మహాత్ముణ్ణి చూసిన క్షణాలు-13

21

గాంధీ స్మృతులు

బంకా బిహారీ దాస్

గాంధీజీని దర్శించుకుని, ఆయన మాటలు వినే అదృష్టం నాకు మూడు సందర్భాల్లో దక్కింది. ఆ అవకాశాలన్నీ నా బాల్యంలోనే వచ్చాయి. 1934లో ఆయన ఒరిస్సాలో పాదయాత్ర చేసినప్పుడు మొదటిసారి ఆయన్ను చూశాను. 1938లో దేలాంగ్ రైల్వే స్టేషన్ దగ్గర మైదానంలో జరిగిన సర్వ సేవా సంఘ్ సమావేశాల సమయంలో రెండోసారి ఆయన్ను చూడటమూ, ఆయన ప్రసంగం వినడమూ జరిగింది. ఇక మూడో అవకాశం 1946లో వచ్చింది; పశ్చిమ బెంగాల్లో బోల్‌పూర్ నుంచి ప్రత్యేక రైల్లో ఒరిస్సా మీదుగా మద్రాస్ వెళుతున్నప్పుడు ఒరిస్సా కాంగ్రెస్ కమిటీ ప్రతినిధిగా నవకృష్ణ చౌధురితో కలిసి సాయంత్రం నుంచి మర్నాటి పొద్దున్న దాకా అదే రైల్లో ప్రయాణించాను. ఈ అనుభవాల్లో ప్రతి ఒక్కటీ నా మనసులో చెరగని ముద్ర వేసింది.

1934 మే నెలలో గాంధీజీ పూరీ నుంచి భద్రక్ దాకా హరిజన పాదయాత్ర చేపట్టారు. భారతీయ సమాజం నుంచి అస్పృశ్యతా వివక్షల్ని సమూలంగా తుడిచిపెట్టడమే ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం. ఇదొక సాంఘిక సంస్కరణ ప్రయత్నమే అయినప్పటికీ, అన్ని మతాలవారినీ, అన్ని కులాలవారినీ జాతీయోద్యమ ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడమే దీని పరమ లక్ష్యం. దీనితో పాటు పరదా పద్ధతి లాంటి అన్ని రకాల మూఢనమ్మకాలమీదా గాంధీజీ ఉద్యమించారు.

మే, జూన్ నెలల ఎండాకాలంలో ఆయన ఈ హరిజన పాదయాత్ర సాగించారు. కేంద్రపడ నుండి బిరూపా నది దాటి కాయిపడా, బారీ మీదుగా ఆయన పాదయాత్ర సాగింది. ప్రముఖ గాంధేయ నాయకుడు గోపబంధు చౌధురి, బాగా వెనకబడ్డ, తరచూ వరదలకు గురయ్యే బారీ ప్రాంతాన్నే తన కార్యక్షేత్రంగా ఎంచుకున్నారు. అలాగే నాకు పొరుగింటాయనా, సోదరసమానుడూ అయిన లాల్ బిహారీ పట్నాయక్ మద్రాస్ ప్రభుత్వంలో విద్యాశాఖలో ఉద్యోగానికి రాజీనామా చేసి జైలు శిక్ష అనుభవించారు. జైలు నుంచి విడుదలయ్యాక, ఆయన కళ్యాణ్‌పూర్‌ గ్రామాన్ని ఖద్దరు పనులకూ ఇతర సృజనాత్మక ప్రయోగాలకూ కేంద్రంగా మార్చారు. స్వాతంత్ర్య సమరంలో మా ఊరు ఒక ముఖ్య కేంద్రంగా ఉండేది. తమ గ్రామం మీదుగా వెళ్లవలసిందిగా కోరుతూ లాల్ బిహారీ బాబు గాంధీజీకొక లేఖ రాశారు. ఆ అభ్యర్థన గాంధీజీ హృదయాన్ని తాకింది. దాంతో మా గ్రామస్థుల్ని కలవడానికి వీలుగా కళ్యాణ్‌పూర్ దగ్గరలో ఉండే ఒక గ్రామం గుండా పాదయాత్ర దారిని మళ్ళించమంటూ ఆయన గోపబంధు చౌధురికి రాశారు.

గాంధీజీ సూచన మేరకు కలమతియా నుండి బారీ వెళ్లే మార్గంలో ఆయన అమ్యాస్‌పూర్ వద్ద కాసేపు ఆగి మా గ్రామ ప్రజలతో మాట్లాడాలని నిర్ణయించారు. ఈ సంగతి తెలియగానే మా ఊరి ప్రజలంతా—పిన్నలూ పెద్దలూ, స్త్రీలూ పురుషులూ, పిల్లలూ—దాదాపు అందరూ అమ్యాస్‌పూర్ వైపు నడిచారు. వరిచేల గుండా, ఖరస్రోతా నది దాటుకుంటూ ఆరేడు కిలోమీటర్లు నడిచి మా అమ్మానాన్నలతో కలిసి నేను కూడా వెళ్లాను. అప్పట్లో నాకు తొమ్మిదేళ్లు, నాలుగో తరగతి చదువుతున్నాను.

చేతిలో కర్ర పట్టుకుని, తన అనుచరులతో కలిసి గాంధీజీ గ్రామానికి చేరుకున్నారు. తెల్లటి దుప్పటి పరిచిన ఒక మంచంమీద కూర్చున్నారు. గ్రామస్థుల తరఫున లాల్ బిహారీ బాబు హరిజనుల సమస్యలమీద రాసిన ఒక వినతిపత్రాన్ని ఇంగ్లీషులో చదివి వినిపించారు. దానికి బదులుగా గాంధీజీ చెప్పిన మాటల సారాంశం ఎంతగా హృదయాన్ని హత్తుకుందంటే, అవి ఇప్పటికీ నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. గాంధీజీ సరళమైన హిందీలో చెప్పిన మాటల్ని యువ నాయకుడు రాజకృష్ణ బోస్ ఒరియాలోకి అనువదించారు. బోస్‌కి మంచి వక్తగా పేరుండేది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆయన ఒరిస్సా ప్రభుత్వంలో ఒక ప్రముఖ మంత్రి అయ్యారు.

తన సంక్షిప్త ప్రసంగంలో గాంధీజీ మాట్లాడుతూ, అస్పృశ్యతా వివక్షలు అత్యంత హేయమైనవని అన్నారు. వాటిని సమూలంగా తుడిచిపెట్టాలని ప్రజలకు హితవు పలుకుతూ, ‘అస్పృశ్యత హిందూ సమాజానికొక మచ్చ. దానికి ఎలాంటి తార్కిక ఆధారం లేదు. హరిజనుల్లో చాకళ్లు తక్కువ కులస్తులని భావిస్తారు. కానీ చివరకు బ్రాహ్మణులైనా సరే, చాకలి బట్టలు ఉతికితే తప్ప శుద్ధి పొందలేరు. చాకలి ఉతికిన బట్టలు కట్టుకుంటేనే వాళ్లు గుడిలోకి ప్రవేశించి పూజలు చేయగలరు’ అన్నారు. ఒరిస్సా ప్రజల తీవ్ర దారిద్ర్యాన్ని ప్రస్తావిస్తూ, కష్టపడి పనిచేయడానికి ఏమాత్రం వెనుకాడవద్దని ఆయన సలహా ఇచ్చారు. కష్టపడే జాతి మాత్రమే అభివృద్ధి చెందుతుందని ఆయన స్పష్టం చేశారు.

చాకళ్ల గురించి గాంధీజీ చెప్పిన దృష్టాంతం నా మనస్సుమీద ప్రగాఢ ముద్ర వేసింది. ఆ మాటల్ని నేనెప్పటికీ మర్చిపోలేను. మంచంమీద ఆయన పక్కనే కూర్చుని, రెప్పవాల్చకుండా ఆయన ముఖం వైపే చూస్తూ ఉండిపోయాను. అంతటి పసివయసులో ఆయన చెప్పినదాంట్లో నాకే మాత్రం అర్థమై ఉంటుంది! ఆ తర్వాత మా గ్రామం తరఫున నేను ఆయన దగ్గరకు వెళ్లాను. ఆ విషయానికి గాంధీజీ ఎంతగానో మురిసిపోయి, తన పత్రిక ‘హరిజన్’లో దాన్ని ప్రచురించారు కూడా.

ఆయన్ను చూసే రెండో అవకాశం 1938లో దక్కింది; పూరీ జిల్లాలో దేలాంగ్ రైల్వే స్టేషన్ దగ్గర జరిగిన గాంధీ సేవా సంఘ్ సమావేశాలకు ఆయన హాజరయ్యారు. మార్చి 28 నుండి 31 దాకా నాలుగు రోజుల పాటు ఆ సమావేశాలు సాగాయి. అప్పట్లో విశ్వనాథ్ దాస్ నాయకత్వంలో ఒరిస్సాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. నేను కొలీజియేట్ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాను. ఒక సాయంత్రం ఆ పాఠశాల విద్యార్థులు కొందరం దేలాంగ్ వెళ్లి బహిరంగ సభకు హాజరయ్యాం. సాధారణంగా గాంధీజీ ప్రార్థనా సమావేశాలే ఆయన బహిరంగ సభలుగా మారేవి. భారతదేశంలోని గాంధేయ నాయకులూ కార్యకర్తలూ అందరూ ఈ వార్షిక సదస్సులో పాల్గొన్నారు. ఆ సభలో గాంధీజీ ఏం మాట్లాడారో ఇప్పుడు నాకు గుర్తులేదు.

(బంకా బిహారీ దాస్ (1923-2001) ప్రసిద్ధ సోషలిస్ట్ నాయకుడు. ఒరిస్సా ప్రభుత్వంలో ఆర్థిక, రెవెన్యూ శాఖల మంత్రిగా పనిచేశారు. ఆయన ఆత్మకథ ‘సంగ్రామర శేష నాహిఁ’ భువనేశ్వర్‌లో రమేష్ చంద్ర స్వైన్ ద్వారా 1998లో ప్రచురితమైంది. ఈ వ్యాసాన్ని ఇంగ్లిషులోకి అనువదించిన మేరీ మొహంతి పూరీలోన ప్రభుత్వ మహిళా కళాశాలలో ఆంగ్ల అధ్యాపకురాలు.)


22

కాలినడకన గాంధీ

మీరాబెహెన్

మేం ఎప్పటిలాగే సాయంత్రం అయిదున్నరకి విడిది నుంచి బయలుదేరాం. అప్పటికి సమయం దాదాపు రాత్రి ఏడున్నర కావస్తోంది; చీకట్లు ముసిరాయి. మేం గమ్యస్థానానికి చేరువవుతుండగా,  కొందరు మనుషులు లాంతర్లతో ఎదురొచ్చి, చివరి మైలు దూరం దారంతా మాకు తోడుగా నడిచారు. దారిన సాగుతున్న కొద్దీ పాదయాత్రికుల సంఖ్య క్రమంగా పెరుగుతూ పోయి, అప్పటికి వందల సంఖ్యకు చేరింది.

చెట్ల సందుల్లోంచి మెరుస్తున్న దీపాల వెలుగులు చూసి సభాస్థలి  దగ్గర్లోనే ఉందని తెలిసింది; రోడ్డుమీద నిలబడిన ఒక పెద్ద జనసమూహం మేం ఎటుపక్క తిరగాలో చూపించింది.

ఆ రాత్రి సభ నిర్వైంచడం కోసం ఒక తాటితోపుని ఎంపిక చేశారు. ఒక పొట్టి బల్ల మీద తెల్లటి గుడ్డ పరిచి వేదికగా మార్చారు. అక్కడక్కడా చెట్ల మధ్య దీపాలు వేలాడదీశారు. చుట్టూ పొడవాటి సన్నటి తాటిచెట్లు తలపైకెత్తి నిటారుగా నిలబడి ఉన్నాయి. తాటిమట్టలు ఆకాశం వైపు నక్షత్రాల్ని చూస్తూ విప్పారి ఉన్నాయి. దగ్గరి నుంచీ దూరం నుంచీ తరలివచ్చిన వందలాది మంది గ్రామస్థులు కింద ఇసుక నేలమీద కూర్చున్నారు.

తాటాకుల్లోంచి పిల్లగాలులు చేసే సన్నటి సవ్వడి తప్ప, కొద్ది నిమిషాల్లోనే అంతటా సంపూర్ణ నిశ్శబ్దం ఆవరించింది. ఆ వాతావరణంలో ప్రార్థన మొదలైంది. ప్రార్థన ముగిశాక, ఆ ప్రశాంత పవిత్ర వాతావరణంలో గాంధీజీ తన సందేశాన్ని వినిపించారు: ‘లెండి;మేల్కోండి,మీ పూర్వీకుల నుంచీ వారసత్వంగా వచ్చి, మీలో పాతుకుపోయిన ఆ పాపాన్ని గుర్తించండి. హిందూ ధర్మాన్ని సంస్కరించుకోండి, లేకపోతే మనం నశించిపోతాం’ అన్నారు.

సాయంకాలపు నడక సాగుతోంది. దారంతా గాంధీజీ రాక కోసం ఆత్రుతగా ఎదురుచూస్తూ గ్రామస్థులు వరుసల్లో నిలబడి ఉన్నారు. అక్కడొక పెద్ద జనసందోహం రోడ్డంతా పరుచుకుని ఉంది. నెరిసిన తెల్లటి జుట్టూ, వృద్ధాప్యంతో మసకబారిన చూపులూ ఉన్న ఒక వృద్ధురాలు హఠాత్తుగా జనం మధ్య ఇటూ అటూ పరుగులు తీస్తోంది. ‘ఆయనెక్కడున్నాడు? ఎక్కడున్నాడు? నేను ఆయన్ను చూడాలి’ అంటోంది. ఆ ఆందోళనలో ఆమె ఆయన్ను దాటి వెళ్లిపోబోతుండగా, ఆమె తపనను గమనించిన గాంధీజీ ఆగి, ఆమెను దగ్గరకు పిలిచారు. ఆ పిలుపు విని ఆమె ఆత్రుతగా ఆయన వైపు వచ్చి, తన వృద్ధ నేత్రాల్తో ఆయన్ని నిదానించి చూసింది. గాంధీజీ నవ్వుతూ ఆమె గడ్డం కింద చేయి పెట్టి, ‘ఏమ్మా, ఇప్పుడు నన్ను సరిగ్గా చూడగలుగుతున్నావా?’ అనడిగారు. ఆమె ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి; ఆమె ఆయన మెడ చుట్టూ చేతులు వేసి, ఆయన గుండెమీద తల వాల్చి పరవశంలో మునిగిపోయింది. ఆయన నెమ్మదిగా ఆమె చేతుల్ని విడిపించారు; కలవరింతలో నడుస్తున్న మనిషిలా ఆమె మళ్లీ జనం మధ్యకు జారుకుంది, కానీ ఆ వెలుగు మాత్రం ఆ వృద్ధ ముఖాన్ని ప్రకాశింపజేస్తూనే ఉండిపోయింది.

 ‘నేను క్షవరానికి సిద్ధంగా ఉన్నాను’ అన్నారు గాంధీ; వెంటనే క్షవరం సామగ్రితో ఒక చిన్న పల్లెటూరి మహిళను లోపలికి తీసుకువచ్చారు.

 ‘అరే! చాలా బాగుందే, నువ్వేనా క్షవరం చేయబోయేది?’ అని ఆయన నవ్వుతూ అడిగారు.

ఆమె చిరునవ్వుతో సమాధానమిచ్చి, ఎంతో నైపుణ్యంతో కత్తి నూరడం మొదలుపెట్టింది. ఆమె ఆయన గడ్డాన్నీ తలనూ పూర్తిగా ఆయన మెచ్చేలా నున్నగా క్షవరం చేసింది.

ఆ పని జరుగుతుండగా గాంధీజీ కళ్లు ఆమె ఒంటిమీద ఉన్న ఆభరణాలమీద పడ్డాయి. ఆమె నిరుపేద మహిళనే అయినప్పటికీ, కొన్ని లక్క గాజుల్తో పాటు ఒక జత పెద్ద వెండి కడియాలూ, ముక్కుకి బంగారు ముక్కుపుడకా ధరించి ఉంది.

 ‘ఏమిటీ పనికిమాలిన వస్తువులు?’ అని అన్నారాయన. ‘వీటివల్ల నువ్వేమీ నీ అందమేమీ ఇనుమడించడం లేదు. ఇవి నిజానికి వికారంగా ఉండటమే కాదు, మురిగ్గా కూడా తయారవుతాయీ అని అన్నారు.

ఆ పేదరాలు ముఖం చిన్నబోయింది. ‘ఈ పవిత్రమైన సందర్భం కోసం నేనివి ప్రత్యేకంగా ఎరవు తెచ్చుకున్నానండి!’ అంది ఆమె ఆవేదనగా. ‘మంచి నగల్లేకుండా మీ ఎదుట ఎలా నిలబడగలను!’ అంది.

గాంధీజీ ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆమె విన్నది, తియ్యగా నవ్వింది, అంతే. అక్కడి నుండి వెళ్లి, ఆ బృందంలో మరో ఇద్దరికి కూడా క్షవరం చేసి, తనకి ముట్టిన కూలీ డబ్బులు తెచ్చి మొత్తం గాంధీజీ ముందే సమర్పించి మౌనంగా వెళ్ళిపోయింది.

(మీరాబెహెన్ (1892-1982) మేడ్లిన్ స్లేడ్ ఒక బ్రిటిష్ మహిళ. మహాత్మా గాంధీ సాన్నిహిత్యంలో ఉంటూ పనిచేసేందుకు ఇంగ్లాండ్‌ వదిలిపెట్టి వచ్చారు. గాంధేయ సిద్ధాంతాల వ్యాప్తికీ, భారత స్వాతంత్ర్య పోరాటానికీ తన జీవితాన్ని అంకితం చేశారు. ఆమె రాసుకున్న ఈ జ్ఞాపకం డి.జి. టెండూల్కర్ రాసిన ‘మహాత్మా’ గ్రంథంలోది.)

8-10-2026

2 Replies to “మహాత్ముణ్ణి చూసిన క్షణాలు-13”

  1. మీరాబెహెన్ రాసిన ఆ వృద్ధురాలి incident శబరి రాముని కోసం ఎదురుచూసి చూసి తీరా ఆయన వచ్చినప్పుడు కళ్లనీళ్లు తిరిగి, మసకబారిన చూపుతో తడబడుతూ ఆతృతగా ఆయనను వెతుక్కున్నట్లు అనిపించింది.

    “ఈ పవిత్రమైన సందర్భం కోసం ఎరవు తెచ్చుకుని” మరీ నగలు ధరించిన ఆ క్షురకురాలు!! Shows what Gandhiji meant to her. No less than God!! గుడికి వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా మంచి వస్త్రాలు, నగలు ధరించి వెళ్లినట్లుగా, గాంధీజీని కలవడాన్ని కూడా ఆమె అంత పవిత్రమైన సందర్భంగా భావించడం!

    What beautiful stories, really!!

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading