మహాత్ముణ్ణి చూసిన క్షణాలు-12

20

తొలిచూపులోనే ప్రేమ

అన్నపూర్ణా మహారాణా

గాంధీజీని ప్రభుత్వం శత్రువుగా పరిగణిస్తున్నందున, ఆయన నిధికి విరాళాలు ఇవ్వడానికి చాలామంది భయపడేవారు. దానికి తోడు ఆయన అస్పృశ్యతను రూపుమాపే ప్రయత్నాల్లో ఉన్నారు. రోజూ మేం మా పనులు మేం చేసుకుంటూ పోయేవాళ్లం. పండిట్ అనుసాయా ప్రసాద్ దగ్గర హిందీ నేర్చుకునేవాళ్లం. ఆయన 1931లో ఒరిస్సా వచ్చారు. ఇక్కడే స్వాతంత్ర్యోద్యమంలో చేరి జైలుకు వెళ్లారు. జైలు నుండి విడుదలయ్యాక, ఒరిస్సాలో హిందీ ప్రచారం కోసమే తనను తాను అంకితం చేసుకున్నారు. స్వామి విచిత్రానంద దాస్ అధ్యక్షతన రాష్ట్రభాషా ప్రచార సమితి ఏర్పాటయింది. రమాదేవి దానికి ప్రధాన సమన్వయకర్త; నిధులు సేకరించడమూ విద్యార్థుల్ని చేర్పించడమూ ఆమె ముఖ్య బాధ్యతలు. చేతిరాత అందంగా ఉంటే ఆ ఉత్తరం గాంధీజీ స్వయంగా చదువుతారని పండిట్జీ మాతో ఎప్పుడూ చెప్తుండేవారు. అందుకని చేతిరాత ప్రాక్టీసు చేస్తూండమని ఆయన మమ్మల్ని నిరంతరం ప్రోత్సహించేవారు. అందుకే మా దస్తూరీ ఎంత అందంగా వీలైతే అంత అందంగా తీర్చిదిద్దుకోడానికి మేం కష్టపడి సాధన చేసేవాళ్లం. గోకుల శ్రీచందన్ మాకు భజనలు పాడటం నేర్పిస్తే, గోపాల్ ఘోష్ వయొలిన్ నేర్పేవారు.

అనుగుల్ పర్యటన ముగించుకుని గాంధీజీ పూరీ చేరుకున్నారు. కానీ రైల్వే స్టేషన్ అంతా పోలీసుల్తో కిటకిటలాడుతూ కనిపించింది. పట్టణంలోకి అడుగుపెట్టేసరికి, గాంధీ ఎక్కడ హరిజనుల్ని గుళ్లోకి తీసుకువస్తారోనన్న భయంతో జగన్నాథ ఆలయ నిర్వాహకులు తలుపులు మూసేసారని తెలిసింది. ‘అనుమానాలూ భయాలూ కమ్ముకున్న వాతావరణంలో హృదయ పరివర్తన తీసుకురావడం సాధ్యం కాదు. శంకరుడూ చైతన్యుల మాదిరిగానే నేను కూడా ఒరిస్సా అంతటా కాలినడకనే పర్యటిస్తాను’ అన్నారు గాంధీజీ. ఆయన ఒక్కసారి నిశ్చయించుకున్నారంటే ఇక ఎవరూ ఆపలేరు. ఆ చారిత్రాత్మక పాదయాత్రకు పూరీలో సన్నాహాలు మొదలయ్యాయి.

కటక్‌లో ఉన్న మాకు ఈ వార్త చేరగానే గుబులు పట్టుకుంది. అప్పటికే ఒరిలో, ఖండైతా గ్రామాల నుండి ప్రజలు తరలివచ్చి సన్‌షైన్ మైదానాన్ని ముంచెత్తారు. స్వాగత సత్కారాల కోసమూ, గాంధీకి సమర్పించాల్సిన విరాళాల కోసమూ ఎవరి దగ్గరైతే డబ్బులు వసూలు చేశామో, వాళ్ళకిప్పుడెలా ముఖం చూపించడం! చివరి నిమిషంలో పర్యటన ప్రణాళిక మార్చేసినందుకు గాంధీజీమీదా నిర్వాహకులమీదా చాలా కోపం వచ్చింది. ఇది మాకు చాలా సమస్యగా మారింది; ఈ విషయం ప్రజలకేలా వివరించి చెప్పాలో పాలుపోలేదు.

పూరీ నుండి రమాదేవి ఒక ఉత్తరం రాశారు: ‘మీరంతా గాంధీ విడిది చేయబోయే బాలకటికి వచ్చేయండి. అక్కడి నుంచి గాంధీ పాదయాత్రలో మీరు కూడా చేరండి’ అని అందులో ఉంది. మేం మొత్తం ఏడుగురం హరిజనవాడల్లో పనిచేస్తున్నాం: సుశీల, మంగళ, శోభ, గోదావరి, మానిక, తులసి, అన్నపూర్ణ. వెంటన పక్కబట్టలు మూటగట్టుకుని భువనేశ్వర్‌ బయలుదేరాం. కటక్‌కీ భువనేశ్వర్‌కీ మధ్య ప్రవహించే నదులమీద యాభై ఏళ్ల కిందట వంతెనలు ఉండేవి కావు; అందువల్ల ఇప్పటిలాగా భువనేశ్వర్‌కు బస్సులు నడిచేవి కావు. రైల్లో భువనేశ్వర్ చేరుకున్నాం. అక్కడి నుండి పాత యాత్రా మార్గం గుండా నడుచుకుంటూ బాలకటి వెళ్లాం.

తీరా అక్కడికి వెళ్లి చూస్తే అప్పటికే సభ ముగిసిపోయింది, అందరూ విడిది కేంద్రానికి వెళ్లిపోయారు. ఆ ‘విడిది’ ఏ డాక్ బంగ్లానో బడి భవనమో కాదు—కేవలం ఒక తోటలో చెట్ల నీడ. అంతే! బ్రిటిష్ ప్రభుత్వానికి బద్ధ శత్రువైన గాంధీకి డాక్ బంగ్లాలోనో బడిలోనో ఆశ్రయం ఇచ్చే ధైర్యం ఎవరికుంటుంది? పాదయాత్రికులు రాత్రి బస కోసం లాంతరు వెలుగులో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గాంధీ మాటలు వినడానికీ ఆయన్ను కళ్లారా చూడటానికీ సుదూర ప్రాంతాల నుండి వచ్చి, సమయానికి చేరుకోలేకపోయిన జనం గాంధీ దర్శనం కోసం ఎగబడి గుడారాల్లోకి చొచ్చుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. వాలంటీర్లు తమ శాయశక్తులా వారిని నిలువరించడానికి తాపత్రయ పడుతున్నారు. మా బృందం అక్కడికి చేరుకునేసరికి పరిస్థితి ఇలా ఉంది. రమాదేవి మమ్మల్ని చూడగానే మాక్కూడా జనాన్ని అదుపు చేసే పని అప్పగించారు . మేం హిందుస్తాన్ సేవాదళ్‌లో శిక్షణ పొందిన వాలంటీర్లం కదా!

జనాన్ని అదుపు చేయడానికి నేను ముందుకు దూసుకుపోతుండగా, వెనుక నుండి ఒక వృద్ధుని స్వరం హిందీలో ఎంతో ఆప్యాయంగా, ‘ఏయ్ అమ్మాయ్! ఎక్కడికలా పరిగెడుతున్నావు?’ అని పిలవడం వినిపించింది. నాకు హిందీ వచ్చు. ఆ పిలుపు విని వెనక్కి తిరిగి చూస్తే చెట్టు కింద గాంధీ విశ్రాంతి తీసుకుంటూ కనిపించారు. ఆయన పక్కన ఒక లాంతరు మసకమసగ్గా వెలుగుతోంది. ఖద్దరు కట్టిన ఒక తెల్లదొరసానీ, మరో వ్యక్తీ ఏదో పనిలో నిమగ్నమై ఉన్నారు. నేను కాస్త గర్వంగా, ‘జనాన్ని అదుపు చేయడానికి!’ అని బదులిచ్చాను. ఆయన నవ్వి, ‘సరే, కానివ్వు’ అన్నారు. ఇంగ్లీషులో ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ అనే మాటొకటుంది. అంటే తొలిచూపులోనే ప్రేమ అన్న మాట. సరిగ్గా ఆ క్షణంలో జరిగిందదే. రెండే రెండు మాటలు, ఒక చిరునవ్వు—మేమిద్దరం యుగయుగాలుగా ఒకరికొకరం తెలిసినట్టే అనిపించింది; గాంధీ మా ప్రియనేస్తమూ, మా అత్యంత ఆప్తుడూ, అమూల్య స్నేహితుడూ అయిపోయారు.

మేం రోజుకు రెండు పూటలా పాదయాత్ర సాగించేవాళ్లం. వేకువజామునే గాంధీజీ ఒక చెంచాతో తన ఇత్తడి గిన్నెమీద మోగిస్తూ అందరినీ నిద్రలేపేవారు. ఆయన ఫైళ్లూ, కాగితాలూ, పళ్లపుల్లలూ, కాచి చల్లార్చిన నీళ్లూ, గ్లాసులూ అన్నీ రాత్రివేళ ఆయన పక్కనే ఉంచేవాళ్లం; దాంతో వాటి కోసం వెతుక్కుంటూ సమయం వృథా కాకుండా ఆయనకు ప్రతిదీ చేతికందే దూరంలో ఉండేది. ఆయన వాడే గ్లాసుకు సుశీలా పాయ్ ‘మల్టీ-పర్పస్’ అని పేరు పెట్టారు. పళ్లు తోముకునేటప్పుడూ, స్నానం చేసేటప్పుడూ, మరుగుదొడ్డిలోనూ, చివరకు మేక పాలు తాగేటప్పుడూ కూడా ఆయన ఆ ఒక్క గ్లాసునే వాడేవారు. అంతా బహుళ ప్రయోజనకారి అన్నమాట అది. గాంధీ ఆ గ్లాసును ఎలా ఉపయోగించారో వివరిస్తూ ఒక చీటీ మీద రాసిపెట్టి మరీ గాంధీ మరణానంతరం దాన్ని మ్యూజియంలో భద్రపరచాలని సుశీలా పాయ్ అంటూండేవారు.

ఆయన మేల్కొలుపు పిలుపు వినగానే మేం లేచి, హడావుడిగా పనులు ముగించుకుని ప్రభాత ప్రార్థనకు సిద్ధమయ్యేవాళ్లం. బాబా కాలేల్కర్ ప్రార్థనా సభ నిర్వహించేవారు. ప్రార్థన లో మొదట ‘ప్రాతః స్మరామి’ శ్లోకాలూ, ఆ తర్వాత భక్తిగీతాల ఆలాపనా ఉండేది. ప్రార్థన ముగిశాక పాదయాత్రికులు గ్రామస్థులు సమర్పించిన అల్పాహారం తీసుకునేవారు. బరువైన సామగ్రిని శిబిరంలోనే వదిలిపెట్టి, అత్యవసరమైన తేలికపాటి వస్తువులు మాత్రమే భుజాన వేసుకుని వాలంటీర్లు నడకకు సిద్ధపడేవారు. అల్పాహారంగా మాకు అటుకులూ, బెల్లమూ, పెరుగూ, కొబ్బరీ, మామిడి పండ్లూ దొరికేవి. స్థానిక యాత్రికులకు మరో బాధ్యత ఉండేది: తిన్న ఎంగిలి విస్తళ్లను గుంతలో పారేయడమూ, మరుగుదొడ్ల కోసం గుంతలు తవ్వడమూ, వంట పాత్రలు సరైన చోట భద్రపరిచారా లేదా అని చూసుకోవడమూ వారి పనే. పాదయాత్ర ప్రారంభమయ్యే సమయం దాకా గాంధీజీ ఉత్తరాలు రాయడంలోనో, ఇతరులతో చర్చలు జరపడంలోనో మునిగిపోయేవారు.

సమయం చెప్పడానికి ఆయనకేదో ఆరో ఇంద్రియం సాయపడుతున్నట్టుగా హఠాత్తుగా చేతి గడియారం చూసుకునేవారు; తన సంచీ ప్రథమ చికిత్స పెట్టె సిద్ధంగా ఉన్నాయో లేదో చూసుకుని, ఎవరినీ పిలవకుండానే నడవడం మొదలుపెట్టేవారు. భోజన సమయానికి ఆయన గడియారం చూస్తే, సరిగ్గా అదే సమయం అయ్యేది. ఏదేమైనా గాంధీజీ నడవడం మొదలుపెట్టగానే మేమంతా ఆయన వెంటే నడిచేవాళ్లం. పరధ్యానం వల్లనో ఏదో పనిమీదనో ఎవరైనా వెనకబడిపోతే, ఆ రోజు వాళ్లు రొప్పుతూ పరుగెత్తాల్సిందే; ఎందుకంటే గాంధీజీ చాలా వేగంగా నడిచేవారు, అవసరమనిపిస్తే ఒక్కోసారి పరుగెత్తేవారు కూడా! సాధారణంగా ఆయన ఇరుపక్కలా ఉన్న ఇద్దరి భుజాలమీద చేతులు వేసి, వారితో చర్చిస్తూ నడిచేవారు. నడక సాగుతుండగానే ప్రజల యోగక్షేమాలు తెలుసుకునేవారు. కానీ గాంధీ పరుగు లంఘించినప్పుడు మాత్రం, ఆయనకు చేతికర్రల్లా తోడ్పడే ఆ ఇద్దరి ప్రాణాలూ తోడేసినట్టయ్యేది!

పాదయాత్రికుల పక్కబట్టల మూటలూ, సేవక్ సంఘ్ తాత్కాలిక కార్యాలయ దస్త్రాలూ, టైప్‌రైటరూ—ఇవన్నీ ఒక బండిమీద తర్వాతి విడిది కేంద్రానికి చేరేవి. బొంబాయి నుంచి వచ్చిన ఒక యాత్రికుడు పాదయాత్ర సాగుతుండగా ఒకసారి అనారోగ్యం పాలయ్యారు. అతణ్ణి ఆ బండిమీద ఎక్కించ వలసింది గానూ, మిగిలినవారంతా తమ పక్కబట్టల మూటల్ని తామే మోసి తెచ్చుకోవలసింది గానూ గాంధీజీ వెంటనే ఆజ్ఞాపించారు. మేం సేవాదళ్‌లో శిక్షణ పొందినవాళ్లం కాబట్టి, మా మూటలు మా భుజాలకెత్తుకుని మోసుకు వెళ్తూ స్వయంగా మహాత్ముని చేతే శభాష్ అనిపించుకున్నాం.

ప్రేమకున్న శక్తి గురుత్వాకర్షణ శక్తి అంతటిది. ఆ ప్రేమే ప్రజల్ని గాంధీ దగ్గరకి, ఎంతో దగ్గరి నుంచీ ఎంతో దూరం నుంచీ కూడా రప్పించేది. దారంతా జనం పోటెత్తేవారు. గాంధీ కనిపించగానే హరిబోల్ ధ్వనులతోనూ హులహులి (మహిళల మంగళ నాదాలు) తోనూ ఆకాశం మార్మోగేది. దారిలో గాంధీతో కలిసి పాటలు పాడుతూ గ్రామస్థులు ముందుకు సాగేవారు. తమ కాళ్ల దుమ్ము గాంధీజీమీద పడకుండా వారు చాలా జాగ్రత్తపడేవారు.

మేం విడిది కేంద్రానికి చేరుకునేసరికి నలుదిక్కుల నుండీ జనం గుమిగూడేవారు. వెంటనే గాంధీజీ వారితో మాటలు మొదలుపెట్టేవారు. అస్పృశ్యత అనే పాపాన్ని కడిగేసుకోమనీ, బద్ధకం వదిలిపెట్టమనీ, మద్యపానం మానమనీ, పరిశుభ్రంగా ఉండమనీ ఆయన పడే పడే చెప్తుండేవారు. ఆభరణాలు త్యజించాలనీ , పరదా పద్ధతి విడిచి పెట్టి బయటకు రావాలనీ మహిళలకు నచ్చజెప్పేవారు. ఇతరుల శ్రమమీద బతికేవాడు దొంగతో సమానమన్న మాటను ఆయన ప్రతి సభలోనూ వల్లించేవారు. గాంధీజీ హిందీలో మాట్లాడితే, రాజకృష్ణ బోస్ దాన్ని ఒరియాలోకి అనువదించేవారు. ఆయన అందుబాటులో లేనప్పుడు గోపబంధు చౌధురి ఆ పని చేసేవారు. సభ ముగిశాక గాంధీజీ స్వయంగా విరాళాలు అడిగేవారు. వెదురు బుట్టల దగ్గర్నుండి బంగారు గొలుసులూ గాజుల దాకా ప్రజలు ఏవేవో కానుకలిచ్చేవారు. గాంధీజీ స్వయంగా వాటిని వేలం వేసేవారు. మేం కూడా పైట చెంగులు పరుస్తూ జనం మధ్య తిరిగి విరాళాలు అడిగేవాళ్లం. ప్రజలు అర్ధణానో లేక పహులానో సమర్పించేవారు. వాటిని మా చేతుల్లో పెడుతున్నప్పుడు వారి ముఖాలు వెలిగిపోయేవి. ఎంతిచ్చారన్నది ముఖ్యం కాదు, ఎంత నిండు మనసుతో ఇచ్చారన్నదే ముఖ్యం.

సభ ముగియగానే కూరగాయలు తరగడంలోనూ చపాతీలు చేయడంలోనూ మేం సాయపడేవాళ్లం. ఆ తర్వాత స్థానిక జనసమాచారం సేకరించడానికి దగ్గర్లో ఉండే హరిజనవాడలకు బయలుదేరేవాళ్లం. హరిజనవాడల్ని శుభ్రం చేయడమూ, హరిజన పిల్లలకు స్నానాలు చేయించడమూ, వాళ్లకు రామధున్ నేర్పించడమూ మేం చేసే పనులు. ఒరిస్సాకి బయటి నుండి వచ్చిన ప్రొఫెసర్ లాలా అచింతరామ్, కృష్ణమీనన్, బాబా కాలేల్కర్ లాంటి ఇతర నాయకులు కూడా మాతో పాటు హరిజనవాడలకు వచ్చేవారు. కార్యాలయ నిర్వహణ, టైపింగూ, లెక్కలు చూడటం, ఉత్తరాలకు సమాధానాలు రాయడంలో దామోదర్ దాస్ ముంజదా, దేవరాజ్, పృథ్వీరాజ్ తదితరులు ఠక్కర్ బాపాకు చేదోడుగా ఉండేవారు. మీరాబెహెన్, సుశీలా పాయ్ గాంధీజీకి ఉత్తరాలు రాయడంలో సాయపడేవారు. జయప్రకాశ్ నారాయణ్ భార్య ప్రభావతీ దేవి గాంధీజీకి వంట చేయడమూ, మేక పాలు కాచడమూ లాంటి పనుల్ని చూసుకునేవారు. బాలాజీ గోవింద్ జీ దేశాయ్ వారపత్రిక ‘హరిజన్’ కోసం వ్యాసాలు రాయడమే కాకుండా, ఒరిస్సా చరిత్ర చదవడానికి మా దగ్గర ఒరియా నేర్చుకుని ‘నీలాద్రి మహోదయ’ గ్రంథం చదవడం మొదలుపెట్టారు. ఆయన ఎంతటి చదువరి అంటే, రోడ్డుమీద నడుస్తూ కూడా పుస్తకాలు చదివేవారు! జమ్నాలాల్ బజాజ్ కుమార్తె ఉమ—ఆ యాత్రికుల్లో అందరికంటే చిన్నదీ, బొద్దుగా ఉన్నదీ, అత్యంత అల్లరి పిల్ల. ధనిక కుటుంబానికి చెందినదైనా సరే, హరిజన యాత్రలో కష్టాలన్నింటినీ ఎలాంటి ఫిర్యాదూ లేకుండా ఓర్చుకుంది. నిజానికి ఆమె ఆ యాత్రను ఎంతో ఆనందించింది. పండిట్ నీలకంఠ దాస్, గోపబంధు చౌధురి ఒరిస్సా వరదల గురించీ ఇతర సమస్యల గురించీ బయటి నుండి వచ్చిన అతిథులకు ఉపన్యాసాలు ఇచ్చేవారు. ఉమా బజాజ్ ఆ వివరాలన్నీ రాసుకుని గాంధీకి ఇచ్చేది. ఆమె రాసిన నోట్సు ఆధారంగానూ, హరిజనవాడలను సందర్శించినప్పుడు మేం సేకరించిన వివరాల ఆధారంగానూ గాంధీజీ కొన్ని రోజులు ప్రసంగించేవారు. ఆయన అలా మాట్లాడినప్పుడల్లా మా గుండెలు గర్వంతో ఉప్పొంగేవి. ప్రాధాన్యత లేని సామాన్యులకు సైతం తాము ముఖ్యులమన్న భావనను కలిగించడం గాంధీజీ నైజం. పాదయాత్రికుల్లో జర్మనీకి చెందిన బట్ సాహెబ్ కూడా ఉన్నారు. ఆయన నాజీ. అందుకే రాజకృష్ణ బాబు పరిహాసంగా ఆయన్ను ‘నాజీలు పాజీలు (దుష్టులు)’ అనేవారు.

ఒరిస్సా కార్యకర్తలకు ఎన్నో బాధ్యతలు అప్పగించారు. గుణనిధి పట్నాయక్ గారూ, సురేంద్ర పట్నాయక్ గారూ ముందస్తు బృందంలో ఉండేవారు. వాళ్లు విడిది కేంద్రానికి ముందుగానే వెళ్లి సరైన ఏర్పాట్లు జరిగాయో లేదో చూసేవారు. హరిజన్ సేవక్ సంఘ్ కార్యదర్శిగా రమాదేవి పాదయాత్ర సమగ్ర పర్యవేక్షణ చూసుకునేవారు. రాజకృష్ణ బాబు అనువాదకుడిగా (‘హిజ్ మాస్టర్స్ వాయిస్’లా) వ్యవహరించేవారు. గోపబంధు చౌధురి ఒరిస్సా పరిస్థితుల్ని అతిథులకు వివరిస్తూ పనులు సమన్వయం చేసుకుంటూ ఉండేవారు. మన్మోహన్ చౌధురీ, వినోద్ కానుంగో విలేకరి బాధ్యతలు నెరవేర్చారు . మన్మోహన్ చౌధురి ఛాయాగ్రాహకుడిగా కూడా పనిచేశారు. కుజాంగ్‌కు చెందిన జగన్నాథ్ శతపథి వంటావార్పూ బాధ్యత చూసుకుంటూ, సమయానికి వంట పూర్తయ్యేలా చూసేవారు. ఈశ్వర్‌లాల్ వ్యాస్ గంట కొట్టే మనిషి. ఒక చెంచాతో కంచు పళ్ళెం మీద మోగిస్తూ ఆయన ఎప్పటికప్పుడు టైము గుర్తుచేసేవారు. అప్పుడప్పుడూ పండిట్ లింగరాజ్ మిశ్రా, పండిట్ నీలకంఠ దాస్, మాలతీ చౌధురి, రాధానాథ్ రథ్, సత్యనారాయణ్ సేన్‌గుప్త గాంధీజీని కలవడానికి వచ్చేవారు. ఇంగ్లాండ్ నుండి అగాథా హారిసన్, స్విట్జర్లాండ్ నుండి పియరీ సెరిసోల్ గాంధీజీతో ఉండటానికి వచ్చారు. మీనూ మసానీ, వియోగి హరి, సతీష్ చంద్ర దాస్‌గుప్త తదితరులు కూడా గాంధీజీని కలవడానికి ఒరిస్సా వచ్చినవారిలో ఉన్నారు.

మధ్యాహ్న భోజనం ముగిసి కాసేపు విశ్రాంతి తీసుకున్నాక, బయటి నుండి వచ్చిన విద్వాంసులు మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడేవారు. వియోగి హరి హిందీ సాహిత్య చరిత్రమీద మాట్లాడితే, సతీష్ చంద్ర దాస్‌గుప్త హరిజనుల సమస్యలమీద ప్రసంగించేవారు. ఆ తర్వాత మేం ఆ తర్వాతి విడిది కేంద్రానికి బయలుదేరేవాళ్లం. సూర్యాస్తమయానికి ముందే భోజనం ముగించుకుని ప్రయాణమయ్యేవాళ్లం. దారిలో జనం పోగయ్యేవారు; శంఖాలు పూరించేవారు, భక్తిగీతాలు ఆలపించేవారు. విడిది కేంద్రానికి చేరుకున్నాక సాయంకాల ప్రార్థనలు చేసుకునేవాళ్లం, ఆ తర్వాత సభ మొదలయ్యేది. సభ ముగిశాక ప్రజల్ని విరాళాలు కోరేవారు. ఆ తర్వాత పాదయాత్రికులు ఆ రాత్రి బస కోసం ఏర్పాట్లు చేసుకునేవారు. చాలా సార్లు మేం నదీ తీరాల్లోనో, ఊరి పొలిమేరల్లోని ఆరుబయట మైదానాల్లోనో గడిపేవాళ్లం. ఎవరి ఇళ్ళల్లోనైనా బస చేయడం చాలా అరుదు.

(అన్నపూర్ణా మహారాణా (జ. 1917) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలూ, సంఘసేవకురాలూను. ఆమె ఆత్మకథ ‘అమృత అనుభవ’ భువనేశ్వర్‌లోని శిక్షాసంధాన్ ద్వారా 2005లో వెలువడింది. దీన్ని ఇంగ్లిషులోకి అనువదించిన సుప్రియా కర్ ‘రూపాంతర్ సెంటర్ ఫర్ ట్రాన్స్‌లేషన్’లో పనిచేస్తున్నారు.)

7-10-2026

2 Replies to “మహాత్ముణ్ణి చూసిన క్షణాలు-12”

  1. అన్నపూర్ణా మహారాణా గారి ఈ memoir నిజంగా a rare gem! ఆ రోజుల్లో గాంధీజీతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నవారి day to day life, ప్రతిరోజూ వాళ్లు చేయవలసిన పనులు, ఎదుర్కొన్న అసౌకర్యాలు, గాంధీజీ చెంచాతో గిన్నె మీద మోగించి అందరినీ నిద్రలేపడం, ఒకే గ్లాసును అన్ని అవసరాలకీ వాడటం, వారికి దొరికిన అల్పాహారం, గాంధీ గారి time sense, నడుస్తూనే పుస్తకాలు చదివే బాలాజీ దేశాయ్, ధనిక కుటుంబం నుంచి వచ్చిన ఉమా బజాజ్ ఎలాంటి ఫిర్యాదులూ లేకుండా కష్టాలన్నీ భరించడం!! ఇలా ఒకరి గురించి మరొకరు గుర్తుపెట్టుకున్న చిన్న చిన్న వివరాలు చదువుతుంటే ఆ కాలంలోకి వెళ్లినట్టే ఉంది.
    Must have been such exciting times, ఇన్ని ప్రాంతాల నుంచి, different backgrounds నుండి వచ్చిన వ్యక్తులు ఒకే లక్ష్యంతో కలిసి పనిచేయడం, పాదయాత్ర లో వారి అనుభవాలు, పరిచయాలు, చర్చలు.. ఎంత గొప్ప అనుభవం!

    నేను సైతం అన్న చందంగా ఎంతమంది పిన్నలూ పెద్దలూ, దేశీయులూ విదేశీయులూ గాంధీజీతో, ఆయన ఆలోచనలతో ప్రేమలో పడకపోతే ఇన్ని వ్యయప్రయాసలకోర్చి తమ జీవితాల్ని ఈ ఉద్యమానికి అర్పించుకుంటారు!

    1. అవును. ఈ జ్ఞాపకాలు చదువుతున్నంత సేపూ నాకు కూడా ఆ పాదయాత్రలో పాల్గొని ఉంటే ఎంత బాగుండేది అని పదేపదే అనిపిస్తూ ఉండింది.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading