కొన్ని కలలు కొన్ని మెలకువలు-36

3

పిచ్చిక గూడు

మనిషిని విద్యావంతుణ్ణి చెయ్యడానికి ఇదొక్కటే నిర్దిష్టమార్గమంటూ మనం దేన్నీ చెప్పలేకపోయినప్పటికీ, కాలక్రమంలో పాఠశాల విద్యార్జనా సాధనంగా రూపుదిద్దుకుంటూ రావడాన్ని కూడా ఎవరూ నివారించ లేకపోయారు. పాఠశాల  ఒక ప్రత్యేక స్ధలం, ప్రత్యేక పద్ధతి, ప్రత్యేక శిక్షణ.

విద్యావంతులంతా పాఠశాలని మరింత సౌకర్యవంతంగా ఎలా తీర్చిదిద్ద గలమా అనే ఆలోచిస్తూ వచ్చారు. అది పురాతన గ్రీకు జిమ్నాషియమయినా, లేదా ప్రాచీన భారతీయ గురుకులమైనా దాని ఉద్దేశ్యం మనిషికి అత్యున్నత స్ధాయి విద్యని అందించడమే.

ప్రపంచమంతటా, అన్ని నాగరికతల్లో కనీసం ఒక వయసుదాకా పిల్లలకి సమగ్రశిక్షణ ఇవ్వడానికి పాఠశాల వంటిదంటూ ఒకటుండాలని మానవసమాజం నమ్ముతూ వచ్చింది. పాఠశాల  అంటే ఏమిటి? గురువా? పిల్లవాడా? బోధనా? అభ్యసనమా? వల్లెవేయడమా? అది కొన్ని పనిగంటల ప్రక్రియా? లేక అహర్నిశలు కొనసాగుతుండే అపురూప సహజీవనమా?

ఈ ప్రశ్నలకు సమాధానాలు ఒక్కలా లేవు. ఇందులో ప్రతి అంశం మీదా ఎంతో చర్చ జరిగింది. ఎన్నో వాదవివాదాలు, ఎన్నెన్నో ప్రయోగాలు జరిగాయి. జరుగుతున్నాయి. ఇంకా ఎన్నో జరగబోతున్నాయి. కాని ఒక్క విషయంలో మాత్రం అన్ని ప్రయోగాలూ, అందరు విద్యావేత్తలూ ఒక్కలానే అభిప్రాయపడ్డారు. పాఠశాల  విద్యార్ధి సమగ్రాభివృద్ధికి తోడ్పడవలసి ఉంటుందని.

సమగ్ర అభివృద్ధి అంటే కేవలం పిల్లవాడి శరీరానికో లేదా బుద్ధికో లేదా హృదయానికో మాత్రమే శిక్షణనివ్వడం కాదు. అది ఏకకాలంలో పిల్లవాడి సమస్త శక్తుల్నీ అభివృద్ధి పరచవలసి ఉంటుందనే ప్రతి విద్యావేత్తా భావిస్తూ వచ్చాడు. తన విద్యార్ధికి ఏదో కనీస విద్యానుభవాన్నిస్తే అత్యంత ప్రాకృతిక పరిసరాల్లో, అత్యంత సహజసిద్ధంగా వాళ్లకి ఒనగూడాలనే ఎందరో విద్యావేత్తలు కోరుకున్నారు. పిల్లవాడితో కలిసి మెలిసి అతనికొక నూతన జీవన దృక్పథాన్నివ్వడం సుదీర్ఘమైన సహనశీల ప్రక్రియ అనే వారు భావించారు.

నా మొదటి కల ఏమిటంటే, ప్రతి ఒక్క మనిషీ, అది బాల్య, కౌమార, యవ్వన అవస్ధలో ప్రపంచం పట్ల కుతూహలవంతంగా తన నేత్రాలు విప్పుకోవాలని, నేర్వడానికి, తెలుసుకోవడానికి ఉత్సాహపడాలని, తెలుసుకోవడం దానికదే ఒక అనుభవం. సాధారణంగా మనుషులకు వివిధ రకాల ఆనందాలతో, అనుభవాలతో పరిచయం ఉంటుంది. అవన్నీ నిజానికి సుఖానుభవాలు మాత్రమే. జ్ఞానానుభవం ఒక్కటే నిజమైన ఆనందానుభవం.

తైత్తిరీయం ఆ అనుభవాలు రెండింటినీ మానుషానుభవం, దివ్యానుభవం అని విడదీసింది. బలిష్టుడు, సంసన్నుడు, ఆరోగ్యవంతుడైన  యువకుడు పొందే  సాధారణ జీవితానుభవాన్ని అది మానుషానుభవం అంది. జ్ఞానానుభవం దానికి ఎన్నో రెట్లు  ఉన్నతమైందనీ, అది దివ్యానుభవమనీ అంది. అది మనిషి తన పరిమితానుభవాన్ని వదలిపెట్టి నూతనానుభవాల దిశగా ప్రయాణించడానికి అనువైన మానసిక స్ధితి.

ప్రతి ఒక్కరి జ్ఞానానుభవం అటువంటి నూతన ప్రపంచ దర్శనం కావాలన్నదే నా మొదటి కల. ప్రపంచపు నలుదిక్కులనుంచీ కొత్త ఆలోచనలు, కొత్త ఆకాంక్షలు అతని మీద వర్షించాలి. అతనికి కొత్త ఇంద్రియాలూ, కొత్త రెక్కలూ ఏర్పడాలి. కొత్త నేత్రాలతో తన పరిమిత పరిచిత ప్రపంచాన్ని చూడగలగాలి. కొత్త హస్తాలతో తన ప్రపంచాన్ని తన తోటి మనుషుల కోసం, పశుపక్ష్యాదుల కోసం పునర్నిర్మించగలగాలి.

నా రెండవ కల ఏమిటంటే ప్రతి విద్యార్ధికీ విద్యానుభవం కుతూహలవంతమైన అనుభవంగానే కాక, ఆ అనుభవంలో అతని కుతూహలాన్ని ఆరకుండా ప్రజ్వలింప చెయ్యగల సహనశీలురైన తల్లిదండ్రులూ, ఉపాధ్యాయులూ కావాలి.

విద్యానుభవం సహనంతో ఓపిగ్గా వేచి ఉండవలసిన ప్రక్రియ. దానికొక వాతావరణం కావాలి. అది పువ్వులు పూయడానికి మనమొక తోట పెంచడం వంటిది. పూలతోటని పెంచినట్టుగా మనమొక పాఠశాలని ఏర్పరచుకోవలసి ఉంటుంది. నా మూడవ కల అటువంటి పాఠశాలలే. పాఠశాల ప్రకృతి ఒడిలో వికసించవలసిన ఖేల.

ప్రతి పాఠశాలా అటువంటి పిచ్చికగూడు కావాలన్నది నా అందమైన, ఎన్నటికీ వీగిపోవడానికి ఇచ్చగించని కల. ఆ కలకి దేశకాల భేదం లేదని టాల్‌స్టాయ్ రూసో, టాగోర్ వంటి మహనీయ విద్యావేత్తలెందరో చెప్తూ వచ్చారు.

వారివారి రచనల్లో వారు పాఠశాలల్ని సంపద్వంతం చేసే మహత్తర పార్శ్వం మీద కాంతి ప్రసరింపచేసారు. ఆ పార్శ్వాలన్నీ జోడిస్తేనే సంపూర్ణ సమగ్రవిద్య ఏర్పడుతుంది.     ఆ సమగ్ర విద్య ఎలాఉంటుందో గాంధీజీ మనకొక దర్శనాన్నిచ్చారు. ఆయన మాటలు చూడండి.

ఇటువంటి జ్ఞానాన్వేషణ వల్లా, విద్యాప్రదానం వల్లా మాత్రమే మానవుడు పురోగమిస్తాడు. తన జీవితాన్ని, ప్రపంచాన్ని మరింత మానవీయ చేసుకోగలుగుతాడు. ఇవి అందమైన కలలే అయినప్పటికీ, ఈ కలల్ని నా జీవితంలోనూ, నేను నివసించిన ప్రతి ఒక్క స్ధలంలోనూ ఏదో మేరకు నిజయం చెయ్యడానికీ, నిజం చేసుకోవడానికీ ప్రయత్నించాను. ఆ ప్రయత్నంలో ఏదో మేరకు సఫలుణ్ణయ్యాను కూడా. ఇప్పుడొక వేళ వెనుదిరిగి, నేను నిజంగా జీవించిన క్షణాలూ, అన్నిటికన్నా ముందు గుర్తు పెట్టుకునే క్షణాలూ ఏవి అని చూసుకుంటే ఆ నా కలలు సాకారం పొందిన క్షణాలే అని చెప్పవలసి ఉంటుంది.

3

The Sparrow’s Nest

Although we cannot point to any single, exclusive path for educating a human being, the school historically emerged as the primary vehicle for acquiring knowledge. The school is a distinct space, a deliberate method, a dedicated discipline.

Across eras, thinkers have sought to shape the school into an ever more nurturing environment. Whether in the ancient Greek Gymnasium or the Indian Gurukula, the underlying purpose remained the same: to offer the highest cultivation of human potential.

Across civilizations, human society has recognized that children need an institutional sanctuary for holistic upbringing, at least through their formative years. Yet what defines a school? Is it the teacher, the child, the instruction, the learning, or mechanical recitation? Is it merely a transaction confined to fixed hours, or an enduring communion of shared living?

The answers to these questions have never been singular. Every facet of schooling has sparked debate, philosophical inquiry, and pedagogical experimentation. Yet across all traditions, educational thinkers converge on one fundamental principle: the school must serve the holistic development of the child.

Holistic development does not mean training the body, the intellect, or the heart in isolation. It demands the simultaneous awakening of all human faculties. Visionary educators have consistently believed that if a child is to receive an authentic education, it must unfold naturally within living, organic surroundings. Guiding a child toward a new perspective on life is a patient, unhurried journey.

My first dream is that every individual—through childhood, adolescence, and youth—should open their eyes to the world with boundless curiosity, eager to learn and explore. Knowing is itself a transformative experience. Human beings encounter many forms of pleasure, yet these are merely transient comforts (sukhanubhavalu). The pursuit and realization of knowledge (jnananubhavam) is the only true enduring joy.

The Taittiriya Upanishad distinguishes between these two states as human joy (manushananda) and transcendent joy (divyananda). It describes the worldly contentment of a strong, prosperous, and healthy youth as human joy. Yet it affirms that the joy of knowledge is infinitely higher—a transcendent state that frees the individual from limited personal horizons to embrace new frontiers of consciousness.

My first dream is that everyone’s educational journey becomes such a fresh vision of the world. New ideas and aspirations should pour in from every horizon. Learners should gain new perceptive faculties and new wings, looking upon their familiar world with fresh eyes, and using their hands to reshape that world for fellow human beings, flora, and fauna alike.

My second dream is that every child’s learning journey should not only be filled with wonder, but also nurtured by patient parents and teachers who keep the flame of that curiosity burning bright.

True learning requires patience, endurance, and a receptive environment. Just as we tend a garden for flowers to blossom, we must cultivate a school. This is my third dream: schools that exist as living plays of discovery (khela) nestled in the lap of nature.

That every school should become such a warm, sheltering sparrow’s nest is a dream I refuse to surrender. Great educators like Leo Tolstoy, Jean-Jacques Rousseau, and Rabindranath Tagore reminded us that this ideal transcends geography and time.

In their writings, each illuminated vital facets of what enriches a school. Only when these diverse dimensions unite does complete, integrated education emerge. Mahatma Gandhi gave us a vivid blueprint of such holistic learning:

Only through such an earnest quest for truth and the generous imparting of knowledge can humanity progress, making our lives and our world more compassionate. Though these are lofty dreams, I have striven to translate them into practice wherever I served, and in that endeavor, I found deep fulfillment. Looking back today upon the moments when I truly lived—the moments etched most brightly in memory—I can say without hesitation that they were the moments when these dreams took root in living reality.

15-8-2026

6 Replies to “కొన్ని కలలు కొన్ని మెలకువలు-36”

  1. ప్రతి పాఠశాలా అటువంటి పిచ్చికగూడు కావాలన్నది నా అందమైన, ఎన్నటికీ వీగిపోవడానికి ఇచ్చగించని కల.

    అపురూపమైన కలలు.

  2. మీ విద్యార్జనానుభవం , మీ విద్యారంగ ఉద్యోగానుభవం వీటికి తోడు మీరు సముపార్జించిన జ్ఞానానుభవం త్రివేణీసంగమమై కొనసాగుతున్నది మీ రచన. అమూల్యమైన ఈ గ్రంథం విద్యాశిక్షణ కేంద్రాల్లో అందుబాటులో ఉంచవలసినది . మీలోని కృషీకృత ఋషికి నమస్సులు.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading