
24
గాంధీజీకి జై
సురేంద్ర మొహంతి
అది బళ్ళో మాకు చివరి సంవత్సరం. పాఠాలు పూర్తి చేయడానికి మాస్టార్లు అదనపు తరగతులు తీసుకుంటున్నారు. మేం హాస్టల్లో ఉండేవాళ్ళం. మాలో బాగా చదివే కొందరి కోసం క్రమం తప్పకుండా ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. పాట్నా విశ్వవిద్యాలయ పరీక్షల్లో మా బడి మంచి ఉత్తీర్ణత సాధించాలని అటు ఉపాధ్యాయులూ, ఇటు విద్యార్థులూ అందరం కష్టపడి చదువుతున్నాం.
‘ది సమాజ్’ అనే ఒరియా దినపత్రిక రోజూ బస్టాండ్ నుంచి కొనుక్కోవడం నాకు అలవాటు. నిజం చెప్పాలంటే, దినపత్రిక చదవడం నా నిత్య అధ్యయనంలో ఒక భాగమైపోయింది. ఫలితంగా జనరల్ నాలెడ్జ్, వక్తృత్వ పోటీల్లో ఎప్పుడూ నాకే మొదటి మార్కులు వచ్చేవి. ఒకరోజు దేలాంగ్ బెర్బోయిలో సర్వ సేవా సంఘ్ మహాసభలు జరగనున్నాయనీ, వాటికి మహాత్మా గాంధీతో పాటు ఇతర ముఖ్య కాంగ్రెస్ నాయకులు హాజరవుతున్నారనీ ‘ది సమాజ్’ పత్రిక ద్వారా తెలిసింది. కొద్ది క్షణాల్లోనే ‘మహాత్ముడు ఒరిస్సా వస్తున్నారు, మహాత్ముడు ఒరిస్సా వస్తున్నారు’ అన్న వార్త నలుదిక్కులా దావానలంలా వ్యాపించింది.
నేను మా వార్డెన్ మన్మోహన్ బాబు దగ్గరకు వెళ్లి, ‘నేను మహాత్మా గాంధీని చూడాలి, దయచేసి నాకు సెలవు ఇవ్వండి’ అని అడిగాను. ఆయన కుదరదన్నారు. ఒకరోజు వేకువజామునే, తర్వాత రాబోయే పరిణామాల గురించి ఏమాత్రం ఆలోచించకుండా సాలీపూర్ బస్టాండ్లో బస్సెక్కి జగత్పూర్ వచ్చేశాను. నా జేబులో ఉన్నది రెండే రెండు రూపాయలు. జగత్పూర్ రైల్వే స్టేషన్లో మా బడికి చెందిన మరో ఇద్దరు విద్యార్థులు ఎదురుపడ్డారు. నేను దేలాంగ్ వెళుతున్నానా అని వాళ్లు ఆరా తీశారు. అవునన్నాను. మధ్యాహ్నం వేళ కటక్ నుండి దేలాంగ్ వైపు ఒక ప్రత్యేక రైలు బయలుదేరబోతోందని వారు చెప్పారు. మేమంతా కలిసి మహానది ఇసుక తిన్నెల గుండా నడిచి, జోబ్రా ఘాట్ దగ్గర పడవ ఎక్కి కటక్ రైల్వే స్టేషన్ చేరుకున్నాం. ఆ ప్రత్యేక రైల్లో ప్రయాణించడానికి మేము టికెట్లు కొనలేదు. ఏ టికెట్ కలెక్టరూ కూడా తనిఖీ చేయడానికి బోగీల్లోకి రాలేదు—బహుశా మహాత్ముని మీద ఉన్న గౌరవంతో వాళ్లు అటువైపు రాలేదేమో! రైలు కదలగానే ‘మహాత్మా గాంధీకి జై’ అన్న నినాదాలతో పరిసరాలన్నీ మార్మోగిపోయాయి. రైలు ఆగిన ప్రతి స్టేషన్ లోనూ మేం బోగీల్లోంచి ‘మహాత్మా గాంధీకి జై’ అని గట్టిగా అరిచాం. ప్లాట్ఫారమ్మీద వేచి ఉన్న ప్రయాణికులు కూడా ‘మహాత్మా గాంధీకి జై’ అంటూ బదులిచ్చారు. నాటి భారతదేశంలో మహాత్మా గాంధీ అనే ఒక్క పేరు సామాన్య ప్రజానీకాన్ని ఎంతగా ఉత్తేజపరిచిందో, ఎంతటి అనురక్తిని నింపిందో చెప్పడానికి ఈ సంఘటనే ఒక నిదర్శనం.
మధ్యాహ్నానికి రైలు దేలాంగ్ చేరుకుంది. స్టేషన్ వెలుపల కొబ్బరి మట్టలతో అల్లిన వందలాది గుడిసెలు కనిపించాయి. వాటి నేలమీద ఎండుగడ్డి పరచి ఉంది. ఆ గడ్డిమీదే దుప్పట్లు పరుచుకుని ప్రతినిధులు బస చేశారు. మహాత్మా గాంధీ మరికొద్దిసేపట్లోనే ప్రజలకు దర్శనమిస్తారని తెలిసింది. తిండీ తిప్పల ధ్యాస మర్చిపోయాం. మహాత్మా గాంధీ ప్రసంగించబోయే స్థలానికి పరుగుతీశాం. విడిది కేంద్రానికి కాస్త దూరంలో చుట్టూ మొగలి పొదలుండే ఒక మైదానం ఒకటుంది. చుట్టుపక్కల గ్రామాల నుండి తరలివచ్చిన పిన్నల్తో, పెద్దల్తో, మహిళల్తో ఆ మైదానమంతా అప్పటికే కిక్కిరిసిపోయింది. సభికుల్లో మగవాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారు. చీర చెంగులు ముఖాలమీదికి లాక్కుని ఆ స్త్రీలు నీడల మాదిరిగా నిశ్శబ్దంగా మహాత్ముని కోసం ఎదురుచూస్తున్నారు.
స్త్రీల గుంపులోకి వెళ్లకుండా వాలంటీర్లు మమ్మల్ని అడ్డుకున్నారు. దాంతో మేం మొగలి పొదల పక్కనే నిలబడి మహాత్ముని రాక కోసం నిరీక్షించాం. మహాత్ముని కోసం ఒక మంచంమీద కుర్చీ వేసి ప్రత్యేకంగా ఒక వేదిక నిర్మించారు. ఆయన రాగానే పురుషులు ‘మహాత్మా గాంధీకి జై’, ‘హరిబోల్’ అంటూ నినదించారు. మహిళలు మంగళ ధ్వనులు (హులహులి) చేశారు. ఆ కోలాహలం సద్దుమణగడానికి చాలా సమయమే పట్టింది. ఆ తర్వాత గాంధీజీ ఆశీర్వదిస్తున్నట్టుగా తన కుడిచేతిని కాస్త పైకెత్తి ప్రసంగించారు. ఆయన ఏం మాట్లాడారో ఎవరికీ బోధపడలేదు. అసలు ఆయన ఉపన్యాసం వినడానికి ఎవరొచ్చారు గనుక? ఒకరి పైట చెంగును మరొకరు ముడేసుకుని వచ్చిన పల్లెటూరి మహిళలకూ, ఒక రోజు కూలీ వదులుకుని వచ్చిన దినసరి కూలీకీ, పంట చేలు గాలికొదిలేసి పరుగులుతీసిన కర్షకులకూ గాంధీ ఉపన్యాసంలో అర్థమయ్యేదేముంది? వాళ్లంతా వచ్చింది కేవలం మహాత్ముని దర్శనం కోసమే. ఒక్కసారి ఆయనమీద తమ చూపులు వాలడమే, అన్నింటికంటే, వాళ్లకు ముఖ్యం. మహాత్ముని ప్రసంగమంటే వారికి తెలిసిన అర్థం అంతవరకే!
అక్కడ నిలబడి ఉన్నప్పుడు నాకో పాత సంఘటన గుర్తొచ్చింది. అదే సంవత్సరమో సరిగ్గా గుర్తులేదు. అప్పట్లో నేను కాన్పూర్లోని మెట్కాఫ్ మిడిల్ స్కూల్లో చదువుతున్నాను. సాలీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే జిగినీపటాపూర్ గ్రామానికి గాంధీజీ వచ్చారు. రాయ్సుంగుడా నుండి జిగినీపటాపూర్ ఆరేడు మైళ్ల దూరంలో ఉంటుంది. గాంధీజీ వస్తున్నారని తెలియగానే ఎలాగైనా వెళ్లి ఆయన్ను చూడాల్సిందేనని మా అమ్మ పట్టుబట్టింది. నాన్న ఆ రోజుకు తన డిస్పెన్సరీ మూసేశారు. నా గుర్తున్నంతవరకు అది ఒక వేసవి ఉదయం. బాడుక్కి మాట్లాడుకున్న ఎడ్లబండిలో మా అమ్మా మరికొందరు మహిళలూ జిగినీపటాపూర్ బయలుదేరారు. చేతిలో గొడుగు పట్టుకుని నాన్న బండి ముందే నడిచారు. నేను దుమ్ము రేపుకుంటూ పక్కనే పరిగెత్తాను.
కానీ ఆ రోజు నేను గాంధీని చూడలేకపోయాను. మా అమ్మా ఇతర స్త్రీలూ మాత్రమే దర్శనం చేసుకోగలిగారు. తిరుగు ప్రయాణంలో నేను అమ్మతో, ‘గాంధీ నీతో ఏం చెప్పారు?’ అని అడిగాను. నాలాగే నాన్న కూడా గాంధీని చూడలేకపోయారు. దాంతో మా కుటుంబం మొత్తంలోనూ గాంధీని దర్శించుకునే సుకృతం తనకు ఒక్కరికే దక్కిందన్న గర్వం అమ్మ ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపించింది. ఆమె ఎంతో గంభీరంగా, ‘ఆయనేం చెబుతాడు? నూలు వడకండి, మీ నగలన్నీ నా చేతుల్లో పెట్టండి అనడం తప్ప ఆయన చెప్పడానికి ఇంకేముంది? ఆయన చెప్పేది అంతే. ఒంటి తీరు మాత్రం సన్నటి బంగారు కడ్డీలా మెరిసిపోతోంది’ అంది. ఆమె ఇంకా అలాగే ఏకరువు పెడుతూనే ఉండేదేమో, కానీ నేను మధ్యలోనే అడ్డుపడుతూ, ‘మరి నువ్వేం నగలిచ్చావు ఆయనకి?’ అని అడిగాను. ఆమె ముఖం చిట్లించి, ‘నా నగలు ఆయనకెందుకివ్వాలి? ఒక వెండి రూపాయి కానుగ్గా సమర్పించి నమస్కారం చేసుకున్నాను’ అంది.
(సురేంద్ర మొహంతి (1920-1992) ప్రముఖ రచయిత, విశిష్ట పార్లమెంటేరియన్. ఆయన ఆత్మకథ ‘పథ ఓ పృథివీ’ భువనేశ్వర్లోని ఈస్టర్న్ మీడియా ద్వారా 1986లో వెలువడింది. ఈ భాగాన్ని ఇంగ్లిషులోకి అనువదించిన జతీంద్ర కె. నాయక్ భువనేశ్వర్లో ఉత్కళ విశ్వవిద్యాలయంలో ఆంగ్ల ఆచార్యులు. ఈ పుస్తకం సంపాదకులు.)
25
గాంధీ రేఖాచిత్రం
ఫ్రీడా హౌస్వర్త్
(ఈ సంకలనంలో ఈ చివరివ్యాసం అన్నిటికన్నా సుదీర్ఘ వ్యాసం. కాబట్టి దీన్ని నాలుగు రోజుల పాటు వరసగా సీరియలైజు చేయబోతున్నాను.)
ఆ సంవత్సరం వరదలతోనూ, కరవుతోనూ అల్లాడుతున్న ఒరిస్సా ప్రాంతంలో గాంధీ పర్యటిస్తున్నారు. కలకత్తా వెళ్లిన నా భర్త తన పర్యటన ముగించుకుని తిరిగి రావడం కోసం నేను ఎదురుచూస్తున్నాను. నేను నా భర్తతో కలిసి మొదటిసారిగా ఆయన స్వస్థలాన్నీ, అక్కడున్న తోటల్నీ చూడాలని ఆశపడుతున్న వేళ అది. సరిగ్గా ఆ సమయంలోనే, నా అదృష్టం కొద్దీ, గాంధీజీ కటక్ రావలసి ఉంది. కటక్ లోకల్ కాంగ్రెస్ బోర్డుకి చెందిన ఏడుగురు సభ్యుల్లో నలుగురు నాకు చాలా బాగా పరిచయం; గాంధీ ఉపన్యాసానికి సంబంధించిన ఏర్పాట్లూ, నిధులూ, స్వాగత సత్కారాలూ, బస లాంటి విషయాలు చర్చించే సమావేశానికి నన్ను కూడా తీసుకెళ్ళడానికి వారిలో ఒకరిని ఒప్పించాను.
అటువంటి పర్యటనల్లో, తెర వెనుక జరిగే సన్నాహాల్ని తొంగిచూడాలనీ, అసలు గాంధీ పర్యటన వెనుక ఏమేమి ఇమిడి ఉంటాయో తెలుసుకోవాలనీ నాకు కుతూహలంగా ఉంది; కానీ నా ముఖ్య ఉద్దేశం మాత్రం గాంధీజీకి ఒక రేఖాచిత్రం గీయడానికి తగిన అవకాశం దక్కించుకోవడమే. ఆ కాంగ్రెస్ సభ్యులకు మాత్రం కళ గురించి ఎలాంటి అవగాహనా లేదు. వాళ్ళు రసజ్ఞత ఏ కోశానా లేనివాళ్ళు. కష్టపడి గీసిన ఒక రేఖాచిత్రం కన్నా, ఒక ఫోటోగ్రాఫు వాళ్ళకి ఎక్కువ తృప్తినిస్తుంది. చాలా తక్కువ ఖర్చులో వస్తుంది కాబట్టి వాళ్ళ దృష్టిలో ఫోటోనే గొప్పగా అనిపిస్తుంది. అయినా సరే, వాళ్ళు నా పట్ల ఎంతో స్నేహపూర్వకంగా ఉంటూ, నేను కోరిన సాయం చేయడానికి సిద్ధపడ్డారు.
గాంధీజీ బస చేయబోయే ఇంట్లోనే ఆ కమిటీ సమావేశమైంది. ఆ రోజు గురించి అప్పటి నా డైరీలో ఇలా రాసుకున్నట్టుగా ఉంది :
కటక్, ఒరిస్సా, 16 డిసెంబర్ 1927.
వరండాలో నేలమీద చారల జంపఖానా పరిచి ఉంది; కేవలం అడుగు ఎత్తున్న ఒక పొడవాటి బల్ల చుట్టూ, మసక లాంతరు వెలుగులో కమిటీ సభ్యులు పద్మాసనాలు వేసుకు కూర్చున్నారు.
నేనూ నేలమీదే కూర్చున్నాను.
ఔను, మహాత్మాజీ వచ్చే వేళకు అన్నీ సకాలంలో సిద్ధమవుతాయి. గోడలకు సున్నాలు వేశారు, ఇళ్ళదగ్గరా, తోటల్లోంచీ చెత్తాచెదారం తొలగించారు. చిల్లరమల్లర సామగ్రి కొన్నారు; రాత్రికి రాత్రి కలకత్తా నుంచి యాభై రూపాయల విలువైన పండ్లూ కూరగాయలూ తెప్పించడానికి ఆర్డరిచ్చారు. ఆ విషయాలు వింటుంటే నాకు ఆశ్చర్యం వేసింది; గాంధీజీ అవసరాలు చాలా పరిమితమని కదా చెప్తారు!
గాంధీజీతో పాటు మరొక ఆరుగురిదాకా రావొచ్చని వారు ఊహిస్తున్నారు. మీరాబెహెన్ (ఇంగ్లీష్ రియర్ అడ్మిరల్ కుమార్తె అయిన మిస్ స్లేడ్, ప్రస్తుతం గాంధీజీ శిష్యురాలు) కోసం ప్రత్యేకంగా ఒక గది కేటాయించాలని అనుకున్నారు.
ఆ సభ్యుల్లో ఒకరైన ఒక న్యాయవాది, గాంధీజీకి రైలు దగ్గర స్వాగతం పలికే కమిటీలో నన్నూ ఒకరిగా ఉండమని సూచించారు. నేను సున్నితంగా తిరస్కరించడంతో ఆ ప్రస్తావన అంతటితో ఆగింది.
మధ్యాహ్నం రెండున్నర గంటలకు గాంధీజీ కటక్ స్టేషన్ చేరుకున్నప్పుడు, నిశ్శబ్దంతోనే ఆయనకు స్వాగతం పలకాల్సి ఉంది. ఎందుకంటే ఆయన ప్రతి వారం చేపట్టబోయే కఠిన మౌనవ్రతం ఆ రోజు మధ్యాహ్నం సరిగ్గా ఒంటిగంటకు మొదలవుతుంది. ఆయన చుట్టూ ఉన్నవారు స్వాగత కమిటీతో మాట్లాడతారు కానీ, స్వయంగా గాంధీజీతో ఎవరూ మాట్లాడకూడదనీ, ఆయన కూడా బదులివ్వరనీ మాకు చెప్పారు. ఎంతటి అపూర్వమైన స్వాగతం! భారతదేశంలో తప్ప మరెక్కడైనా ఇలాంటి ఆహ్వానాన్ని ఊహించగలమా?
గాంధీ రాకముందే నేను ఈ ఇంటికి చేరుకోవాలనీ, ఆయన కూర్చుని నా చిత్రలేఖనానికి తగిన భంగిమలో కూర్చునే ఏర్పాటు కోసం నేరుగా మిస్ స్లేడ్తోనే మాట్లాడి ఒప్పించాలనీ నిర్ణయించారు. కానీ అదెలా సాధ్యం? గాంధీజీ చిత్రకారుల కోసం ప్రత్యేకంగా ‘పోజు’ ఇచ్చే మనిషి కాదు. అలాంటి వాటికి ఆయన దగ్గర సమయమూ లేదు, ఆసక్తీ లేదు. ఒక ఇంటర్వ్యూలో ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు నాకు గుర్తున్నాయి: ‘వ్యక్తిగతంగా నాకు చిత్రలేఖనం లాంటి కళలతో పనేమీ లేదు. నక్షత్రాలతో నిండిన ఆకాశాన్ని చూస్తేనే నాకు కావలసినంత తృప్తి కలుగుతుంది. మీకు తెలిసే ఉంటుంది, ఐరోపాలో ఏడాది పొడుగునా ఎక్కువ కాలం ఆనందించడానికి నక్షత్రాల ఆకాశం ఉండదు కాబట్టి, బహుశా వాళ్ళకి తమను తాము సంతృప్తిపరుచుకోడానికి చిత్రలేఖనంతో అవసరం పడిందేమో! నా ఆశ్రమాన్ని నేను వర్ణ చిత్రాలతో అలంకరించాలని అనుకోను. చిత్రలేఖనాలమీద నాకు ప్రత్యేకమైన శ్రద్ధ కూడా లేదు, వాటిని తెచ్చుకుని గోడలమీద తగిలించుకొమ్మని తక్కినవాళ్ళకి చెప్పను కూడా. నా ఆశ్రమంలో ఉన్న గోడల్ని బొమ్మలతో అలంకరించడం నాకు ఇష్టం ఉండదు, నేనెప్పుడూ ఆ గోడల హద్దులు దాటి బయటనే ఉండాలని కోరుకుంటాను— గోడలు నన్ను బంధిస్తున్నట్టూ, నా స్వేచ్ఛను హరిస్తున్నట్టూ, నన్ను ప్రకృతికి దూరం చేస్తున్నట్టూ అనిపిస్తుంది’.
మరో సందర్భంలో ఆయన ఇలా అన్నట్టు కూడా విన్నాను : ‘మీరు నా సత్యాగ్రహ ఆశ్రమానికి వెళితే గోడలన్నీ వట్టిగా, బోసిపోయి కనిపిస్తాయి. నా మిత్రులు దీనిని ఆక్షేపిస్తుంటారు. గోడలమీద చిత్రాలు లేవన్న మాట నిజమే. కానీ అందుకు కారణం, గోడలు మనకు ఆశ్రయం ఇవ్వడానికే తప్ప, కళకు వ్యతిరేకం కావడం వల్ల కాదు. విసుగు లేకుండా నక్షత్ర ఖచిత గగన వితానాన్ని నేను ఎల్లప్పటికీ చూస్తూనే ఉండిపోలేదా? మనసుకి కలిగించే పరవశంలో తారాతోరణాల ఆకాశాన్ని మించిన చిత్రలేఖనం మరొకటి ఉంటుందని నేనెన్నటికీ ఊహించలేను. అది నన్ను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతుంది. అనిర్వచనీయమైన పారవశ్యంలోకి నెడుతూంటుంది. భగవంతుని అద్భుత కళాసృష్టితో పోలిస్తే, మనిషి చేసే పని కేవలం మెరిసే తాటాకు చప్పుడు లాంటిది కాదా?’
ఇలాంటి నిరుత్సాహకర అభిప్రాయాలు మహాత్మాజీకి ఉన్నాయని తెలుసు కాబట్టి చిత్రలేఖనానికి అనుమతి దొరుకుతుందని పెద్దగా నమ్మకం కలగడం లేదు, అయినా ఏదో విధంగా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నాను. ఒకవేళ ప్రయత్నించడానికి నాకు అనుమతి దక్కినా, తన కలం ద్వారా అంతర్మథనం చెందుతూ, యువ భారతీయులతో అనితరసాధ్యం గానూ, సూటిగానూ, నిశితంగా, స్వదేశీ శైలిలో వాదిస్తూ, విన్నవిస్తూ ఉండే ఆ సాధుపురుషుని రూపాన్ని నిజంగా నేనొక రేఖాచిత్రంలోకి కుదించగలనా? (ఇంకా ఉంది)
(ఫ్రీడా హౌస్వర్త్ (1886-1974) చిత్రకారిణి, రచయిత్రి, ఇలస్ట్రేటర్. స్విట్జర్లాండ్లో జన్మించిన ఈమె, బర్కిలీలో భారతీయ విద్యార్థి సారంగధర్ దాస్ను కలిసి వివాహం చేసుకుని ఒరిస్సా వచ్చారు. ఆమె రచనల్లో ఎ మ్యారేజ్ టు ఇండియా, లీప్హోమ్ అండ్ జెంటిల్బ్రాన్, ఇన్టు ది సన్ ముఖ్యమైనవి.)
10-10-2026


సభికుల్లో స్త్రీల కంటే మగవాళ్లు చాలా తక్కువ మంది ఉండడం, గాంధీజీ ఏం మాట్లాడారో అర్థం కాకపోయినా, ఆయనను ఒక్కసారైనా చూడాలని తమ పనులు, వ్యవసాయం వదులుకుని మరీ వచ్చిన సామాన్య ప్రజలు!
గాంధీ దర్శనం చేసుకుని వెండి రూపాయి సమర్పించారుగానీ, నగల విషయానికి వచ్చేసరికి మాత్రం ఇవ్వలేకపోయిన సురేంద్ర మొహంతి గారి అమ్మగారు!
ఆ కాలపు సామాన్య ప్రజలకు గాంధీ గారి పట్ల వున్న అభిమానం, గౌరవం! But at the same time, ఆయన ఆశయాల పట్ల వారికి పెద్దగా అవగాహన లేకపోవడం కూడా ప్రత్యక్షంగా చూసినవారు ఇలాంటి వివరాలను record చెయ్యడం వలన తెలుస్తున్నాయి.
Frieda Hauswirth గారి జ్ఞాపకాల్లో ఒక విదేశీయురాలి perspective కనిపిస్తుంది. She seems to have recorded events as she saw them. In spite of her admiration for Gandhiji, ఆయన రాక కోసం చేసిన ఖర్చు, కళల గురించి ఆయన అభిప్రాయాలపై ఆమె రాసిన విషయాలు particularly interesting గా ఉన్నాయి. Looking forward to reading more of her account.
అవును. మీ పరిశీలనలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. గాంధీని దగ్గర నుంచీ, దూరం నుంచీ చూసిన వాళ్ళ నిజాయితీ కథనాల వల్ల మనకు ఆయన గురించీ, ఆ కాలం గురించీ, అప్పటి చరిత్ర గురించీ కూడా ఎంతో కొంత తెలుస్తోంది.