
8
నా ఆరాధ్య దైవం
సరళా దేవి
వివిధ సందర్భాల్లో గాంధీజీని కలిసే అదృష్టం నాకు దక్కింది. ఎన్నో కాంగ్రెస్ మహాసభల్లో ఆయన దర్శనం చేసుకున్నాను. ఒరిస్సా పర్యటనలో ఆయన మొదటిసారి కటక్ నగరానికే వచ్చారు. అప్పటి నుండి నేను ఆయన అనుచరురాలినై, ఆయన ఆశయాల కోసం నా జీవితాన్ని పూర్తిగా అంకితం చేశాను. ఆయన స్ఫూర్తితో పరాయి పాలన సంకెళ్ల నుండి భరతమాతను విముక్తం చేయడానికి ఇల్లు విడిచి బయటకు వచ్చాను. ఆయన త్యాగనిరతి నా చుట్టూ ఉన్న పరిసరాల్నీ, నా లౌకిక జీవితపు కట్టుబాట్లనూ పూర్తిగా మరిచిపోయేలా చేసింది.
గాంధీజీ నా జీవితానికొక కొత్త అర్థాన్నిచ్చారు. నాలో ఒక కొత్త లోకపు జ్వాలనూ, సరికొత్త విప్లవోత్సాహాన్నీ రగిల్చారు.
ధనికులూ, బలవంతులూ, సామాన్యులూ—ఇలా అన్ని వర్గాల ప్రజలూ కాట్జూరి నదీ తీరాన గాంధీజీ బస చేసిన చిన్న కుటీరం వైపు పోటెత్తారు. ప్రజలందరికీ ఆయన దర్శనం చేసుకోవాలనే తపన ఎంతగా ఉందో స్పష్టంగా కనిపించింది. వచ్చినవాళ్ళెవరూ వట్టి చేతుల్తో రాలేదు. పూలూ, పండ్లూ కానుకలుగా తెచ్చారు. ఎంతటి మహా జనసందోహం తరలివచ్చినా ఆ చిన్నకుటీరం ఏనాడూ కిక్కిరిసిపోయినట్టు కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. గాంధీజీ ఆదేశం మేరకు ఆ వస్తువుల్ని పేదలకూ, అనాథలకూ నేనే పంచిపెట్టాను. పాత చిరుగుల బట్టలతో స్త్రీలూ, పిల్లలూ గుంపులు గుంపులుగా వచ్చారు.
తలుపు ముంగిట వేచి ఉన్న ఆ ఉద్విగ్న జనసమూహం తనవైపు అడుగు తీసి అడుగు వేయకపోయినా, కాసేపు విశ్రాంతి తీసుకుంటానని గాంధీజీ వారికి సైగ చేశారు. ద్వారం దగ్గర పహరా కాసే బాధ్యత నాకు అప్పగించారు. జన ప్రవాహం మా త్రం ఆగకుండా సాగుతూనే ఉంది. అప్పుడప్పుడూ నేను లోపలికి వెళ్లి అంతకంతకూ పెరుగుతున్న జనం గురించి గాంధీజీకి వివరిస్తూ వచ్చాను. ‘నన్ను కాస్త ప్రశాంతంగా ఉండనివ్వవు కదా!’ అన్నారు గాంధీజీ సగం నవ్వుతూ, పరిహాసంగా. ‘నేనేం చేయగలను మహాత్మా, నా చేతుల్లో ఏమీ లేదు’ అన్నాను నేను. ‘వాతావరణం బాగోలేకపోయినా జనం వెనకడుగు వేయడం లేదు. మీ ఆరోగ్యం గురించీ, మీ అలసట గురించీ వాళ్లకు ధ్యాస లేదు. నేను ఎంత ప్రాధేయపడినా వాళ్లు కదలడం లేదు. అందరూ ఆ మామిడి చెట్టు కిందే గుమిగూడారు!’ అన్నాను.
గాంధీజీ బయటకు వచ్చి ప్రజలకు దర్శనమిచ్చారు. నా వైపు తిరిగి, ‘ఎన్నిసార్లని నేను కూర్చున్న చోటినుంచి బయటకి లాకకొస్తావు? అది సరే గానీ, హరిజన నిధి సేకరణ ఎంతవరకు వచ్చిందో చెప్పు?’ అని అడిగారు. దానికి నేను, ‘మహాత్మాజీ, సాయంత్రం నాలుగు గంటలకు మీరు నగరానికి వెళ్లాల్సి ఉంది కదా. టౌన్ హాల్లో మహిళా సభ ఏర్పాటు చేశాను. ఇప్పటికే స్త్రీలంతా అక్కడికి వచ్చి చేరుకుని ఉంటారు. మీ పిలుపు మేరకు అక్కడ ఉన్నవాళ్లు తమకు తోచినదంతా మీ చేతుల్లో పెడతారన్న విషయంలో నాకు ఎలాంటి సందేహమూ లేదు’ అని బదులిచ్చాను.
చీకటి పడేలోపే గాంధీజీ కటక్ నగరం చేరుకున్నారు. శ్రీరామచంద్ర భవన్‌లో ఆయన ఉపన్యాసం గురించి నేను అంతకుముందే ప్రకటన అతికించాను. కాంగ్రెస్ వాలంటీర్లతో కలిసి మహాత్ముడు అక్కడికి వచ్చారు. అప్పటికి ఆ వాలంటీర్లలో ఎవరూ ‘నేతలు’గా మారలేదు. ఎలాంటి స్వార్థ ప్రయోజనాలూ లేవు, ఏ గొడవలూ లేవు! పనులన్నీ ప్రశాంతంగా, సాఫీగా సాగిపోయాయి. మహాత్మాజీ తన రాక వెనుక ఉన్న ఉద్దేశాన్ని మాకు వివరించారు. హరిజనుల దుర్భర పరిస్థితుల్ని ఎత్తిచూపుతూ, మహిళల పాత్ర ఎంతటిదో నొక్కి చెప్పారు. హరిజనుల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని సూచించారు.
గాంధీజీ హిందీ ప్రసంగాన్ని నేను ఇంగ్లీషులోకి అనువదించి, ‘హరిజన నిధి’ కోసం ధనరూపంలోనూ, ఆభరణాల రూపంలోనూ ఉదారంగా విరాళాలు ఇవ్వాల్సిందిగా అక్కడి మహిళలకు విజ్ఞప్తి చేశాను. అక్కడ ఉన్న స్థితిమంతుల కుటుంబాలకు చెందిన స్త్రీలలో ఎక్కువమంది నగదు ఇచ్చారు. చేతిలో డబ్బు లేనివాళ్లు ఒంటిమీద ఉన్న నగలన్నీ తీసి, అక్కడ పరిచిన తెల్లటి దుప్పటిమీద కుమ్మరించారు. అలా దాదాపు అరవై నుండి డెబ్బై తులాల బంగారం మేరకు నగలు పోగయ్యాయి. దానికి తోడు, దాదాపు వెయ్యి రూపాయల నగదు కూడా చకచకా వసూలైంది. స్వచ్ఛహృదయులైన ఆ జాగృత స్త్రీమూర్తుల నుండి అందిన కానుకలు చూసి మహాత్మాజీ ఎంతో సంతోషించారు.
సభ ముగిసింది. ఉదయం నుండి సాయంత్రం ఆరు గంటల దాకా నేను ఆయన వెంటే ఉన్నాను. ప్రజలు అక్కడ తనకి నివేదన చేసిన పండ్లు తాను తినకుండా, ఆయన పిల్లలకే పంచిపెడుతుండటం చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. గాంధీజీ ఆరగిస్తారని గంపలకొద్దీ పండ్లు తెచ్చినవాళ్లు మాత్రం కాస్త నిరాశ చెందారు; ఎందుకంటే ఆయనకు బదులుగా ఆ పండ్లన్నీ ఎక్కడెక్కడి నుంచో వచ్చిన మహిళలకూ, పిల్లలకూ, పేదలకూ, అనాథలకూ చేరాయి.
అంతకుముందు ఒక సందర్భంలో కస్తూర్బా, దేవదాస్‌లతో కలిసి వచ్చినప్పుడు గాంధీజీ స్వరాజ్య ఆశ్రమంలో బస చేశారు. ఆ తర్వాత అన్నదా రాయ్ గారింటికీ, అక్కడి నుండి నవబాబు ఇంటికీ మారారు. ఆయా స్థలాలన్నింటికీ నేనూ వెళ్లాను.
(సరళా దేవి (1904-1986) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు. రచయిత్రి. ఈ వ్యాసాన్ని ఇంగ్లిషులోకి అనువదించిన సచ్చిదానంద మొహంతి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆంగ్ల ఆచార్యులు.)
9
గాంధీ పంపిన సందేశం
గోవింద చంద్ర మిశ్రా
ఆ ఏడాది మహాత్మా గాంధీ ఒరిస్సాకు రావలసి ఉంది. ఆయన చేతుల మీదుగానే ఆశ్రమానికి శంకుస్థాపన చేయించాలనుకున్నాను నవంబర్ 15 నుంచి నెల రోజుల పాటు ఆయన ఒరిస్సాలోనే ఉంటారని అనుకున్నారు, కానీ ఆయనకు వేరే అత్యవసరమైన పనులు ఉండటంతో అది వీలవ లేదు. డిసెంబరులో మాత్రమే రాగలననీ, ఒరిస్సాలో ఇరవై రోజులకు మించి గడపలేననీ ఆయన రాశారు. అఖిల భారత చరఖా సంఘానికి మద్దతుగా గాంధీజీ పర్యటిస్తున్నారు. బాబు నిరంజన్ పట్నాయక్ ఈ చరఖా సంఘం ఒరిస్సా విభాగానికి ఏజెంట్‌గా ఉండేవారు. ఖద్దరు గురించీ, చరఖా గురించీ ప్రచారం చెయ్యడం కోసమే మహాత్ముడు ఒరిస్సా వస్తున్నారు. ఆ వ్యవహారాలు అక్కడ స్థానికంగా చూసుకుంటున్న నిరంజన్ బాబే గాంధీజీ స్థానిక పర్యటన కార్యక్రమం రూపొందిస్తున్నారు. నిజానికి గాంధీజీ ఒరిస్సా పర్యటనకు పూనుకోడానికి ముఖ్య కారణం నేనే. అయినా సరే, కనీసం నాకు మాట మాత్రమైనా చెప్పకుండా నిరంజన్ బాబు గాంధీజీ పర్యటన వివరాలు తయారుచేశారు. ఆయన రూపొందించిన ప్రణాళికలో మా ఆశ్రమాన్ని సందర్శించే ప్రస్తావననే లేదు. ఈ సంగతి తెలిశాక నాకు చాలా బాధ కలిగింది, పట్టరాని కోపం కూడా వచ్చింది. అయినప్పటికీ మహాత్మా గాంధీ చేతుల మీదుగా ఆశ్రమ భవనం శంకుస్థాపన చేయ్హించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేసుకుంటూ పోయాను. కట్టబోయే భవనానికి బ్లూప్రింట్ సిద్ధం చేశాం. రకరకాల సామగ్రి పోగుచేశాం.
ఆంధ్రప్రదేశ్ నుండి మహాత్మా గాంధీ ఒరిస్సా చేరుకున్నారు. ఆయన ఒరిస్సా గడ్డమీద అడుగుపెట్టగానే నేను వెళ్లి కలవాల్సి ఉంది. కానీ నేను కావాలనే వెళ్లలేదు. ఒరిస్సాలో అడుగుపెట్టిన వెంటనే మహాత్మాజీ మొదట నా కోసమే చూశారు, నా సంగతే వాకబు చేశారు. ఈ విషయం కూడా ఎవరూ నాకు చెప్పలేదు. బాణ్‌పూర్ నుండి బోల్‌గఢ్ దాకా మహాత్మాజీ మోటారు కారులో ప్రయాణించారు. బోల్‌గఢ్ వెళ్లే దారిలో ఖుర్దా వద్ద ఆయన కాసేపు ఆగారు; నేను అక్కడికి వెళ్లి ఆయన్ను కలిశాను. నన్ను చూడగానే మహాత్మాజీ ఒక్కసారిగా, ‘ఎక్కడున్నావు ఇన్నాళ్లూ? నీ కోసమే వెతుకుతున్నాను’ అన్నారు.
ఆ మాట వినగానే నా నోట మాట రాలేదు. మారు మాట్లాడకుండా కారెక్కేసి బోల్‌గఢ్ వెళ్లిపోయాను. మహాత్మాజీ బోల్‌గఢ్‌లో మూడు రోజులు బస చేశారు. అక్కడి నుండి మహదేవ్ దేశాయ్, కాకా కాలేల్కర్‌లతో పాటు మేం కొంతమందిమి నయాగఢ్ విహారానికి వెళ్లాం. నయాగఢ్‌లోని ఇటామతి గ్రామాన్ని చూడగానే కాకా సాహెబ్, మహదేవ్ భాయ్ పట్టరాని ఆనందంతో పొంగిపోయారు. ఒరిస్సా పల్లెటూరి జీవనంలోని సరళత గురించీ, అందం గురించీ అక్కడ చాలాసేపు చర్చ నడిచింది.
ఒరియా సంస్కృతినీ, అక్కడి జీవన విధానాన్నీ దగ్గరగా తెలుసుకోవడానికి వాళ్లు ఇటామతిలోని ఒకటి రెండు ఇళ్లల్లోకి వెళ్లి అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించారు. వేకువజామునే కళ్లాపి చల్లి, ఆ గృహిణులు ఇళ్లను పేడతో అలికి శుభ్రం చేసుకున్న తీరు చూశారు. పశువుల పాకలు శుభ్రం చేసి, బూడిద చల్లి ఉంచారు. ఇత్తడి పాత్రలు తోమి, తళతళలాడేలా మెరుగుపెట్టి ఒక పద్ధతి ప్రకారం వరుసగా సర్ది ఉన్నాయి. ముంగిట్లోని తులసికోట ఎంతో కళకళలాడుతూ కనిపించింది. కాకా సాహెబ్ ఒక్కసారిగా పరవశించిపోతూ, ‘ఈ మనుషులూ, వీళ్ల ఇళ్లూ ఎంత అందంగా, ఎంత నిష్కల్మషంగా ఉన్నాయో కదా!’ అన్నారు.
కానీ ఆ అందమూ, ఆ అమాయకత్వమూ కేవలం పైపై ముసుగు మాత్రమే. వాటిలో జీవం లేదు. అంతా నిర్జీవంగా ఉంది. విచక్షణారహితమైన అణచివేత పాలన కింద గ్రామీణ జీవితపు జీవధార ఇంకిపోయింది. ప్రజలు ఎంతగా భయపడిపోయి ఉన్నారంటే, వాళ్ల శరీరాల్లో ప్రాణమున్న ఛాయలే కనిపించడం లేదు. ఇటామతిలో అలాంటి దృశ్యాలు ఎన్నో చూశాం; ఎన్నో విషయాలు చర్చించాం.
నేను కూడా స్థానిక జమీందారీ సంస్థానాల ప్రాంతాల నుంచి వచ్చినవాణ్ణి కావడంతో ఆ సంభాషణ నాకు చాలా దగ్గరగా తోచింది. ఆ చర్చల్ని ఎంతో ఆస్వాదించాను. చివరికి మేము ఇటామతి నుండి వెనక్కి వచ్చేశాం. బోల్‌గఢ్ నుండి సత్యవాదీ, పూరీల మీదుగా మహాత్మాజీ బాలేశ్వర్ ప్రయాణమయ్యారు. మహాత్ముడి చేతుల మీదుగా నా ఆశ్రమానికి శంకుస్థాపన జరగాలని కోరుకుంటున్నట్టు విన్నవించుకున్నాను. ఆ కార్యక్రమం ఏర్పాట్లు చూసుకోవడానికి నేను తిరిగి ఆశ్రమానికి వచ్చేశాను.
బాలేశ్వర్ నుండి మహాత్మాజీ కటక్ తిరిగి వచ్చారు. ఆయన ఆరోగ్యం ఏమంత బాగాలేదు. తీరిక లేకుండా నిరంతరం పనిచేయించడం వల్ల కటక్‌లోనే ఆయన అనారోగ్యం పాలయ్యారు. కటక్‌లో మహాత్మాజీ గోపాల్ చంద్ర ప్రహరాజ్ గారి ఇంట్లో బస చేశారు. ప్రహరాజ్ గారి ఇంట్లో మహాత్మాజీ బస ఏర్పాటు చేయడం వెనుక నా పాత్ర ఉంది. ప్రహరాజ్ ఖద్దరు కట్టి, ఒక కాంగ్రెస్ కార్యకర్తగా మారారు. ఆయన కాంగ్రెస్‌లో ఒక క్రియాశీలక కార్యకర్తగా ఎదగాలని నేను కోరుకున్నాను. ఆ కోరిక నెరవేరడానికే ఆయన ఇంట్లో మహాత్మాజీ బసకు ఏర్పాట్లు చేశాను. మహాత్మాజీ అక్కడున్న సమయంలోనే, మా ఆశ్రమానికి వచ్చి, శంకుస్థాపన చేసే విషయం మళ్లీ ప్రస్తావనకు వచ్చింది. మహాత్మాజీ నా అభ్యర్థనను మన్నించారు. కానీ వైద్యుల సలహా మేరకు ఆయన కటక్‌లోనే విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించారు. కటక్ జిల్లా పర్యటన కోసం కేటాయించిన మూడు నాలుగు రోజుల సమయాన్నీ మహాత్మాజీ కటక్‌లోనే ఆరోగ్యం కుదుటపరుచుకోవడానికి వెచ్చించారు. అయితే, నాతో పాటు ఆశ్రమానికి వచ్చి శంకుస్థాపన చేయడానికి తాను సిద్ధమేనని ఆయన నాతో చెప్పారు. కానీ ఆ నిర్ణయం తీసుకునే బాధ్యత మహాత్మాజీ నా మీదే మోపారు.
నేను పెద్ద ధర్మసంకటంలో పడ్డాను. మహాత్మాజీ వచ్చి ఆశ్రమానికి శంకుస్థాపన చేస్తారన్న నమ్మకంతో ఘనంగా ఏర్పాట్లన్నీ చేసుకున్నాను. ఆయన అక్కడికి రాకపోవడం నేను ఊహించ లేను. కానీ ఇప్పుడు ఆయన్ని అక్కడికి తీసుకువెళ్ళాలా లేదా తేల్చుకోవలసిన బాధ్యత నా మీదే పడింది. గాంధీజీని అక్కడికి తీసుకెళ్లి, సభను ప్రశాంతంగా ముగించడం అసాధ్యమైన పని. ఆ జనసందోహం నుండీ, ఆ తోపులాట నుండీ ఆయనెలా బయటపడగలరు? ఆయన నా మాట కాదనలేక వచ్చినా, తీరాచేసి ఆయన ఆరోగ్యం మరింత విషమిస్తేనో? యావద్దేశం నా మీద మండిపడుతుంది, నన్నే నిందిస్తుంది.
ఇవన్నీ ఆలోచించాక, మహాత్మాజీని నాతో పాటు ఆశ్రమానికి తీసుకువెళ్లే ధైర్యం నాకు చాలలేదు. ఆయన రాకపోయినా నేనేమీ అనుకోనని ఆయనకు చెప్పేసాను. మహాత్మాజీ తాను స్వయంగా ఆశ్రమానికి రాలేకపోయినా, ఆ కార్యక్రమానికి హాజరు కావాలసిందిగా మీరా బెహెన్, మహదేవ్ దేశాయ్, కాకా కాలేల్కర్‌లను పంపించారు. ఆయన స్వదస్తూరీతో ఒక సందేశం కూడా రాసి నాకు పంపించారు. కట్టబోతున్న భవనం బ్లూప్రింట్‌మీద ఆయన ‘నా తరఫున మీరా బెహెన్ ఈ భవనానికి శంకుస్థాపన చేస్తారు; అది నేనే స్వయంగా శంకుస్థాపన చేసినదానితో సమానం’ అని రాశారు.
(గోవింద చంద్ర మిశ్రా (1890-1967) రాసుకున్న ఆత్మకథ ‘జాతీయ జీవనర ఆత్మవికాస్’ (1940) లోనిది ఈ భాగం. ఆ ఆత్మకథ కటక్‌లోని ఆర్య ప్రకాశని ప్రచురించిన ‘గోవిందచంద్ర రచన సమగ్ర’ లో లభ్యమవుతున్నది. ఈ వ్యాసాన్ని ఇంగ్లిషులోకి అనువదించిన సుజిత్ మహాపాత్ర విమర్శకుడు, అనువాదకుడు. బకుల్ ఫౌండేషన్ సభ్యకార్యదర్శి.)
2-10-2026

