మహాత్ముణ్ణి చూసిన క్షణాలు-7

12

మహాత్ముని దర్శనం

కాశీనాథ్ నాయక్

అది 1934వ సంవత్సరం; జగన్నాథుని ఆలయ సింహద్వారం నుండి ఒరిస్సాలో భద్రక్ దాకా మహాత్ముడు తన చారిత్రక పాదయాత్రను ప్రారంభించారు. ఆయన్ను చూడాలని నాక్కూడా చాలా బలమైన కోరిక కలిగింది.

పూరీ నుంచి యాత్ర మొదలుపెట్టాక గాంధీజీ దండముకుందపూర్ సమీపంలో రామ్‌దాస్ మఠంలో బస చేయబోతున్నారని వినగానే నా ఒళ్లు పులకరించిపోయింది. అంతటి సువర్ణావకాశం చేజార్చుకోవడం మూర్ఖత్వమనిపించింది. నా ఆలోచన మా అమ్మకు చెప్పి, వెంటనే పాఠశాల వసతిగృహానికి బయలుదేరాను. హాస్టల్ విద్యార్థులంతా, ముఖ్యంగా చింతామణి పాణిగ్రాహి నన్ను చూడగానే ఎంతో సంతోషించారు. మేమంతా కలిసి భోజనం చేశాం.

పాదయాత్ర సాగిస్తున్న ఆ బృందం మా పాఠశాల దగ్గరున్న జగన్నాథ్ సందు గుండా కరణ్ సాహి వైపు కదులుతుండగా, నేనూ మరికొందరు విద్యార్థులం కలిసి  వారితో నడిచాం.

మహాత్ముణ్ణి ఒక్కసారి దర్శించుకుందామని అపార జనసందోహం తరలివచ్చింది. కొద్దిసేపటికే సభ మొదలైంది. నా లాంటి పిల్లలు ముందు వరుసలో కూర్చున్నారు. మహాత్ముడు వేదిక దగ్గరకు రాగానే ఆ ప్రాంతమంతా నినాదాలతో ప్రతిధ్వనించింది. ఆ మహనీయుడికి గౌరవసూచకంగా అందరూ లేచి నిలబడ్డారు. మేమూ లేచి నిలబడ్డాం. వేదిక వైపు నడుస్తూ గాంధీజీ మా శిరసుల్ని ఆప్యాయంగా స్పృశిస్తూ వెళ్లారు. మహాత్ముని ఆ పవిత్ర స్పర్శతో నా హృదయం ఎలా ఉప్పొంగిపోయిందో నేనిప్పటికీ మర్చిపోలేను. అయితే, వయసులో చిన్నవాణ్ణీ అమాయకుణ్ణీ కావడం వల్ల ఆ సభలో గాంధీజీ ఏం మాట్లాడారో నాకేమీ కొరుకుడుపడలేదు.

మహాత్మాజీ ఒక దేవదూత అనీ, బ్రిటిష్ వారి బానిస సంకెళ్ల నుండి భరతమాతను విముక్తం చేయడానికి ఆయన మానవ రూపంలో అవతరించారనీ వింటుండేవాణ్ణి; ఆ దివ్య పురుషుణ్ణి ఎప్పుడెప్పుడు చూస్తానా అని తపించేవాణ్ణి. తీరా ఆ కోరిక సాకారమైన ఆ దివ్య దివసాన ఆయన ముఖాన్నీ వేషధారణనూ గొప్ప ఆత్రుతతో అలాగే చూస్తూ ఉండిపోయాను.

మరుసటి రోజే గాంధీజీ ఆయన అనుచరులూ పిప్లి దగ్గర సదావ్రత మఠం వద్ద కాసేపు ఆగి, మా ఊరి దగ్గర్లో గుడియా పొఖరి దగ్గర బస చేయాల్సి ఉంది. బాలకటి, బాలిపట్న గ్రామాల నుండి వచ్చిన కొందరు కుర్రాళ్లతో కలిసి నేను కూడా గుడియా పొఖరి వైపు దారితీశాను; తెల్లవారకముందే అక్కడికి చేరుకున్నాం. నాలో ఉన్న ఉత్సాహానికి నాకు ఆకలి తెలియలేదు. అలసట కలగలేదు. గాంధీజీకీ ఆయన సహచరులకూ బస కల్పించడానికి ‘కఖరువాపద’ అనే తోట శుభ్రం చేసి సిద్ధం చేశారు. మేము కూడా ఆ రాత్రి అక్కడే గడపాలని నిశ్చయించుకున్నాం. అక్కడికి వెళ్లేటప్పటికి ముకుందపూర్ వాసి సాధుబాబు కనిపించారు. మమ్మల్ని చూసి ఆయన ఎంతో సంతోషించారు.

సాధుబాబు నిబద్ధత గల ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు. ఆయన తరచూ మా బడికి వస్తూ, మహాత్ముని గురించీ, స్వాతంత్ర్య పోరాటం గురించీ, పరిశుభ్రత గురించీ,  నూలు వడకడం ప్రాధాన్యత గురించీ వివరిస్తుండేవారు. తోటలో మేము ఎదురుపడగానే, ఆయన మాకు తినడానికి అటుకులూ, బెల్లమూ, కొబ్బరి తురుమూ ఇచ్చి, ఆ రాత్రికి తోటలోనే గడపమని చెప్పారు.

మరుసటి రోజు గాంధీజీ అక్కడికి చేరుకున్నప్పుడు, ఆయనకు స్వాగతం పలికేందుకు సాధుబాబు తక్కిన కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి రోడ్డుమీద నిలబడ్డారు. మరుక్షణమే, హృదయాన్ని హత్తుకునే చిరపరిచిత నినాదాలు—‘మహాత్మా గాంధీకి జై’, ‘భరతమాతకు జై’ అంటూ ఆకాశాన్ని తాకాయి. ఏమాత్రం ఓపిక పట్టలేకపోతున్న నా స్నేహితులతో కలిసి నేను కూడా ఆత్రుతగా రోడ్డు పక్కన నిలబడి చూస్తున్నాను. పోటెత్తిన ఆ అపార జనసంద్రం మధ్య గాంధీజీ ఒక దివ్య కాంతిలా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నారు.

మహాత్మాజీ కొద్దిరోజుల పాటు అక్కడే బస చేయాల్సి ఉన్నందున, ఆయన కోసం తాత్కాలికంగా ఒక చిన్న పాకనూ, మరుగుదొడ్డినీ అప్పటికే నిర్మించారు. కొద్ది నిమిషాల విశ్రాంతి తర్వాత నూలు వడికే కార్యక్రమం మొదలైంది. మహాత్మాజీ తన సహచరులతో పాటు అందులో పాల్గొన్నారు. నెమ్మదిగా జనం తోటలోకి పోటెత్తారు. మహాత్ముని చూడటానికి స్త్రీలు సైతం పరదాలు కట్టిన ఎడ్లబండ్లమీద వచ్చారు. వరుసగా రెండోసారి కూడా మహాత్ముని దివ్య దర్శనం లభించినందుకు నన్ను నేను ఎంతో అదృష్టవంతుడిగా లెక్కేసుకున్నాను.

ఆ తర్వాత వారు బస చేయవలసిన స్థావరం బాలకటిలోని అప్పర్ ప్రైమరీ పాఠశాల. మూడోసారి కూడా ఆయన్ను చూడాలన్న తీవ్రమైన తపన ఉన్నప్పటికీ, నేను బాలకటి దాకా వెళ్లలేకపోయాను. బరువెక్కిన హృదయంతో ఇంటి ముఖం పట్టాను.

విచిత్రమైన కాకతాళీయమేమిటంటే, ఆ తర్వాతి కాలంలో నేను ఉపాధ్యాయుడిగా చేరింది సరిగ్గా ఆ బాలకటి పాఠశాలలోనే! సుదీర్ఘంగా ముప్పై మూడు సంవత్సరాల పాటు, రోజు విడవకుండా ప్రతి రోజూ, గాంధీజీ కూర్చున్న ఆ పవిత్ర స్థలాన్ని దర్శించుకునే అరుదైన భాగ్యం నాకు దక్కింది.

(కాశీనాథ్ నాయక్ (జ. 1919) ఉపాధ్యాయులు. పిల్లల కోసం ఎన్నో పుస్తకాలు రాశారు. ఆయన ఆత్మకథ ‘శిక్షకర జీవనస్మృతి’ శిక్షాసంధాన్ ద్వారా 2005లో ప్రచురితమైంది. ఈ వ్యాసాన్ని ఇంగ్లిషులోకి అనువదించిన దీపక్ చంపతీరాయ్ భువనేశ్వర్‌లో కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థి.)


13

జీవితానికొక పాఠం

వినోద్ కానుంగో

హరిజనోద్ధరణ కోసం బాపూజీ 1934లో ఒరిస్సాలో పర్యటించారు. ఈ పర్యటనకు ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. భారతదేశంలో బ్రిటిష్ అధికారులు గాంధీజీని ‘గడుసు మనిషి ’ అని వ్యవహరిస్తుండటం కొంతవరకు సరిపోయేదే అయినా, వాళ్లు ఏ ఉద్దేశంతో అన్నారో దానికిది సరిగ్గా వ్యతిరేకార్థాన్ని సూచిస్తుంది. 1934 నాటికి ప్రజలు అలసిపోయి, నీరసించి ఉన్నారని గాంధీజీ చాలా బాగా గ్రహించారు. 1932 నాటి స్వాతంత్ర్య పోరాటం ఎటూ తేలకుండా పోయింది. రాజకీయ ప్రచారాలూ, సభలూ మళ్లీ ఎన్నో అరెస్టులకే దారితీస్తాయి—చివరకు గాంధీజీనే స్వయంగా అరెస్టయ్యే అవకాశమూ ఉంది. గతంలో ఆయన ఎన్నోసార్లు జైలుకెళ్లారు. జైల్లో ఉన్నప్పుడు ఏదో ఒక నెపంతో నిరాహారదీక్ష చేయడం, దాంతో ప్రభుత్వం ఆయన్ను విడుదల చేయడం పరిపాటైంది. ఇలాంటి పిల్లి-ఎలుక ఆటలు ఆడటం గాంధీజీ ఉద్దేశం కాదు. ఆయనో కొత్త మార్గం కనుక్కోవలసి వచ్చింది; ప్రజలతో మళ్లీ సంబంధాలు పునరుద్ధరించుకోవాల్సి ఉంది. బహిరంగ సభలకు మరింతమంది ప్రజలు తరలివచ్చేలా ప్రోత్సహించడానికి ఒక మార్గం వెతకాలి. అందుకనే భారతదేశమంతటా పర్యటించి అస్పృశ్యతా నివారణ సందేశం వ్యాప్తి చేస్తానని ఆయన ప్రకటించారు. ఆయన చేపట్టింది రాజకీయ ఉద్యమం కాదు కాబట్టి, ప్రభుత్వానికి మనసులో ఇష్టం లేకపోయినా ఆయన్ను అడ్డుకోడానికి ఎలాంటి కారణమూ దొరకలేదు.

1934 మే నెలలో ఆయన ఒరిస్సాకు రావలసి ఉంది. ఆ పర్యటనలో ఆయన మధ్యప్రదేశ్ నుంచి సంబల్‌పూర్ చేరుకుంటారు. సంబల్‌పూర్ నుండి అనుగుల్ మీదుగా మేరముండలి రైల్వే స్టేషన్‌కి కారులో  వెళతారు. అక్కడి నుండి తాల్చేర్ రైలెక్కి పూరీ చేరుకుంటారు. ఆ రోజుల్లో ఒరిస్సా నుండి వెలువడే ఏకైక దినపత్రిక ‘ది సమాజ్’. లింగరాజ్ మిశ్రా దానికి సంపాదకుడు. రాధానాథ్ రథ్ కూడా ఆయనతో పాటే పనిచేసేవారు. ఆ పత్రికకి ఇలాంటి కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా రిపోర్టింగ్ చేసే విలేకరులెవరూ లేరు. గాంధీ ఎక్కడికి వెళితే అక్కడికి ఎవరో ఒకరు ఆయన వెంటే వెళ్లాలని ఆ ఇద్దరూ నిర్ణయించారు. ఆయన ప్రసంగాల్నీ, పర్యటన విశేషాల్నీ ‘ది సమాజ్’లో విస్తృతంగా ప్రచురించాలి. కానీ అలాంటి వ్యక్తి ఎవరూ వాళ్లకు దొరకలేదు. అందుకని వాళ్ళు నేనైతేనే ఆ పని చేయగలనని నన్నడిగారు. అంతకుముందే నేను కూడా గాంధీజీతో కలిసి ప్రయాణిస్తూ ఆయన్నుంచి నేర్చుకోవాలనుకున్నాను. నేను వాలంటీరుగా పనిచేస్తానంటే నిర్వాహకులు కూడా ఒప్పుకుంటారు. అందుకని వాళ్ళు నన్నడగ్గానే నేను ఆ ప్రతిపాదనకి ఒప్పుకున్నాను.

టెలిగ్రామ్ అధికార పత్రమూ, రిపోర్టర్ కార్డూ  చేతబట్టుకుని అనుగుల్ బయలుదేరాను; అప్పటికే గాంధీజీ సంబల్‌పూర్ విడిచిపెట్టారు. అక్కడి నుండి ఆయన పూరీ రైల్లో వచ్చారు. పూరీలోనే  ఆయన, ‘నేనింక కారులోగానీ, రైళ్లలలో గానీ ప్రయాణించను. హరిజనోద్ధరణ కోసం కాలినడకనే ముందుకు సాగుతాను’ అని ప్రకటించారు. దీన్ని నేను  ‘మహా పాదయాత్ర’ అన్నాను. ప్రతి రోజూ ఆయన కొంత  దూరం నడిచి, ఒక బహిరంగ సభ నిర్వహించేవారు. మధ్యాహ్నం నాలుగు గంటల దాకా విశ్రాంతి తీసుకుని, మళ్లీ నడక మొదలుపెట్టేవారు. సాయంత్రం మరో సభ జరిగేది, ఆ రాత్రికి అక్కడే బస చేసేవారు.

పాదయాత్ర నిర్వహణ బాధ్యతల్ని  థక్కర్ బాపా, అంటే, అమృత్‌లాల్ వి. ఠాకూర్ కి  అప్పగించారు. నాక్కూడా పని చాలా పెరిగింది. రోజూ ప్రసంగాలు ఉండేవి. కార్యకర్తల మధ్య రెండు మూడు విడతలుగా చర్చలు సాగేవి; యాత్రలో జరిగే రకరకాల సంఘటనల్ని వివరంగా నివేదించాలని సంపాదకులు నాకు ప్రత్యేకంగా పురమాయించారు. యాత్ర మొత్తం బాధ్యతలన్నీ థక్కర్ బాపా పర్యవేక్షిస్తున్నప్పటికీ, గోపబంధు చౌధురీ, రమాదేవీ ఆయనకు చేదోడువాదోడుగా నిలిచారు. ఒరిస్సా నలుమూలల నుండీ వచ్చిన ప్రముఖ నాయకులూ, పేరుమోసిన కార్యకర్తలూ గాంధీజీతో కలిసి కొంత దూరం నడిచారు. నా అదృష్టం కొద్దీ నాకు మరో బాధ్యత కూడా అప్పగించారు. గోపబంధు చౌధురి నాతో, ‘బాపూజీ నడుస్తున్నప్పుడు ఆయన ముందే జనం విపరీతంగా గుమిగూడుతున్నారు. దీనివల్ల దుమ్ము లేవడమే కాకుండా, ఆయన నడకకు అడ్డంకిగా మారుతోంది. నువ్వు బాపూజీకి ముందు నడవడం మొదలుపెట్టు. నీకు అటూ ఇటూ ఇద్దరు వాలంటీర్లు సాయంగా ఉంటారు, దాంతో బాపూజీ నడిచేటప్పుడు ఆయనకి ముందు కొంత చోటు మిగులుతుంది. అలాగే రాత్రిపూట నువ్వు బాపూజీ బస దగ్గరే ఉండాలి; లేకపోతే ఆయన్ను చూడాలన్న ఆత్రుతతో జనం ఆయన్ను నిద్రపోనివ్వరు’ అన్నారు.

బాపూజీ నడుస్తున్నప్పుడు తనకి ఇరుపక్కలా ఉన్న ఇద్దరి భుజాలమీద చేతులు వేసేవారు. వారితో ముఖ్యమైన విషయాలు చర్చిస్తుండేవారు. వాళ్లు వాలంటీర్లైతే, గ్రామాల పరిస్థితుల గురించి ఆరా తీసేవారు. పూరీ నుండి భద్రక్ దాకా సాగిన ఆ పాదయాత్ర నెలకు పైగా నడిచింది. వర్షాకాలం మొదలైంది, యాత్ర ముగిసింది. ఒకరోజు ఎం.ఆర్. మసానీ వచ్చారు. రెండు రోజుల తర్వాత ఘనశ్యామ్‌దాస్ బిర్లా వచ్చారు. గాంధీజీ వారితో ముఖ్యమైన చర్చలు జరిపారు. వాళ్లు హిందీలోనో, ఇంగ్లీషులోనో మాట్లాడినప్పుడు నాలుగైదు మాటలు వినాలని నేను చెవులు రిక్కించేవాణ్ణి. అయితే వారిద్దరితోనూ ఆయన గుజరాతీలోనే మాట్లాడారు.

ఈ సంఘటనలు చెబుతున్నప్పుడు నేనొక ముఖ్యమైన విషయం ప్రస్తావించాలి. ఇన్ని రోజుల పాటు బాపూ మాటలు వినగలగడం నాకు దక్కిన గొప్ప గౌరవం. ఉదయం సభ ముగిశాక ఆయన ప్రజా  బృందాలను కలిసేవారు. ఆ సందర్భంగా ఆయన వారికిచ్చే ఆదేశాలు చాలా ముఖ్యమైనవిగా ఉండేవి.  అలాంటప్పుడు చాలాసార్లు నేను అనువాదకుడిగా వ్యవహరించవలసి వచ్చింది. ప్రజలు రకరకాల ప్రశ్నలు వేసేవారు. బాపూజీ ఏమాత్రం సహనం కోల్పోకుండా వారి ప్రశ్నలకు సమాధానమిచ్చేవారు. మధ్యాహ్నం పూట ఆయన ఒరిస్సా కార్యకర్తలతోనూ, బయటి నుండి వచ్చినవారితోనూ సమావేశమయ్యేవారు. ఆ చర్చలు చాలా ఆలోచనాత్మకంగా నడిచేవి. అలాంటప్పుడు నాక్కూడా కొన్ని ప్రశ్నలు అడిగే అవకాశం దక్కింది. మొత్తమ్మీద అదంతా ఒక శిక్షణా శిబిరంలో ఉన్నట్టే గడిచింది. నేను ఎప్పటికప్పుడు పంపుతూ వచ్చిన నివేదికల్ని ‘ది సమాజ్’ యథాతథంగా అచ్చేసింది. రిపోర్టింగ్‌లో నాకు కూడా బాగా పట్టుబడింది. పాదయాత్ర విశేషాలు పత్రికలో ఎలా వచ్చాయో తెలుసుకోడానికి ఠక్కర్ బాపా, లాలా అనంతరామ్ లాంటి వాళ్లు ‘ది సమాజ్’ నివేదికల్ని అనువాదం చేయించుకుని చదువుతుండేవారునన్ను మెచ్చుకుంటూ ఉండేవారు.

బాపూజీ మరణించిన ఏడాది తర్వాత ఆ పాదయాత్ర గురించి నేనొక పుస్తకం ప్రచురించాను. ఆ చారిత్రక పాదయాత్ర సమగ్ర వివరాల్ని ఆ పుస్తకం అందిస్తుంది. దానికి మరికొన్ని వివరాలు జోడించి దానికి హిందీలోనూ, ఇంగ్లీష్ లోనూ కూడా అనువాదాలు తీసుకురావాలని నన్ను చాలామంది అడిగారు. ఆ పాదయాత్ర సాగుతున్న సమయంలో బాపూజీ నన్నొకసారి గట్టిగా మందలించారు. ఆ కోపంలో కూడా నా పట్ల ఎంతో ప్రేమ కనిపించింది. అది కూడా ఆశీస్సులతో సమానమేనని అనిపించింది. పైగా వార్తల్ని రాయడంలో విచక్షణ ఎంత కీలకమో ఆ సంఘటన నాకు నేర్పింది.

ఆ రోజు బాపూజీ కేంద్రపడలో ధవనద్ ఇందుపూర్‌లో బస చేశారు. అస్పృశ్యతమీద కొందరు హిందూ పండితులతో కలిసి చర్చించాలని అంతకుముందే నిర్ణయించారు. అలాంటి సమావేశం జరపాలని గాంధీజీనే స్వయంగా అనుకున్నారు. సమాజంలోని ఒక వర్గాన్ని అంటరానివారిగా చూడటాన్ని ఆ పండితులు సమర్థించుకోబోయారు. అందుకోసం ఎక్కడెక్కడి గ్రంథాల్లోంచో ఏవేవో శ్లోకాలు ఉటంకించారు. ఒకానొక సందర్భంలో వాళ్లు ‘పానోళ్లూ, హాడీలూ గొడ్డుమాంసం తింటారు. మేం వాళ్లను ఎలా తాకగలం?’ అన్నారు. దానికి బాపూజీ, ‘కొందరు క్రైస్తవులూ ముస్లింలూ గొడ్డుమాంసం తినకపోయినా, వారి మతాల్లో వాళ్ళని నిషేధించలేదు కదా. మరి హిందువులు వాళ్లను ఎందుకు తాకుతారు? వాళ్ల సంగతి పక్కన పెట్టండి. నేనో సంగతి చెప్పనా? నాకు తెలిసిన పెద్ద హిందూ నాయకుడు ఒకాయన ఉన్నారు. ఆయన ఇంగ్లాండ్ వెళ్లినప్పుడు గొడ్డుమాంసం తింటారు. అంతమాత్రాన ఆయన్నెవారూ హిందూ సమాజం నుండి వెలెయ్యలేదు కదా అన్నారు. ఆయన ఆ మాట చెప్పడంతో పండితుల నోళ్లు మూతపడ్డాయి. ఆ చర్చ మరికొంతసేపు సాగింది.

నేను ‘ది సమాజ్’కు పంపిన నివేదికలో ఆ నాయకుడి పేరు రాసేశాను. అది అలాగే అచ్చయిపోయేదే. కానీ అనుకోకుండా ఆ విషయం ఆ పత్రికా సంపాదకుడు పండిట్ లింగరాజ్ మిశ్రా దృష్టికి వచ్చింది. ఆయన ఆ పేరు కొట్టేసి, బ్రాకెట్లలో ‘మా విలేకరి ఒక ప్రముఖ హిందూ నాయకుడి పేరును ప్రస్తావించారు. ఆ పేరును ఇక్కడ వెల్లడించడం లేదు’ అని రాశారు. కథ అంతటితో ముగిసిందని నేను భావించాను. బారీ వెళ్లే మార్గంలో పండిట్ లింగరాజ్ బాపూజీని కలిశారు. మేం ముగ్గురం కలిసి కూర్చున్నప్పుడు ఈ ప్రస్తావన వచ్చింది. ‘ఆ పేరు పత్రికలో వేశారా?’ అని బాపూజీ అడిగారు. పండిట్‌జీ లేదని చెబుతూ, ‘బాపూజీ, మీరా పేరు చెప్పలేదా? వినోద్ ఆ పేరు నాకే పంపాడు’ అని వెంటనే అడిగేశారు. నా గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. బాపూజీ, ‘ఔను, ఆ పేరు చెప్పింది నేనే. కానీ వినోద్, నువ్వు వెంటనే దాన్నలా పత్రికలకి పంపేయకూడదు. నేనా పేరు చెప్పిన మాటా నిజమే, దాన్ని రాయొద్దని నీతో అనని మాటా నిజమే. కానీ ఆ చర్చ బయటి లోకానికి తెలియాలా వద్దా అన్న ఇంగితం నీకుండాలి కదా. ఆయన పేరు బయటకు వెల్లడించవచ్చో లేదో నువ్వు నన్ను అడిగి తెలుసుకోవాల్సింది’ అన్నారు. ఆ విషయం అంతటితో ముగిసింది కానీ, నాకదొక పెద్ద పాఠం నేర్పింది. నేనెన్నో ఏళ్లుగా పాత్రికేయ వృత్తిలో ఉన్నాను; కానీ ఆ వృత్తిలో ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలో ఆ రోజే తెలుసుకున్నాను. నేనలాంటి తప్పు మళ్ళా ఎప్పుడూ చేయలేదు. గాంధీజీ మందలింపులోనే ఆయన ఆశీస్సులు కూడా మిళితమై ఉన్నాయని నేను మొదట్లోనే చెప్పింది అందుకే.

(వినోద్ కానుంగో (1912-1990) విజ్ఞానసర్వస్వ కర్త గా సుప్రసిద్ధులు. బాలసాహిత్య రచయిత. ఆయన ఆత్మకథ ‘పథ పచే పచే అపథువా’ ని వసుంధరా ప్రకాశని వారు 1987లో ప్రచురించారు. ఈ వ్యాసాన్ని ఇంగ్లిషులోకి అనువదించిన జెహరా జబీన్ కటక్‌లో క్రైస్ట్ కాలేజీలో ఆంగ్ల అధ్యాపకురాలు.)

3-10-2026

2 Replies to “మహాత్ముణ్ణి చూసిన క్షణాలు-7”

  1. కాలి నడకన ప్రజలను నేరుగా కలుసుకుని, నీరసించిన freedom movement ని revive చెయ్యడమే కాకుండా, ప్రజల్లో మళ్లీ చైతన్యం నింపుతూ తన అస్పృశ్యతా నివారణ సందేశాన్ని మరింత మందికి చేరవెయ్యాలనే గాంధీజీ ‘మహాపాదయాత్ర’ వెనకున్న సంకల్పం చాలా గొప్పది!!

    ఆ ‘గడుసు మనిషి’ గడుసుతనం, పట్టుదల వల్లనే ఈరోజు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం!!

    ఈ జ్ఞాపకాల ద్వారా ఆ కాలం గురించి ఎన్నో కొత్త విషయాలు తెలుస్తున్నాయి. 🙏🏽

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading