
9
దర్శనశీల పాఠశాల
పిల్లవాడు తరగతి గదిలో నల్లబల్లకేసి చూసి ఎక్కువ నేర్చుకుంటాడో లేక తరగతి గదిలో బయటకు చూస్తూ ఎక్కువ నేర్చుకుంటాడో చెప్పడం కష్టమని ఒక విద్యావేత్త అన్నాడు. పాఠశాల తన విద్యార్ధులకు నైపుణ్యాల్ని అందచేసే క్రమంలో తనకి తెలిసో తెలియకుండానో కొన్ని సందుల్ని కొన్ని వెసులుబాటుల్ని కూడా ఏర్పరుస్తుంది. ఆ సన్నని సందుల్లోంచే ఆ పాఠశాలని ఒక నిర్మాణంగా కాక సజీవ ప్రవాహంగా చేసే జీవనస్రవంతి ప్రవహిస్తూ ఉంటుంది.
తాడికొండలో నాకు అటువంటి కిటికీగా హీరాలాల్ మాష్టారు కనబడ్డారు. ఆయన నేను ఎనిమిదో తరగతి చదువుతుండగా మా స్కూల్‌కి హిందీ మాస్టారుగా వచ్చారు. కావడానికి ఆయన హిందీ ఉపాధ్యాయులయినప్పటికీ మమ్మల్ని, ముఖ్యంగా నన్ను, అపరిమితంగా ప్రభావితం చేసారు.
ఆయన వల్ల మాత్రమే నేను నా లెర్నింగ్ ప్రాసెస్ నుంచి బయటపడి అన్ లెర్నింగ్ ప్రాసెస్ వైపు ప్రయాణించగలిగాను. ఆయనే లేకపోయింటే నేనొక కెరీరిస్టు ఇంజనీరుగానో లేదా సర్జన్‌గానో అదీ కాదా కెరీరిస్టు అధికారిగానో బతుకుతూ ఉండేవాణ్ణి. కేవలం నా నైపుణ్యాలకు మెరుగుపెట్టుకుంటూ నా తోటి మానవ సమాజానికి దూరంగా, అపరిచితుడిగా, పరాయిగా ఉండిపోయేవాణ్ణి.
నా పాఠశాలలోని ఆదర్శశీల అంశాల మీద నేను దృష్టి పెట్టగలగడానికి నాకు నిజమైన చేయూత మాష్టారి నుంచే లభించింది. శరత్కాలపు సాయంకాలాల్లో ఆయన నన్ను వెంటబెట్టుకుని మా బడి వెనక చేలగట్టు మీద కృష్ణశాస్త్రినీ, వేదులనూ, సుమిత్రానందన్ పంత్‌నూ పరిచయం చేయడం ద్వారా నాలోని సాహిత్య తృష్ణనూ, తద్వారా నా సృజనశీలత్వాన్నీ మేల్కొల్పారు.
పొద్దున్నే మా డార్మిటరీ అరుగు మీద నేను నిద్ర లేవగానే నిండుగా నేల రాలిన పారిజాతాలు. వాటి చుట్టూతా మాష్టారు వినిపించే కవితాసుగంధం ఆవరించిన సూక్ష్మపరిమళ విభూతి నన్నొక స్వాప్నికలోకం వైపు మేల్కొల్పిన మాట నిజమే. కాని నన్ను అక్కడితో ఆగనివ్వకుండా చేసిన మహిమ కూడా ఆయనదే.
ఒకవైపు మనిషిలోని నైపుణ్యాల్ని మెరుగుపెడుతూనే అతనిలోని ఆత్మగుణాన్ని వెలికి తీయడమే ఆదర్శపాఠశాల లక్షణమని చెప్తున్నాను కదా. అటువంటి ఆత్మగుణాన్ని ప్రోత్సహించే లక్షణాల్ని నా పాఠశాల కలిగిఉన్నప్పటికీ, ఆ విషయం నాకు మొదట్లో మా ఆర్ట్ మాష్టారు రామ్మూర్తిగారి వల్లా, ఆయన వెళ్ళిపోయిన తరువాత హీరాలాల్ మాష్టారివల్లా మాత్రమే అర్ధమయింది. అటువంటి సంఘటనల్ని నా పాఠశాల జీవితం నుంచి ఎన్నో ఎత్తి చూపవచ్చు. మూడు ఉదాహరణల్ని మాత్రం ఇక్కడ ప్రస్తావిస్తాను.
మొదటి సంఘటన. ఒకసారి మా ఆర్ట్ మాష్టారు ఒక ఆదివారంనాడు ఎందుకోగాని పిల్లలందరికీ డ్రాయింగ్ పోటీ పెట్టారు. దాదాపు వందమందికి పైగా పిల్లలు ఆ పోటీలో పాల్గొన్నారు. పిల్లలు వేసిన బొమ్మలు చాలా వైవిధ్యంతోనూ, చాలా కౌశల్యంతోనూ చూపరులను ఆకర్షించే విధంగా ఉన్నాయి. వాటిలో బహుమతికంటూ మూడు బొమ్మల్ని ఎంపిక చెయ్యడం చాలా కష్టసాధ్యమైన పని. ఆర్ట్ మాష్టారు ఏ బొమ్మని ఎంపిక చేస్తారా అని అందరికీ ఒకటే కుతుహలం.
కానీ తీరాచూస్తే ఆయన ఎంపిక చేసిన బొమ్మ మా పాఠశాలలో పిల్లలు క్రికెట్ ఆడుతున్న దృశ్యాన్ని చిత్రించిన బొమ్మని. ఆ బొమ్మలో మనుషుల దేహాల్ని చిత్రించడంలోగాని, ఆటలోని చలనశీలత్వాన్ని చిత్రించడంలోగాని, ఏ విధమైన నేర్పరితనం లేదు. ఆ బొమ్మలేమంత ఆకర్షణీయంగా లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే అందులో చిత్రకారుడికుండవలసిన రేఖానైపుణ్యం ఏ మాత్రం వికాసానికి నోచుకోలేదు.
మాష్టారు దానికి ప్రథమ బహుమతి నిచ్చారంటే ఏదో కారణం ఉండకపోదు కదా ! అదేమిటని అడిగారంతా. దానికి ఆయనచ్చిన సమాధానాన్ని నేను ఎన్నటికీ మరవలేను.
ఆయన చెప్పిందిది : ‘ఆ బొమ్మని చిత్రకారుడు ఏ స్టాండ్ పాయింట్ నుంచి చిత్రించాడన్నది. చూడండి. ఆ నాలుగు రోడ్లకూడలి, ఆ బొమ్మలోని ఏటవాలు. దానిలో మనకొక ఏరియల్ వ్యూ కనిపించడం లేదూ.
అంటే, ఆ బొమ్మని గీస్తున్నప్పుడు ఆ పిల్లవాడు తను తరగతి గదిలో ఉన్నాడనుకోవడం లేదు. మన స్కూలుకి ఎదురుగా ఉన్న కొండ మీద కూచున్నట్టుగా ఊహించుకుని ఆ బొమ్మ గీసాడన్నమాట. అందువల్ల ఏం జరిగింది? మనం, అంటే ఆ బొమ్మని చూస్తున్న సందర్శకులు ఆ బొమ్మని చూడగానే ఒక్కక్షణం నేల మీంచి పైకి లేస్తాం.
అంటే ఏమిటన్న మాట, ఎలివేట్ అవుతున్నామన్నమాట. కాబట్టి నువ్వు బొమ్మ ఎంత బాగా గీసావన్నది కాదు. ఏ పెర్‌స్పెక్టివ్‌తో గీసావన్నది ముఖ్యం. అటువంటి పెర్‌స్పెక్టివ్ ఉంది కాబట్టే పికాసోని అంత అద్భుతచిత్రకారుడంటోంది లోకం’.
నాకు సంబంధించినంతవరకూ, ఇది చాలా గొప్ప సంఘటన. దర్శనశీల పాఠశాలలు తమ పిల్లలకు కేవలం నైపుణ్యాల్ని మాత్రమే ఇచ్చి ఊరుకోవు. అంతకన్నా ముఖ్యంగా అవి తమ పిల్లలు తమకు తామై ఒక పెర్‌స్పెక్టివ్‌ని, జీవన దృక్పధాన్ని ఏర్పరచుకోవాలని భావిస్తాయి.
రెండవసంఘటన, మేం తొమ్మిదవ తరగతి చదువుతుండగా జరిగింది. మా హిందీ పరీక్షలో, బహుశా అది క్వార్టర్లీ అనుకుంటాను. హీరాలాల్ మాష్టారు ప్రశ్నపత్రాన్ని తయారు చేసి అందులో చివరి ప్రశ్నగా అయిదు మార్కులకి అనువాదం కూడా చెయ్యమన్నారు. అంటే హిందీలో ఉన్న పేరాని తెలుగులోకి మార్చడమన్నమాట. ఆ పేరాలో చాలా సాధారణమైన హిందీ వాక్యాలున్నాయి. ‘వహా ఏక్ తాలాబ్ హై. వహ్ బహుత్ సుందర్ హై’ లాంటి వాక్యాలన్నమాట.
మేమందరమూ కూడా సహజంగానే ఆ వాక్యాల్ని ‘అక్కడొక చెరువు ఉన్నది. అది చాలా అందంగా ఉన్నది’ పద్ధతిలో అనువాదం చేసాం. తీరా చూస్తే ఆ సమాధానాన్ని దిద్దేటప్పుడు మాష్టారు అందరికీ సున్నా చుట్టారు. ఆయనెందుకు అలా చేసారో మాకు అర్ధం కాలేదు. మేం పొరపడ్డామా అని ప్రశ్నపత్రాన్ని మరొక మారు చూసాం.
అందులో ఏమీ తేడా లేదు. మరెందుకు మేం చేసిన అనువాదాన్ని తప్పుగా కొట్టిపారేసారు? సాహసించి ఆయన్నే అడిగాం. దానికి ఆయనిచ్చిన జవాబు లాంటి జవాబుని సాంప్రదాయిక పాఠశాలలు గాని, ఆధునిక పాఠశాలలుగాని కలలో కూడా ఊహించలేవు. ఆయనన్నారు కదా :
‘మిమ్మల్ని చెయ్యమన్నది హిందీ నుంచి తెలుగులోకి అనువాదం. మీరు చేసింది మక్కీకి మక్కీ అనువాదం. మీరు ఆ వాక్యాల్ని స్వేచ్ఛానువాదం చేస్తారని నేను ఆశించాను. తులసీదాస్ రామచరితమానస్ రాసినప్పుడు వాల్మీకిని అనుసరించాడు గాని అనుకరించలేదు. అనుసృజించాడు. మీ ముందున్న హిందీ వాక్యాల్నే మీరు తెలుగులోకి మార్చడంలో అంత విధేయత చూపిస్తే రేపు మీ చుట్టూ ఉండే ప్రపంచాన్నేం మార్చగలుగుతారు?’
దర్శనశీల పాఠశాల విధేయుల్ని సృష్టించదు. స్వతంత్రుల్ని సృష్టిస్తుందనేది నేను నేర్చుకున్న రెండవపాఠం.
మూడవ సంఘటన కూడా దాదాపు ఆ రోజుల్లోనే జరిగింది. దీన్ని కొద్దిగా వివరించాలి.
అదేమంటే ఆ సంవత్సరం పాఠశాల కేబినెట్‌కి ఎన్నికలు జరగలేదు. ప్రధానమంత్రితో సహా అందర్నీ నామినేట్ చేసి నియమించారు. ఆ పదవులు పొందిన వారిలో మాలో ప్రతి ఒక్కరినీ విస్మయపరిచింది. మా విద్యామంత్రి నియామకం. ఆ సారి మా తరగతిలోనే మా సెక్షన్‌లోనే ఉంటున్న రాజేంద్రప్రసాద్‌ని విద్యామంత్రిగా నియమించారు. అప్పటికి అతడు మా సెక్షన్‌కి బయట ఎవరికీ పెద్దగా తెలియదు. ప్రతిభావిశేషాల్లో కూడా అతడప్పటికి ఎవరి దృష్టినీ ప్రత్యేకంగా ఆకర్షించినవాడు కాడు. దాంతో అంతా ఆశ్చర్యపోయారు. ఎవరీ రాజేంద్రప్రసాద్? ఎందుకు అతన్ని మాత్రమే విద్యామంత్రిగా నియమించారని?
అప్పుడు మా వెంకటరత్నం మాష్టారు ఆ సాయంకాలం సమావేశంలో ఆ నియామకం వెనుకనున్న నేపథ్యాన్ని వివరించారు. అదేమంటే అప్పటికి కొన్ని నెలల కిందట మా పాఠశాలలో ఒక ప్రయోగాన్ని నిర్వహించారు.
అది ఇన్విజిలేటర్లు లేకుండా పరీక్ష రాయడమన్నమాట. తరగతి గదిలో మా టెక్ట్స్‌బుక్స్, మా నోట్సులు మా పక్కనే ఉంటాయి. ఉపాధ్యాయుడు వచ్చి ప్రశ్న పత్రాన్ని మాకు ఇచ్చి వెళ్లిపోతాడు. మేం ఆ తరువాత నలభై అయిదు నిమిషాలు ఏ పర్యవేక్షకుడూ లేని తరగతి గదిలో మా ఆంతరాత్మ పర్యవేక్షణలో మేం పరీక్ష రాయాలి. అదీ ప్రయోగం.
దాదాపు మొదటి అరగంటా పిల్లలంతా చాలా సీరియస్‌గా, నిజాయితీగానే ఉన్నారు. ఇంతలో ఎక్కడో మొదలయి ఏదో అలజడి. చివరికి నాతో సహా పిల్లలంతా ఏదో ఒక పుస్తకం తెరిచి చూడకుండా ఉండలేకపోయారు.
నలభై అయిదు నిమిషాలు కాగానే ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి వచ్చాడు. పిల్లల మొహాల్లో దాగని అపరాధభావం ఆయన కంటపడింది.
‘మీలో పుస్తకం చూసినవాళ్లెవరో నిజాయితీగా మీ అంతట మీరే ఒప్పుకోండి’ అన్నాడాయన.
ఒక్కరు కూడా మాట్లాడలేదు.
కొన్ని క్షణాల నిశ్శబ్దం.
మళ్లా ఆయనన్నాడు కదా : ‘మీరు కాపీ కొట్టి ఉంటే అదొక తప్పు. ఆ తప్పుని ఒప్పుకోక పోవడం రెండవ తప్పు. మీలో తప్పు చేసినవారెవరో నిజాయితీగా మీ అంతట మీరే ముందుకు వచ్చి క్లాసు బయట గంట సేపు ఎండలో నిలబడండి’ అన్నాడు. ఆ శిక్ష ఏమిటో తెలిసాక ముందుకొచ్చేదెవరు? సరిగ్గా అప్పుడే ఒక విద్యార్ధి లేచి నిల్చున్నాడు.
‘మాష్టారూ, నేను కాపీ కొట్టలేదు గానీ, రాసిన అన్సరు తప్పో రైటో చూసు కోవడానికి టెక్ట్స్‌బుక్ అయితే తీసి చూసాను. కాబట్టి నేను పనిష్మెంట్ తీసుకుంటాను’ అని లేచి వెళ్లి ఎండలో నిలబడ్డాడు. అతడు తప్ప మరెవ్వరూ లేవకపోవడం చూసి ‘వాడు ఒక్క తప్పేచేసాడు. మీరు రెండు తప్పులు చేస్తున్నార’ని నిట్టూరుస్తూ ఆ ఉపాధ్యాయుడు తరగతి వదిలి వెళ్లిపోయాడు.
ఆ రోజట్లా లేచి తన తప్పు ఒప్పుకున్న ఆ విద్యార్ధే రాజేంద్రప్రసాద్. అతన్ని విద్యామంత్రిగా నియమించడం ద్వారా ఎడ్యుకేషన్ అంటే ఫస్టురాంకు తెచ్చుకోవడం కాదనీ, నిజాయితీని కాపాడుకోవడమని తాము చెప్తున్నట్టుగా వెంకకటరత్నం మాష్టారు ఆ రోజు అందరికీ వివరించారు.
దర్శనశీల పాఠశాలల అంతిమధ్యేయం నిర్భయత్వాన్నివ్వడమేననటానికి ఇంతకు మించిన ఉదాహరణ ఏముంటుంది?
10
అటువంటి పాఠశాల మళ్ళా కనిపించలేదు
అటువంటి పాఠశాలని వదిలిపెట్టిన తరువాత దాదాపు ఈ ఇరవై అయిదేళ్లుగా నేను అటువంటి దర్శనశీల పాఠశాలల కోసం అన్వేషిస్తూ ఉన్నాను. నాకటువంటి పాఠశాల ఇప్పటిదాకా తారసపడలేదు. రానురాను పాఠశాలలు మరింత ఎఫెక్టివ్ పాఠశాలలు కావడమెట్లా అని ఆలోచిస్తూ ఉన్నాయి తప్ప మరింత విజనరీ ఇన్‌స్టిట్యూషన్సు కావడమెట్లానా అని ఆలోచిస్తున్నట్టుగా నాకు కనపడలేదు.
పదవతరగతి పూర్తిచేసి బయటి ప్రపంచంలోకి రాగానే నేను ఎదుర్కొన్న ఆఘాతం మరింత తీవ్రంగా అనిపించింది. నా కళాశాలలేవీ నాకు తాడికొండని మరిపించలేకపోయాయి. ముఖ్యంగా ఆ గురుశిష్య బాంధవ్యం. అదెక్కడా నాకు ఆ విధంగా కనపడలేదు. సాధారణ యాంత్రిక నైపుణ్యాల్ని ఇవ్వడానికి కూడా బయటి ప్రపంచపు పాఠశాలలు పూర్తిగా అశక్తమనిపించాయి.
నేనొక డిగ్రీ కళాశాలలో బి.ఏ. మొదటిసంవత్సరంలో చేరినప్పుడు మొదటిరోజు అనుభవమే నాకు తట్టుకోలేనంత షాక్ నిచ్చింది. దాదాపు వందమందికి పైగా ఉన్న ఆ మొదటి సంవత్సరం క్లాసులో ఇకనమిక్స్ లెక్చరర్ పాఠం చెప్పడానికి రాగానే దాదాపు పదిహేనునిమిషాల పాటు తరగతి తరగతి అంతా ఆయన్ని హేళన చేస్తూ అరిచే అరుపులతో మోత ఎత్తింది.
ఆయన ఎన్నో ఏళ్లుగా ఇది అలవాటయినవాడివల్లే ఆ హేళనలతో, ఆ ఈలలతో ఆ పిల్లికూతలతో నిమిత్తం లేకుండా తన పాఠాన్ని తను చెప్పుకుపోవడం మొదలుపెట్టాడు.
ఆ తరువాత నేను రెండు కళాశాలల్లో పేరుకు రెండేళ్లు నాపేరు నమోదు చేయించుకున్నా ఒక్కరోజు కూడా ఏ కళాశాలలోనూ అడుగుపెట్టలేదు. చివరికి బి.ఏ. రెండవ సంవత్సరం పూర్తికాగానే చదువుమానేసి చిన్న ఉద్యోగంలో చేరిపోయాను. దాంతో యూనివెర్సిటీలో చదువుకోవాలన్న కోరిక తీరకుండానే నా పాఠశాల చదువుకట్లా శాశ్వతంగా తెరపడింది.
9
A Visionary School
An educationist once observed that it is difficult to determine whether a child learns more by looking at the blackboard inside the classroom or by gazing out of the window. In the very process of imparting skills to its students, a school, knowingly or unknowingly, creates certain structural gaps and small allowances. It is through these narrow crevices that the vital current of life flows, transforming the school from a rigid institution into a living, breathing stream.
At Tadikonda, Hiralal Master appeared to me as precisely such a window to the world. He arrived at our school as a Hindi instructor when I was studying in the eighth grade. Although he was officially designated as a teacher of Hindi, he influenced us—and most intensely, me—beyond measure.
It was solely because of his presence that I was able to liberate myself from the confines of the formal learning process and journey toward the profound path of unlearning. Had he not crossed my path, I would have likely lived out my days as a careerist engineer, a surgeon, or perhaps a career-minded bureaucrat. I would have spent my life merely sharpening my functional skills while remaining distant, unfamiliar, and deeply alienated from the human society around me.
The true catalyst that enabled me to look past the routine and discern the genuinely ideal and visionary dimensions of my school came from Master himself. On serene autumn evenings, he would take me along the ridges of the fields behind our school, introducing me to the evocative verses of Devulapalli Krishna Sastri, Vedula Satyanarayana Sastry, and Sumitranandan Pant. In doing so, he awakened my latent literary thirst, and through it, ignited my creative consciousness.
It is an undeniable truth that when I woke up in the morning, the sight of fallen parijata blossoms thickly carpeting our dormitory porch, enveloped by the rich poetic fragrance Master wove around them, awakened me into a sublime world of dreams. Yet, the true miracle lay in the fact that he refused to let me remain static in that dream world—and that grace, too, belongs entirely to him.
I have consistently maintained that the defining hallmark of an ideal school is its ability to refine an individual’s practical skills while simultaneously drawing forth the latent qualities of their spirit. Although my own school was richly endowed with environments that nurtured these spiritual qualities, this profound truth became clear to me initially only through the lens of our Art Master, Mr. Ramamurthy, and later, after his departure, through Hiralal Master. One could cite countless such epiphanies from my school life, but I shall limit myself to three illustrative examples here.
The First Incident: On a particular Sunday, for no particular reason, our Art Master organized a drawing competition open to all the students. Over a hundred children enthusiastically participated. The resulting sketches displayed an astonishing diversity and technical proficiency, instantly captivating anyone who looked at them. Consequently, selecting a mere three drawings for the top prizes became an exceptionally daunting task, and the entire student body waited with bated breath to see which pieces the Art Master would crown.
To everyone’s utter bewilderment, the piece he selected for the coveted first prize was a sketch depicting children playing cricket on our school grounds. Technically speaking, the drawing completely lacked any sophisticated rendering of human anatomy or the fluid dynamism of the sport. It possessed no immediate aesthetic charm; in short, the formal linearity and draftsmanship expected of a trained artist were entirely unawakened in it. Yet, there had to be an underlying reason why Master had elevated this specific piece to the highest honor. When everyone pressed him for an explanation, he gave a response that remains permanently etched in my consciousness.
This was his explanation: “Observe the precise standpoint from which the boy executed this drawing. Look closely at the convergence of those four roads and the steep inclination of the slope. Do you not discern a distinct aerial view embedded within it? What this signifies is that while composing this sketch, the child did not perceive himself as being confined within the walls of a classroom. Instead, he envisioned himself perched high upon the hill that faces our school, capturing the entire landscape from that vantage point. And what is the profound consequence of this? The moment we—the viewers—gaze upon this drawing, we are momentarily lifted off the ground. In essence, we experience a sense of spatial elevation. Ultimately, it is not the mere technical execution of a drawing that truly matters, but the conceptual perspective with which it is rendered. It is precisely because Pablo Picasso possessed such a transformative perspective that the world hails him as an artistic genius.”
For me, this was a momentous and deeply transformative event. Visionary schools do not simply stop at equipping their children with functional skills. Far more fundamentally, they aspire to create the conditions where their pupils can independently cultivate their own unique perspective and an enduring worldview.
The Second Incident occurred during our ninth-grade year. It was during a Hindi examination—most likely the quarterly finals—for which Hiralal Master had designed the question paper. As the concluding challenge, he had assigned a five-mark translation exercise, requiring us to render a short Hindi passage into Telugu. The paragraph comprised incredibly basic Hindi sentences, along the lines of, “Wahan ek talab hai. Wah bahut sundar hai.”
Naturally, all of us proceeded to render those lines into standard, literal Telugu. To our absolute astonishment, when the graded papers were returned, Master had circled a resounding zero across all our answer sheets. We were completely bewildered as to why he had done so. Suspecting we had misread the prompt, we re-examined the question paper, but found nothing amiss. Why then had he summarily rejected our translations as incorrect? Gathering our courage, we approached him directly to demand an answer. The explanation he offered is something that neither conventional academies nor modern elite schools could ever fathom, even in their wildest dreams.
A truly visionary school does not churn out docile conformists; it births fiercely independent spirits. That was the second profound lesson I integrated.
The Third Incident occurred around the same period, and its context requires a brief elaboration. That particular academic year, the democratic elections for the student cabinet were suspended. Instead, every single office, including that of the Prime Minister, was filled through direct nomination and appointment. Among all the positions distributed, the one that left the entire student body in absolute astonishment was the appointment of our new Education Minister. Rajendra Prasad, a boy from my own class and section, had been elevated to the post. Until that moment, he was virtually anonymous outside the narrow confines of our classroom, having never drawn attention to himself through any extraordinary talents or striking achievements. Naturally, a wave of bewilderment swept through the school: Who exactly was this Rajendra Prasad, and why had he alone been chosen to serve as the Education Minister?
It was during that evening’s general assembly that our instructor, Mr. Venkatratnam, unveiled the hidden background behind this surprising appointment. He revealed that a few months prior, a radical pedagogical experiment had been quietly conducted within the school walls. The challenge was simple yet profound: writing an examination completely stripped of external invigilators.
According to the protocol of the experiment, our textbooks and personal lecture notes remained stacked right beside us at our desks. The teacher simply walked into the room, distributed the question papers, and walked out. For the next forty-five minutes, we were left entirely unsupervised in a silent room, tasked with writing our exam under no other watchman than the absolute vigilance of our own conscience.
For the initial half-hour, every student remained deeply serious, maintaining an unblemished, rigorous honesty. Slowly, however, an invisible ripple of restlessness began somewhere in the room and quickly spread. In the end, under the pressure of the ticking clock, almost every single child—myself included—succumbed to the temptation, incapable of resisting the urge to furtively pry open a book.
The moment the forty-five minutes elapsed, the instructor stepped back into the classroom. The transparent, undeniable guilt written across the children’s faces did not escape his discerning gaze. Standing before us, he gave a direct challenge: “Let those among you who opened a book step forward and confess honestly of your own volition.”
Not a single soul spoke.
A suffocating silence hung over the room for several long moments.
He continued: “To copy is one transgression; to refuse to admit it is a second, far greater one. Whoever among you erred, have the honesty to step forward voluntarily and stand in the sun outside the classroom for an hour.” Once the nature of the penalty was laid bare, who among us would dare to step forward?
At that precise moment, a single student stood up. “Master,” he said, “I did not copy, but I did open the textbook to verify whether the answer I had written was correct or incorrect. Because of that, I accept the punishment.” Without another word, he walked outside and took his place in the harsh sun. Observing that no one else followed suit, the teacher let out a heavy sigh: “He has committed only one transgression. You, by remaining silent, are committing two.” With that, he turned and left the classroom.
That student who had the courage to rise and confess his error was Rajendra Prasad. Mr. Venkatratnam explained to us that afternoon that by appointing him as the Education Minister, the school was making a definitive statement: education is not a race to secure the highest academic rank, but a lifelong commitment to safeguarding one’s integrity.
Could there be a more poignant illustration of the fact that the ultimate objective of a visionary school is the cultivation of absolute fearlessness?
10
The Elusive Ideal
After leaving that school, I have spent the past twenty-five years searching for such visionary schools. I have not encountered one to this day. Gradually, schools seem to be constantly thinking about how to become more effective schools, but I have never seen them thinking about how to become more visionary institutions.
The shock I faced upon completing the tenth grade and stepping into the outside world felt even more severe. None of my colleges could make me forget Tadikonda. Especially that teacher-student bond; I never found it like that anywhere else. The schools of the outside world seemed completely incapable of imparting even basic mechanical skills.
When I joined the first year of my B.A. at a degree college, the experience on the very first day gave me an unbearable shock. In that first-year class of over a hundred students, the moment the Economics lecturer came to teach, the entire class erupted in shouts, mocking and jeering at him for almost fifteen minutes.
Used to this for many years, he simply began teaching his lesson, completely unbothered by the mockery, the whistling, and the catcalls.
After that, although I registered my name at two colleges for two years, I never stepped foot in any college even for a single day. Finally, as soon as my second year of B.A. was completed, I dropped out of my studies and joined a small job. With that, the curtain fell on my formal education permanently, leaving my desire to study at a university unfulfilled.
11-7-2026


వాటి infrastructure వలనో, academic results వలనో మాత్రమే ఒక పాఠశాల మంచి వ్యక్తిత్వం గల విద్యార్థులను తీర్చిదిద్దలేదు.
ఆర్ట్ మాష్టారు నువ్వు బొమ్మ ఎంత బాగా గీసావన్నది కాదు. ఏ perspective తో గీసావన్నది ముఖ్యం అని చూపించిన విధానంలోనూ,
హీరాలాల్ మాష్టారు మక్కీకి మక్కీగా చేసిన అనువాదానికి సున్న చుట్టి, స్వతంత్రంగా ఆలోచించడం నేర్పిన విధానంలోనూ,
మీ సహాధ్యాయి రాజేంద్రప్రసాద్ సంఘటన ద్వారా “ఎడ్యుకేషన్ అంటే ఫస్టురాంకు తెచ్చుకోవడం కాదనీ, నిజాయితీని కాపాడుకోవడమని “ మీ పాఠశాల ఇచ్చిన సందేశంలోనూ
ఇటువంటి రోజువారీ సంఘటనల ద్వారా, ఇటువంటి ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం ద్వారా పిల్లల నడవడికను, ఆలోచనా విధానాన్ని, జీవన దృక్పథాన్ని మలుస్తూ పాఠశాలలు గొప్ప వ్యక్తులను తీర్చిదిద్దగలవని చూపించారు.
అటువంటి ఆదర్శ పాఠశాలలు ఎటువంటి గొప్ప మనుషులను సమాజానికి అందించగలవన్నదానికి మీరే ఒక wonderful example, Sir!
🙏🏽
హృదయపూర్వకమైన ధన్యవాదాలు మాధవీ! ఆ పాఠశాల కన్న అప్రయోజకుల్లో నేను కూడా ఒకడిని అనే అనుకుంటూ ఉంటాను.
చాలా బాగుంది భద్రుడు గారు ఈ సిరీస్ లో ఈ భాగం. ఎన్నో విషయాలు ఎంతో విపులంగా వివరించారు.
రామ్మూర్తి మాస్టారు చిత్రలేఖన పోటీలో సాంకేతిక రేఖానైపుణ్యం, ఆకర్షణీయమైన రంగుల కౌశల్యం లేకపోయినా.. కేవలం ఒక విద్యార్థి కొండపై కూర్చుని పాఠశాలను చూస్తున్నట్లుగా గీసాడన్న ఒకే ఒక్క కారణంతో ఆ ‘ఏరియల్ వ్యూ’ బొమ్మకు ఆర్ట్ మాస్టారు రామ్మూర్తి గారు ప్రథమ బహుమతి ఇవ్వడం,
. “నువ్వు బొమ్మ ఎంత బాగా గీసావన్నది కాదు, ఏ పెర్‌స్పెక్టివ్‌తో గీసావన్నది ముఖ్యం” అన్న ఆయన పెర్‌స్పెక్టివ్ అంటే కేవలం బొమ్మ గీసే కోణం కాదు, జీవితాన్ని దర్శించే స్థానం అనడం చాలా కరెక్ట్.
“తులసీదాస్ రామచరితమానస్ రాసినప్పుడు వాల్మీకిని అనుసరించాడు గాని అనుకరించలేదు. అనుసృజించాడు. మీ ముందున్న హిందీ వాక్యాల్నే మీరు తెలుగులోకి మార్చడంలో అంత విధేయత చూపిస్తే రేపు మీ చుట్టూ ఉండే ప్రపంచాన్నేం మార్చగలుగుతారు?” అంటూ మీ హీరాలాల్ మాస్టారు వేసిన ఒక్క ప్రశ్న చాలు, దర్శనశీల పాఠశాల యొక్క అంతఃసూత్రాన్ని ఆవిష్కరించడానికి. మీరు హీరాలాల్ మాస్టారు గురించి ఇంతకు మునుపు మరేదో పోస్టులో కూడా ప్రస్తావించారనుకుంటా..
ఇన్విజిలేటర్ లేని పరీక్ష అనే ప్రయోగంలో, ఏ పర్యవేక్షకుడూ లేకపోయినా తన ఆంతరాత్మ పర్యవేక్షణలో పరీక్ష రాస్తూ.. రాసిన సమాధానం తప్పో ఒప్పో చూసుకోవడానికి టెక్ట్స్‌బుక్ తెరిచిన తన చిన్న పొరపాటును ధైర్యంగా ఒప్పుకుని, శిక్షగా ఎండలో నిలబడిన రాజేంద్రప్రసాద్ సంఘటన గురించి చదువుతుంటే భలే ఆనందంగా అనిపించింది.
ఎండలో నిలబడిన ఆవిద్యార్థిని చూసి మిగిలిన వందమంది అపరాధభావంతో తలదించుకుంటే, ఉపాధ్యాయుడు “వాడు ఒక్క తప్పే చేసాడు, మీరు రెండు తప్పులు చేస్తున్నారు” అని మీ వెంకటరత్నం మాస్టారు గారు అనడం నైతిక విద్యాబోధనకు పరాకాష్ఠ.
తాడికొండను వదిలిపెట్టి మీరు బయటి కాలేజీ ప్రపంచంలోకి అడుగుపెట్టి బి.ఏ. మొదటి రోజు తరగతి గదిలోకి లెక్చరర్ రాగానే విద్యార్థులంతా హేళన చేస్తూ అరిచే అరుపులు, ఈలలు, పిల్లికూతలు.. ఆ గందరగోళానికి అలవాటుపడి యాంత్రికంగా పాఠం చెప్పుకుపోయే అధ్యాపకుడు.. నాకు నా ఇంటర్, ఇంజనీరింగ్ కాలేజీలలో కొంతమంది లెక్చరర్ల క్లాస్రూమ్స్ గుర్తుకు తెచ్చాయి.
బయటి ప్రపంచపు పాఠశాలలు కనీస యాంత్రిక నైపుణ్యాలను ఇవ్వడానికి కూడా అశక్తమైపోయాయని ఆ వాతావరణాన్ని తట్టుకోలేక, కాలేజీ లో డిగ్రీ చదువు డిస్కాంటిన్యు చేసి ఉద్యోగంలో చేరిపోవడం నాకు కొంచెం బాధగా అనిపించింది భద్రుడు గారు.
ఎంతో సహృదయంతోను, ఎంతో వివరంగానూ, ఎంతో ఆర్తి తోనూ మీరు రాసిన ఈ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు.