మహాత్ముణ్ణి చూసిన క్షణాలు-3

3

టిక్కెట్టు లేకుండా  రైలు ప్రయాణం

శ్రీధర్ దాస్

అవి 1921 నాటి డోలా పండుగ సెలవుల రోజులు. నేను ఇంట్లోనే ఉన్నాను. ఆ సమయంలో మహాత్మా గాంధీ ఒరిస్సా పర్యటనకు వస్తున్నారన్న వార్త విన్నాను. సాఖీగోపాల్‌లో ఒక సభ జరగబోతోందనీ, ఆ సభలో మహాత్మా గాంధీ ప్రసంగిస్తారనీ తెలిసింది. అప్పటికే మా కళ్లల్లో మహాత్మా గాంధీ ఒక దేవుడి స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక ఆయన్ను స్వయంగా కళ్లారా చూసి, ఆయన మాటలు వినాలన్న కోరికని ఎవరైనా ఎలా ఆపుకోగలరు? అందుకని సుమారు ముప్పై ఐదు మైళ్లు కాలినడకన పోయి సాఖీగోపాల్ చేరుకున్నాను. సభ జరిగింది. మహాత్ముడు ప్రసంగించేది హిందీలో కదా; నాకేమీ అర్థం కాదేమోనని భయపడ్డాను. కానీ ఆయన మాట్లాడిన హిందీ అర్థం చేసుకోడం నాకేమాత్రం కష్టమనిపించలేదు.

అదీకాక, ఆయన ప్రసంగాన్ని గోపబంధు అక్కడికక్కడే ఒరియాలోకి అనువదించి చెప్పారు. సత్యవాది నుండి మహాత్మాజీ పూరీ బయల్దేరారు. ఆ రోజు సాఖీగోపాల్ స్టేషన్ జనంతో కిక్కిరిసిపోయింది. నేను కూడా అదే రైల్లో పూరీ బయలుదేరాను. ఆ రోజు మిగతా వందలాది మంది ప్రయాణికుల్లాగే, నాది కూడా టిక్కెట్టు లేని రైలు ప్రయాణమే.

(శ్రీధర్ దాస్ (1901-1988): ప్రముఖ విద్యావేత్త, పేరొందిన నిఘంటుకర్త, అనువాదకుడు. ఈ వ్యాసాన్ని ఇంగ్లిషులోకి అనువదించిన మేరీ మొహంతి పూరీలో, ప్రభుత్వ మహిళాకళాశాలలో ఆంగ్ల అధ్యాపకురాలు.)


4

అర్ధరాత్రి సాహసం

వాంఛానిధి పట్నాయక్

సహాయ నిరాకరణ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి మహాత్మా గాంధీ దేశమంతటా పర్యటించారు. మా హైస్కూలు పరీక్షలు 1921 మార్చి 31 నుండి ప్రారంభం కావలసి ఉంది. మార్చి 19న, మద్రాసు వెళ్లే మార్గంలో మహాత్మా గాంధీ బరంపురం మీదుగా వెళ్లవలసి ఉంది. నేనూ, మృత్యుంజయుడూ మహాత్మా గాంధీని దర్శించుకోవాలని నిశ్చయించుకున్నాం. అయితే, ఆయన్ను చూసి, పరీక్ష జరిగే రోజు నాటికి మళ్లీ వెనక్కి తిరిగి రాగలమా లేదా అన్న దిగులు మమ్మల్ని పట్టుకుంది. మాతో పాటు రావాలని చాలామంది విద్యార్థులే ఆశపడ్డారు. కానీ వెళ్లవద్దని మాత్రం ప్రతి ఒక్కరూ మమ్మల్ని వారించారు.

అర్ధరాత్రి వేళ, చదువుకు కాస్త విరామం ఇద్దామని అనుకున్నాం. బయటకు వచ్చి చూస్తే, పక్క మెస్సు లోని విద్యార్థులు ఎంతోమంది గాంధీజీని చూడటానికి బరంపురం వెళ్లడానికి సిద్ధపడుతున్నారు. ఇంక మేమేం చేయగలం? ఆ రోజుల్లో రసూల్‌కొండ నుండి బరంపురానికి రోజూ ఒకే ఒక బస్సు. అది ఆ రోజే వెళ్లి, అదే రోజు తిరిగొచ్చేది. పొద్దున్నే బయల్దేరే ఆ బస్సుకి కనీసం ముప్ఫయి మంది ప్రయాణికులు దొరికితేనే మామూలు సమయం కంటే కాస్త ముందే బయలుదేరేది. మాలో అసహనం పెరిగిపోయింది. కానీ బస్సు చార్జీలు ఎలా సర్దుబాటు చేసుకోవడం? మా క్లాస్‌మేట్ రఘునాథ్ సాహు అక్కడే కూర్చుని ఉన్నాడు. వాడి మెడలో ఒక బంగారు గొలుసు ఉంది.. మా చూపు దానిమీద పడగానే, ఆ గొలుసు ఇవ్వమని అడిగాం. వాడు దాన్ని తన మెడలోంచి తీసి ఇచ్చేశాడు. గొలుసైతే చేతికి వచ్చింది సరే, కానీ అర్ధరాత్రి పూట, దానికి బదులుగా డబ్బులెవరిస్తారు? గొలుసు చేతబట్టుకుని బజారుకు వెళ్లాం. ఒక హోటలు యజమాని తలుపు సగం తీసి ఉంచి, ముందు గుమ్మం దగ్గర కూర్చుని ఆ రోజు సంపాదన లెక్కపెట్టుకుంటున్నాడు. మేం ఆ గొలుసు అతడి దగ్గర కుదువబెట్టి పదిహేను రూపాయలు అప్పు తీసుకున్నాం. రఘునాథూ, మృత్యుంజయుడూ, నేనూ బరంపురం బయల్దేరాం.

మా బాబాయి దుర్గా మాధవ్ పట్నాయక్ అప్పట్లో ఉపాధ్యాయ శిక్షణ పొందుతున్నారు. ఎంతో జంకుతూ ఆయన దగ్గరకు వెళ్లి, మా ప్రయాణం సంగతి చెప్పాం. కానీ ఆయనెందుకు మమ్మల్ని ఆపుతారు? నిజానికి ఆయనకి కూడా మాతో రావాలనే ఉంది, కానీ ఆయన దగ్గర చాలినంత డబ్బు లేదు. బెలగుంతకు చెందిన పట్టం సూరపాత్ర ఆయనకు కొంత డబ్బు సర్దారు.

తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో మేం బరంపురం రైల్వే స్టేషన్ చేరుకున్నాం. కాసేపటికే రైలు ప్లాట్‌ఫారమ్‌మీదికి వచ్చింది. గాంధీజీకి స్వాగతం పలకడానికి అపార జనసందోహం గుమిగూడింది. ఆ జనం తాకిడికి గాంధీజీ మోటారుకారు అంగుళం కూడా ముందుకు కదలలేకపోయింది. వాహనం ఫుట్‌రెస్ట్‌ మీద నిలబడి సబ్ కలెక్టర్ దీనబంధు పాల్ ప్రజల్ని అదుపు చేయడానికి ప్రయత్నించారు. కానీ ఆయన మాట ఎవరూ పట్టించుకోలేదు. చివరకు గాంధీజీ స్వయంగా లేచి నిలబడి, వాహనాన్ని ముందుకు పోనివ్వమని ప్రజలకు సైగ చేశాకనే జనం దారిచ్చారు. అప్పుడు సబ్ కలెక్టర్ ఊపిరి పీల్చుకున్నారు. అడ్వకేట్ మధుసూదన్ పాణిగ్రాహి నివాసమైన ‘మధుమందిర్’లో మహాత్మాజీ బస చేశారు. గాంధీజీని ఒక్కసారైనా దర్శించుకుందామని ఆ న్యాయవాది ఇంటి ముందు ఎంతోమంది ప్రజలు గుమిగూడారు. గాంధీజీ ఆ ఇంటి మొదటి అంతస్తు వరండాలో నిలబడి అందరికీ చేతులెత్తి నమస్కరించారు.

సాయంత్రం నాలుగు గంటలకి బరకాస్ మైదానంలో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. కొన్ని బల్లలు ఒకదానికొమీద ఒకటి చేర్చి ఎత్తయిన వేదిక అమర్చారు, మహాత్మా గాంధీ దానిమీద కూర్చున్నారు. ఆయన పక్కనే ఒరిస్సా మహానాయకుడు పండిట్ గోపబంధు దాస్ కూర్చున్నారు. సభ మొదలైంది. ఆ రోజుల్లో లౌడ్‌స్పీకర్లు ఉండేవి కావు. మహాత్మా గాంధీ సన్నని స్వరం చాలామందికి వినిపించలేదు. అప్పుడప్పుడూ జనం మధ్య చెలరేగే గుసగుసలూ, సందడీ ప్రసంగానికి అంతరాయం కలిగించేవి. పండిట్ గోపబంధు దాస్ లేచి నిలబడి, గంభీర స్వరంతో మాట్లాడి జనాన్ని శాంతింపజేసేవారు. ఆ రోజుల్లో గాంధీజీ అచ్చమైన గుజరాతీ వేషధారణలో—ధోవతీ, కుర్తా, తలపాగా ధరించేవారు. భుజంమీద చిన్న గుడ్డ పేలిక ఉండేది. మరోవైపు గోపబంధు బాబు పెద్ద నల్లని గడ్డంతో, ధోవతీ, కుర్తా వేసుకున్నారు. ఆయన్ను నేను చూడటం అదే మొదటిసారి.

సభ ముగిశాక అందరూ వెళ్లిపోయారు. ఇక ఆ రాత్రికి రాత్రే మళ్ళా వెనక్కి వెళ్ళడమెలా, మర్నాడు ఉదయమే పరీక్షకి హాజరు కావడమెలా అన్న చింత మమ్మల్ని చుట్టుముట్టింది. బస్సు బయలుదేరడానికి కనీసం ముప్ఫయి మంది ప్రయాణికుల్ని సమకూర్చడం మా పనైంది. మరుసటి రోజు షౌకత్ అలీ, మహమ్మద్ అలీ, లాలా లజపత్ రాయ్ బరంపురం రాబోతున్నారు. వాళ్ళని కూడా చూడాలని మా సహ విద్యార్థులకి మనసులో ఉన్నప్పటికీ, వాళ్లు కూడా మాతో పాటే వెనక్కి రాక తప్పలేదు. తెల్లవారుజాముకల్లా మేం రసూల్‌కొండ చేరుకున్నాం. మేం మంచాలమీద ఒరిగి మూడు నాలుగు గంటలు కూడా గడవకముందే మా స్నేహితులు వచ్చి మమ్మల్ని నిద్రలేపారు. మేము బరంపురం వెళ్లి వచ్చిన విషయం వాళ్లకెలా తెలిసిందో మరి! భోజనం ముగించుకుని, ఉదయం పదింటికల్లా పరీక్ష హాలుకి చేరుకున్నాం. కళ్ళనిండా ఒకటే నిద్ర ముంచుకొస్తోంది. ఆ రోజుల్లో మా పరీక్షలు వరుసగా మూడు రోజుల పాటు, రోజుకు రెండు పూటలా జరిగేవి. అప్పటివరకు జరిగిన ప్రతి పరీక్షలోనూ, ప్రతి తరగతిలోనూ నేనే మొదటి స్థానంలో నిలిచేవాణ్ణి. కానీ ఇప్పుడు చూడబోతే ముందసలు పరీక్ష పాసవుతానా అని సందేహం కలిగింది. ఏమైతేనేం, ప్రస్తుతానికైతే ఆ బెంగ పక్క పెట్టేశాను.

(వాంఛానిధి పట్నాయక్ (1901-1988): కవి, సంఘసేవకుడు. ఆయన రాసుకున్న ఆత్మకథ ‘మో కథ’ 1988లో భువనేశ్వర్‌లోని పూజ్యపూజా ఒరిస్సా వారు ప్రచురించారు. ఈ వ్యాసాన్ని ఇంగ్లిషులోకి అనువదించిన ప్రజ్ఞా పారమితా పాణిగ్రాహి భువనేశ్వర్‌లోని ఉత్కళ విశ్వవిద్యాలయం, దూరవిద్య విభాగంలో అధ్యాపకురాలు.)


5

గాంధీకి ఒక కానుక

హరిచరణ్ గిరి

పండిట్ గోపబంధు ఆహ్వానం మేరకు మహాత్మా గాంధీ ఒరిస్సా పర్యటనకు మొదటిసారి వచ్చారు. కటక్‌లోని బారాబటి కోట ఎదురుగా ఉన్న మైదానంలో సభ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే కాంగ్రెస్ వారు ఆ సభ జరపకుండా అడ్డుకోడానికి పోలీసులు కటక్‌లో 144 సెక్షన్ విధించారు. దాంతో ఒరిస్సా నాయకులు తీవ్రమైన ఆందోళనలో పడ్డారు. కానీ పండిట్ గోపబంధు ఒక ఉపాయం ఆలోచించి, 144 సెక్షన్ పరిధిలోకి రాని కాట్జూరి నది ఒడ్డున ఇసుక తిన్నెలమీద సభ ఏర్పాటు చేశారు. ఒక్క గంట వ్యవధిలోనే సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. నిర్ణీత సమయానికి, అంటే మధ్యాహ్నం నాలుగు గంటలకే సభ మొదలైంది. ఆరుబయట, ఆకాశం కింద ఇసుక తిన్నెలమీద వేలాది మంది ప్రజలు వచ్చి చేరారు.

గాంధీ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగిస్తుండగా, పోలీసులు ఎవరో ఒకరి చేత ఆ సభ మధ్యలోకి చిరిగిన చేట ఒకటి విసిరేయించారు. ‘ఇది గాంధీకిచ్చిన బహుమతి’ అని ఎవరో గట్టిగా అరిచారు. సభ ముగిశాక, ఆ చేటను వేలం వేయాలని గోపబంధు సూచించారు. వేలంలో పాల్గొనాల్సిందిగా ప్రజల్ని ఆహ్వానించారు. ఒక పెద్దమనిషి వెంటనే ఆ వేలంపాటలో అందరికంటే ఎక్కువ పాడి, ఇరవై రూపాయలు చెల్లించి మరీ ఆ చేట పట్టుకెళ్లిపోయారు.

(హరిచరణ్ గిరి (1903-1995)రాసుకున్న ఆత్మకథ ‘మో జీవన కహాణీ’1983లో పిపిలిలో రచయిత నే స్వయంగా ప్రచురించుకున్నారు. ఈ వ్యాసాన్ని ఇంగ్లిషులోకి అనువదించిన జతీంద్ర కె. నాయక్ భువనేశ్వర్‌లోని ఉత్కళ విశ్వవిద్యాలయంలో ఆంగ్ల ఆచార్యులు. ఆయన ఈ పుస్తకానికి సంపాదకులు కూడా.)

30-9-2026

One Reply to “”

  1. విద్యార్థులు పరీక్షల్ని కూడా పక్కన పెట్టి గాంధీజీని చూడటానికి వెళ్లడం, ఒకరేమో ముప్పై ఐదు మైళ్లు కాలినడకన వెళ్లడం, టికెట్ లేకుండానే ప్రయాణం చేయడం,
    గాంధీజీని అవమానించడానికి విసిరిన చిరిగిన చేటే 20 రూపాయలకు వేలం పోవడం!! ఈ వివరాలన్నీ ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి.

    It is fascinating to see the historical events through the eyes of people from different ages, backgrounds, and places. 🙏🏽

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading