాడు. ఎప్పుడైనా పెద్ద పెద్ద చెరువులూ, నగరాలూ ఏర్పడితే ఇంద్రుడు వాటిని అంతం చేసేసేవాడు. ఒక్కోసారి అనిపిస్తుంది: మళ్ళీ అలాంటి వాడు ఎవరైనా పుట్టాలి అని!’
అని నవ్వేశారు గురూజీ! మళ్ళీ అందుకుని-
‘ఆ సంగతి అలా వదిలెయ్యండి. గ్రామాల శైలి, వాటి జనాభా, వాటి సరిహద్దులు- ఇవన్నీ చాలా అందంగా కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో గ్రామాలు చాలా బావుండేవి. ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ గ్రామాలు ఆ లెక్కల్లోకి రావు. ఇక్కడి పాతబస్తీలు అంకోలి, తంతోలి, జైనథ్, జిమ్మా-ఇవన్నీ ఇప్పటికీ అలాగే ఉన్నాయి. వాటి సరిహద్దులు కూడా అంతే పెద్దవిగా ఉన్నాయి. అవి అలానే కొనసాగుతున్నాయి. ఒక గ్రామం నుంచి చూస్తే మరో గ్రామం కనిపిస్తూనే ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది. అక్కడి శబ్దాలు కూడా వినిపిస్తూ ఉంటాయి. ఆ చిన్న గ్రామాల గురించి విద్యాసాగర్ రెడ్డి1 గారు చాలా మంచి అధ్యయనం చేసారు. అందులో ఆ శాతాల వివరాలన్నీ ఇచ్చారు. గ్రామాల్లో ఉండే చేతివృత్తుల వారి గురించి లెక్కలిచ్చారు. మన దగ్గరున్న పత్రాల ప్రకారం 360 జాతుల ప్రస్తావన వస్తుంది. ఇరవై కిలోమీటర్ల పరిధిలో 360 జాతులు లేదా కులాలు బతకవచ్చు. ప్రతి వస్తువూ అక్కడ తయారవ్వాలి. ఆ కులాలు లేదా జాతుల వారు ఒకరిమీద ఒకరు ఆధారపడి ఉండేవారు. ఇదంతా నిన్న మాట్లాడుకున్నాం. ముఖ్యంగా 18 కులాల వారుండేవారు. కర్ణాటక పెళ్ళిళ్ళల్లో కూడా 52 కులాల ప్రస్తావన వస్తుంది. ఆ 52 కులాల సామగ్రి ఖచ్చితంగా ఉండాలి అని. రాజస్తాన్ లో కూడా 52 కులాల ప్రస్తావన వస్తుంది. ఒక పెళ్ళిలో 52 కులాల వారికి ప్రాధాన్యత ఉంటుందని. ప్రశాంత్2 దీనిమీద లెక్కలు తీస్తే తేలింది. ఒక పెళ్ళి జరిగితే 52 కులాల చేతివృత్తుల వారి సామగ్రి అందులో అవసరమవుతుంది. రాజస్తాన్ లో కూడా ఈ లెక్కలు తీస్తే అంతే తేలింది. మొన్న గోపాల్ తో పాటు బికనీర్ నుంచి ఒక శర్మ గారు వచ్చారు. వారి దగ్గర చాలా పాటలున్నాయి. పెళ్ళిళ్ళలో పాడే పాటలు. పెళ్ళికి పిలిచినప్పుడు ఏ కులం వాడు ఎక్కడ కూర్చోవాలి అనే దానికి ఎలాంటి ఏర్పాట్లు చేసేవారో ఆ పాటల్లో ఉంది. వారికోసం ఎలాంటి ఆసనం వేయాలి, ఎవరికి గొంగడి పరచాలి, ఎవరికి చద్దరు వేయాలి లాంటివన్నీ. ఇప్పుడు సన్న్యాసులున్నారు, వారు గొంగడిమీదనే కదా కూచుంటారు, వారు చద్దర్లమీద కూచోరు. అదొక పద్ధతి.’
నాకు అర్థమయింది. గురూజీ నిన్న సామాజిక అర్థ వ్యవస్థ గురించి మాట్లాడారు. ఇవాళ గ్రామాల గురించీ, ఇళ్ళ గురించీ, వ్యవసాయం గురించీ, నీటి వ్యవస్థ గురించీ, మొత్తం కౌటుంబిక అర్థవ్యవస్థ గురించి మాట్లాడబోతున్నారన్న మాట అని అనుకున్నాను.
- విద్యాసాగర్ రెడ్డిగారు నిర్మల్ కి చెందిన అడ్వొకేట్. అదిలాబాదు జిల్లా గ్రామవ్యవస్థల మీద పరిశోధన చేసారు.
- ప్రశాంత్.వి.కుమార్ శ్రీ శ్రీ రవిశంకర్ బృందానికి చెందిన వారు. కళాశ్రమంతో కలిసి పనిచేసారు. రజని బక్షి కన్నా ముందే కళాశ్రమం పైన ఒక పుస్తకం రాయాలని చాలా సమాచారం సేకరించారు.
Featured image: Meeting in Kalashramam, photograph courtesy: Apurva Sharma
16-6-2026


జీవన శిల్పి 14వ భాగం చదువుతుంటే, ఆధునిక సమాజం ఏదైతే టెక్నలాజికల్ డెవలప్మెంట్, అడ్వాన్స్మెంట్, ‘అభివృద్ధి’ అని బావిస్తున్న ఆధునిక నగర నాగరికత వెనుక ఎంతటి ఆశాస్త్రీయత ఉందో, దానికి భిన్నంగా మన ప్రాచీన గ్రామ వ్యవస్థ వెనుక ఎంతటి అద్భుతమైన పర్యావరణ విజ్ఞానం, సామాజికత ల సమతుల్యత నిక్షిప్తమై ఉండేదో గురూజీ రవీంద్ర కుమార్ శర్మ గారి మాటల్లో తెలుసుకుంటుంటే మన ప్రాచీన గ్రామీణ వ్యవస్థల మీద ఎప్పటినుంచో ఉన్న ఎన్నో సందేహాలు నివృత్తమవుతున్నాయి భద్రుడు గారు.
గాలి దిశలను బట్టి ఆగ్నేయంలో కమ్మరులు, కుమ్మరుల ఇళ్లు నిర్మించడం, ప్రాంతీయ వాతావరణాన్ని, వ్యాధులను తట్టుకునేలా ఏకశాల నుండి చతుశ్శాల వరకు ఇళ్లను డిజైన్ చేయడం కేవలం ఇటుకల నిర్మాణం కాదు, అదొక ప్రకృతి చికిత్స. నదుల, చెరువుల నీటి గుణాలను (వాత, పిత్త, కఫాలు) అధ్యయనం చేసి, దానికి తగ్గట్టుగా వాస్తు, పర్యావరణాలను సమన్వయం చేసుకుంటూ జీవనశైలిని మార్చుకోవడం భలే అనిపించింది.
ప్రతి 500 సంవత్సరాలకు ప్రకృతి నియమం ప్రకారం జనాభా పెరుగుదల , అడవి విస్తరణ మధ్య ఉండే సమతుల్యతను బట్టి గ్రామ శివార్లను నిర్ణయించడం, మనిషి తన ఆహారం కోసం ప్రయాణించాల్సిన పరిధిని ఎడ్లబండి వేగానికి, పక్షుల గూటికి పరిమితం చేయడం వంటి విషయాలు గురూజీ నోట వింటుంటే ఆ గ్రామాల్లో ప్రజలు ఎంతటి సుస్థిరమైన ప్రణాళికతో బతికేవారో అర్థమవుతోంది.
ఐదు లక్షల జనాభా దాటితే నగరాలను అంతం చేసే ‘పురందరుడి’ (ఇంద్రుడి) ప్రస్తావన తెచ్చి—”ఒక్కోసారి అనిపిస్తుంది: మళ్ళీ అలాంటి వాడు ఎవరైనా పుట్టాలి అని!” అన్న గురూజీ చమత్కారపు నవ్వు వెనుక మెట్రో నగరాలుగా మారిపోతూ, కాలుష్యంతో, అడ్డగోలు నిర్మాణాలతో ఊపిరాడకుండా పోతున్న నేటి నగరాలు నాశనమవ్వడమే తప్ప బాగుపడవన్న సర్కాజమ్ ఉందేమో కదండీ…
గత భాగాల్లోని గ్రామీణ వ్యవస్థల్లో ఆర్థిక, సామాజిక విశ్లేషణల నుండి ఈ భాగంలో అప్పటి గ్రామాల్లో కౌటుంబిక, భౌగోళిక పర్యావరణ అర్థవ్యవస్థల వైపు గురూజీ చేసిన సంభాషణలను మీ అక్షరాల్లో చదవడం చాలా సంతోషంగా ఉంది.
చాలా చక్కగా సమ్మరైజ్ చేశారు. మీ సహృదయ స్పందనకు నమోవాకాలు.
ఎంత research, ఎన్ని విషయాలు!!
గ్రామం అంటే నిర్వచనం, గ్రామాన్ని పూర్వులు ఎలా ఏర్పాటు చేసుకున్నారు, వివిధ వృత్తుల వాళ్ళు, సామాజికంగా జీవించడం అంటే ఏమిటి, చాణక్యుడు గ్రామాన్ని ఎలా నిర్మించాలి, ఎలా ఏర్పాటు చేయాలి అనే పద్ధతులు చెప్పడం, గ్రామ సరిహద్దులను ఎలా నిర్ణయించారు, నదుల్లోని నీటి గుణాలు, types of houses!!
గురూజీ ఎంత అధ్యయనం చేశారు!!
ఈ సంభాషణ చదువుతుంటే, పూర్వపు గ్రామం ఒక geographical unit మాత్రమే కాదు, ఒక cultural, ecological and economic unit కూడా కదా అనిపిస్తుంది.
“గ్రామాల శైలి, వాటి జనాభా, వాటి సరిహద్దులు- ఇవన్నీ చాలా అందంగా కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో గ్రామాలు చాలా బావుండేవి. ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ గ్రామాలు ఆ లెక్కల్లోకి రావు. ఇక్కడి పాతబస్తీలు అంకోలి, తంతోలి, జైనథ్, జిమ్మా-ఇవన్నీ ఇప్పటికీ అలాగే ఉన్నాయి.”
The fact that these villages still retain something of their original character is both surprising and amazing.
Centuries ago చేసిన planning ఎంత పటిష్టంగా వుంటే ఈ గ్రామాలింకా functional గా నిలబడి వున్నాయి!!
Thank you for sharing so much knowledge and wisdom, Sir.🙏🏽
అవును కదా! హృదయపూర్వక ధన్యవాదాలు మాధవీ!