
1
గాంధీజీతో ముఖాముఖి
రమాదేవి
తన రాజీనామా సమర్పించిన మూడు నాలుగు రోజుల తర్వాత గోపబాబు స్వరాజ్య ఆశ్రమానికి వెళ్లడం మొదలుపెట్టారు. గాంధీజీ కటక్‌కు వస్తున్నారన్న వార్త అప్పటికే అంతటా తెలిసిపోయింది. కార్యకర్తల్లోనూ, వాలంటీర్లలోనూ సరికొత్త ఉత్సాహోద్రేకాలు వెల్లువెత్తాయి. ఉద్యమంలో చేరేందుకు ఆశ్రమానికి కొత్తవారు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.వారి బాగోగులు డాక్టర్ అటల్ బిహారీ ఆచార్య (అటల్ దా) చూసుకునేవారు. అటల్ దా మృదుభాషి, కానీ నిలువెల్లా విప్లవకారుడు. కలకత్తాలో వైద్య విద్య చదువుతున్న రోజుల్లో ఆయనకి సాయుధ విప్లవోద్యమంతో సంబంధాలుండేవి. ఆయన బస చేసిన విద్యార్థుల వసతిగృహం గది గోడలమీద ఒక కాళీమాత పటం ఉండేది. అటల్ దా కాళీ భక్తుడని అందరూ భావించేవారు. ఒకరోజు ఆయనమీద అనుమానంతో పోలీసులు ఆ గది సోదా చేశారు. గది మొత్తం క్షుణ్ణంగా వెతికారు కానీ, భక్తిభావం వల్ల ఆ కాళీమాత పటం మాత్రం ముట్టుకోలేదు. అటల్ దా ఆ పటం వెనకాటలే తన తుపాకీ దాచిపెట్టారు.
అటల్ దా విప్లవమార్గం వదిలిపెట్టి సహాయ నిరాకరణోద్యమంలో చేరాక అందులో ఎంతో క్రియాశీలకంగా మారారు. ఆ రోజుల్లో కాంగ్రెస్ నిర్వహించే బహిరంగ సభలకు వెళ్లడానికి గానీ, ప్రదర్శనలలో పాల్గోడానికి గానీ ఎవరూ పట్టించుకోని, సాహసించని కాలమొకటి ఉండేది. అటువంటి సందర్భాల్లో జాతీయ త్రివర్ణ పతాకం పైకెత్తి పట్టుకుని అటల్ దా తానొక్కరే ఆ పట్టణ వీథుల్లో గంభీరంగా నడుచుకుంటూ పోయేవారు. కాట్జూరి నదీ తీరానికి వెళ్ళి అక్కడి ఇసుక తిన్నెలమీద ఆ జెండా పాతేవారు. వినేవాళ్ళు ఎవరున్నా లేకపోయినా తాను చెప్పదలుచుకున్నది ఎలుగెత్తి ప్రసంగిస్తూ ఉండేవారు.
హోలీ పండుగ మొదలయ్యే మార్చినెలలో డోలా పున్నమి నాడు గాంధీజీ కటక్ చేరుకున్నారు. ఆ రోజు ప్రతి ఒక్కరి ఆనందోత్సాహలకీ పటాపగ్గాలు లేకుండాపోయాయి. చెయ్యవలసిన పనులు ఎన్నో ఉండటంతో, క్షణం ఆగి ఊపిరి పీల్చుకునే తీరిక కూడా ఎవరికీ లేకపోయింది. ఆ రోజు మధ్యాహ్నం రెండింటికి ‘బినోద్ బిహారీ’ అనే చోట సభ జరగ వలసి ఉంది. నేను ఆ సభకు వెళ్ళకుండా ఉండనని మా అత్తగారు ముందే గ్రహించారు. అందుకే నన్ను ఇంటిపనులు త్వరగా ముగించుకొమ్మని చెప్పి, నేను సభకు వెళ్లి వచ్చేదాకా, పిల్లల్ని తానే చూసుకుంటానని చెప్పారు. సాయంత్రం నదీ తీరాన బహిరంగ సభ జరగవలసి ఉంది. ఉపన్యాసాలు వినడానికి నేను ఆ కరకట్టమీద ఎక్కడో ఒకచోట కూర్చుంటానని కూడా ఆమె ఊహించారు. అందుకే వంటగదిలో సాయంత్రానికి ఇంకే పనీ మిగలకుండా మొత్తం పనులన్నీ వెంటనే పూర్తిచేసుకొమ్మని చెప్పారు.
అపరాహ్ణం ముగిసే సమయానికి నేను బినోద్ బిహారీ చేరుకున్నాను. పూజా సెలవుల్లో దుర్గాదేవి విగ్రహాన్ని పూజించే ఆ హాల్లో దుమ్ము దులిపి, శుభ్రం చేసి, సభికులు కూర్చోడానికి నేలమీద తివాసీలు పరిచారు. సభ ప్రారంభించే ముందు ఒక గీతం ఆలపిస్తే బాగుంటుంది అనిపించింది నాకు. సరిగ్గా అదే వేళకి ప్రొఫెసర్ మోహినీ మోహన్ సేనాపతి గారి భార్య హిరణ్మయీదేవి అక్కడికి వచ్చారు. ఆమె నాకు మంచి స్నేహితురాలు. నేను గీతాలాపన గురించి ప్రస్తావించగానే ఆమె తనే పాడటానికి ముందుకొచ్చారు. కానీ ఆమెకు హార్మోనియం కావలసి వచ్చింది. సమయం ఎక్కువ లేదు. అక్కడే ఆ ప్రాంగణంలోనే ఉంటున్న హైమవతీ దేవి వెంటనే ఒక హార్మోనియం తెప్పించారు. గాంధీజీ వచ్చే సమయం దగ్గరపడుతున్న కొద్దీ, సభికులు మరింత నిశ్శబ్దంగా, గంభీరంగా మారారు. అప్పటికే సుమారు నలభై మంది స్త్రీలం మేమక్కడికి చేరుకున్నాం.
కొద్దిసేపటికే బయట నినాదాలు వినిపించాయి; కస్తూర్బా, దేవదాస్ గాంధీలతో కలిసి గాంధీజీ హాల్లో అడుగుపెట్టారు. వారితో పాటు మరికొంతమంది కూడా ఉన్నారు. గాంధీజీ చిన్న ప్రసంగం చేశారు. ఆభరణాలు ధరించడం మానుకొమ్మనీ, అందుకు బదులు వాటిని తనకు విరాళంగా ఇమ్మనీ ఆయన మహిళల్ని కోరారు. కొందరు నగదు విరాళాలు కూడా ఇచ్చారు. సత్యభామపూర్‌లో, ఆ పాతబడిన రాట్నంమీద వడికిన నూలు కండె ఒకటి నాతో పాటు తెచ్చుకున్నాను. ఒకవేళ గాంధీజీ స్వయంగా వచ్చి అడిగినా సరే, ఏ ఆభరణాలూ ఇవ్వొద్దని మా అత్తగారు నన్ను ముందే హెచ్చరించారు. ఎప్పటిలాగే నేను ఆమె మాట వినకతప్పలేదు.అందుకని నా నగలేవీ ఇవ్వలేదు. ఆ నూలు కండె మాత్రం ఆయన చేతుల్లో పెట్టాను. అప్పుడు ఆయన నా వైపు చూశారు. ఆ చూపు నాలో ఏదో తెలియని అనుభూతి కలిగించింది. దాన్ని నేనిప్పటికీ మర్చిపోలేకుండా ఉన్నాను.
ఆ రోజు అలా నాకు గాంధీజీ దర్శనం లభించింది. మా అత్తగారికి కూడా ఆయన్ను చూడాలని బలంగా ఉన్నప్పటికీ, తన కోరిక మనసులోనే దాచుకున్నారు. సాయంత్రం బహిరంగ సభ జరిగే సమయానికి నాతో పాటు బామీదీదీని పంపడానికి బదులు, తనే స్వయంగా నాతో కలిసి నది ఒడ్డుకి వచ్చారు. ఆ రోజుల్లో మైకులూ, లౌడ్‌స్పీకర్లూ ఉండేవి కావు, కాబట్టి మాకు ఆ ప్రసంగాలు ఏమీ వినిపించలేదు. గాంధీజీ, కస్తూర్బాల దర్శనం చేసుకోవాలన్న కోరిక అయితే తీరింది.
ఏప్రిల్ 6 నుండి 13 దాకా ఆ వారం రోజులూ ‘జాతీయ వారోత్సవం’గా పాటించవలసి ఉంది. అందులో భాగంగా, మొదటి రోజూ, చివరి రోజూ ఉపవాసముండి, సాయంకాలం పూట తేలికపాటి ఆహారం మాత్రమే తీసుకోవాలి. దుకాణాలు, కార్యాలయాలూ అన్నీ మూసేసి ఆ రోజు హర్తాళ్ పాటించాలి. ఇలాంటి విషయాలు ఇంతకు ముందెన్నడూ ఎవరూ వినలేదు. ఇవన్నీ సరికొత్త ఆలోచనలు. కార్యకర్తలు పట్టణమంతా తిరిగి దుకాణాలు మూసెయ్యవలసిందిగా దుకాణాదారుల్ని ఒప్పించారు. హర్తాళ్ ఘన విజయం సాధించింది.
గోపబాబూ, నేనూ ఉపవాసం ఉన్నాం. మా అత్తగారు అయోమయంలో పడ్డారు. మేము ఉపవాసం ఉంటున్నాం, కానీ ఉపవాసదినాల్లో పాటించవలసిన సంప్రదాయ పద్ధతులు మాత్రం మేం పట్టించుకోడం లేదు. సాయంత్రంపూట రోజూ తినే మామూలు ఆహారమే తీసుకున్నాం. మతపరంగా ఎలాంటి ఆచారాలూ పాటించలేదు. పూజా పునస్కారాలూ, నైవేద్యాలూ లేకుండా, ఉపవాసవేళ ముగియగానే నేరుగా భోజనానికి కూర్చోవడం మా అత్తగారికి ఎంత ఆశ్చర్యం కలిగించిందో, నాకు అంత ఆనందాన్నిచ్చింది. వండిన ఉప్పుడు బియ్యం తగలడం వల్ల పొరపాటున ఆహారం మైలపడిపోతుందేమోనన్న ఆందోళనతో తక్కినవాళ్ళు నిరంతరం భయపడవలసిన అవసరం లేకపోయింది. మా ఉపవాసం వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ కలగడం లేదన్న భావన నాలో ప్రశాంతత నింపింది. ఆ రోజు నేను వీలైనంత సమయం నూలు వడకడానికే కేటాయించాను. రాట్నంగాని దూదిగాని ఏమంత బాగాలేవు. నాక్కూడా పెద్దగా చెప్పుకోదగ్గ నైపుణ్యమూ లేదు. దాంతో నేను వడికిన నూలు కూడా తక్కువమొత్తంలోనే వచ్చింది.
(రమాదేవి చౌధురి (1899-1985): ప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధురాలు. సంఘసేవకురాలు. ఆమె రాసుకున్న ఆత్మకథ ‘జీవన పథే ‘ 1984 లో గ్రంథ మందిర్ ద్వారా వెలువడింది. ఈ వ్యాసాన్ని ఇంగ్లిషులోకి అనువదించిన మన్మోహన్ చౌధురీ రచయిత్రి కుమారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రముఖ గాంధేయవాది, స్వయంగా విశిష్ట రచయిత కూడా.)
2
మహాత్ముని సందేశం
నారాయణ వీరవర సామంత
డోలా పున్నమి వేళ వాలంటీర్ల సందడితో వెన్నెల కాంతుల్లో కాట్జూరి నదీ తీరం ప్రాణం పోసుకుంది. మరుసటి రోజు ఉదయం మహాత్మాజీ ఎక్స్ ప్రెస్ రైలులో రానుండటంతో నగరమంతా ఒకటే కోలాహలంగా మారింది. సాయంత్రం మేమంతా స్వరాజ్య ఆశ్రమానికి వెళ్లి అక్కడ సమావేశమయ్యాం. అర్ధరాత్రి దాటాక శ్రీ జాదుమణి మంగరాజ్ నాయకత్వంలో ఆశ్రమం నుండి ఒక ఊరేగింపు బయలుదేరింది. హిందువులూ, ముస్లింలూ దాదాపు ఐదు వందల మంది వాలంటీర్లు స్టేషన్ వైపు నెమ్మదిగా కవాతు చేసుకుంటూ సాగారు. ‘వందేమాతరం’, ‘అల్లాహు అక్బర్’, ‘మహాత్మాజీకి జై’ అంటూ నినదిస్తూ, వెన్నెల స్నానంలో తడిసి ముద్దవుతూ ఆ సైన్యం రాత్రివేళ అక్కడికి చేరుకున్నారు . రైల్వే స్టేషన్‌లో క్రమశిక్షణ కాపాడటానికి ఎవరి స్థానాల్లో వారు నిలబడ్డారు. సుమారు నాలుగు గంటల ప్రాంతంలో జనం అదుపు తప్పుతున్నారని అర్థమైంది. కళ్లారా చూస్తే తప్ప ఆ అపార జనసందోహం ఎంతటిదో ఎవరూ ఊహించలేరు. భవనాల పై అంతస్థులూ, చెట్ల కొమ్మలూ, రోడ్లూ—స్టేషన్‌కీ రాణీహాట్ వంతెనకీ మధ్యనున్న ప్రతి ఒక్క చోటూ జనంతో కిక్కిరిసిపోయింది. అంత మంది అక్కడ సృష్టించిన ఆ గందరగోళాన్ని ఐదు వందల మంది వాలంటీర్లు మాత్రం ఎలా అదుపు చేయగలరు? అంతటి మహా జనసముద్రం ముందు వాళ్ళే మాత్రం సరిపోరనిపించింది. ఏదో ఒక ప్రమాదం సంభవించడం తప్పదనీ, దానికోసం మౌనంగా ఎదురుచూస్తూ నిలబడిపోక తప్పదనే అనుకున్నారంతా . ఏదో ఒక ముప్పు ముంచెత్తడం ఖాయమనిపించింది.
‘మహాత్మాజీకి జై’ అనే నినాదాలతో ప్రతిధ్వనిస్తున్న స్టేషన్‌లోకి ఎక్స్ ప్రెస్ రైలు వచ్చి ఆగింది. మూడో తరగతి బోగీ నుండి భారతదేశపు మహోన్నత ఆత్మ, మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ క్రిందికి దిగారు. ఒక టోపీ, ఒక మామూలు కుర్తా – అంటే ఆయన వేషధారణ. ఉద్రేకంతో ఉన్న ఆ జనసందోహం ఎప్పుడో ప్రమాదం హద్దులు దాటిపోయింది. ఏ క్షణంలోనైనా ఏదో ఒక భయంకర కల్లోలం అక్కడున్నవాళ్ళందర్నీ ముంచెత్తుతుందనిపించింది. వాలంటీర్లూ, పోలీసులూ, రైల్వే అధికారులూ ఏర్పాటు చేసిన వ్యవస్థ మొత్తం అప్పటికే చెల్లాచెదురైపోయింది. కానీ ఆ మహానుభావుడు చిరునవ్వుతో ప్రజలకు నమస్కరిస్తూ ప్లాట్‌ఫారమ్ దాటి రాగానే, ఆ జనసమూహమంతటిమీదా దానంతట అదే ఒక క్రమశిక్షణ ఆవరించింది. మహాత్ముని తేజస్సుకి మంత్రముగ్ధులై, జనం బొమ్మల్లా నిశ్చేష్టులై నిలబడిపోయారు. జనం ప్రదర్శించిన ఈ ఆత్మనిగ్రహమే మన జాతీయ స్వభావం ఎటువంటిదో తెలియజేసింది. ఒరిస్సా ప్రజలు చూపిన ఈ ఆత్మనిగ్రహ సామర్థ్యమే తమకీ, మహాత్మా గాంధీకీ మధ్య ఒక భావోద్వేగ బంధంగా ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుపుకోడానికి దోహదపడింది.
ఆ రోజు మొట్టమొదటి సభ, ఆ మధ్యాహ్నం వేళ కదమ్‌రసూల్ ప్రాంగణంలో, ముస్లిం సోదరుల మధ్య జరిగింది. ఖిలాఫత్ ఉద్యమకారులపట్ల బ్రిటిష్ ప్రభుత్వం ప్రవర్తించిన అనాగరిక వైఖరిని ఖండిస్తూ చేసిన జాతీయ తీర్మానాలూ, స్వాతంత్ర్య పోరాటంలో హిందూ-ముస్లిం ఐక్యత ప్రాధాన్యత లాంటి అంశాలు అక్కడ హాజరైన ముస్లింలతో కూలంకషంగా చర్చించారు. కాంగ్రెస్ పట్ల ఒరిస్సా ముస్లింల హృదయాల్లో డాక్టర్ ఎక్రమ్ రసూల్ మేల్కొల్పిన భక్తిభావం, స్వాతంత్ర్య సమరపు చివరి పోరాటం ముగిసేదాకా కూడా వారిని ఉత్తేజపరుస్తూనే ఉంది. అమదుకనే ఆ తర్వాత కాలంలో, సరిహద్దు ప్రాంతాల్లో, ముఖ్యంగా పొరుగున ఉన్న బెంగాల్ రాష్ట్రంలో చెలరేగిన రక్తపాత ఘర్షణల ప్రభావం ఒరిస్సామీద ఏమాత్రం పడలేదు.
ఈ చిరస్మరణీయ దినాన కాట్జూరి నది ఒడ్డున ఇసుక తిన్నెలమీద ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్ వారికి భారతదేశం అందించిన సహకారానికి బదులుగా దేశానికి పంజాబ్‌లో నెత్తురూ, క్రూరత్వమే బహుమానాలుగా లభించాయి.దాంతో స్వాతంత్ర్యం సాధించడానికి భారతదేశానికి సహాయ నిరాకరణ తప్ప మరో మార్గం లేకుండా పోయింది. ఈ అంశంమీద గాంధీజీ చేసిన ప్రసంగం అందరి మనసుల్నీ కదిలించింది. విద్యాసంస్థల్ని వదిలిపెట్టి బయటకు రావాలని ఆయన విద్యార్థుల్ని కోరినప్పుడు, కటక్ బ్రహ్మసమాజసభ్యుల్లో ఒకరైన శ్రీ లాల్ మోహన్ ఛటర్జీ, ‘తాను స్వయంగా పాశ్చాత్య విద్యని అభ్యసించి, ఆ విద్యావల్ల తానొక గొప్ప నాయకుడిగా రూపొందిన గాంధీజీ ఇప్పుడు ఆ విద్య వల్ల ఉపయోగం లేదని ఎలా చెప్పగలరు?’ అని ప్రశ్నించారు. ఆయన తన ప్రశ్న ముగించారో లేదో గాంధీజీ, ‘బుద్ధభగవానుడూ, చైతన్యమహాప్రభువూ, శంకరాచార్యుల వంటి మహనీయులకి ఈ పాశ్చాత్య విద్యతో పరిచయమే లేదు. వారితో పోలిస్తే నేనెక్కడ? అసలు ఆ పాశ్చాత్య విద్యా సంపర్కమే లేకపోయి ఉంటే నేను మరింత ఉన్నతుడిగా మారి ఉండేవాణ్ణి అని అనుకుంటున్నాను’ అని జవాబిచ్చారు. ఆ సభకు విద్యావంతులు కూడా పెద్ద ఎత్తున హాజరై ఉన్నారు. వారు గాంధీజీ చెప్పిన ఆ మాటలతో చాలా సంతృప్తి చెందారు.
ఆ రాత్రి స్వరాజ్య ఆశ్రమ ప్రాంగణంలో అక్కడి కార్యకర్తల కోసం మరో సమావేశం జరిగింది. ఆయుధాల బలం కంటే తమ నాగరికతా బలంతోనే బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని ఆక్రమించుకోగలిగారు అనే అభిప్రాయం అక్కడ వ్యక్తమైంది. మనకి కూడా అంతటి ఉన్నతమైన నాగరికత లేకుండా మనం వాళ్ళని ఎలా జయించగలుగుతాం అన్న ప్రశ్న బలంగా వినబడింది. కానీ గాంధీజీ చెప్పిందేమంటే, ‘పాశ్చాత్య నాగరికత తన మనుగడ కోసం తక్కిన జాతుల్ని దోచుకుంటుంది. కాబట్టి దాన్ని మనం ఎన్నటికీ మనకి ఆదర్శంగా స్వీకరించలేం. బ్రిటిష్ వాళ్ళు చాలా చిన్న జాతి. వాళ్ళు తమ నాగరికతను కాపాడుకోవాలంటే భారతదేశం లాంటి పెద్ద మార్కెట్‌ని తమ అధీనంలో ఉంచుకోక తప్పదు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మనం స్వయంసమృద్ధి సాధించుకోగలిగితే, బ్రిటిష్ వాళ్ళు అప్పటికి బాగా బలహీనపడతారు. భారతదేశం లాంటి భారీ దేశం కూడా అలాంటి నాగరికతనే అనుకరిస్తే, మన మార్కెట్ అవసరాలకు యావత్ ప్రపంచం కూడా చాలదన్న విషయంలో సందేహం లేదు. కాబట్టి, బ్రిటిష్ పాలన కంటే బ్రిటిష్ నాగరికతే మనకు మరింత హానికరం’ అని అన్నారు. కార్యకర్తలు అడిగిన ప్రశ్నలకు తన ప్రసంగంలోనే సమాధానాలు ఉన్నాయని చెబుతూ, చరఖాలు మనల్ని స్వయంసమృద్ధ నాగరికతగా ఎలా మారుస్తాయో గాంధీజీ ఎంతో నమ్మకంగా వివరించారు. విలాసవంతమైన పాశ్చాత్యవస్తువ్యామోహంలో పడకుండా భారతీయుల్ని నిలవరించడానికి చరఖాల వినియోగం ఎంతో అవసరమని ఆయన స్పష్టం చేశారు.
స్వరాజ్య ఆశ్రమంలో చరఖాల తయారీ మొదలయ్యింది. దూది ఏకే పద్ధతిలో సబర్మతి ఆశ్రమంలో శిక్షణ పొందిన దస్పల్లా నివాసి గోవింద్ మిశ్రా (ఆ తర్వాత ఆయన పార్లమెంటు సభ్యుడయ్యారు) నుండి ఆశ్రమ కార్యకర్తలు శిక్షణ తీసుకున్నారు. గాంధీజీ ఒరిస్సా వచ్చి వెళ్ళాక నేను కూడా రాట్నం తిప్పాలని ఆ రోజే మనసులో గట్టిగా అనుకున్నాను.
తర్వాతి సభ పూరీలోని బడదండ దగ్గర జరిగింది. 1920 నాటి వరదలకు బ్రహ్మగిరి ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. ప్రభుత్వం దాన్ని ఆధికారికంగా కరవు ప్రాంతంగా ప్రకటించకపోయినా, ఈ ప్రాంతం అప్పటికే తీవ్రంగా అతలాకుతలమై ఉంది. బడదండ దగ్గర నాగ్‌పూర్ తీర్మానం గురించి వివరిస్తూ, కాంగ్రెస్‌లో చేరి తిలక్ స్వరాజ్య నిధికి విరాళాలు ఇవ్వాలని భారత పౌరులకు గాంధీజీ పిలుపునిచ్చారు. కరవు కోరల్లో చిక్కుకుని, చిక్కిశల్యమై, అర్థనగ్నంగా ఉన్న వందలాది, వేలాది మంది ప్రజలు ముందుకు వచ్చి, తాము తమ ఒంటిమీద చుట్టుకున్న చిరుగుల కొంగుల్లో ముడేసుకున్న అరకాసునో, అణానో ఎంతో ప్రేమతో సమర్పించారు. ఆ దృశ్యం చూసి గాంధీజీ ఎంతగానో చలించిపోయారు; బ్రహ్మగిరి పేదలకు ప్రతినిధిగా తాను తన జీవితాంతం వారి మాదిరిగానే కొల్లాయి మాత్రమే ధరిస్తానని అక్కడే ప్రతిజ్ఞ చేశారు. భారతదేశ భవిష్యత్తు గ్రామాల్లోనే ఉంది కాబట్టి, వాలంటీర్లు పట్టణాల్లో కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయాలని గాంధీజీ ఆదేశించారు. దోపిడీ, అత్యాచారాల లాంటి సామాజిక అన్యాయాలమీద పోరాటంలో గ్రామీణ ప్రజల్ని నిర్భయులుగా తీర్చిదిద్దడానికి ప్రతి స్వరాజ్య కార్యకర్తా కృషి చేయాలని ఆయన చెప్పారు. అప్పటికే అటువంటి ప్రతిజ్ఞ తీసుకున్నవారు నిస్సందేహంగా తమ కార్యశీలతను ఋజువు చేసుకున్నారు.
గాంధీజీ పర్యటన ముగిసిన తర్వాత నేను కుజాంగ్ నా కార్యక్షేత్రంగా పని మొదలుపెట్టాను. అక్కడే మా నాన్నగారి ఎస్టేటు ఉండేది. ఆరు నెలల పాటు కాంగ్రెస్‌తో కలిసి పనిచేసినప్పుడు నా స్వభావంలో ఒక మార్పు వచ్చినప్పటికీ, అది పైపై మార్పే. అక్కడి అమాయక ప్రజల మధ్య పల్లెటూళ్లలో పనిచేయడం ద్వారా మాత్రమే నా అంతరంగం లోంచీ నన్ను నేను మార్చుకునే అవకాశం నాకు లభించింది.
(నారాయణ వీరవర సామంత్ (1900-1999): ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. రాజకీయ నాయకుడు. ఈ వ్యాసాన్ని ఇంగ్లిషులోకి అనువదించిన ప్రియంవదా పాల్ భువనేశ్వర్‌లోని సిలికాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆంగ్ల అధ్యాపకురాలు. అనువాదకురాలు. చిత్రకారిణి కూడా.)
30-9-2026


సర్, రమాదేవిగారు రాసుకున్న జ్ఞాపకాల్లో తాను నగలు ఇవ్వలేక, తాను వడికిన ఆ నూలు కండెను గాంధీజీ చేతిలో పెట్టడం, ఆయన ఆమె వైపు చూసిన ఆ ఒక్క చూపు ఆమెకు జీవితాంతం గుర్తుండిపోవడం. అలాగే ఆమె అత్తగారికి కూడా గాంధీజీని చూడాలనే కోరిక ఉండి, దాన్ని బయటకు చెప్పకుండా చివరికి తానే ఆమెతో కలిసి నది ఒడ్డుకు వెళ్లడం!! These incidents show how deeply Gandhiji influenced people.
హర్తాళ్ అనే ఆలోచనే అప్పట్లో ఎంత కొత్తదో చదివితే ఆశ్చర్యంగా ఉంది. ఈ రోజుల్లో అవసరం ఉన్నా లేకపోయినా హర్తాళ్ అనేది ఎంత మామూలు విషయంగా మారిపోయింది కదా.
ఇక పూరీలో పేదలు తమ చిరుగుల కొంగుల్లో దాచుకున్న అరకాసో అణానో తీసుకొచ్చి ఇవ్వడం, ఆ దృశ్యం చూసి గాంధీజీ చలించిపోయి, బ్రహ్మగిరి పేదలకు ప్రతినిధిగా తాను కూడా జీవితాంతం వారి మాదిరిగానే కొల్లాయి మాత్రమే ధరిస్తానని ప్రతిజ్ఞ చేయడం!!
ఇవన్నీ చదువుతుంటే History books లో చదివిన సంఘటనలే ఒకరి జ్ఞాపకాలుగా చదివినప్పుడు feels so much closer.
ఇలాంటి firsthand memories దొరకడం నిజంగా ఒక అదృష్టం. 🙏🏽
హృదయపూర్వక ధన్యవాదాలు మాధవీ!