
2
స్వీయభూమి
మూడు రోజుల తర్వాత గొయిపాక ప్రధానోపాధ్యాయుడు నన్ను వెతుక్కుంటూ బీరుపాడు వచ్చాడు. తను ఇన్నాళ్లూ ఎక్కడికి గైరుహాజరయిపోయానని అడుగుతానేమోనని అనుకున్నాడేమో నాకా అవకాశం ఇవ్వకుండానే ‘మన స్కూలుకి వెళ్లిపోదాం రండి, సార్ ’ అన్నాడు. ‘మన స్కూలు’ అన్నమాట వినగానే నాకేదో ఆత్మీయతాస్ఫురణ కలిగింది. ఆ అడవుల్లో నా కోసమొక పాఠశాల ఎదురుచూస్తున్నదనీ, నా జీవితమంతా ఆ పాఠశాలలోనే గడపనున్నదనీ ఏదో కలలాగా తోచింది.
ఒక్క ఉదుటున లేచాను. ఆ ఉపాధ్యాయుని కేసి చూసాను. నల్లని గొడుగు ధరించి, అరిగిపోయిన హవాయి చెప్పుల్తో అతడు కూడా పందొమ్మిదవ శతాబ్ది రష్యా నుంచే సరాసరి అక్కడికి నడిచివచ్చినట్టున్నాడు. అతన్నేమీ అనాలనిపించలేదు నాకు. నా సామానూ, సంచీ భుజానికెత్తుకుని ‘పదండి’ అన్నాను.
మూడునాలుగురోజులుగా ఆ కొండలు అలవాటయిపోయినట్టున్నాయి. ఈ సారి గొయిపాక కొండ ఎక్కి దిగడానికి అట్టేసేపు పట్టినట్టే లేదు. కొండదిగి పాఠశాలలోకి అడుగుపెట్టగానే అక్కడి దృశ్యాన్ని చూసి నా కళ్లని నేనే నమ్మలేక పోయాను. దాదాపు ముప్పైమంది పిల్లలు, ఆడపిల్లలూ, మగపిల్లలూ కూడా కొత్త దుస్తుల్తో వినయంగా కూచుని ఉన్నవాళ్లు నన్ను చూడగానే ‘గు-డ్-మా-ర్నింగ్-సా-ర్ ’ అంటూ ఒక్కసారి లేచి స్వాగతమిచ్చారు. ఎన్నో ఏళ్లుగా తనిఖీ అధికారుల కోసం స్కూలుని ముస్తాబు చెయ్యడంలో ఆ మాస్టారు సాధించిన నేర్పరితనమంతా అక్కడ కొట్టొచ్చినట్టుగా కనబడుతూ ఉంది.
కాని ఆ కృత్రిమ వాతావరణాన్ని నేను ఏవగించుకోలేదు. మూడు రోజుల కిందట ఊసరక్షేత్రంలా ఉన్న ఆ బీడుభూమిలో నేడు కొన్ని పూలమొక్కలు హఠాత్తుగా ప్రత్యక్షమయి కిలకిలా నవ్వుతున్నట్టు తలలూపుతున్నట్టు అనిపించింది. నాకెందుకో నా ఆత్మపైకి లేచి వచ్చినట్టనిపించింది.
ఆ పాఠశాల దాని సమస్త బలహీన ఆధారాలన్నిటితో, అది లేవనెత్తుతున్న అసంఖ్యాకమైన సమాధానాలు లేని ఎన్నో ప్రశ్నలతో సహా నాకేదో ఉపదేశ మిస్తున్నట్టుగా అనిపించింది.
అక్కడ పదిరోజులు గడిపాను. ఆ చిన్నారి కోదు పిల్లల మధ్య వాళ్లతో తిని, వాళ్లతో ఆడిపాడిన ఆ పదిరోజులూ నా జీవితంలో నేను మరవలేనివి. ముందొక రోజు నాకు ఆ వాతావరణం కొత్తగా అనిపించిన మాట నిజం. కాని ఆ రోజు రాత్రే ఆ కొత్తదనమంతా ఎగిరిపోయింది. ఆ రోజు నేను వచ్చినప్పుడు ముచ్చట్లాడుకుంటూ నాకెంతో అపరిచితంగా అనిపించిన ఆ హాస్టలు పనివారిలో నేను ఊహించి ఉండని కళాకారులు ప్రత్యక్షమయ్యారు. వారు అంతదాకా ఎక్కడ దాచారో తమ వాద్యాల్ని బయటకు తీసారు.
ఆ రాత్రి ఆకాశం మేఘరహితంగా ఉంది. ఆ ఆషాడఋతువులో కూడా ఆకాశం అసంఖ్యాక నక్షత్రాలతో మెరుస్తూ ఉండింది. పాఠశాల ఎదటగా పెద్ద నెగడి వెలిగించారు. పిల్లలూ, పెద్దలూ అంతా తమ కొచ్చిన పాటలు పాడారు. ఆటలు ఆడారు. నృత్యం చేసారు. ఆ పాటల్లో మనకి తెలిసిన ప్రపంచపు కల్మషం లేదు. అవి పురాతన కుయిభాషాపదాల నిర్మలత్వాన్ని మూటగట్టుకున్న పూలదొంతరలు. ఆ రాత్రి నేను నా స్వీయభూమికి చేరినట్టుగా భావించాను. ‘ఇదే నా కర్మ భూమి, నా సారస్వతం, నా రంగస్ధలం’ అని పదే పదే నాకు చెప్పుకున్నాను.
ఆ మర్నాడు తెల్లవారగానే నాకు ఆ పిల్లల కోసమొక కొత్త దినం తెరుచుకుందని గుర్తొచ్చింది. వాళ్లకి నేను కొత్తరోజుని ఏ విధంగా అందించాలి? ఆ మాట కొస్తే ఆ మాష్టారు గాని మరొక ఉపాధ్యాయుడు గాని ఆ పిల్లల కోసం ఎటువంటి దైనందిన జీవితాన్ని అక్కడ ఆవిష్కరించవలసి ఉంటుంది? ఎటువంటి ఆవిష్కరణకు వాళ్లు శిక్షణ పొందారు?
వాళ్లకి ఉపాధ్యాయశిక్షణ నిచ్చిన సంస్ధలకు, వాటిల్లో బోధించే ఉపాధ్యాయులకు గాని అటువంటి గ్రామాలున్నాయని గాని, తమ ట్రయినీలు తమ జీవితకాలంలో అధికభాగం అటువంటి పాఠశాలల్లోనే బోధించవలసి ఉంటుందని గానీ ఊహకి కూడా అందదు. అటువంటి అరణ్యనేపథ్యంలో, నాగరిక ప్రపంచపు వాసన కూడా సోకని ఆ నిష్కపట ఆదివాసుల భాషలో మాట్లాడుకునే వారి పిల్లల ఎదట తమ ట్రైనీలు పరాయిగా, కొత్తగా, అశక్తులుగా నిలబడివలసి ఉంటుందని ఆ ఉపాధ్యాయశిక్షణా సంస్ధలకి నేటికి కూడా తెలియదు.
తమ దగ్గర ఆ ఉపాధ్యాయులు గడిపిన ఏడాది లేదా ఏణ్ణర్ధం కాలం కేవలం సర్టిఫికెటుని ఇవ్వడానికి మాత్రమే ఉపయోగించిందని ఆ సంస్ధకి తెలియక పోయినా ఆ ఉపాధ్యాయుడికి తెలుసు. ఆ సర్టిఫికెటు వల్లనే అతనికి జీవనోపాధి లభించింది. అతడు తన ఇష్టపూర్వకంగా తననేదో ఆత్మోత్సాహం ముందుకునెడుతుంటే ఉపాధ్యాయవృత్తిని స్వీకరించినవాడు కాడు. మారుతున్న ప్రపంచంలో తననీ, తన కుటుంబాన్నీ పోషించుకోవడం కోసమే అతడా వృత్తిని స్వీకరించాడు. ఒకప్పుడు బ్రిటిష్ ఇండియాలో ఉపాధ్యాయుల్ని చూసి మహాత్ముడే ఇలా ప్రశ్నించాడు :
‘హృదయ శిక్షణ గురించి ఒక్కమాట. ఇది పుస్తకాల ద్వారా రాదు. సజీవమైన గురుసంపర్కం వల్ల వస్తుంది. మన ప్రయిమరీ, సెకండరీ స్కూళ్ల అధ్యాపకులెవరు? విశ్వాసం, శీలంగల స్త్రీపురుషులేనా వారు? తామై తాము హృదయశిక్షణ పొందిన వారేనా? తమ ఆధీనంలో ఉన్న బాలబాలికల సహజశక్తుల్ని శ్రద్ధతో పోషించగలరా? చిన్న పాఠశాలల్లో ఉపాధ్యాయుల్ని నియమించే పద్ధతి బిడ్డల సౌశీల్య వికాసానికి ఆటంకంగా లేదా? వారి బతుకుదలకి కావలసిన వేతనాలు లభిస్తున్నాయా? ఈ ఉపాధ్యాయులు వారి దేశప్రేమని బట్టి నియమించ బడటం లేదు. మరొక ఉద్యోగం దొరకనందునే వాళ్లు ఇటు వస్తున్నారు’.
అప్పటికీ ఇప్పటికీ అధ్యాపక వృత్తిలోని పరాయీకరణలో ఏమీ మార్పు లేదు. కేవలం పరాయీకరణ మాత్రమే కాదు. అందులో అశక్తత కూడా ఉంది. పొద్దున్నే ఆ దండకారణ్యంలోని సాలవృక్షశాఖల్లోంచి ప్రభాత సూర్యకాంతి ప్రసరిస్తూ ఉండగా, దాని కిరణాల మాల కన్నా ఎంత సుందరతరమైన అలంకారంతో ఆ ఉపాధ్యాయుడు తన పాఠశాలని అలంకరించగలడు?
ఆ పిల్లలు పొద్దున్నే లేచి నెమ్మదిగా ఆ ఎండ వెచ్చదనాన్ని అనుభవిస్తో అక్కడ కొండవాలులో ప్రవహించే ఏటిదాకా నడుచుకుంటూ పోయేవారు. ఆ ఏరు సన్నని కలస్వనంతో ప్రవహిస్తూ ఉండేది. దాని తేమ ఇసుకమీద బంగారం పోసినట్టు సూర్యరశ్మి పరుచుకోనేది. దాని ఇరువైపులా అల్లుకున్న పొదల్లోంచీ, తీగెలనుంచీ, చెట్ల గుబుర్లలోంచీ తెల్లని శరాల్లా సూర్యకిరణాలు సూటిగా భూమిని తాకుతుండేవి. ఆ కొమ్మల మీద రకరకాల పక్షులు, ఆకుపచ్చ వన్నెవి, పసూవన్నెవి, ధూసరవర్ణానివి రెక్కలల్లార్చుకునేవి. కిచకిచలాడేవి. ఆ పైన ఆకాశంలోకి రివ్వున సంధించిన శరాల్లా ఎగిరిపోయేవి.
పిల్లలు కూడా తమ భాషలో కిచకిచలాడుకుంటూ ఆ పిట్టల్నీ, ఆ గాలుల్నీ తాకుతూ, ఆ తీగెల్నీ, ఆ పువ్వుల్నీ పక్కకు తోసుకుంటూ ముఖాలు కడుక్కునేవారు. ఆ ఏట్లో మునిగితేలేవారు. ఈతలు కొట్టేవారు.
అత్యంత సహజంగా, సంతోషభరితంగా సాగే ఆ జలకాలాటల్లో ఆ ప్రధానో పాధ్యాయుడికి స్ధానం లేదు. అతడు అయితే పిల్లలకు వంట ఏర్పాట్లలో మునిగి పొయ్యేవాడు. లేదా కొండ దిగువ గుమ్మలక్ష్మిపురంలో ఉన్న కుటుంబసమస్యల గురించీ, తనకి కొండ దిగువకి బదిలీ ఎప్పుడవుతుందా అన్న దాని గురించీ ఆలోచనల్లో మునిగిపొయ్యేవాడు.
వారం రోజులు గడిచేటప్పటికి పిల్లలకి నా మాటలు బోధపడకపోయినా నా నవ్వుముఖం బాగా బోధపడటం మొదలుపెట్టింది. వాళ్లకేదో సన్నిహిత కరస్పర్శ నా నుంచి లభించసాగింది. పలక మీద బొమ్మలు గీసి ఆ బొమ్మల ద్వారా వాళ్లు నాతో సంభాషించడం మొదలుపెట్టారు. ముందు వాళ్లొక పక్షినో, పువ్వునో గీసేవారు. అప్పుడు ఆ పలక మీద నేనో గాలిపటాన్నో, రైలు బొమ్మనో గీసేవాణ్ణి. అప్పుడు దానిమీద ఒక నెమలినో, ఇంటినో, ముగ్గునో గీసేవారు.
నేనక్కడలేనప్పుడు వాళ్లకెలానూ పాఠాలు నడవవు కాబట్టి నేనున్న నాలుగు రోజులు కూడా ఆ కృత్రిమ అధ్యయనం అనవసరమని ఆ మాస్టారికి చెప్పేసాను. ఇక నేనున్నని రోజులు ఆ పిల్లలూ నేనూ ఆ అడవి అంతా కలయతిరిగాం. వాళ్లు ఆడుకునే ప్రతి ఒక్క స్ధలాన్నీ చూపించారు నాకు. ఒకరోజు పిల్లలు ఎక్కణ్ణుంచో అందమైన రాళ్లు ఏరి తెచ్చారు. మరో రోజు నెమలి ఈకలు ఏరి తెచ్చారు.
ఆ పగళ్లంతా వానాకాలపు పచ్చికమీద అసంఖ్యాకమైన సీతాకోకచిలుకలు ఎగురుతుండేవి. ఆ అడవుల్లో పశువులు తప్పిపోకుండా వాటి మెడల్లో కట్టిన చిరు గంటలు అవి మేత మేస్తున్నంతసేపూ సన్నని ధ్వని చేస్తూండేవి. ఆ పొదల్లో పసుల కాపరులు పీరూడిలు (పిల్లంగోవులు) ఊదుకుంటూ తిరిగేవారు.
ఆ పీరూడి పాటలు విన్నప్పుడల్లా ప్రతి పిల్లవాడి ముఖంలో అతిలోక వివశత్వం కనిపించేది. వాళ్ల చిన్న చిన్న హృదయాల్లో ఏ లోకాల ఊసులు దాగి ఉన్నాయి? వాటిని వినకుండానే ఆ భాషని బోధపరుచుకోకుండానే మనం మన మాటల్ని వారికి నూరిపోస్తున్నామే అనిపించింది.
ఎవరో అధికారి దిగువ నుంచి వచ్చి ఆ పాఠశాలలో ఉంటున్నాడన్న వార్త నెమ్మదిగా ఆ చుట్టుపక్కల వ్యాపించింది. దాంతో ఆ దారమ్మట ఎవరన్నా గ్రామస్ధాయి అధికారులు గాని దిగువస్ధాయి ప్రభుత్వోద్యోగులు గాని పోతున్నవారల్లా ఆగి ఒక క్షణం నన్ను పలకరించి వెళ్లేవారు. ఏ సమాచార సాధనాలు లేని ఆ అడవిలో ఎప్పటికప్పుడు పార్వతీపురంలో జరిగే ప్రతి వార్తా నాకు ఎవరో ఒక ఉద్యోగి చేరవేసి వెళ్లిపోయేవాడు.
వాళ్లొచ్చి వెళ్లినంతసేపూ మాత్రం, రోడ్డు మీద బస్సు పోయినప్పుడు దుమ్ము రేగినట్టు నాగరిక ప్రపంచవాసన రేగేది. వాళ్లు వెళ్లిపోయిన కొన్ని క్షణాలకే అది సద్దుమణిగేది. మళ్లా ఆవుల మెడలో గంటలు, పిల్లంగోవి పాటలు వినిపించేవి.
మా పాఠశాలకి దిగువన ఏరు. ఏటికి అవతల ఒడ్డున మరొక లోయ. ఆ లోయకవతల డొంబువాళ్ల వలస ఒకటుండేది. వాళ్లు గిరిజనులు కారు. దళితులు. వస్త్రాల్ని నేయడం వృత్తిగా జీవిస్తుండేవారు. వారికి తెలుగు వచ్చు. నాగరిక ప్రపంచం గురించి వారికి తెలివిడి ఉంది. వారి యువకులు కొందరు స్కూలుకి వచ్చి నాతో ఏదో ఒకటి చర్చిస్తూండేవారు.
కాని గిరిజనుల్లో ఎక్కువగా వారి పంచాయతీ మెంబరొకతనే నాతో మాట్లాడే వాడు. అతడెప్పుడూ తాగి ఉండేవాడు. మొదటిరోజునే నాతో గొడవపడ్డాడు. మరుక్షణమే మిత్రుడయ్యాడు. బహుశా అతని పంచాయతీ అనుభవం ఏ నాగరికుణ్ణీ అంత తొందరగా నమ్మకూడదని అతనికి బోధించి ఉంటుంది.
మధ్యలో ఒకసారి ఆ మాష్టారు నన్ను గుమ్మలక్ష్మీపురం తీసుకువెళ్లాడు. ఆ కొండదారిని నడుస్తూండగా కొద్దిసేపట్లోనే ఆషాడమేఘాలు ముసురుకుని మహావర్షం కురిసింది. వర్షంలోని మహాసౌందర్యాన్ని నేను ఆ రోజు నిజంగా చూడగలిగాను. కాని ఆ అందాలు, ఆ ఆనందాలు జీవితానికి ఒక పార్శ్వం మాత్రమే. ఆ కొండ దారుల్లో గిరిజన కార్పొరేషన్ నుంచి సరుకులు ఎత్తించుకుని మూటలు గట్టి కొండ మీదకు చేర్చడంలో ఉండే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఆ ప్రధానోపాధ్యాయుడి శక్తి సామర్ధ్యాలన్నీ ఆ హాస్టలు నిర్వహణకే ఖర్చయిపోయేవి.
నా మజిలీ ముగింపుకొచ్చింది. నేను కొండదిగి పార్వతీపురం వెళ్లవలసిన రోజు రానేవచ్చింది. ఆ రోజు ఆ మాస్టారు ఆ కోదుపల్లెలో నాకో వీడ్కోలు సభ ఏర్పాటు చేసాడు. ఆ సభకి పంచాయతీ మెంబరు అధ్యక్షత వహించాడు. సగం కుయి, సగం తెలుగు కలగలిసిన అతని ప్రసంగంలో – తమ గ్రామంలో ఒకప్పుడు వెంపటావు సత్యం ఉన్నాడనీ, తిరిగి ఇన్నాళ్లకు తమని అభిమానించేవాడు మరొకడు తమతో కొన్నాళ్లు నివసించేడనీ చెప్పాడు. ఆ పిల్లలూ, ఆ హాస్టలు పనివారూ ఎప్పటి లానే పాటలు పాడారు. పీరూడి ఊదారు.
కొండదిగి కూనేరు రాగానే నాకొక్కసారిగా చెప్పలేనంత దిగులు ఆవహించింది. ఆ కోదుపల్లె, ఆ సీతాకోకచిలుకలూ, ఆ పిల్లంగోవి పాటలూ, పసుపు రెక్కల ఆ పిచుకలూ, ఆ పిల్లలూ నా మనసంతా ఆవరించేసారు. నేనేం నేర్చుకున్నానక్కడ? ఇన్నేళ్ల తరువాత వెనక్కి తిరిగి చూసుకుంటే, దండకారణ్యంలో గడిపిన ఆ రెండు వారాలే నా భవిష్యకార్యక్రమానికి యథార్ధమైన ప్రాతిపదికను సమకూర్చాయని పించింది.
ఆ గిరిజన సమాజంలో ఆ పాఠశాల అత్యంత హాస్యాస్పదంగా ఎందుకుందో, దాన్ని అత్యంత శక్తివంతంగా ఎలా మార్చవచ్చునో నాకో దిశానిర్దేశం అక్కడే లభించింది. ఆ అనుభవం ఇచ్చిన మెలకువలోంచే నేను నా కొత్తకలలకు రెక్కలు చాపుకుని ఎగిరాను.
2
My True Land
Three days later, the headmaster of the Goyipaka school came to Beerupadu looking for me. Perhaps sensing that I might ask where he had been all this time, he preempted me entirely and said, “Come, sir, let us go to our school.” Hearing him say “our school” sparked a sudden wave of warmth and belonging within me. It felt like a dream—the realization that a school was waiting for me out there in the depths of the forest, and a fleeting sense that I might spend the rest of my life within its walls. I stood up at once and looked closely at him. Clutching a black umbrella and wearing worn-out rubber slippers, he looked as though he had walked straight out of nineteenth-century Russia into this very spot. I felt no desire to question him. Hoisting my luggage and shoulder bag, I simply said, “Let’s go.”
Having trekked those hills for the past three or four days, I seemed to have adapted to the terrain. This time, climbing up and descending the Goyipaka hill felt as though it took no time at all. The moment I walked onto the school premises, I could scarcely believe my eyes. Around thirty children, both boys and girls, were sitting neatly in fresh clothes. The moment they saw me, they stood up in unison and chimed in a long, drawn-out greeting: “Goo-d mor-ning, sirrr.” The sheer resourcefulness this master had perfected over years of dressing up his school for visiting inspectors was strikingly visible everywhere.
Yet, I did not look down upon this staged atmosphere. In that barren, desolate clearing that had resembled a wasteland just three days ago, it now felt as though a few flowering plants had suddenly burst into bloom, nodding their heads and laughing merrily. For some reason, I felt my spirit lift. The school, with all its fragile foundations and the countless unanswered questions it raised, seemed to be offering me a profound lesson.
I spent ten days there. Those ten days spent among those little Khond children—eating with them, playing, and singing alongside them—remain entirely unforgettable. It is true that the environment felt completely foreign to me on that first day, but by that very night, all that unfamiliarity dissolved. The hostel workers, who had seemed so distant and strange when I first saw them chatting idly, revealed themselves to be artists of an unexpected caliber. They brought out their musical instruments, which they had kept hidden away until that moment.
The sky was cloudless that night. Even in the midst of the Ashadha season, the heavens shimmered with countless stars. In front of the school, a large hearth fire was lit. Children and adults alike sang the songs they knew, played games, and danced together. Those songs bore none of the pollution of the world we know; they were like clusters of fresh flowers, gathering the pure essence of ancient Kui words. That night, I felt as though I had finally arrived at my true land. “This is my karmabhoomi, my fountain of expression, and a stage for my imagination,” I told myself over and over again.
As dawn broke the next morning, I realized that a new day had opened for these children. How was I to offer this new day to them? For that matter, what kind of daily life were the headmaster or any other teacher supposed to create for the children here? What kind of creative expression had they actually been trained to provide? The institutions that train these teachers, and the instructors who lecture there, cannot even fathom that such villages exist, let alone that their trainees will spend the better part of their careers teaching in such schools. Even today, these training colleges remain blind to the fact that their graduates are left standing helpless, like awkward strangers, before innocent tribal children speaking their own native tongue in a deep forest setting completely untouched by modern civilization.
An institution may not realize that the year or two a trainee spends there serves merely to secure a certificate, but the teacher knows it all too well. It was that certificate alone that provided him with a livelihood. He did not enter the teaching profession out of choice, driven by some inner passion; he took it up simply to feed himself and his family in a changing world. Looking at the state of teachers in British India, Mahatma Gandhi himself once observed:
“A word about the training of the heart. It does not come through books. It comes through the living touch of the teacher. Who are the teachers in our primary and secondary schools? Are they men and women of faith and character? Have they themselves received the training of the heart? Can they inspire the children under their charge? Is the method of appointing teachers in these small schools conducive to the development of character? Are they paid a living wage? The teachers are not appointed for their patriotism. They come because they can get no other employment.”
There has been absolutely no change in the alienation within the teaching profession between then and now. And it is not just alienation; there is a profound sense of helplessness in it too. As the early morning sun filters through the branches of the majestic Sal trees in this Dandakaranya forest, what adornment could a teacher possibly bring to his school that could ever match the breathtaking beauty of that garland of light?
The children would wake up early in the morning, slowly bathing in the gentle warmth of the sun as they walked down to the stream flowing along the hillside. That stream flowed with a soft, liquid murmur. Over its damp sand, the morning sunlight spread like poured gold. Through the tangled bushes, vines, and thick foliage on either bank, sunbeams shot straight down to touch the earth like brilliant white arrows. Upon the branches, a vibrant variety of birds—tinged in shades of green, yellow, and ash-grey—would flutter their wings and chirp merrily, before suddenly launching themselves into the sky like arrows shot from a bow.
Chattering away in their own tongue, the children would likewise touch the birds and the breeze, gently pushing aside the vines and wild blossoms as they washed their faces. They would plunge into the stream, splashing and swimming about.
The headmaster had absolutely no place in these effortless, joyful water games. He would either be entirely consumed by daily chores of getting the meal cooked for the children, or hopelessly lost in worrying about his family problems down the hill in Gummalaxmipuram, wondering when his transfer to the plains would finally come through.
By the time a week had passed, even though the children could not comprehend a word I said, they had fully learned to read the warmth of my smiling face. They began to feel a close, comforting bond through my presence. They even started conversing with me by drawing pictures on their slates. First, they would sketch a bird or a flower. In response, I would draw a kite or a toy train on the slate. Then, they would counter with a peacock, a little house, or a tribal design.
Knowing that no real lessons would take place once I left anyway, I told the master that there was no need to force this artificial study during the few days I was there. For the rest of my stay, the children and I roamed freely all over that forest. They eagerly showed me every single spot where they loved to play. One day, they gathered and brought me a collection of beautiful stones from somewhere in the woods; on another day, they brought me fallen peacock feathers.
All through those long days, countless butterflies fluttered over the lush monsoon grass. Deep in the forest, the small bells tied around the necks of the grazing cattle—meant to keep them from wandering off—tinkled softly as long as they fed. Among the thickets, young herdsmen wandered about, playing sweet melodies on their peeroodis (tribal bamboo flutes). Whenever the notes of the peeroodi floated through the air, a look of otherworldly trance would wash over every child’s face. What secret whispers of distant worlds lay hidden within those tiny hearts? It struck me then how we blindly insist on pouring our own words into them, without ever pausing to listen to their hearts or understand their language.
The news that some officer from the plains had arrived and was staying at the school slowly rippled through the surrounding hills. Consequently, whenever village-level functionaries or lower-rung government employees happened to pass along that path, they would stop for a brief moment to greet me before moving on. In that isolated forest, completely cut off from any modern communication channels, these passing employees would swiftly deliver the latest updates from Parvathipuram.
Yet, for as long as their visits lasted, a heavy air of the civilized world would stir around us—very much like the thick dust kicked up when a bus passes along a dry road. A few moments after their departure, however, the dust would settle, the noise would recede, and the gentle tinkling of cattle bells and the melodies of the bamboo flute would once again fill the silence.
Below our school ran the stream, and on the opposite bank lay another valley. Beyond that valley stood a settlement of the Dombu people. They were not tribals, but Dalits, who earned their livelihood through their traditional occupation of weaving cloth. They spoke Telugu and possessed a clear understanding of the outside world. A few of their young men would frequently walk over to the school to engage me in various discussions.
Among the tribal inhabitants, however, it was mostly their local panchayat member who spoke with me. He was invariably drunk. On my very first day, he picked a fight with me, only to become a close friend the very next moment. Perhaps his experience in local governance had taught him a harsh lesson: never to trust an outsider from the civilized world too quickly.
At one point during my stay, the headmaster took me down to Gummalaxmipuram. As we trekked along the mountain path, the heavy clouds of the Ashadha season suddenly massed overhead and unleashed a torrential downpour. On that day, I witnessed the raw, magnificent beauty of rain in the wild. Yet, such beauty and joy represent only one facet of existence. The sheer, exhausting labor of collecting provisions from the Girijan Co-operative Corporation, binding them into heavy bundles, and hauling them up those steep mountain paths was immense. The headmaster’s entire energy and capability were completely drained by the logistical nightmare of managing the hostel.
Eventually, my brief sojourn drew to a close. The day arrived for me to descend the hills and return to Parvathipuram. To mark the occasion, the master organized a farewell gathering for me in the Khond village. The panchayat member presided over the meeting. In a speech delivered in a unique blend of half-Kui and half-Telugu, he remarked that Vempatapu Satyam had once lived in their village, and now, after all these years, another person who genuinely cared for them had come to share their lives for a few days. The children and the hostel workers sang their songs just as they always did, and the sweet notes of the peeroodi floated through the air.
The moment I climbed down the mountain and reached Kuneru, an overwhelming, indescribable sorrow suddenly enveloped me. My mind was completely haunted by images of that Khond village, the fluttering butterflies, the haunting flute melodies, the yellow-winged sparrows, and the faces of those children. What had I truly learned there? Looking back after the passage of so many years, I realize that those two weeks spent in the Dandakaranya forest provided the actual, enduring foundation for my entire life’s work. It was in that remote clearing that I gained a clear, defining vision of why the existing school system was so utterly farcical within a tribal society—and exactly how it could be transformed into a powerful instrument of change. Armed with the profound awakening born of that experience, I spread the wings of my new dreams and took flight.
13-7-2026


తమ గ్రామంలో ఒకప్పుడు వెంపటావు సత్యం ఉన్నాడనీ, తిరిగి ఇన్నాళ్లకు తమని అభిమానించేవాడు మరొకడు తమతో కొన్నాళ్లు నివసించేడనీ చెప్పాడు.