
మూడవ రోజు: మూడవ సంభాషణ
రామరాజ్యమంటే పూడుపడని చెరువులే
గ్రామాల గురించీ, గ్రామాల్లో కట్టుకునే ఇండ్ల గురించీ, గ్రామాల్లో పనిచేసే వృత్తికారులు ఆ గ్రామాన్ని ఒక దేవతారూపంగా ఎలా భావించేవారో చెప్పాక, గురూజీ, తన సంభాషణ ఇంకా కొనసాగిస్తున్నారు:
‘ఊళ్ళల్లో ఇండ్లు కట్టేటప్పుడు బయట సిపాయిల బొమ్మలు అంటే పోలీసుల బొమ్మలు వేసేవారు. కొన్నిచోట్ల ఆయా ప్రాంతాల సిపాయీల బొమ్మలు వేసేవారు. మరికొన్ని చోట్ల మహిళలు హారతి పళ్ళెం పట్టుకుని నిలబడినట్టుగా బొమ్మలు వేసేవారు. లోపల కూచునే గది డిజైన్ వేరుగా ఉండేది, పడుకునే గదుల డిజైన్ పూర్తిగా వేరుగా ఉండేది. ఆ పెయింటింగ్స్ పనులన్నీ నకాశీ వారు చేసేవారు. ప్రతి ఇంటిపైనా చిత్రకళ ఉండేది, ఏదో వీడి ఇంట్లో ఉంది, వీడి ఇంట్లో లేదని కాదు, అందరిళ్ళల్లోనూ ఉండేది. ఇంటికి సున్నం వేసారంటే, ఆ సున్నం వేసేవాడు వెళ్ళి నేరుగా నక్కాశీ వాళ్ళతో ‘ఆ ఇంటికి సున్నం వెయ్యడం పూర్తయింది, ఇక మీరు వెళ్ళి బొమ్మలు వేసుకోవచ్చు’ అని చెప్పేవాడు. వాళ్ళు తమ రంగులన్నీ తెచ్చుకుని ఇల్లంతా చక్కగా చిత్రాలు వేసేవారు. పూర్వం ఇదంతా మొత్తం గ్రామంలో జరిగేది. పాతికేళ్ళ కిందటిదాకా, మా ఎల్లప్ప తాతా వాళ్ళూ ఉన్నంతవరకూ, ప్రతి ఇంట్లోనూ ఈ పెయింటింగ్స్ ఉండేవి.’
‘ఇళ్ళ పైన పెంకులు పరచడంలో కూడా ఎన్నో రకాల శైలులు ఉండేవి. ఎక్కడైతే రెండువైపులా వాలుగా పెంకులు వేస్తారో అక్కడ మళ్ళీ ఒక అంచు అవసరం ఉండదు. ఎక్కడైతే అంచులు కూడా పేరుస్తారో ఆ అంచుల మీద చాలా అందమైన పక్షుల బొమ్మలు వేసేవారు. వాటిని ప్రతి సంవత్సరం మార్చవలసి వచ్చేది. కుమ్మర్లు వాటి ప్రతి ఏటా తయారు చేసి తెచ్చేవారు. కొన్ని సార్లు నెమలి బొమ్మలు కూడా వేసేవారు. వీటిని ప్రతి సంవత్సరం లేదా రెండేళ్ళకోసారి మార్చే ఆచారం ఉండేది. ఈ ప్రాంతంలో చాలా చోట్ల ఇవి చాలాకాలం వరకూ అలాగే ఉండేవి. కాని పెంకులు మాత్రం ఏడాదికో, రెండేళ్ళకో ఒకసారి మార్చేవారు. అలా అంచులు కట్టేచోట, ఆ కట్టుబడికి ప్రత్యేకమైన పెంకు ఉపయోగించేవారు. అందులో పక్షుల బొమ్మలు, కోతుల బొమ్మలు ఉండేవి. వాటిని మాత్రమే మార్చేవారు. అది కుమ్మర్ల వ్యాపారం కోసం.’
‘ఇక్కడ మనకు కనిపించే బావుల్లో మూడు రకాల బావులున్నాయి. ఒకటి చాలా చిన్న బావి, అది చాలా కష్టం మీద రెండున్నర అడుగుల పొడవూ, మూడు అడుగుల వెడల్పు మాత్రమే ఉండేది. మరొక రకమైన బావిని బారాయ్ బావి అనేవారు. అది అరవై చేతుల పొడవు, అరవై చేతుల వెడల్పు ఉండేది. అంత పెద్ద బావుల మీద నాలుగు నాలుగు మోటలు నడిచేవి. ఇక మూడో తరహా బావులు ఉమ్మడి బావులు, అవి కొన్నిసార్లు చతురస్రాకారంగా ఉండేవి, గుండ్రంగా కూడా ఉండేవి. ఇక్కడ చతురస్రాకారంగా ఉండే బావులు చాలా ఎక్కువ. అవి ఉమ్మడి బావులు, ప్రతి మొహల్లాకి తమ స్వంత బావి ఉండేది. కొన్ని బావుల నీరు ప్రత్యేకంగా ఉండేది. తాగడానికి, పప్పు ఉడికించుకోడానికి ఉపయోగించే నీరు చాలా తక్కువ బావుల్లో ఉండేది. కొన్ని బావులు ఎంత పెద్దవిగా ఉండేవంటే, ఉట్నూరు గడీలో బావి చూసారా? దాని లోపల గదులున్నాయి, మండపాలున్నాయి. ఆ లోపల సమావేశాలూ, సంగీత సభలూ కూడా నడిచేవి. సంగీతసభలు నిర్వహించడానికి వీలుగా ఆ బావుల్ని నిర్మించారు. అప్పుడు మైకులు లేవు కదా. అందుకని అందులో శబ్దం బాగా ప్రతిధ్వనించడానికి వీలుగా నిర్మించారు. అదిలాబాదులో పదహారు చెరువులు, అరవై బావులు ఉండేవి. ప్రతి గ్రామంలోనూ కనీసం మూడు బావులుండాలి.’
‘గ్రామాల్లో చెరువుల ప్రాధాన్యత చాలా ఎక్కువ. చెరువులు నిర్మించడంలో ఎన్నో రకాల పద్ధతులు ఉండేవి. ఒకరకమైన పద్ధతి ఏమిటంటే గ్రామంచుట్టూ గొలుసుకట్టు చెరువులు నిర్మించడం. అంటే ఒక చిన్న చెరువు ఉంటుంది, దాని తర్వాత వచ్చే చెరువు దానికన్నా పెద్దది, ఆ తర్వాత వచ్చేది దానికంటే పెద్దది, దాని తర్వాత వచ్చేది ఇంకా పెద్దది- ఇలా వరసగా ఉండి, ఊరి చివరలో చాలా పెద్ద చెరువు ఒకటి ఉండేది. అసలు విషయం ఏమిటంటే, వర్షాకాలంలో వచ్చే మొదటి మురికినీరూ, మట్టీ అంతా ఆ చిన్న చెరువులో ఆగిపోతుంది. ఆ తర్వాత మిగిలిన స్వచ్ఛమైన నీరు దానికంటే పెద్ద చెరువులోకి వెళుతుంది. అది చాలాకాలం నిండుతుంది. ఆ తర్వాత మిగిలిన నీరు దానికంటే పెద్ద చెరువులోకి- ఇలా వెళుతుంది. అందువల్ల చివరిగా ఉన్న ఆ పెద్ద చెరువులో ఎప్పుడూ మట్టి పేరుకుపోయేది కాదు. అది ఎప్పుడూ పూడిపోదు. పైగా చిన్న చెరువుల్లో పూడికతీత చాలా సులభంగా తీసుకోవచ్చు. సులభంగా శుభ్రం చేయవచ్చు. అదే పెద్ద చెరువులో పూడిక పడితే ఆ మట్టి తీయడం చాలా కష్టం. దాదాపుగా అసాధ్యం. అందుకోసమే ఇలా గొలుసుకట్టుగా చెరువులు నిర్మించేవారు, పెద్ద చెరువులోకి మట్టిపోకుండా చూసుకునేవారు.’
‘ఆ లెక్క ప్రకారం వారు చెరువుల మధ్య దూరాలు నిర్ణయించుకునేవారు. ఆ చెరువుల్లో కొన్ని కేవలం స్నానం చేయడంకోసం కేటాయించేవారు. కొన్ని తాగునీటికోసం. మరికొన్ని మలమూత్ర విసర్జన కోసం కేటాయించేవారు. ప్రజలు ఏ ప్రాంతంలో వెళ్ళి మలమూత్ర విసర్జన చేయాలో దానికి వేరే చెరువు ఉండేది. ఆ నీటిని మరే ఇతర అవసరాలకూ ఉపయోగించేవారు కారు.’
‘కానీ ఒక నియమం ఉండేది. ఈ చెరువులన్నింటికీ కలిపి సంవత్సరంలో ఒక కార్యక్రమం ఖచ్చితంగా జరిగేది. ప్రతి చెరువుకూ, ఆ చెరువుకు సంబంధించిన ఉత్సవం లాంటిది ఒకటి జరిగేది. అందులో ప్రజలందరికీ ఈ పిలుపునిచ్చేవారు. తెలుగు వాళ్ళు, కోలీలు చెరువులు నిర్మించేవాళ్ళు. వాళ్ళు చేతిలో వెదురుకర్రలు పట్టుకుని కాళ్ళకు గజ్జెలు కట్టుకుని ఇరవై నాలుగ్గంటలూ ఆ చెరువు చుట్టూ ప్రదక్షిణ చేసేవారు. ఎక్కడైనా ఎలుకలు కన్నాలు చేసి ఉంటే, వాటిని మూసివేస్తూ, పాడుతూ, నాట్యం చేస్తూ ప్రదక్షిణ చేయాల్సి వచ్చేది. వర్షాలు పడుతున్నప్పుడు నీరు వస్తుంది కదా, నీరు వస్తున్నకొద్దీ ఆ చెరువు ఒడ్డున పైవరకూ వచ్చేవారు. ఆ మట్టి అంతా తొక్కుకుంటూ వెళ్ళేవారు. ఊరి జనాలు ఎంతోమంది వాళ్ళతో కలిసి ఆ ప్రదక్షిణ చేసేవారు. చెరువు మొత్తం నిండిన తరువాత దానికి ఒక పూజ జరుగుతుంది. చాలా పెద్ద పూజ. యజ్ఞాలు చేసి, పూజలు నిర్వహించేవారు. ఏ కుటుంబానికి తాబేలు కులదైవమో, ఎవరికి పీత దైవమో, ఎవరికి చేప దైవమో, ఏయే జలచరాలు ఎవరికైతే కులదైవాలుగా ఊంటాయో వారు ఆయా జలచరాల బొమ్మల్ని బంగారంతో అలంకరించి పూజ చేసి ఆ చెరువునీటిలో వదిలేసేవారు. ఆ తర్వాత చెరువులోకి నీరు వచ్చే దారి పొడుగునా చిల్లగింజ చెట్లు నాటేవారు. చిల్లగింజను, కొన్ని చోట్ల ఇండుగపిక్క అంటారు, నీళ్ళ కుండలో వేస్తే ఆ నీళ్ళు శుభ్రపడతాయి కదా. మన అడవుల్లో చాలా ఉన్నాయి. ‘మావలా’ వైపు ఎక్కడనుంచి నీరు వస్తుందో ఆ దారి పొడుగునా చాలా చెట్లు నాటారు. ఇప్పుడు నరికేసారుగాని, పూర్వం అక్కడ చాలా చెట్లుండేవి. అలానే చెరువుకట్టమీద ఈతచెట్లు నాటేవారు. ఎందుకంటే ఈతచెట్లు చాలా బలంగా మట్టిని పట్టి ఉంచుతాయి. వాటివేర్లు గట్టిగా పడతాయి. పాతచెరువులన్నింటిపైనా ఈత చెట్లు కనిపిస్తాయి. తుమ్మచెట్లు కాదు, ఈత చెట్లు. వాటిని ఆ కట్టమీద నాటేవారు.’
‘అలానే చెరువుకట్టకి కూడా కొన్ని నియమాలుండేవి. మలమూత్ర విసర్జనలు చెరువుకు కనీసం ఐదువందల గజాల అవతలనే చేయాలి. దానికి లోపల చేయకూడదు. ఎక్కడైతే చెరువునుండి పొలాలకు నీరు వదులుతారో ఆ ఆ చెరువు మొత్తం నిండిన తర్వాత దాన్ని ‘నీరటి’ వాళ్ళకు అప్పగించేవారు. నీరటివాళ్ళు దళిత సమాజానికి చెందినవారు. వారి పర్యవేక్షణలోనే అది ఉండేది. చెరువుకింద పొలాల్లో ఏ మడుల్లో ఎలాంటి రకం వరి వేయాలనేది ఆ నీరటివాడే నిర్ణయించేవాడు. ఏ వైపు ఎక్కువ నీరు వెళ్తుందో, ఎటు తక్కువ నీరు వెళ్తుందో చూసి ఆ మధ్యలో ఎలాంటి వరి వేయాలో చెప్పేవాడు. తక్కువనీటితో పండే వరి ఏదో దాన్నే ఆ మడుల్లో వేయించేవాడు.’
‘అలాగే మరో పని కూడా చేసేవారు. ఈ రోజుగనుక మీ పొలానికి నీరు వదలవలసి ఉంటే, మీరు మీ ఇంట్లో ఉన్న పశువులన్నింటినీ తెచ్చి ఆ నీరువెళ్ళే తూము రస్తా దగ్గద వదిలేయాలి. ఆ పశువుల్ని అక్కడ బాగా తిప్పేసరికి ఆ నీరంతా బురదనీరుగా మారిపోయేది. ఆ తర్వాతే అతడు నీరు వదిలేవాడు. అందువల్ల ఆ బురదమట్టి మొత్తం పొలాల్లోకి వెళ్ళిపోయేది. నేలమీదున్న బురద మొత్తం పొలాల్లోకి చేరిపోయేది. ఇది ప్రతి రోజూ చేసే పని. అందువల్ల చెరువులో ఎప్పుడూ మట్టి పేరుకుపోయేది కాదు.’
‘ఏడాదికొకసారి చెరువుకి ప్రదక్షిణాలు, పూజలు జరిగేవి. ఆ పూజలో భాగంగా ఆ చెరువులో ఎవరు స్నానం చేయాలనుకుంటున్నారో వారు మొదట అయిదు పిండాల మట్టి, అంటే దాదాపు అయిదు గంపల మట్టి తీసి బయట పడేయాలి. ఆ తర్వాతే అందులో స్నానం చెయ్యాలి. ఆ రోజు వెయ్యి మంది స్నానం చేసారనుకుందాం, అంటే ఐదువేల గంపల మట్టి బయటకొచ్చేస్తుంది. బస్! అంతకంటే ఎక్కువేం కావాలి? అందువల్ల ఆ చెరువుల్లో ఎప్పుడూ బురదపేరుకునేది కాదు, కీటకాలు పుట్టేవి కావు. ఆ ప్రక్రియ నిరంతరం సాగుతూ ఉండేది. ఆ రకంగా వారు చెరువుల్ని చాలా సురక్షితంగా, పద్ధతిగా ఉంచేవారు.’
‘బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఈ చెరువుల్ని ప్రజలదగ్గరనుండి లాక్కుని ఆర్ అండ్ బి డిపార్ట్ మెంటుకి అప్పగించారు. ఆ తర్వాత మరో ఇరవై ఏడు డిపార్ట్ మెంటుల చేతులు మారాయి. అందులో ఈ చెరువులన్నీ నాశనమైపోయాయి. ఆ స్థలాల్ని ఆక్రమించి ఇళ్ళు కట్టుకున్నారు. ఆ చెరువులు రెవెన్యూ డిపార్ట్ మెంటు ఆధీనంలో ఉన్నప్పుడు ప్రజలు వాటిని మర్చిపోయారు. ఇవి మన చెరువులు అనే విషయం మర్చిపోయారు.’
‘చంద్రాపూర్ వదిలేసి రాజ్ పరివార్ గోండులు ఎప్పుడైతే ఇటువైపు వచ్చారో వారు ప్రతి ఇరవై కిలోమీటర్ల పరిధిలో చిన్న చిన్న గడీలు నిర్మించారు. ప్రతి ఒక్క గడీతో పాటు పది చెరువులు కూడా నిర్మించారు. ఇప్పుడు ఈ పోచంపల్లి ఉంది కదా, అది చాలా చిన్న గడీ అక్కడ. కానీ దాంతో పాటు పది చెరువులు ఉన్నాయి. దానికి ఇరవై కిలోమీటర్లదూరంలో ఉట్నూరులో పదిచెరువులు ఉన్నాయి. వారు తమ వ్యవస్థనంతా అలా ఏర్పాటు చేసుకున్నారు. నాకేమో తెలీదు, ఇంత అద్భుతమైన వ్యవస్థను ఏర్పాటు చేసిన ఈ ప్రజలు ఆ తర్వాత ‘ట్రైబల్స్ గా ఎలా మారిపోయారో తెలీదు! అవును, వీరు కూడా తమని తాము ‘ట్రైబల్స్’ గానే భావిస్తున్నారిప్పుడు.’
‘ఆ చెరువులన్నీ నీరటి పర్యవేక్షణలో ఉండేవి. అయితే చెరువుల్లో పండే పంటలు, నీటి పంటల్ని సాగుచేసే ప్రజలు వేరేగా ఉండేవారు. చేపల పంట, పాలగడ్డ, కమలాక్ష, దూసగడ్డ లాంటివి చెరువుల్లో పండేవి. భోయీలు వీటిని సాగుచేసే సమాజం. ప్రతి చెరువులోనూ ఈ పంటలు పండించేవారు. చాలా సింగోడా పండేది చెరువుల్లో. చేపలు సరే. కొన్ని చోట్ల వరి కూడా పండించేవారు. ఆ వరి చెరువులోపలే పండేది. తనంతట తానే మొలిచేది. అది ఉపవాసాల సమయంలో తినడానికి ఉపయోగపడే వరిబియ్యం. దూసడ్లు అంటాం మేం. కమలాక్ష్ చాలా పండేది. పాలగడ్డ అని ఇంకొకటి ఉండేది. వీటన్నిటినీ చెరువు పంటలుగా భావిస్తారు. పండించడం, తయారుచేయడం, వాటి రక్షణ, ఆ తర్వాత వాటినుంచి ప్రయోజనం పొందడం ఇవన్నీ మనవాళ్ళకు బాగా తెలుసు. వాటి నిర్మాణం ఎలా చేయాలి, వాటిని సురక్షితంగా ఎలా ఉంచాలి, దాన్నుంచి అన్ని రకాలుగా లాభం ఎలా పొందాలి, అంతే తప్ప, నాశనం చేయడం కాదు, వాటికోసం మన దగ్గర చాలా అందమైన పద్ధతులుండేవి.’
‘కొన్ని సార్లు చాలా గందరగోళాలు జరుగుతూ వచ్చాయి. మహాభారత కాలంలో చెరువుల గురించి చాలా మంచి వర్ణన ఉంది. పాండవులు వనవాసానికి వెళ్తున్న సమయంలో, వారికి చాలా దాహం వేసింది, అప్పుడు భీముడు నీళ్ళకోసం వెళ్ళాడు. అక్కడొక అందమైన జలాశయాన్ని చూసాడు. ఆ చెరువుని చూడగానే, చుట్టుపక్కల ఎవరూ లేరని చూసి, అందులోకి దూకేసాడు. దూకేసి చాలా ఆనందంగా స్నానం చేయడం మొదలుపెట్టాడు. అడవిలో ఎవరూ లేరని చూసి దూకేసాడు కదా. అప్పుడక్కడ ఒక చిన్నపిల్లవాడు కూర్చుని ఉన్నాడు. ఆ పిల్లవాడు భీముడితో ‘నువ్వు చూడటానికి రాజపుత్రుడిలాగా కనిపిస్తున్నావు, మరి నీకు ఇంత కూడా తెలీదా? చెరువుతో మనం ఎలా ప్రవర్తించాలి, ఎలాంటి పద్ధతులు పాటించాలని? నేరుగా వచ్చి చెరువులో దూకేసావు. పైగా మస్తీ చేస్తున్నావు, ఇది అస్సలు చెయ్యకూడని పని, తప్పు’ అని చెరువు పట్ల పాటించవలసిన నియమాలు చెప్పుకొస్తాడు. చెరువునుంచి ఎంత దూరంలోకి నీళ్ళు తీసుకువెళ్ళి కాళ్ళు కడుక్కోవాలి మొదలైన నియమాలు చెప్తాడు. కాని భీముడు వినడు కదా. దాంతో ఆ పిల్లవాడు అతణ్ణి రాళ్ళతో కొట్టడం మొదలుపెడతాడు. తన మీద రాళ్ళు విసురుతుండటంతో భీముడు బయటికొచ్చి అతణ్ణి గట్టిగా ఒక దెబ్బ కొడతాడు. అతడు ఇతణ్ణి పట్టుకుంటాడు. ఇద్దరి మధ్యా పెద్ద యుద్ధం జరుగుతుంది. ఆ పిల్లవాడు భీముణ్ణి ఎత్తుకుని పరిగెడతాడు.’నిన్ను తీసుకెళ్ళి సముద్రంలో పడేస్తాను, నీ సంగతి తేలుస్తాను’ అని. అప్పుడు ఆకాశవాణి ‘అరే, అతను నీ తాత’ అని చెప్తే అతను భీముణ్ణి కిందపడేసి కాళ్ళకు నమస్కరిస్తాడు. ‘నువ్వు మా తాతవైతే ఆ సంగతి మొదటే చెప్పాలి కదా’ అంటాడు. అతడు ఘటోత్కచుడి కొడుకు, బర్బరీకుడు. రామ చరిత మానస్ లో కూడా పదే పదే వస్తుంది, రాముడి కాలంలో చెరువుల్లో బురదా, కీటకాలూ ఉండేవి కావని. అంత అందంగా వారు ఆ చెరువుల వ్యవస్థను ఏర్పాటు చేసుకునేవారు.’
గురూజీ రామ చరిత మానస్ ప్రస్తావన తెచ్చినప్పుడల్లా నాకు చాలా ముచ్చటగా అనిపించేది. రామ చరిత మానస్ కి, నాకు తెలిసిన అరాధకులు ముగ్గురిలో, మహాత్మాగాంధి కాక, మిగిలిన ఇద్దరూ మా హీరాలాల్ మాష్టారూ, గురూజీనూ. ఒక వయసు వచ్చిన తరువాత తాను రామ చరిత మానస్ తప్ప మరే పుస్తకం చదవలేదని గురూజీ చెప్తుండేవారు. ప్రతి రోజూ ఆశ్రమంలో పొద్దున్నే ఆరుగంటలకి, ఆ ప్రార్థనామందిరంలో ఎవరున్నా లేకపోయినా, రామ చరిత మానస్ నుంచి కొన్ని దోహాలో, చౌపాయీలో చదవడంతోటే గురూజీ దినచర్య మొదలయ్యేది.
అందులో నాకు ఆశ్చర్యమేమీ కనిపించలేదు. ఎందుకంటే, కొందరికి కొన్ని text లు primary texts గా ఉంటాయి. తమ జీవన విధానాన్ని రూపుదిద్దుకోవడంలో ఆ పుస్తకాలు వారికెప్పటికప్పుడు దారి చూపిస్తూ ఉంటాయి. గురూజీ ఒకసారి ఇలానే మాట్లాడుతూ, రామ చరిత మానస్ ద్వారానే తాను ఎకనమిక్స్ తెలుసుకున్నానని అన్నారు. నేను నవ్వుతూ ‘గురూజీ, ఇంకేదైనా తెలుసుకున్నానని చెప్తే నేను అర్థం చేసుకోగలనుగానీ, మరీ ఎకనమిక్స్ తెలుసుకున్నానని అంటే ఎలా?’ అనడిగాను. కానీ గురూజీ నవ్వలేదు. ‘అవును సార్, రామ రాజ్యంలో నదుల్లోనూ, చెరువుల్లోనూ పూడు ఉండేది కాదని నాకు రామ చరిత మానస్ చదివినప్పుడే తెలిసింది’ అని అన్నారు. నేను మరేమీ మాట్లాడలేదు. ఇంటికొచ్చాక, రామ చరిత మానస్ తీసి, రామరాజ్యం గురించిన వర్ణన చదివాను. అక్కడ కవి, నదుల గురించి చెప్తూ ‘సరితా సకల్ బహహిఁ బర్ బారీ, సీతల్ అమల్ స్వాద్ సుఖకారీ’ (నదులన్నీ నిర్మలంగా, చల్లగా, పానయోగ్యంగా, సుఖకరంగా ప్రవహిస్తున్నాయి) అనీ, చెరువుల గురించి చెప్తూ ‘సరసిజ్ సంకుల్ సకల్ తడాగా'(సరోవరాలన్నీ తామరపూలతో కిక్కిరిసి ఉన్నాయి) అనీ అన్నాడు. కానీ నా చుట్టూ ఎటు చూసినా నగరాలు మాలిన్యాన్ని మోసుకుపోతున్న నదులూ, గుర్రపుడెక్కతో, నాచుతో కప్పడిపోయిన చెరువులూ కనిపిస్తూ ఉన్నాయి. నా హృదయంలో చెప్పలేని అనుతాపం కలిగింది. నాకు అర్థమయింది: రామరాజ్యానికి తక్కినవారి నిర్వచనాలేమో గాని, గురూజీకి మాత్రం పూడుపడని చెరువులూ, నదులూ ఎక్కడుంటే అక్కడే రామరాజ్యమన్నమాట!
గురూజీ ఇంకా చెప్తున్నారు: ‘ఎంతదాకా అయితే గ్రామమూ, గ్రామం తాలుకు ఉమ్మడి ఆస్తులూ స్వతంత్రంగా ఉండేవో అంతవరకూ మన దగ్గర ఈ వస్తువులన్నీ చాలా పద్ధతిగా కాపాడుకునేవారు. చాలా అందమైన పద్ధతిలో నిర్వహించుకునేవారు. 1960 దాకా కూడా ఈ ఊరి చుట్టుపక్కల ప్రాంతాల్లో అలాగే ఉండేది. 1960 దాకా ఇక్కడ సమష్టి వ్యాపారమే నడిచేది. మన గౌరవప్రదమైన ప్రభుత్వం ఆ తర్వాత దాన్ని అంతం చేసేసింది. అంతకుముందు ఆ గ్రామం ఆస్తికి గ్రామమే యజమానిగా ఉండేది. దాన్నెలా ఉపయోగించాలో ఆ గ్రామానికి తెలుసు. ఎలా చేసుకోవాలి, ఏమేమి చేసుకోవాలనేది వారికి బాగా తెలుసు.’
‘అందుకే మన దగ్గర ఏ ఏ చెరువులు కావాలి, ఎంత కావాలి అనేది వారు చాలా చక్కగా చేసుకునేవారు. అందరూ ఉమ్మడిగా వ్యవసాయం చేసేవారు. పట్టేదారు అంటూ ఎవరూ ఉండేవారు కాదు. గ్రామాల్లో చాలా పెద్ద విస్తీర్ణం పశువులమేత పేరుతో వదిలేసేవారు. ఎక్కడైతే వేల ఆవులు నిలబడి మేసేవో, ఆ భూమిని పన్నెండేళ్ళ తరువాత పొలాలుగా మార్చేవారు. ఏవైతే అప్పటిదాకా పొలాలుగా ఉండేవో వాటిని పశువులబీడుగా వదిలిపెట్టేసేవారు. అందువల్ల అంత దంచి దంచి కష్టపడి ఎరువులు వేయవలసిన అవసరం కూడా ఉండేది కాదు వారికి. అది సహజంగానే సారవంతంగా మారిపోయేది.’
‘పూర్వం మన దగ్గర ఉమ్మడి సేద్యం ఉండేది. భూమి అంతా గ్రామానికి చెందింది. వ్యక్తిగతమైంది కాదు. అంతా గ్రామం తాలూకు భూమి. ధరమ్ పాల్ గారి దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి కదా, అందులో ఉంది, బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తరువాత వాళ్ళు నౌకర్లను పెట్టారు. రెవెన్యూ ఉద్యోగులకు ఇచ్చే జీతాలు ఖచ్చితమైన జీతాలు. కానీ ఇక్కడ వసూలు చేసే రెవెన్యూ ఖచ్చితమైంది కాదు. ఇక్కడ ఆరు శాతం, పన్నెండు శాతం అలా ఉండేది. 100 గంపలు ధాన్యం పండితే ఆరు గంపలు రాజుకి పన్ను కట్టాలి. 50 గంపలైతే 3 గంపలు, 25 అయితే ఒకటిన్నర గంప ఇచ్చేవారు. ఇక్కడ రెవెన్యూ సమానంగా ఉండేది కాదు. కొన్నిసార్లు పెరిగేది, కొన్ని సార్లు తగ్గేది. కానీ ఈ బ్రిటిష్ వాళ్ళు తమ ఉద్యోగులకీ, సిపాయీలకీ ఇచ్చే జీతాలు ఫిక్సెడ్ గా ఉండేవి. దాంతో వారు చూసారు, ప్రతి సంవత్సరం ధాన్యం ఎక్కువతక్కువగా పండుతుంది కదా, ఇదంతా పెద్ద గందరగోళంగా అనిపించింది. వారు వెళ్ళి గ్రామగ్రామానా అడిగారు: ఈ భూమి ఎవరిది? అని. ప్రతి ఒక్కరూ ఇది గ్రామం భూమి అని చెప్పారు. దాంతో వీళ్ళు అంటే బ్రిటిష్ వాళ్ళు ఒక నియమం పెట్టారు, ఏ భూమి అయితే ఎవరికీ చెందిలేదో అది ప్రభుత్వం భూమి అని. దాంతో చాలామంది ప్రజలు పరుగుపరుగున వెళ్ళి తమ పేరుమీద భూములు రాయించుకున్నారు. పట్టాలు చేయించుకున్నారు. పట్టాలయ్యాక, ఒక ఎకరంలో ఎంత పండుతుంది అని భూములమీద పన్నెండు సంవత్సరాల యావరేజ్ తీసారు. ఆ లెక్క ప్రకారం ఎకరాన్ని బట్టి వారు కిరాయి వసూలు చేయడం మొదలుపెట్టారు. టాక్స్ కాదు, కిరాయి, అంటే రెంట్ పెట్టారు, ఒక ఎకరానికి ఇంత ఇవ్వాలి అని. ఆ కాలంలో ఈ భూములన్నీ చేతులు మారిపోయాయి. ప్రజలు పట్టేదార్లైపోయారు. గ్రామంతాలూకు సమష్టిభూమి అనేది అంతమైపోయి ప్రజలు సొంతదారులయిపోయారు.’
‘బహుశా 1777 లో అనుకోవచ్చు, వారు ఇక్కడి మార్కెట్ వ్యవస్థను ముంచేసారు. 1836 తర్వాతా భూమి విషయంలోనూ అదే చేసారు. ఎందుకంటే 1802 నుంచి 1823 దాకా పాఠశాలల గురించి సర్వే చేసారు. ఇక్కడ చాలా పాఠశాలలు నడిచేవి కదా. ప్రతి గ్రామంలోనూ పాఠశాలలు నడిచేవి. అసలు ఈ పాఠశాలలు ఎలా నడుస్తున్నాయన్నది వారు చూసారు. ఆ స్కూళ్ళను గ్రామం నడిపిస్తుంది. గ్రామం ఎలా నడిపిస్తుంది స్కూళ్ళని? గ్రామం మూడు వ్యవస్థల్ని నడిపించేది: పాఠశాలలు, ధర్మశాలలు, దేవాలయాలు. గ్రామంలో సమిష్టి వ్యవస్థ ఉంది. మొత్తం బాధ్యత అంతా గ్రామానికి ఉంటుంది తప్ప ఏ ఒక్క వ్యక్తికీ ఉండదు. దాంతో వారు గ్రామానికి ఉన్న భూమినే అంతం చేసేసారు. ఎప్పుడైతే అందరినీ పట్టేదార్లుగా మార్చేసారో, అప్పుడు ఈ మూడు వ్యవస్థలూ కూలిపోయాయి. దేవాలయాల్ని ఎవరు చూసుకోవాలి? స్కూళ్ళని ఎవరు చూసుకోవాలి? ధర్మశాలలూ, సత్త్రాలూ ఎవరు నడిపించాలి? ఈ మూడు వ్యవస్థలూ అంతమైపోయాయి.’
‘ఒక సమాజంగనుక సామాజిక పద్ధతిలో జీవించాలంటే దాని ఆర్థిక వ్యవస్థ కూడా సామాజిక ఆర్థిక వ్యవస్థగానే ఉండాలి, అవునా? అసామాజిక ఆర్థిక వ్యవస్థ అక్కడ నడవదు. లేదా మరేరకమైన ఆర్థిక వ్యవస్థ కూడా అక్కడ పనిచేయదు. కాబట్టి పూర్వం ఇక్కడి గ్రామాలను గమనించినప్పుడు వాటి సొంత ఆర్థిక విధానం లేదా ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండేది? ప్రతి ఒక్కరిలోనూ భద్రతా భావం ఉండి తీరాలి. ఎవరికీ, ఏ ఒక్కరికీ కూడా, ‘మా ప్రమేయం లేకుండా ఇది సాగదు’ అనే భావన రాకూడదు. మన దగ్గర ధనం అంటే డబ్బు విషయంలో ఎవరినీ ఎవరికీ ఋణపడి ఉండేలా చేయలేదు. గ్రామాల్లో భావన పరంగా ఒకరికొకరు ఋణపడి ఉండేవారు. నేను నిన్న చెప్పినట్లుగా ఒక గ్రామంలో కనీసం 360 కులాలు లేదా జాతులుండేవి. ఆ కులాల మధ్య, వాటి తమ స్వంత అంతర్గత వ్యవస్థలు ఎలా ఉండేవి? వారి స్వంత ఏర్పాట్లు ఏమిటి? వీటినొకసారి అర్థం చేసుకోవాలి. తమ తమ స్వంత వృత్తిపరమైన ఏర్పాట్లు ఎలా ఉండేవి? గ్రామాల్లో అందరినీ సువ్యవస్థితంగా ఉంచడానికి ఎలాంటి ఏర్పాట్లు ఉండేవి?’
‘ప్రతి ఒక్కరిదగ్గరా వారి స్వంత టెక్నాలజీ, నైపుణ్యమూ ఉండేవి. ఆ సాంకేతికతల్ని ప్రోత్సహించడానికీ, వాటిలో మార్పులు, చేర్పులు, సంస్కరణలు చెయ్యడానికి కూడా సమాజంలో ఒక వ్యవస్థ ఉంటూ వచ్చింది. పంచ విశ్వకర్మల పని ఇదే ఉండేది. అవునా! ఎవరూ కూడా తమ సాంకేతికతని ఊరికే సొంతంగా కనిపెట్టేయరు. అందులో ఏం కావాలి, ఇంకేం లోపాలున్నాయి, ఏం జరగాలి, ఏదైనా పాడైపోతే దాన్నెలా బాగు చెయ్యాలి- ఈ ఏర్పాట్లనీ గ్రామంలోనే ఉండేవి. ఎందుకంటే ఏదైనా వస్తువు ఒకవేళ పాడైపోతే దాన్ని మళ్ళీ బాగుచేయాలి కదా. ఆ నిబంధనలన్నీ గ్రామాల్లో ఉండేవి. సాంకేతికతలకి సంబంధించి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఎలాగైతే మారాల్సి ఉంటుందో, చేయాల్సి ఉంటుందో ఆ సమాచారం అక్కడ ఎలా పుడుతుంది? ఏ గ్రామంలోనైనా కొత్త వస్తువు ఏ విధంగా తయారవుతుంది? సాంకేతికతల్లో ఎక్కడ ఎలాంటి మార్పులు వచ్చాయో, ఏదో ఒక గ్రామంలో జరిగిన మార్పు, ఈ గ్రామం వరకూ ఎలా చేరుకుంటుంది?
‘ఉదాహరణకి అడవిలో పండ్లూ, గ్రామంలో పండ్లూ కూడా కోలీ సమాజం చేతుల్లో ఉండేది. ఆ రోజుల్లోనే కాదు, ఇరవై సంవత్సరాల కిందటిదాకా కూడా అడవి పండ్లన్నిటిమీదా కోలీలకే హక్కులుండేవి. మిగతా తోటల్లో పండ్లన్నిటిమీదా కూడా వీరికే హక్కుండేది. వాటిని కూడా పండించడం, కోయడం, అమ్మడం వాళ్ల పనిగానే ఉండేది. తాలూకాలు ఏర్పడ్డాక, రెవెన్యూ వ్యవస్థ వచ్చిన తరువాత, ఈ చెట్లన్నింటినీ రెవెన్యూ శాఖ ద్వారా వీరు తమ ఆధీనంలోకి తీసుకునేవారు.సీతాఫలం చెట్లు కావచ్చు, చింతచెట్లు కావచ్చు, ఇవన్నీ ప్రభుత్వభూముల్లో ఉండేవి. వేలంపాటలు జరిగినప్పుడు వారు సమాజం తరఫున వేలం పాడేవారు. మొత్తం సమాజం తరఫున. ఆ రోజుల్లో అక్కడ 300 ఇళ్ళ కోలీ సమాజం ఉండేది. కాబట్టి ఆ సమాజమే వేలం పాట పాడేది. చింతచెట్లు, సీతాఫలం చెట్లు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకునేవారు, ఎంత డబ్బు కట్టాలనేది ముందే మాట్లాడుకునేవారు. కాని డబ్బు ఆ సమయంలోనే ఇచ్చేసేవారు కాదు. ఆ తర్వాత వీరంతా కలిసి కూచుని నిర్ణయించుకునేవారు. సంరక్షణకోసం ఎవరు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు ఏ తోటకు వెళ్ళాలి, ఎక్కడెక్కడ చెట్లున్నాయో అక్కడకు ఎవరెవరు వెళ్ళాలో తమలో తాము పంచుకునేవారు. అక్కడికి వెళ్ళి చిన్న చిన్న మంచెలు వేసుకునేవారు.అక్కడే ఉండేవారు. పండ్లు పక్వానికి వచ్చే సమయం వచ్చినప్పుడు వాటిని కోసి ఒకచోట పోగుచేసేవారు. అలా పోగుచేసాక కుటుంబాల లెక్కన వాటిని సమానంగా పంచుకునేవారు. అలా పంచుకునేటప్పుడు పెద్ద పండు, చిన్న పండు, మధ్యస్థంగా ఉండే పండు అనే లెక్కలు కూడా చూసుకునేవారు. ప్రతి ఒక్కరికీ సమానమైన పద్ధతిలో దాన్ని పంచి ఇచ్చేవారు. ఆ జనాలు ఆ పండ్లన్నిటినీ అమ్మి, దాని ద్వారా వచ్చిన డబ్బుని ఒకచోట పోగుచేసి, మొదట రెవెన్యూ వారికి కట్టాల్సిన డబ్బు కట్టాక, ఆ మిగిలిన సొమ్ము వీరి సొంతమయ్యేది.’
‘అందులో మళ్ళా, ఎవరైనా ‘నేను ఏ ప్రాంతంలో తిరుగుతున్నానో అక్కడెవరూ పెద్ద పండ్లు కొనడం లేదు, చిన్నవే కొంటున్నారు’ అని అన్నారనుకోండి, లేదా మరొకరు ‘లేదు, లేదు, నేను తిరిగే ప్రాంతంలో ఎవరూ చిన్నపండ్లు కొనడం లేదు, అన్నీ పెద్దపండ్లే కొంటున్నారు’ అని కూడా అనొచ్చు. కాబట్టి ఎన్ని చిన్న పండ్లకు బదులుగా ఎన్ని పెద్ద పండ్లు ఇవ్వాలనేది ముందే నిర్ణయించుకునేవారు. ఆ లెక్క ప్రకారం ఇచ్చేవారు. వాటినలా అమ్ముకుని తర్వాత తమకు రావలసింది తాము తీసుకునేవారు. అది వారి సొంతసంపాదనగా ఉంటూ వచ్చేది. ఆ సంపాదన అంతా వచ్చిన తరువాత వారు తమ సమాజంకోసం కొంత భాగం ఇవ్వాల్సి వచ్చేది. అది ఆ సమాజపు పెద్ద దగ్గర జమ చేసేవారు. ఏడాదికి ఒకసారి, సాధారణంగా హోలీ పండగ సమయంలో, ఆ డబ్బు ప్రజలకు పంచి ఇచ్చేవారు. ఎవరైనా వచ్చి తన కుమార్తె వివాహం ఉందంటేనో లేదా మరేదైనా పనికోసం డబ్బు అడిగేవారు. కాబట్టి వారు ఎంతో సరిగ్గా ఆ డబ్బు అందరికీ పంచేవారు.’
‘కందిపప్పులాంటి పంటలు వచ్చినప్పుడు కూడా అందులోంచి కూడా ఒక భాగం గ్రామానికి ఇవ్వాల్సి వచ్చేది. అందరికీ ధాన్యం అంతా పంచిన తర్వాత ఒక భాగాన్ని గ్రామానికి అప్పగించేవారు. ఆ భాగం గ్రామంలో ఎవరికోసమని ఉంచేవారు? వికలాంగుల కోసం, విధవరాండ్రకోసం, విద్వాంసుల కోసం, వైద్యుల కోసం ఆ భాగం అట్టేపెట్టేవారు. గ్రామంలో ఎవరైనా విద్వాంసుడు లేదా సంగీతకారుడు ఉంటే, లేదా ఎవరైనా సాహిత్యం రచిస్తూ, మహాభారతం లాంటివి రాస్తూ ఉంటే, వారి పూర్తి బాధ్యత గ్రామం తీసుకునేది. గ్రామంలోకి ఎవరైనా చాలా పెద్ద విద్వాంసుడు లేదా పండితుడు వస్తే, వారిచేత ప్రవచనాలు చెప్పించడం లేదా మరేదైనా కార్యక్రమం చేయించాలంటే గ్రామం తరఫున వారికి సమర్పించేవారు. సమాజం తరఫున కాదు, గ్రామం తరఫున వారికి ఏర్పాట్లు జరిగేవి. అలాగే వైద్యుల కోసం కూడా.’
‘ఉదాహరణకి పాములు పట్టేవాడున్నాడనుకోండి. వాళ్ళ నియమాలు చాలా కఠినంగా ఉండేవి. పాములు పట్టేవాడు అన్నం తినడానికి కూచున్నాడు. ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. అంతలోనే వార్త వచ్చింది ఫలానా చోట ఒకరిని పాము కుట్టింది అని. అప్పుడు వాడు రెండో ముద్ద నోట్లో పెట్టుకోడానికి వీల్లేదు. అది వాని నియమం. తక్షణమే వాడక్కణ్ణుంచి లేచి వెళ్ళిపోవాలి. లేచి వెళ్ళిపోతాడు. వైద్యులకు అలాంటి నియమాలుండేవి. వాడు ఏ క్షణంలోనైనా సిద్ధంగా ఉండాలి. కొన్ని సార్లు రోజంతా పడుతుంది. మరి వాని జీవనం ఎలా? వాని పూర్తి బాధ్యత గ్రామం చూసుకునేది. వికలాంగుల బాధ్యత ఎలాగూ చూసేవారు. ఆ పై, వృద్ధులు, విధవరాండ్రు, ఎవరూ లేనివారు- వారి బాధ్యత కూడా గ్రామమే చూసుకునేది.’
‘అలానే అతిథుల బాధ్యత కూడా. గ్రామంలోకి జనాలు వస్తుంటారు, యాత్రికులు వస్తుంటారు. ఈ గ్రామ ప్రజలు ఏం చేసేవారంటే-ఇక్కడ ధనోరా అని ఒక గ్రామం ఉంది. ఎవరైనా ఆ గ్రామానికి వస్తే, పటేల్ తరఫున వారికి భోజన సౌకర్యం ఏర్పాటు చేసేవారు. గ్రామం పెట్టే భోజనం అది. ఎవరు వచ్చినా ఒకటి రెండు రోజుల వరకు వారి బాధ్యత చూసేవారు. వారు ముందుకు వెళ్ళిపోతున్నారా లేదా ఇక్కడే ఆగుతున్నారా చూసేవారు. ఒకవేళ ఇక్కడే ఆగాలి అనుకుంటే, ఏ పనిమీద ఆగారు, ఆ పనికోసం వారికెలాంటి ఏర్పాట్లు చేయాలనేది చూసేవారు. కాని రెండు రోజుల పాటు భోజన సౌకర్యం వారు ఖచ్చితంగా ఏర్పాటు చేసేవారు.’
‘పూర్వం ప్రజలు కాలినడకన ప్రయాణించేటప్పుడు, ఆ రోజుల్లో విపరీతంగా ప్రయాణించేవారు, హిందుస్తాన్ లో అన్నం అమ్మడం పాపంగా భావించేవారు. ఏ రోజైతే హిందుస్తాన్ లో అన్నం అమ్మడం మొదలయ్యిందో ఆ రోజే ఇక్కడి సంస్కృతి నాశనమైపోయింది. మరి యాత్రీకులు నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటారు కదా, మరి తీర్థయాత్రలకు బయలుదేరే ఆ యాత్రీకులు తమతో పాటు ఎంత ఆహారం తీసుకుని బయలుదేరతారు? పూర్వం ఒక రొట్టె కూడా తమతో తీసుకువెళ్ళేవారు కాదు. ఎందుకంటే ఇరవై కిలోమీటర్లు నడిచేటప్పటికి అక్కడ వారి బంధువులుండేవారు. వెళ్ళడం, ఏ బంధువుల ఇంట్లోనో ప్రవేశించడం, బస్, చలో! ఇక్కడ భీంసేరి అని ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో మధ్యాహ్నం రెండుమూడు గంటల వేళ యాత్రీకులు వచ్చి గ్రామం మధ్యలో ఉన్న ఒక అరుగుమీద కూచునేవారు. అప్పుడు గ్రామ కొత్వాలు వచ్చి పుస్తకంలో రాసుకునేవాడు. ‘మీరు ఎక్కణ్ణుంచి వస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు?’ అని అడిగి ఆ వివరాలు రాసుకున్న తర్వాత, ‘సరే, నువ్వు ఫలానా ఇంట్లో భోజనానికి వెళ్ళు, నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళు, నువ్వు ఈ ఇంట్లోకి వెళ్ళు’ అని ప్రతి కులం వారిని వారి కులంవారి ఇళ్ళకే పంపించేవాడు. గ్రామంలో జీవిస్తున్న ఆయా సామాజిక వర్గాల ప్రజలందరిలోనూ ఇదొక నియమంగా ఉండేది, రోజూ ఒక అతిథికి భోజనం పెట్టాలి అని.’
‘వారు తమలో తాము రోజులు పంచుకునేవారు. సోమవారం ఎవరి వంతు, మంగళవారం ఎవరి వంతు అని. ఆ రోజు ఎవరి వంతైతే, ఎంతమంది అతిథులు వచ్చినా వారు వారి ఇంటికే వెళ్ళేవారు. అక్కడ భోజనం చేసేవారు. రాత్రి అక్కడే పడుకునేవారు. తమ సొంత కులం వారే ఉంటారు కాబట్టి, ఎన్నో విషయాలు మాట్లాడుకునేవారు. ‘ఏ గ్రామంలో ఎలాంటి మార్పులు వచ్చాయి, టెక్నాలజీలో ఎలాంటి మార్పులు వచ్చాయి, కొత్తగా ఏం పుట్టింది ‘- ఈ విషయాలన్నీ ప్రజలకు చాలా సులభంగా తెలిసిపోయేవి. ఉదయాన్నే వీరు బట్టలు సర్దుకుని బయలుదేరేటప్పుడు, వాళ్ళు వీరికి తినుబండారాలు ఇచ్చి పంపించేవారు. ఆ జనాలు మళ్ళా ఊరి మధ్య చెట్టుకిందకు చేరి కలుసుకుని మళ్ళీ ప్రయాణం కొనసాగించేవారు. వారి ప్రయాణం రోజుకి ఇరవై కిలోమీటర్ల కన్నా ఎక్కువగా ఉండేది కాదు. మళ్ళీ ఇంకో ప్రదేశానికి వెళ్ళేవారు. మళ్ళీ అక్కడా ఇదే ఏర్పాట్లు ఉండేవి.’
‘మీకు తెలుసు కదా, కాళేశ్వరంలో ఇప్పటికీ అన్నం అమ్మరు. ఇప్పుడు టూరిజం సెంటరు చేసిన తర్వాత హోటళ్ళన్నీ వస్తాయనుకోండి. కానీ కాళేశ్వరంలొ ఎవరైనా ఏ ఇంట్లోకి అయినా వెళ్ళి ‘మేము భోజనం చేస్తాము’ అని అడిగితే, వాళ్ళు ‘ఎంతమంది ఉన్నారు?’ అని అడుగుతారు. ఇంతమంది ఉన్నారు అని చెప్పగానే ‘శాకాహారులా మాంసాహారులా’ అని అడుగుతారు. లేదు ‘మేం మాంసాహారులం’ అంటే ‘సరే, ఫలానా ఇంటికి వెళ్ళండి’ అని చెబుతారు. ఆ ఇంటికి వెళ్ళగానే, ‘సరే మీరు నదిలో స్నానం చేసి పూజ ముగించుకుని రండి’ అని చెప్తారు. ఇక్కడ గోదావరి ఉంటుంది కదా, అక్కడ సంగమం కూడా ఉంది. వారు స్నానం చేసి పూజ ముగించుకుని వచ్చి ఎంతో ఆనందంగా భోజనం చేసేవారు. ముందుకు సాగేవారు. ఇంతమంది తిన్నారు కాబట్టి ఇంత డబ్బయింది, అంత అయింది అని ఎవరూ అనరు, అడగరు కూడా. భోజనం చేసిన తర్వాత ఆ విస్తరాకు కింద కొద్దిగా డబ్బులు పెట్టేసి, బస్, లేచివెళ్ళేవారు. కాళేశ్వరంలో ఇప్పటికీ ఇది సాగుతూనే ఉంది.’
‘మా చిన్నతనంలో మేము చాలా పిల్లలుగా ఉన్నప్పటి మాట. ఎక్కణ్ణుంచో బయటినుండి బ్రాహ్మణులు వచ్చేవారు. వారు ఊళ్ళోకి రాగానే ‘బ్రాహ్మణుల ఇల్లెక్కడుంది’ అని అడిగేవారు. ఫలానా ఇల్లు అని చూపించేవారు. అప్పుడు వారు తమ మడిగుడ్డ ఆ ఇంటిబయట ఉన్న మేకుకి తగిలిచి వెళ్ళిపోయేవారు. ఇంటిలోపల ఉన్న స్త్రీలు లేచి బయట ఎన్ని గుడ్డలు వేలాడుతున్నాయని చూసేవారు. ఆ లెక్కన అన్నం వండేవారు. ఆ వచ్చినవారు తమ పనులన్నీ ముగించుకుని వచ్చి బావి దగ్గర స్నానం చేసి సంధ్య వార్చుకుని భోజనానికి కూర్చునేవారు. భోజనం చేసేవారు, ఎన్ని రోజులు ఉండాలి అనుకుంటే అన్ని రోజులు ఉండేవారు. అయితే ఒకటుండేది, వానికి ఆ గ్రామంలో ఏమేమి లభించాయో వాటన్నింటినీ మూటగట్టుకుని తీసుకువెళ్ళేవాడు కాడు. వాటన్నింటినీ ఇక్కడే వదిలేసి వెళ్ళేవాడు. ‘మరో ప్రదేశానికి వెళ్ళినా నాకిది లభిస్తుంది కదా’ అనుకునేవాడు. ‘నా తర్వాత ఇక్కడికి వేరే వాళ్ళు వస్తారు కదా, వారికి ఉపయోగపడుతుంది’ అని ఆ ఊళ్ళో తనకి ఏది లభించినా దాన్నక్కడే వదిలేసి వెళ్ళేవాడు. మేము మా చిన్నతనంలో ఇది చూసాం.’
‘ఈ విధంగా, ప్రతి సమాజానికి, ప్రతి కులానికీ తనదైన ఒక సామాజిక శాస్త్రం ఉండేది. ఉదాహరణకి గ్రామంలో ఎవరైనా పోయారనుకోండి, కుమ్మరి ఇంటినుండి మట్టికుండ వెళ్తుంది. ఒకవేళ కుమ్మరి ఇంట్లోనే ఎవరైనా చనిపోతే మరి ఆ మట్టికుండ ఎవరివ్వాలి? తమ ఇంటికుండ తామే తీసుకుంటారా? లేదు. అప్పుడు ఆ సమాజపు పెద్ద ఎవరుంటారో అతడు తన ఇంటినుండి ఆ కుండను తీసుకువెళ్ళడం ధర్మంగా ఉండేది. గ్రామంలో ఎవరి ఇంట్లోనైనా పెళ్ళి జరిగితే కుమ్మరి ఇంటినుండి చాలా కుండలు వస్తాయి. ఒకవేళ కుమ్మరి ఇంట్లోనే వివాహం ఉంటే? అప్పుడు వాళ్ళు మేళతాళాలతో తమ సమాజపు పెద్ద ఇంటికి వెళ్ళి వారి ఇంటినుండి మట్టికుండలు తీసుకువస్తారు.’
‘అలాగే వడ్రంగులున్నారనుకోండి. గ్రామంలో ఎలాంటి కార్యక్రమం జరిగినా, వివాహం జరిగినా వడ్రంగి ఇంటినుండి పొచ్చమ్మ, అంటే, గ్రామదేవత విగ్రహం తయారు చేయిస్తారు. ఆ గ్రామదేవత విగ్రహాన్ని తీసుకువెళ్ళి పొచ్చమ్మ గుడిలో ప్రతిష్ఠిస్తారు. కానీ వడ్రంగి ఇంట్లోనే వివాహం ఉంటే? వాడు ఆ గుడికి వెళ్ళి అక్కడ ఉన్న రెండు కొయ్య విగ్రహాల్ని మేళతాళాల్తో తన ఇంటికి తీసుకువస్తాడు. ‘ఈమె మా కుమార్తె, మా ఇంటి పెళ్ళికి మా కుమార్తె రాకపోతే ఎలా’ అని ఆ దేవతను తమ కుమార్తె లాగా భావించి తన ఇంటికి తీసుకువస్తాడు. వివాహమంతా ముగిసిన తర్వాత మళ్లీ మేళతాళాల్తో తీసుకువెళ్ళి పొచ్చమ్మ గుడిలో పెట్టివస్తాడు. ఇవన్నీ ప్రతి ఒక్క కులానికీ ఉన్న స్వంత సామాజిక నియమాలు.’
‘ఏ కార్యక్రమంలోనైనా ముందుండటం, భోజనంలో అందరికంటే వెనక ఉండటం చర్మకారుల పద్ధతిగా ఉండేది. ‘ప్రతి పనిలోనూ ముందు, తిండిలో వెనక’ అన్నమాట! వారు గ్రామంలో ఎలాంటి కార్యక్రమం కోసమైనా బయలుదేరేటప్పుడు, తమ గ్రామదేవత వద్ద మొదట వాద్యాలు వాయించి, ఆ తర్వాతే బయటకు వచ్చేవారు.’
‘ఆ మధ్య ఆగస్టులో లంబాడాల సమాజంలో ఒక వివాహం జరిగింది. లంబాడాల్లో ఎన్నో అద్భుతమైన పద్ధతులున్నాయి. వారిలో ఎవరైనా పురుషుడి భార్య చనిపోతే, చిన్న పిల్లల్ని చూసుకోవడం కోసం రెండవ వివాహం చేసుకున్నాడనుకోండి. వానికి ఆ రెండవపెళ్ళి కోసం ఖచ్చితంగా అలాంటి స్త్రీనే ఇస్తారు. ఎవరి భర్త చనిపోయాడో అలాంటి స్త్రీనే అతడు వివాహం చేసుకోవాలి. ఒకవేళ ఆమెకి బిడ్డ ఉందనుకోండి, ఆ బిడ్డను కూడా ఆమె వాని ఇంటికే తీసుకువస్తుంది. వాడు ఆ బిడ్డను కూడా తన ఇంట్లోనే చూసుకోవాలి. ఆ బిడ్డ కూడా ఆ ఇంట్లోనే పెరుగుతుంది. పెద్దదవుతుంది. ఒకవేళ వాడు ఆస్తి పంచుకునే సమయం వచ్చినప్పుడు, వాడు ఆ బిడ్డకి కూడా తన ఆస్తిలో తక్కిన పిల్లల్తో సమానమైన భాగం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే 30 సంవత్సరాల తర్వాత ఒక ఉమ్మడి కార్యక్రమం చేసి ఆ బిడ్డను కూడా తమ కుటుంబంలో ఒకరిగా కలుపుకుంటారు. ఇవన్నీ మన సంస్కృతిలో ఎన్నో అద్భుతమైన పద్ధతులుగా ఉంటూ వచ్చాయి.’
‘ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ కలగకూడదు. ఎవరిలోనూ అభద్రతా భావమనేది రాకూడదు. అందుకనే అలాంటి ఎన్నో నిబంధనలు మన సమాజంలో ఉంటూ వచ్చాయి. చాలసార్లు పంచాయతీలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు నిర్ణయాలు చేయడం చాలా కష్టమైపోతుంది. అసాధ్యంగా మారిపోతుంది. అలాంటప్పుడు ఆయా కులాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు తమ కులపురాణాలు చెప్పేవారికోసం ఎదురుచూసేవారు. ఆ జాతిపురాణం చెప్పేవారికి కూడా 150 లేదా 200 గ్రామాలు ఉండేవి. ఒకాయనకు 800 గ్రామాలు కూడా ఉండేవి. ఆ 800 గ్రామాల్లో వాడు తిరగాలి కదా. కాబట్టి వానికి ఒక్కో గ్రామానికి వచ్చే వంతు రావడానికి రెండుమూడేళ్ళు కూడా పడుతుంది. వారు వచ్చినప్పుడు వారి ముందు ఈ పంచాయతీ ఉంచేవారు. ఆ పంచాయతీ నిర్ణయం వారే చేసేవారు. ఆ నిర్ణయాన్ని అందరూ ఖచ్చితంగా ఆమోదించవలసి వచ్చేది. ఎందుకంటే వారు ఎన్నో గ్రామాలు తిరిగారు కాబట్టి ఎన్నో గ్రామాల ఉదాహరణలిచ్చేవారు. ‘ఫలానా గ్రామంలో ఇలాంటి పంచాయతీ వచ్చినప్పుడు ఈ నిర్ణయం చేశారు, ఆ గ్రామంలో ఇలాంటి పంచాయతీ వస్తే ఈ నిర్ణయం చేసారు’ అని ఎన్నో గ్రామాల నిర్ణయాలు చెప్పి ‘వాటిని బట్టి మేము ఈ నిర్ణయం చేస్తున్నాం’ అని చెప్పేవారు. ఆ నిర్ణయాన్ని సమాజం అంగీకరించేది.’
‘నేనొక చాలా వింతైన పంచాయతీ చూసాను. ఇక్కడ తంతోలి అని ఒక గ్రామం ఉంది. ఆ గ్రామానికి చెందిన ఒక అమ్మాయిని ఇక్కడ తలమడుగు గ్రామానికి చెందిన ఒకరికిచ్చి వివాహం చేసారు. ఆమె గర్భవతిగా ఉన్న సమయంలో ఆమె భర్త ఆమెని వదిలేశాడు. ఆమె తన పుట్టింటికి వచ్చేసింది. ఆమె వచ్చే సమయంలో వాడు ఒక కాగితం రాసిచ్చాడు: ‘నీకు పుట్టబోయే బిడ్డకు అయ్యే ఖర్చులో సగం ఖర్చు నేనిస్తాను’ అని. పంచాయతీలో కూర్చుని అది రాయించారు వాని చేత. వానిని వదిలేసారు. ఆమె పుట్టింటికి వచ్చేసింది. ఆమెకి ఒక కుమార్తె పుట్టింది, ఆ కుమార్తెను ఐదో తరగతి ఆరో తరగతి దాకా చదివించారు.ఆ తర్వాత ఆమెకు వివాహం చేసారు. ఆ కుమార్తెకి కూడా ముగ్గురు నలుగురు పిల్లలు పుట్టారు. ఆమె తల్లి చనిపోయింది. కానీ ఆమె కుమార్తె చేతికి ఆ కాగితం దొరికింది. అది కూడా ఎంతో కాలం తర్వాత! ఆమెకి కూడా ముగ్గురు నలుగురు పిల్లలు పుట్టిన తరువాత! ఆమె చేతికి ఆ కాగితం దొరకగానే ఆమె ఇక్కడి కుమ్మరుల వద్దకు వచ్చింది. ‘నాకు న్యాయం చేయండి, నా పంచాయతీ చెయ్యండి’ అని.
‘మరి అక్కడ ఏం న్యాయం చేస్తారు? ‘నేను పుట్టకముందే మా అమ్మని నాన్న వదిలేశాడు. వాడు సగం ఖర్చు ఇస్తాను అని రాసిచ్చిన కాగితం ఇదుగో నా దగ్గర ఉంది’ అని. ఎన్ని సంవత్సరాలు అయిపోయాయి. దాదాపు 30-35 సంవత్సరాలు అయిపోయాయి వదిలేసి కూడా! మరిప్పుడు ఈ న్యాయం అడిగితే ఏం న్యాయం చేస్తారు? ‘సరే, వాడు ఒకవేళ బతికి ఉంటే, వానికి ఖచ్చితంగా వార్త పంపుతాం. ఫలానాచోట నీ పంచాయతీ ఉంది నువ్వు రావాలి’ అని చెప్పారు. వాడు బతికే ఉన్నాడు. వానికి వార్త వెళ్ళింది. వాడు పంచాయతీకి వచ్చాడు. వచ్చిన తరువాత చాలా చర్చలు జరిగాయి. ఎన్నో విషయాలు మాట్లాడిన తరువాత వాడు అంగీకరించాడు. ‘అవును, ఈమె నా కుమార్తె, ఈ కాగితం నేనే రాసిచ్చాను. కాబట్టి నేనిస్తాను’అని అన్నాడు. ‘నీకు ఎంత ఖర్చు కావాలి చెప్పు?’ అని ఆ అమాయిని అడిగారు. ఆమె దాదాపు అరవై వేల దాకా అడిగింది. మళ్ళా అంతా కలిసి ఆలోచించారు. వీడు అంత ఇవ్వగలడా, ఇవ్వలేడా అని. వాడు ‘నేను పదహారు వేలు ఇవ్వగలను. ఈమె నా కుమార్తె కదా, నా దగ్గర ఉన్నది నేనిస్తాను’ అని అన్నాడు. అలా పదహారువేలు ఆమెకిచ్చాడు.’
‘ఈ విధమైన నిర్ణయాలు మన సమాజంలో చాలా సులభంగా జరుగుతుంటాయి. అందరూ కూర్చుని నిర్ణయం చేస్తుంటారు. అది ఆధునిక కోర్టుల్లో సాధ్యం కాదు. అక్కడకు వెళ్తే, అన్నిటికన్నా ముందు, ‘ఈమె నీ కుమార్తె అని నిరూపించు’ అంటారు. అవునా? ఆ మాటైతే అడుగుతారు కదా!’
‘నేను మరొక పంచాయతీ చూసాను. ఇద్దరు అన్నదమ్ములున్నారు. నాలుగు ఎకరాల భూమి ఉంది. తండ్రి చనిపోయాడు. ఆ అన్న ఆ నాలుగెకరాల భూమి సాగుచేస్తూ వేరొకరి వద్ద నౌకరీ చేస్తూ, ఆ నాలుగెకరాల భూమి ద్వారా తమ్ముణ్ణి సాకాడు. పెద్దవాణ్ణి చేసాడు. చదివించాడు. వాడు చదువుకున్న తరువాత, వానికి అటెండరు ఉద్యోగం వచ్చింది. అటెండరు అయ్యాడు. వానికి వివాహం చేసారు. వివాహం జరిగిన తరువాత ‘సరే, ఇప్పుడు ఆస్తి పంచుకుందాం, ఎవరిది వాళ్ళది చేసుకుందాం’ అనే మాట వచ్చింది. మరి ఆస్తి ఎలా పంచుకుంటారు?’
‘సమాజం చెప్పింది: ‘అరే, నీకు బుద్ధుందా? ఇక్కడ ఆస్తి ఎలా పంచుకుంటారు? ఆ నాలుగు ఎకరాల మీద వానికి నలుగురు పిల్లలున్నారు. వాడు ఆ రెండు ఎకరాల భూమి తీసుకుని వాళ్ళకి ఏమి తినిపిస్తాడు? ఏం తాగిస్తాడు? వాని పరిస్థితి ఏమవుతుంది? నీకు ఆల్రెడీ ఉద్యోగం ఉంది కదా’ అని సమాజం ఎంతో నచ్చచెప్పింది. కానీ వీడు వినలేదు. వినకపోతే పంచాయతీ ఒక నిర్ణయం చేసింది: ‘సరే, నీ తండ్రి చనిపోయిన తర్వాత ఇన్ని సంవత్సరాల పాటు వాడు నిన్ను సాకాడు. నిన్ను చదివించాడు, సమస్తం చేసాడు. కాబట్టి అన్ని సంవత్సరాల పాటు నీ జీతం కూడా సగం పంచుకోవాలి’ అని. ‘ఆస్తి పంచుకుంటున్నావు కాబట్టి, నీ జీతం కూడా సగం పంచాల్సి ఉంటుంది. ఆ తర్వాతే భూమి భాగం తీసుకోవాలి’ అని.’
‘కానీ వీడు కోర్టుకి వెళ్ళి ఆ భూమిభాగం తీసుకున్నాడు. కోర్టు ఇచ్చేస్తుంది కదా. ఇచ్చేసింది. కాని సమాజంలో అలా నడవదు. సమాజం మొత్తం పరిస్థితులు చూసి, హాలాత్ గమనించాకనే నిర్ణయం తీసుకుంటుంది. కోర్టు అలా చూడదు. కోర్టుకి తనదైన చట్టం ఉంటుంది. ఆ లెక్కన వెడుతుంది. కానీ సమాజం అలా ఎప్పుడూ చేయదు. అన్ని రకాలుగా గమనించి, ఆలోచించి, ఆ తర్వాతే నిర్ణయం చేస్తుంది.ఎందుకంటే ప్రతి ఒక్కరితోనూ వ్యక్తిగత సంబంధాలు ఉంటాయి, బంధుత్వాలుంటాయి, సమస్తం ఉంటుంది కదా! ప్రతి ఒక్కరి పరిస్థితీ అందరికీ తెలుసు, హాలాత్ అందరికీ తెలుసు’ అని ఆగారు గురూజీ.
18-6-2026


సర్, ఇంతటి విలువైన అంశాలతో ఉన్న మన ప్రాచీన గ్రామాల చరిత్రను ఇంతవరకు ఏ పాఠ్య పుస్తకాలలో అయినా కనిపించక పోవడానికి కారణం ఏమై ఉండవచ్చో….
అవును కదా!
మన కొక మంచి చరిత్ర ఉంది అని పాశ్చాత్యులు ఒప్పుకోరు.
మన కొక మంచి నాగరికత అనాదిగా ఉందని పాశ్చాత్యులు ఒప్పుకోరు.
మన భాషాసంపద గొప్పదని పాశ్చాత్యులు ఒప్పుకోరు.
మన గ్రామస్వరాజ్యం గురించి పాశ్చాత్యులు ఒప్పుకోరు.
ఇది ఒక అనాగరిక దేశం అనీ ఎప్పుడూ ఎవరో ఒకరు బయటనుండి వచ్చి పరిపాలించి అదుపులో ఉంచుతున్నారని మాత్రం మన పాఠశాలల్లో పిల్లలకు ఎప్పటినుండో ఆ పాశ్చాత్యులూ వారి మానసపుత్రులూ నూరిపోస్తున్నారు.
పాశ్చాత్యులు ఒప్పుకోరు కాబట్టి మన ఉనికిని మనం ఆనందంగా కోల్పోయాం.
ఇప్పుడు ఎవరన్నా ఆపాతవిషయాలు చెబుతుంటే అబ్బురంగా వినవలసి వస్తోంది.
గాంధీ గారి నిర్మాణకార్యక్రమం పుస్థకాలు స్కూలు లైబ్రరీలో ఉండేవి. ఎవరూ చదివేవారు కాదు!
కొమర్రాజు లక్ష్మణరావు పంతులు గారి చరిత్ర పుస్తకాలు నేను చదువుతున్నందుకు మాస్కూల్లో టీచర్లే నన్ను హేళనచేసారు.
ఇప్పుడిప్పుడే చాలామంది మనసంస్కృతి, మనచరిత్ర అంటుంటే సంతోషం కలుగుతోంది.
ఈవ్యాసపరంపర అద్భుతంగా నడుస్తోంది! మహదానందం.
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
You deserve to be felicitated with Jnanpith Award for this series sir 🙏
ధన్యవాదాలు సార్! అది గురూజీ వాక్కుకున్న బలం.
చెరువుల నిర్మాణం, సంరక్షణ గురించి గురూజీ చెప్పిన వివరాలు చదువుతూ ఉంటే మన పూర్వీకులు ఎంత practical గా ఆలోచించి తమ ఇండ్లను, చెరువులను design చేసుకునేవారో అప్పుడు ఒక light bulb moment లా అనిపించింది.
గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ ద్వారా పూడిక పెద్ద చెరువులకు చేరకుండా ఆపడం, చెరువులను స్నానం, తాగునీరు, ఇతర అవసరాల కోసం వేర్వేరుగా ఉపయోగించడం, చెరువుకట్టలపై ఈతచెట్లు నాటడం వంటి పద్ధతులు చూస్తే ఎంత లోతైన environmental understanding, అనుభవంతో ఈ వ్యవస్థలు ఏర్పడ్డాయో తెలుస్తుంది.
సాహిత్యం అనేది ప్రజల జీవితాల నుంచి, వారి అనుభవాల నుంచి, వారి జీవన విధానాల నుంచి పుట్టిందనే విషయం మనకి తెలిసిందే. అలాగే ఆ అనుభవాలను record చేసి, ముందు తరాలకు అందించడం కూడా ఈ విధంగానే సాహిత్యం ద్వారా జరిగిందే .
మహాభారతంలోని భీముడు, బర్బరీకుడి కథ ద్వారా చెరువులతో ఎలా ప్రవర్తించాలి, వాటిని ఎలా సంరక్షించాలి వంటి విషయాలు కథారూపంలో చెప్పబడటం. అలాగే రామచరితమానస్‌లో రామరాజ్య వర్ణనలో నదులు నిర్మలంగా ప్రవహించడం, చెరువులు తామరపూలతో కళకళలాడడం గురించి చెప్పడం కూడా అందుకేనేమో అనిపించింది.
అలాగే గ్రామ పంచాయతీల గురించి చెప్పిన విషయాలు కూడా ఆలోచింపజేశాయి.
గ్రామ పంచాయతీ vs justice system.
కోర్టు తన చట్టం ప్రకారం తీర్పు ఇస్తుంది.
గ్రామ సమాజం తన ప్రజల జీవితం, బంధుత్వాలు, పరిస్థితులు, బాధ్యతలు అన్నీ దగ్గరగా తెలిసి ఉండటం వల్ల నిర్ణయాలు హక్కులు, పత్రాలు, నిరూపణల ఆధారంగా మాత్రమే కాకుండా వాస్తవాలను కూడా పరిగణనలోకి తీసుకుని న్యాయం చేసేదని గురూజీ చూపించిన తేడా చాలా interesting గా అనిపించింది.
ఇటువంటి పంచాయతీలు ఊళ్లో చిన్నతనంలో చూసిన అనుభవం కూడా గుర్తుకు వచ్చింది.
ఈ conversationలో చాలా course material వుంది. They should design courses to study this information you are sharing through these conversations, Sir.
🙏🏽🙏🏽🙏🏽
చాలా వివరంగా సమ్మరైజ్ చేశారు. మీ వంటి వారు చదవడం వల్ల ఈ పోస్టులకు సార్ధకత చేకూరుతున్నది. హృదయపూర్వక ధన్యవాదాలు మాధవీ!
గురూజీ రవీంద్ర శర్మ గారి ఈ సుదీర్ఘ సంభాషణకు మీరిచ్చిన అక్షర రూపం చదువుతుంటే, కేవలం ఒక వ్యాసాన్ని చదివిన అనుభూతి కలగలేదు. కాల గర్భంలో కలిసిపోతున్న ఒక సంపూర్ణ నాగరికతను, ఆనాటి సామాజిక శిల్పాన్ని, మన పూర్వీకుల ఆలోచనలను అత్యంత సమీపం గా కురుక్షేత్ర యుద్ధాన్ని సంజయుడు చెబుతుంటే ధృతరాష్ట్రుడు దర్శించినట్టు గా ఒక అలౌకిక ఆనందానుభూతి కలిగింది. రవీంద్ర శర్మ గారి జ్ఞాపకాలలోని ఆర్ద్రతను, ఆనాటి భారతీయ గ్రామీణ వ్యవస్థలోని సంక్లిష్టమైన, అత్యంత వైజ్ఞానికమైన జీవన శైలిని మీరు అక్షరబద్ధం చేసిన తీరు అద్భుతం.
గురూజీ ఆదిలాబాద్ ప్రాంతంలోని బావుల గురించి మాట్లాడుతూ ఉట్నూరు గడీలోని బావి గురించి చెప్పిన విశేషం. బావి లోపల గదులు, మండపాలు ఉండటం, అక్కడ సమావేశాలు, సంగీత సభలు నిర్వహించడం అనేది ఆయన తెలపాక పోతే అసలు మన ఊహకు కూడా అందని విషయం.
“వర్షాకాలంలో వచ్చే మొదటి మురికినీరూ, మట్టీ అంతా ఆ చిన్న చెరువులో ఆగిపోతుంది. ఆ తర్వాత మిగిలిన స్వచ్ఛమైన నీరు దానికంటే పెద్ద చెరువులోకి వెళుతుంది… అందువల్ల చివరిగా ఉన్న ఆ పెద్ద చెరువులో ఎప్పువూ మట్టి పేరుకుపోయేది కాదు. అది ఎప్పుడూ పూడిపోదు. పైగా చిన్న చెరువుల్లో పూడికతీత చాలా సులభంగా తీసుకోవచ్చు.”
పైన గురూజీ చెప్పిన విషయం చదవగానే వ్యాసానికి మీరు పెట్టిన “రామరాజ్యమంటే పూడుపడని చెరువులే” అని కరెక్ట్ గా పెట్టారనిపించింది. గొలుసుకట్టు చెరువుల వెనుక ఉన్న ఆ విజ్ఞానాన్ని గురూజీ వివరించిన తీరు చదువుతుంటే ఆ ప్రాచీన గ్రామీణ పూర్వీకుల మేధస్సుకు సాష్టాంగ నమస్కారం చేయాలనిపిస్తోంది.
ఈ సుదీర్ఘమైన సంభాషణలో గురూజీ ప్రస్తావించిన వృత్తికారుల సమన్వయం, కళాత్మక జీవన సౌందర్యం, జలవనరుల నిర్వహణలోని అద్భుత ఇంజనీరింగ్, చెరువుల రక్షణలో ప్రతిబింబించే సామూహిక బాధ్యత, వీటన్నింటితో పాటు మన పురాణాల్లో ఉన్న చెరువుని ఎలా వాడుకోవాలో తెలిపే నియమాల గురించిన భీమ బర్బరీకుల సంవాద కథను గ్రామీణ సంప్రదాయ వ్యవస్థకు ముడిపెడుతూ వారు చేసిన విశ్లేషణ భలే అనిపించాయి. ఈ వ్యాసం పుణ్యమా అని ఆ శ్లోకాల గురించి తెలుసుకోగలిగాను. గురూజీ భారతంలో ఆ కథ ఉందన్నారు, నిజానికి ఈ కథ స్కంద పురాణంలోని, కౌమారికా ఖండం లో 64వ సర్గ మొదట్లో ఉంది
ఈ వ్యాసం చదివే వాళ్ళ సౌలభ్యం కోసం కొన్ని శ్లోకాలు… ఇక్కడ పంచుకుంటున్నా
నద్యాం నద్యాం సదా స్నాయాత్ న తటాకే కదాచన |
తటాకే తు తదా స్నాయాత్ దేవతార్థం న చేజ్జలమ్ ||
మనుషులు ఎల్లప్పుడూ ప్రవహించే నదీ జలాలలోనే స్నానం చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. నిల్వ ఉండే చెరువులలోకి నేరుగా దిగి స్నానం చేయకూడదు. ఒకవేళ ఆ చెరువు నీరు దేవతార్చనకు లేదా ప్రజలు తాగడానికి ఉపయోగించేది కాకపోతేనే అందులోకి దిగవచ్చు, లేదంటే గట్టు మీద నిలబడి నీటిని ముంచుకుని మాత్రమే స్నానం చేయాలి.
తీర్థేషు యే ప్రకుర్వన్తి జలదోషం నరాధమాః |బ్రహ్మఘ్నైస్తే సమాయుక్తాః పతన్తి నరకే అశుచౌ ||
పవిత్రమైన చెరువులలో, నదులలో వ్యర్థాలను వేస్తూ, నీటిని అపవిత్రం చేసే మనుషులు బ్రహ్మహత్యా పాతకం చేసినవారితో సమానమైన దోషాన్ని మూటగట్టుకుంటారు. వారు తీవ్రమైన నరక బాధలను అనుభవిస్తారని బర్బరీకుడు హెచ్చరిస్తాడు.
పాదౌ ప్రక్షాళ్య హస్తే చ తతః స్పృశేజ్జలం శుచిః |అప్రక్షాళితపాదేన న గచ్ఛేత్ పల్వలం క్వచిత్ ||
ఏదైనా చెరువు లేదా నది నుండి నీరు తాగాలన్నా లేదా అందులోకి దిగాలన్నా, మొదట గట్టు వెలుపల వేరే నీటితో చేతులు, కాళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి. మురికి కాళ్ళతో నేరుగా పవిత్రమైన జలవనరులలోకి నడవడం వల్ల ఆ నీరంతా కలుషితమై ఇతరులకు వ్యాధులు సంక్రమిస్తాయి.
యతః పీతం జలం పుంసామ్ అప్రక్షాల్య చ యద్భవేత్ |
ప్రేతాః పిశాచాః తద్రూపం సంక్రమ్య ప్రపిబంతి తత్ ||
కాళ్లు, చేతులు, నోరు కడుక్కోకుండా అశుచిగా నీరు తాగితే, ఆ నీటిని ప్రేతాలు, పిశాచాలు తాగుతాయని, అంటే అపరిశుభ్రత వల్ల శారీరక, మానసిక అనారోగ్యాలు కలుగుతాయని బర్బరీకుడు హెచ్చరించాడు.
దుర్మతే భోః కిమేతత్ త్వం కురుషే పాపనిశ్చయః |
దేవీకుండే క్షాలయసి ముఖం పాదౌ కరౌ చ యత్ ||
దేవతా తీర్థాల పవిత్రత (నీటిలో మురికి కడగకూడదు) : పవిత్ర దేవీకుండంలో ముఖం, కాళ్లు, చేతులు కడుక్కుంటున్న భీముణ్ణి చూసి, అలాంటి పాపపు పని చేస్తున్నందుకు బర్బరీకుడు కోపగించుకున్నాడు.
మలాక్తతోయం యన్నామా అస్పృశ్యం తన్నరైరపి |
కుతో దేవైశ్చ తత్ పాపం స్పృశ్యతే తత్త్వతో వద ||
మనిషికే పనికిరానిది దేవుడికి ఎలా పనికొస్తుంది? :మనుషులకే పనికిరాని మలంతో కూడిన కలుషిత నీటిని దేవతలు ఎలా స్వీకరిస్తారని, పవిత్ర జలాశయంలో మురికి కడిగి దాన్ని ఎలా కలుషితం చేస్తున్నావని బర్బరీకుడు ప్రశ్నించాడు.
మీరు భీముడు- బర్బరీకుడి కథ గురించి మూలం గురించిన వివరాలతో పాటు, అందులో బర్బరీకుడు చెప్పిన జాగ్రత్తలను ఈ విధంగా శ్లోకం -తాత్పర్యం రూపంలో ఇవ్వడం వల్ల ఈ సంభాషణకు ఎంతో సాధికారికత చేకూరింది. మీకు ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే. ఈ శ్లోకాలు పుస్తకంలో వివరణలో చేర్చుకుంటాను.