కొన్ని కలలు కొన్ని మెలకువలు-34

వారికి నా నమస్సులు, వారికి నా స్వాగతం

ఈ అనుభవాల్ని ఇక్కడితో ముగించాలనుకుంటున్నాను. కానీ ఇది నా కలలకి ముగింపు కాదు. నిజమైన అభ్యాసి జీవితకాల సాధకుడు అనే మాట నిజమైతే నా సాధన కూడా జీవితకాలం పాటు కొనసాగేదనే నేను కూడా నమ్ముతున్నాను.

ముఖ్యంగా 1987 నుంచి 97 దాకా పదేళ్ల పాటు గిరిజన విద్యారంగంలో వివిధ భూముల్లో చేపట్టిన వివిధ ప్రయోగాల గురించి ఇప్పటిదాకా వివరించాను. కాని, ఈ పుస్తకాన్ని నేను ‘సార్వత్రిక విద్యతో నా అనుభవాలు’ అనే అన్నాను గాని ‘గిరిజన విద్యతో నా అనుభవాలు’ అనలేదు, ఎందుకని?

అందుకు రెండు కారణాలు. మొదటిది, నేను చేపట్టిన ప్రయత్నాలు గిరిజన విద్యావిధానంలో గిరిజనుల్ని ముందుకు తీసుకువెళ్లడానికి కాదు. మార్గరెట్ మీడ్ చెప్పినట్టుగా గిరిజనులకి కూడా తమదైన సామాజిక – సామూహిక బోధనాభ్యసన ప్రక్రియ ఉండి ఉండవచ్చు. అది పాఠశాలలతో నిమిత్తం లేకుండా వర్ధిల్లుతూండినది కావచ్చు. నేను ప్రోత్సహించింది దాన్ని కాదు.

నేను చేసింది గిరిజనులకు అధునికవిద్య అందే క్రమాన్ని సరిదిద్దడం, ఆ ప్రక్రియలో గిరిజన సమాజాలూ, బాలబాలికలూ మనఃపూర్వకంగా పాల్గొనేలా చేయడం, అటువంటి అధునిక విద్య ఇప్పుడున్నదానికన్నా మరింత ప్రయోజనకరంగా ఉండగలదేమో చూడటం. అలా చూసినట్టయితే, నా కార్యక్షేత్రం గిరిజన ప్రాంతమయినప్పటికీ, నేను పనిచేసింది సార్వత్రిక విద్యకోసమే అని చెప్పవలసి ఉంటుంది.

రెండవది, అందరూ విద్యావంతులు కావాలంటే అది కేవలం పట్టణ ప్రాంతాల్లోని అధికాదాయవర్గాల పిల్లలూ, అగ్రవర్గాల, అగ్రవర్ణాల పిల్లలూ మాత్రమే విద్యావంతులయితే చాలదు. ఆధునిక విద్య పిలుపు అందుతున్నప్పటికీ, విద్యావంతులు కాలేకపోతున్న అనేక బలహీనవర్గాలూ, ఇంతదాకా అప్రధానీకరణకు గురవుతూ వస్తున్న వివిధ ప్రజాశ్రేణులూ, ప్రజాసమూహాలూ ఎందువల్ల అధునికవిద్యతో పూర్తికాలం కలిసినడవలేకపోతున్నారో నిశితంగా చూసుకోకపోతే, ఆ మార్గంలో మనం చేస్తూ వచ్చిన తప్పుల్ని సరిదిద్దుకోకపోతే, ‘అందరికీ విద్య’ కలగానే మిగిలిపోతుంది తప్ప, వాస్తవంగా ఎన్నటికీ మారదు.

అటువంటి కలని వాస్తవంగా మార్చడానికి వివిధ ప్రజాసమూహాలతో ఎందరో అద్భుతమైన కృషి చేస్తూ ఉన్నారు. పట్టణప్రాంతాల్లో మురికివాడల పిల్లల కోసం, బాలకార్మికుల కోసం, శారీరకంగా, మానసికంగా వికలాంగులైన వారికోసం, దళితుల కోసం, బాలికల కోసం చక్కని విద్యాకార్యక్రమాలు నడుపుతున్నవారెందరో ఉన్నారు. వారందరినీ మనం ఆయా ప్రత్యేకరంగాలో సార్వత్రిక విద్య కోసం కృషి చేస్తున్నవారిగానే అభివర్ణిస్తాం.

నేనుకూడా అటువంటి ప్రత్యేక రంగంలో సార్వత్రిక విద్యకు కృషి చేసానని భావిస్తున్నాను కాబట్టే ఇంతదాకా చెప్పుకున్న అనుభవాలన్నిటినీ సార్వత్రిక విద్యతో నా అనుభవాలుగానే పేర్కొన్నాను.

వారివారి రంగాల్లో విద్యావేత్తలు, ప్రణాళికావేత్తలు, ఉత్తమ ఉపాధ్యాయులు, సంస్కర్తలు, కార్యకర్తలు చేస్తున్న కృషి ముందు నా కృషి గొప్పదనీ, ప్రత్యేకించి చెప్పు కోవలసినదనీ నేను భావించడం లేదు. అంకితభావంలో, నిర్విరామ సేవాతత్పరతలో, పిల్లల ప్రపంచాన్ని ప్రేమించడంలో ఎందరో మహనీయుల్ని, ఎందరో స్వార్ధత్యాగుల్ని నేను నా కళ్లారా చూసాను. వారిలో కొందరు సుప్రతిష్ఠులు. కొందరి పేరు వారున్న వూళ్లోనే చాలామందికి తెలియకపోయి ఉండవచ్చు. కాని చిన్నారి బాలబాలికల్ని ఆధునికవిద్య ద్వారా మేల్కొల్పడంలో వారందరి కృషీ ఒక్కలాంటిదే, నిరూపమానమైందే.

నేను తాడికొండలో చదువుకుంటున్నప్పుడు మాకు పాఠాలు బోధించిన ప్రతి  ఉపాధ్యాయుడూ తన జీవితంలోని అత్యంత అమూల్యమైన ఉత్పాదక సమయాన్ని మా కోసం ధారపోసారు. వారు కేవలం తమ జీతభత్యాల కోసం ఆ పని చేసారని నేను భావించలేను. పిల్లలకు జ్ఞానాన్నీ, విలువల్నీ, ధర్మాల్నీ బోధించడం తమ జీవితంగా మారిపోయినందునే వారట్లా జీవించారని నేననుకుంటున్నాను.

అటువంటి ఉపాధ్యాయులకు, పాఠశాలలకు, విద్యావేత్తలకు నా నమస్సులు తెలియచేసుకోవడానికి కూడా ఈ పుస్తకం రాసాను. విద్య ద్వారా సమాజాన్ని ఆధునీకరిం చడం నిర్విరామసంగ్రామం అనుకుంటే, ఆ సంగ్రామంలో తమ జవసత్త్వాల్ని ధార పోసిన యోధులు వారు. వారిని స్మరించడమే, ఆ అనుభవాల్ని తలపోస్తూండటమే నిరంతర విద్య అనవచ్చు.

మా స్కూల్లో ప్రతాపరామన్ అని కెమిస్ట్రీ ఉపాధ్యాయులుండేవారు. ఒకరోజు ఆయన తెల్లని చొక్కా వేసుకొచ్చారు. ఆ చొక్కా చూసిన పిల్లవాడెవడో ఆయన మీద వెనకనుంచి ఇంకు జల్లాడు. దాన్ని కేవలం ఆకతాయిచర్య అనలేం. అందులో మానసిక వైకల్యానికి సంబంధించింది కూడా ఏదో ఉంది. ఆరోజు మా ప్రిన్సిపాల్ ఉగ్రనరసింహావతారమెత్తారు. పిల్లలందరినీ పెరేడ్ చేయించారు. చివరికి ఆ పనికి పాల్పడ్డ పిల్లవాణ్ణి గుర్తించారు. అతడిని ఆ ఉపాధ్యాయుడి ముందు నిలబెట్టి ‘మాష్టారూ, మీరు వీడికి ఏ శిక్ష విధించమంటే ఆ శిక్ష విధిస్తాను చెప్పండి’ అన్నారామె. కాని ఆ మాష్టారు అతడిని ఏమీ అనలేదు. ‘ఇంతమందిలో ఎత్తిచూపబడేలాంటి పనిచేయడమే పెద్దశిక్ష. వాడు దీనికి సిగ్గుపడితే చాలు’ అన్నారాయన.

మా తెలుగు మాష్టారు రాళ్లబండి కృష్ణమూర్తి నాకు ఏకపాత్రాభినయాల్లో తర్ఫీదు ఇవ్వడానికి తన తీరికగంటలన్నీ ఏళ్ల తరబడి ఖర్చుపెట్టారు. పాఠశాల పని గంటలు ముగిసిన తర్వాత కూడా ఆయన రాత్రి పదిపదకొండు గంటల దాకా నన్ను తీర్చిదిద్దడమే పనిగా ఉండేవారు. ఆ సమయంలో సాధారణంగా ఏ తల్లితండ్రులయినా తమ పిల్లల్ని చదివించుకోవాలనుకుంటారు. ఆ పిల్లలు పెరిగి పెద్దయి ప్రయోజకులయితే, వారు తమని వృద్ధాప్యంలో చూస్తారని ఆశ ఉండవచ్చు. నా మీద ఆయన వెచ్చించిన ఆ ఆమూల్య సమయానికి నేను తీర్చిన ఋణమేమిటి?

ఉత్నూరులో ఉండగా జరిగిన సంఘటనొకటి జ్ఞాపకమొస్తోంది. దేవాపూర్ సిమెంట్ ఫాక్టరీ సమీపంలో ఉండే బాబర్‌నగర్ ఆశ్రమపాఠశాల లోపలికి ఉండటంతో బస్ సౌకర్యం ఉండేది కాదు. ఎవరన్నా దేవాపూర్ ఫాక్టరీ దగ్గర బస్ దిగి దాదాపు అయిదారు కిలోమీటర్లు లోపలకి నడవవలసివచ్చేది. అందువల్ల ఆ పాఠశాల చాలాకాలం ఎవరి శ్రద్ధకీ నోచుకోక నిస్తేజంగా ఉండేది. ఆ రోజుల్లో మేం హాస్టళ్లలో, ఆశ్రమపాఠశాలల్లో స్కౌటు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామని చెప్పానుకదా. అందులో పనిచేసే వార్డెన్లకు, డిప్యూటీ వార్డెన్లకు స్కౌటు శిక్షణ ఇచ్చామని కూడా చెప్పాను కదా. ఆ విధంగా శిక్షణ పొందిన యువ ఉపాధ్యాయుడొకతన్ని అక్కడ డిప్యూటీ వార్డెన్‌గా నియమించాం.

అతడి పేరు లక్ష్మణ్. తొలితరం గిరిజన ఉపాధ్యాయుడు. బహుశా ఇరవై రెండేళ్ల వయసు ఉండవచ్చు. అతడిని అక్కడ నియమించాక ఆ పాఠశాలని మళ్లా సందర్శించాను. అతడు ఆ కొన్నినెలల్లోనే ఆ పాఠశాల రూపురేఖలు మార్చేసాడు. అక్కడొక అందమైన తోట పెంచాడు. ఆ పిల్లలతో దాన్నొక పిచికగూడుగా మార్చాడు.

నాకా పాఠశాల కన్నులపండువగా అనిపించింది. నేను అతన్ని అభినందించాను. ఆ పిల్లల్ని ఆశీర్వదించాను. తిరిగి వచ్చెయ్యబోతూండగా అతడు నా వెనకే సందేహంగా అడుగులు వేస్తున్నట్టు అనిపించింది. అతడు నాకేదో చెప్పుకోవాలనుకుంటున్నట్టుగా సంకేతమందింది నాకు. ఆగి ఏమిటన్నాను.

అతడన్నాడు కదా : ‘సార్, మీరు చెప్పినట్టే నేను ఆ ప్రాథమిక పాఠశాలని స్కౌటు శిబిరంగా పూలతోటగా తీర్చిదిద్దడానికి నా శాయశక్తులా పాటుపడుతున్నాను. అందులో నేను వళ్లుదాచుకున్నది లేదు. మీరు పాఠశాల గ్రామంలోనే నన్ను నివాసముండమన్నారని నేను ఈ గ్రామంలోనే కుటుంబంతో ఉంటున్నాను. ఇక్కడ కరెంటు లేదు. నాకు ఒక మగబిడ్డ. పదినెలలవాడు. రాత్రిపూట లైటులేకపోతే రాత్రంతా గుక్కపట్టి ఏడుస్తున్నాడు. మాకెవ్వరికీ రాత్రంతా నిద్ర ఉండటం లేదు. మళ్లా పొద్దున్నే నేను పిల్లల్ని లేపటానికి, ఫిజికల్ ఎక్సర్‌సైజులు చేయించడానికి స్కూలుకి నాల్గుగంటలకే వచ్చేస్తున్నాను. ఇది మా కుటుంబానికి చాలా ఇబ్బందిగా ఉంటోంది. మీరు అనుమతిస్తే నేను నా కుటుంబాన్ని ఈ గ్రామంలో కాక, అదిగో, ఆ కనబడే గ్రామంలో పెట్టుకుందామనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ కరెంటు ఉంది. ఆ గ్రామం ఇక్కడికి కిలోమీటర్‌లోపే ఉంటుంది’ అన్నాడు.

అతడి మాటలు విని నా హృదయం ద్రవించింది. పాఠశాలలున్న గ్రామాల్లో నివాసముండకుండా,  యాభై, వందామైళ్ల దూరం నుంచి పాఠశాలలకు వచ్చిపోతున్న   ఉపాధ్యాయులున్న సమాజంలోనే ఆ గిరిజన యువకుడి వంటి ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. దేశసరిహద్దుల్లో అప్రమత్తంగా నిలబడి నిన్నూ నన్నూ రక్షిస్తున్న సైనికులకీ,  అటువంటి ఉపాధ్యాయులకీ తేడా చూపడం కష్టం.

నేను పాడేరులో పనిచేస్తున్నప్పుడు చూసిన ఇద్దరు ఉపాధ్యాయులు కూడా నాకు గుర్తొస్తున్నారు. ఒకరు, అప్పట్లో అరకులోయ ఆశ్రమపాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తుండే బి.వి.సూర్యనారాయణ. ఏ సంస్ధ అయినా తన తలమానికంగా చెప్పుకోగలిగిన ఉద్యోగి అతడు.

మరొకరి పేరు అక్కారావు. ఆ రోజుల్లో ఆయన తాపర్తి ఆశ్రమపాఠశాలలో పనిచేసేవాడు. గంగరాజు మాడుగుల మండలంలోని లోతట్టు పాఠశాల అయిన నుర్మతిలో అతడు కొన్నాళ్ళు పనిచేసాడు. ఆ రోజుల్లో అక్కడికి బస్సు నడిచేది కాదు. దాదాపు ఇరవై కిలోమీటర్లు నడవవలసి వచ్చేది. అందువల్ల తన భార్యాపిల్లల్ని తన వెంట పెట్టుకుపోలేక వారినెక్కడో దిగువన ఉంచి, ఆ పాఠశాలలో తనొక్కడే రోజుల తరబడి గడిపేవాడు. ఎప్పుడో నెలకో, రెండునెలలకో ఒకసారి కుటుంబాన్ని చూసు కోవడానికి పోగలిగేవాడు. అలా అతడు నుర్మతిలోనే ఉండగా దిగువ అతని భార్య మరణించింది. ఆ వార్త అతనికి చేరేటప్పటికి వారం రోజులు పట్టింది ! కాని ఆ అనుభవాలు అతని నిబద్ధతనీ, పరిశుద్ధతనీ లేశ మాత్రం కూడా ప్రభావితం చేయలేదని కూడా చెప్పాలి.

ఇటువంటి అత్యుత్తమ ఉపాధ్యాయులకూ, పాఠశాలలకూ ఉదాహరణల్ని నేను బయట ప్రపంచంలో కూడా చాలా చూసాను. త్యాగనిరతిలో, పిల్లల్ని ప్రేమించడంలో నిజమైన ఉపాధ్యాయులెక్కడన్నా ఒక్కలానే ఉంటారు.

హైదరాబాదులో ‘వికాసవిద్యావనం’ నడుపుతున్న రామచంద్రరావుగారు, విజయవాడలో ఆ సంస్ధని నడుపుతున్న డా.హేమ, పరిమి అటువంటి ఉదాహరణలు. వారిని కలుసుకున్న రోజుల్ని తల్చుకుని నేనెంతో గర్విస్తాను.

పూర్వకాలపు సంచారగురువులకు నేటికాలపు ప్రతీక అని చెప్పదగ్గ శివరామ్ గురించి తలుచుకోవడంలో ఎంతో సంతోషముంది. నేను శ్రీశైలం ఉండగా ఆయన రెండు మూడు రోజులు నా దగ్గర ఉన్నారు. తక్కినవాళ్లు శిలని చూస్తే శిల్పి దానిలో శిల్పాన్ని చూస్తాడన్నట్టు, మట్టిముద్దల్లాంటి మనుషుల్లో దీపపు ప్రమిదల్ని చూడగలిగిన సహనం ఆయనిది.

తమచుట్టూ ఉన్న అంధకారాన్ని చీల్చి తక్కినవారికి దారి చూపడానికి దీపాల్లాగే వెలిగే పాఠశాలల్ని కూడా నేను ఎన్నిటినో చూసాను. నిజామాబాద్ జిల్లాలోని వర్నిలో జోగినుల పిల్లలగురించి సంస్కార్ సంస్ధ నడుపుతున్న ఆశ్రమ పాఠశాల అటువంటిది. ఆ పాఠశాలని చూసినప్పుడు నేనూ అటువంటి పాఠశాలని నడిపితే ఎంత బాగుణ్ణు అనిపించింది. ఒకప్ప్పుడు జోగినుల పిల్లల్ని తమ పాఠశాలలకు అనుమతించని గ్రామస్థులు ఇప్పుడు సంస్కార్ పాఠశాలలో జోగినుల పిల్లలతో సమానంగా చదువుకోవడానికి అడ్మిషన్లకోసం పోటీపడుతున్నారంటే ఆ పాఠశాల ఏమి సాధించిందో మనం అర్ధం చేసుకోవచ్చు. అటువంటి స్ఫూర్తినే వికారాబాద్‌లో ఎం.వి.ఫౌండేషన్ కార్యక్రమాల్ని చూసినప్పుడు కూడా కలిగింది.

మరొక అత్యుత్తమ పాఠశాలని నేను శ్రీకాకుళం జిల్లాలో సీతంపేట దగ్గర ఈతమాను వలసలో చూసాను. జనచేతన అనే స్వచ్ఛందసంస్ధ సవరలకోసం సవర మీడియంలో నడిపిన మొదటి పాఠశాల అది. గిరిజన ప్రాంతాల్లో ఆదివారానికి బదులు సంతరోజుని వారాంత సెలవుగా ప్రకటించి అమలుచేసిన మొదటి పాఠశాల అది. నేనా పాఠశాలను ఆదివారం నాడు చూసాను. మామూలు పాఠశాలలకు వారాంతసెలవు నాడు ఆ పాఠశాలలో నేను చూసిన పనితీరు తక్కినచోట్ల మామూలు రోజుల్లో కూడా కనరాదు.

జనవిజ్ఞానవేదిక, హైదరాబాద్‌వారు పిల్లలకోసం సాహిత్యాన్ని పిల్లలతో రచింపచేసి ప్రపంచం ముందుకు తెచ్చిన ప్రయోగం కూడా అటువంటిదే. నాకు తెలిసి ఇటువంటి అత్యున్నత స్ధాయి ప్రయోగాన్ని తన అత్యుచ్చదశలో సోవియెట్ రష్యా కూడా చేపట్టి ఉండేలేదు. పిల్లల్ని ప్రేమించడంలో సంతోషానికి అలవాటు పడ్డవాళ్లు మాత్రమే ఇటువంటి కలలు కనగలరు. నిజం చేసుకోగలరు.

ఉపాధ్యాయులు, పాఠశాలలే కాక అధికారుల్లో కూడా మహనీయుల్ని నేను అడుగడుగునా చూసాను. వారిలో ముఖ్యంగా చెప్పవలసినది వి.ఎం.మనోహర ప్రసాద్‌గారిని. రంపచోడవరం సమగ్రగిరిజనాభివృద్ధి సంస్ధ ప్రాజెక్టు అధికారిగా ఆయన చేసింది అపూర్వకృషి. ఇప్పటికీ ఇంకా ఆచరణకు నోచుకోని ఎన్నో ప్రతి పాదనల్ని అందరికన్నా ముందుగా కార్యరూపంలో పెట్టింది ఆయనే. ఏ హోదాలో ఉన్నా గిరిజనుల్ని తనవాళ్లుగా హృదయానికి హత్తుకున్న నిజమైన గిరిజన ప్రేమి ఆయన.

నేను ప్రస్తావిస్తున్న సమస్యలు ప్రధానంగా గ్రామీణప్రాంతాల, గిరిజన ప్రాంతాల సమస్యలే అయినప్పటికీ, ఆ సమస్యలు పట్టణప్రాంతాలకు లేవనిగానీ, మధ్యతరగతి వాటినుంచి తప్పించుకోగలిగిందనీ అర్ధం కానేకాదు. గిరిజనబాల బాలికలకి ఆధునిక విద్య ఎంత సమస్యో పట్టణప్రాంతాల్లోని మధ్యతరగతికి కూడా అంతే సమస్య. పట్టణ ప్రాంత విద్యలో నా అనుభవాలు స్వల్పమే అయినప్పటికీ, ఈ అనుభవాల నుంచి నేను నేర్చుకున్న పాఠాల నుంచి వారికి ఉపయోగించేది కూడా కొంత లేకపోలేదు. దాన్ని తమ కార్యక్షేత్రానికి అనువర్తింప చేసుకోగలిగినవారికి అది బోధపడుతుంది.

సార్వత్రిక విద్యకోసం సమాయత్తమై వివిధ ప్రయోగాలు చేపడుతున్నవారిలో ప్రజాసంఘాలు కూడా ఉన్నాయి. హట్టగూడ ఉదాహరణను నేనింతకుముందే చెప్పాను. మరొక మేలిమి ఉదాహరణ ఆదిలాబాద్ జిల్లాలో జిల్లారాజ్‌గోండ్ సేవా సమితి సిర్పూర్(యు) మండలంలో మహాగావ్‌లో నడుపుతున్న పాఠశాల.

గిరిజన సాంస్కృతిక నిర్మాతల్లో ఒకరైన సంత్‌సురోయాజీమహరాజ్ పేరిట ప్రారంభించిన ఆ పాఠశాల దేశంలోనే ప్రజాసంఘం నడుపుకుంటున్న మొదటి ఆదివాసి పాఠశాలగా అభివర్ణించవచ్చు. గోండు రాజవంశానికి చెందిన కంచన్‌పల్లి రాజా ఆత్రం భగవంతరావు ఆ పాఠశాలను ఎంత పదిలంగా చూసుకునేవారో నేనెరుగుదును. అటువంటి మరొక పాఠశాలని వారు గోండీ మీడియంలో అసిఫాబాద్‌లో ప్రారంభించింది కూడా చూసాన్నేను.

సార్వత్రిక విద్యను తమ హృదయాలకు హత్తుకున్న సాధువులు, సత్పురుషులు, కవులు, రచయితలు  నాకు నిత్యస్ఫూర్తి. మదనపల్లిలో ఋషీవేలీలో గిరిజన ఉపాధ్యాయులతో సమావేశమైనప్పుడు నాకు జిడ్డుకృష్ణమూర్తి హృదయవైశాల్యం మరొకసారి బోధపడింది. ఎక్కడి పాడేరు? ఎక్కడి కృష్ణమూర్తి? ఆయన విద్యాదర్శాల మహిమ అటువంటిది. పిల్లల పట్ల ఆయన ప్రేమ అటువంటిది.

అటువంటి అనుభూతికే నేనొకమారు అదిలాబాద్‌లో కూడా లోనయ్యాను. అక్కడి అడవుల్లో కుంతాల జలపాతానికి చేరువలో కొరటికల్ అనే ఆశ్రమపాఠశాల ఉంది. అది మారుమూల పాఠశాల. నేనా పాఠశాలని సందర్శించినప్పుడు అక్కడి చిన్నారి గోండు బాలబాలికలు ‘దేశమును ప్రేమించుమన్నా’ గీతాన్ని ఆలపించారు. ఆ పాటవింటూనే నేను వివశుణ్ణయ్యాను. ఎక్కడి గురజాడ? ఎక్కడి కొరటికల్? ఉదారచరితులకు వసుధ ఏక కుటుంబమన్నమాట మరొకసారి రుజువయ్యింది.

నానక్ ఎలా ఉండేవాడో, కబీర్ ఎలా ఉండేవాడో మనకొక సజీవసాక్ష్యంగా నేడు ఆదిలాబాద్ గిరిజన ప్రాంతాల్ని పునీతం చేస్తున్న ఫూలాజీబాబాని ఎందరు ఎన్ని కోరికలు కోరి ఉంటారో. జీవితంలో ఎవర్నీ ఏదీ అడిగి ఉండని ఆ స్వార్ధత్యాగి నన్ను మాత్రం తన గ్రామంలో ఆశ్రమపాఠశాల తెరవమని కోరాడు. ఆయన కోరిక మేరకు పట్నాపూర్లో ఆశ్రమ పాఠశాల తెరిచాం. భగవంతుడి వార్తాహరుడెవరైనా ఈ లోకంలో ఎవరినుంచన్నా ఏదన్నా యాచిస్తే పాఠశాలని మాత్రమే అభ్యర్ధిస్తాడన డానికి అది చక్కని నిరూపణ.

సార్వత్రిక విద్యా ఉద్యమంలో సమాజమే అందరికన్నా పెద్ద భాగస్వామి అనడానికి అసంఖ్యాకమైన జ్ఞాపకాలున్నాయి. ఈసమయంలో మూడు ఉదాహరణలు గుర్తొస్తున్నాయి. మొదటిది, పాడేరులో అత్యంత బీదపొరజా గ్రామం నడుపుకుంటున్న మాబడికి చెందిన అనుభవం. అప్పటికింకా ప్రభుత్వం మధ్యాహ్నభోజనం పేరిట బియ్యం మాత్రమే ఇస్తోంది గాని, అన్నం వండిపెట్టడానికి అదనపుసాయాన్నివ్వడం లేదు.

అయినా ఆ గ్రామం మధ్యాహ్నభోజనమిస్తోందని విని అక్కడకి వెళ్లాను. వారేమి చేస్తున్నారో చూద్దామని. తీరా చూస్తే అక్కడ ఆ బీద గిరిజనులు తమ పిల్లలకు ప్రభుత్వమిచ్చిన బియ్యాన్ని ఉడకబెట్టి గంజి చేసి ఆ గంజినే వడ్డిస్తున్నారు! సంకల్పముంటే దేన్నన్నా సాధించవచ్చనడానికి ఆ పొరజా గ్రామాన్ని మించిన ఉదాహరణని నేనింతదాకా చూడలేదు.

మరొక ఉదాహరణ, రంపచోడవరం దగ్గర చూసిన అనుభవం. మేం గిరిజన ప్రాంతాల్లో మధ్యాహ్న భోజనపథకాన్ని ప్రారంభించాలనుకున్నప్పుడు పిల్లలకి ఎవరు అన్నం వండిపెడతారన్న ప్రశ్న ఎదరయ్యింది. దానికి డా.రమేష్‌గారు ఆ పిల్లల తల్లుల్నే వంతులవారీ వండిపెట్టమని అడుగుదామన్నారు. చాలామంది ఆ ప్రతిపాదన ఆచరణాత్మకం కాదన్నారు. అటువంటి రోజుల్లో పందిరిమామిడి గ్రామంలో మధ్యాహ్నభోజన పథకం నడుస్తోందని విన్నప్పుడు ఆ గ్రామానికి వెళ్లాను. అక్కడొక తల్లిని ఆ పథకాన్ని ఎలా అమలుచేస్తున్నారని ప్రశ్నించాను. దానికామె, గ్రామంలోని ప్రతి తల్లీ తన పిల్ల లేదా పిల్లవాడి పేరిట నెలకొకరోజు అన్నం వండిపెడుతోందని చెప్పింది.

‘నువ్వు కూడా నీవంతుగా వండి వడ్డిస్తున్నావా’ అని అడిగాను.

‘అవును, నెలకు రెండుసార్లు’ అంది ఆ తల్లి.

‘రెండుసార్లెందుకు?’ అని అడిగాను.

‘నాకిద్దరు పిల్లలు, వాళ్లిద్దరూ ఆ బడికే వెళ్తున్నారు’ అందామె!

మరొక ఉత్తేజకరమైన అనుభవం కూడా రంపచోడవరంలోనే. మేం ఐఫాడ్ సహాయంతో విద్యాప్రణాళికను అమలుచేస్తున్నప్పుడు దానిలో భాగంగా కళాజాతలు కూడా చేపట్టవలసి ఉంది. అప్పుడక్కడ ప్రాజెక్టు అధికారిగా ఉన్న జయేష్‌రంజన్ ఆ పనిని యువకుల బృందాలకు కాక, పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్ధుల బృందాలకే అప్పగించాడు. నా మిత్రుడూ, గురువూ, మహోన్నత కళాకారుడూ అయినా టి.జె.రామనాథం ఆ బృందాలకు శిక్షణ ఇచ్చాడు. ఆ పిల్లలు పగలు బళ్లో చదువుకుంటూ రాత్రుళ్లు గ్రామగ్రామానా ‘చదువు కొత్తలు’ చేసి బడిమానేసిన తమ నేస్తాల్ని వెతికి పట్టుకుని బడి గురించి చెప్పి తీసుకొచ్చారు.

‘ఈ పని మీరు చేస్తే బాగుంటుందా? పెద్దవాళ్లు చేసే బాగుంటుందా?’ అని అడిగాను వాళ్లని.

‘మా నేస్తాల్ని మేం పిలిస్తేనే బడిబాగుందని నమ్ముతారు. బళ్లో చదువుకోని వాళ్లు వెళ్లి పాటలు పాడితే వాళ్లకి నమ్మకమేముంటుంది?’ అన్నారు ఆ పసిపిల్లలు.

ఆ ఉపాధ్యాయులకు, ఆ పాఠశాలలకు, ఆ ప్రణాళికవేత్తలకు, ఆ ప్రజా సమూహాలకు, ఆ తల్లులకు నా నమస్సులు.

మీరు విద్యార్ధి కావచ్చు. ఉపాధ్యాయులు కావచ్చు. తల్లిదండ్రులు కావచ్చు. విద్యావేత్తలు కావచ్చు. ప్రణాళికల రూపకర్తలు కావచ్చు. మీరెవరన్నాగానీ మీకు విద్యమీద ఉన్న ప్రేమకీ, విద్యని సార్వత్రికం చేయాలన్న మీ తలపుకీ బాసటగా నిలిచే పుస్తకమిదని నమ్మకంగా చెప్పగలను. మీరున్నచోటునుంచే, మీరు సామాజికంగా నిర్వహించే పాత్ర ఎంత చిన్నదయినా కానివ్వండి. మీ ప్రతి ఒక్కరి చేయూతతోనే అసంఖ్యాక ప్రజాసమూహాలు వెలుగులోకి ప్రయాణించగలవని నమ్మండి.

అది విద్యాశాఖాధికారి కానివ్వండి. యూనివెర్సిటీ ప్రొఫెసర్ కానివ్వండి. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కానివ్వండి. దేశీయవిద్యావేత్త కానివ్వండి.  విదేశీమానవతావాది కానివ్వండి. ప్రజాసంఘం కానివ్వండి. ప్రభుత్వం కానివ్వండి. స్వచ్ఛందసంస్ధ కానివ్వండి.  అంతర్జాతీయ అభివృద్ధిసంస్ధ కానివ్వండి.  ప్రతి ఒక్కరూ మనఃపూర్వకంగా సంకల్పించినట్టయితే, అందరూ కలిసి కట్టుగా పనిచేసినట్టయితే విద్య ఏ కొద్దిమందికో అమృతాన్ని పంచి తక్కినవారికి ఒట్టి చేతులు చూపే మోహినీమాయ కాదని రుజువు చేయగలుగుతాం.

మన మన వ్యక్తిగత దర్శనాలు విద్య పట్ల మనకి కలిగిస్తున్న కలల్ని, మన మన వ్యక్తిగత అనుభవాలు మనకి కలిగిస్తూ వచ్చిన మెలకువల్ని మనమొకరితో ఒకరం పంచుకుంటే ఇప్పుడున్నదానికన్నా మరింతబలపడతాం. మనం జీవిస్తున్న సమాజాన్నీ, ప్రపంచాన్నీ మరింత బలపర్చుకోగలుగుతాం. ఆ ఆశతో, ఆ శుభాకాంక్షల్తో నా ఈ అనుభవాల్ని మీ అందరితో ఇలా పంచుకుంటున్నాను.

ఈ కృషిలో చేయిచేయి కలపడానికి ఎవరెవరు ముందుకొస్తారో వారెల్లరికీ నా స్వాగతం.


My Gratitude, My Welcome

I wish to bring these reflections to a close here, but this is by no means the end of my dreams. If it is true that a genuine learner is a lifelong seeker, then my own pursuit, too, will continue for a lifetime.

Thus far, I have recounted the diverse experiments undertaken across different terrains within the tribal education sector over a decade, specifically from 1987 to 1997. Yet, why did I title this book My Experiments with Universal Education rather than My Experiments with Tribal Education?

There are two reasons. First, the efforts I undertook were not intended simply to advance tribal communities within a predefined tribal education framework. As Margaret Mead observed, indigenous communities possess their own vibrant socio-communal learning processes that flourish entirely independent of formal schooling. That was not what I sought to alter or promote.

Instead, my endeavor was to correct the way modern education reaches Scheduled Tribe communities, ensuring that tribal societies and their children participate wholeheartedly in that process, and exploring how modern education might be rendered far more meaningful than it currently is. Viewed in that light, although my immediate field of work was the tribal agency, the labor itself was dedicated entirely to universal education.

Second, true universal literacy requires that education reach far beyond the children of urban high-income brackets or upper-caste elites. If we fail to examine why numerous marginalized groups and vulnerable sections—who hear the promise of modern education yet remain excluded—are unable to sustain their journey through school, and if we fail to correct the structural errors we have made along the way, “Education for All” will remain an empty dream rather than a living reality.

Many dedicated individuals are working alongside diverse communities to turn that dream into reality. Across our cities and towns, countless people run exceptional educational programs for slum children, child laborers, persons with physical and intellectual disabilities, Dalits, and girls. We rightly recognize all of them as champions of universal education within their respective spheres.

Because I believe my own labor belonged to this very mission within a specific domain, I have framed all the experiences shared in this book as my experiences with universal education.

I do not consider my own work greater or more worthy of special note than the quiet labor of educationists, planners, dedicated teachers, reformers, and grassroots workers in their respective fields. With my own eyes, I have witnessed countless noble, selfless individuals whose dedication, tireless service, and profound love for the world of children run deep. Some are renowned figures; others remain unknown even within their own villages. Yet in awakening young minds through modern education, their contributions are all of one piece—unmatched and sacred.

When I was a student in Tadikonda, every teacher who instructed us poured the most precious, creative years of their lives into our learning. I cannot believe they did so merely for a salary. They lived that way because imparting knowledge, moral values, and righteousness to children had become the very purpose of their lives.

I wrote this book, in part, to offer my deepest salutations to such teachers, schools, and educators. If modernizing society through education is a relentless struggle, they are the true warriors who poured their life’s vitality into that crusade. To remember them and to reflect upon those shared experiences is, in itself, a form of continuous learning.

In our school, we had a chemistry teacher named Prataparaman. One day, he came to class wearing a crisp white shirt. Seeing that shirt, a student poured ink on him from behind. We cannot dismiss that merely as a schoolboy prank; there was something profoundly disturbed about it. That day, our Principal assumed the fierce form of Narasimha (Ugra Narasimhavataram), marching all the students in parade until the guilty boy was identified. Making the boy stand before the teacher, the Principal declared, “Master, tell me what punishment to give him, and I will execute it.” Yet the teacher refused to punish him. “To be singled out before everyone for such an act is punishment enough,” he said quietly. “It is enough if he feels genuine remorse.”

Our Telugu teacher, Rallabandi Krishnamurthy, spent his every leisure hour over years training me in mono-acting (ekapatrabhinayam). Long after school hours ended, he would coach me late into the night, often until ten or eleven o’clock. At an hour when any parent would naturally want their own children to study, hoping they would grow up and support them in old age, he poured himself into me. What debt have I ever repaid for the precious time he gifted me?

I am reminded of an incident that took place during my time in Utnoor. The Babarnagar Ashram School, located near the Devapur Cement Factory, sat deep in the interior with no bus connectivity. Anyone visiting had to disembark near the Devapur factory and walk five or six kilometers inland. Consequently, the school had languished in neglect for years, devoid of vitality.

Around that time, as I mentioned earlier, we introduced Scout programs across all residential hostels and Ashram Schools, providing formal Scout training to wardens and deputy wardens. Among them was a young, first-generation Scheduled Tribe teacher named Laxman—hardly twenty-two years old—whom we posted as Deputy Warden at Babarnagar.

Visiting the school a few months after his arrival, I found it transformed. Within that brief span, Laxman had created a beautiful garden, turning the remote schoolyard into a warm, inviting sanctuary for the children.

The transformation was a joy to behold. I commended his initiative and blessed the students. As I turned to leave, I felt him stepping hesitantly behind me, signaling that he had something to share. I paused and asked what was on his mind.

He spoke quietly:

“Sir, true to your guidance, I have poured every ounce of energy into developing this primary school into an active Scout camp and a flower garden. I have held nothing back. Because you instructed us to reside in the same village as the school, I live here with my family. However, there is no electricity in this hamlet. I have a ten-month-old infant son. Without light at night, he cries inconsolably, and none of us get any sleep. Yet, by four in the morning, I must be at the school to wake the children and lead physical exercises. It has become very difficult for my family. If you permit, I would like to move my family to that neighboring village visible over there—it has electricity, and it is less than a kilometer away.”

Hearing his humble request, my heart melted. In a society where many teachers commute long distances from urban centers rather than live in the villages they serve, there are also devoted young Scheduled Tribe educators like Laxman. It is hard to draw a line between soldiers standing vigil at our national borders to keep us safe and teachers like him guarding the minds of our children.

I am also reminded of two exceptional teachers from my tenure in Paderu. The first was B.V. Suryanarayana, then serving as Headmaster of the Araku Valley Ashram School—an educator any institution would proudly claim as its crown jewel.

The second was Akka Rao, who worked at the Tataparthi Ashram School after serving for years in Nurmathi, an interior hamlet in the Gangaraju Madugula mandal. In those days, no buses reached Nurmathi; one had to trek nearly twenty kilometers on foot. Unable to bring his wife and young children along, Akka Rao left them in the plains below and lived alone at the school for months at a time, visiting his family only once every month or two. While he was posted in Nurmathi, his wife passed away in the plains below, and the tragic news took an entire week to reach him in that remote interior. Yet even that unimaginable grief never dimmed his professional purity or his commitment to his students.

I have witnessed numerous examples of such inspiring teachers and schools in the wider world as well. True educators are identical everywhere in their capacity for selflessness and their love for children.

Ramachandra Rao, running Vikasa Vidyavanam in Hyderabad, as well as Dr. Hema and Parimi, managing the same institution in Vijayawada, stand out as shining examples. I recall the days I spent with them with immense pride.

It also brings me great joy to recall Sivaram, a modern-day embodiment of the ancient Sanchara Gurus (wandering teachers). During my posting at Srisailam, he stayed with me for a few days. Where others see an unshaped block of stone, a sculptor envisions the hidden statue within; Sivaram possessed that rare, quiet patience, seeing the promise of bright oil lamps (prameedalu) in unformed lumps of clay.

I have also seen schools that burn like solitary lamps in the dark, cutting through ambient ignorance to illuminate the path for others. The residential school run by the Samskar organization in Varni, Nizamabad district, for the children of Joginis is one such beacon. Visiting that campus made me yearn to run such a school myself.

Villagers who once barred Jogini children from local classrooms now compete for admission into the Samskar school alongside them—a testament to what dedicated education can accomplish. I felt that same transformative inspiration when observing the pioneering field work of the MV Foundation in Vikarabad.

I encountered another remarkable school in Eetamanuvalasa near Seethampeta, in Srikakulam district. Established by a voluntary organization called Janachetana, it was the first school to deliver primary instruction in the Savara language for Savara children. It was also the first in the agency tracts to designate the weekly market day (shandy) as the official weekly holiday instead of Sunday. I visited the campus on a Sunday; the academic vigor and joyful discipline I witnessed there on a designated holiday surpassed what one finds on routine working days elsewhere.

The experiment undertaken by Jana Vignana Vedika in Hyderabad—publishing literature written by children themselves—was another landmark endeavor. To my knowledge, even the Soviet Union at its peak had not attempted an exercise of such pedagogical depth. Only those who have known the profound joy of loving children can dare to dream such dreams, and bring them to life.

Beyond teachers and schools, I encountered noble individuals at every level of administration. Prominent among them was V.M. Manohara Prasad. As Project Officer of the Rampachodavaram ITDA, his contributions were pioneering. He was the first to operationalize complex field proposals that others hesitated to attempt. Whatever his official designation, he remained a true lover of Scheduled Tribes, embracing Adivasi communities as his own.

While the challenges I have detailed belong primarily to rural and agency tracts, it would be a mistake to assume that urban spaces or middle-class families are exempt from them. Accessing meaningful, humanistic education poses as much of a challenge for urban middle-class families as it does for Scheduled Tribe children. Though my direct experience with urban schooling is modest, the core lessons drawn from these field experiments hold universal value for anyone seeking to adapt them.

Mass community organizations (praja sanghams) have also played a vital role in advancing universal education. I have already cited the work at Hattaguda. Another shining example is the school managed by the Zilla Raj Gond Seva Samithi at Mahagao in the Sirpur (U) mandal of Adilabad district.

Established in memory of Sant Suroyaji Maharaj—a revered cultural builder of Adivasi society—it stands as the first community-run Adivasi school in the country. I saw firsthand how tenderly Kanchanpally Raja Atram Bhagavanth Rao, of the Gond royal lineage, nurtured that institution, and how the Samithi later established another Gondi-medium school in Asifabad.

Sages, spiritual leaders, poets, and writers who embraced universal education have been my enduring source of inspiration. Meeting Scheduled Tribe teachers in Rishi Valley reaffirmed for me the vastness of Jiddu Krishnamurti’s vision. Where is Paderu, and where was Krishnamurti? Such was the power of his educational ideal, and his love for children.

I experienced that same transcendence in Adilabad. Deep in the forest near Kuntala waterfalls sits a remote Ashram School at Koratikal. When I visited, young Gond children welcomed us by singing Gurajada Apparao’s classic Telugu poem, “Desamunu Preminchumanna” (Love the Nation, My Brother). Hearing their voices echo through the forest, I was spellbound. Where was Gurajada’s coastal birthplace, and where was this remote Gond hamlet? It proved once again that for broad-minded souls, the entire world is one family (Vasudhaika Kutumbam).

Phulaji Baba—who purifies the Adilabad agency tracts as a living embodiment of Sant Nanak and Kabir—is revered by thousands. Yet that selfless saint, who never asked anyone for anything, asked me for only one thing: to open an Ashram School in his village. True to his wish, we established a school at Patnapur—a moving testament that if a messenger of the Divine ever asks for alms, he asks only for a school.

Countless memories reinforce the truth that society itself is the ultimate partner in universalizing education. Three instances stand out vividly:

The first belongs to a Maa Badi center run by a impoverished Porja village in Paderu. At the time, the government supplied raw rice under the nutrition program but provided no operational funds for cooking. Hearing that the village was nevertheless serving hot lunches, I visited to see how they managed. I discovered that those poor Adivasi families were boiling the government rice to prepare a thick rice gruel (ganji), serving it daily to keep their children nourished at school. I have never seen a more powerful testament to what community resolve can achieve.

The second instance took place near Rampachodavaram. When planning the midday meal scheme, administrators debated who would cook for the children. Dr. P.V. Ramesh suggested asking mothers to take turns, but critics dismissed the idea as impractical. Hearing that the model was functioning in Pandirimamidi village, I visited and asked a mother how they sustained it. She explained that every mother cooked one day a month for each child she had in school.

I asked her, “Are you also cooking for the school?”

“Yes, twice a month,” she replied.

“Why twice?”

“Because I have two children, and both attend this school!” she said proudly.

A third inspiring moment occurred in Rampachodavaram during the IFAD project rollout. As part of our community mobilization efforts, we planned mobile street theater campaigns (Kala Jathas). Jayesh Ranjan, then serving as ITDA Project Officer, entrusted these performances not to adult troupes, but to teams of school children. My friend and mentor, the master artist T.J. Ramanatham, trained the young performers. By day, these children studied in class; by night, they traveled from hamlet to hamlet performing Chaduvu Kothalu (The Harvest of Learning), seeking out dropped-out peers and persuading them to return to school.

I asked the children, “Is it better that you do this work, or that adults do it?”

The children replied simply, “Our friends will believe the school is good only if we call them. If people who don’t attend school sing about it, why would anyone believe them?”

My deepest salutations go to those teachers, those schools, those planners, those community groups, and those mothers.

Whether you are a student, a teacher, a parent, an educator, or a policy planner—whoever you may be—I present this book as an abiding support for your love of learning and your commitment to universalizing education. Whatever your role in society, however modest it may seem, believe that the journey toward light for countless communities depends on your helping hand.

Whether one is an administrative officer, a university professor, a primary school teacher, a national educationist, a global humanitarian, a mass organization, a government department, a non-governmental organization, or an international development agency—if we unite with genuine resolve, we can prove that education is not an illusion (Mohini Maya) that offers the nectar of immortality (Amrutham) to a privileged few while leaving the rest empty-handed.

When we share the dreams born of our personal visions and the awakenings forged through our field experiences, we strengthen one another. In doing so, we build a stronger society and a more just world. It is with this hope, and these best wishes, that I share these reflections with you all.

To everyone who steps forward to join hands in this noble endeavor, I offer my warmest welcome.

13-8-2026

3 Replies to “కొన్ని కలలు కొన్ని మెలకువలు-34”

  1. త్యాగనిరతిలో, పిల్లల్ని ప్రేమించడంలో నిజమైన ఉపాధ్యాయులెక్కడన్నా ఒక్కలానే ఉంటారు.

    సార్వత్రిక విద్య.గురించి మీరు కన్న కలలు, కలిగిన మెలకువలు…
    ఆ అనుభవసారమంతా తెలుసుకోవటం, మళ్ళీ చదవటం గొప్ప అనుభవం.

  2. భద్రుడు గారు, అనేక కారణాల వల్ల మీ ఈ “కొన్ని కలలు కొన్ని మెలకువలు” సిరీస్ లో గత ఇరవై భాగాలు చదవ లేక పోయాను. ఈ భాగం లో ముగింపు వాక్యాలు.. మీ తాడికొండ మాస్టార్లకు పలికిన నివాళులు… లక్ష్మణ్, అక్కారావ్ లాంటి గిరిజన పాఠశాలలలో పనిచేసిన ఉత్తమ ఉపాధ్యాయులు, మహనీయులుగా మీచేత ముద్ర వేయించుకున్న అధికారులను మీరు జ్ఞాపకం చేసుకుని వాళ్ళతో మీ అనుభవాలను మాకు ఎంతో హృద్యంగా తెలిపారు. మీరన్నట్టు త్యాగనిరతిలో, పిల్లల్ని ప్రేమించడంలో నిజమైన ఉపాధ్యాయులెక్కడన్నా ఒక్కలానే ఉంటారు. అంతే కాదు అటువంటి త్యాగశీలులు ఏ వృత్తిలో ఉన్నా ఒక లాగే వుంటారు. ఈ పుస్తకం వీలు దొరకగానే తప్పకుండా చదువుతాను.

  3. Sir, what an extraordinary journey this has been. 🙏🏽

    ఆధునిక విద్యను గిరిజన పిల్లలకు ఎలా అందించాలి? వారి సమాజాలనూ, వారి జీవన విధానాన్నీ, వారి అవసరాలనూ అర్థం చేసుకోకుండా వారికి విద్యను ఎలా అందించగలం? “అందరికీ విద్య” నిజంగా అందాలంటే, ఇప్పటివరకు విద్యతో పూర్తిగా కలిసినడవలేకపోతున్న వివిధ ప్రజాసమూహాలను ఆ విద్యతో ఎలా కలపాలి? ఈ ప్రశ్నలకు మీ అనుభవాల ద్వారా సమాధానాలను వెతుక్కుంటూ సాగిన ఒక గొప్ప పుస్తకం ఇది.

    గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన మీ అనుభవాల ద్వారా సార్వత్రిక విద్యకు సంబంధించి మీ కలలను, మీ అనుభవాల నుండి మీరు నేర్చుకున్న పాఠాలనూ, మీకు కలిగిన మెలకువలనూ మాతో పంచుకున్నారు.

    It has been enriching learning experience for us readers!!

    Thank you, Sir, for sharing this wonderful series and these invaluable experiences with us. 🙏🏽

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading