మహాత్ముణ్ణి చూసిన క్షణాలు-8

2026 నోబెల్ పురస్కారం Anne Carson కి ప్రకటించారు!

సాహిత్యానికిచ్చే నోబెల్ పురస్కారం 2026 సంవత్సరానికి కెనడియన్ కవయిత్రి Anne Carson కి ప్రకటించినట్టు ఇప్పుడే  మానస చామర్తి ఈ బ్లాగులో మెసేజి పెట్టారు.

శాఫో కవిత్వం మీద ఆమె రాసిన పుస్తకం If Not, Winter ఆధారంగానే ఈ వేసవిలో నేను శాఫోకి ఉత్తరాలు రాసిన సంగతి కూడా ఆమె గుర్తుచేసారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఒక రచయితకి నోబెల్ ప్రైజు వస్తే మర్నాటికల్లా తెలుగులో ఒక వ్యాసం రాస్తే అదే గొప్ప విషయంగా భావించేవాణ్ణి. కానీ ఈ ఏడాది మొదటిసారిగా, ఆమె పుస్తకం మీద నేనో పుస్తకం రాసాక ఆమెకి నోబెల్ పురస్కారం ప్రకటిస్తే అది నాకే ప్రకటించినంత సంతోషంగా ఉంది. సరే, ఇంతకీ ఆమె ఈ వార్త వినగానే ‘మీమేమన్నా పిచ్చి పట్టిందా?’ అనడిగారట. ‘ఆ డబ్బు మీరేం చేస్తారు’ అనడిగితే, తమ ఫ్రెండ్ కి ఒకరికి ఇల్లు లేదనీ వాళ్ళకి ఇల్లు కట్టుకోడానికి సాయం చేస్తామనీ అన్నారట. Anne Carson రాసిన పుస్తకాల్లో Autobiography of Red కి బహుశా ఈ బహుమతి ప్రకటించి ఉంటారు. కాని ఆమె ప్రసిద్ధ గ్రీకు నాటక కర్తలు సోఫోక్లీజు, యురిపిడిస్ నాటకాలకు చేసిన అనువాదాలు కూడా గొప్పవే. ఆమెనుంచి తెలుగు సాహిత్య ప్రపంచం నేర్చుకోవలసింది ముఖ్యంగా ఈ అంశం: మన ప్రాచీన సాహిత్యాన్ని మనం ప్రేమిస్తే మనల్ని కూడా ప్రపంచం ప్రేమిస్తుందన్నదే.

14

గాంధీజీ ఆశీస్సులు

నీలమణి రౌత్రే

నేను బళ్ళో చదువుకుంటున్న రోజుల్లో, అంటే 1934లో, గాంధీజీ భద్రక్ మీదుగా కటక్‌కు రైల్లో ప్రయాణించారు. గాంధీజీ ఎప్పుడూ మూడో తరగతి బోగీలోనే ప్రయాణించేవారు. ఆ రోజు ఆయన్ను చూడాలన్న ఉత్సాహంతో భద్రక్ స్టేషన్ అంతా జనంతో కిక్కిరిసిపోయింది. నేనూ అక్కడికి వెళ్లాను. మహాత్మా గాంధీ జయజయధ్వానాలతో ఆ పరిసరాలన్నీ మార్మోగిపోయాయి. అంతటి మహా జనసందోహంలో నేనసలు గాంధీజీని చూడగలనా అనిపించింది. జనం ప్లాట్‌ఫారమ్‌మీద ఎదురు చూస్తున్నారు. గాంధీజీ కూర్చున్న బోగీలోకి ఎవరూ బలవంతంగా చొచ్చుకువెళ్లవద్దని వాలంటీర్లు అందరినీ బతిమాలుతున్నారు. రైలు ఆగిన తర్వాత ప్రజలంతా చూడటానికి వీలుగా గాంధీజీ స్వయంగా తలుపు దగ్గరకు వస్తారని వారు చెప్పారు. నా అదృష్టం కొద్దీ, గాంధీజీ కూర్చున్న ఆ మూడో తరగతి బోగీ సరిగ్గా నా ముందే వచ్చి ఆగింది. ఒక్కసారిగా నా మనసు నా అదుపు తప్పింది. నేను కిటికీలోంచి లోపలికి దూకేశాను. గాంధీజీ నన్ను పట్టుకున్నారు. ఎంతో ఆప్యాయంగా నన్ను మందలించి, ఒక్కసారి నా తల నిమిరి, రైలు దింపేశారు.

