
ఢిల్లీ నుంచి ఉత్తరాలు
6
ఈరోజు ప్రధానమంత్రిని కలిసాం. ఆయన మాకు తీన్ మూర్తి భవన్లో అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఆ భవన్ ఒకప్పుడు నెహ్రూ కుటుంబపు నివాసగృహం. తదుపరి దాన్ని వాళ్లు జాతీయ పోరాటంలో తమ కుటుంబం నిర్వహించిన పాత్రకి గుర్తుగా జాతికి అంకితం చేసారు. ఇప్పుడది నెహ్రూ మూజియంగా, గ్రంథాలయంగా ఉంది. దాని లోపలి ఆవరణలో అందంగా తీర్చిదిద్దబడ్డ పచ్చిక పైన ప్రధానమంత్రి గిరిజన ప్రతినిధుల్ని, దేశం నలుమూలల్నించీ వచ్చిన సాంస్కృతిక బృందాల్నీ, ఎన్.సి.సి దళాల్నీ కలుసుకున్నాడు. ఆ కలయిక లాంఛనపూర్వకంగా, మర్యాదాత్మకంగా ఉంది. మేమాయనతో ప్రత్యేకంగా ఫొటో దిగే అవకాశం సంపాదించాం. ఆ ఫొటో ఎలా వస్తుందో చూడాలని ఉంది.
సాయంకాలం సైన్యాలకు వీడ్కోలు సంరంభం. అది నిజంగా కన్నులపండువు. పూర్వకాలపు మహారాజుల వైభవమంతా అక్కడ గోచరిస్తుంది. రిపబ్లిక్ విన్యాసాల ముగింపుని సంకేతపరుస్తూ సైన్యం నిర్వహించే ప్రతీకాత్మక ఉత్సవమది. అది నార్త్ సౌత్ బ్లాకుల మధ్య నుండే శోభాయమానమైనకూడలిలో ఏర్పాటుచేయబడింది. ఆ మధ్యలో రాష్ట్రపతి ఆసీనుడై ఉండగా చుట్టూ త్రివిధదళాలూ విడివిడిగానూ, కలసికట్టుగానూ వీడ్కోలు సంగీతాన్ని వినిపించారు. ఆశ్వికదళాలతో, ఒంటెలతో, లెఫ్టినెంటులతో, ఊళలతో, మేళాలతో, తాళాలతో, మధుర సంగీతధ్వనులతో ఆకాశమంతా ప్రతిధ్వనించింది. జాతి రక్షకసైన్యాల హార్మొనీతో గాలి పరవశించిపోయింది. పశ్చిమదిగంతం పైన సూర్యాస్తమయమవుతోంది. ఆ సంగీతం చుట్టూ మహిమాన్వితమైన నిశ్శబ్దమొకటి పరివ్యాప్తమయిఉంది. పదిలక్షల నేత్రాలు ఆ సంరంభాన్ని రెప్పవేయకుండా తిలకిస్తున్నాయి. వారందరి పైనా సెక్యూరిటీ డేగ కన్ను.
నేనేదో మధ్యయుగాల రాజ్యానికి తీసుకుపోబడ్డట్టుగా భావించాను. ఏదో పాత భారతీయ సినిమాలోని సీను ఏదో నా కళ్ల ముందు తిరుగుతున్నట్టుంది. సూర్యుడు అస్తమించాడు. త్రివర్ణపతాకాన్ని అవనతం చేసారు. అప్పుడొక్కసారిగా విద్యుద్దీపాలు జిగేల్మన్నాయి. మొత్తం పార్లమెంటుభవనం, ఆ రెండుబ్లాకులు, రాష్ట్రపతిభవనం మనోహరంగా దీపాలంకృతమయ్యాయి. అప్పుడు జాతీయగీతాలాపన, వీడ్కోలు సంరంభం ముగింపుకొచ్చింది. నేనెక్కడున్నాను? భారతదేశంగా పిలవబడే ఈ ప్రజాస్వామ్య దేశం నన్ను అబ్బురపరిచింది. ఒక వైపు త్రివిధదళాల సర్వాధిపతిని కేవలం లాంఛనప్రాయమైన రాజ్యాధినేతగానే ఉంచిన రాజ్యాంగనిర్మాతల వివేకాన్ని నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. మరొక వైపు ఈ మొత్తం వ్యవహారమంతటినీ ఎంతో యాంత్రికంగా, ఎంతో బ్యురోక్రటిక్ గా నిర్వహిస్తున్న వైనాన్ని కూడా చూడకుండా ఉండలేకపోతున్నాను. బయటికి అడుగుపెడ్తూండగా హఠాత్తుగా స్ఫురించింది నాకు. ఏ జాతిభద్రత అయినా దాని సైన్యం సామర్థ్యంలో గాని, దాని ఆయుధసంపత్తిలోగాని లేదని ఆ జాతి పౌరుల శీలనిర్మాణం లోనే ఉంటుందనీ. ఈ దేశ ప్రజలు అటువంటి శీలాన్వేషణలో ఉన్నారా?
ఈ మహనీయ పురాతన మహాదేశ ప్రజలు ప్రస్తుతం అవకాశాల వెతుకులాటలో, అందింది అందినంత మేరకు చేజిక్కించుకోవడంలో, సరుకులు సమకూర్చుకోవడంలో, ఇంజనీరింగు సీట్లకూ, విదేశీ ప్రయాణాలకు ఉరుకులు పెట్టడంలో నిమగ్నులయిఉన్నారు. ఆ మొత్తం వీడ్కోలు ఉత్సవమంతా, ఎన్నో ఏళ్లుగా అదే రంగస్థలం మీద, వెలిసిపోయిన పాతనాటకమేదో ప్రదర్శిస్తున్నట్టనిపించింది. ప్రదర్శన విజయవంతంగానే నడిచిఉండవచ్చు, కానీ సందేశమేమిటి? అదెవరినన్నా ఉత్తేజపరచగలిగిందా? అసలుదాన్నెవరన్నా హృదయపూర్వకంగా తీసుకోగలిగేరా? అక్కడ సివిల్ అధికారులు మిలటరీఅధికారుల్ని ద్వేషిస్తుంటే మిలటరీఅధికారులు సివిల్అధికారుల్ని ఏవగించుకుంటున్నారు. ఈ మొత్తం నాటకమంతా చూస్తూ రాష్ట్రపతి ఏమనుకుంటూండవచ్చు?
మనం ఇప్పుడు చూస్తున్న ఈ ఆధునిక జాతీయరాజ్యమనేది ఫ్యూడలిజం నుంచీ, పెట్టుబడిదారీవిధానం నుంచి ప్రభవించిన పందొమ్మిదో శతాబ్దపు ఐరోపీయ నమూనా. తన కన్నా తరువాత పుట్టిన చాలా సంస్థలు అంతరించిపోయినా అది మాత్రం ఇంకా నిలవగలిగి ఉంది. కానీ మూడవ ప్రపంచంలో మాత్రం ఈ ఇరవయ్యవ శతాబ్దంలో రాజ్యం అసాధారణమైన మార్పులకి లోనవుతోంది. ఇక భారతదేశంలో రాజ్యం తన ప్రజాస్వామిక ఆచరణలన్నిటితోనూ అటు ఉగ్రవాదికీ, ఇటు రాజనీతివిద్యార్థికీ కూడా అర్థంగాని ప్రహేళికగానేమిగుల్తోంది. ఒక్కొక్కసారి అది చాలా దుర్బలంగా కనిపిస్తుంది. కానీ ఆ బలహీనత కేవలం పైపై అభిప్రాయంగానే బయటపడుతుంది. నువ్వొక్కసారి దాన్ని ఎదిరించి చూడు, అప్పుడు తెలుసుకొంటావు, దాని మూలాలూ, బాహువులూ ఎంత దృఢమో. ఒక్కొక్కప్పుడు అది తనని తాను రద్దుపరుచుకుంటోందా అనిపిస్తుంది. ఆ మరుక్షణమే ఇనుమడించిన బలంతో తన భస్మరాశులనుంచి తిరిగి పునరుజ్జీవించే ఫీనిక్సుపక్షిలా పైకి లేస్తుంది. ఇదొక కొత్త అనుభవం నాకు.
అయితే ఈ వేడుక నన్నానందపరచకపోలేదు. ఆ రంగులు, ఆ సంగీతం, ఆ మహాసంరంభం, ఆ సైనికబలం, అసలు ఆ మొత్తం సమష్టిఅనుభవం. భారతదేశ రాజకీయభవితవ్యం గురించి మొత్తం అంశాలన్నిటినీ మళ్లా కొత్తగా పరిశీలించు కోవడానికి ఇది నాకొక కొత్త సందర్భాన్నిచ్చింది.
7
నువ్వెంత సుదీర్ఘంగానన్నా ఉత్తరాలు రాయి, కానీ సజీవ మానవ కంఠస్వరాన్ని, ముఖ్యంగా, నీకు అత్యంత ప్రేమాస్పదమయిన స్వరాన్ని విన్నప్పుడు నీలో ఝల్లుమనే విద్యుత్తరంగాలకి ఆ ఉత్తరాలు సాటిరావు. అక్కడ ఆ స్వరమే సందేశం. అదొక సజీవసంవాదం. కాలాన్నీ, స్థలాన్నీ దాటి వికసించే ఐక్యమది. ..
ఈ రోజంతా మాకు విశ్రాంతి ప్రకటించారు. ఏ ఆధికారిక కార్యక్రమాలూ లేవు. పొద్దున్న నేను సాహిత్య అకాడెమీ కార్యాలయానికీ, వాళ్ల పుస్తక విక్రయ కేంద్రానికీ వెళ్లాను. ఆ కేంద్రం సెల్లార్లలో దాదాపు రెండుగంటల పాటు పుస్తకాలు వెతికి మూడు పుస్తకాలు ఏరుకున్నాను. ఒకటి, ఈస్తటిక్స్ మీద, మరొకటి సుబ్రహ్మణ్య భారతి కవిత్వమూ, ఆ కవిత్వం మీద వ్యాసాలూ, మూడవది సంస్కృత పురాణేతిహాసాల నుంచి ఏరి కూర్చిన సంకలనం. ఆ తరువాత భారతీయ విద్యాభవన్ వారి పుస్తక విక్రయకేంద్రానికి కూడా వెళ్లాను. అక్కడ సంస్కృతనాటకాన్నీ, క్రతుకాండనీ పోలుస్తూ రాసిన విద్వత్ రచన ఒకటి నన్ను ఆనందాశ్చర్యాలతో ముంచెత్తింది.
నువ్వు నమ్ముతావో లేదో గానీ గత మూడు నాలుగు నెలలుగా నేను అటువంటి భావాలతోనే తలమున్కలుగా ఉన్నాను. నా అస్పష్టభావాలకు మాటలివ్వడానికా అన్నట్టు భగవంతుడు ఆ పుస్తకాన్ని అక్కడ నా చేతులకందించాడు. అదొక రష్యన్ పరిశోధకురాలు రాసిన పుస్తకం. ‘డ్రామా ఎండ్ రిచ్యువల్ ఇన్ ఎర్లీ హిందూయిజం’ ఆ పుస్తకం పేరు. అటువంటి పాండిత్యం ఆధారంగా నేను కూడా నా భావాలకొక ఆకారాన్నివ్వగలనని సంతోషం కలిగింది.
నా తీరిక సమయంలో ‘గురు ట్రెడిషన్’ చదువుతూ ఉన్నాను. మధ్య మధ్యలో ఓ హెన్రీ చిన్నకథలు. బయట తిరగడానికి లేదు కనుక అయితే పక్క మీద దొర్లుతూనో లేదా రూం హీటర్ పక్కన కుర్చీలో కూలబడో ఏదో ఒకటి చదువుకుంటూనే గడపవలసి ఉంటుంది. కానీ నా కయితే ఆ వెచ్చని వాతావరణంలో ఆ గొప్ప పుస్తకాల వల్ల మనసు కూడా వెచ్చబడింది. ఆగ్రాలో నా అనుభూతి మీద పొద్దున్న ఒక కవిత రాసాను. ఆ రోజు నీకు ఉత్తరంలో ఏమేమి రాసానో అదంతా కవిత్వరూపంలో తేవాలని చూసేను.
కవిత పూర్తవగానే చిన్న ఉత్తరం రాసి నామాడి శ్రీధర్ కి ఫోన్ చేసాను. అతనయితే దాన్ని వెంటనే ప్రింట్ చేస్తాడని కాదు, ఆ కవితకి అతనెక్కువ మురిసిపోతాడని ఆ ఉత్తరం. ఆ కవిత అందరికన్నా అతని హృదయాన్నికెక్కువ చేరువవుతుందని నా నమ్మకం. నేనా కవితని ఏడు సార్లు తిరిగి రాసాను. అందులో ఆ ఏడవ వెర్షన్ని, అది కూడా చివరి నిముషపు దిద్దుబాట్లతో అతనికి పంపాను. ఆ కవిత ఈ ఉత్తరంతో పాటు నీకు పంపుతున్నాను చూడు.
ఆగ్రాలో ఒక మధ్యాహ్నం
ఆకాశమంతటా ఆవరించిన
మలిహేమంతపు ఎండలో
ఆగ్రాలో ఒక మధ్యాహ్నం,
పండులో పుల్లదనంలాగా చలి.
పురాతన స్వప్నం తాజమహల్
నిన్నరాత్రే ఎవరో భూమ్మీద ప్రతిష్ఠించినట్టుంది.
మెరిసిపోతున్న పాలరాతి గుమ్మటాలు
ధవళ అపరాహ్ణ శోభలో
సాగిలబడుతున్నారు దాని ఎదట
కొత్త ఆరాధకులు మరికొందరు.
నా ఎదట పచ్చికలో ఒక పుష్పం
దాని పరాగ కేంద్రంలో భ్రమరం.
పుష్పం కోసం భ్రమరం
భ్రమరం కోసం పుష్పం,
వాటి అకళంక మిలన పునర్మిలనాలతో
నా కళ్లు పండగ చేసుకున్నాయి.
మూగుతూనే ఉన్నారు మనుషులు కెమేరాల్తో
ఆ రమ్యమహల్ చుట్టూ.
ఈ మధ్యాహ్నం నా ఎదట
దినాంతానికి రాలిపోయే
అజేయ పుష్పం,
షాజహాన్ కన్నా ప్రేమోన్మత్త భ్రమరం.
8
నా బాల్యమంతా నేను మా అమ్మకీ, నా అక్కచెల్లెళ్లకీ, అన్నదమ్ములకీ, మా ఇంటికీ, మా ఊరికీ దూరంగా గడపవలసివచ్చింది. ఎడబాటులోనూ, బెంగలోనూ గడిచిన సుదీర్ఘకాలమది. కానీ అది నా లోపల్లోపల చాలానే పనిచేసింది. అది నన్నెన్నటికీ బయటికి ఎదగనివ్వలేదు. నేనా బెంగనుంచి బయటపడటానికే కవిత్వం రాసాను. నెమ్మదిమీద, నా ఆవేశాల్నీ, ఉద్వేగాల్నీ అదుపుచేసుకోవడం నేర్చుకున్నాను. కవిత్వం, పుస్తకాలు, ముఖ్యంగా ప్రార్థన నాలో గొప్ప పరివర్తన తీసుకువచ్చాయి. ఈ మనఃస్థితి నాకొక రోజులో అలవాటుపడింది కాదు. అనేక పతనాల తరువాత, పశ్చాత్తాపాల తరువాత సాధ్యపడిందది. అన్నిటికన్నా ముఖ్యంగా భగవత్కృప అపారంగా నా పైన వర్షిస్తూండటమే అందుకు కారణం.
పొద్దున్న మేము భారతరాష్ట్రపతిని కలిసాం. ఆయన మాకు రాష్ట్రపతిభవన్లో తేనీటి విందు ఇచ్చాడు. ప్రఖ్యాతి చెందిన మొఘల్ గార్డెన్సులో మమ్మల్ని కలిసాడాయన. తన అతిథుల దగ్గరికి తనే పోయి ప్రతి ఒక్కర్నీ వ్యక్తిగతంగా పలకరించాడు. అప్పుడు దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలిచ్చారు. ఆపైన అల్పాహారం, టీ. మధ్యాహ్నం తలకోరా ఇండోర్ స్టేడియంలో సంక్షేమ మంత్రిత్వ శాఖ చిన్న గెటుగెదర్ ఏర్పాటు చేసింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ముఖ్య అతిథిగా వచ్చాడు. గిరిజనఅతిథులకు జ్ఞాపికలు బహూకరించారు. ఆ పైన సాంస్కృతిక ప్రదర్శనలు.. రేపు మధ్యాహ్నానికి ఆధికారిక కార్యక్రమాలు ముగిసిపోవాల్సిఉంది. కానీ చిన్న మార్పు చేసారు. రక్షణమంత్రితో రేపు జరగవలసిన మా సమావేశం ఎల్లుండికి వాయిదా పడింది. రేపు ఇక్కడే లోకల్ సైట్ సీయింగ్ ఏర్పాటు చేసారు.
9
మా పర్యటన ముగింపుకొచ్చింది. ఇక ఒక్క రోజు మాత్రమే మిగిలింది. రేపు సాయంకాలానికి మేం హైదరాబాద్ తిరుగుప్రయాణంలో ఉంటాం. ఈ రాత్రి డిన్నర్ తరువాత కేంప్ ఫైర్ పెట్టారు. ఇప్పుడే అక్కణ్ణుంచి వస్తున్నాను. మా బృందంలో ఉన్న వాళ్లంతా తమ తమ స్వాభావికఉత్సాహంతో పాల్గొన్నారు. పాటలు, గజళ్లు, గిరిజన రాగాలు, దోహాలు, అన్నిటినీ మించి హృదయరంజకమైన వాయిద్య ఘోష. అన్నిటికీ చివర బృందనృత్యం. అంతా సంతోషంతో ముందుకురికి నాట్యం చేసారు. ఎవ్వరూ ఏ ఒక్కర్నీ వదల్లేదు. నేను కూడా నాలుగయిదు స్టెప్పులు వెయ్యాల్సివచ్చింది.
ఇది మా శిబిరానికి బీటింగ్ రిట్రీట్ లాంటిది. ఈ సంరంభమంతటివెనుకా ఉన్న మనిషి, ఆధారశక్తి, మిష్టర్ వర్మ. ఆయన సంక్షేమ మంత్రిత్వ శాఖలో అండర్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. ఈ శిబిరానికి ఆయనే ఇంఛార్జి. ఆయన సామర్థ్యం, ఉత్సాహం అపారం. ఈ శిబిరం విజయవంతమయ్యిందంటే అందుకు ఆయన చొరవ, ఓర్పు, ఆహ్లాదకరమైన వ్యక్తిత్వమే చాలా వరకు కారణం.
ఈ రోజు పొద్దున్న మేం ఎర్రకోటకి వెళ్లాం. అక్కడ చాలాసేపే గడిపాను. ఈ సారి నేనక్కడి మ్యూజియంని కొంత తీరిగ్గా చూడగలిగాను. ముఖ్యంగా అక్కడ ప్రదర్శించిన మొఘల్ చిత్రలేఖనాల్ని. వాటిలో రెండు మూడు చిత్రలేఖనాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. ఒకటి కబీరు చిత్రం. అది కబీర్ ని మరింత వాస్తవికమైన దేహరూపంతో, ఆకృతిలో, వస్త్రధారణతో, కర్మశీలుడయిన యోగిగా చిత్రించింది. రెండవ చిత్రం ‘తానీషా ఇన్ ఏ ఫెయిరీ లెజెండ్’ అనేది. అది ఆ గోల్కొండ నవాబుని కలలద్వీపంలో ఊహించి చిత్రించిన కావ్యం. మొఘల్, హిందూ సంస్కృతుల అత్యంత సౌందర్యాత్మకసమన్వయం అది. అక్కడ తానీషా అప్సరసల లోకంలో విహరిస్తున్న విద్యాధరరాకుమారుడిలా కనిపిస్తాడు. ఆ వర్ణసంయోజన, ఆ స్థల నిర్వహణ, అప్సరసందోహం, ఆ ఉద్యానం, మత్తిలిన ఆ రాకుమారుడి నేత్రాలు ఆ మొత్తం చిత్రలేఖనాన్నొక దృశ్య సంగీత మర్మరధ్వనితో మనోహరంగా కంపింపచేసాయి.
ఇక మూడవ చిత్రం ఒక చిన్న చేప బొమ్మ. అది నాలో ఎటువంటి అనిర్వచనీయ సంవేదనల్ని రేకెత్తించిందంటే నేను చాలా సేపటి దాకా అక్కణ్ణుంచి కదల్లేకపోయాను. అది మొఘల్ చిత్రకళ పైన నా అవగాహననే పునర్విమర్శించుకునేలా చేసింది. అది మొఘల్ వాస్తుకీ, మొఘల్ చిత్రకళకీ మధ్య గల వైరుధ్యాన్ని కూడా ఎత్తిచూపింది. జహంగీర్ చక్రవర్తి ఆస్థానంలో చిత్రకారుడెవరో చిత్రించిన ఆ చేప బొమ్మ రినైజాన్సు నాటి యూరోప్ కన్నా ఆధునిక పాశ్చాత్య ప్రపంచంకన్నా ఉన్నతమైన స్థానానికి భారతదేశాన్ని తీసుకుపోయింది. అక్కడ కాలిగ్రఫీకి చెందిన వివిధ ప్రదర్శనల్ని కూడా చూసాను. అవి కవిత్వ ప్రచురణ పద్ధతుల గురించీ, పేజిమేకింగ్ గురించీ, లే ఔట్ గురించీ నా కేవేవో ఆలోచనల్నిచ్చాయి. తమ రచనలను ప్రచురణ రూపంలో చూసుకోవాలనుకునే వాళ్లకి ఆ కాలిగ్రఫీ ఏదో విలువైన సూచనల్నిస్తుందనవచ్చు.
ఆ మ్యూజియంని వదిలిపెడితే తక్కిన ఎర్రకోట మొత్తం మురిగ్గా గబ్బిలాల వాసనకొడుతూ ఉంది. అక్కడ వాళ్లు నేతాజీ శతజయంతి సందర్భాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ కూడా ఉంది. ఆజాద్ హింద్ ఫౌజుకీ ఎర్రకోటకీ మధ్య గల సంబంధాన్ని గుర్తు చేస్తున్నదది. ఎర్రకోట మీద త్రివర్ణపతాకాన్ని ఎగరవెయ్యడం తన ఏకైక స్వప్నమన్నాడట నేతాజీ. ఆ ఎగ్జిబిషన్ లో డాక్యుమెంటేషన్ బాగానే ఉన్నప్పటికీ ఆ ప్రదర్శన మాత్రం చాలా హడావిడిగా, బాధ్యతారహితంగా ఉంది. అక్కడున్న అన్ని హాళ్లలోనూ సందర్శకుల్ని అతి తక్కువ ఆకర్షించిన హాలు అదేకావడంలో ఆశ్చర్యం లేదనిపించింది…
1997
Letters from Delhi
6
Today we met the Prime Minister. He granted us an audience at Teen Murti Bhavan. That mansion was once the residence of the Nehru family, who later gifted it to the nation in commemoration of their family’s role in the freedom struggle. Today it serves as the Nehru Memorial Museum and Library.
Upon the manicured lawns of the inner estate, the Prime Minister received tribal delegates, cultural troupes from across the country, and NCC contingents. The meeting was formal, polite, and ceremonial. We managed to take a photograph with him; I am eager to see how it turns out.
In the evening came the Beating Retreat ceremony—a magnificent feast for the eyes. All the pomp and majesty of ancient imperial courts seemed to come alive. It is the symbolic ceremony staged by the armed forces to mark the culmination of the Republic Day celebrations, mounted at the grand intersection flanked by North and South Blocks.
With the President seated at the center, the three wings of the armed forces performed retreat fanfares both separately and in unison. The evening sky reverberated with the thunder of cavalry, camels, bugles, massed pipes and drums, and evocative military melodies. The air was intoxicated with the martial harmony of the nation’s guardians. The sun was setting across the western horizon, and a majestic hush enveloped the music. A million eyes watched the spectacle without blinking, while above them all hovered the eagle eye of security.
I felt transported into a medieval court. It felt as though a scene from an old Indian epic film were moving before my eyes. The sun dipped below the horizon. The national tricolor was lowered. At that exact instant, electric illuminations blazed to life: Parliament House, the two Secretariats, and Rashtrapati Bhavan were illuminated in a sea of light. As the national anthem rose into the dusk, the retreat ceremony drew to a close.
Where was I? This democratic entity called India left me astonished. On one hand, I could appreciate the wisdom of our constitutional framers in retaining the Supreme Commander of the Armed Forces as a ceremonial Head of State. On the other hand, I could not help observing the mechanical, bureaucratic air with which the entire pageant was conducted.
As I walked out, a sudden realization struck me: the enduring security of any nation rests neither in martial strength nor in its arsenal of weaponry, but solely in the character of its citizens. Are the people of this country engaged in such a cultivation of character?
The citizens of this ancient, magnificent land seem currently absorbed in pursuing opportunities, grasping whatever falls within reach, amassing consumer goods, and racing after engineering admissions and foreign visas. The entire Beating Retreat ceremony seemed like a faded, familiar play staged upon the same old boards year after year. The performance went off smoothly, but what was its message? Did it stir anyone’s spirit? Did anyone take it truly to heart?
There, civil administrators harbor resentment toward military commanders, while military officers regard the civilian bureaucracy with quiet disdain. Watching this entire drama unfold, what must the President have been thinking?
The modern nation-state we witness today is a nineteenth-century European construct that emerged from feudalism and capitalism. Though many institutions born after it have vanished, the nation-state has managed to survive. Yet in the Third World during this twentieth century, the State is undergoing extraordinary mutations. In India, with all its democratic practices, the State remains an impenetrable riddle to the insurgent and the student of political science alike.
At times it appears exceedingly frail. Yet that frailty is merely an illusion. Confront it once, and you discover the unyielding strength of its sinews and roots. At times it seems on the verge of dissolution; the very next moment, it rises from its ashes with redoubled power, like a phoenix.
This was a fresh revelation for me. Even so, the pageant did not fail to delight: the colors, the music, the ceremonial grandeur, the military bearing, the shared collective spectacle. It offered me a fresh vantage point from which to examine anew the political destinies of India.
7
Write letters as long as you will, yet they can never rival that electric tremor coursing through the veins when hearing a living human voice—above all, the voice of the one most beloved. There, the voice itself becomes the message. It is a living dialogue—a communion that unfolds beyond the frontiers of time and space…
Today was declared a day of rest for us; no official engagements were slated. In the morning, I visited the Sahitya Akademi offices and their book sales center. I spent nearly two hours foraging through the volumes in their basement, finally selecting three books: one on aesthetics, another of Subramania Bharati’s poetry along with critical essays on his verse, and a third an anthology culled from Sanskrit puranas and epics.
Afterward, I made my way to the Bharatiya Vidya Bhavan sales emporium. There, a scholarly volume exploring the structural parallels between classical Sanskrit drama and Vedic ritual overwhelmed me with wonder and delight. Believe it or not, I have been deeply immersed in those very ideas for the past three or four months. As if to lend words to my inchoate intuitions, God placed that book directly into my hands. It is the work of a Russian scholar, titled Drama and Ritual in Early Hinduism. It brought me immense joy to feel that, anchored in such rigorous scholarship, I too might give definite shape to my thoughts.
During my idle hours, I return to The Guru Tradition. In between, I dip into the short stories of O. Henry. With outdoor movement ruled out, one must pass the hours either lounging on the bed or huddled in an armchair beside the room heater, reading away. Yet in that ambient warmth, those noble books warmed my heart as well.
This morning, I composed a poem on my encounter at Agra. I attempted to translate everything I had shared in my letter to you into the idiom of verse. The moment it was completed, I penned a brief note and telephoned Namadi Sridhar. Not that he would rush it into print at once, but rather because I knew the poem would delight him deeply; I believe it will speak to his heart more intimately than to anyone else’s. I reworked that poem seven times, and sent him that seventh version bearing a few last-minute revisions. I am enclosing that poem with this letter for you to see.
An Afternoon in Agra
In the late autumn sun,
an afternoon in Agra.
A chill hangs in the air
like the tartness of ripening fruit.
This ancient dream, the Taj Mahal,
still looks as fresh as yesterday.
Upon the marble domes,
the afternoon light gleams white.
Before the monument, prostrate,
a new generation of admirers.
A flower on the lawn before me,
a bee amid its pollen.
The flower for the bee,
the bee for the flower.
As I watch them meet-
what a delightful sight!
Streams of people, cameras in hand,
still swarm around the building.
But this afternoon, before me:
a flower that fades by evening, yet invincible.
And there, a bee
even more passionate than Shah Jahan.
8
My entire childhood had to be spent far away from my mother, my sisters, my brothers, our hearth, and our native village. It was a prolonged season worn away in separation and yearning. Yet inwardly, it wrought a profound transformation. It never permitted me to settle into shallow outward complacencies.
It was precisely to deliver myself from that homesickness and gnawing ache that I took to writing poetry. By slow degrees, I learned to bridle my passions and emotional surges. Poetry, books, and above all, prayer worked a great inner conversion within me.
This poise was not acquired in a single day. It became possible only after many stumbles, falls, and agonizing repentances. Above all, it flowered because divine grace has showered upon me without measure.
This morning, we met the President of India. He hosted a tea reception for us at Rashtrapati Bhavan, receiving us amidst the renowned Mughal Gardens. He walked up to his guests himself, greeting each one of us with gracious personal warmth. Artists drawn from diverse corners of the country presented cultural performances, followed by refreshments and tea.
In the afternoon, the Ministry of Welfare hosted a small gathering at the Talkatora Indoor Stadium, with the Minister of Parliamentary Affairs gracing the occasion as the chief guest. Mementos were presented to the tribal delegates, followed by further cultural presentations.
Our official itinerary was slated to conclude by tomorrow afternoon. However, a slight revision was introduced: our scheduled meeting with the Defence Minister tomorrow has been deferred to the day after. For tomorrow, they have arranged local sightseeing within the city.
9
Our tour has drawn to its close; only a single day remains. By tomorrow evening, we shall be on our return journey to Hyderabad.
Tonight, following dinner, they lit a campfire. I have just returned from the circle. Everyone in our contingent joined in with their natural, uninhibited warmth. Songs, ghazals, indigenous tribal melodies, dohas, and above all, a stirring roar of percussion filled the night air. To crown it all came a collective group dance: everyone leapt forward in sheer exuberance, leaving no one behind. I too was drawn into the fold and had to match steps for a round or two. It served as a kind of Beating Retreat for our camp.
The moving spirit and pillar behind this entire celebration is Mr. Varma. Serving as Under Secretary in the Ministry of Welfare, he has held charge of this camp. His efficiency and infectious enthusiasm know no bounds. If this camp proved such an unqualified success, it is largely due to his initiative, patience, and delightfully genial presence.
Earlier this morning, we visited the Red Fort. I spent a long while there, managing this time to wander through the museum with unhurried leisure—especially taking in the Mughal miniatures on display. Two or three paintings arrested my gaze completely.
The first was a portrait of Kabir. It depicted him with a grounded, physical realism in form, bearing, and attire—a contemplative yogi wholly immersed in action (karma-shila).
The second was Tana Shah in a Fairy Legend. It was a painted poem envisioning the Golconda Sultan stranded upon an enchanted isle of dreams—a breathtaking aesthetic synthesis of Mughal and Hindu sensibilities. There, Tana Shah appears like a celestial Vidyadhara prince disporting in a realm of apsaras. The harmony of color, the organization of space, the cluster of celestial nymphs, the lush pleasure garden, and the intoxicated eyes of the prince caused the entire painting to vibrate with the quiet, murmurous cadence of visual music.
The third work was a miniature of a small fish. It stirred such indefinable tremors within me that I stood rooted to the spot for a long while. It compelled me to reconsider my entire appraisal of Mughal art, laying bare the striking paradox between the monumental scale of Mughal architecture and the intimate subtlety of Mughal painting. That fish, rendered by some master in Emperor Jahangir’s imperial atelier, elevated India to an aesthetic plane surpassing Renaissance Europe and the modern Western world alike.
I also examined various specimens of classical calligraphy. They set my thoughts racing on poetic typography, page architecture, and layout design. For anyone aspiring to see their writings take shape in print, that calligraphy offers invaluable insights into the craft of the book.
Step outside that museum gallery, however, and the rest of the Red Fort lies grimy and reeking of bats. They had also mounted a photo exhibition to commemorate the birth centenary of Netaji, recalling the historic bond between the Indian National Army and the Red Fort. Netaji had once declared that hoisting the national tricolor over the ramparts of the Red Fort was his singular, supreme dream. Yet while the archival documentation was respectable, the curation itself was hurried and slipshod. It was hardly surprising that among all the halls in the complex, this one held the least attraction for the visiting public…
1997


“ఈ ఇరవయ్యవ శతాబ్దంలో రాజ్యం అసాధారణమైన మార్పులకి లోనవుతోంది. ఇక భారతదేశంలో రాజ్యం తన ప్రజాస్వామిక ఆచరణలన్నిటితోనూ అటు ఉగ్రవాదికీ, ఇటు రాజనీతివిద్యార్థికీ కూడా అర్థంగాని ప్రహేళికగానేమిగుల్తోంది.”
“దినాంతానికి రాలిపోయే
అజేయ పుష్పం,
షాజహాన్ కన్నా ప్రేమోన్మత్త భ్రమరం.”
హృదయపూర్వక ధన్యవాదాలు సోమ శేఖర్!