
6
దోసెడు ఇసుక
ఉదయ్‌నాథ్ శారంగి
ఈ రోజుల్లో ఒరియాలో ప్రముఖ దినపత్రికగా వెలుగొందుతున్న ‘ది సమాజ్’, ఆ కాలంలో వారపత్రికగా వచ్చేది. నేను సబ్ రిజిస్ట్రార్ గారి నివాసానికి వెళ్లినప్పుడు ఆ వారపత్రిక నా కంటపడింది. అందులో ఇంగ్లీషు, ఒరియాల్లో పెద్ద అక్షరాలతో ప్రచురించిన వార్త ఒకటి కనిపించింది: ‘మహాత్మా గాంధీ ఒరిస్సా పర్యటనకు రానున్నారు; మార్చి 23 నాటికి కటక్ చేరుకుంటారు’.
ఆ సమయంలో దుర్గాచరణ్ మహాపాత్ర అనే జమీందారు ఇంటి ఎదురుగా ఉన్న విశాలమైన మైదానంలో ‘డోలా మేళన్’ ఉత్సవం జరుగుతోంది. అక్కడ విపరీతమైన జనం గుమిగూడారు. నేనక్కడికి వెళ్ళినప్పుడు నాకు మహాత్మా గాంధీ ఒరిస్సా పర్యటన వివరాలు ఉన్న కరపత్రమొకటి దొరికింది. అందులో గాంధీగారు మార్చి 23న రావలసి ఉంది. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా నేను మర్నాడు పొద్దున్నే కటక్ బయల్దేరాను. అంతా ఒక క్షణికావేశంలో జరిగిపోయింది. ఇంటి నుండి కటక్ ఎంత దూరమో, ఎప్పుడు బయలుదేరాలో, కటక్ చేరుకున్నాక ఎక్కడ ఉండాలో నాకేమాత్రం తెలియదు. నా దగ్గరున్న డబ్బైతే కేవలం మూడు అణాలు మాత్రమే.
ఆ మూడణాలనీ దృష్టిలో పెట్టుకుని, కటక్ దాకా కాలినడకనే పోదామనుకున్నాను.. సుమారు పదిహేను మైళ్లు నడిచాక, దారిన ఉన్న ఒక చిన్న పల్లెటూరి బజారు ‘బవడే’ చేరుకున్నాను. అక్కడ కాసిన్ని పేలాలూ, మరమరాలూ తిన్నాను. అవన్నీ నమలడం నావల్ల కాక సగం పక్కనే ఉన్న కాలువలోకి విసిరేసి, దోసిలి పట్టి అందులో నీళ్లు తాగాను. కాలువకు నేను సమర్పించిన ఆ పేలాలకి బదులుగానే ఈ నీళ్లు నాకు దక్కాయేమో అని క్షణకాలం అనిపించింది. ఇంకా సాయంత్రం కాకముందే కటక్ రైల్వే స్టేషన్ చేరుకున్నాను.
కటక్ నాకు కొత్త ప్రదేశం. ఎటు వెళ్లాలో ఏమీ పాలుపోలేదు. స్వరాజ్య ఆశ్రమం ఎక్కడుందో, అక్కడికి ఎలా వెళ్ళాలో నాకు తెలియదు. పోనీ ఎవరినైనా అడుగుదామన్నా ఎంతో సిగ్గనిపించింది.
అయితే, నా ముందే ఒక ఐదారుగురు నడుచుకుంటూ వెళ్లడం కనిపించింది. వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటల్ని బట్టి వాళ్ళు ఆ ఆశ్రమానికే వెళ్తున్నారని తెలిసింది. కేవలం మహాత్మా గాంధీని దర్శించుకోవాలనే వాళ్లంతా సాలీపూర్ నుండి గుంపుగా వచ్చారు. నేను ఒక్కడినే కావడంతో వాళ్లతో కలిసిపోయాను.
మేము మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఆశ్రమం చేరుకున్నాం. అప్పటికే ఆ ప్రదేశమంతా ఒక మహా జనసముద్రంలా మారింది. వందలాది మంది లోపలి వరండాలో భోజనాలు చేస్తున్నారు. ఆ సమయంలో లోపలి నుండి చూడటానికి చక్కగా కనిపిస్తున్న ఒక యువకుడు బయటకు వచ్చి నన్ను లోపలికి పిలిచాడు.
తర్వాత ఆయనతో కాస్త చనువు పెరిగాక ఆయన పేరు సుదర్శన్ ప్రహరాజ్ అని తెలిసింది. స్వాతంత్ర్య పోరాటంలో కోసం ఆయన చదువు వదిలిపెట్టేశారు. అప్పట్లో ఆయన కటక్‌లో చదువుకుంటూ ఉండేవారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలమీద ఆయనకు మంచి అవగాహన ఉంది. అంతటి తెలివైన, ఉత్తమ యువకుడు నాకు మార్గదర్శిగా దొరికినందుకు నాకెంతో సంతోషం కలిగింది.
అర్ధరాత్రి దాటాక ఆశ్రమంలో ఉన్నవారంతా రైల్వే స్టేషన్ వైపు నడవడం మొదలుపెట్టారు. నేనూ వాళ్లతో కలిశాను. అక్కడికి చేరుకున్నాక చూస్తే స్టేషన్ జనంతో విపరీతంగా కిక్కిరిసిపోయింది. ప్లాట్ఫారమ్మీద అడుగుపెట్టడం అసాధ్యమైపోయింది. వందలాది మందితో పాటు నేను కూడా రోడ్డు పక్కన నిలబడక తప్పలేదు. వాళ్లతో గొంతు కలిపి నేనూ ఆకాశం దద్దరిల్లేలా ‘మహాత్మా గాంధీకి జై’ అంటూ నినదించడం మొదలుపెట్టాను.
ఆ పగలంతా ఎలా గడిచిపోయిందో నేనిప్పటికీ చెప్పలేను.
సాయంత్రం కాట్జూరి నది ఒడ్డున ఇసుక తిన్నెలమీద ఒక బహిరంగ సభ జరిగింది. అక్కడికి అపార జనసందోహం తరలివచ్చింది. నది ఒడ్డున కట్ట మీంచి అటూ ఇటూ చూస్తే, ఇరువైపులా ఉన్న ఆ జనాన్ని చూసి ఆశ్చర్యపోయాను. ఆ జనసంద్రం సుదూర దిగంతాల దాకా విస్తరించి ఉన్నట్టు అనిపించింది. నేను సుదర్శన్‌తో కలిసి వేదికకి దగ్గరగా అనువైన చోటు చూసుకుని కూర్చుని, మహాత్మా గాంధీ రాక కోసం ఎదురుచూశాను.
ఎట్టకేలకు కస్తూర్బాతో కలిసి గాంధీజీ వచ్చారు. పండిట్ గోపబంధూ, భాగీరథీ మహాపాత్రా ముందు నడుస్తూ దారి తీశారు. వారితో పాటు మరికొందరూ ఉన్నారు.
ఒక్కసారిగా ఆకాశం మార్మోగేలా ‘గాంధీజీకి జై’ అనే నినాదం మిన్నంటింది. భక్తిభావంతో ఉప్పొంగిపోతున్న ఆ జనసమూహం పలికిన కంఠస్వరమది. గాంధీజీ వేదికమీద కూర్చున్నారు. ఆయనకు ఎడమవైపున వేసిన కుర్చీలో కస్తూర్బా ఆసీనులయ్యారు. ఆ రోజుల్లో కటక్‌లో మైకుల సంగతే ఎవరికీ తెలియదు.
ముందుగా పండిట్ గోపబంధు గాంధీజీకీ, కస్తూర్బాకీ స్వాగతం పలికారు. ఆయన స్వరం గంభీరంగా, ప్రతిధ్వనించేలా సాగింది. ఆ ప్రాంతమంతా జనంతో కిక్కిరిసిపోయినప్పటికీ, అంతటా ప్రశాంతమైన నిశ్శబ్దం అలుముకుంది. ప్రతి ఒక్కరూ కదలకుండా, శ్రద్ధగా పండిట్ గోపబంధు ఉపన్యాసం వింటున్నారు; అది చాలా దూరం దాకా స్పష్టంగా వినిపించింది.
నాకు గుర్తున్నంతవరకు పండిట్ గోపబంధు ఇలా అన్నారు: ‘ఉత్కళభూమి పవిత్రమైన నేల, దైవానికి ప్రీతిపాత్రమైన చోటు. భరతమాత ముద్దుబిడ్డలందరూ ఈ గడ్డను దర్శించారు. ఇప్పుడు మహాత్మా గాంధీ రాకతో ఈ ప్రదేశం మరింత పవిత్రమైంది. మూడు వందల ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే డోలా పూర్ణిమ పవిత్ర దినాన శ్రీ చైతన్య మహాప్రభువు ఇక్కడే ఈ నదిని దాటారు. నేడు ఈ వర్తమాన యుగపు దైవావతారమైన మరో పుణ్యపురుషుడు తన పాదస్పర్శతో ఈ నేలను పునీతం చేశారు. ఇది మన అదృష్టం, భాగ్యవిశేషం’.
దేశ పరిస్థితులూ, స్వాతంత్ర్యోద్యమ లక్ష్యాలూ, ఉద్యమం విజయవంతం కావడానికి అనుసరించవలసిన కార్యాచరణను వివరిస్తూ గాంధీజీ హిందీలో సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఆయన ఉపన్యాసం నాకు పెద్దగా కొరుకుడుపడలేదు. అయినా సరే, ఆయన చెప్పిన ప్రతి మాటా నాకు అర్థమైనట్టే మిగతావాళ్లతో పాటు నేనూ చప్పట్లు కొట్టాను. ప్రసంగం ముగిశాక, సభలోని ఒక యువకుడు లేచి, ‘మీరేమో మమ్మల్ని చదువులు వదిలేయమంటున్నారు. మీరూ, మీలాంటి మిగతా నాయకులూ ఇంగ్లీషు చదువుకున్నారు కదా. మాకు ఇంగ్లీషు పరిజ్ఞానం లేకుండా దేశసేవ ఎలా చేయగలం?’ అని గాంధీజీని అడిగాడు.
గాంధీజీ బదులిస్తూ, ‘ఇప్పుడే కదా గోపబంధు బాబు శ్రీ చైతన్యుల గురించి చెప్పారు. ఆయన ఏమైనా ఇంగ్లీషు చదువుకున్నారా? చైనా నాయకుడు చియాంగ్ కైషేక్కు ఇంగ్లీషు రాదు, మరి ఆ దేశ వ్యవహారాలను ఆయన ఎలా నడిపిస్తున్నారు?’ అన్నారు.
ఆ ప్రశ్న అడిగిన యువకుడు ఎవరో కాదు, మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కిశోరీ చరణ్ కానుంగో గారి తమ్ముడేననీ, ఆయన పేరు నృసింహ చరణ్ కానుంగో అనీ నాకు ఆ తర్వాత తెలిసింది. బహిరంగ సభలో మహాత్మా గాంధీని అలా నిలదీసి ప్రశ్నించే ధైర్యం ఆ రోజుల్లో చాలా అరుదు. అంతటి సాహసం చూపినందుకు చాలామంది ఆ యువకుణ్ణి మెచ్చుకుంటే, కొందరు మాత్రం ఆయన ప్రవర్తనను తప్పుపట్టారు.
గాంధీజీని శ్రీమహావిష్ణువు పదవ అవతారంగా ప్రజలు భావించేవారు. పదకొండవ అవతారమైన కల్కి ఎప్పుడో సుదూర భవిష్యత్తులో రావలసి ఉంది. ఈ నమ్మకానికి ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉండేది: శ్రీకృష్ణుడు జన్మించిన ద్వారకా ప్రాంతమే గాంధీజీ జన్మస్థలం కూడా. రావణ సంహారమే రామావతారపు ముఖ్య లక్ష్యం; కంసుని వధించడమే శ్రీ కృష్ణావతారపు ప్రధాన ధ్యేయం. ఇప్పుడు కూడా సమాజంలో మోసం, అవినీతి లాంటి దుర్గుణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ విదేశీ ప్రభుత్వాన్ని తుదముట్టించడానికి రక్షకుడి రూపంలో భగవంతుడే గాంధీజీగా అవతరించాడన్నది ఆ కథ సారాంశం. దీనికి తోడు, ఒరిస్సా కమిషనర్ గ్రూనింగ్ను కొద్ది రోజుల క్రితమే పండిట్ గోపబంధు ఓడించడం కూడా ఈ విశ్వాసానికి ఊతమిచ్చిన సంఘటనగా మారింది.
గాంధీజీ ఏదో ఒక రోజు విదేశీ పాలకుల్ని తరిమికొడతారన్న నమ్మకం మాలో కూడా బలపడటంతో, నేనూ సుదర్శనూ ఆ నదీతీరం నుంచి దోసిళ్ళతో ఇసుక తెచ్చి ఆశ్రమం ముందు చల్లాం. గాంధీజీ, కస్తూర్బాలు నడిచిన ఆ పవిత్రమైన ఇసుకను ఒక పెన్నిధిలా మేమేంటో కాలం పాటు దాచుకున్నాం.
(ఉదయనాథ్ శారంగి (1905-1999) ప్రసిద్ధ పాత్రికేయులు. ఆయన ఆత్మకథ ‘గాంధీ మహారాజంక శిష్య’ ని 1984లో ఒరిస్సా బుక్ స్టోర్ వారు ప్రచురించారు. ఈ వ్యాసాన్ని ఇంగ్లిషులోకి అనువదించిన ప్రశాంత కె. రథ్ విశ్రాంత ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు.)
7
మహాత్మా గాంధీ ఒక అనాగరికుడు
చింతామణి మిశ్రా
నేను సత్యవాది పాఠశాలలో చేరిన కొద్ది రోజులకే ఇదంతా జరిగింది. మహాత్మా గాంధీ సత్యవాది వస్తున్నారన్న వార్త వినగానే మా బాబాయి దగ్గరకు పరుగుతీశాను. గాంధీ గొప్పతనం గురించీ, సహాయ నిరాకరణోద్యమ ప్రాధాన్యత గురించీ ఆయనకు పూసగుచ్చినట్టు చెప్పి, ఆయన చేత ఖద్దరు కట్టించి, ఆయన్ని కూడా గట్టి కాంగ్రెస్ వాదిగా మార్చేయాలని నా ప్రణాళిక. నాతో పాటు సత్యవాదికి వచ్చి గాంధీ ప్రసంగం వినవలసిందిగా ఆయన్ని అడిగాను. నాతో పాటు రావడానికి ఆయన చాలా ఉత్సాహం చూపించారు. పాఠశాల ప్రాంగణంలో జరుగుతున్న ఆ సభకు ఆయనా, నేనూ వెళ్లాం. మా ఊళ్లో ముస్లింలు కూడా చాలామంది ఉండేవారు కాబట్టి, మాకు ఒరియా కలిసిన హిందీతో సులభంగానే అర్థమయ్యేది.
సభ సాగుతోంది; ఇంతలో మహాత్మా గాంధీ మధ్యాహ్న భోజన సమయం రానే వచ్చింది. ఆయన అనుచరుల్లో ఒకరు కాస్త ఆహారం తెచ్చి మహాత్మా గాంధీ ముందు పెట్టారు. గిన్నెలో ఒక చెంచా ఉంది; గాంధీజీ ఆ గిన్నె చేతుల్లోకి తీసుకుని గబగబా తినడం మొదలుపెట్టారు. అందరూ రెప్పవాల్చకుండా ఆయన వైపే చూస్తున్నారు. ఆ గిన్నెలో ఉన్న అపురూపమైన ఆహారం ఏమై ఉంటుందా అని నేనూ ఒకటే ఆలోచిస్తున్నాను. సరిగ్గా అదే సమయంలో మా బాబాయి, ‘ఎంత మోటుమనిషి!’ అంటూ విసుగ్గా గట్టిగా అనేసి, సభలోంచి లేచి కోపంగా వెళ్లిపోయారు. నేను కూడా లేచి ఆయన వెనుకే వెళ్లి, ఆయన పక్కన మౌనంగా నిలబడ్డాను. ‘ఒరే పిచ్చివాడా! ఈ మనిషి సంగతి ఏమీ తెలుసుకోకుండానే నన్ను ఇక్కడిదాకా తీసుకువచ్చావు. రైలు చార్జీల కింద యాభై పైసలు దండగ చేశావు. ఈయన్నేనా నువ్వు మహాత్ముడనేది? సభ మధ్యలో కూర్చుని అలా తింటాడా ఎవరైనా! వేలాది మంది జనం చూస్తుండగా ఎలా తినబుద్ధవుతుంది? ఇలాంటివాళ్లు అనాగరికులు, నువ్వేమో ఈయన్ని మహాత్ముడంటావు!’ అని మండిపడ్డారు.
సమయపాలన విషయంలో గాంధీజీ చాలా ఖచ్చితంగా ఉంటారనీ, వేళ తప్పకుండా సమయానికే ఆహారం తీసుకుంటారనీ బాబాయికి నచ్చజెప్పడానికి ప్రయత్నించాను. కానీ లాభం లేకపోయింది!
మరుసటి రోజు ఉదయం మేము ఊరికి బయలుదేరే ముందు, మా బాబాయితో మాట్లాడవలసిందిగా హరిబాబునూ, రాంబాబునూ బతిమిలాడాను . హరిబాబు అసలు ఆ విషయం ఎత్తకముందే, ‘ఐదు వేల మంది ఎదురుగా కూర్చుని నువ్వు తినగలవా? తూర్పు దేశాల వాళ్లందరూ ఇంతగా దిగజారిపోయారా? ఇది భోజనం సమయమని అందరూ అంటున్నారు; ఈ కుర్రాడూ, వీడి స్నేహితులూ అదే మాట చెబుతున్నారు. కాస్త ఇంగితజ్ఞానం ఉన్నవాడెవడైనా నిన్న ఆ పెద్ద మనిషి చేసిన పని చేస్తాడా?’ అంటూ బాబాయి ఎదురు ప్రశ్నించారు. హరిబాబూ, రాంబాబూ ఒకరితో ఒకరు మాట్లాడుకున్న దాన్నిబట్టి చూస్తే, వాళ్ళిద్దరూ కూడా గాంధీని సమర్థించడం మానేసి బాబాయి ఆరోపణల్నే అంగీకరించినట్టు నాకు అర్థమైంది.
(చింతామణి మిశ్రా (1906-1980) ‘ఉత్కళ ప్రసంగ’, ‘ఒరిస్సా రివ్యూ’ పత్రికల వ్యవస్థాపక సంపాదకుడు. స్వాతంత్ర్యానంతరం ఒరిస్సా ప్రభుత్వ సమాచార, పౌరసంబంధాల శాఖకు మొదటి కార్యదర్శిగా వ్యవహరించారు. నవజీవన్ సాహిత్య పత్రిక సంపాదకులు కూడా. ఈ భాగం ఆయన ఆత్మకథ ‘అర్ధశతాబ్దిర అనుభూతి’ (మొదటి సంపుటం) నుంచి తీసుకున్నది. కటక్‌లోని నవజీవన్ పుస్తకాలయ వారు 1983 లో దాన్ని ప్రచురించారు.ఈ వ్యాసాన్ని ఇంగ్లిషులోకి అనువదించిన అక్తర్ జె. ఖాన్ భువనేశ్వర్‌లోని ఉత్కళ విశ్వవిద్యాలయంలో ఆంగ్ల అధ్యాపకులు.)
30-9-2026

