నేను తిరిగిన దారులు-15

త్రయంబకం యజామహే

2

బిందువులో సింధువు

మేము తుల్జాపూర్ వదిలేటప్పటికే చాలా ఆలస్యమైంది. దాంతో మేం షిర్డీ చేరేటప్పటికి బాగా పొద్దుపోయింది. అంతకుముందు షిర్డీ వెళ్లినప్పుడు ఒకసారి ఎల్లోరా, మరొకసారి అజంతా చూశాం. ఈ సారి కూడా మరేదన్నా కొత్త స్థలం చూడాలనుకున్నాం. చుట్టుపక్కలున్న స్థలాల గురించి అడుగుతుంటే అందరికీ ఈ సారి త్రయంబకం చూడాలనిపించింది. దాంతో పొద్దున్నే నాసిక్ మీదుగా త్రయంబకం వెళ్లడానికి నిశ్చయించుకున్నాం.

విజయదశమి రోజులు కావడంతో షిర్డీ చాలా రద్దీగా ఉంది. మాకు ఉండడానికి ఒక పెద్ద హాలులాంటిది దొరికింది. మేం ఆ రాత్రి ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అన్న అలోచనతోనే గడిపేశాం. పొద్దున్నే నాసిక్ బయలుదేరాం. ప్రయాణంలో కొంతదూరం పోయినతరువాత మేం పశ్చిమకనుమల బాట పట్టామని మాకర్థమైంది. ఆ దారి పొడుగునా ఎత్తు పల్లాల మధ్య కొండవాలుల మధ్య, మలుపులమధ్య ప్రయాణిస్తుంటే నేనంతదాకా చూసి ఉండని కొత్తనేల కనిపించడం మొదలైంది. కొత్త ప్రదేశాలు చూడటంలో మనలో రేకెత్తే ఈ సంతోషానికి అర్థమేమిటి? కొత్త ప్రదేశాలు చూసినప్పుడు బహుశా మనలో ఏదో పరిమితమైన వాటినుంచి బయటపడే విడుదల తాలూకు సంతోషం స్ఫురిస్తుందనుకుంటాను. ఈ సంతోషమే మరింత బలపడితే మనిషి సాహసికుడిగా మారతాడనుకుంటాను. అపారమైన సముద్రాలమీద చిన్నచిన్న తెప్పలు వేసుకుని కొత్త ఖండాల్నీ, కొత్త దేశాల్నీ వెతుక్కుంటూ పోయిన మహానావికుల్నీ, మహా సాహసికుల్నీ ఈ సంతోషం ఒక వ్యసనంగా పట్టుకుని ఉందనుకుంటాను.

ఆ గ్రామీణ మహారాష్ట్రసీమ గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఆ ఎగుడుదిగుడుల దారులు నాకు ప్రాచీనప్రాకృత కవిత్వపంక్తుల్లాగా అనిపించాయి. హాలుడి ‘గాథాసప్తశతి’, జయవల్లభుడి ‘వజ్జాలగ్గం’ ఈ దారుల్లో రూపొందినవే. కొన్నేళ్లకిందట ఆండ్రూషెల్లింగ్ అనే ఒక అమెరికన్ సాహిత్యవిదార్థి కొన్ని ప్రాకృతకవితలకు చేసిన అనువాదాలు చదివాను. ‘ద కేన్ గ్రోవ్స్ ఆఫ్ నర్మదా రివర్’ (1998), ‘డ్రాపింగ్ ద బౌ’ (1991) పేరిట అతడు తెచ్చిన సంకలనాల్లో కొన్ని సంస్కృతప్రాకృత అనువాదాలు చూసినప్పుడు ప్రాకృతకవిత్వం చాలా కొత్తగా, చాలా సమకాలీనంగా కనిపించింది. దాంతో మళ్లా నేను ‘గాథాసప్తశతి’, ‘వజ్జాలగ్గం’, ‘అమరుశతకం’, ‘సుభాషితరత్నావళి’, ‘చోరపంచాశిక’ వంటి ప్రాచీనకవితాసంకలనాలు అధ్యయనం మొదలుపెట్టాను. ఇప్పుడు ఈ గ్రామాలమధ్యనుంచి ప్రయాణిస్తుంటే ఆ కవితలు మళ్లా కొత్తగా అర్థవంతంగా స్ఫురిస్తూఉన్నాయి. వానాకాలం గడిచిపోయి శరత్కాలం ప్రవేశిస్తున్న ఈ ప్రాంతమంతటా రంగులు తిరుగుతున్న ఆకుపచ్చదనం గాథాసప్తశతినుంచి ఈ గాథను గుర్తుకు తెస్తోంది.

వర్షారాత్రా ఉన్నతపయోధరే యౌవనే ఇవ వ్యతిక్రాంతే
ప్రథమైక కాసకుసుమం దృశ్యతే పలితం ఇవ ధరణ్యాః

ఆ ఉన్నతస్తని యవ్వనం గతించిపోయినట్టు
వానాకాలపు మేఘరాత్రులు తరలిపోయాయి
ఇప్పుడు కళ్లముందు తలెత్తిన తొలి రెల్లుపువ్వు
ధరణీకేశరాశిలో తెల్లవెంట్రుకలా కనిపిస్తోంది.

గాథాసప్తశతినుంచే మరొక కవిత:

కుత్రగతం రవిబింబం కుత్ర ప్రనష్టాః చంద్రతారాః
గగనే బలాకాపంక్తీ కాలః హోరామ్ ఇవ కర్షతి

ఆ రవిబింబం ఇప్పుడెక్కడ?
ఆ చంద్రతారలు ఇప్పుడెక్కడ?
జ్యోతిష్కుడి కుండలిలో గుర్తుల్లాగా
ఆకాశంలో కొంగలబారులు

మేం నాసిక్ లో  ఆగకుండానే ఆ రోడ్లమీదుగా ఆ  పట్టణాన్ని చూసుకుంటూ త్రయంబకం దారిన ముందుకు సాగిపోయాం. నాసిక్ దాటి కొంతదూరం పోయిన తరువాత దూరంగా ఒక కొండలవరుస కనిపిస్తూ ఉంది. నీలదిగంతరేఖ మీద విప్పారుతున్న మొగ్గల్లాగా ఆ దూరశిఖరాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ దారిన అడుగుపెట్టిన ఏ ప్రయాణీకుడైనా వాటిని చూడగానే ఒక క్షణం చకితుడు కాకుండా ఉండలేడు. అస్పష్టంగా కనిపిస్తున్న ఆ శిఖరాలు మనలో ఏదో స్పష్టమైన జ్ఞాపకాల్ని మేల్కొల్పుతున్నట్టే ఉన్నాయి. ఇక అవి కనబడినప్పటినుంచీ మా ప్రయాణమంతా వాటికి మరింతమరింత చేరువగా పోతూండడమేనని అనిపించింది.

మేం త్రయంబకం చేరేటప్పటికి పదకొండు గంటలు దాటింది. మా బండిని ఊరి బయటే పార్కింగ్లో ఆపారు. అక్కడనుంచి ఊళ్లోకి నడిచిపోవాలన్నారు. మేం అక్కడనుంచి ఊళ్లోకి వెళ్లి గుడి ఎక్కడ ఉందని అడుగుతూ వెళ్లాం. నాకు త్రయంబకేశ్వరుణ్ణి చూడటంకన్నా గోదావరి ఎక్కడ పుట్టిందో ఆ చోటు చూడాలన్న కుతూహలం చాలా ఎక్కువగా ఉంది. మేం గుడి దగ్గరికి వెళ్తూ దారి పొడుగునా ఏవేవో ఊహించుకుంటూ ఉన్నాం. నా మనసులో ఏదో ఒక అస్పష్టమైన చిత్రం. అక్కడ గోదావరి ప్రవహిస్తూ ఉంటుందనీ, ఆ ఒడ్డున త్రయంబకేశ్వరుని దేవాలయం ఉంటుందనీ, మేం నదిలో స్నానం చేసి దేవుణ్ణి దర్శించుకోవచ్చనీ… ఇట్లాంటివే ఏవేవో ఆలోచనలు. గోదావరి జిల్లాలో పుట్టి జీవితమంతా గోదావరితోటే అల్లుకుని పెరిగినవాణ్ణి. నా ఊహలు, నా కలలు, నా కవిత్వం, నా సంస్కారం గోదావరి ఉగ్గుపాలతో రంగరించి పోసింది. నది మూలం అన్వేషించకూడదంటారు కానీ, ఈ రోజు నేను ఈ నది ఉద్గమస్థానాన్ని వెతుక్కుంటూ వస్తే, నాకు నా సంస్కారమూలాల్ని వెతుక్కుంటున్నట్టే అనిపించింది.

తీరాచేసి మేం గుడి దగ్గరికి వెళ్తే అక్కడెక్కడా మాకు గోదావరి కనిపించలేదు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన త్రయంబకేశ్వరం లోపల శివుడు మాకోసం ఎదురుచూస్తూన్నాడు. కానీ మేం గంగను వెతుకుతున్నాం. నాకు నీలితరగల గోదావరి ఎక్కడుందన్న ఆత్రుత తప్ప, మరేదీ పట్టడం లేదు. ఆ పచ్చని ఎండలో ఆ దేవాలయం నల్లని ప్రాకారం ఎదుట నేను కనబడ్డ వాళ్లని ఆపి ‘గోదావరి ఎక్కడ?’ అని అడుగుతూనేతున్నాను. నా ప్రశ్న వాళ్లకి అర్థం కావడం లేదు. చివరికి ఒక బ్రాహ్మణుడు నా మాట విని ‘నువ్వు అడుగుతున్నది కుశావర్తం గురించేనా? అదిగో, ఆ దారిలో కుడివైపు తిరిగి కొద్దిగా ముందుకువెళ్లు. అక్కడ కనిపిస్తుంది. అదే గోదావరి’ అన్నాడు.

మేం ఆ ఇరుకైన దేవాలయ వీథుల్లో అటూఇటూ పేర్చిన పూజాసామగ్రి దుకాణాల మధ్యనుంచి అతను చెప్పినట్టే మలుపులు తిరిగి వెళ్లేటప్పటికి అక్కడ కొన్ని మండపాలు, వాటి మధ్య మెట్లు కట్టిన ఒక కోనేరు కనిపించాయి. కానీ ఆ కోనేటిలో ఒక్క చుక్కకూడా నీరు లేదు. దాని అడుగునంతా ఎండిపోయి నల్లటి మట్టి కనిపిస్తూ ఉంది. ఆ కోనేరు దిగువమెట్లు ఎండిపోయిన నాచుతో నల్లగా కనిపిస్తున్నాయి. ఆ కోనేటి మధ్యలో ఒక చిన్న కుండీలాగా ఉంది. నేను అటూఇటూ చుట్టూ చూశాను. ఏది, ఆ నీలితరగల గోదావరి? అక్కడెవరినో ఆపి ‘ఇక్కడ గోదావరి ఏది?’ అని అడిగాను. వాళ్లు ఆ కోనేటిమధ్యలో ఉన్న ఆ కుండీని చూపించారు. దాన్లో నల్లగా, మురిగ్గా ఉన్న నీళ్లని చూపిస్తూ ‘అదే గోదావరి, అదే కుశావర్తం’ అన్నారు. పన్నెండేళ్లకొకసారి బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు కుంభమేళా జరిగే కుశావర్తం, సకల దోషాలనూ హరిస్తుందని నామదేవ్ కీర్తించిన కుశావర్తం, ఎక్కడ స్నానం చేస్తే నేరుగా కైలాసపర్వతం మీదే చోటు దొరుకుతుందని కీర్తించారో, ఆ కుశావర్తం ఇదేనా? నాకు ఆ నీళ్లను కనీసం ముట్టుకోవాలని కూడా అనిపించలేదు. మళ్లా వాళ్లతో ‘ఇక్కడ గోదావరి ఎక్కడ?’ అని అడిగాను. ‘గోదావరి అదే. ఆ కుశావర్తంలోంచే నాసిక్ వైపు  ప్రయాణిస్తోంది’ అన్నారు వాళ్లు. నాకు చెప్పలేనంత నిరుత్సాహం కలిగింది. నేను ఇంతదూరం అన్వేషిస్తూ వచ్చింది దీన్ని చూడ్డానికేనా? అయినా మరోసారి ఆశగా వాళ్లను అడిగాను: ‘గోదావరి పుట్టింది ఎక్కడ?’ అని.

అప్పుడు వాళ్లు దూరంగా కనిపిస్తున్న కొండలవైపు చూపించారు. ఆ కొండల్నీ మేం పొద్దుటనుంచీ చూస్తూ వస్తున్నది. ‘అదిగో. ఆ బ్రహ్మగిరి మీదనే గోదావరి పుట్టింది. మీరు గోదావరిని చూడాలంటే అక్కడికి వెళ్లండి’ అన్నారు. నేను మళ్లా ఆ కొండల్ని చూశాను. అప్పటికి మిట్టమధ్యాహ్నం పన్నెండు దాటింది. ఎండ తీక్షణంగా ఉంది. ఆ కొండలు ఆకాశాన్ని తాకుతున్నంత ఎత్తుగా ఉన్నాయి. ‘అక్కడికి వెళ్లడానికి దారేమిటి?’ అని అడిగితే, ‘ఎక్కడానికి మెట్లున్నాయి. మీకు కావాలంటే డోలీ కూడా కడతారు’ అన్నారు అక్కడివాళ్లు. మేం పొద్దుటనుంచీ ఏమీ తినలేదు. ఆకలిగా కూడా ఉంది. కాని నాకు ఎలాగైనా ఆ కొండలమీదకు వెళ్లి గోదావరి పుట్టే చోటు ఎలా ఉంటుందో చూడాలని చాలా బలంగా అనిపిస్తోంది. కాని ఆడవాళ్లూ, చిన్నపిల్లలు ఆ ఎండకి తట్టుకోగలరా? కొండ ఎక్కగలరా? కాని ఆశ్చర్యంగా అందరికీ నాకు లాగే ఆ కొండ ఎక్కాలని కోరిక బలంగా ఉంది. మేం అడుగు ముందుకేశాం.

కొంతదూరం పోగానే ఊరు శివార్లనుంచి అడవి మొదలైంది. అటూఇటూ దట్టంగా పెరిగిన వెదురు పొదలూ, రేగుచెట్లూ, చిన్నచిన్న పొదలూ, ఎటుచూసిన అడవిపూలూ. ఊరిబయట కొండదిగువన చాలామంది డోలీలు మోసేవాళ్లు కనిపించారు. వాళ్లు మమ్మల్ని చూడగానే గలగలా పరుగెట్టుకుంటూ వచ్చి డోలీలు కడతామన్నారు. ఒక్కోడోలీలో ఇద్దరేసి మనుషులు కూర్చోవచ్చనీ, డోలీకి ఏడువందలదాకా అవుతుందని చెప్పారు. మేం డోలీలు కట్టించాలా వద్దా అన్నది తేల్చుకోలేకపోయాం. వాళ్లనట్లానే వదలి కొంతదూరం ముందుకు వెళ్లాం. వాళ్లు మా వెనకే వచ్చి బేరమాడారు. చివరికి రెండు డోలీలు కట్టించాం. ఒక డోలీలో మా వదినా, మరో డోలీలో విజ్జీ కూర్చున్నారు. ఆ ఎండలో చెట్లనీడలమధ్యా ఒక్కొక్క మెట్టూ ఎక్కుతూ ఆ కొండలవైపు ప్రయాణిస్తుంటే నాకు ఆకాశానికి నిచ్చెన ఎక్కుతున్నట్లనిపించింది. మేం కొండమీదకు చేరేటప్పటికి ఆకలి పూర్తిగా పోయింది.

బ్రహ్మగిరి అని పిలుస్తుండే మహాశిఖరం అంచులదగ్గర మలుపులు తిరుగుతూ ‘ఇక్కడ గోదావరి ఎక్కడ?’ అని కనిపించిన వాళ్లందర్నీ అడుగుతూ వెళ్తున్నాను. కొండశిఖరం మీంచి ఉరికే సింహపు పిల్లలా ఒక జలపాతం నా కళ్లముందు సాక్షాత్కరిస్తుందని నా ఊహ. ‘తాను తెప్పున్న ఎగసింది గోదావరి’ అని కవి చిత్రించిన చిత్రమేదో నా మనసులో అచ్చుగుద్దినట్టు ఉండిపోయింది. కొండ కొమ్ముమీంచి కిందికి జాలుగా ఎగిసిపడుతున్న జలపాతం మీంచి నీటి ఆవిరి గాల్లో తేలుతుంటే, ఆ ఆవిరిమీంచి ఏటవాలుగా ఏడురంగుల ఇంద్రచాపం కనిపిస్తుందని నా కల.

మాకెవరో ‘అదిగో నాలుగడుగులు ముందుకెళ్తే అక్కడే గంగాద్వారం’ అని చెప్పారు. మేం అక్కడనుంచి వడివడిగా అడుగులు వేసుకుంటూ ఆ గంగాద్వారం దగ్గరికి వెళ్లాం. అక్కడ శిఖరపాదం చెంత చిన్నగుహలాగా ఉంది. ఆ గుహ మొదట్లో ఒక పెద్ద నీళ్ల తొట్టెలాగా ఉంది. అక్కడ కొంతమంది భక్తులు నిలబడి నమస్కారాలు పెడుతున్నారు. ఒక పూజారి పచ్చటి ఆకుతో వాళ్లమీద శుద్ధోదకం చల్లుతున్నాడు. మేం కూడా అక్కడికి వెళ్లి ఆ పూజారిని ‘ఇక్కడ గోదావరి ఏది’ అని అడిగాం.

ఆ పూజారి ‘ఇదిగో ఇదే గంగా గోదావరి’ అన్నాడు. అతను చూపిస్తున్న వైపు చూస్తే, ఏముంది అక్కడ? ఒక గోముఖంలాంటి బొమ్మ, దాని నోటినుంచి ఒకటీ ఒకటి చొప్పున కిందికి పడుతున్న నీటి బొట్లు. కింద తొట్టెలాగా ఉన్న నిర్మాణంలో పడుతున్న నీళ్లు తేటగా, స్వచ్ఛంగా మెరుస్తున్నాయి. ఆ నీళ్లమీద ఒక్కొక్క నీటిబొట్టూ పడుతున్నవేళ నిశ్శబ్దంగా సన్నని నీటి తరగలు విస్తరిస్తున్నాయి. శరత్కాలపు అపరాహపువేళల ప్రశాంతి, అడవిపూల సుగంధంతో కూడుకుని చుట్టూ ఆవరిస్తోంది. నేను ఉండబట్టలేక మళ్లీ అడిగాను, ‘ఇదేనా గోదావరి’ అని.

‘ఇదే ఇదే’ అన్నాడా పూజారి. ‘ఈ గోదావరే, మీరు కింద చూసి ఉంటారే కుశావర్తం. అక్కడికి వెళ్లి అక్కడనుంచి నాసిక్ వైపు ప్రవహిస్తుంది’ అన్నాడు.

బహుశా అతడు చూసింది అంతదాకానే అయి ఉంటుంది. కాని బాసర సరస్వతీఆలయం దగ్గర, పోచంపాడు శ్రీరామసాగరం దగ్గర, కాళేశ్వరం అడవుల్లో, భద్రాచలం రామచరణాలను స్పృశిస్తూ, పాపికొండల మధ్యగా పరవళ్లు తొక్కుతూ, రాజమండ్రి వైపు ప్రవహించే గోదావరి నా కళ్లముందు మెదిలింది. ఏ గోదావరి ఒడ్డున ఎన్నో ఉదయాలు, రాత్రులు, నెలలు, సంవత్సరాలు నేను గడిపానో, చిత్రవిచిత్ర శోభలతో, ఎండల్లో, వానల్లో, పొగమంచు తొలిజాముల్లో నాకు సాక్షాత్కరించిన ఏ గోదావరిని నేను ప్రేమించానో, ఆ గోదావరి తొలిక్షణాల్నే నేనిక్కడ చూస్తున్నాననిపించగానే నా ఒళ్లంతా విద్యుత్తు ప్రవహించింది. గోదావరి సముద్రంలో కలిసేచోటు ఎలా ఉంటుందో చూడాలని కిందటేడాదే అంతర్వేది వెళ్లాం. ఆ గోదావరి సంగమదృశ్యం నా కళ్లముందు సాక్షాత్కరించింది. విశాలమైన మైదానం మరొక మహావిశాలమైన మైదానంలో కలసిపోతున్నట్లుగా పల్చగా పరుచుకున్న గోదావరి మహాసాగరంలో సంగమించే అపురూప దృశ్యం, ఎటుచూసినా అపారజలరాశి తప్ప, మరేమీ కనిపించని ఆ దృశ్యాన్నీ, ఒకటొకటిగా ఈ మహాశిఖర చరణాల చెంత బొట్లుబొట్లుగా పడుతున్న ఈ జలదృశ్యాన్నీ మనసులో పక్కపక్కన పెట్టి పోల్చుకోవడానికి ప్రయత్నించాను. ఏ అతీతకాలం నుంచి ఎన్ని యుగాలుగా, ఎన్ని శతాబ్దాలుగా ఈ నీటిబిందువులిట్లా ప్రభవిస్తూనే ఉన్నాయి? ఏ మహావర్షాలు, ఏ ఆకాశగంగలు, ఏ కాంతిమయలోకాల్ని తమలో పొదువుకొని ఈ మహాశిఖరాల గుండా ఇట్లా రసస్పందనలుగా వెలువడుతున్నాయి? ఈ మహారస యజ్ఞం ఎప్పుడు మొదలైంది? తెల్లగా తేటగా ఉన్న ఈ నీటిబిందువుల్లో ఏ సత్యం, శివం, సౌందర్యం ప్రవహిస్తున్నాయి? ఈ నీటిబిందువులు ఒక మహాప్రవాహంగా మారి ప్రయాణిస్తున్న దారి పొడుగునా ఎన్ని గ్రామాలు, పట్టణాలు, నగరాలు, ఎందరు కవులు, సాధువులు, గాయకులు, ఋషులు, కళాకారులు. నేను ఆ నీటిబిందువులనే అట్లా తదేకంగా చాలాసేపు మైమరచి చూస్తూండిపోయాను. నాకు గంగాగోదావరి ప్రత్యక్షమైంది. నా అన్వేషణ ఫలించిందనిపించింది. అనేక పద్యాలు, వచనాలతో కూడుకున్న ఒక మహాకావ్యం కూడా కవి హృదయంలో మొట్టమొదట ఒక తలపుగా, ఒక స్పందనగా మాత్రమేకదా గోచరించేది. ఆ మొదటి నాదం, ఆ ప్రథమసంస్పందనం, ఆ ప్రథమ ప్రతిశ్రుతి. ఇదేకదా! బిందువులో సింధువుని చూడగలగడమే నిజమైన దర్శనం అనుకుంటే నాకా క్షణాన లభించింది నిజమైన దర్శనం, సందర్శనం.


The Pilgrimage to Trimbakeshwar

2

An Ocean in a Drop

By the time we left Tuljapur, it was already quite late. Consequently, night had fallen deep by the time we reached Shirdi. On previous visits to Shirdi, we had explored Ellora once and Ajanta another time. This time too, we wanted to see some place new. Enquiring about nearby destinations, everyone felt drawn toward seeing Trimbakeshwar. Thus, we decided to set out at dawn for Trimbakeshwar by way of Nashik.

As it was the festive season of Vijayadasami, Shirdi was heavily crowded. We managed to find shelter in a large community hall. We spent that entire night merely waiting for the dawn to break. Early next morning, we departed for Nashik. After covering some distance, we realized our road had begun ascending the trails of the Western Ghats. Winding along that route—traversing crests and troughs, dipping through hill slopes, and negotiating sharp bends—a landscape I had never set eyes upon before began to unfold.

What is the true meaning of the joy awakened within us upon beholding unfamiliar terrain? Perhaps when we encounter new lands, we taste the exhilaration of breaking free from our own narrow, bounded confines. If that joy intensifies, I believe it transforms a person into an adventurer. It must have been this very intoxication that held sway over those legendary navigators and daring explorers who set sail on fragile crafts across boundless oceans, seeking out uncharted continents and distant shores.

Traveling through that rustic expanse of Maharashtra, those undulating, rugged pathways felt to me like lines of ancient Prakrit verse. It was along these very tracks that Hala’s Gathasaptashati and Jayavallabha’s Vajjālaggaṃ were born. Some years ago, I read translations of select Prakrit poems by Andrew Schelling, an American student of literature. Reading the Sanskrit and Prakrit translations in his anthologies The Cane Groves of Narmada River (1998) and Dropping the Bow (1991), Prakrit poetry appeared remarkably fresh, immediate, and contemporary. That inspired me to return to the study of ancient poetic anthologies such as Gathasaptashati, Vajjālaggaṃ, Amarushataka, Subhashitaratnakosha, and Chaurapanchashika.

Now, journeying through the heart of these villages, those verses resonated anew with evocative meaning. Across this entire region—where the monsoons had just drawn to a close and autumn was quietly stepping in—the shifting, layered hues of green brought to mind this lyric from the Gathasaptashati:

Varṣārātrā unnatapayodhare yauvane iva vyatikrānte
Prathamaika kāsakusumaṃ dṛśyate palitaṃ iva dharaṇyāḥ

As youth leaves a shapely maiden,
cloud-heavy monsoon nights have rolled away;
the first cane flower lifting its head
gleams like silver in Earth’s dark tresses.

And another verse from the Gāthāsaptaśatī:

Kutragataṃ ravibimbaṃ kutra pranaṣṭāḥ candratārāḥ
Gagane balākāpaṅktī kālaḥ horām iva karṣati

Where now is the orb of the sun?
Where have the moon and stars vanished?
Like glyphs drawn on an astrologer’s chart,
a line of cranes glides across the sky.

Without stopping in Nashik, we caught passing glimpses of the town through our car windows and pressed onward along the road to Trimbakeshwar. Some distance past Nashik, a range of hills came into view far away. Along the azure horizon, those distant peaks looked like buds gently opening their petals. No traveler stepping onto that road could behold them without being struck by a sudden pang of wonder. Though indistinct to the eye, those soaring peaks seemed to awaken sharp, living memories slumbering within. From the moment they revealed themselves, it felt as though the rest of our journey was merely a progressive drawing near, closer and ever closer, to their presence.

By the time we reached Trimbakeshwar, it was past eleven. Our vehicle was stopped at a parking lot right on the outskirts of the settlement; from there, we were told, we had to proceed into the village on foot. Walking into town, we went along asking for directions to the temple. Far more than beholding Lord Tryambakeshwar, an intense longing possessed me to gaze upon the very cradle where the Godavari is born. Making our way toward the temple, our minds were filled with all kinds of reveries along the path. An indistinct picture had formed in my heart—that the Godavari would be flowing in full splendor, that the shrine of Tryambakeshwar would stand gracefully upon her banks, and that we could bathe in her sacred currents before going in for darshan of the Lord… thoughts such as these drifted endlessly through my mind. Born in the Godavari district, I had spent my whole life cradled in her fold. My imagination, my dreams, my poetry, my very sensibilities were steeped in the river’s maternal nourishment, as though fed with her first sips of sweet milk. They say one must never search for the origin of a river, yet as I journeyed searching for the primordial source of this stream today, it felt as though I was tracing the very wellspring of my own inner being.

When at last we arrived before the shrine, nowhere in sight could we see the Godavari. Inside the temple of Trimbakeshwar, one of the twelve sacred Jyotirlingas, Shiva stood waiting for us; yet we were searching for the Ganga. Barring the desperate thirst to find where the Godavari rolled with her blue waves, nothing else seemed to matter. Standing before the black stone ramparts of the temple in the clear, golden sunlight, I kept stopping everyone I met to ask, “Where is the Godavari?”

None could understand my question. At last, an elderly Brahmin heard my enquiry and asked, “Are you asking about Kushavarta? Look there, turn right down that lane and walk a little further. You will find it there. That is the Godavari.”

We turned through the narrow temple lanes, winding our way past stalls crammed with puja offerings on either side. Reaching the spot he indicated, we saw a cluster of stone pillared pavilions cradling a stepped water tank (koneru). But in that holy tank, there was not a single drop of water. Its floor was parched dry, revealing black, cracked earth beneath. The lowest tiers of stone steps were stained dark with withered moss. In the very middle of the dry tank sat a tiny cistern.

I looked all around, utterly bewildered. Where were those rolling blue waves of the Godavari?

I stopped a bystander and asked again, “Where is the Godavari here?”

They pointed toward the small cistern in the center of the dry bed. Gesturing toward the dark, murky puddle settled within it, they said, “That is the Godavari. That is Kushavarta.”

Was this truly Kushavarta—the sacred confluence where the Kumbha Mela gathers once every twelve years when Jupiter enters Leo; the Kushavarta celebrated by Saint Namdev as the dissolver of all sins; the holy pool where a single dip is praised as granting an abode straight upon Mount Kailash? I could not bring myself even to touch those waters.

Once more, I asked them, “Where is the Godavari here?”

“That is the Godavari,” they replied. “Flowing out from this very Kushavarta, she journeys on toward Nashik.”

An unspeakable dejection washed over me. Was it merely to see this that I had come searching all this immense distance? Yet, clinging to a faint glimmer of hope, I asked them once more:

“Where was the Godavari born?”

Then they pointed toward the mountains rising in the distance—the very peaks we had been watching since morning.

“Look there. The Godavari is born upon that Brahmagiri. If you wish to see the Godavari, go there,” they said.

I looked at those hills once again. By then it was past noon, and the sun beat down fiercely. Those summits seemed to brush the very vault of the sky.

“How does one get there?” I asked.

“There are stone steps to climb. If you wish, they can carry you up in a doli (palanquin),” the locals told us.

We had eaten nothing since morning, and hunger was setting in. Yet an intense longing gripped me—at all costs, I had to climb those heights and witness the cradle where the Godavari is born. But could the women and children endure that blazing sun? Could they climb the mountain? To my surprise, the yearning to ascend that hill burned just as fervently in all of them as it did in me. We took our first steps forward.

A short distance on, right at the village limits, the forest began. On either side grew thick bamboo brakes, wild jujube thickets, low scrub, and wild blossoms everywhere the eye could see. Outside the village at the foot of the hill, many palanquin bearers stood waiting. The moment they spotted us, they came bustling forward, offering to carry us in their dolis. They said two people could sit in each palanquin and quoted around seven hundred rupees per ride. We wavered, unable to decide whether to hire them or not. Leaving them behind, we walked a little further ahead. They followed right behind us, bargaining along the path. Finally, we hired two dolis. My sister-in-law sat in one, and Vijji in the other.

Climbing step by step toward those peaks in that sun, moving through patches of tree shade, it felt as though I was ascending a ladder to the sky. By the time we reached the upper reaches of the mountain, our hunger had completely vanished.

Winding past the ridges of that great summit known as Brahmagiri, I kept asking everyone I met, “Where is the Godavari here?”

In my imagination, I had envisioned a cascading waterfall leaping like a lion cub from the crest of the mountain. That poetic image—“And she surged forth in an instant, the Godavari”—remained indelibly imprinted on my mind. My dream was of a torrential fall plummeting down from the brow of the mountain, fine spray drifting into the air, with a vibrant seven-hued rainbow slanting across the rising mist.

Someone told us, “Take just four steps forward—that is Gangadwaram right there.”

From there, we quickened our pace toward Gangadwaram. At the foot of the summit, there was a small cave-like hollow. At the entrance to the cave sat a large stone trough filled with water. A few devotees stood there offering prostrations. A priest was sprinkling sanctified water over them with a fresh green leaf.

We too approached and asked the priest:

“Where is the Godavari here?”

“Look here, this is Ganga Godavari,” the priest said.

Following the direction of his hand, what did I behold? A sculpted figure resembling a cow’s mouth (gomukha), and from its lips, water falling drop by single drop. The water collecting in the stone cistern below shimmered limpid, crystal clear. As each droplet descended upon the surface, delicate, silent ripples spread across the still pool. The serene quietude of an autumn afternoon, laced with the wild fragrance of forest blossoms, hung gently over the surroundings.

Unable to contain myself, I asked once more, “Is this truly the Godavari?”

“Yes, this is it! This is it!” the priest assured. “It is this very Godavari that flows down to the Kushavarta you must have seen below, and from there journeys on toward Nashik.”

Perhaps his vision reached only that far. But before my mind’s eye arose the vast Godavari I knew—washing past the Saraswati temple at Basara, swelling into the Sri Rama Sagar at Pochampadu, coursing through the deep forests of Kaleshwaram, touching the lotus feet of Rama at Bhadrachalam, roaring through the gorge of Papikondalu, and flowing in majestic fullness toward Rajahmundry. The very river along whose banks I had spent countless dawns, nights, months, and years; the very river I had loved through all her shifting splendors, under blazing suns, sweeping rains, and mist-laden twilights—the sudden realization that I was witnessing the primordial infancy of that very Godavari sent a current of electricity coursing through my veins.

Just the previous year, yearning to see where the Godavari merges into the sea, we had traveled to Antarvedi. That sublime spectacle of her confluence flashed before my eyes: like an immense plain dissolving into an even vaster expanse, the shallow, wide-stretching Godavari surrendering into the infinite ocean—a world where nothing met the eye save boundless water. In my heart, I placed those two visions side by side: that infinite watery expanse at the estuary, and here, at the feet of this colossal summit, this quiet trickle descending drop by drop.

Since what timeless age, across how many eons and centuries, have these drops been welling forth like this? What primordial monsoons, what celestial rivers, what realms of pure light have been absorbed and gathered within these immense peaks to emerge as this living, vibrant pulsation? When did this supreme sacrificial offering of nectar (rasa-yajna) begin? What truth, what auspiciousness, what beauty (Satyam, Shivam, Sundaram) flows through these white, pellucid drops?

As these solitary drops gather into a mighty torrent, how many villages, towns, and cities will flourish along their journey? How many poets, ascetics, singers, rishis, and artists will be nurtured by their touch?

I stood rooted to the spot for a long while, staring in rapt trance at those descending water droplets. Ganga Godavari had revealed Herself to me. My quest had reached its fulfillment. Even an epic composed of countless verses and prose begins in the poet’s heart merely as a fleeting impulse, a solitary stirring. That first primordial sound, that initial resonance, that foundational echo—was this not it?

If true vision (darshana) is the ability to behold the boundless ocean cradled within a single drop, then what was bestowed upon me in that sacred moment was true vision, a sublime revelation.

14-9-2026

4 Replies to “నేను తిరిగిన దారులు-15”

  1. తలెత్తిన తొలి రెల్లుపువ్వు
    ధరణీకేశరాశిలో తెల్లవెంట్రుకలా కనిపిస్తోంది.
    ఆహా…ఏమి వర్ణన గాథాసప్తశతిలో.

    నది ఉద్గమస్థానాన్ని వెతుక్కుంటూ వస్తే, నాకు నా సంస్కారమూలాల్ని వెతుక్కుంటున్నట్టే….

  2. త్రయంబకం వెళ్లినప్పుడు ఆ‌ కొండ పైకి ఎక్కడం కష్టం అయింది. డోలీ ఎక్క బుద్ధి వేయలేదు. పైన మీరు దర్శించిన ‘బిందువులో సింధువు’ చూడాలన్న ఉబలాటం తీరలేదు. ఆ లోటు ఇప్పుడు తీరింది.
    ధన్యవాదాలండీ🙏

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading