
మూడవ రోజు: నాలుగవ సంభాషణ
కృష్ణుడు తెచ్చిన మూడు విప్లవాలు
మధ్యాహ్న భోజనం అయ్యాక, కొంత విశ్రాంతి తర్వాత మళ్ళా గురూజీ సంభాషణ కొనసాగించారు. ఈసారి మ్యూజియంలో ఆ ఎత్తైన అరుగుల మీద కూచున్నాం. బయట ఎంత ఎండగా ఉన్నా అక్కడ చాలా చల్లగా ఉంది. మా ఊళ్ళల్లో రామనవమికోసం వేసిన తాటాకు పందిళ్ళు ఆ వేసవి మొత్తం అలానే ఉండేవి, చల్లనినీడనిస్తూ. అలాంటి పందిరి కింద కూచున్నట్టుగా ఉంది.
గురూజీ కొనసాగిస్తున్నారు: ‘మన ప్రాంతంలో ఏమేమైతే దొరుకుతాయో వాటిని ఉపయోగించడం ప్రజలకి తెలుసు. జల్, జంగల్, జమీన్- ఈ మూడూ వాళ్ళవే. అడవి కూడా ఊరి ప్రజలదే కదా. భూమీ ఊరిదే, నీళ్ళూ ఊరివే. మన దగ్గర నీటిని రెండు రకాలుగా భావించారు, ప్రాకృతిక జలం, అప్రాకృతిక జలం అని. నదులూ, సరస్సులూ సహజనీటి వనరులు. బావులూ, చెరువులూ కృత్రిమనీటి వనరులు. వీటిని మనం తయారుచేసుకోవలసి ఉంటుంది.
చెరువుల్ని ఎందుకు నిర్మించాలి? ఎక్కడ నిర్మించాలి? ఎక్కడైతే భూమిలో నీరు చాలా తక్కువగా ఉంటుందో అక్కడే చెరువులు ఏర్పడ్డాయి. ఎక్కడ భూమిలో నీరు పుష్కళంగా ఉంటుందో అక్కడ చెరువులు తవ్వాల్సిన అవసరం లేదు. అక్కడ చిన్న బావి తవ్వితే చాలు, నీళ్ళే నీళ్ళు. ఎక్కడ భూముల్లో నీరు తక్కువగా ఉంటుందో అలాంటి భూముల్లోనే చెరువుల ఆలోచన వస్తుంది.
ఇప్పుడు చెరువులు చాలా రకాలు. తాల్ వేరు, తలైయా వేరు. చెరువులు, కుంటలు-వీటన్నిటికీ వేర్వేరు పేర్లున్నాయి. వాటి సైజుని బట్టి రకరకాల పేర్లు. ప్రతి ఒక్కదాన్నీ చెరువు అనరు. ఒకదాన్ని కుంట అంటారు. మరొకదాన్ని చెరువనో మరేదో పేరుతో పిలిస్తారు. వాటి పరిమాణాన్ని బట్టి, ఆకారాన్ని బట్టి, డిజైన్ ని బట్టి వాటికి పేర్లు.
వాటిల్లో మడుగు మళ్ళా సరస్సులాగే ఉంటుంది. నదుల్లో కొన్ని చోట్ల చాలా లోతుగా ఉంటుంది. అక్కడెప్పుడూ నీరు నిలిచి ఉంటుంది. దాన్ని మడుగు అంటారు. మడుగులు నదుల్లో ఉంటాయి. వాటి నీరు ఎప్పుడూ అయిపోదు, ఎప్పుడూ ఎండిపోదు. మడుగు అనగానే కృష్ణుడు గుర్తొస్తాడు.
ఒక ఊరి ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకోవాలంటే కృష్ణుణ్ణి ఒకసారి అర్థం చేసుకోవాలి. కృష్ణుడు తన జీవితంలో మూడు రకాల విప్లవాలు తీసుకొచ్చాడు. చాలా పెద్ద విప్లవాలు. అతని మొదటి విప్లవం ఏమిటంటే ఊళ్ళోంచి పాలు బయటకు వెళ్ళనివ్వలేదు. రెండోది మన ఊళ్ళో నీళ్ళు మనవే కావాలి అని పోరాడాడు. దానిమీద కబ్జా చేసి కూచోడానికి ఇంకొకడు ఎవడు? కృష్ణుడి మూడో విప్లవం ఏమిటంటే, ఒక చిన్నవేలితో చూపిస్తూ ఒక కొండను దేవతల కంటే పైకి లేపాడు. అది గోవర్ధనం. అది మన మొదటి వనరు. మనం మొదటి ప్రాధాన్యత దానికివ్వాలి, ఆ తర్వాతే బయటి వనరులకి. దాన్ని ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చునో అన్ని రకాలుగా ఉపయోగించుకుంటాం. ఒకవేళ ప్రపంచమంతా మనమీద కోపగించుకున్నా కూడా మనం ఈ ఒక్క వనరు బలంతో బతకవచ్చు. అయితే దాన్ని ఆ విధంగా ఉపయోగించుకునే పద్ధతి మనం తెలుసుకోవాలి. కాబట్టి మన మొదటి ప్రాధాన్యత దానికివ్వాలి. రెండోది ఊరి నీళ్ళు ఊరివే కావాలి. మూడోది ఊళ్ళోంచి పాలు బయటికి వెళ్ళకూడదు. ఊళ్ళోంచి పాలు మధురకి వెళ్తున్నప్పుడు, మహిళలు ఆ కడవలు తీసుకెళ్తుంటే, రాళ్ళు విసిరి కుండలు పగలగొట్టేవాడు. దాచి ఉంచిన పాలని పిల్లలకి తాపించడం, కింద పడేయడం, తాను తాగేయడం లాంటివన్నీ చేసేవాడు.
ఊళ్ళో పాలు బయటికి ఎందుకు వెళ్ళకూడదు? ఇది ఇక్కడున్న ఒక సాధారణ మహిళ నాకు అర్థమయ్యేలా చెప్పింది. ఒక లంబాడా ఆమె. ఒక ఆదివాసి మహిళ. నేనొకసారి అలా తిరుగుతూ ఒక లంబాడాల తాండాకి వెళ్ళాను. నాకు చాలా ఆకలిగా అనిపించింది. నేనామెను ‘అమ్మా, తినడానికి ఏమైనా ఉంటే పెడతావా? ‘ అనడిగాను. ఆమె ‘తినడానికైతే ఇప్పుడేమీ లేదు, పాలున్నాయి పాలు తాగు’ అన్నది. నేను పాలు తాగి నా జేబులో చేయిపెట్టాను. నేను డబ్బులివ్వబోతున్నానని ఆమెకి అనిపించినట్టుంది ‘ఏమి డబ్బులిస్తున్నావా ఏమిటి?’ అనడిగింది. ‘అవును, పాలిచ్చావు కదా, డబ్బులిస్తాను ‘అని అన్నాను. ‘అదేమిటి? ఎవరైనా పాలమ్ముతారా ఏమిటి?’ అనడిగింది ఆమె. ‘మా ప్రాంతంలో అయితే అమ్ముతారు’ అని అన్నాను. ఇది ఇప్పటి మాట కాదు. 35 ఏళ్ళ కిందటి మాట. నా మాటలు విని ఆమె ఆశ్చర్యపోతూ ‘ఏంటి? మీ ప్రాంతంలో పాలు అమ్మడం మొదలయ్యిందా? అంటే దాని అర్థం నువ్వు పేదవాడివయ్యావని, మీ ఊరు పేదదైపోయిందని’ అని అంది. ‘సరే, మీరు పాలు అమ్మకపోతే మరేం అమ్ముతారు?’అనడిగాను. ‘మేం పాలమ్మం, నెయ్యి అమ్ముతాం’ అని చెప్పిందామె.
‘మా పిల్లవాడు పాలు తాగుతాడు, మీగడ తింటాడు, వెన్న తింటాడు, మజ్జిగ తాగుతాడు, పెరుగు తింటాడు, ఇంతా తినేవాడికి నెయ్యి ఎందుకు? అవునా? ఇవన్నీ ఎవరికి దొరకవో వాళ్ళ కోసం నెయ్యి. టౌనులో ఉండేవాళ్ళకి ఇవన్నీ దొరకవు కదా, అందుకే వాళ్ళకోసం నెయ్యి అన్నారు. మా పిల్లవాడు ఇవన్నీ తింటున్నప్పుడు వీడికి నెయ్యి అవసరం ఏముంది?’ అనడిగింది ఆమె.’
కృష్ణుడి మొదటి విప్లవం నాకు అక్కడ అర్థమయింది. మనకున్న వనరుల్ని మనం పూర్తిగా ఉపయోగించుకుని, ఆ తర్వాత ఏది అవసరం లేదో, దాన్ని బయటకు పంపడం. ఇది ఊరు పాటించవలసిన మొదటి ఆర్థిక వ్యవస్థ. మన దగ్గరున్న ప్రతి వస్తువుని మన పద్ధతిలో పూర్తిగా ఉపయోగించుకున్నాకనే, ఇక దేని అవసరం మనకు లేదో దాన్ని మాత్రమే బయటకు పంపడం.
కృష్ణుడి రెండో విప్లవం ఇది- కాళీయుడు నీటిని విషపూరితం చేసి ఉంచాడు కదా. మన నీటివనరుల్ని కబ్జా చేసి కూర్చోడానికి వీడెవడు? మన ఊరి జలవనరులు మనవే కావాలి. ఎక్కడైతే పశువులు వెళ్ళి ఏ నీళ్ళు తాగి చనిపోతున్నాయో, ఎక్కడైతే వాడు ఆక్రమించి ఎవరినీ రానివ్వడం లేదో, ముందు వాణ్ణి వెళ్ళగొట్టు. అందుకని కృష్ణుడు కాళియమర్దనం చేసాడు.
‘మూడోది, ఇంద్రుడి పూజ చెయ్యడానికి వెళ్తున్న ప్రజల్ని ఆపాడు-‘ఎవడీ ఇంద్రుడు? ఈ గోవర్ధనం మన మొదటి వనరు. దీని బలంతో మనం బతుకుతున్నాం. దీని బలంతో మన పశుసంపద పెరుగుతోంది. కాబట్టి మనం దీనికే మొదటి ప్రాధాన్యతనివ్వాలి. ఆ తర్వాతనే బయటి వనరులకి’ అని అన్నాడు. ఈ మూడు విప్లవాలను ఊరి ప్రజలు మళ్ళీ ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ రోజు అదిలాబాద్ ప్రజలు సాత్నాలా నీళ్ళు తాగుతున్నారు ఇక్కడ కూర్చుని. ఎవరి నీటినో కబ్జా చేసి కూర్చున్నారు. అవునా కాదా? ప్రతి వస్తువుపైనా ఎవరిదో ఒకదానిపై కబ్జా చేసి కూచున్నారు.’
‘ఈ విధానం మారాలి. నీకు అవసరమైతే, నీ జలవనరుల్ని నువ్వు తయారు చేసుకో, నిర్మించుకో. ఇక్కడ 16 చెరువులున్నప్పుడు, అవి ఎవరి నీటినో కబ్జా చేసినవి కావు కదా. మన 16 చెరువుల్నీ నాశనం చేసుకుని ఇంకెవరి నీటినో కబ్జా చేస్తున్నాం. ఆధునిక టెక్నాలజీ అంటే ఎవరి నీటిపైనో, ఎవరి భూమి పైనో కబ్జా చేయడం కాదు కదా? అది జరగకూడదు. కృష్ణుడి మూడు విప్లవాల్ని అర్థం చేసుకుంటే ఊరి ప్రజలు చాలా పనులు చేయగలరు. ఈ రోజు ఊళ్ళోంచి ప్రతి ఒక్క వస్తువూ బయటికి వెళ్ళిపోతోంది కదా. కాని పూర్వం అలా ఉండేది కాదు. అందుకే కృష్ణుడు గొప్పవాడు. అంతే తప్ప గోపికల చీరలు పట్టుకెళ్ళిపోయాడని గొప్పవాడా? కాదు కదా! (నవ్వులు)’
‘ఇప్పుడు ఊళ్ళోంచి ప్రతి వస్తువు బయటకి పోతోంది. మళ్ళీ అదే వస్తువును వీళ్ళు కొనుక్కోవలసి వస్తోంది. అందుకే ఆ ‘వెలుగు’ వాళ్ళు పాలు అమ్మడం మొదలుపెట్టినప్పుడు నేను వద్దన్నాను. ‘అరే, వీళ్ళు పాలమ్మడం మొదలుపెట్టారు. ఊళ్ళో పాలు కూడా అయిపోగొడుతున్నారు’అని ఎవరికో చెప్పాను కూడా. ఇప్పుడు డబ్బు కావాలని పాలు బయటకి పంపుతున్నారు. డబ్బునే అంతం చేసేయ్యండి. ఎందుకంటే మన దగ్గర డబ్బులేకుండానే అంతా నడిచింది. హిందుస్తాన్ కృషి ప్రధాన దేశం, అంటే వ్యవసాయం మీద ఆధారపడ్డ దేశమని, మనకి చదువు చెప్పారు. హిందుస్తాన్ వ్యవసాయ ప్రధాన దేశం ఎప్పుడూ కాదు. హిందుస్తాన్ ఉద్యోగ ప్రధాన దేశం, అంటే పని, పరిశ్రమ, వృత్తి ప్రధానం. వ్యవసాయ ప్రధానమైంది ఊరి ఆర్థిక వ్యవస్థ. దేశం పరిశ్రమ ప్రధానమైంది. ఇక్కడ ప్రతి ఇల్లూ ఒక కార్ఖానా. ఇక్కడి ప్రజలు గింజలు అమ్మి వెండి సంపాదించలేదు ఎప్పుడూ. అలాంటప్పుడు ఇది వ్యవసాయ ప్రధాన దేశం ఎలా అవుతుంది? ఇది పరిశ్రమ ప్రధాన దేశం. ఈ రోజు కూడా కావాలనుకుంటే అలా చేయవచ్చు. కానీ చేయనివ్వరు. ఒక ఊళ్ళో ఎంతమంది ఉంటారు? తమ పన్నెండు నెలలకోసం తమ పూర్తి ఏర్పాట్లు వాళ్ళు చేసుకోలేరా? ఎంత ధాన్యం కావాలి వాళ్ళకి? అదంతా స్వయంగా చేసుకోగలరు వాళ్ళు.’
ఇక్కడ గురూజీ ప్రస్తావించిన ‘వెలుగు’ పథకం గ్రామీణాభివృద్ధి శాఖ ప్రారంభించిన కార్యక్రమం. రాష్ట్రంలో దారిద్య్ర్యాన్ని రూపుమాపాలనే ఉద్దేశ్యంతో 1999-2000 ప్రాంతంలో ‘సొసైటి ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టి ‘(సెర్ప్) అనే సంస్థని ప్రభుత్వం ప్రారంభించింది. ప్రతి ఒక్క గ్రామంలోనూ మహిళల్తో పొదుపు సంఘాలు ఏర్పాటు చేసి వారి ద్వారా డబ్బు పొదుపు చేయించడం, అల పొదుపు చేసుకున్న సొమ్ముని ఆ మహిళా సంఘాలు తమ సభ్యులకి తక్కువ వడ్డీమీద ఋణాలుగా ఇవ్వడం ఆ పథకం ఉద్దేశ్యం. తర్వాత రోజుల్లో,ప్రభుత్వం, ఆ సంఘాలకి బాంకుల ద్వారా పావలా వడ్డికే ఋణాలు అందించడం కూడా మొదలుపెట్టింది. మొదట్లో వెలుగు అనీ, తర్వాత ఇందిరా క్రాంతి పథం అనీ, ప్రభుత్వాలు మారినప్పుడల్లా, ఆ పథకం పేరు కూడా మారుతూ వస్తున్నది. కాని గత పాతికేళ్ళుగా ఈ పథకం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గ్రామీణ నిరుపేద మహిళల్లో ఎంతో చైతన్యాన్నీ, సాధికారికతనూ తీసుకు వచ్చింది.
కానీ సమస్య ఏమిటంటే, మహిళలు అలా దాచుకున్న ఆ పొదుపును ఆదాయాన్ని పెంచే ఆర్థిక కార్యక్రమాలకు ఎలా మళ్ళించాలనే విషయం మీద మన ప్రభుత్వాలకు దిశానిర్దేశం లేకపోవడం. అందుకోసం వారు వరల్డ్ బాంకు వైపు చూస్తూ వచ్చారు. బాంకు వారికి livelihoods అనే ఒక కొత్త పదాన్ని పరిచయం చేసింది. అంటే గ్రామీణ మహిళలు కేవలం వ్యవసాయం లేదా కేవలం పాడి, కేవలం చేతిపనుల మీద కాక, వీటన్నింటినీ పొదువుకున్న ఒక జీవనవ్యవస్థని గ్రామాల్లో ఆవిష్కరించాలని దాని ఉద్దేశ్యం. అలా చెయ్యమని మన ప్రభుత్వాలకి వరల్డ్ బాంక్ సూచించింది కానీ, గురూజీ అప్పటికే ఎన్నో ఏళ్ళుగా ఈ విషయాలే, వరల్డ్ బాంకు కన్నా ఎంతో మిన్నగా, బిగ్గరగా చెప్తూ ఉన్నాడు. వినిపించుకునేవారేరీ?
‘ఇప్పుడు ఈ వస్తువులన్నింటికంటే కూడా ఎక్కువగా వీళ్ళకి డబ్బు కావాలి. ఒకప్పుడు ఇక్కడి గోండు మహిళ కూడా రెండు కిలోల వెండి ధరించేది. వీళ్ళ నడుముకు ఉండే పట్టీలో తొంభై తులాల వెండి ఉండేది. పావు పావు కిలోల పట్టీలు ఉండేవి. ముప్పావు కిలో సరీ సాక్రీ ఉండేది. చేతులకి కడియాలు వేరుగా ఉండేవి. మొత్తం కలిపి కనీసం రెండు కిలోల వెండి ధరించి తిరిగేది (నవ్వుతూ). ఒక లంబాడా మహిళ అయితే మూడు నాలుగు కిలోల వెండి ధరించి ఉండేది. లంబాడాలు, మథురాలు- ఈ వెండి అంతా వారు సంపాదించుకున్నదే కదా. ఊరి ఆర్థిక వ్యవస్థలో ఒక పెద్ద నిబంధన ఉండేది- ఊరి ధనంతో బయటి వస్తువు ఏదీ కొనకూడదు. బయటి వస్తువేదైనా ఈ ఊరికి రావాలంటే దానికోసం బయటినుండి డబ్బు సంపాదించాలి. ఊరి ధనం ఊరి ఆహారం. బయటి వస్తువులు కావాలంటే, దానికోసం బయటినుండి డబ్బు సంపాదించాలి.’
‘చిన్న చిన్న సంస్థానాలు ఉన్నప్పుడు, ఆ రాజులున్నప్పుడు, వీళ్ళకి పెద్ద నిబంధనలుండేవి. ఎవరైనా బజారుకి వెళ్ళినప్పుడు, ఈ ఊళ్ళోకి వచ్చేముందు చెక్ పోస్టు దగ్గరే తనిఖీ చేసేవాళ్ళు-బయటినుండి ఏం వస్తువు కొని తెస్తున్నాడని. ఒక పరిమితికి మించి బయటినుంచి ఏదీ తేకూడదు. దుస్తులు తెస్తుంటే వాటిని అక్కడే తగలబెట్టేసేవాళ్ళు. ఊరి ధనం ఊరి ఆహారం. బయటి వస్తువు కావాలంటే బయటినుండి డబ్బు సంపాదించు- ఇదీ సూత్రం ఎవరికైనా సరే.’
‘కొన్నిసార్లు చాలా నైపుణ్యంతో కూడిన వస్తువులుండేవి. అవి బయటి డబ్బుకోసం ఉండేవి. ఇక్కడి కళాకారులు మూడు జాతరలు చేసి ఒక తులం బంగారం కొని తెచ్చేవాళ్ళు. నకాశీ పనిచేసేవాళ్ళు అనేవారు ‘మూడు జాతరలు చేసాం, ఒక తులం బంగారం కొన్నాం ‘అని. బంగారం బయటిది. జాతరల్లో బయటి డబ్బు సంపాదించారు. అక్కడినుంచే ఆ వస్తువు కొనుక్కుని తెచ్చుకున్నారు. అంతే తప్ప ఊరి డబ్బుతో, ఊరి ధనంతో బయటి వస్తువు రాకూడదు.’
అక్కడ కూచున్నవాళ్ళల్లో ఒకరు గురూజీ మాటలకు అడ్డు వచ్చి ‘ఊళ్ళో అందరూ పనిచేసే వాళ్ళే ఉండరు కదా? సోమరిపోతులు కూడా ఉంటారు కదా ‘ అని అడిగాడు.
‘సోమరితనం ఎప్పటినుండి వచ్చింది మనదగ్గర? ‘ అనడిగారు గురూజీ.’ ఎవరైనా సోమరిపోతులుంటే వాళ్ళ పప్పులుడకవు కదా. అందరూ పనిచేసేవాళ్ళే ఉన్నప్పుడు వీడికి కూడా పనిచేసే అలవాటు ఉంటుంది కదా సహజంగా. ఎంత బలహీనుడైనా సరే, ఒకవేళ వికలాంగుడైతే, శారీరికంగా బలహీనుడైతె, వాడికి తగ్గ పని వాడు చేసుకునేవాడు. వాడినెవరూ బలవంతం చేసే వారు కాదు.’
అని ఒక క్షణం ఆగి గురూజీ నిట్టూర్చి, ‘పూర్వం గ్రామాల్లో చాలా కళగా ఉండేదికదా, ఈ రోజు ఊళ్ళు వెలవెలబోతున్నాయి. ముప్ఫై నలభై ఏళ్ళ కిందట ఊళ్ళల్లో తిరుగుతున్నప్పుడు ఒక కళ కనిపించేది. అది ఒక రూపంలో వ్యక్తమయ్యేది. ఈ రోజు ఉదాసీనత కనిపిస్తోంది. గ్రామాల కళ మారిపోయింది’ అని అన్నారు.
ఆ తర్వాత మళ్ళా గురూజీ వనరుల దగ్గరికొచ్చారు. ఇప్పుడాయన దృష్టిమొత్తం జలవనరులమీదనే ఉన్నట్టుంది. మళ్ళా చెప్పడం మొదలుపెట్టారు:
‘వ్యవసాయంలో భూమీ, పశువుల్తో పాటు నీరు కూడా ఒక భాగం. పశువుల జననం నుండి వాటి పాలన, పోషణ, ప్రజననం దాకా అంతా ఒకే వ్యవస్థగా ఉండేది. దాని గురించిన సమాచారం ప్రజలకు చాలా సమృద్ధిగా ఉండేది. మన దగ్గర నదుల్ని మూడు రకాలుగా భావించారు-రజస్వతి, సరస్వతి, పయస్వతి. ఏ నదుల్లో ఇసుక ఎక్కువ ఉంటుందో అది రజస్వతి. ఏ నదుల్లో రాళ్ళు ఎక్కువగా ఉంటాయో అది పయస్వతి. ఏది తక్కువ వెడల్పుతోనూ, ఎక్కువ లోతుగానూ ఉంటుందో అది సరస్వతి. మన దగ్గర నదులకి సంభవించినంత నాశనం బహుశా మరెక్కడా జరగలేదు టీవీల్లో ఒక్కోసారి చూస్తాం, పాశ్చాత్యదేశాల్లో నదుల్ని. చాలా అందమైన నదులు. కొన్ని నదులు నగరాల మధ్యనుండి ప్రవహిస్తాయి. చాలా శుభ్రంగా, అందంగా ఉంటాయి. కానీ ఇక్కడ ఎన్ని పెద్ద పెద్ద నగరాలు నిర్మించారో అవన్నీ పెద్ద పెద్ద నదుల్ని నాశనం చేసి మాత్రమే నిర్మించారు. ఇప్పుడు హైదరాబాద్ నిర్మిచారు, మూసీని నాశనం చేసారు. నాందేడ్ నిర్మించారు, గోదావరిని నాశనం చేసారు. నాసిక్ గోదావరిని నాశనం చేసింది. ఇక్కడ ప్రతి ఒక్క నగరం ఒక నదిని నాశనం చేసింది. దాన్ని చాలా అందమైన పద్ధతిలో కాపాడుకోవచ్చును, కానీ కాపాడుకోలేదు.’
‘ఒకప్పుడు మన దగ్గర నదుల్ని ఎలా కాపాడుకునేవారంటే- ఇక్కడ గోదావరిమీద, అంటే నిర్మల్ దగ్గర, ఏ వంతెన నిర్మించారో, అక్కడ ఒక రాయిమీద రాసి ఉండేడని చెప్తారు, అది ఫార్సీలోనో ఉర్దూలోనో రాసి ఉండేది, నేనైతే చదవలేదు. ఆ వంతెన ప్రారంభం చెయ్యడానికి నిజాం వచ్చినప్పుడు అక్కడ ఆ రాతిని ప్రదర్శించారట. దానిమీద గోదావరికి క్షమాపణలు చెప్పుకున్నారట: ‘ఓ గోదావరీ, నువ్వు నీ ఇష్టానుసారంగా ప్రవహిస్తావు. మేము నీ ప్రవాహాన్ని బంధిస్తున్నాం. వంతెన అంటే బంధించడమే. జనసామాన్య కళ్యాణం కోసం నీ ప్రవాహాన్ని బంధిస్తున్నాం. మాకు హక్కులేదు నీ ప్రవాహాన్ని నిరోధించడానికి, కాని మేం నిరోధిస్తున్నాం. కాబట్టి నువ్వు మమ్మల్ని క్షమించు, క్షమించు, క్షమించు ‘ అని క్షమాపణలు కోరుకుంటూ ఆ రాయిని అక్కడ నిలబెట్టారట. తర్వాత రోజుల్లో ఆ రాయి ముక్కలై పడి ఉంటే, ఇదుగో, మనవాడు వెళ్ళి దాన్ని ఫొటో తీసుకొచ్చాడు.’
‘కాబట్టి గమనించవలసిందేమంటే, పూర్వం ఒక వంతెన కట్టడాన్ని కూడా ప్రజలు మంచిగా భావించేవారు కాదు. అలా కట్టడానికి ముందే నదినుంచి క్షమాయాచన చేసుకునేవారు. ఇప్పుడు మనదగ్గర వంతెనలు కూడా పెద్ద ఎత్తున కడుతున్నారు. రవాణా సాధనాలు మారగానే వంతెనల అవసరం కనిపించడం మొదలయ్యింది. అంతకు పూర్వం వంతెనల అవసరం అంతగా కనిపించలేదు. ప్రజలు కాలినడకన యాత్ర చేసినప్పుడు, లేదా రథాల మీద యాత్ర చేసేటప్పుడు, వంతెనల అవసరం ఉండేదికాదు. రథాల్ని కూడా పడవల మీదనే నదులు దాటించేవారు. ‘నీటిలో ఎడ్లబండి పడవమీద ఉంటుంది, నేలమీద ఎడ్లబండి మీద పడవ ఉంటుంది ‘ అవునా? అలా!(నవ్వులు) ఎందుకు వేల సంవత్సరాల కాలంలో కూడా మన దగ్గర నదులమీద ఆనకట్టలు కట్టలేదో మనకి తెలియదు.’
‘పూర్వకాలపు గ్రంథాల్లో ఎక్కడైనా నదుల్ని కొద్దిగా మళ్ళించే ప్రస్తావన వస్తుంది, వర్ణన వస్తుంది, కానీ నదుల్ని నిరోధించడం మంచిదిగా భావించలేదు. ఈ పిచ్చితనం ఇప్పుడిప్పుడే మొదలయ్యింది కదా. పెద్ద పెద్ద ఆనకట్టలు నిర్మించడం. కాని మన దగ్గర చిన్న, చిన్న చెరువులదే చాలా ఎక్కువ వ్యవస్థ ఉంది. హైదరాబాదులో 350 చెరువులు ఉండేవి. మైసూరు రాష్ట్రంలో ఒకటి తక్కువ యాభై వేల చెరువులున్నాయి. భండారా జిల్లాలో ముప్ఫై తొమ్మిది వేల చెరువులుండేవి. భండారా జిల్లాలో ఆ చెరువులిప్పటికీ ఉన్నాయి. పూర్వం ఈ ప్రాంతంలో ఏ ఇంటికైనా ఆమ్మాయిని ఇచ్చేవాళ్ళు ‘మీ ఊళ్ళో ఏముంది?’ అనడిగేవారు. వాళ్ళు ‘మా ఊళ్ళో పన్నెండు చెరువులున్నాయి’ అని చెప్పారనుకోండి, ఇంకేమీ అడిగేవారు కాదు. పన్నెండు చెరువులున్నచోట ఇంకేం కావాలి? మరేమీ ఆలోచించకుండా వారు ఆ సంబంధం ఖాయం చేసుకునేవారు. చెరువు సమృద్ధికి ప్రతీక మన దగ్గర.’
‘ఇక్కడ నీరు పట్టి ఉంచే పద్ధతులు కూడా ఉండేవి. నీటిని చాలాకాలం సరిపడా స్టాక్ చేసుకుని ఉంచుకునేవారు ప్రజలు. నిల్వచేసుకుని తాగేవారు. కొన్ని వర్షాల తర్వాత నీరు శుభ్రం అయ్యేది. అంతవరకూ అది బురదగా ఉండేది. దాన్ని ఎంత చేసినా శుభ్రమయ్యేది కాదు. అందుకని ఆ నీటిని శుభ్రపరచడానికి ఇక్కడ పటిక ఉపయోగించారు. లేదా ఇండుగ పిక్క కూడా ఉపయోగించేవారు. పటిక ఒక్కసారి అలా తిప్పితే పూర్తి మురికి కిందికి దిగిపోతుంది. ఇండుగపిక్క వేసినా అంతే. నీరు తాగడానికి ఇత్తడి పాత్ర చాలా శ్రేష్ఠమైందిగా భావించారు. రాగి పాత్ర నీళ్ళు రాత్రి ఉంచి ఉదయం తాగడానికి. మొదట ఏ వర్షం పడుతుందో దాన్నీ, వడగండ్లు పడే మొదటి వర్షం నీటినీ మంచిదిగా భావించేవారు కారు. కాని వడగండ్లని మాత్రం నిల్వ చేసి ఉంచుకునేవారు. ఆ వడగండ్ల నీటిని మందుల్లోకి ఉపయోగించుకునేవారు.’
‘చాలా వస్తువులు తయారుచేసేటప్పుడు నానబెట్టి తయారు చేయవలసి ఉంటుంది. వెదురు నానబెట్టాలి. జనపనార నానబెట్టాలి. దాన్ని నానబెట్టి తాళ్ళు తయారుచేయాలి. కాబట్టి వీటికి నానబెట్టే చోట్లు విడిగా ఉండేవి. ఆ స్థలం స్థిరంగా ఉండేది. తాగే నీటి స్థలాలు వేరే ఉండేవి. ఈ స్థలాలకి వాటితో సంబంధం లేదు. ప్రవహించే నీటికి అంత దోషం లేదు. కాబట్టి ఆ వస్తువుల్ని నానబెట్టే స్థలాలు అలా ఉండేవి. అవి ఉన్నచోటనుంచి చాలా దూరం వరకూ ఏ గ్రామమూ ఉండదు. తాగునీరు తెచ్చుకునే స్థలాలూ, స్నానం చేసే స్థలాలూ, గుడ్డలు ఉతికే స్థలాలూ అన్నీ వేరు వేరుగా ఉండేవి. గుడ్డలు ఉతకడానికి ఆ రోజుల్లో ఎలాంటి సర్ఫ్ లూ ఉండేవి కావు. చౌడు మట్టి మాత్రమే ఉండేది. కొన్ని రకాల చెట్ల కట్టెలు తగలబెట్టి సున్నంతో కలిపి ఒక పదార్థం తయారు చేసేవారు. దాన్ని ‘కారం’ అనే వారు. దాంతో చాలా చక్కటి నురుగు వచ్చేదని చెప్పేవారు.’
‘ఉన్ని దుస్తులు ఉతకాలంటే కుంకుడు కాయలున్నాయి. ఈ వస్తువులన్నింటితో బట్టలు ఎలా ఉతకాలి, వాటి సంస్కారం, పాత్రలు, నగలు ఎలా శుభ్రం చేయాలి, ఆ ప్రక్రియలు చాలా బాగుండేవి. ఇత్తడి పాత్ర దేనితో కడగాలి, రాగి పాత్ర దేనితో తోమాలి, మట్టి పాత్రని దేనితో శుభ్రం చేయాలి, బంగారు, వెండి నగల్ని ఎలా కడగాలి- ప్రత్యేకమైన ప్రక్రియలుండేవి. మట్టి పాత్రని తోమాల్సి వస్తే దాన్ని బూడిదతో తోమేవారు. ఇత్తడి, రాగి పాత్రల్ని చింతపండుతో తోమేవారు. బంగారాన్ని పసుపుతో తోమేవారు. మట్టిపాత్రల్లాంటివి ఒక సంవత్సరంకన్నా ఎక్కువ ఉపయోగించలేం. ఒకవేళ చాలా రోజుల వరకూ దాన్ని వాడకుండా ఉండిపోతే దాన్ని ఉపయోగించకూడదు. హోలీ రోజున దాని పని ఖతం. అయితే మట్టి పాత్రని ఉపయోగించేముందు దాన్ని మళ్ళీ ఒకసారి భట్టీలో కాల్చాలి. అప్పుడు దాన్ని ఉపయోగించవచ్చు.’
‘నీళ్ళు పట్టడానికి చాలా సాధనాలు చర్మంతో చేసినవి ఉండేవి. చర్మంలో నీరుమోసేవారు. నీరు నిలవ ఉంచేవారు కూడా. పెద్ద పెద్ద బావుల్లోంచి నీళ్ళు తోడే బొక్కెన కూడా చర్మంతో చేసింది ఉండేది. ఇప్పుడు వాడుతున్న ఈ ఇనప మోట బొక్కెనల కన్నా ముందు చర్మంతో చేసినవే ఉండేవి. వాటిని గేదె చర్మంతో చేసేవారు.’
‘కొన్నిసార్లు నీరు కమండలాల్లో కూడా ఉంచేవారు. ఆ తుంబల్ని చేదు ఆనపకాయల్తో తయారు చేసేవారు. ఆనపకాయలు ఎండిపోయాక, దాని ముఖం కొంత భాగం కట్ చేసి దాన్ని లోపల శుభ్రం చేసి దానిలో మూడు రోజుల దాకా చింతపండు నీళ్ళు పోసి ఉంచుతారు. ఆ తర్వాత దాన్ని మళ్ళీ శుభ్రం చేసి కడుగుతారు. ఆ తర్వాత దానిలో బూడిద కలిపిన నీళ్ళు పోసి ఉంచుతారు. ఆ తర్వాత ఒకటి రెండు రోజులు దానిలో నీరుపోసి పారబోస్తారు. ఆ తర్వాతనే దాన్ని ఉపయోగిస్తారు. పూర్వం అడవుల్లోకి వెళ్ళేవాళ్ళంతా తుంబల్లోనే నీళ్ళు ఉంచుకునేవారు.’
‘తుంబలు చాలా రకాల ఆకారాల్లో ఉంటాయి. అందులో ఒకటి డమరు ఆకారంలో ఉంటుంది. దానికి కొంతభాగం కట్ చేసి దండీలాంటిది పెడితే అది కమండలం. కానీ చాలా కమండలాలు కొబ్బరికాయతో తయారు చేసినవి ఉన్నాయి. బెంగాల్ వైపు ఒక కొబ్బరికాయ ఉంటుంది.చాలా పెద్ద కొబ్బరికాయ, దాన్ని రెండు భాగాలు చేస్తే, ఫకీర్ల దగ్గర కనిపించే కటోరాలాగా అవుతుంది. అలా విడగొట్టకుండా ఉన్న దానిలో ఒక దండీ పెడితే అది కమండలం అవుతుంది. అందులో నీరు చాలా శుభ్రంగా ఉంటుంది.’
‘పూర్వం ఎవరినైనా రాజుని చేయాలంటే పూర్తి తీర్థాల నీరు తెచ్చేవారు. ఆ నీరు నిల్వచేసి అతనికి స్నానం చేయించేవారు. చాలా పూజల్లో, ఉదాహరణకి ఎవరైనా మూలా నక్షత్రంలో పుడితే అతనికి ఇరవై ఏడు బావుల నీటితో స్నానం చేయిస్తారు. కొన్ని కొన్ని భాషలు చూస్తాం. బీహారీ భాష చాలా తీయగా ఉంటుంది. ఎక్కడి భూమిలో నీరు ఎక్కువగా ఉంటుందో అక్కడ భాషలు చాలా తియ్యగా ఉంటాయి. ఎక్కడ భూమిలో నీరు చాలా తక్కువగా ఉంటుందో ఆ భాషలు కొద్దిగా కఠినంగా ఉంటాయి. మార్వాడ్ భాష ఒక రకంగా తీయగా ఉంటుంది. మార్వాడ్ లో ఎక్కడ నీరు తక్కువగా ఉంటుందో, అక్కడ వాళ్ళు తిట్టడం కూడా ప్రేమగా తిడతారు. అదేం సంబంధమో తెలియదు.’
‘మార్వాడ్ ప్రాంతం పూర్వం ఆలోచనల వలస ప్రాంతం. అక్కడుండేవాడి దగ్గర సైకిలుందనుకో, విమానం దాకా ఆలోచన చేస్తాడు. తూర్పు ప్రాంతమంతా పాటలు పాడటంలో మస్త్ ఉంటుంది. వర్షాకాలంలో ఇల్లు కారుతూ ఉంటుంది. దాన్ని బాగు చేయడు, ఢోలక్ పట్టుకుని పాటలు పాడటానికి కూచుంటాడు. భలే. చెట్టు కింద ఉంటాడు కానీ ఢోలక్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఆ ప్రాంతమంతా అంతే, పాటలు పాడుకుంటూ ఉంటుంది. వాళ్ళకి మరెలాంటి ఆలోచనలూ ఉండవు.’
ఈలోపు మరొకరెవరో ‘గురూజీ జల్ గురించి చెప్పారు. జంగల్ సంగతేమిటి?’ అనడిగారు. దాంతో గురూజీ చెట్ల గురించీ, అడవుల గురించీ చెప్పడం మొదలుపెట్టారు. దానికదే ఒక పెద్ద ప్రసంగం.
19-6-2026


చదువుతున్నంత సేపు ద్వారక / మధుర వీధుల్లో తిరిగి వజ్ర వైడూర్యాలను అతి చౌకగా కొనుగోలు చేసి తెచ్చుకున్నాము అనే అనుభూతి కలిగింది..
ఎలాంటి అనుభూతి అంటే శక మహర్షి సమక్షంలో పరీక్షిత్తుకు కలిగిన అనుభూతి కలిగింది గురువుగారు🙏🏻
ధన్యవాదాలు సార్!
ఈ మాటలు వినడం ద్వారా భాగవతంలోని ఘట్టాలను కొత్త కోణంలో చూడాలనే ఎరుక కలిగింది. కృష్ణుడు చేసిన చర్యలు కేవలం పురాణ సంఘటనలు కాదని, వాటి వెనుక ఒక సమగ్ర జీవన తత్వం, సమాజ నిర్మాణం, స్వావలంబనకు సంబంధించిన లోతైన సూత్రీకరణ దాగి ఉందని అర్థమైంది. మనిషి తన నేలతో, తన నీటితో, తన సమాజంతో ఎలా మమేకమై జీవించాలో ఆయన తన చర్యల ద్వారానే చెప్పాడేమో అనిపించింది. అలాగే లంబాడా మహిళ చెప్పిన ‘పాలు అమ్మడం అంటే ఊరు పేదదైపోవడం’ అనే మాట, సంపదను కేవలం డబ్బుతో కొలిచే మన దృష్టిని మరోసారి ప్రశ్నించేలా చేసింది. సంపద అనేది మన జీవనాధారాలను మన దగ్గరే నిలుపుకొని, వాటి ద్వారా సమాజాన్ని పోషించగల సామర్థ్యంలోనూ ఉంటుందని అర్థమైంది. ఈ మాటలు వింటున్నంతసేపూ, అభివృద్ధి అనేది కొత్త వనరులను వెతకడంలో కాకుండా, మనకున్న వనరులతో సమతుల్యమైన అనుబంధాన్ని తిరిగి ఏర్పరచుకోవడంలోనే ఉందేమో అనిపించింది.
ఒక గ్రంథం చదివేటప్కపుడు కథలను లేదా సంఘటనలను తెలుసుకోవడం మాత్రమే సరిపోదని, వాటి వెనుక దాగి ఉన్న జీవన సూత్రాలను, సామాజిక తాత్వికతను, కాలాతీతమైన జ్ఞానాన్ని అర్థం చేసుకునే చూపును పెంపొందించుకోవడం కూడా అంతే అవసరమని అనిపించింది. అప్పుడు మాత్రమే గ్రంథాలు గతానికి చెందిన కథలుగా కాకుండా, వర్తమాన జీవితానికి దిశానిర్దేశం చేసే జీవన పాఠాలుగా మారతాయని అనిపించింది.
ఇంతటి విలువైన విషయాలు తెలియజేస్తున్న శ్రీ గురూజీ కి,వాటిని మాకు అందజేస్తున్న మీకు
హృదయపూర్వక నమస్సులు
ఎంతో సహృదయంతో సవివరంగా స్పందించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.
గోవర్ధన గిరి పూజ, మన ప్రాంతంలో ఉన్న ప్రకృతి వనరులను గౌరవించి, కాపాడే ప్రయత్నం. నేను గతంలో దూరదర్శన్ లో ఒక కార్యక్రమంలో చూశాను. ఉత్తర భారతదేశంలో కొన్ని పవిత్ర క్షేత్రము లలోని పర్వతాలపై ఉన్న చెట్లను అసలు కొట్టి వేయరు.ఎవరైనా ముట్టుకుంటే ఊరుకోరట. వాటిని దేవ వనాలు అంటారు అంటే . పర్వతాలు, అడవులు సురక్షితంగా ఉంటే వానలు అవే వస్తాయి. సంపదలు చేకూరుతాయి.
అవును సార్! నిజమే. ఆయన దేవ వనాల గురించి కూడా మాట్లాడారు. తర్వాత సంభాషణలో వస్తుంది.
కృష్ణుడి జీవితాన్ని గ్రామ ఆర్థిక వ్యవస్థకు మార్గదర్శకంగా గురూజీ వివరించిన తీరు నిజంగా చాలా బాగుంది.
ఇంకెవరైనా మన పురాణాల్లో ఇటువంటి insights ని పట్టుకుని గురూజీ లాగా ఆలోచించి ఆచరించిన వారున్నారా ??
అలాగే, మన పూర్వీకులు వనరులను సంరక్షించిన విధానం, ప్రకృతిని గౌరవించిన తీరు, నీటి నుండి పాత్రల వరకు ప్రతి వస్తువును ఎలా ఉపయోగించాలి, ఎలా శుభ్రపరుచుకోవాలి అనే విషయాల్లో వారికి ఉన్న అవగాహన ఆశ్చర్యపరుస్తుంది. Their life was a part of nature, not separate from it, and perhaps that is why there was no destruction on the scale we see today.
“పూర్వం గ్రామాల్లో చాలా కళగా ఉండేది. ఈ రోజు ఉదాసీనత కనిపిస్తోంది. గ్రామాల కళ మారిపోయింది.”
This is so true.
నాకు తెలిసిన మా గ్రామమే ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది అనిపిస్తుంది.
Thank you for sharing this informative conversation, Sir. 🙏🏽
హృదయపూర్వక ధన్యవాదాలు మాధవీ!
రామనవమికి ఊళ్ళల్లో వేసే తాటాకు పందిళ్లను గుర్తు చేస్తూ మొదలుపెట్టిన ఈ సంభాషణలో చాలా అంశాలు నన్ను నేను పుట్టిన పల్లెటూరు బల్లిపాడు కి తీసుకెళ్లి ఒక రౌండ్ తిప్పించాయి భద్రుడు గారు. గురూజీ ” మన ప్రాంతంలో ఏమేమైతే దొరుకుతాయో వాటిని ఉపయోగించడం ప్రజలకి తెలుసు. జల్, జంగల్, జమీన్- ” అన్నారు. అటువంటి స్థితి నుంచి ప్రస్తుత ప్రపంచం రోటీ, కపడా, మకాన్ ఎంత ఖరీదైనవి సంపాదిస్తే అంత గొప్ప అని భావించే ఒక అసతృప్తికరమైన పరిస్థితికి చేరుకోవడం ఎంత దురదృష్టకరం కదండీ..
ఈ సంభాషణల ద్వారా మన మూలాల్లోని అత్యద్భుతమైన జీవన తాత్వికత, గ్రామీణ ఆర్థిక స్వావలంబన తెలుసుకున్న కొలదీ ఎక్కడినుంచి ఎక్కడికి వచ్చాం అని దిగులు పుడుతోంది.
శ్రీకృష్ణుడు తెచ్చిన మూడు విప్లవాలు గ్రామ వనరులను కాపాడుకోవడం, జలవనరులపై హక్కు, గోవర్ధనం వంటి స్థానిక సంపదకు ప్రాధాన్యత ఇవ్వడం గురించి గురూజీ వివరించిన తీరు భారతం, భాగవతం లో కృష్ణలీలల వెనుక వున్న తాత్విక చింతనల సంగతి మనకి అసలు తెలీదు అనిపించింది.
కృష్ణుడి మొదటి విప్లవం అక్కడ నాకర్థమయిందంటూ.మీరిచ్చిన ఈ ఇంటర్ప్రిటేషన్ – “మనకున్న వనరుల్ని మనం పూర్తిగా ఉపయోగించుకుని, ఆ తర్వాత ఏది అవసరం లేదో, దాన్ని బయటకు పంపడం. ఇది ఊరు పాటించవలసిన మొదటి ఆర్థిక వ్యవస్థ. మన దగ్గరున్న ప్రతి వస్తువుని మన పద్ధతిలో పూర్తిగా ఉపయోగించుకున్నాకనే, ఇక దేని అవసరం మనకు లేదో దాన్ని మాత్రమే బయటకు పంపడం” – చాలా చాలా బాగుంది. మన వనరులను మనం పూర్తిగా వాడుకున్నాకే మిగిలిన దాన్ని బయటకు పంపాలనే ఆర్థిక సూత్రం ఎంత కాలాతీతమైనదో అర్థమవుతోంది.
నదులను రజస్వతి, సరస్వతి, పయస్వతిగా వర్గీకరించడం వెనుక ఉన్న మన పూర్వీకుల శాస్త్రీయ అవగాహన, అలాగే ఒక వంతెన కట్టేటప్పుడు కూడా గోదావరికి నిజాం క్షమాపణలు చెప్పుకున్నారనే చారిత్రక సత్యం… ప్రకృతి పట్ల మన సంస్కృతికి ఉన్న గౌరవభావం తలుచుకుంటే ఎంతో గర్వంగా ఉన్నప్పటికీ.. ఇవన్నీ ఎలా కోల్పోయాం.. అన్న ఆలోచన వచ్చి చాలా బాధ గా ఉంది.
మట్టి పాత్రలు, కమండలాలు, తుంబల తయారీ మరియు నీటిని నిల్వ చేసే సాంప్రదాయ పద్ధతులను గురూజీ చాలా ఆసక్తికరంగా వివరించారు. పూర్వం గ్రామాల్లో ఉన్న కళల స్థానం లో ఉదాసీనత చోటు చేసుకోవడం గురించిన గురూజీ నిట్టూర్పు మాత్రం అక్షర సత్యం.. గత ఐదేళ్లలో నేను ఎన్నో ఊళ్లను నేను పుట్టిన బల్లిపాడు తో సహా చూసినప్పుడు నేను కూడా ఇదే గమనించా..
ఇంతటి అమూల్యమైన, లోతైన జీవన పాఠాలను, రవీంద్ర శర్మ గారి అమృత తుల్యమైన వాక్కులు మీ ద్వారా ఇలా మమ్మల్ని చేరడం మా అదృష్టం భద్రుడు గారు. మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు.
.
అవును సార్! జల వనరుల గురించి ఆయన దృష్టికి రానిదేదీ కనిపించలేదు ఈ సంభాషణలో! మీ సహృదయ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు.