మహాత్ముణ్ణి చూసిన క్షణాలు-10

17

గాంధీ పాదయాత్ర

వినోద్ కానుంగో

మేం పిపిలీ, సియులాచకల్ మీదుగా సాగి బాలకటి చేరుకున్నాం. అక్కడ జనం పెద్ద ఎత్తున  గుమిగూడారు. భువనేశ్వర్ నుంచి వచ్చిన పూజారులూ, కొందరు పలుకుబడి గల వ్యక్తులతో సహా వేలాది మంది ప్రజలు బాపూజీని పట్టణానికి రమ్మని ఒత్తిడి చేశారు. కానీ బాపూజీ తన ప్రణాళిక మార్చుకోడానికి ఒప్పుకోలేదు. మేం నది దాటే సమయానికి జనసందోహం మరింత పెరిగింది. కళ్లు కనిపించనంతగా ధూళి ఆకాశాన్ని కప్పేసింది. నదీ లోపల ఇసుకతిన్నెలమీద ఒక సభ జరిగింది. ఏడెనిమిది వేల మంది ఆ సభకు హాజరయ్యారు. బాలకటి కంచు, ఇత్తడి పాత్రలకు ప్రసిద్ధి. అలాంటి కొన్ని పాత్రలు బాపూజీకి కానుకగా సమర్పించారు.

సభికులు నిశ్శబ్దమయ్యాక బాపూజీ వారినుద్దేశించి ‘మానవ అహంకారమే అస్పృశ్యతకు మూలకారణం. క్షయవ్యాధిలాగే అస్పృశ్యత కూడా మనుషుల్ని లోలోపలే తినేస్తుంది. మనం ఈ వ్యాధికి బలి కాకూడదు. ప్రపంచమంతా మన వైపే చూస్తోంది. ఈ పాపాన్ని మనం కడిగేసుకోకపోతే లోకం మనల్ని అసహ్యించుకుంటుంది’ అని అన్నారు. ఆయనింకా ఇలా చెపపారు:

‘నాకు డబ్బక్కర్లేదు. ఒక పైసా గానీ, పైసాలో నాల్గవ వంతైనా చాలు. ఒరిస్సాలోని ఒక పేదవాడు ఇచ్చిన పైసా ఒక రూపాయి కంటే ఎంతో విలువైంది.’

‘ఎవరినీ అంటరానివారిగా చూసే పాపానికి అగ్రవర్ణ హిందువులు ఒడిగట్టకూడదు. ఇతరుల ఏవగింపుకీ, నిరాదరణకీ గురైనవారిని భగవంతుడే రక్షిస్తాడని భగవద్గీతలోనూ, మహాభారతంలోనూ, అన్ని పవిత్ర గ్రంథాల్లోనూ చెప్పారు. పాండవులు ద్రౌపదిని నిస్సహాయంగా వదిలేసినప్పుడు, భగవంతుడే ఆమెను ఆదుకున్నాడు. రాయిలా పడి ఉన్న అహల్యకు శ్రీరామచంద్రుడు ప్రాణం పోశాడు. తోటి మనుషులచేత తిరస్కారానికి గురైనవాడే దేవుడికి స్వంతమవుతాడు.’

మేం సత్యభామపూర్ చేరుకున్నాం. మాతో పాటు నడుస్తున్న మీరాబెన్‌కు అంత దూరం నడవడం అలవాటు లేదు. ఆమె కాళ్లు నొప్పులు పెట్టాయి. దాంతో ఆమె తన కాళ్లకు గుడ్డలు కట్టుకుని నడిచారు. ఒక తోపులో సభ ఏర్పాటు చేశారు. అక్కడ గ్రామస్థులతో బాపూజీ ఎన్నో విషయాలు చర్చించారు.

సత్యభామపూర్‌లో గాంధీజీ పేదరికం తాలూకు దారుణ దృశ్యాలు చూశారు. ప్రజలు తమకు తోచినదంతా హరిజన నిధికి విరాళంగా ఇచ్చారు. ఒక నిరుపేద తానూ ఏదో ఒకటి ఇవ్వాలని అనుకున్నాడు. మహాత్మునికి విరాళమిస్తే పుణ్యం వస్తుందనీ, తరించవచ్చనీ అతని భావన. కానీ అతడి దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు. ఒక జమీందారు దగ్గర ఒక పైసా అడుక్కుని తెచ్చి మహాత్ముడి చేతిలో పెట్టాడు. ఊరి పిల్లలంతా కలిసి పదమూడు రూపాయలు పోగుచేసి, హరిజన నిధికి అందించారు.

గాంధీజీని ఒక్కసారి దర్శించుకుందామని జనం రోజంతా వేచి చూస్తూనే ఉన్నారు. ఒకటే జనసందోహం గుమిగూడింది. సుదూర ప్రాంతాల నుంచీ మహిళలు ఎడ్లబళ్ళ మీద వచ్చారు. అక్కడ చేరిన వారంతా వృథాగా కాలం గడపడం గాంధీజీ గమనించారు. మధ్యాహ్నం వేళ నూలు వడక వలసిందిగా ఆయన మహిళా కార్యకర్తలకు చెప్పారు. ప్రజల్ని దగ్గరకు పిలిచి వారితో ‘చూడండి, మీరంతా ఊరికే కాలం వృథా చేస్తున్నారు. మన ప్రజలు ఎంత పేదరికంలో ఉన్నారంటే, మన మహిళా వాలంటీర్లు విరాళాల కోసం వెళ్లినప్పుడు వాళ్లు కేవలం ఒక పహులా,అంటే పైసాలో నాల్గోవంతు, మాత్రమే ఇస్తున్నారు. తమ దగ్గర ఇవ్వడానికి ఏమీ లేకపోవడం వల్లే అలా ఇస్తున్నారు. వాళ్లు అంత నికృష్ట దారిద్ర్యంలో ఉన్నారు. అలాంటప్పుడు మనం ఇలా ఖాళీగా కూర్చోవడం ఎలా సమర్థనీయం?’అనడిగారు.

సత్యభామపూర్‌లో ఒక పెద్ద హరిజనవాడ ఉంది. బాపూజీ ఎక్కడ మజిలీ చేసినా హరిజనుల్ని తమతో కలిసి భోజనానికి రావాల్సిందిగా ఆహ్వానించమని పురమాయించేవారు. ఆ ప్రకారమే భోయీలను ఆహ్వానించాం, తాము వస్తామని వాళ్లు మాటిచ్చారు. కానీ భోజన సమయానికి ఎవరూ రాలేదు. తమకు వడ్డించే భోజనాన్ని పానా, కందరా కులాలవాళ్లు ముట్టుకున్నారని తెలిసి వాళ్లు రాలేదని తేలింది. బౌరీలు హరిజనులు అన్న మాట నిజమే, అగ్రవర్ణాలవాళ్లు వారిని తాకరు. అయినా సరే, పానాల కంటే కందరాల కంటే తాము ఉన్నతులమని వారి భావన. అంతటి తక్కువ కులాలవాళ్లు ముట్టుకున్న భోజనం తింటే తమ కులం పోతుందేమోనన్న భయం వారిది. ఈ విషయం తెలుసుకున్న గాంధీజీ దిగ్భ్రాంతి చెందారు. కులం పోతుందన్న భయం ప్రజల్ని ఎంతగా పట్టిపీడిస్తోందంటే, ఎంతో ప్రేమా ఆప్యాయతలతో ఆహ్వానించినా సరే కలిసి భోజనం చేయడానికి కూడా రాలేకపోతున్నారు!

ఎండాకాలంలో మామిడి చెట్లకు ‘ఆంబడాణి’ అనే పురుగులు పడతాయి. గాంధీజీ ఒక మామిడి తోపులో విడిది చేశారు. మండుటెండ వేడిమికి తోడు ఆ పురుగుల బెడద కూడా చేరడంతో గాంధీజీకి ఏమాత్రం కుదురు లేకుండా పోయింది. దాంతో ఆయన ఒక మర్రిచెట్టు వద్దకు వచ్చి, దాని కింద కూర్చున్నారు.

కుష్టువ్యాధి సోకిన ఒక బౌరీ కులస్తుడు గాంధీజీ దగ్గరకు రావడానికి సాహసించలేకపోయాడు. కాస్త దూరం నుండే ఆందోళనగా చూస్తూ ఉండిపోయాడు. గాంధీజీ ఆయన్ను దగ్గరకు పిలిచి, రోగ వివరాలు అడిగి తెలుసుకున్నారు. భింగార్‌పూర్ నుండి వైద్యుణ్ణి పిలిపించి, అతడికి మందులిప్పించారు. అతనికి అన్నంతో పాటు వస్త్రాలు కూడా ఇచ్చారు. అన్నమూ బట్టలూ కూడా ఇచ్చారు.

ఆలయంలోకి హరిజనుల ప్రవేశం

గాంధీజీ పాద యాత్ర గురించి ‘ది సమాజ్’ ప్రత్యేక విలేకరి ఒక సమగ్ర నివేదికని అందించారు. ముందు రోజు రాత్రే సుదూర ప్రాంతాల నుండి బలిఅంతాకి జనం వచ్చారు. కటక్ నుంచి ఎంతోమంది ప్రయాణమై వచ్చి, పాదయాత్రలో పాల్గోడానికి అక్కడ చేరారు. కటక్ ప్రజల తరఫున విద్యారత్న బాలుకేశ్వర్ ఆచార్య, లింగరాజ్ బాబు, సత్యనారాయణ్ బాబు పాదయాత్రికులకు అభినందనలు తెలపడానికి వచ్చారు.

పాదయాత్రలో ఎంతోమంది పాల్గొనడంతో గాలంతా దుమ్ము ఆవరించింది. అందరి బట్టలమీదా దుమ్ము పొర పేరుకుపోయింది. ఆరుగురు వాలంటీర్ల సాయంతో మహతాబ్‌, గోపబాబులు దారి సుగమం చేయడానికి అందరికంటే ముందు పరుగుతీశారు. బాపూజీ కూడా ఒక చిన్నపిల్లవాడిలా పరిగెత్తడం మొదలుపెట్టారు. వందలాది మంది ప్రజలు ‘హరిబోల్’ అంటూ నినదిస్తూ రొప్పుతూ ఆయన వెంటే పరుగుతీశారు.

బలిఅంతాలో హరిజనులను ఆలయంలోకి అనుమతించే మహోత్సవం జరగాల్సి ఉంది. హరిజనులు అడుగుపెట్టడంకోసం ఆలయం తెరిచి ఉంచడానికి ఆలయ ధర్మకర్తలు అప్పటికే అంగీకరించారు. కానీ ఆ ఆలయాన్ని నిత్యం దర్శించుకునేందుకు అక్కడ హాజరైన భక్తుల అభిప్రాయం కూడా తెలుసుకోవాలని గాంధీజీ భావించారు. మొదట్లోనే ఆయనొక విషయాన్ని స్పష్టం చేశారు: ఈ ఆలోచనని సమర్థించే అగ్రవర్ణ హిందువులు మాత్రమే చేతులెత్తి తమ ఆమోదం తెలపండి, హరిజనులు చేతులెత్తవలసిన అవసరం లేదు అన్నారు. ఆ తర్వాత ఆయన, ‘ఈ రోజు నుండి ఈ ఆలయం హరిజనుల ప్రవేశానికి తలుపులు తెరిచింది. నేనింకా మూలవిరాట్టుని చూడలేదు. ఆ విగ్రహం చాలా అందంగా ఉంటుందని చెప్పారు. ఇప్పుడు ఆలయంలోకి ప్రవేశించి స్వామిని కళ్లారా దర్శించుకుంటాను’ అని ప్రకటించారు.

‘అనాదిగా మనం కాపాడుకుంటూ వస్తున్న ఆలయ భావనను ప్రజలకు వివరించాలి. గతంలో ఆలయమే మనకు సర్వస్వంగా ఉండేది. గుడిలోపల పాపం చేయాలన్న ఆలోచన కూడా మన మనసుల్లోకి వచ్చేది కాదు. మునులూ ఋషులూ అక్కడ ధ్యానం చేసేవారు; వాతావరణమంతా ఎంత పవిత్రతతో నిండి ఉండేదంటే, అక్కడున్నప్పుడు ఎలాంటి మన మనసుల్ని ఎలాంటి చెడు ఆలోచనలూ తాకేవి కావు. గుడికి అనుబంధంగా పాఠశాల ఉండేది. ఆలయ ప్రాంగణంలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేవారు. అంతేకాకుండా తాము పండితులు కావాలనుకునే విద్యార్థులకి సంస్కృతం బోధించేవారు. సత్సంగం దొరికే పవిత్ర స్థలమది. ఆ మహానుభావులు ఎల్లప్పుడూ లోకకల్యాణాన్నే కాంక్షించేవారు. గుళ్లకు అనుబంధంగా ఉండే ధర్మశాలలు పేదల ఆకలి తీర్చేవి. ప్రతి శుభకార్యమూ ఆలయంతో ముడిపడి ఉండేది. ఈ ఆలయ నిర్వాహకులు కూడా వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకునే దీన్ని నడిపిస్తారని ఆశిస్తున్నాను. ఆలయం క్షీణిస్తే, ధర్మం కూడా క్షీణిస్తుంది. హిందూ ధర్మం క్షీణించిందన్న నిజాన్ని ఎవరు కాదనగలరు? పూజారులకి సంస్కృతం రాదు. స్వార్థంతో మనందరి కళ్ళూ మూసుకుపోయాయి. ఈ రోజుల్లో ఆలయాలకు అనుబంధంగా పాఠశాలలు కనిపించడం అరుదైపోయింది. గుడిలో అడుగుపెట్టినప్పుడు కలగవలసిన దివ్య భావనలు ఇప్పుడు మనసుల్లో మెదలడం లేదు. గుడి ఎంత బోసిపోయిందో, మన జీవితాలూ అంతే శూన్యంగా మారాయి.’

‘ప్రతి ఒక్కరూ సాయంత్రం వేళ గానీ, పడుకునే ముందర గానీ భగవంతుణ్ణి ప్రార్థించాలి. పగటిపూట చేసిన పాపాలకు ఆయన్ని క్షమాపణ వేడుకోవాలి. పొద్దున్నే లేవగానే అంతరంగం ప్రక్షాళన చేసుకోవాలి. శరీరానికి ఆహారం ఎంత అవసరమో, ఆత్మకు భగవత్ ప్రార్థన అంత అవసరం. ఆ అనుభూతి నిజంగా అనిర్వచనీయమైంది.’

సత్యభామపూర్‌లో తాము భోజనానికి ఆహ్వానించినా కూడా హరిజనులు రాని సంఘటనని ఆయన గుర్తుచేశారు. ‘నిజానికి వాళ్ళు అక్కడ భయపడ్డానికేమీ లేదు. మేమే స్వయంగా వండి వారికి వడ్డించేవాళ్లం. ఆ అమాయకులకు ఏం చేయాలో పాలుపోలేదు. వారిలో ఈనాటికీ అలాంటి వైఖరి ఉండటానికి మనమే బాధ్యులం. మానవాళిని హెచ్చుతగ్గులుగా విభజించడం నేర్పింది మనమే. ఎక్కడ తినాలో, ఎక్కడ తినకూడదో చెప్పే శాస్త్ర నియమాలు మన దగ్గరున్నాయి. అగ్రవర్ణాలవాళ్లు విదిలించిన ఎంగిలి మెతుకులు తినే హరిజనులు, స్వచ్ఛమైన మనస్సుతో పెట్టిన ఆహారం మాత్రం ముట్టుకోలేకపోతున్నారు. ఈ చీకటి లోంచి మనం బయటపడకపోతే, మనతో పాటు మన ధర్మం కూడా ప్రమాదంలో పడుతుంది. అందుకే నేను ఈ యాత్ర చేపట్టాను. నేను బతికి ఉన్నంత కాలం ఈ విషయం చెప్తూనే ఉంటాను’ అన్నారు.

సభ ముగిశాక గాంధీజీ ఆలయంలోకి వెళ్లి దైవదర్శనం చేసుకున్నారు. అక్కడున్న వారందరికీ ప్రసాదం పంచారు.

తూర్పూ పడమరా

పాదయాత్రలో గాంధీజీ ఎక్కడ అనారోగ్యం పాలవుతారోనని మొదట్లో మేం భయపడ్డాం. ఆయనెప్పుడూ ఒక జనసంద్రం మధ్యనే ఉండేవారు. శరీరం నిండా దుమ్ము పేరుకుపోయేది. జనాల తాకిడి వల్ల కాస్త విరామం కూడా దొరక్క కొన్నిసార్లు ఆయన భోజనం కూడా మానేయవలసి వచ్చేది. నారింజ రసం తీసుకోవడం కూడా మానేశారు. ఇన్ని ఇబ్బందులున్నా ఆయన బరువు ఐదు పౌండ్లు పెరిగారు.

‘ఈ యాత్రానుభవం ఎంతో అద్భుతమైంది’ అన్నది ఆయన సొంత మాట.

యాత్రికులు తెలంగాపెంథా, కాజీపట్నా చేరుకునేసరికి ప్రజల ఉత్సాహం తారాస్థాయికి చేరింది. కటక్ నుండి వందలాది మంది ప్రజలు సైకిళ్లమీద అక్కడికి వచ్చారు. తమతో పాటే భోజనాలూ తెచ్చుకున్నారు. కటక్ మహిళలు కూడా వచ్చారు.

బాపూజీకి సమర్పించిన సన్మానపత్రంలో ఇలా రాసి ఉంది:

‘ఇక్కడ అస్పృశ్యత ఆచరణలో ఉంది; హృదయమూ కఠినంగా మారింది.’

బాపూజీ ఆ వాక్యాన్ని ఉటంకిస్తూ ఇలా అన్నారు: ‘ఇందులో ఆశ్చర్యపడవలసిందేమీ లేదు. కోట్లాదిమంది ప్రజల్ని జంతువుల్లా చూస్తూ మనం వారిని వెలివేశాం. వారిపట్ల అన్యాయంగా ప్రవర్తిస్తూ, వారిని సరిగ్గా చూడటం లేదు. ఇంతకంటే క్రూరత్వం మరొకటి ఉంటుందా? దీనివల్ల మన మధ్య ఐక్యత నశించి, కలహాలూ, విభేదాలూ పెరిగిపోతాయి. మానవ ప్రవర్తనలోనే అస్పృశ్యత అత్యంత క్రూరమైన రూపం. దానికి మతపరమైన ఆమోదం లభించింది కాబట్టే నేనీ మాట అంటున్నాను. ఒకప్పుడు ఇలాంటి మాటలు సభల్లో మాట్లాడటానికి కూడా వీలుండేది కాదు. భగవంతుడి దయ వల్ల ఈ రోజు పల్లెల నుండి ఎంతోమంది ప్రజలు నా మాట వినడానికి ఇక్కడికి వచ్చారు. అస్పృశ్యతకు మత సమ్మతి లేదని వాళ్ళిప్పుడు గ్రహించారు; కానీ తరతరాలుగా కొనసాగుతున్న తమ అలవాట్లు మార్చుకోడానికి మాత్రం సిద్ధంగా లేరు. ఈ క్రూరత్వం మన జీవితాల్లోని అన్ని రంగాలమీదా తన ముద్ర వేసింది. నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను: ఈ దురాచారాన్ని మనం వదులుకోకపోతే, భగవంతుడు మనల్ని ఎన్నటికీ క్షమించడు, మనం నాశనమైపోతాం. ప్రతి ఊరిలోనూ హరిజన పిల్లలు బడికి వెళ్లడం నాకు తెలుసు. కానీ వారిని విడిగా దూరంగా కూర్చోబెడతారు. ఈ ఏర్పాటు చూసి ఏ ఉపాధ్యాయుడికీ సిగ్గనిపించదు, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా లజ్జ కలగదు. దీనివల్ల విద్యార్థుల ముందు అత్యంత తప్పుడు ఆదర్శాలు నిలబెట్టినవాళ్ళమవుతున్నాం. పిల్లలకు ఏం నేర్పిస్తున్నారు? తాము కలలో కూడా ఊహించని చెడు భావనలు వాళ్లకు బళ్ళల్లో నూరిపోస్తున్నారు. ఈ అసహ్యకరమైన ఆచారం సమసిపోయేదాకా నిశ్చింతగా నిద్రపోవద్దని నా సోదర సోదరీమణులందరికీ పిలుపునిస్తున్నాను. హరిజనుల్లో కాస్త చైతన్యం వచ్చి ఉంటే, ఇతరులు తమపట్ల అస్పృశ్యత పాటించకుండా వాళ్లే అడ్డుకుని ఉండేవారు.’

‘తూర్పూ పడమరా వేర్వేరనీ, అవి ఎన్నటికీ కలవవనీ సన్మానపత్రంలో పేర్కొన్నారు. నేనే ఆ భావనకు ప్రచారకుడినని కూడా అన్నారు. అలాంటి పని నేనెంతమాత్రం చేయదలచుకోలేదు. ఇది నాకేమీ ప్రశంస కాదు. నిజంగా నేనలా చేసి ఉంటే, నన్ను తప్పుపట్టాల్సిందే. నేను అద్వైతాన్ని నమ్ముతాను. తూర్పు పడమరల మధ్య గానీ, ఉత్తర దక్షిణాల మధ్య గానీ నేనెలాంటి భేదాన్నీ గుర్తించను. ఎలా గుర్తించగలం? హెచ్చుతగ్గుల అంతరాలను రూపుమాపాలనుకునే వ్యక్తి పశ్చిమ దేశాలకు శత్రువు ఎలా కాగలడు? నాకు చిన్నప్పటి నుంచీ కూడా అలాంటి దృష్టితో పరిచయమే లేదు; కలలో కూడా నేనలా ఆలోచించలేదు.’

‘నేను ముందే చెప్పాను, ఇప్పుడు మళ్లీ చెబుతున్నాను: మనం పశ్చిమ దేశాలను గుడ్డిగా అనుకరించాల్సిన పనిలేదు. పాశ్చాత్య నాగరికత ఇంద్రియ భోగాలకు ప్రాధాన్యతనిస్తే, ప్రాచ్య నాగరికత త్యాగాన్ని నొక్కి చెబుతుంది. ఈ ప్రపంచంలో అర్థవంతంగా జీవించాలంటే లౌకిక వాంఛల్ని త్యజించాలని ఉపనిషత్తులు ప్రబోధిస్తున్నాయి. అది తూర్పూ పడమరల మధ్య భేదాన్ని అంగీకరించదు; అది కేవలం దృక్పథాల మధ్య ఉన్న తేడా మాత్రమే. ఈ రోజు నేను మీకు చెప్పిన విషయంతోనూ, ఎప్పుడో 1908లో నేను చెప్పిన దానితోనూ పశ్చిమ దేశాలకు చెందిన వేలాది మంది ఏకీభవిస్తున్నారు. నాకుమీకు చెప్పే హక్కు ఉంటే నేనిదే చెప్తాను: తూర్పూ పడమరల మధ్య భేదాన్ని తుడిచిపెట్టండి. అస్పృశ్యతను రూపుమాపడమంటే హెచ్చుతగ్గుల అంతరాల్ని తుడిచిపెట్టడమే. మన హరిజన సోదరులు కేవలం ఒక నెపం మాత్రమే. ఈ మహాయజ్ఞంలో మిమ్మల్ని మీరు సమర్పించుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను.’

కాట్జూరి నదికి ఒకవైపు కాజీపట్నా, మరోవైపు కటక్ ఉన్నాయి. కటక్‌లో బస చేసే ఉద్దేశం గాంధీజీకి లేదు. ఆయన సభ ముగిశాక నేరుగా స్టేషన్‌కు వెళ్లిపోయేలా ఏర్పాట్లు జరిగాయి. అందుకే కటక్ ప్రజల తరఫున కాజీపట్నాలోనే ఆయనకు సన్మానం చేశారు.

జనం తాకిడి నుండి ఆయన్ను కాపాడటానికి ఒక వినూత్న ఉపాయం ఆలోచించారు. తెలంగాపెంథా నుండి కటక్ వెళ్లే దారంతా భజనలు చేసుకుంటూ సాగారు. దారిన జనం పూలవర్షం కురిపించారు. కటక్ నుండి వచ్చిన మహిళలు తమ ఆభరణాలు సమర్పించారు; ఆ వృద్ధుడు తానే  స్వయంగా వాటిని వేలం వేయించారు.

కటక్ వెండి నగిషీ పని ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఆ కళాఖండాల్ని చూసి బాపూజీ ఎంతో మురిసిపోయారు. భికారీ బాబు కుటీర పరిశ్రమ తరఫున హరిహర్ మహాపాత్ర కొంత పట్టు దారాన్నీ, కొన్ని బొమ్మల్నీ, భారతదేశ పటాన్నీ బాపూజీకి బహూకరించారు. సభ నుండి తిరిగి వస్తున్న మార్గంలో తమ కర్మాగారాన్ని సందర్శించవలసిందిగా ఆయన బాపూజీని ఆహ్వానించారు. వెళ్లడానికి బాపూజీ సంతోషంగా ఒప్పుకున్నారు. తోలు పరిశ్రమ గురించి తనకున్న సందేహాల్ని హరిబాబు నివృత్తి చేసుకోగోరారు. బాపూజీ హరిజనోద్యమం ప్రారంభించినప్పుడు ఆవు చర్మాల వ్యాపారాన్నీ, కోళ్ల పెంపకాన్నీ వ్యతిరేకిస్తున్నారని ఒక వదంతి వ్యాపించింది. ఫలితంగా వాటిమీదే ఆధారపడి జీవించే నిరుపేదలు నష్టపోయారు. హరిబాబు ఈ విషయాన్ని గాంధీజీ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన స్పందిస్తూ, ‘అలా ప్రచారం చేయడం తప్పు. తోలు వ్యాపారం కొనసాగించమనే నేను వారికి సలహా ఇస్తాను. కానీ కోళ్ల పెంపకం చేపట్టమని మాత్రం వారికి సలహా ఇవ్వను’ అన్నారు.

కోళ్ల పెంపకం చేసేవారికి మంచి లాభాలు వస్తాయనీ, దానికి పెద్దగా పెట్టుబడి కూడా అవసరం లేదనీ ఆయనకు చెప్పారు. అయితే సంపర్కం లేకుండానే గుడ్లు ఉత్పత్తి చేయవచ్చనీ, ప్రాణం లేని అలాంటి గుడ్లు కూడా సాధారణ గుడ్లలాగే బలవర్ధకమైనవనీ చెప్పినప్పుడు బాపూజీకి నమ్మకం కుదరలేదు. ‘అదే గనుక నిజమైతే, నాకేమీ అభ్యంతరం లేదు. కానీ వాళ్లు అలా చేయగలరా?’ అనడిగారు బాపూజీ. శాంతినికేతన్‌లో ఆ పని సులభంగానే చేస్తున్నారని మాలతీ దేవి ఆయనతో చెప్తే, ‘మంచిది, అలా చేయగలిగితే హరిజనులూ తక్కినవాళ్ళూ కూడా ఈ వ్యాపారం చేపట్టవచ్చు’ అనిఅన్నారు.

గాంధీజీ హరిజన యాత్ర ప్రభావం విస్తృతంగా కనిపించడం మొదలయ్యాక, కొందరు సనాతన హిందువులకు గుబులు పట్టుకుంది. లాలానాథ్ అనే సనాతనవాది దేశంలోని ఎన్నో ప్రాంతాల్లో గాంధీజీకి నల్ల జెండాలు చూపించాడు. అతడు కటక్ కూడా వచ్చాడు. కొంతమంది మనుషుల్నీ జెండాలనూ పోగుచేశాడు. కానీ కటక్‌లో నిరసన చేపడితే ప్రజలు తీవ్ర ఆగ్రహంతో తనమీద దాడి చేస్తారని అతడు గ్రహించాడు. అందుకని గాంధీజీ ఆయన్ను నేరుగా కాజీపట్నాకు రమ్మనీ, అక్కడ అవసరమైతే అతడి రక్షణ కోసం ప్రత్యేక వాలంటీర్లను నియమిస్తామనీ, అతడి అభిప్రాయాల్ని చెప్పుకోడానికి తగిన అవకాశం ఇస్తామనీ సూచించారు. తనకు నల్ల జెండాలు చూపించాలనుకున్న వ్యక్తికి సైతం సహాయం చేయడం కేవలం సత్యారాధకుడికే సాధ్యమవుతుంది!

సాయంత్రం వేళ ఎంతో శ్రమతో అతణ్ణి కాజీపట్నాలోని కాట్జూరి ఇసుక తిన్నెలమీదకి తీసుకువచ్చారు. భారీ జనసందోహం గుమిగూడింది. ఆ రోజు యావత్ కటక్ నగరమూ కాట్జూరి ఇసుక తిన్నెలమీదకి వచ్చి వాలిందా అన్నట్టుగా ఉంది.

మాట్లాడటానికి అవకాశం ఇస్తామని లాలానాథ్‌కు గాంధీజీ అంతకుముందే హామీ ఇచ్చారు. సభను ఉద్దేశించి ప్రసంగించడానికి ముందు గాంధీజీ అతడి కోసం వెతికారు. అతడు ఎక్కడా కనిపించలేదు. గాంధీజీ కాసేపు ఆందోళన చెందారు. చేతుల్లో నల్ల జెండాలు పట్టుకున్న ఇరవై ఇరవై ఐదు మంది వ్యక్తులు నది కట్ట దిగి రావడం కనిపించింది. గాంధీజీ మాట్లాడుతూ, ‘కాశీ నుండి పండిట్ లాలానాథ్ ఆయన మిత్రులూ కటక్ వచ్చారు. వాళ్లు మనకు నల్ల జెండాలు చూపించడానికి ప్రయత్నించవచ్చు. అలా చేసినా సరే, వారిని నిందించకండి. వారి పట్ల వినయంతోనూ మర్యాదతోనూ ప్రవర్తించండి. వారికి నచ్చిన చోట వారిని కూర్చోనివ్వండి. వారిక్కడికే రావాలనుకుంటే రానివ్వండి’ అన్నారు.

జనం విపరీతంగా ఉండటంతో లాలానాథ్ ఆయన అనుచరులూ ఆ తోపులాట దాటుకుని సభాస్థలికి రావడం అంత తేలిగ్గా కనిపించలేదు. వారిమీద ప్రజలు విరుచుకుపడకుండా కాపాడటానికి పోలీసులు రక్షణగా ఉన్నారు. అదంతా చూసి  జనానికి చాలా చిరాగ్గా అనిపించినప్పటికీ  మౌనంగానే ఉండిపోయారు.

సత్యనారాయణ్ బాబు వేదికమీద కూర్చున్నారు. లాలానాథ్‌నూ ఇతరులనూ వేదిక దగ్గరకి తీసుకు రాడానికి బాపూజీ ఆయన్ను పంపించారు. ‘మనం ఆలయ ప్రాంగణంలోనే ప్రాణాలు విడుద్దాం’ అనే పాట పాడుకుంటూ వారు సభ దగ్గరికి వచ్చారు. అక్కడికి చేరుకునేసరికి లాలానాథ్ చెమటలు కక్కుతున్నాడు. బాపూజీ తలవంచి చిరునవ్వుతో, ‘నేను ఎవరి గురించైతే మీకు చెబుతున్నానో ఆ పండిట్ లాలానాథ్ వచ్చేశారు. ఆయన మాట్లాడనివ్వండి. ఆయన ప్రసంగం ముగిశాక నేను మీతో మాట్లాడతాను. నా మాటలు ఎంత శ్రద్ధగా విన్నారో, ఆయన మాటలనూ అంతే ఏకాగ్రతతో వినండి’ అన్నారు.

లాలానాథ్ మాట్లాడటానికి లేచాడు. అంతటా నిశ్శబ్దం ఆవరించింది. నిమ్న కులాలవారి ఆలయ ప్రవేశాన్ని వ్యతిరేకించినందుకు జనం అతణ్ణి పోకిరీ అని పిలిచారు. తన వాదన సమర్థించుకోడానికి అతడు శాస్త్ర ప్రమాణాలు ఉటంకించడానికి సిద్ధపడ్డాడు.

లాలానాథ్ మాటలు ఓపికగా విన్నందుకు బాపూజీ సభికులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘పండిట్ లాలానాథ్ మనతో రెండు విషయాలు పంచుకున్నారు. ఆయన్ను పోకిరీ అన్న వ్యక్తి తప్పు చేశాడు. ఒక సంస్కర్త ఆయన్ను అలా అని ఉంటే నేను చింతిస్తున్నాను. నన్ను ప్రభావితం చేయడానికీ, నా హృదయాన్ని మార్చడానికీ పండిట్ లాలానాథ్‌కూ ఆయన మిత్రులకూ పూర్తి హక్కు ఉంది. నా వంతుగా నేనూ వారి హృదయాల్ని మార్చడానికి ప్రయత్నిస్తాను. నా ప్రయత్నంలో నాకు సహకరించండి. నేను సనాతనులకు బాధ కలిగించానని ఆయన అన్నారు. కానీ నా దృష్టిలో నేనూ ఒక సనాతనుడినే. చర్చలకూ సంవాదాలకూ నేను వ్యతిరేకం కాదు; పైగా నేను దానికి అనుకూలం. వారితో చర్చించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాను. వాళ్లు గనుక నా హృదయాన్ని మార్చగలిగితే, నేను వారి వాదననే అంగీకరిస్తాను’ అన్నారు.

‘నన్ను రెండోసారి ఇక్కడికి ఆహ్వానించి ఒరిస్సా కాంగ్రెస్ కార్యకర్తలు ఒక గొప్ప బాధ్యతను భుజానికెత్తుకున్నారు. ఈ ఉద్యమం విజయవంతం కావడానికి కార్యకర్తలతో పాటు గ్రామస్థులు కూడా అంకితభావంతో పనిచేయాలి. హరిజనోద్యమం గురించి హిందువులకు సందేహాలుంటే, వినయపూర్వకంగా వారి సందేహాలను నివృత్తి చేయాలి’ అన్నారు.

గాంధీజీకి ఒక విరాళాల బొత్తి సమర్పించారు. హిందీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఆయన ద్వారా సర్టిఫికెట్లు అందజేసిన తర్వాత సభ ముగిసింది.

శ్రీరామచంద్ర భవన్‌లో మహిళా సభ ఏర్పాటు చేశారు. సరళా దేవి స్వాగత పత్రం చదివాక బాపూజీ సభికులనుద్దేశించి మాట్లాడారు. ఆ తర్వాత ఆయన భికారీ బాబు కుటీర పరిశ్రమ సందర్శించడానికి వెళ్లారు. ఆయనకు అందులోని అన్ని విభాగాల్నీ చూపించడానికి చాలా సమయమే పట్టింది.

అప్పటికి బయట మళ్ళా ఐదారు వేల మంది జనం గుమిగూడారు. వారంతా గాంధీజీ వెంట స్టేషన్ దాకా వస్తే కటక్ నగరమంతా ఎర్రటి దుమ్ముతో నిండిపోతుందని భావించారు. దాంతో జనానికి తెలియకుండా గాంధీజీ మరో మార్గం గుండా వెళ్లారు. ఒక చిన్న టార్చిలైటూ, ఒక లాంతరూ, కొద్దిమంది మనుషులు మాత్రమే ఆయన వెంటే నడిచారు. జనం చెదిరిపోయారు. ఆ రాత్రి గాంధీజీ రైలెక్కి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశానికి హాజరు కావడం కోసం పాట్నా బయలుదేరారు.

6-10-2026

2 Replies to “మహాత్ముణ్ణి చూసిన క్షణాలు-10”

  1. మన దేశంలో caste discrimination అగ్రవర్ణాలకూ “నిమ్న కులాల” వారికి మధ్యనే కాకుండా, “నిమ్న వర్గాల” మధ్య కూడా ఎంత deep rooted గా వుందో అనిపిస్తుంది.

    వేదాలు, ఉపనిషత్తులు, అద్వైత తత్త్వం చదువుకున్న సమాజంలో ఈ అంతరాలు ఇన్ని శతాబ్దాలుగా ఎందుకు కొనసాగాయా అని ఎప్పుడూ అనుకుంటాను.

    ఆధ్యాత్మికంగా ఎంత ఉన్నతమైన భావాలు ఉన్నా, అవి మన రోజువారీ ప్రవర్తనలో కనిపించనంతవరకు ప్రయోజనం ఏముంది? మీరు “తేనీటి పుస్తకం” గురించి మాట్లాడుతూ, Japan లో Zen Buddhism, Confucianism, Shinto సంప్రదాయాల నుంచి నేర్చుకున్న పాఠాలను రోజువారీ జీవితంలోకి తెచ్చుకున్నారు కాబట్టే, వారి society లో ఈరోజుకీ మనం చూస్తున్న respect for fellow beings, discipline, aesthetic culture వంటివి వారి జీవన విధానంలో భాగమయ్యాయని, మనం మాత్రం మన ఆధ్యాత్మిక, తాత్విక సంపదను పుస్తకాలకే పరిమితం చేసి, పూజలు చేస్తామే కానీ, ఆచరణలోకి తీసుకురాలేకపోయామని అన్నారు.

    గాంధీ వంటి మహాత్ములు ఈ విషయాలను ప్రజలకు తెలియజెప్పి, నచ్చజెప్పి, హెచ్చుతగ్గులను రూపుమాపడానికి ఉద్యమించినప్పుడు చదువుకున్న వారి నుండి కూడా ఎంతటి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చిందో ఈ సంఘటనలు చదువుతుంటే అర్థమవుతోంది.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading