గురుప్రసాదరావుగారి  గురించి

చలంగారు అరుణాచలం వెళ్ళాక వెలువరించిన పుస్తకాల్లో ‘చలం మిత్రులు'(1977) చాలా ప్రత్యేకమైంది. ఒక విధంగా చెప్పాలంటే ఆయన చివరి పుస్తకం కూడానేమో. శ్రీ రమణస్థాన్ పబ్లికేషన్స్ పేరు మీద దాన్ని మిత్రుల సహకారంతో ఆ కుటుంబ సభ్యులే వెలువరించారు.

ఎప్పుడో నలభయ్యేళ్ళ కింద చదివిన ఆ పుస్తకం నాకు ఇన్నేళ్ళుగా మళ్ళా  దొరకలేదు. ఇప్పుడు గుంటూరు అన్నమయ్య గ్రంథాలయం వారి సౌజన్యంతో ఆ పుస్తకం మళ్ళా చదవగలిగాను. నూటముప్ఫై పేజీల ఆ పుస్తకంలో చలంగారు  తన బాల్య, యవ్వన దినాలనాటి మిత్రులు పధ్నాలుగు మంది గురించి రాసుకున్నారు.  అందులో తల్లాప్రగడ ప్రకాశరాయుడు వంటి గాంధీశిష్యుల్తో పాటు కృష్ణశాస్త్రి, ముద్దుకృష్ణ లాంటి భావకవితాయుగ ప్రవక్తలూ, సుబ్రహ్మణ్యదేవర వంటి సంగీతకారులూ కూడా ఉన్నారు. కానీ ఆ పుస్తకంలో కనిపించే చాలామంది సాహిత్యలోకానికి ఏ మాత్రం తెలియనివాళ్ళు. ఆంధ్రదేశ చరిత్రలో వారి గురించి కనీసం ఫుట్ నోట్సు కూడా ఎక్కడా చూడం మనం.

మనకి తెలిసినవాళ్ళు అనుకున్నవాళ్ళు కూడా ఆ పుస్తకంలో మనకు తెలియని ముఖచిత్రాల్తో కనిపిస్తారు. భారతదేశంలో హరీన్  ఛటో, కమలా ఛటోపాధ్యాయల గురించి తెలియనిదెవరికి? కాని ఇందులో కనిపించే హరీన్, కమలా- చలంగారు మాత్రమే చూడగలినవాళ్ళు. చివరికి మనకి తెలిసిన రఘుపతి వెంకట రత్నం నాయుడు గారు కూడా మనకి తెలియని కోణాల్లో పరిచయమవుతారు..

నిన్న రాత్రి కూచుని ఒక్కబిగిన ఆ పుస్తకం చదివేసేటప్పటికి నా మనసంతా చాలా తేటపడింది. ఇన్నేళ్ళుగా నా ఆలోచనల్లో చేరుకున్న మడ్డిని ఆ పుస్తకం ఇండుగపిక్కలాగా కిందకి నెట్టేసింది. దాంతో  ఒకప్పటి నా నిర్మల హృదయం నాకు ఎంతో కొంత తేటగా కనబడటం మొదలయ్యింది.

ఎందుకని? ఎందుకంటే, ఆ రచనల్లో సత్యసంధులైన మనుషుల పరిచయం ఉంది. లోకం తాలూకు ద్వంద్వ ప్రమాణాలకీ, ఆత్మవంచనకీ దూరంగా జీవించిన మనుషుల గురించిన జ్ఞాపకాలున్నాయి. ఒకవేళ, కృష్ణశాస్త్రిలాగా, తన మిత్రులు,  తమ తర్వాతి జీవితాల్లో లోకం మెప్పుకోసమో, డబ్బుకోసమో, తమనుంచి తాము దూరంగా జరుగుతున్నారని గుర్తుపట్టినప్పుడు కూడా చలంగారు వారి హృదయాల్లోన్ని నైర్మల్యాన్ని తాను మొదటిసారి ఎక్కడ చూసాడో ఆ తావుల్నే గుర్తుపెట్టుకుంటూ ఉన్నారు. కృష్ణశాస్త్రి విషయం మరీ ఆశ్చర్యం. తామిద్దరూ తెలుగు బ్రహ్మసమాజపు రోజుల్లో (1920-21) కృష్ణశాస్త్రి కీర్తనలు విని ఎంతగా పరవశించాడో చెప్తూనే, ఆ తర్వాత ఆయన సినిమా పాటలు తననెట్లా స్పందింపచెయ్యలేకపోయేవో కూడా చెప్తూనే, కాని 1970 ల్లో, సౌరిస్ ద్వారా తాను ఈశ్వరవాణి వినడం మొదలయ్యాక ఆ చిన్నప్పటి కృష్ణశాస్త్రి మళ్ళా చాలా కొత్తగా కనిపిస్తున్నాడని రాసుకున్నారు.  ‘అతని కవిత్వం, అతనూ-నేను అరుణాచలం వచ్చిన తరువాతే అర్ధమైనారు’ అని రాసారాయన.

చలంగారు తిరువణ్ణామలై వెళ్ళిన తరువాత రాసిన ఉత్తరాలూ, ‘మార్తా’ నవలా, ప్రపంచ ప్రసిద్ధ ఈశ్వరీయ సాహిత్యానికి ఆయన చేసిన అనుసృజనలూ, ‘బుజ్జిగాడు’  వంటివి చదివినప్పుడల్లా నా మనసుకి అపారమైన  ప్రశాంతి అనుభవంలోకి వస్తూ ఉంటుంది. గొప్ప యోగులు రాసుకున్న జర్నళ్ళో, డైరీలో, ఉత్తరాలో, సాధన తాలూకు అనుభవాలో చదువుతున్నప్పుడు నాలో ఎటువంటి ఒక జ్యోతిర్మయ జాగృతి అనుభవానికొస్తుందో, చలం గారి ఈ రచనలు చదివినా కూడా ఇలానే ఉంటుంది.

ఆయన తొలిజీవితపు రచనలూ ఉత్కృష్టమైనవే, సందేహం లేదు, ముఖ్యంగా ఆ అశాంతి , ఆ అసహనం, సమాజపు ద్వంద్వనీతి పట్ల అణచుకోలేని ఆ ఆగ్రహం మనల్ని ఎట్లా గుంజివేస్తాయో, మనలనెట్లా నిలవనివ్వకుండా చేస్తాయో మర్చిపోలేను. కాని ఆయన తర్వాత జీవితపు రచనల్లోని ఆ సహనం, ఆ ప్రశాంతి, తననుండి తాను వేరుపడి తనని తాను ఒకింత నిర్లిప్తంగా  చూసుకోగల ఆ మానసిక విముక్తీ కూడా నన్ను అంతే గాఢంగా ప్రభావితం చేసాయి.

ముఖ్యంగా చిన్నారావు అనే మిత్రుడికి రాసిన ఉత్తరాలు. మహాస్థాన్ పేరిట వచ్చిన ఆ ఉత్తరాలు నా రాజమండ్రిదినాల్లో నాకొక పారాయణ గ్రంథంగా ఉండేది . దానికి సంజీవదేవ్ గారు రాసిన అద్భుతమైన ముందుమాట కూడా. సంజీవ దేవ్ గారు నా బాల్యకాల మిత్రుడూ, చలంగారు నా యవ్వనదినాల మిత్రుడూనూ! వారిద్దరే లేకపోయుంటే, వారి రచనల ద్వారా నాలోకి ప్రవహించిన వారి వివేకస్రవంతి నాకు లభించకపోయి ఉంటే నేను లోకం దృష్టిలో ఏమోగాని, నా దృష్టిలోనేనొక నిర్భాగ్యుడిగానే మిగిలిపోయి ఉండేవాణ్ణి.

ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే- అరుణగారు వాళ్ళ నాన్నగారి స్మృతి సంచికగా వెలువరించిన ‘నేనూ చలం ‘(2026) పుస్తకం నాకు పంపించి మూడు నెలలపైనే గడిచిపోయాక, రెండు వారాల కిందట, ఆ పుస్తకం తెరిచాను. చలం ఫౌండేషన్,  విశాఖపట్టణంవారు ప్రచురించిన ఆ పుస్తకం ఈ మూడునాలుగు నెలలుగానూ నా బల్లమీద నాకు కనిపిస్తూనే ఉంది.

కాని వారం పది రోజుల కిందట ఒక రాత్రి ఆ పుస్తకం తీసి చూద్దును కదా, అందులో, గురుప్రసాద రావుగారికి చలం గారు రాసినవీ, సంజీవ దేవ్ గారు రాసినవీ కొన్ని ఉత్తరాలు కూడా ఉన్నాయి. ఆ ఉత్తరాలు చదివేటప్పటికి నేను మాటల్లో పెట్టలేని ఒక అనిర్వచనీయమైన సంతోషం నన్ను ఆవహించింది. నా సొంత నేలకి నేను మరింత దగ్గరగా జరిగాననిపించింది. అప్పటికప్పుడే అరుణ గారికి ఫోన్ చేసి మాట్లాడాలనిపించింది. ఎంత నిర్మల ప్రపంచాన్ని ఆమె నాకు మూటగట్టి పంపించారు!

ఆ పుస్తకం చదివినవెంటనే నాకు ‘చలం మిత్రులు’ పుస్తకం చదవాలనిపించింది. ఎందుకంటే చలం గారు తన పుస్తకంలో తన జీవిత పూర్వార్ధంలో తనకి పరిచయమైన మిత్రుల గురించే రాసారు. కాని ఆయన అరుణాచలం వెళ్ళాక ఆయన జీవితంలో ప్రవేశించినవాళ్ళూ, ఆయన్ని వదల్లేక, ఆయన్నే అంటిపెట్టుకుని ఉండిపోయినవాళ్ళూ కూడా మరెందరో ఉన్నారు. వారిలో చాలామంది గురించి మనకి కనీస వివరాలు కూడా తెలియదు. చలంగారు జీవితమంతా ఏ విలువల్ని ఉపాసిస్తూ గడిపారో, ఆ విలువల్నే ఆ శిష్యులు కూడా సాధన చేసారనిపిస్తుంది. వాళ్ళల్లో నాకు బాగా దగ్గరగా తెలిసిన వ్యక్తి గురుప్రసాదరావుగారు. ఆయన్ని చూసే తక్కిన ఆ శిష్యులు కూడా ఎలా ఉండి ఉంటారో ఊహించే ప్రయత్నం చేస్తున్నాను.

110 పేజీల ‘నేనూ చలం’ పుస్తకంలో, దాదాపు నలభై పేజీలు గురుప్రసాద రావు గారి గురించి ఆత్మీయుల జ్ఞాపకాలు. అందులో నేనూ, అక్కా రాసిన వ్యాసాలు కూడా ఉన్నాయి. కాని ఆ మొదటి డెబ్భై పేజీల్లో, గురుప్రసాద రావుగారు తనకీ, చలంగారికీ ఉన్న అనుబంధం గురించి రాసుకున్న తలపోతలు ముప్ఫై పేజీలూ, ఆ తర్వాత చలంగారూ, సంజీవ దేవ్ గారూ తనకు రాసిన కొన్ని ఉత్తరాలు నలభై పేజీలూ ఉన్నాయి.

ఎంతసేపూ తమ రచనలు మాత్రమే తాము చదువుకుంటూ ఉండే తెలుగు రచయితల్తో తిరిగి తిరిగి నా మనసు కూడా పదే పదే brutalize అవుతూ వున్న క్రమంలో, ఆ డెబ్భై పేజీలూ నాకొక దివ్య ఔషధంలాగా పనిచేసాయి. ఔషధం మామూలుగా చేదుగా ఉంటుంది. కానీ ఇది మాత్రం తియ్యటి ఔషధం!

గురుప్రసాద రావుగారు రాజకీయ సిద్ధాంతాల ప్రకారం కమ్యూనిస్టు. వృత్తి రీత్యా అడ్వొకేటు. కానీ ఆ రాజకీయాలూ, ఆ వృత్తీ రెండూ కూడా ఆయన లోపలి జీవితాన్ని ప్రభావితం చెయ్యలేకపోయాయి. తక్కిన ఏ శక్తులూ తాకని ఒక ఆత్మీయమైన తావులో చలంగారు ఆయన్ని తాకారు. అంతే, చలంగారు జీవించి ఉన్నంతవరకూ చలంగారినీ, ఆ తర్వాత సౌరిస్ గారినీ సేవించుకోవడమే ఆయన జీవితానికి ప్రధాన వ్యాపకమైపోయింది. ఒక విధంగా చెప్పాలంటే, ఆ తండ్రీకూతుళ్ళ సేవలోనే ఆయన తన సర్వశక్తుల్నీ పూర్ణాహుతి చేసేసారు.

ఇప్పుడు ఈ చిన్న పుస్తకంలో కూడా తాను లేడు, చలంగారు మాత్రమే ఉన్నారు.  చివరికి తాను రాసుకున్న ముందుమాటలో కూడా మళ్ళా చలంగారి ఉత్తరాల్లో వాక్యాలే ఉన్నాయి! బహుశా చలంగారి వాక్యాలిచ్చిన ఊతంతోనూ, వాటినుంచే బలం తెచ్చుకుని ఆయన ఇన్నేళ్ళూ జీవించగలిగారా అనిపిస్తుంది. ఈ వాక్యాలు చూడండి:

అటువంటి పిలుపు గురుప్రసాదరావుగారికి వినబడింది. కాబట్టే ఆయన ఇక్కడ ఈ ప్రపంచం మధ్యలోనే ఉండినప్పటికీ, తాను ప్రాపంచికుడు  కాకుండా తనని తాను కాపాడుకున్నారు. అటువంటి హృదయనైర్మల్యం ఏదో చలంగారికీ, సంజీవ దేవ్ గారికీ కూడా ఆయనలో కనిపించి ఉండాలి. అందుకని వాళ్ళు రాసిన ఉత్తరాల్లో కొన్ని వాక్యాలు చదువుతుంటే నాక్కూడా ఆ సత్పురుష సాంగత్య మహిమ గోచరిస్తూంది.

ముఖ్యంగా డబ్బుకీ, డబ్బు మనుషులకీ, డబ్బు తప్ప మరేదీ పట్టని సమాజానికీ మనిషి ఎంత దూరంగా జరిగిపోతూ ఉంటే, అతడి జీవితంలో అంతకంతకీ గొప్ప సంతోషం ఉదయిస్తూ ఉంటుంది. అందుకనే తన జీవితంలో చలం గారు గుర్తుపెట్టుకున్నది డబ్బు పట్టని మనుషుల్నే. గురుప్రసాదరావుగారిలో చలంగారిని ఆకట్టుకున్న సుగుణాల్లో అది కూడా ఒకటని ఈ ఉత్తరం చెప్తోంది. చూడండి:

గురుప్రసాదరావుగారు తన ముందుమాటలో ఈ ఉత్తరంలోని  ఈ వాక్యాలే ఎత్తి రాస్తూ ‘ ఈ విషయం ఎలా వూహించారో ఇప్పటికీ అర్థం కాలేదు నాకు’  అని రాసుకున్నారు.

డబ్బు తర్వాత చలంగారు జీవితమంతా ద్వేషించిన రెండో దుర్గుణం possessiveness. Possessiveness వస్తువుల విషయంలోనూ, అనుబంధాల విషయంలోనూ మాత్రమే కాదు, అభిప్రాయాల విషయంలోనూ, సిద్ధాంతాల విషయంలోనూ కూడా ఉండవచ్చు. Subtle రూపంలో, అది self-consciousness కూడా. అంటే భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు మనిషి ఆయన్ని కళ్ళారా చూడటం మాని సెల్ ఫోన్ తెరిచిపట్టుకుని ఒక సెల్ఫీ తీసుకుందాం అని అడగడం లాంటిది. ‘చలం మిత్రులు’ పుస్తకంలో ఆయన ఎవర్నేనా మునుపటిలాగా నిర్మలంగా లేరు అనడానికి చెప్పే గుణగుణాల్లో మొదటిది, వాళ్ళు చాలా self-conscious అయ్యారు అనడం. ఎందుకంటే, మనుషుల్ని డబ్బు వైపు నుంచి పక్కకి లాగే ఎంత గొప్ప తావులూ కూడా అక్కడ చేరినవాళ్ళ స్వోత్కర్ష వల్ల మరింత భరించలేనివిగా తయారవుతాయి. చలం గారి జీవితంలోని గొప్ప ఆధ్యాత్మిక సంతోషానికి కారణం ఆయన డబ్బుకీ, స్వోత్కర్షకీ దూరంగా ఉండగలగడమే. తక్కిన దురారాచారాలన్నీ ఈ రెండింటిలోంచే పుట్టుకొస్తాయికాబట్టి, వీటికి దూరంగా ఉండటం దానికదే ఒక సదాచారం. అందుకనే ఆ కాలమంతటా చలంగారు ఏం రాసినా, అది ఎంత మామూలు వాక్యంగానివ్వండి, అది చదువుతుంటే, ఒక సూఫీ సాధువు మాట్లాడుతున్నట్లుంటుంది. ఈ వాక్యాలు చూడండి:

ఇక సంజీవ దేవ్ గారి ఉత్తరాలు ఈ పుస్తకానికి రెండో పార్శ్వం. నా దృష్టిలో చలంగారు దర్శించిన లోకాలకీ, సంజీవదేవ్ గారు చిత్రించిన లోకాలకీ మధ్య ఏమీ తేడా లేదు. చలంగారువు ఒక జెన్ గురువులాంటి వారనుకుంటే, సంజీవ దేవ్ ఒక జెన్ చిత్రకారుడు. ఈ స్థూల ప్రపంచం నుంచి పైపైకి,  మరింత తేలికపడ్డ కాంతిమయ ప్రపంచంలోకి, వెళ్ళగలిగారు వాళ్ళిద్దరూ. అందుకనే చలంగారి వాక్యాలకీ, సంజీవ్ దేవ్ వాక్యాలకీ మధ్య శైలీభేదమే తప్ప సారాంశభేదం కనిపించదు నాకు.

గురుప్రసాద రావుగారి జీవితంలో ఒక దారుణమైన దుస్సంఘటన జరిగింది. ఒకసారి వారి శ్రీమతి, కుమార్తె ఇద్దరు ముగ్గురు బంధుమిత్రుల్తో కలిసి భీమునిపట్నం వెళ్తూండగా ఆ ఆ కారు యాక్సిడెంటుకి గురయ్యింది. గురుప్రసాదరావుగారి శ్రీమతితో పాటు మరొకరో ఇద్దరో కూడా ఆ ప్రమాదంలో అక్కడికక్కడే మరణించారు. వారి కూతురు అరుణ ఎంత తీవ్రంగా గాయపడ్డారంటే, ఆ తర్వాత ఆమె రెండేళ్ళ పాటు లేచి నడవలేకపోయారు. కాని ఆ విపత్తునీ, అది కలిగించిన షాక్ నీ, మాటల్లో చెప్పలేని ఆ వ్యథనీ గురుప్రసాదరావుగారు ఎట్లానో ఎదుర్కున్నారు. దాన్ని నిలువరించి నిలబడగలిగారు. అటువంటి రోజుల్లో ఆయనకి రాసిన ఒక ఉత్తరంలో సంజీవ్ దేవ్ గారు ఇలా రాస్తున్నారు:

మరొక ఉత్తరంలో ఇలా రాసారు:

ఈ చిన్న పుస్తకమూ, ఈ కొన్ని ఉత్తరాలూ నాకు కలిగించిన సంతోషం, అందించిన ఓదార్పు, కూడగట్టిన ధైర్యం నేను మాటల్లో పెట్టలేనివి.

23-9-

6 Replies to “గురుప్రసాదరావుగారి  గురించి”

  1. చదువుతుంటేనే ఆ లోకం పట్ల వల్లమాలిన ఆసక్తి కలిగిందండీ..
    రెండు పుస్తకాలూ e కాపీలు అందుబాటులో ఉన్నాయా సర్?

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading