నా అదృష్టమేమంటే, నా యవ్వనకాలంలో గొప్ప గురువులు లభించారు. నేనేది రాసినా ఎంతో ఆదరంగా, శ్రద్ధగా చదివి నాకు సూచనలిచ్చేవారు, ప్రోత్సహించేవారు. ఇప్పుడు పొద్దు వాటారుతున్నాక నా తరువాతి తరం యువపాఠకులు నా రచనల్ని చదువుతున్నారు. ఒక రచయితకి ఇంతకన్నా తృప్తి కలిగించే అంశం మరొకటి ఉండదని చెప్పగలను. సంజయ్ ఖాన్ గొప్ప పాఠకుడు, కథకుడు, సాహిత్యాభిమాని. ఆ వెన్నెల రాత్రుల పైన ఆయన రాసిన ఈ వ్యాసం మీతో పంచుకోకుండా ఎలా ఉండగలను!
ఆ వెన్నెల రాత్రులు
ఎప్పుడో 1987 లో మొదలుపెట్టిన నవల. రెండేళ్ళ కిందట పూర్తిచేయగలిగాను. అప్పణ్ణుంచీ ప్రచురిద్దామనుకుంటూనే వాయిదా వేస్తూ వచ్చాను. ఇప్పటికే ఆలస్యం అయ్యింది. అందుకని ఈ వసంతపూర్ణిమ నాడు ఈ పుస్తకాన్నిట్లా మీ చేతుల్లో పెడుతున్నాను. ఇది నా 60 వ పుస్తకం. ఎప్పట్లానే ఈ పుస్తకాన్ని కూడా మీరు ఆదరిస్తారని భావిస్తున్నాను.
ఒక మాట
చివరికి ఇన్నాళ్ళకి, అంటే ఈ రచన మొదలుపెట్టిన 36 ఏళ్ళ తరువాత, ఇలా పూర్తిచేయగలిగాను. నా జీవితంలో సుదీర్ఘకాలం తీసుకున్న రచనగా ఇది మిగిలిపోతుంది.