ఆ రోజు భద్రక్‌లో 144 సెక్షన్ విధించారు. ‘బట్’ అనే ఒక తెల్లదొర గాంధీజీతో కలిసి నడిచారు. ఆయన నిజానికి నాజీయిజాన్ని విశ్వసించేవాడు, హిట్లర్ మద్దతుదారుడు. కానీ అహింసా పోరాట పద్ధతుల్ని అధ్యయనం చేయడం కోసం ఆయన గాంధీజీతో పాటే ఉన్నారు. అక్కడి ఎస్.డి.ఓ. అసభ్య ప్రవర్తన ఆయనకు విపరీతమైన కోపం తెప్పించింది. ఆ ఎస్.డి.ఓ. గనుక తనకు ఎదురుపడితే తుపాకీతో కాల్చి చంపేస్తానని ఆయన అన్నట్టు తెలిసింది.

ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకే మహాత్మా గాంధీ పూరీ నుండి భద్రక్ దాకా పాదయాత్ర చేపట్టారు. అస్పృశ్యతా నివారణ కోసమూ, హిందూ దేవాలయాల్లోకి హరిజనుల నిరాటంక ప్రవేశం కోసమూ చేపట్టిన చారిత్రక పాదయాత్ర అది. గాంధీజీ ఆ దారిపొడుగునా కాలినడకనే ముందుకు సాగారు. భారతదేశంలో రకరకాల ప్రాంతాల నుంచీ, విదేశాల నుంచీ కూడా ఎందరో ప్రముఖులు ఆయన వెంట నడిచారు. భద్రక్‌లో పాత బజారు దగ్గర సాలిందీ నది ఒడ్డున జీవరామ్‌జీ కల్యాణ్‌జీ ఏర్పాటు చేసిన ఆశ్రమంలో గాంధీజీ ఒక రోజు బస చేశారు. ఆ రోజు గాంధీకి తాటాకు విసనకర్రతో విసిరే అదృష్టం నాకు దక్కింది. నా జీవితంలో అదొక పుణ్యకార్యంగా, పవిత్ర ఘనకార్యంగా భావించి మరీ ఎంతో ఉత్సాహంతో గాంధీజీకి విసనకర్రతో విసిరాను. భద్రక్‌కు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు మౌలానా మహమ్మద్ హనీఫ్, గాంధీజీ సన్మాన కమిటీకి అధ్యక్షుడిగా ఉండేవారు. నన్నీ పని కోసం ఆయనే ఎంపిక చేశారు.

భద్రక్ ఎస్.డి.ఓ.గా ఉన్న బ్రిటిష్ అధికారి దుర్గాచరణ్ దాస్ అహంకార ప్రవర్తన నాకింకా గుర్తుంది. గాంధీ రోడ్డుమీద నడుచుకుంటూ వెళుతుంటే, ఆయన ఒక మోటారు కారులో రోడ్డంతా దుమ్ము రేపుకుంటూ దూసుకుపోయాడు. ఆయన చేసిన పని అక్కడున్న వాళ్ళందర్నీ చాలా బాధపెట్టింది. ఆగ్రహం కూడా తెప్పించింది. మొత్తం భారతదేశంలో ఎక్కడా ఏ ప్రభుత్వ అధికారి గాంధీజీ పట్ల ఇంత అమర్యాదకరంగా ప్రవర్తించలేదని ప్రజలు చెప్పుకోవడం నా చెవిన పడింది.

(నీలమణి రౌత్రాయి (1920-2004) విశిష్ట రాజకీయ నాయకుడు. ఒరిస్సా ముఖ్యమంత్రిగానూ (1977-80), కేంద్ర కేబినెట్ మంత్రిగానూ పనిచేశారు. ఆయన ఆత్మకథ ‘స్మృతి ఓ అనుభూతి’ ని (1986) కటక్‌లోని గ్రంథ మందిర్ వారు 2001లో ప్రచురించారు. ఈ వ్యాసాన్ని ఇంగ్లీషులోకి అనువదించిన మేరీ మొహంతి పూరీలో ప్రభుత్వ మహిళా కళాశాలలో ఆంగ్ల అధ్యాపకురాలుగా పనిచేస్తున్నారు.)


15

గాంధీ దర్శనం

వసంత కుమార్ శతపథి

అది 1934వ సంవత్సరం. కొద్ది రోజుల క్రితమే ఒక పెను భూకంపం బీహార్‌ను అతలాకుతలం చేసింది. ‘మన సమాజం పాల్పడుతున్న అస్పృశ్యత అనే పాపం వల్లనే ఈ ప్రకృతి వైపరీత్యం సంభవించింది ‘అని గాంధీ చేసిన ప్రకటన సామాన్య ప్రజల్ని విస్మయంలో ముంచెత్తింది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా యావత్ భారతదేశమూ ఆ దురాచారాన్ని పాటిస్తున్నప్పుడు, భగవంతుడు ఒక్క బీహార్‌నే ఎందుకు ఎంచుకున్నట్టు? నిస్సందేహంగా అది సామాన్యుల అవగాహనకు మించిన గాంధేయ తత్వపు వింత ధోరణి. అయినప్పటికీ మహాత్ముని దర్శనం చేసుకోవాలన్న తపన ప్రజల్లో ఏమాత్రం తగ్గలేదు; ప్రత్యేక రాష్ట్రంగా ఇంకా రూపుదిద్దుకోని ఒరిస్సా ప్రజల్లో ఆ ఆరాటం మరీ ఎక్కువగా ఉండేది. మొదటి కారణం—ఒరిస్సా దారిద్ర్యం గాంధీ మనసును తీవ్రంగా కదిలించింది, ఆయనకు ఈ నేలమీద ఎంతో ప్రేముంది. మరో కారణం—మిగతా ప్రాంతాల వారితో పోలిస్తే, ఒరియా ప్రజలకు ఆయన్ను చూసే అవకాశం తరచూ దక్కేది కాదు.

విద్యాసంస్థల పాలన అంతా పాట్నా నుండే సాగేది కాబట్టి, భూకంపం కారణంగా పరీక్షలు ఫిబ్రవరి నుండి జూన్‌కు వాయిదా పడ్డాయి. అప్పటికి మే నెల నడుస్తోంది. కటక్ నాటి నడివేసవి ఎండల తీవ్రతకూ, ఉక్కపోతకూ మాడిపోతూ, ఆ కీలకమైన నెల ఎప్పుడొస్తుందా అని మాలో కొందరం ఎదురుచూస్తున్నాం.

సరిగ్గా అదే సమయంలో, పూరీ వెళ్లే మార్గంలో గాంధీ కటక్ మీదుగా వెళ్లనున్నారన్న వార్త దావానలంలా వ్యాపించింది. ఆయన అనుగుల్ నుండి తాల్చేర్ రైల్లో ప్రయాణించి వస్తారు. ఆ రోజుల్లో కటక్‌లో ధెంకనాల్, తాల్చేర్ పేర్లు తరచూ వినిపించేవి. ఒరిస్సాలోని ఏకైక నగరమైన కటక్‌కు ఈ రెండు గ్రామీణ ప్రాంతాల నుండే నౌకర్లూ, కూలీలూ, రిక్షావాళ్లూ వచ్చేవారు; సరిగ్గా ఈ రోజుల్లో చాకళ్లూ, హోటలు నడిపేవాళ్లూ, రిక్షావాళ్లూ దక్షిణ ప్రాంతం నుండి వచ్చినట్టుగా! ఆ మహనీయుణ్ణి ఒక్కసారి కళ్లారా చూసేందుకు కటక్ ప్రజలకు ఇదొక అద్భుతమైన అవకాశం. మహాత్ముణ్ణి దర్శనం చేసుకోవాలన్న వారి ఉత్సాహం ఎప్పటిలాగే మిన్నంటింది. కానీ వారి కల నెరవేరడం అంత తేలికైన విషయమేమీ కాదు.

నా పరిస్థితి అయితే మరీ అధ్వానంగా ఉంది. ఐదేళ్ల క్రితం గాంధీ అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించడానికి కుట్ర పన్నానన్న కారణంతో మా హైస్కూలు ప్రధానోపాధ్యాయులు నన్ను దండించారు. ‘జన్మాష్టమి’ అనే కవితలో నేను బ్రిటిషు పాలకుణ్ణి కంసుడిగా చిత్రీకరించాను; దాంతో ఆ కవిత అచ్చయిన చేతిరాత పత్రికని అధికారులు జప్తు చేశారు. విదేశీ వస్త్రాలు మోసుకెళ్తున్న ఎడ్లబండిని అడ్డుకోడానికి రోడ్డుమీద పడుకున్న కొందరు గాంధేయ సత్యాగ్రహుల్ని పోలీసులు నిర్దాక్షిణ్యంగా చితకబాదడం నా కళ్లారా చూశాను. ఆ బాధితుల్లో ఒకరికి మంచినీళ్లు ఇచ్చి ఆదుకోబోయిన ఒక పాన్ షాపు యజమానిని కూడా పోలీసులు విచక్షణారహితంగా కొట్టారు. సూర్యుడస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యపు వైభవం పట్టపగటి భానుడిలా వెలుగుతున్న రోజులవి. గాంధీ ఇటువైపు వస్తున్నారన్న సంగతి పాఠశాల యాజమాన్యానికి తెలియకుండా ఉంటుందా? బ్రిటిష్ సామ్రాజ్యానికే పెనుముప్పుగా మారిన ఆయన్ను చూడటానికి మేం చేసే ప్రయత్నాల్ని యాజమాన్యం చూసీచూడనట్టు వదిలేస్తే, అది వాళ్ల ఉద్యోగాలకే ఎసరుపెట్టదా? ఏదేమైనా, అధికారుల కళ్లుగప్పి వ్యవహరించడంలో స్కూల్లోగానీ కాలేజీలోగాని చదువుకునే విద్యార్థులకి అనాదిగా ఒక వింత ఆనందం ఉండేది. ఒక్కోసారి అలా చేసి వాళ్లు రాత్రికి రాత్రి సుప్రసిద్ధులైపోయేవారు.

రాత్రి దాదాపు ఎనిమిది గంటల సమయం కావస్తోంది. మూడే మూడు లాంతర్లు వెలుగుతున్న ఆ మసక ప్లాట్‌ఫారమ్‌మీద సుమారు రెండు వందల మంది దాకా గుమిగూడారు. మూడో గంట మోగగానే జనం నుండి పెద్ద జయజయధ్వానాలు మిన్నంటాయి. రైలు పొగలు కక్కుకుంటూ ప్లాట్‌ఫారమ్‌మీదికి రాగానే ఆ కేకలు మరింత పెరిగాయి. రైలు ఆగకముందే ఉత్సాహంతో ఉన్న ఆ జనం అటూ ఇటూ పరుగులు తీశారు. కాసేపటికే వాళ్లంతా ఆ మూడో తరగతి బోగీ చుట్టూ చేరారు; ‘గాంధీజీకి జై’ అనే ఉమ్మడి నినాదాల మధ్య ఒక కిటికీలోంచి గాంధీ ప్రశాంత ముఖం కనిపించింది. ఆ స్వాగతానికి ఏమాత్రం సంతోషించకపోగా, గాంధీజీ వారిని తీవ్రంగా మందలించారు: ‘రాత్రివేళల్లో శబ్దాలు చేయడాన్ని శాస్త్రాలు నిషేధించాయి’ అన్నారు. ప్లాట్‌ఫారమ్‌మీద ఒక్కసారిగా పిన్‌డ్రాప్ సైలెన్స్ ఆవరించింది. ‘రాత్రి నిశ్శబ్దాన్ని భంగపరిచే హక్కు ఎవరికీ లేదు’ అని ఆయన గట్టిగా చెప్పారు.

ఆ మసక వెలుతురులో ఆయన ముఖం స్పష్టంగా కనిపించకపోవడంతో, ఎవరో ఒకరు లాఠీ చివర లాంతరు కట్టి గాంధీ ముఖానికి దగ్గరగా ఎత్తిపట్టారు. ఆ కిరోసిన్ మంట నుంచి వచ్చే మసి గానీ, దుర్వాసన గానీ మహాత్ముణ్ణి ఏమాత్రం ఇబ్బంది పెట్టినట్టు కనిపించలేదు. ఆయన మాట్లాడుతూ:

‘అస్పృశ్యతను రూపుమాపడానికి నేను పూరీ వెళుతున్నాను. తిరుగు ప్రయాణంలో మళ్లీ కటక్ మీదుగానే వెళతాను. నేను ప్రస్తుతం హరిజనుల కోసం నిధులు సేకరిస్తున్నాను. ఒరియా ప్రజలు చాలా పేదవారు. నేను వారి నుండి పెద్ద మొత్తాల్లో విరాళాలు ఆశించడం లేదు. వాళ్ళిచ్చేది చిన్న కాసుగానీ, అరకాసుగానీ, అది కూడా నాకు చాలా ఎక్కువనే’ అని అన్నారు. అలా అంటూ ఆయన తన పొడవాటి చేతిని ముందుకు చాచారు. దాంతో ఆ జనంలో ఉత్సాహం ఎంతగా పెల్లుబికిందంటే, అతి కష్టమ్మీద నిలిపిన ఆ లాంతరు కాస్తా ఒక్కసారిగా కిందపడి పగిలిపోయింది. వాలంటీర్లు ఆ గాజు పెంకుల్ని శుభ్రం చేశారు.

ప్రజలు ఎంతో ఉత్సాహంతో తమ దగ్గరున్న డబ్బంతా తీసి గాంధీజీ చేతిలో పెట్టడం నేను గమనించాను. అలా ఇస్తున్నప్పుడు, సాక్షాత్తూ దైవాన్నే తాకుతున్నట్టుగా ఆయన చేతిని ఆప్యాయంగా నిమిరారు. ఆ ఉత్సాహంలో వెనకబడిపోడం ఇష్టం లేక నేనూ ముందుకు దూకాను. కానీ తీరా చూస్తే నా జేబులు ఖాళీగా ఉన్నాయి; నా గుండె ఆగినంత పనైంది.

వెంటనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పక్కనే ఉన్న హాస్టల్ వైపు పరుగుతీశాను. దారిలో నా స్నేహితుడు ఎదురుపడటంతో, అతని దగ్గర కొన్ని నాణాలు అప్పు తీసుకుని మళ్లీ స్టేషన్ వైపు లంఘించాను. పరుగెడుతుండగా నా కుడికాలి బొటనవేలు ఒక రాయికి బలంగా గుద్దుకుంది. అయినా లెక్కచేయకుండా పరుగు కొనసాగించాను. స్టేషన్‌కు చేరుకుని చూసేసరికి, రైలు ఇంకా అక్కడే ఉండటం, గాంధీజీ చేయి ఇంకా చాచి ఉండటం చూసి నాకు ప్రాణం లేచివచ్చింది; సిగ్నల్ మాత్రం అప్పుడే ఆకుపచ్చగా మారింది. రొప్పుతూనే ఆ అప్పు తెచ్చిన నాణాల్ని గాంధీజీ విశాలమైన చేతుల్లో పోసి, ఆయన పొడవాటి చేతిని నిమిరాను. ఎంతటి అనిర్వచనీయమైన పరవశం! గతంలో పూరీ జగన్నాథుని దర్శనమూ స్పర్శా నాలో ఎలాంటి ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించాయో, ఇది కూడా సరిగ్గా అలాగే అనిపించింది.

మత్తు వీడని స్థితిలోనే హాస్టల్‌కు తిరిగి వచ్చి కాళ్లు కడుక్కున్నాను. అప్పుడే నా చూపులు రక్తం కారుతున్న పాదంమీద పడ్డాయి. బొటనవేలి నుండి రక్తం ధారగా కారుతోంది. ఒక్కసారిగా తీవ్రమైన నొప్పి నన్ను చుట్టుముట్టింది. అసలు గాయమై చాలా సమయమైంది కదా! మరింతసేపూ నాకా బాధ ఎందుకు తెలియలేదు? నాలో నేనే ఆశ్చర్యపోయాను. శరీరాన్ని నడిపించేది మనస్సేనని నాకు అప్పుడు బోధపడింది. ప్రేమ దైవసంబంధమైనదైనా, మానవసంబంధమైనదైనా—ప్రేమలో మునిగిన మనస్సు శరీరమిచ్చే ఆజ్ఞలకు ఎన్నడూ లొంగదు. ఒక ఉన్నత ఆశయం స్ఫూర్తినిచ్చినప్పుడు మనిషి శారీరక బాధల నుండి విముక్తుడవుతాడు.

నా గాయం మానిపోయింది కానీ, పగిలిన కాలిగోరు మాత్రం శాశ్వతమైన గుర్తుగా మిగిలిపోయింది. ఆ తర్వాతి జీవితంలో ఎవరైనా దాని గురించి అడిగినప్పుడల్లా నేనీ కథ మళ్లీ మళ్లీ చెప్పేవాణ్ణి; అలా ఆ కథ చెప్పిన ప్రతిసారీ నా ముఖంలో ఆనాటి దివ్యానుభూతి స్పష్టంగా ప్రతిఫలించేది.

దాదాపు వారం రోజులు గడిచాయి. మళ్లీ కటక్ వస్తానని గాంధీజీ మాట ఇచ్చారు. ఆయన కదలికల గురించి రకరకాల వార్తలు అందుతూనే ఉన్నాయి: గాంధీ అనుమతి తీసుకోకుండా కస్తూర్బా జగన్నాథుని దర్శనానికి వెళ్లడం వల్ల ఆ వృద్ధ దంపతుల మధ్య చిన్న మనస్పర్థ వచ్చిందట. దాంతో గాంధీజీ స్వయంగా దర్శనానికి వెళ్లడానికి నిరాకరించారు. పూరీ నుండి మొదలైన పాదయాత్ర వల్ల మీరాబెహెన్ పాదాలకు బొబ్బలెక్కాయి. అయినా సరే, ఆమె కట్టుకట్టిన కాళ్లతోనే నడక కొనసాగిస్తున్నారు. హిందూ మహాసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న పండిట్ లాలానాథ్ అనే ఒక సనాతనవాది గాంధీని నీడలా వెంటాడుతున్నాడన్న వార్త కూడా వచ్చింది.

అది మే 16వ తేదీ. గాంధీ కాజీపట్నా చేరుకున్నారు; అక్కడ ఒక బాలిక ఆయనకు ఒక జ్ఞాపికతో పాటు తన బంగారు గాజుల్ని కానుకగా సమర్పించింది. సూర్యాస్తమయ సమయానికి ఆయన కటక్ చేరుకుంటారనీ, రాగానే కాట్జూరి నదీ ఇసుక తిన్నెలమీద జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారనీ తెలిసింది. నాకైతే ఇది గాంధీని మరోసారి దర్శించుకునే గొప్ప అవకాశం. నయం కాకపోగా నా కాలి బొటనవేలి గాయం చీముపట్టి ఉంది. అయినా సరే, మధ్యాహ్నం 4:30 గంటలకే నేను ఇసుక తిన్నెలకు చేరుకున్నాను. నదిలోని చల్లటి నీరు మండుటెండ వేడిమిని కాస్త తగ్గించింది.

సభ కోసం చేసిన ఏర్పాట్లు చాలా సాధారణంగా ఉన్నాయి. ఒకటి రెండు బల్లల్ని ఎలాగోలా అమర్చారు. స్త్రీలకూ పురుషులకూ వేర్వేరు స్థలాల్ని కేటాయిస్తూ పొడవాటి తాళ్లు కట్టారు. ఆ సమయానికి రెండు మూడు వందల మందికి మించి సభికులు లేరు. దగ్గరలోనే ఎండిపోయి, పలుచగా పారుతున్న కాట్జూరి నది; కాస్త దూరంలో నీలిరంగు నారాజ్ కొండ; మరీ అంత దూరం కాకుండా ఒక లంకమీద మెరుస్తున్న జిల్లేడు పూల గుత్తులు కనిపిస్తున్నాయి.

ఎండ తీక్షణత నెమ్మదిగా తగ్గసాగింది. అందరి చూపూ కాజీపట్నా వైపే ఉంది. హఠాత్తుగా దూరంగా ఒక చిన్న గుంపు కనిపించింది; తక్కువ ఎత్తున్న నదీ కట్ట దిగి, తాత్కాలిక కాలిబాట గుండా ఆ గుంపు నదీ గర్భంలోకి అడుగుపెట్టింది. వారు దగ్గరకు వస్తున్న కొద్దీ ఒక తాటాకు గొడుగు, దాని పక్కనే నిస్సందేహంగా గాంధీజీ అనదగ్గ ఆకారం వేగంగా అడుగులు వేస్తూ కనిపించాయి. ఎంత దూరం నుండైనా ఆయన్ను సులభంగా గుర్తుపట్టవచ్చు. పాదయాత్రలో ఆయన అడుగులు పసిపిల్లవాడి అడుగుల్లా చూడముచ్చటగానూ, లయబద్ధంగానూ పడేవి. దాదాపు పదిహేను నిమిషాల్లో ఆయన సభాస్థలికి చేరుకున్నారు. ఒక బల్లమీద పద్మాసనం వేసుకుని, ఒక చేతిని ఆనించి కూర్చున్న గాంధీ, సరిగ్గా మనం చిత్రపటాల్లో చూసినట్టే ఉన్నారు. ‘ఏ ఒక్క మంచి పని ప్రారంభించాలన్నా ముందుగా భగవంతుని నామస్మరణ చేయాలి’ అంటూ ఆయన మాట మొదలుపెట్టారు. ఆయన ఆ మాట పలికారో లేదో, అంతవరకు నిర్జీవంగా ఉన్న ఆ వాతావరణమంతా ఒక్కసారిగా విద్యుద్దీప్తమైపోయింది. అప్పటికే సూర్యుడు కిందికి దిగి నారాజ్ కొండ శిఖరాన్ని తాకుతున్నాడు. కాట్జూరి నది చల్లటి పవనాలు మెల్లగా వీయడం మొదలయ్యాయి. ఆ పిల్లగాలుల లయకు అనుగుణంగా, గాంధీ స్త్రీ సహజమైన సన్నని కంఠస్వరంతో భగవద్గీత రెండో అధ్యాయంలో ఆత్మ అమరత్వాన్నీ, ఆధ్యాత్మిక విజయాలనూ తెలిపే కొన్ని శ్లోకాలను పఠించారు. ఒక మునివాటిక చుట్టూ ఉండే దివ్యకాంతి లాంటి పవిత్ర వాతావరణం ఒక్కసారిగా అక్కడ వెల్లివిరిసింది. ఇలాంటి పారవశ్యం జీవితంలో అనుభవానికి రావడం చాలా అరుదు. ప్రార్థన ముగిశాక, గాంధీ అస్పృశ్యత అంశంమీద క్లుప్తంగా మాట్లాడారు. ఆ అంశం కంటే కూడా ఆయన మాట్లాడిన తీరే అందరినీ కట్టిపడేసింది. ఆయన ప్రసంగం ముగియగానే, వాలంటీర్లు చేతుల్లో గుడ్డలు పట్టుకుని విరాళాల సేకరణ కోసం జనం మధ్య తిరిగారు. అంతటి కరవు రోజుల్లో కూడా అంత స్వల్ప వ్యవధిలో అంత పెద్ద మొత్తం పోగుపడటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ రోజుల్లో గాంధీ కోసం ప్రజలు ఇవ్వనిదంటూ ఏదీ లేదు.

చివరగా గాంధీజీ మాట్లాడుతూ, ‘ఇవాల్టి సభలో మాట్లాడటానికి పండిట్ లాలానాథ్ నా అనుమతి కోరారు. నేనాయనకు అనుమతి ఇచ్చాను. నా మాటలు ఎంత నిశ్శబ్దంగా విన్నారో, ఆయన మాటలనూ అంతే ప్రశాంతంగా వింటారని ఆశిస్తున్నాను. ఆయన ఏ క్షణంలోనైనా ఇక్కడికి చేరుకుంటారు’ అన్నారు. నిజంగానే కాసేపటికి దూరంగా బోడిగుండుతో ఉన్న సనాతనవాది పండిట్ లాలానాథ్ తన అనుచరులతో కలిసి రావడం కనిపించింది. వాళ్లు నడుస్తూ ఏదో సంకీర్తన చేస్తున్నారు. వారిలో కొందరు నల్ల జెండాలనూ, నలుపు-తెలుపు బొట్లు పెట్టిన కుండలూ, కర్రలకు కట్టిన చీపురు కట్టలూ పట్టుకుని, కీర్తనల తాళానికి అనుగుణంగా నాట్యం చేస్తున్నారు. ఎంతటి విచిత్రమైన మతం! ఎంతటి కర్ణకఠోరమైన గోల! ఎంతటి విపరీతమైన ఆవేశం!

పండిట్‌జీ తన అనుచరులతో సభా స్థలానికి చేరుకున్నారో లేదో, జనం ఒక్కసారిగా వారిమీదికి ఆగ్రహంతో దూసుకెళ్లి, చేతికి ఏది దొరికితే వాటితో పాటు దోసిళ్లకొద్దీ ఇసుకను కూడా వాళ్ళ మీద ఎత్తిపోసారు. ఆ పైన క్షణాల వ్యవధిలో ఆ మట్టికుండలన్నీ పగలగొట్టి, ఆ గుంపుని పూర్తిగా చెదరగొట్టారు. చివరకు పండిట్ లాలానాథ్ కూడా ఎక్కడా కనిపించకుండా పోయారు. గాంధీజీ ఎంతో కలత చెందారు. పండిట్‌జీని సగౌరవంగా వేదిక వద్దకు తీసుకురావలసిందిగా ఆయన వాలంటీర్లను ఆదేశించారు. స్వయంగా ఆయనే ముందుకొచ్చి పండిట్‌జీని తోడ్కొని వచ్చి కూర్చోబెట్టి, ఆయన కళ్లకూ ముఖానికీ అంటిన దుమ్ము తుడిచి శుభ్రం చేసి, ఆయన్ను కుదుటపరిచారు. ఆ తర్వాత సభికుల్ని ఉద్దేశించి, ‘ముందే చెప్పినప్పటికీ మీరు మన అతిథిని అవమానించి తీవ్రమైన అపరాధం చేశారు. కాబట్టి మీ తరఫున నేను భగవంతుణ్ణి క్షమాపణ కోరుతున్నాను’ అన్నారు. నాకు బైబిల్ వాక్యం గుర్తొచ్చింది: ‘ఓ తండ్రీ! వీరిని క్షమించు. వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు!’

అప్పుడు పండిట్ లాలానాథ్ చేతులెత్తి, కీచు గొంతుతో సనాతన ధర్మ గొప్పతనాన్ని కీర్తించడం మొదలుపెట్టారు. ఆంటోనీని మాట్లాడనిచ్చి బ్రూటస్ చేసిన తప్పిదమే గాంధీ కూడా చేశారని మేము అనుకున్నాం. కానీ పండిట్ లాలానాథ్ ఉపన్యాసం గానీ, ఆయన వాదనలు గానీ ఎవరి మనసునీ తాకలేదు. పైగా ఆయన తీవ్రవాద ధోరణి అందరికీ చిరాకు తెప్పించింది. సంధ్యా వేళ సభ ముగిసింది. గాంధీ, లాలానాథ్ ఇద్దరూ భుజం భుజం కలిపి కటక్ వైపు నడుచుకుంటూ వెళ్లడం చూసి మేం నిశ్చేష్టులమయ్యాం.

శత్రువును ప్రేమించాలనీ, ప్రత్యర్థి దృక్పథాన్ని గౌరవించాలనీ, ఇతరుల పాపానికి తానే ప్రాయశ్చిత్తం చేసుకోవాలనీ చెప్పే సిద్ధాంతాలూ సూత్రాలూ ఆచరణలో ఎలా ఉంటాయో మా కళ్లారా మేం చూశాం.

(వసంత కుమార్ శతపథి (1913-1994) ఒరిస్సాకు చెందిన ప్రముఖ కథారచయిత. ఆ యన ఆత్మకథ ‘మనేపడే’ నుంచి ఈ భాగాన్ని ఇంగ్లీషులోకి అనువదించిన సుమన్యు శతపథి ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఆంగ్ల ఆచార్యులుగా పనిచేస్తున్నారు.)

5-10-2026

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading