నా ఇంగ్లాండ్ యాత్ర -16

27

28 మార్చి, బ్రిటిష్ ఎయిర్వేస్, బోయింగ్ 139, లండన్ – ముంబై

స్వదేశానికి పోయే ఓడనెక్కిన సింద్‌బాద్‌గా నా గృహానికి చేరడానికి పయనమయ్యాను. ఒక్కసారిగా మనసంతా మొద్దుబారింది. ఒక మహత్తరదేశంనుండి, ఖండంనుండి నా దేశం వైపుగా అడుగు వెయ్యడంతో ఎన్నో సంవేదనలు ముప్పిరిగొని అనిర్వచనీయమైన తిమ్మిరి ఆవహించింది. మగతగా కళ్ళు మూసుకున్నాను.

మెలకువ వచ్చేసరికి విమానం ఆల్ప్స్ పర్వతశ్రేణుల పైన సాగుతోంది. యూరోపియన్ హిమాలయాల ధవళశిఖరాలు ఎండలో తళ తళ మెరుస్తున్నాయి. నా యాత్ర గురించి సమ్మింగ్ అప్ థాట్స్‌ని నెమ్మదిగా కూడగట్టుకునే ప్రయత్నం చేసాను. నిస్సందేహంగా ఇది నా జీవితంలో గొప్పయాత్ర. నా జీవితమంతా ప్రయాణాల్లో గడిచిపోయిన మాట నిజమే, కాని ఈ యాత్రతో నేను ప్రపంచపథికుణ్ణయినాను.

నీలాంధకార భరితాలైన మహాసాగరాల్లో ముందుకు దూకిన కొలంబస్, మాజిలాన్, వాస్కోడగామాలు  ఏర్పరచిన దారుల్లో ప్రపంచాన్ని రెండు చేతుల్తో దగ్గరకు తీసుకునే మానవ ప్రేమికుల, మహాసాహసికుల  పరంపరలో ఈ యాత్రతో నేనుకూడా చేరిపోయాను. వసుధ ఏక కుటుంబంగా ఏనాటికయినా  రూపొందడానికి ఈ అడుగు జాడల్లోంచి దారి కట్టుకోవాల్సి వుంటుంది. విదేశంలో నన్నాదరించిన  స్నేహహస్తాలు స్వదేశంలోకూడా నా జ్ఞాపకాల్లో నన్ను వెన్నంటే వుంటాయి.

హావర్త్‌లో ప్రభాత సూర్యరశ్మి, వర్డ్స్ వర్త్ కవితా, గూటెన్‌బర్గ్  బైబిల్, కోహినూరు వజ్రం, కార్నర్ హౌస్  రెస్టారెంట్‌లో వెచ్చని క్షణాలూ, డెల్మీర్ ఎదుట చెర్రీ తరువూ, చలి సాయంకాలాల్లోని మాంచెస్టర్ బెగ్గర్స్, కొత్తరూపాల్లో తిరిగితిరిగి దర్శనమిచ్చే ఈడిపస్, ఫౌస్ట్, హామ్లెట్ – ఇంగ్లీష్ జీవితం తన వెలుగునీడల్తో నా హృదయంపైని చిత్రించిన రమ్యజ్ఞాపకం నన్ను ఎన్నటికీ వెన్నంటే వుంటుంది.

సామర్ఖండ్ సిల్కు దారుల్లో ఈసపుకథలూ, పంచతంత్రమూ కలగలిసి పోయినట్టే నా అనుభవాలూ, అనుభూతులూ కలగలిసిపోయాయి. ఆ సమ్మేళనం నుంచి బహుశా కొత్త ఐడెంటిటీ ప్రభవించవచ్చు, బహుశా అది కొత్త ప్రపంచపు కొత్త శతాబ్దపు ఆత్మ కావచ్చు.

28

గేట్ వే ఆఫ్ ఇండియా, ముంబై

ఇది ముంబాయి, భారతదేశపు గృహతోరణం. మండించే ఎండ, రోడ్లంతా చెలరేగుతున్న దుమ్ము, ఎటుపక్క చూసినా మనుషులు. జీవించడం ఇక్కడ గొప్ప తొక్కిసలాట. దాదర్ పోవడానికి ఘటకోపర్ స్టేషన్‌లో ఎలక్ట్రిక్ ట్రెయిన్ ఎక్కుతుంటే ఆ సమ్మర్దంలో నాచెప్పులు తెగిపోయాయి. ఇది నా స్వదేశం, ఇక్కడే నేను నా పిల్లలతో జీవించాలి.

కానీ ఎంత ప్రేమాస్పదమైన లోకం ఇది. దాహం వేస్తోందని అడిగితే, నా కృతజ్ఞతల కోసం కూడా చూడకుండా, రైల్వేస్టేషన్‌లో టీ దుకాణంవాడు గ్లాసుడు మంచినీళ్ళిచ్చాడు. లండన్‌లో కనీసం ఒక పౌండైనా ఖర్చుపెడితే తప్ప దొరకని మంచినీళ్ళు. చివరికి విమానంలో కూడా ఎయిర్ హోస్టెస్ నీకు మద్యమివ్వగలదు, సాఫ్ట్ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూస్ ఇవ్వగలదు, కాని మంచినీళ్ళు దొరకలేదు నాకు.

ఇది ఇండియా, బీదవాళ్ళ దేశం. కాని ఎంత సంతోషప్రదమయిన దేశమిది:

అపి స్వర్ణమయీ లంకా న మే రోచతి లక్ష్మణ!
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి!

ఆంధ్రప్రభ దినపత్రిక ఆదివారం అనుబంధం, 1997


27

British Airways, Boeing 139: London to Mumbai (28 March)

Boarding the vessel homeward bound, I felt like Sinbad setting sail for his native hearth. Suddenly, an immense numbness settled over my senses. Stepping away from a monumental land and continent toward my own country, waves of contradictory emotions converged, wrapping my mind in an indefinable stillness. Drowsily, I closed my eyes.

When I awoke, the aircraft was cruising high above the Alpine ranges. The snow-clad peaks of the European Himalayas glittered beneath the sun. Slowly, I tried to gather my summing-up thoughts on this voyage.

Unquestionably, this has been one of the great journeys of my life. It is true that my entire life has been spent wandering along paths and highways; yet with this journey, I have become a true pilgrim of the world.

By traversing the sea-lanes charted by Columbus, Magellan, and Vasco da Gama—pioneers who plunged into the dark blue terrors of uncharted oceans—I too have joined that long continuum of daring adventurers and lovers of mankind who strive to embrace the whole world with outstretched hands. If the ancient vision of Vasudhaiva Kutumbakam—the earth as one family—is ever to become a living reality, the path must be carved through such footprints.

The hands of friendship that welcomed me in a foreign land will accompany me through memory in my own homeland as well. The morning sun at Haworth; the sonnet of Wordsworth; the Gutenberg Bible; the Koh-i-Noor diamond; the warm, unhurried moments at Cornerhouse; the flowering cherry tree before the Delmere; the shivering beggars along Manchester streets; and Oedipus, Faust, and Hamlet returning to life in ever-new guises—this radiant tapestry of light and shadow that English life inscribed upon my heart will remain with me forever.

Just as Aesop’s fables and the tales of the Panchatantra interwove along the ancient silk routes of Samarkand, so too my lived experiences and deep intuitions have merged into one. Out of that confluence, perhaps a new identity will be born; perhaps it will reveal itself as the very spirit of a new century and a new world.

28

Gateway of India, Mumbai

This is Mumbai—the ceremonial portal of India. A scorching sun, dust swirling along every road, and a sea of human beings wherever the eye falls. Existence here is an unending scramble. Climbing aboard an electric local train at Ghatkopar to reach Dadar, my sandals snapped beneath the crush of the crowd.

This is my native soil; it is here that I must live with my children.

Yet what a warm, loving world this is! Feeling parched, I asked for water, and without waiting for words of gratitude, the vendor at a railway tea stall handed me a brimming glass of drinking water. In London, one cannot secure drinking water without parting with at least a pound. Even on the aircraft, the flight attendant could serve alcohol, soft drinks, or fruit juices, but plain drinking water was nowhere to be had.

This is India—a land of poor people. Yet how immense is the joy it cradles:

Api svarṇamayī laṅkā na me rocati lakṣmaṇa!
Jananī janmabhūmiśca svargādapi garīyasī

(“Even though Lanka is wrought of gold, Lakshmana, it delights not my heart! Mother and Motherland are greater by far than Heaven itself.”)

Andhra Prabha Sunday Magazine, 1997

25-10-2026

4 Replies to “నా ఇంగ్లాండ్ యాత్ర -16”

  1. A complete immersion experience, sir!

    You really soaked in the history, landscape, language, cinema, art, theatre, culture, people and politics of England. ఎన్నెన్ని కోణాల్లో ఆ దేశాన్ని పరికించారు, పరిశీలించారు, దర్శించారు!

    Thank you for sharing your experiences through this wonderful travelogue!!🙏🏽

    1. హృదయపూర్వక ధన్యవాదాలు మాధవీ! మీరు కూడా ఈ యాత్రతో కలిసి నడిచినందుకు మీ ప్రతి ఒక్క మాటా నాకు ఎంతో విలువైనది.

  2. నమస్కారములు…..మీ తిరుగు ప్రయాణం కూడా అద్భుతంగా ఉంది…….మీఇంగ్లాండుయాత్ర16ఎపిసోడ్లుస్వీటుసిక్స్టీనుగాఉంది….మరిచిపోలేని మధురానుభూతులు పొంది వాటిని ఎంతోమందికి పంచిపెట్టారు…..మీరుమీకళ్ళతోచూసిఅనుభవించినఆనందాలుమామనసుతోచూసుకున్నాము.మీరుఅనేకరంగాలనువాటిలోనిగొప్పతనాలనుమాకందించారు….కొన్నిలోటుపాట్లనుకూడావిశదీకరించారు….మాంచెస్టరుఎందుకోపదే,పదేజ్నాపకమొస్తోంది….జాన్కీట్సునుకూడామరచిపోలేను…..ఇండియాలో తిరుగు ప్రయాణం ముగిసిమన దేశంలో కాలిడిన మొదటి అడుగులో మీకేమ నిపించిందో…మీరు తెలియజేయలేదు.శుభాభినందనలు…

Leave a Reply